Satellite
-
శాటిలైట్ టెలికం.. మన దేశంలోకి వెల్కం!
మనం ఇప్పుడు జేబులో సెల్‌ఫోన్ పెట్టుకుని గడిపేస్తున్నాం. ఎక్కడున్నా కాల్స్, మెసేజీలు పంపడం, అందుకోవడం దగ్గరి నుంచి ఇంటర్నెట్ దాకా యథాలాపంగా వాడేస్తున్నాం. కానీ అడవులు, ఎడారులు, మారుమూల ప్రాంతాల్లో మొబైల్ సేవలు సరిగా అందవు. అలాంటి చోట మంచి పరిష్కారం శాటిలైట్ టెలికం సేవలు. ఇక్కడా, అక్కడా అని లేకుండా ఎక్కడైనా సరే... సిగ్నల్స్ అందుకోగలగడం దాని ప్రత్యేకత.త్వరలోనే ఈ శాటిలైట్ టెలికం సేవలు మన దేశంలో అందుబాటులోకి రానున్నాయి. భారత టెలికం రంగం మరో మెట్టు ఎక్కబోతోంది. అయితే శాటిలైట్ ఆధారిత టెలికం సేవలు సామాన్యుడికి చేరడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా ప్రారంభదశలోనే ఉండటం, వీటి ధరలు, ఈ సాంకేతికతను వినియోగించగల హ్యాండ్ సెట్ల ధరలు ఎక్కువగా ఉండటం దీనికి కారణమని పేర్కొంటున్నారు. – నూగూరి మహేందర్, సాక్షి ప్రతినిధికాస్త ఖరీదైనవే.. శాట్‌కామ్ సేవలు ఖరీదైనవే. దేశంలో టెల్కోల హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు నెలకు కనీసం రూ.400 నుంచి రూ.4,000 వరకు ఉంటాయి. అవసరాన్ని, తాహతును బట్టి ఎంచుకోవచ్చు. కానీ ఉపగ్రహ టెలికం, ఇంటర్నెట్ వ్యయాలు అంతకు 7 నుంచి 18 రెట్లు ఖరీదైనవని జేఎం ఫైనాన్షియల్స్ సంస్థ వెల్లడించింది. సైన్యం, నావికా దళం, మారుమూల ప్రాంతాల్లో వ్యాపార కార్యకలాపాలు సాగించే సంస్థలకు శాటిలైట్ కమ్యూనికేషన్స్ ఉపయోగకరం. ఆతిథ్య రంగంలో లగ్జరీ హోటళ్లు, కొండ ప్రాంతాల్లో రిసార్టులు ఏర్పాటు చేసే సంస్థలు తమ వినియోగదారుల కోసం శాటిలైట్ సేవలను వినియోగించుకునే అవకాశం ఉంది.ఈ క్రమంలో తొలుత బిజినెస్ టు బిజినెస్ విభాగంలో శాటిలైట్ టెలికం సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ప్రముఖ టెలికం కంపెనీ ప్రతినిధి ఒకరు ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు తెలిపారు. ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్ కంపెనీ కెన్యాలో ఒక్కో యాంటెన్నాకు నెలకు 30 డాలర్లు వసూలు చేస్తోందని.. ఇతర దేశాల్లో అది 100 డాలర్లు, అంతకంటే అధికంగా ఉందని చెప్పారు. మన దేశంలో ప్రవేశపెడితే ధర ఎంతనేది తెలుస్తుందని పేర్కొన్నారు. ఇక ఇండియా మొబైల్ కాంగ్రెస్ వేదికగా యూటెల్‌శాట్ వన్‌వెబ్ తన సత్తాను ప్రదర్శించిందని.. ఆ సంస్థతో చేతులు కలిపేందుకు భారత సైన్యం ముందుకు వచ్చిందని వెల్లడించారు.రెండు సంస్థలకు లైసెన్స్.. మరొకటి వెయిటింగ్.. శాట్‌కామ్ సేవలు భారత్‌లో అందించాలంటే కంపెనీలకు ‘గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ (జీఎంపీసీఎస్)’లైసెన్స్, ‘ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్–ఆథరైజేషన్ సెంటర్ (ఇన్‌స్పేస్)’లైసెన్స్ ఉండటం తప్పనిసరి. ప్రస్తుతం కేంద్రం నుంచి వన్‌వెబ్ ఇండియా కమ్యూనికేషన్స్, జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్ సంస్థలు శాటిలైట్ కమ్యూనికేషన్స్ లైసెన్స్ దక్కించుకున్నాయి. వన్‌వెబ్ ఇండియా.. యూటెల్‌శాట్ భాగస్వామ్యంతో భారతీ ఎయిర్టెల్ ప్రమోట్ చేయగా... లక్సెంబర్గ్‌కు చెందిన ఎస్ఈఎస్ సంస్థతో రిలయన్స్ జియో చేతులు కలిపి.. జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్‌ను ప్రమోట్ చేస్తోంది.ఇప్పటికే పలు దేశాల్లో సేవలు అందిస్తున్న యూటెల్‌శాట్ వన్‌వెబ్ గుజరాత్, తమిళనాడులో బేస్ స్టేషన్లను ఏర్పాటు చేసిందని, అనుమతులు రాగానే సేవలు ప్రారంభిస్తామని భారతీ ఎంటర్ప్రైజెస్ వైస్ చైర్మన్ రాజన్ భారతీ మిత్తల్ ఇటీవలే ప్రకటించారు. ఇక జియో–ఎస్ఈఎస్కు సైతం భారత్‌లో రెండు ప్రాంతాల్లో బేస్ స్టేషన్స్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో టాప్‌లో ఉన్న స్టార్‌లింక్ సంస్థ 100కుపైగా దేశాల్లో ఇప్పటికే సర్విసులు ప్రారంభించింది. భారత్‌లో లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంది. అమెజాన్‌కు చెందిన కైపర్ కూడా ఇక్కడ అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి.ఎవరి సామర్థ్యం వారిదే.. తమకు భూమిచుట్టూ కక్ష్యలో 6,900కుపైగా ఇంటర్నెట్ ఉపగ్రహాలు ఉన్నాయని స్టార్‌లింక్ చెబుతోంది. యూటెల్‌శాట్ వన్‌వెబ్ ఖాతాలోని ఉపగ్రహాల సంఖ్య 635కుపై మాటే. ఇక ప్రపంచ జనాభాలో 99 శాతం మందికి వీడియో, డేటా సేవలను అందించగలిగేలా రెండు వేర్వేరు కక్ష్యలలో పనిచేస్తున్న దాదాపు 70 ఉపగ్రహాలను కలిగి ఉన్నట్టు ఎస్ఈఎస్ సంస్థ తెలిపింది. 100 కోట్లకుపైగా టీవీ వ్యూయర్స్, టాప్–10 గ్లోబల్ టెలికం కంపెనీల్లో ఏడింటికి, ప్రపంచంలోని ఆరు ప్రధాన క్రూజ్ లైన్స్‌లో ఐదింటికి తాము సేవలు అందిస్తున్నట్టు వెల్లడించింది.వైఫై తరహాలో సేవలు.. శాటిలైట్ నుంచి సిగ్నల్స్ అందుకోవడానికి చిన్న యాంటెన్నా ఏర్పాటు చేస్తారు. ఆ యాంటెన్నా వైఫై జోన్ మాదిరిగా పనిచేస్తుంది. దాని ద్వారా కాల్స్, ఎస్సెమ్మెస్‌లు చేసుకోవచ్చు. సాధారణ ఫోన్లు వాడేవారి నుంచి కాల్స్ అందుకోవాలంటే.. సంబంధిత సంస్థకు బేస్‌స్టేషన్ ఉండాలి. సాధారణ కస్టమర్ కాల్ చేస్తే ఆ బేస్‌స్టేషన్ ద్వారా శాటిలైట్‌కు, అక్కడి నుంచి యాంటెన్నా పరిధిలో ఉన్న వినియోగదారులకు కనెక్ట్ అవుతుంది. సాధారణ కాల్స్, సందేశాలకు మాత్రమే శాటిలైట్ ఆధారిత టెలికం సేవలు ఉపయుక్తం. 4జీ, కేబుల్ బ్రాడ్‌బ్యాండ్ మాదిరి వేగంగా డేటాను అందుకునే అవకాశం తక్కువ.