
శాటిలైట్ ఆధారిత టోలింగ్ వ్యవస్థను మే 1 నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. శాటిలైట్ ఆధారిత టోలింగ్ సిస్టమ్ ఫాస్టాగ్ ఆధారిత టోల్ కలెక్షన్ వ్యవస్థను భర్తీ చేస్తుందని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేస్తూ, 2025 మే 1 నుంచి దేశవ్యాప్తంగా ఈ సర్వీసుల అమలుకు సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది.
టోల్ ప్లాజాలగుండా వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా సులువైన ప్రయాణం కోసం భవిష్యత్తులో టోల్ ప్లాజాల వద్ద ‘ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్(ఏఎన్పీఆర్)-ఫాస్టాగ్ టోలింగ్ సిస్టమ్’ను అమలు చేయనున్నట్లు తెలిపింది. ఇది వాహనాల నంబర్ ప్లేట్లను స్కాన్ చేసి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ)ను ఉపయోగించే ప్రస్తుత ఫాస్టాగ్ సిస్టమ్ ద్వారా పని చేస్తుందని పేర్కొంది. ఇది అమలులోకి వస్తే టోల్ ప్లాజాల అధిక సమయం ఆగాల్సిన అవసరం లేకుండా హై పెర్ఫార్మెన్స్ ఏఎన్పీఆర్ కెమెరాలు, ఫాస్టాగ్ రీడర్ల ద్వారా వెంటనే టోల్ ఛార్జీలు కట్ అయ్యేలా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఈ-నోటీసులు జారీ చేస్తామని, వాటిని చెల్లించకపోతే ఫాస్టాగ్, ఇతర వాహన సంబంధిత సదుపాయాలను నిలిపివేయాల్సి వస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఇదీ చదవండి: ప్రముఖ బ్యాంకులు వడ్డీ రేట్ల కోత..
ఎంపిక చేసిన టోల్ ప్లాజాల వద్ద ‘ఏఎన్‌పీఆర్-ఫాస్టాగ్ టోలింగ్ సిస్టమ్’ అమలుకు ఎన్‌హెచ్‌ఏఐ ఇప్పటికే బిడ్లను ఆహ్వానించింది. ఈ వ్యవస్థ పనితీరు, సామర్థ్యం, వినియోగదారుల స్పందన ఆధారంగా దేశవ్యాప్తంగా దీని అమలుపై నిర్ణయం తీసుకోనున్నారు. భారతదేశ జాతీయ రహదారి నెట్‌వర్క్‌లో సుమారు 855 ప్లాజాలు ఉన్నాయి. వీటిలో 675 ప్రభుత్వ నిధులతో, మిగతావి ప్రైవేట్ ఆపరేటర్లతో నిర్వహిస్తున్నారు.
శాటిలైట్ ఆధారిత టోలింగ్
గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అమలులోకి వచ్చిన తరువాత టోల్ ఫీజు చెల్లించడానికి ప్రత్యేకంగా.. వాహనాలను ఆపాల్సిన అవసరం లేదు. వాహనం ప్రయాణించిన దూరాన్ని శాటిలైట్ పరిగణించి వాహనదారుల ఈ-వ్యాలెట్ నుంచి టోల్ ఛార్జీ కట్ అవుతుంది. అయితే దీనికోసం వాహనదారులు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) చిప్ కలిగిన ఫాస్టాగ్‌ను వాహనానికి అతికించాల్సి ఉంటుంది. లేదా ఇతర ఆన్ బోర్డ్ యూనిట్ (OBU) లేదా ట్రాకింగ్ పరికరాలను అమర్చి.. టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.