ప్రభుత్వమే స్పెక్ట్రమ్ కేటాయించి.. శాటిలైట్ టెలికం బేస్‌స్టేషన్ పనిచేయాలంటే ప్రత్యేక స్పెక్ట్రమ్ (తరంగ దైర్ఘ్యం) కేటాయింపులు అవసరం. లైసెన్స్ పొందిన కంపెనీలకు ప్రభుత్వం ఇంకా దీనిని కేటాయించలేదు. శాటిలైట్ సేవల కోసం ప్రభుత్వం స్పెక్ట్రమ్ కేటాయిస్తుంది (అడ్మినిస్ట్రేటివ్ అలకేషన్). దీనిని అన్ని కంపెనీలు పంచుకోవాల్సి ఉంటుంది. అలాకాకుండా రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు స్పెక్ట్రమ్ వేలం వేయాలని ప్రతిపాదించాయి. విదేశీ సంస్థలు స్టార్‌లింక్, ప్రాజెక్ట్ కైపర్‌లు మాత్రం అడ్మినిస్ట్రేటివ్ కేటాయింపుల విధానం అమలు చేయాలని కోరాయి. బ్రెజిల్ గతంలో స్పెక్ట్రమ్ వేలం వేసి విఫలమై ప్రస్తుతం అడ్మినిస్ట్రేటివ్ మార్గాన్ని ఎంచుకుందని వివరిస్తున్నాయి. దీనితో మన దేశం కూడా అడ్మినిస్ట్రేటివ్ మార్గం అనుసరించాలని నిర్ణయించింది.కొన్ని ఫోన్ మోడల్స్‌లోనే అందుబాటులో.. శాటిలైట్ ఆధారిత టెలికం సేవలు అందుకోవాలంటే మొబైల్ ఫోన్లో ప్రత్యేక ఏర్పాటు తప్పనిసరి. యాపి ల్ తయారీ ఐఫోన్–14, ఆ తర్వాతి మోడళ్లు శాటిలైట్ కనెక్టివిటీని సపోర్ట్ చేస్తాయి. గూగుల్ పిక్సెల్ 9 సిరీస్, సామ్సంగ్ గెలాక్సీ ఎస్25 ఈ వరుసలో ఉన్నాయి. ఇవేగాక ప్రత్యేక శాటిలైట్ ఫోన్స్ కూడా లభిస్తాయి. ఇరీడియం 9555, ఇన్మాశాట్ ఐశా ట్ ఫోన్ 2, థురాయో ఎక్స్‌టీ–లైట్, గ్లోబల్ స్టార్ జీఎస్పీ–1700 మోడళ్లను ఎయిర్టెల్ విక్రయిస్తోంది. వీటి ధరలు రూ.70 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు ఉన్నాయి. పోస్ట్ పెయిడ్ ప్లాన్ల ధర రూ.1,500 నుంచి ప్రారంభమవుతుంది. పరిమితి దాటితే ప్రతి నిమిషానికి అదనంగా చార్జీ చెల్లించాల్సి ఉంటుంది.శాట్‌కామ్ అంటే.. శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థలు (శాట్‌కామ్) డేటా, వాయిస్‌ను ప్రసారానికి, స్వీకరణకు ఉపగ్రహాలపై ఆధారపడతాయి. అదే మామూలు టెలికం సేవలు ఫైబర్ ఆప్టిక్స్, ఇతర కేబుళ్లపై ఆధారపడతాయి. శాట్‌కామ్ సేవలకు ఇటువంటి మౌలిక సదుపాయాల అవసరం లేదు. భారత్‌లో సాధారణ నెట్వర్క్ 98 శాతం భూ భాగంలో విస్తరించి ఉంది. అయితే ఈ సంప్రదాయ నెట్‌వర్క్‌లను ఏర్పా టు చేయడం ఆర్థికంగా, లాభపరంగా సాధ్యంకాని కొండలు, గుట్టలు, అడవులు, మారుమూల ప్రాంతాల్లో శాట్‌కామ్ సేవలు ప్రయోజనకరంగా ఉంటాయి. అత్యవసర పరిస్థితులు, తీవ్ర వాతావరణ పరిస్థితులలో కూడా ఇవి పనిచేయగలవు. -
ఎన్వీఎస్–02 కూలనుందా?
న్యూఢిల్లీ: ఎన్వీఎస్–02 ఉపగ్రహ కక్ష్యను పెంచేందుకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కాకపోవడంపై ఇస్రో వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. జనవరి 31వ తేదీన ప్రయోగించిన ఈ ఉపగ్రహంలోని థ్రస్టర్లను మండించేందుకు శాస్త్రవేత్తలు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. అయితే, ఆక్సిడైజర్‌ను అందించే వాల్వులు తెరుచుకోవడం లేదు. లిక్విడ్ అపోజీ మోటార్(ఎల్ఏఎం) వ్యవస్థ విఫలమైందని అంటున్నారు. దీంతో, ప్రత్యామ్నాయాలను వెతికే పనిలో ఉన్నారు. ప్రస్తుతం జియో సిక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్(జీటీవీ)లో ఉన్న ఈ శాటిలైట్ థ్రస్టర్లను యాక్టివేట్ చేయకుంటే అది దీర్ఘవృత్తాకార కక్ష్యలోనే ఉండిపోయే ప్రమాదముంది. ‘నిర్దేశిత దూరం దాన్ని తీసుకెళ్లాలంటే ఎల్‌ఏఎంను మండించాలి. ఎల్ఏఎంలో ఇంజిన్, ఆక్సిడైజర్, ఇంధనం ఉంటాయి. ఇంజిన్ యాక్టివేట్ కావాలంటే ఆక్సిడైజర్ ప్రవహించాలి. అయితే, ఆక్సిడైజర్ వాల్వులు తెరిచేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఈ ప్రక్రియ అసాధ్యంగా మారింది’అని ఓ నిపుణుడు వివరించారు. నిపుణుల బృందం ప్రస్తుతం జియో స్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోనే ఉండిపోయిన ఉపగ్రహాన్ని జియో స్టేషనరీ ఆర్బిట్‌లోకి తీసుకెళ్లాల్సి ఉంది. దేశ వ్యాప్తంగా నావిగేషన్ సేవలను అందించేందుకు ఇది అత్యంత కీలకం. ఎన్వీఎస్–02లోని ఇతర వ్యవస్థలన్నీ సక్రమంగానే పనిచేస్తున్నాయి. భూ కేంద్రంతో సంబంధాలు కూడా సజావుగా సాగుతున్నాయి. అయితే, ఎల్‌ఏఎంను మండించలేకపోవడంతో నిర్దేశిత కక్ష్యలోకి దీనిని పంపించలేని పరిస్థితి ఏర్పడింది. ఇందుకు ప్రత్యామ్నాయాలను కనిపెట్టేందుకు ఇస్రో ప్రత్యేకంగా నిపుణులు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇవన్నీ సజావుగా సాగితే సరి, లేకుంటే ఉపగ్రహం తిరిగి భూమిపై పడిపోయే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముక్కలై మండిపోతుందా..! ఎల్‌ఏఎంను ఫైర్ చేయకుంటే, శాటిలైట్‌ను నిర్దేశిత కక్ష్యలోకి పంపే వీల్లేదు. అందుకే, అది ఆ కక్ష్యలోనే ఉండిపోనుంది. ఈ నేపథ్యంలో దీర్ఘవృత్తాకార కక్ష్యలో ఉండే ఎన్వీఎస్–02 నుంచి సాధ్యమైనంత మేర సమాచారం రాబట్టుకోవడం మాత్రమే ఇస్రో చేయగలిగిందని నిపుణులు అంటున్నారు. థ్రస్టర్లను యాక్టివేట్ చేయలేని పరిస్థితుల్లో దీర్ఘవృత్తాకార కక్ష్యలో ఉండే ఎన్వీఎస్–02 కక్ష్యలో మార్పుల కారణంగా అంతరిక్ష వాతావరణం లాక్కెళుతుంది. దీంతో, కక్ష్య నుంచి దూరంగా వెళ్లిపోయి వాతావరణంలోకి తిరిగి ప్రవేశిస్తుంది. తీవ్ర ఘర్షణ కారణంగా ముక్కలై మండిపోతుంది. తర్వాతి తరం నావిక్ వ్యవస్థలో భాగంగా ఇస్రో పంపే శాటిలైట్లలో ఎన్వీఎస్–02 రెండోది. భవిష్యత్తులో ఇటువంటి వాటిని మరికొన్నిటిని ప్రయోగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. వీటి వల్ల భారత్‌తోపాటు చుట్టుపక్కల 1,500 కిలోమీటర్ల పరిధిలోని వినియోగదారులకు జీపీఎస్, టైమింగ్ డేటా వంటి సమాచారం అందుతుంది. -
బృహస్పతి చంద్రుడిపై శిలాద్రవ గదులు
సౌర వ్యవస్థలో సూర్యుడి నుంచి ఐదో గ్రహం జూపిటర్(బృహస్పతి). అన్ని గ్రహాల్లోకెల్లా ఇదే పెద్దది. మన భూమికి ఉపగ్రహం చందమామ ఉన్నట్లే బృహస్పతికి కూడా ‘ఐవా’ అనే ఉపగ్రహం ఉంది. మొత్తం సౌర వ్యవస్థలో నిరంతరం జ్వలించే భారీ అగ్నిపర్వతాలు (వాల్కనో) ఉన్న పెద్ద ఉపగ్రహం ఐవా. ఇక్కడ 400 అగ్నిపర్వతాలు ఉన్నట్లు అంచనా. ఇవి నిత్యం శిలాద్రవాన్ని(మాగ్మా) విరజిమ్ముతూనే ఉంటాయి. అదొక అగ్ని గుండమని చెప్పొచ్చు. సరిగ్గా మన చందమామ పరిమాణంలో ఉండే ఐవాలో ఈ వాల్కనోలకు కారణం ఏమిటన్నది చాలా ఏళ్లుగా మిస్టరీగానే ఉండేది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ’నాసా’ ఈ రహస్యాన్ని ఛేదించే విషయంలో పురోగతి సాధించింది. నాసా సైంటిస్టులు జూనో మిషన్‌లో భాగంగా బృహస్పతిపై పరిశోధనలకు జూనో స్పేస్‌క్రాఫ్ట్ ప్రయోగించారు. 2023 డిసెంబర్, 2024 ఫిబ్రవరిలో ఈ స్పేస్‌క్రాఫ్ట్ ఐవా సమీపంలోకి వెళ్లింది. ఐవా ఉపరితలం నుంచి 1,500 కిలోమీటర్ల ఎత్తువరకూ చేరుకొని ఫొటోలు చిత్రీకరించింది. అత్యంత కచ్చితత్వంతో కూడిన డాప్లర్ డేటాను సేకరించింది. ఈ గణాంకాలను విశ్లేషించిన నాసా శాస్త్రవేత్తలు ఐవాపై నిప్పుల కొండలకు కారణం ఏమిటన్నది గుర్తించారు. ఐవా ఉపరితలం కింద మాగ్మా ఒక సముద్రం తరహాలో విస్తరించి లేదని, వేర్వేరు చాంబర్ల(గదులు)లో ఉందని కనిపెట్టారు. శిలాద్రవం ఒకదానితో ఒకటి సంబంధం లేదని వేర్వేరు చాంబర్లలో ఉండడం వల్ల అధిక ఒత్తిడితో ఉపరితలంపైకి వేగంగా చొచ్చుకొని వస్తున్నట్లు చెప్పారు. దాంతో విరామం లేకుండా అగ్నిపర్వతాలు జ్వలిస్తున్నట్లు వెల్లడించారు. ఒకవేళ సముద్రం తరహాలో మాగ్మా విస్తరించే ఉంటే దానిపై ఒత్తిడి తక్కువగా ఉండేది. అలాంటప్పుడు అది పైకి ఉబికి వచ్చే అవకాశం అంతగా ఉండదు. ఈ అధ్యయనం వివరాలను నేచురల్ జర్నల్‌లో ప్రచురించారు. ఐవా ఉపగ్రహాన్ని తొలిసారిగా 1610లో గలీలియో గలిలీ కనిపెట్టారు. కానీ, అక్కడ భారీ సంఖ్యలో అగ్నిపర్వతాలు ఉన్న సంగతి 1979తో తెలిసింది. నాసా ప్రయోగించిన వోయేజర్–1 స్పేస్‌క్రాఫ్ట్ ఈ విషయం గుర్తించింది. అప్పటి నుంచి వీటిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఐవాపైనున్న వాల్కనోల గుట్టు తెలిసింది కాబట్టి గ్రహాలు, ఉపగ్రహాలు ఎలా, ఎప్పుడు ఏర్పడ్డాయన్నది గుర్తించడానికి ఈ పరిశోధన దోహదపడుతుందని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నిప్పులు చిమ్ముతూ నింగిలోకి GSAT-20
-
నింగిలోకి దూసుకెళ్లిన కలప ఉపగ్రహం
వాషింగ్టన్: అత్యంత కఠినమైన లోహాలతో రూపొందిన కృత్రిమ ఉపగ్రహాలు కాలంచెల్లాక కక్ష్యల్లో స్పేస్‌జంక్‌గా పోగుబడుతున్న నేపథ్యంలో వాటికి ప్రత్యామ్నాయంగా కలపను భవిష్యత్తులో వాడే ఉద్దేశ్యంతో జపాన్ శాస్త్రవేత్తలు కలపతో ఉపగ్రహాన్ని తయారుచేశారు. ప్రపంచంలో తొలిసారిగా కలపతో తయారైన ‘లిగ్నోశాట్’ఉపగ్రహం అమెరికాలోని నాసా వారి కెన్నడీ అంతరిక్షప్రయోగ కేంద్రం నుంచి స్పేస్ఎక్స్ రాకెట్ లో నింగిలోకి దూసుకుపోయి ందని క్యోటో వర్సిటీ హ్యూమన్ స్పేసాలజీ సెంటర్ మంగళవారం ప్రకటించింది. కేవలం అరచేయి సైజులో 10 సెంటీమీటర్ల వృత్తాకార పరిమాణంలో ఈ బుల్లిశాటిలైట్ను తయారుచేశారు. ఒక కంటైనర్‌లో అమర్చి పంపారు. త్వరలో ఇది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని చేరుకోంది. కొద్దిరోజుల విరామం తర్వాత దీనిని ఐఎస్ఎస్ బయట ప్రవేశపెట్టనున్నారు. ఆరునెలలపాటు ఇది తన కక్ష్యలో తిరగనుంది. శూన్యంలో రోదసీ వాతావరణంలో కలప ఏ మేరకు మన్నికగా ఉంటుందనే విషయాలపై అధ్యయనం చేయనున్నారు. ప్రతి 45 నిమిషాలకు ఇది రోదసీలో చీకటి మొదలు తీక్షణమైన సూర్యరశ్ని దాకా అంటే మైనస్ 100 డిగ్రీ సెల్సియస్ నుంచి 100 డిగ్రీ సెల్సియస్దాకా భిన్న ఉష్ణోగ్రతలను తట్టుకోవాల్సి ఉంటుంది. కలపను దహించే ఆక్సిజన్ వంటి వాయువులు శూన్యంలో ఉండవుకాబట్టి అక్కడ కలప ధృఢంగా ఉండగలదని జపాన్‌లోని క్యోటో విశ్వవిద్యాలయ అటవీశాస్త్ర ప్రొఫెసర్ కోజీ మురాటా వాదిస్తున్నారు. ఖడ్గం పిడి, ఒరగా వాడే మంగోలియా జాతి హొనోకీ చెట్టు కలపను ఈ శాటిలైట్ తయారీలో వాడారు. జపాన్ సంప్రదాయక కళతో ఎలాంటి నట్లు, బోల్ట్‌లు, జిగురు వాడకుండానే లిగ్నోశాట్‌ను సిద్ధంచేశారు. కాలం చెల్లిన శాటిలైట్ తిరిగి భూవాతావరణంలోకి వచ్చేటపుడు ప్రమాదకర అల్యూమినియం ఆక్సైడ్ అణువులను వెలువరుస్తుంది. అదే కలప శాటిలైట్‌తో పర్యావరణానికి, కమ్యూనికేషన్ కక్ష్యలకు ఎలాంటి సమస్యలు ఉండవని క్యోటో వర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం బయట కలపశాటిలైట్ మన్నిక బాగుందని తేలితే భవిష్యత్తులో చంద్రుడు, మార్స్‌పై వ్యోమగాముల ఆవాసాలకు కలపను విరివిగా వాడే అవకాశముంది. ఐఎస్ఎస్ నుంచి సరకుల రాకపోకల్లోనూ కంటైనర్లకు కలపను వాడే వీలుంది. -
బీఎస్ఎన్ఎల్ కొత్త అడుగు.. దేశంలో తొలి D2D
శాటిలైట్ కమ్యూనికేషన్స్ కంపెనీ వయాశాట్ (Viasat), ప్రభుత్వ టెల్కో బీఎస్ఎన్ఎల్ (BSNL) సహకారంతో భారతదేశంలో మొదటిసారిగా డైరెక్ట్-టు-డివైస్ కనెక్టివిటీని తీసుకొస్తోంది. దీనికి సంబంధించిన ట్రయల్‌ను విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించింది.బీఎస్ఎన్ఎల్తో కలిసి వయాశాట్ ఇంజనీర్లు ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో ఉపగ్రహ ఆధారిత టూ-వే మెసేజింగ్ సేవలను ప్రదర్శించారు. డీటుడీ కనెక్టివిటీ ద్వారా మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు వంటి సాధారణంగా ఉపయోగించే పరికరాలు లేదా కార్లు, పారిశ్రామిక యంత్రాలు, రవాణా సాధనాలను ఎటువంటి ప్రత్యేక హార్డ్‌వేర్ అవసరం లేకుండానే శాటిలైట్ నెట్‌వర్క్‌కు అనుసంధానించవచ్చు.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ దూకుడు.. ఇక మరింత ‘స్పీడు’"ఈ ట్రయల్‌లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి నాన్-టెరెస్ట్రియల్ నెట్వర్క్ (NTN) కనెక్టివిటీ కోసం వయాసాట్ టూ-వే మెసేజింగ్, ఎస్ఓఎస్ మెసేజింగ్‌ను ప్రదర్శించింది .దాదాపు 36,000 కి.మీల దూరంలోని వయాశాట్ జియోస్టేషనరీ ఎల్-బ్యాండ్ శాటిలైట్‌కు ఈ సందేశాలు చేరాయి. వయాశాట్ శాటిలైట్ నెట్వర్క్ని ఉపయోగించి సెల్ ఫోన్ కనెక్టివిటీకి శాటిలైట్ సేవలు అందించడం సాంకేతికంగా సాధ్యమవుతుందని ఈ ట్రయల్ ఫలితం రుజువు చేసింది" అని వయాశాట్ ఒక ప్రకటనలో తెలిపింది.ఏమిటీ D2D?డైరెక్ట్ -టు - డివైస్ (D2D) అనేది సాధారణ స్మార్ట్ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు వంటి పరికరాలను ఎటువంటి అదనపు హార్డ్‌వేర్ అవసరం లేకుండా నేరుగా శాటిలైట్ నెట్‌వర్క్‌లకు అనుసంధానించే టెక్నాలజీ. సాంప్రదాయ ఇంటర్నెట్ సదుపాయాలు లేని మారుమూల ప్రాంతాలు, ఇంటర్నెట్ అంతంత మాత్రమే ఉండే ప్రాంతాల్లో ఈ సాంకేతికత అవాంతరాలు లేని కనెక్టివిటీని అందిస్తుంది.ప్రయోజనాలివే.. » సాంప్రదాయ ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలు అందుబాటులో లేని మారుమూల, గ్రామీణ ప్రాంతాల్లో కనెక్టివిటీని అందిస్తుంది» వినియోగదారులు తమ లొకేషన్‌తో సంబంధం లేకుండా ఇంటర్నెట్ సేవలు, కమ్యూనికేషన్ సాధనాలను యాక్సెస్ చేయగలరు.» సాంప్రదాయ శాటిలైట్ కమ్యూనికేషన్ పద్ధతులతో పోలిస్తే తక్కువ జాప్యంతో వేగవంతమైన డేటా ప్రసారానికి దారితీస్తుంది.» అందుబాటులో ఉన్న స్పెక్ట్రమ్‌ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు తోడ్పడుతుంది. మొత్తం నెట్వర్క్ పనితీరును మెరుగుపరుస్తుంది» అదనపు హార్డ్‌వేర్ అవసరాన్ని తగ్గిస్తుంది. ఇది కనెక్టివిటీకి మరింత తక్కువ ఖర్చుతో కూడుకున్న పరిష్కారంగా మారుతుంది .» అత్యవసర సేవలు , సముద్రయానం , విమానయానం వంటి వాటిలో ఉపయోగించుకోవచ్చు. -
వేలం ప్రక్రియే మేలు: రిలయన్స్
వ్యక్తిగత లేదా గృహ వినియోగదారుల కోసం శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలకు సంబంధించి ఎలాంటి నిబంధనలు లేవని రిలయన్స్ తెలిపింది. దేశంలో గృహ వినియోగానికి సంబంధించిన ఉపగ్రహ బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను నేరుగా కేటాయించాలని ట్రాయ్ నిర్ణయం తీసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలపై రిలయన్స్ స్పందించింది. నిర్దిష్ట స్థాయి కలిగిన శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవల కోసం స్పెక్ట్రమ్‌ను నేరుగా కేటాయించడం కంటే వేలం నిర్వహించాలని తెలిపింది.దేశంలో గృహ వినియోగ శాటిలైట్ సేవలకు స్పెక్ట్రమ్‌ను ఎలా కేటాయిస్తారని గతేడాది నుంచి చర్చలు సాగుతున్నాయి. ఇలొన్మస్క్కు చెందిన స్టార్‌లింక్, అమెజాన్ ఆధ్వర్యంలోని ప్రాజెక్ట్ కూపర్ వంటి వాటికోసం అంతర్జాతీయంగా వివిధ ప్రాంతాల్లో స్పెక్ట్రమ్‌కు సంబంధించి నేరుగా అడ్మినిస్ట్రేటివ్ కేటాయింపులు చేశారు. అయితే ఆసియాలోని వివిధ ప్రాంతాల్లో విస్తరణకు సిద్ధమవుతున్న రిలయన్స్ జియో మాత్రం హోమ్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రమ్ కోసం వేలం ప్రక్రియ నిర్వహించాలని తెలుపుతుంది. ఈమేరకు ట్రాయ్‌కు ఇటీవల లేఖ రాసినట్లు పేర్కొంది. మస్క్ కోరుకున్న విధంగా గతేడాది స్పెక్ట్రమ్‌ను నేరుగా కేటాయించేందుకు ట్రాయ్ నిబంధనలు సవరించనుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: రూపాయి భారీ పతనానికి కారణాలుటెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ దీనికి సంబంధించిన నిబంధనలపై ప్రస్తుతం పబ్లిక్ కన్సల్టేషన్‌ను నిర్వహిస్తోంది. ఈ ప్రక్రియపై మరింత స్పష్టత రావడానికంటే ముందే రిలయన్స్ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తుంది. ట్రాయ్ తన కన్సల్టేషన్ పేపర్లో ఎలాంటి చట్టపరమైన అధ్యయనాలు నిర్వహించకుండానే స్పెక్ట్రమ్ కేటాయింపులపై నిర్ణయం తీసుకోబోతుందని రిలయన్స్ తన లేఖలో పేర్కొంది. -
నానో శాటిలైట్ సాధనలో తొలిమెట్టు.. పుణేలో గ్రౌండ్ స్టేషన్
మిట్ వరల్డ్ పీస్ యూనివర్సిటీ (MIT-WPU) సంస్థ నానో-శాటిలైట్ చొరవలో భాగంగా పుణే క్యాంపస్‌లో అత్యాధునిక గ్రౌండ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది. శాటిలైట్ రిసెప్షన్, రేడియో ఆస్ట్రానమీ రెండింటిలోనూ సామర్ధ్యం కలిగిన ఈ కేంద్రాన్ని మిట్ వరల్డ్ పీస్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రాహుల్ కరాద్ ప్రారంభించారు.రేడియో ఆస్ట్రానమీ పరిశోధన పురోగతికి, శాటిలైట్ కమ్యూనికేషన్ సామర్థ్యాలను మెరుగుపరచడానికి అవసరమైన విలువైన డేటాను ఈ గ్రౌండ్ స్టేషన్ అందిస్తుంది. శాటిలైట్ కమ్యూనికేషన్ (డౌన్‌లింక్), కాస్మిక్ అబ్జర్వేషన్ సంక్లిష్ట పనులను ఏకకాలంలో నిర్వహించగల సామర్థ్యం ప్రపంచంలోనే అరుదైన ఈ కేంద్రానికి ఉంది.లో ఎర్త్ ఆర్బిట్ (LEO), మీడియం ఎర్త్ ఆర్బిట్ (MEO), హై ఎలిప్టికల్ ఆర్బిట్ (HEO), జియోస్టేషనరీ ఎర్త్ ఆర్బిట్ (GEO)లోని ఉపగ్రహాల నుండి సిగ్నల్స్ అందుకోవడానికి రూపొందించిన ఆరు వేర్వేరు యాంటెన్నాలు ఈ గ్రౌండ్ స్టేషన్లో ఉంటాయి. ప్రత్యేకమైన డిష్ అండ్ హార్న్ యాంటెనాలు అధిక-ఫ్రీక్వెన్సీ సంకేతాలను స్వీకరిస్తాయి. వాటిని శక్తివంతమైన రేడియో ఆస్ట్రానమీ సాధనంగా మారుస్తాయి. అత్యంత సూక్ష్మమైన సంకేతాలు, గెలాక్సీ మ్యాపింగ్, డార్క్ మ్యాటర్, కాస్మోస్ రేడియో చిత్రాలను అధ్యయనం చేయడానికి వీలు కల్పిస్తాయి.గ్రౌండ్ స్టేషన్ వాతావరణ డేటాను సేకరించడానికి ఓపెన్ సోర్స్ ఉపగ్రహాల నుండి సిగ్నల్‌లను అందుకోగలదు, అలాగే క్యూబ్శాట్లు, నానోశాట్లు, మైక్రోసాట్ల నుండి టెలిమెట్రీని అందుకోగలదు.స్కూల్ ఆఫ్ సైన్స్ & ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అసోసియేట్ డీన్ డాక్టర్ అనుప్ కాలే, ప్రొఫెసర్ అనఘా కర్నే, డాక్టర్ డియోబ్రత్ సింగ్, డాక్టర్ సచిన్ కులకర్ణిలతో సహా 35 మంది మిట్ వరల్డ్ పీస్ యూనివర్సిటీ విద్యార్థుల బృందం ప్రాజెక్ట్‌లో పని చేస్తోంది. -
ఇస్రో అమ్ములపొదిలోకి మరో రాకెట్
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అమ్ముల పొదిలోకి మరో రాకెట్ చేరింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ) డి–3 ప్రయోగాన్ని శుక్రవారం ఉదయం విజయవంతంగా నిర్వహించింది. ఈ ప్రయోగం ద్వారా 175.5 కేజీల బరువు కలిగిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈవోఎస్–08), ఎస్ఆర్–0 డెమోశాట్ అనే రెండు ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగానికి శుక్రవారం తెల్లవారుజామున 2.47 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించారు. ఆరున్నర గంటలపాటు కౌంట్‌డౌన్ అనంతరం ఉదయం 9.17 గంటలకు ఎస్ఎస్ఎల్వీ డి–3 రాకెట్ నింగివైపునకు దూసుకెళ్లింది. రాకెట్‌లోని మొత్తం నాలుగు దశలు సక్రమంగా పనిచేయడంతో 16.56 నిమిషాల్లోనే ప్రయోగం విజయవంతంగా ముగిసింది. భూమికి 475 కిలోమీటర్లు ఎత్తులోని లియో ఆర్బిట్ (సూర్య సమకాలిక కక్ష్య)లో 37.2 డిగ్రీల వృత్తాకారపు కక్ష్యలోకి విజయవంతంగా ఉప గ్రహాలను ప్రవేశపెట్టారు. మొదట ఈవోఎస్–08ను కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఎస్ఆర్–0 డెమోశాట్ అనే చిన్న ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. కక్ష్యలోకి చేరిన ఉపగ్రహాల నుంచి సిగ్నల్స్ అందడంతో శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఇస్రో చిన్న తరహా ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా ప్రయోగించి వాణిజ్యపరంగా గుర్తింపు పొందింది. ఇవీ ఉపయోగాలు ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్–08లో ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్, గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం–రిప్లెక్టోమెట్రీ, ఎస్ఐసీ యూవీ డొసిమీటర్ అనే మూడు రకాల పేలోడ్స్‌ను అమర్చారు. వీటి ద్వారా ఈ ఉపగ్రహం భూమి మీద వాతావరణ పరిస్థితులు(¿ౌగోళిక–పర్యావరణం)పై ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ సమాచారాన్ని చేరవేస్తుంది. ముఖ్యంగా అటవీ, వ్యవసాయం, భూమి స్వభావం, నీరు అధ్యయనాలకు సంబం«ధించిన సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉపగ్రహం ఒక్క ఏడాదే సేవలు అందిస్తుంది. వాణిజ్యపరంగా కూడా వినియోగిస్తాంఎస్ఎస్ఎల్వీ డి–3 ప్రయోగం అనంతరం ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి మాట్లాడుతూ ఇస్రోలో సరికొత్తగా ఎస్ఎస్ఎల్వీ రాకెట్ చేరిందని చెప్పారు. ఇప్పటిదాకా ఎస్ఎల్వీ, ఏఎస్ఎల్వీ, పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ మార్క్–3 వంటి ఐదు రకాల రాకెట్లు మాత్రమే ఉండేవని తెలిపారు. 2022 ఆగస్టు 7న ప్రయోగించిన ఎస్ఎస్ఎల్వీ డి–1 రాకెట్ విఫలం కావడంతో అందులో ఏర్పడిన లోపాలను సరిచేసి.. ముందస్తు పరీక్షలు నిర్వహించి ఎస్ఎస్ఎల్వీ డి–3 ప్రయోగానికి సిద్ధమయ్యామన్నారు. దీనికోసం అహరి్నశలు పనిచేసిన ఇస్రోలోని అన్ని విభాగాలకు అభినందనలు తెలిపారు. వాణిజ్యపరంగా కూడా ఈ రాకెట్‌ను వినియోగిస్తామని చెప్పారు. వెహికల్ డైరెక్టర్ ఎస్ఎస్ వినోద్, శాటిలైట్ డైరెక్టర్ ఎ.ఆవినాష్ మాట్లాడుతూ ఉపగ్రహం నుంచి నిర్దేశించిన విధంగా సిగ్నల్స్ అందాయని తెలిపారు.ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ అభినందనలుసాక్షి, అమరావతి: ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి శుక్రవారం స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ) డి–3ని విజయవంతంగా ప్రయోగించడంపై ఆయన హర్షం వ్యక్తంచేశారు. ఈ ప్రయోగం ద్వారా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈవోఎస్–08), ఎస్ఆర్–0 డెమోశాట్ను విజయవంతంగా కక్ష్యలోకి పంపిన శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. అంతరిక్ష పరిశోధన రంగంలో ఈ విజయం ఇస్రోను ప్రపంచ వేదికపై నిలిపిందని ఆయన పేర్కొన్నారు. -
శ్రీహరికోట : ఇస్రో మరో ఘనత.. నింగిలోకి ఎస్ఎస్ఎల్వీ-డీ3 (ఫొటోలు)
-
చైనా కవ్వింపు చర్య.. భారత్ భూభాగంలో వంతెన నిర్మాణం
భారత సరిహద్దులోని ప్యాంగాంగ్ సరస్సు వద్ద చైనా సైనిక కార్యకలాపాలను ముమ్మరం చేసినట్ల తెలుస్తోంది. ప్యాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ ఒడ్డులను కలుపుతూ 400 మీటర్ల వంతెనను పూర్తి చేసింది. దీనికి సంబంధించిన సాటిలైట్ అమెరికాకు చెందిన బ్లాక్‌స్కై సంస్థ విడుదల చేసింది. ఈ బ్రిడ్జ్ పూర్తి కావటం వల్ల సరిహద్దుల్లో సైనిక దళాలు, సామగ్రిని మోహరించడానికి చైనాకు సమయం తగ్గనున్నట్లు తెలుస్తోంది.🛑 China has completed a 400-meter bridge over Pangong Lake in #Ladakh, enhancing troop movement between the north and south banks and reducing travel by 50-100 km. Located 2 km from the Line of Actual Control (#LAC) in the disputed Aksai Chin area, this bridge is strategically… pic.twitter.com/qMCVzN7ypg— Saikiran Kannan | 赛基兰坎南 (@saikirankannan) July 30, 2024 ఈ వంతెన పూర్తి అయి జూలై 9 నుంచే ఉపయోగంలోకి వచ్చి పలు వాహనాలు రాకపోకలు సాగిస్తున్నట్లు సాటిలైట్ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. ఈ బ్రిడ్జ్ సరిహద్దుకు కేవలల 25 కిలో మీటర్ల దూరంలోనే ఉండటం గమనార్హం. ఈ బ్రిడ్జ్‌కి ఉత్తరంగా ఉన్న ఖుర్నాక్ కోట ప్రాంతంలో చైనా ఆర్మీ రెండు హెలిపాడ్లు నిర్మించినట్లు కూడా ఆ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ ప్రాంతం 1958కి ముందు భారత్ భాగంగానే ఉండేది. కానీ, అనంతరం ఈ ప్రాంత్నాన్ని చైనా ఆక్రమించింది. ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి రావటం వల్ల ప్యాంగాంగ్ సరస్సు మధ్య 50 నుంచి 100 కిలోమిటర్ల దూరం తగ్గనుంది. అయితే ఈ బ్రిడ్జ్ నిర్మాణంపై గతంలో భారత విదేశాంగ శాఖ స్పందించింది. ‘‘దాదాపు 60 ఏళ్లుగా చైనా అక్రమ ఆక్రమణలో ఉన్న ప్రాంతంలో ఈ వంతెనను నిర్మిస్తున్నారు. ఇలాంటి అక్రమ ఆక్రమణలను భారతదేశం ఎన్నడూ అంగీకరించదు’’అని పేర్కొంది. -
నింగిలోకి బెలూన్ శాటిలైట్
చంద్రగిరి (తిరుపతి జిల్లా): వాతావరణంలోని మార్పులు, పీడనతో పాటు మరికొన్ని విశేషాలను తెలుసుకునేందుకు మోహన్‌బాబు యూనివర్సిటీ (ఎంబీయూ) విద్యార్థులు, ఎన్ఏఆర్ఎల్, ఐఐఎస్టీ సహకారంతో రూపొందించిన బెలూన్ శాటిలైట్ శనివారం నింగిలోకి ఎగిరింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చాన్సలర్ మోహన్‌బాబు, ప్రో చాన్సలర్ మంచు విష్ణులతో పాటు ఇస్రో చంద్రయాన్–3 ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ వీర ముత్తువేల్, డాక్టర్ కల్పన కాళహస్తి, ఓషన్ శాట్–3 మిషన్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ తెన్ముయి శెల్వి , గ్రూపు డైరెక్టర్ గోపికృష్ణతో పాటు ఎన్ఏఆర్ఎల్, ఐఐఎస్టీ శాస్త్రవేత్తలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా ఉదయం 11.15 గంటలకు విద్యార్థులు రూపొందించిన ఎంబీయూ శాట్–1ను మోహన్‌బాబుతో పాటు శాస్త్రవేత్తలు లాంచ్ చేశారు. ఎన్ఏఆర్ఎల్తో భాగస్వామ్యం ద్వారా రూ.1.5 లక్షల తక్కువ ఖర్చుతో విజయవంతంగా నిర్వహించిన ఈ బెలూన్ శాటిలైట్ ఇతర విశ్వవిద్యాలయాలకు ప్రామాణికంగామారుతుందని విద్యార్థులు చెప్పారు. సుమారు 5 కేజీల బరువుతో 35 కి.మీ. ఎత్తులో 200 కిలోమీటర్ల వరకూ ఈ శాటిలైట్ ప్రయాణిస్తుందని చెప్పారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి సారిగా ఒక యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన శాటిలైట్ విజయవంతం కావడం సంతోషకరమని యూనివర్సిటీ చాన్సలర్ మోహన్‌బాబు చెప్పారు. -
భారత సరిహద్దుల్లో చైనా బంకర్ల నిర్మాణం!
భారత్‌ను కవ్వించే ప్రయత్నాలు చేస్తోంది చైనా. ఇప్పటికే భారత సరిహద్దులను డ్రాగన్ దేశం అస్థిరపరిచే కుట్రను గత కొన్నేళ్లుగా అమలు చేస్తోంది. అయితే తాజాగా చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) తూర్పు లడఖ్‌లోని ప్యాగ్యాంగ్ సరస్సు చుట్టుపక్కల అండర్‌గ్రౌండ్ బంకర్లు నిర్మిస్తున్నట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా కనిపిస్తోందని రక్షణ రంగ నిపుణులు వెల్లడించారు. ఆయుధాలు, ఇంధనం, సైనిక వాహనాల కోసం చైనా ఆర్మీ బంకర్లు నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ప్యాగ్యాంగ్ సరస్సుకు ఉత్తర వైపు పర్వతాల మధ్య చైనా ఆర్మీ బేస్ సిర్జాప్ వద్ద బంకర్ల నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ బంకర్ల నిర్మాణాలు వాస్తవాధీన రేఖకు కేవలం ఐదు కిలోమిటర్ల దూరంలోనే ఉంది. ప్రస్తుతం ఈ బంకర్లు నిర్మిస్త్ను ప్రాంతంలో 2020 ప్రారంభమైన ప్రతిష్టంభనకు ముందు ఎటువంటి మానవ సంచారం లేదు.2021-22 మధ్య నిర్మించిన బంకర్లుగా కనిపిస్తున్నాయి. ఈ బేస్‌లో ఆయుధాలు, ఇంధనం, ఇతర సామాగ్రి భద్రపరచం కోసం నిర్మించిన బంకర్లుగా కనిపిస్తున్నాయి. యూఎస్‌కు చెందిన బ్లాక్‌స్కై సంస్థ అందించిన ఉపగ్రహ చిత్రాల ఈ విషయం తెలుస్తోంది. సాటిలైట్ మే 30న తీసినఫొటోలో ఒక పెద్ద బంకర్.. దానికి ఎనిమిది ఎన్ట్రెన్స్లు. మరో చిన్న బంకర్.. దానికి ఐదు ఎన్ట్రెన్స్ ఉన్నట్లు స్పష్టం తెలుస్తోంది.అదే విధంగా పక్కనే పలు పెద్ద బిల్డింగ్లు, సైనిక వాహనాలతో అనేక షెల్టర్లు ఉన్నాయి. సైనిక వాహనాలను గగనతల దాడుల నుంచి రక్షించుకోవడానికి చైనా ఆర్మీ షెల్టర్లు నిర్మించుకున్నట్లు రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు.. ఇటీవల జరిగిన ఎస్సీవో సదస్సు సందర్భంగా ఆస్తానాలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భేటీ అయ్యారు. ఈ భేటీలో ద్వైపాక్షిక సంబంధాలపై లోతుగా చర్చించారు. సరిహద్దుల్లో నెలకొన్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఇరు నేతలూ తీర్మానించారు. ఇందుకోసం సైనిక, దౌత్య మార్గాల్లో ప్రయత్నాలను వేగవంతం చేసేందుకు అంగీకారం తెలిపారు. -
అంతరిక్ష వ్యర్థాలకు చెక్ పెట్టేలా 'చెక్క ఉపగ్రహం'..ప్రపంచంలోనే..!
సాధారణంగా ఉపగ్రహాలు లోహంతో తయారు చేస్తారు. అవి వాతావరణంలో పొరపాటున కాలిపోతే హానికరమైన చెత్తను సృష్టిస్తున్నాయి. ఈ శిథిలాల కార్యాచరణ ఇతర ఉపగ్రహాలు, అంతరిక్ష నౌకకు గణనీయమైన ముప్పుని కలిగిస్తాయి. అందుకని ఈ సమస్యకు చెక్‌పెట్టేలా జపాన్ శాస్త్రవేత్తలు సరికొత్త ఉప్రగ్రహ్నాన్ని అభివృద్ధిచ చేశారు. దేనితో అంటే..ప్రపంచంలోనే తొలిసారిగా జపాన్ పరిశోధకులు లిగ్నోశాట్ అనే చిన్న చెక్క ఉపగ్రహాన్ని అభివృద్ధి చేశారు. దీన్ని సెప్టెంబర్‌లో అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ లిగ్నోశాట్ని క్యోటో విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు లాగింగ్ కంపెనీ సుమిటోమో ఫారెస్ట్రీ సహకారంతో రూపొందించగలిగారు. 2020 ఏప్రిల్ నుంచి ఈ ఉపగ్రహాన్ని అభివృద్ధి చేసే పనిలోపడ్డారు. ఈ ఉపగ్రహాన్ని తయారు చేసేందుకుమాగ్నోలియా కలపను ఎంచుకున్నారు. ఈ చెక్క ఉపగ్రహాలు అంతరిక్షంలోని వ్యర్థాల సమస్యలకు శాశ్వతమైన పరిష్కారం అందించగలవని పరిశోధకులు చెబుతున్నారు. చెక్కను ఉపగ్రహంలా మలిచేలా ప్రతివైపు పది సెంటిమీటర్లు ఉండేలా అడ్జెస్ట్ చేశారు. దీన్ని సెప్టెంబర్‌లో కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ ఎక్స్ రాకెట్లో ప్రయోగించనుంది. అక్కడ నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్)కి డెలివరీ చేయడం జరుగుతుంది. అక్కడ ఈ ఉపగ్రహం బలాన్ని, ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులను తట్టుకునే సామార్థ్యం ఉందా లేదా వంటి పలు టెస్ట్‌లు చేస్తారు. అందుకోసం డేటాని పంపించి పరిశీలిస్తామని సుమిటో ఫారెస్ట్రీ ప్రతినిధి తెలిపారు. ఈ సరికొత్త చెక్క ఉపగ్రహం అంతరిక్ష వ్యర్థాలపై పోరాటంలో ఒక ముఖ్యమైన ముందడుగు. ఇది గనుక విజయవంతమైతే కొత్తతరం పర్యావరణ అనకూల ఉపగ్రహాలను తయారు చేసేలా ఈ లిగ్నోశాట్ ఉపగ్రహం మార్గం సుగమం చేస్తుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.(చదవండి: చిట్టి పికాసో: రెండేళ్ల వయసులో పెయింటింగ్..ఎంతకు అమ్ముడయ్యాయంటే..) -
నేడు నింగిలోకి అగ్నిబాన్ రాకెట్
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): అగ్నికుల్ కాస్మోస్ ప్రయివేట్ లిమిటెడ్ (చెన్నై) అనే ప్రయివేట్ అంతరిక్ష సంస్థకు చెందిన అగ్నిబాన్ ఎస్ఓఆర్ టీఈడీ మిషన్–01 అనే చిన్న తరహా రాకెట్‌ను సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని అగ్నికుల్ ప్రయోగవేదిక నుంచి శనివారం ఉదయం 6గంటలకు ప్రయోగించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ విషయాన్ని షార్ శుక్రవారం మీడియాకు తెలిపింది. ఇస్రోలోని వాణిజ్యవిభాగమైన ఇన్‌స్పేస్ సంస్థ ఆహ్వానం మేరకు షార్‌లోని సౌండింగ్ రాకెట్ లాంచ్పాడ్ నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నారు. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభమవుతుంది. ఈ ప్రయోగంలో సుమారు వంద కిలోలు బరువు కలిగిన పేలోడ్ (ఉపగ్రహం)ను లోయర్ ఎర్త్ ఆర్బిట్ (లియో)లోకి పంపించనున్నారు. అయితే రాకెట్‌కు సంబంధించిన అన్ని విషయాలను అగ్నికుల్ సంస్థ చూసుకుంటుండగా, షార్ అధికారులు, ఇంజినీర్లు ప్రయోగాన్ని పర్యవేక్షిస్తున్నారు. అందుకే ఈ రాకెట్‌కు సంబంధించిన వివరాలను పూర్తిస్థాయిలో వెల్లడించడం లేదు. అయితే షార్ వేదికగా ప్రయివేట్ అంతరిక్ష సంస్థల్లో స్కైరూట్, అగ్నికుల్ అనే రెండు సంస్థలకు చెందిన చిన్న తరహా ప్రయోగాలకు ఇస్రో వీలు కల్పిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ప్రయోగ వేదికలను కూడా కల్పించి మరీ ప్రయివేట్ అంతరిక్ష సంస్థలకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తోంది. అందుకే అగ్నికుల్ సంస్థకు షార్కేంద్రంలో ఒక ప్రయోగవేదికను కూడా కేటాయించారు. అగ్నిబాన్ రాకెట్ వివరాలివి పేటెంట్ పొందిన అగ్నిలెట్ ఇంజన్లతో ఈ రాకెట్ నడవడం విశేషం. ఇది త్రీడీ–ప్రింటెడ్ 6 కేఎన్ సెమీ క్రయోజనిక్ ఇంజిన్ సాయంతో నిలువునా నింగిలోకి ఎగురుతుంది. అగ్నికుల్ రాకెట్ 18 మీటర్లు ఎత్తు కలిగి 1.3 మీటర్లు వెడల్పు ఉంది. ప్రయోగ సమయంలో 14వేల కిలోల బరువు కలిగి ఉంటుంది. ఈ అగ్నిలెట్ ఇంజిన్లలో ద్రవ ఆక్సిజన్, ద్రవ ఆక్సిడైజర్ అనే ఇంధనం సాయంతో మూడు దశలుగా రాకెట్‌ను ప్రయోగిస్తారు. అగ్నికుల్ కాస్మోస్ సంస్థ గతేడాది ఆగస్టు 15న ఒకసారి ప్రయోగాన్ని నిర్వహించగా, రెండోసారి శనివారం ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. -
వసంతపు వెలుగులు
సరిగ్గా సగ భాగం చీకట్లో, మరో సగం ఉదయపు కాంతుల్లో నిండుగా వెలిగిపోతూ కనిపిస్తున్న భూమిని చూస్తున్నారుగా! వసంత విషువత్తు (స్ప్రింగ్ ఈక్వినాక్స్) సందర్భంగా బుధవారం అంతరిక్షం నుంచి భూ గ్రహం ఇలా కని్పంచింది. అచ్చెరువొందించే ఈ ఫొటోను యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ ద ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ మెటరోలాజికల్ శాటిలైట్స్ (ఈయూఎంఈటీఎస్ఏటీ) విడుదల చేసింది. సంవత్సరంలో రెండు రోజులు భూమిపై రాత్రింబవళ్ల నిడివి సమానంగా ఉంటుంది. ఆ రోజుల్లో సూర్యుడు భూమధ్యరేఖపై నేరుగా ఉండటమే ఇందుకు కారణం. వీటినే విషువత్తులుగా పిలుస్తారు. భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించే క్రమంలో ఇవి ఏర్పడతాయి. మొదటిదైన వసంత విషువత్తు ఏటా మార్చి 20కి అటూ ఇటుగా వస్తుంది. ఆ రోజుతో ఉత్తరార్ధ గోళం అధికారికంగా శీతాకాలం నుంచి వసంత కాలంలోకి ప్రవేశిస్తుంది. అక్కడినుంచి ఆ ప్రాంతంలో పగటికాలం, ఉష్ణోగ్రతలు పెరుగుతూ రాత్రుళ్ల నిడివి తగ్గుతూ వస్తాయి. రెండోదైన శరది్వషువత్తు (ఆటమల్ ఈక్వినాక్స్) సెపె్టంబర్ 22కు ఇటూ ఇటుగా వస్తుంది. విషువత్తులకు జ్యోతిశ్శాస్త్రంలో చాలా ప్రాధాన్యముంటుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికాకు ‘స్పేస్ ఎక్స్’ నిఘా ఉపగ్రహాలు!
వాషింగ్టన్: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ స్థాపించిన ‘స్పేస్ ఎక్స్’ కంపెనీ కేవలం అంతరిక్ష ప్రయోగాలే కాదు, నిఘా ఉపగ్రహాల తయారీకి సైతం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు స్పేస్ ఎక్స్‌తో అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ‘ఎన్ఆర్ఓ’ డీల్ కుదుర్చుకున్నట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. 2021లోనే ఒప్పందం కుదిరిందని, ఈ కాంట్రాక్టు విలువ 1.8 బిలియన్ డాలర్లు అని తెలియజేశాయి. దీనిప్రకారం ఎలాన్ మస్క్ సంస్థ వందలాది నిఘా ఉపగ్రహాలను తయారు చేసి, ఎన్ఆర్ఓకు అప్పగించాల్సి ఉంటుంది. అమెరికా భద్రతా సంస్థలు, ఎలాన్ మస్క్ కంపెనీ మధ్య బలపడుతున్న బంధానికి ఈ ఒప్పందమే నిదర్శనమని చెబుతున్నారు. ఈ ఉపగ్రహాలు. భూగోళంపై ప్రతి ప్రాంతంపై డేగ కన్నేస్తాయి. అమెరికా సైనిక ఆపరేషన్లకు తోడ్పాటునందిస్తాయి. లక్ష్యాలను కచ్చితంగా గుర్తించడానికి సహకరిస్తాయి. వీటితో అమెరికా ప్రభుత్వానికి, సైన్యానికి చాలా ప్రయోజనాలే ఉంటాయిని నిపుణులు పేర్కొంటున్నారు. -
ISRO: జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్ ప్రయోగం విజయవంతం
-
అమెరికా వార్నింగ్ ఇచ్చినా ఒకేసారి మూడు ఉపగ్రహాలు ప్రయోగించిన దేశం..!
అణ్వాయుధాల ప్రదర్శనకు తమ దేశం వ్యతిరేకమని, కేవలం రక్షణ చర్యల్లో భాగంగానే కొన్ని అంతరిక్ష పరిశోధనలు జరుపుతున్నట్లు ప్రకటిస్తూనే ఇరాన్ తాజాగా ఒకేసారి మూడు ఉపగ్రహాలను స్పేస్‌లోకి ప్రవేశపెట్టింది. ఇరాన్‌లోని సెమ్నాన్ ప్రావిన్స్‌లోని ఇమాన్ ఖమేని స్పేస్ పోర్ట్ నుంచి మహ్దా(పరిశోధనా ఉపగ్రహం), కెహాన్-2(గ్లోబల్ పొజిషనింగ్), హతేఫ్-1(కమ్యూనికేషన్) నానో ఉపగ్రహాలను ఒకేసారి ప్రయోగించింది. ఇలాంటి ప్రయోగం చేయడం ఇరాన్‌కు ఇదే తొలిసారి కావడం విశేషం. కొన్ని మీడియా కథనాల ప్రకారం.. ‘మహ్దా’ ఉపగ్రహాన్ని ఇరాన్ స్పేస్ ఏజెన్సీ అభివృద్ధి చేసింది. ఈ ఉపగ్రహాలను టూ-స్టేజ్ సీమోర్గ్(ఫీనిక్స్) ఉపగ్రహ వాహననౌక ద్వారా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహాలను 450 కిలోమీటర్ల దిగువ కక్ష్యలో ప్రవేశపెట్టినట్లు తెలిసింది. స్పేస్ ఆధారిత పొజిషనింగ్ టెక్నాలజీ, న్యారో బ్యాండ్ కమ్యునికేషన్ పరీక్షించే లక్ష్యంతో ఇరాన్ ఈ ప్రయోగాలను చేపట్టింది. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ ఈ ప్రయోగాన్ని తీవ్రంగా ఖండించాయి. ఇలాంటి ప్రయోగాలకు దిగొద్దని అమెరికా ఇరాన్‌ను హెచ్చరించినా తన బాలిస్టిక్ క్షిపణుల కోసం ఇరాన్ ఈ టెక్నాలజీను వాడుకోబోతున్నట్లు ప్రకటించింది. దేశ పౌర, రక్షణ ప్రయోజనాల కోసం మాత్రమే ప్రయత్నిస్తున్నట్లు ఇరాన్ తెలిపింది. అయితే ఇరాన్ వద్ద ఉన్న బాలిస్టిక్ క్షిపణులను వాడేందుకే ఈ ప్రయోగం జరిగినట్లు పశ్చిమదేశాలు అభిప్రాయపడుతున్నాయి. ఇరాన్ మాత్రం అణ్వాయుధాలు ప్రదర్శనకు తమ దేశం వ్యతిరేకమని, కేవలం రక్షణ చర్యల్లో భాగంగానే ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఇదీ చదవండి: ఈ దేశాల్లో డబ్బులన్నీ వ్యాపార కుటుంబాలవే.. యునైటెడ్ స్టేట్స్ గతంలో ఇరాన్ ఉపగ్రహ ప్రయోగాలు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాన్ని ధిక్కరిస్తున్నాయని గతంలో తెలిపింది. అణ్వాయుధాలను పంపిణీ చేయగల బాలిస్టిక్ క్షిపణులతో కూడిన ఎలాంటి కార్యకలాపాలను చేపట్టవద్దని గతంలోనే తీర్మానించాయి. తాజా పరిణామాలతో ఇరుదేశాల మధ్య కొంత ఉద్రిక్తతలు చోటుచేసుకున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. -
ఇస్రో కీర్తి కిరీటంలో మరో ఉపగ్రహం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’ కీర్తి కిరీటంలో మరో ఉపగ్రహం ప్రకాశించనుంది. వాతావరణ రంగంలో సేవలందించేందుకు ప్రత్యేకంగా ఉద్దేశించిన ఇన్శాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని త్వరలో శ్రీహరికోట నుంచి రోదసికి ప్రయోగించేందుకు ఇస్రో ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం కక్ష్యలో పరిభ్రమిస్తూ ఇన్శాట్-3డీ, ఇన్శాట్-3డీఆర్ ఉపగ్రహాలు అందిస్తున్న సేవలకు కొనసాగింపుగా ఇన్శాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని త్వరలో జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్ సాయంతో నింగికి ప్రయోగించనున్నారు. కేంద్రప్రభుత్వ ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ కోసం ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. ఫిబ్రవరి 17-మార్చి 17 తేదీల మధ్య ఎప్పుడైనా దాన్ని ప్రయోగించేలా లాంచ్ విండోను ఇస్రో నిర్ణయించింది. ఆ తేదీల మధ్య కాలంలో రాకెట్ గమన మార్గానికి అవాంతరాలు కలుగకుండా ముందుజాగ్రత్త చర్యగా వైమానిక సంస్థలకు ఇస్రో ఇప్పటికే నోటమ్ (నోటీస్ టు ఎయిర్ మిషన్స్) జారీ చేసింది. అంతా సవ్యంగా ఉంటే, వీలు కుదిరితే ఫిబ్రవరి మాసం మధ్యలోనే ఉపగ్రహాన్ని రోదసిలో ప్రవేశపెట్టాలని ఇస్రో యోచిస్తోంది. బెంగళూరులోని ప్రొఫెసర్ యు.ఆర్.రావు శాటిలైట్ సెంటరులో ఇప్పటికే అసెంబ్లింగ్, ఇంటిగ్రేషన్ కార్యక్రమాలతోపాటుగా కీలక పరీక్షలన్నిటినీ విజయవంతంగా పూర్తిచేసుకున్న ఇన్శాట్-3డీఎస్ ఉపగ్రహం శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంటోంది. వాతావరణ సంబంధమైన అధ్యయనం నిర్వహించే ఈ ఉపగ్రహం బరువు ప్రయోగ సమయంలో 2,275 కిలోలు ఉంటుంది. వాతావరణ అంచనాలు రూపొందించడానికి, విపత్తుల గురించి ముంచే హెచ్చరించడానికి వీలుగా తనలోని అత్యాధునిక శాస్త్రీయ పరికరాలతో భూ, సముద్ర ఉపరితలాలను ఇన్శాట్-3డీఎస్ ఉపగ్రహం పరిశీలిస్తుంది. ఇమేజర్లు, డేటా రిలే ట్రాన్స్‌పాండర్ (డీఆర్టీ), శాటిలైట్ ఎయిడెడ్ సర్చ్ అండ్ రెస్క్యూ (ఎస్ఏఎస్ & ఆర్) ట్రాన్స్‌పాండర్ తదితర పరికరాలను దానిలో అమర్చారు. మార్చిలో నింగికి ‘నిసార్’… ఇస్రో ఆధ్వర్యంలో ఈ ఏడాది మార్చి నెలలో ‘నిసార్’ ఉపగ్రహ ప్రయోగం జరగనుంది. ‘నిసార్’ అంటే నాసా-ఇస్రో సింథటిక్ ఆపెర్చర్ రాడార్. ఇదొక భూ పరిశీలక రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం. ఈ రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’, మన ఇస్రోల సంయుక్త ప్రాజెక్టు. ‘నిసార్’ ప్రయోగంలో వాడే ఉపగ్రహ వాహక నౌక (జీఎస్ఎల్వీ)కు తాజా ఇన్శాట్-3డీఎస్ ప్రయోగం అర్హతా పరీక్ష లాంటిదని అంతరిక్ష రంగ నిపుణులు అంటున్నారు. ఎందుకంటే... ‘నిసార్’ అనేది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎర్త్ ఇమేజింగ్ శాటిలైట్. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.12,500 కోట్లు. సింథటిక్ అపెర్చర్ రాడార్ (సార్) అమర్చిన ‘నిసార్’… భూమి సంబంధ మార్పుల్ని పరిశీలిస్తుంది. చిత్తడి నేలల స్థితిగతులు, అగ్నిపర్వతాల కారణంగా నేల రూపురేఖల్లో సంభవించే మార్పులను గమనిస్తుంది. అలాగే భూమిపై శీతలావరణం (క్రయోస్ఫియర్)కు సంబంధించి మంచు పలకలు, హిమనీనదాలు, సముద్ర మంచులో కలిగే మార్పులను క్షుణ్ణంగా శోధిస్తుంది. :::: జమ్ముల శ్రీకాంత్ -
అల్లదివో.. ‘మూన్ స్నైపర్’ ఫోటోలు తీసిన ‘నాసా’ ఉపగ్రహం
జపాన్ ల్యాండర్ చంద్రుడిపై దిగకముందు, దిగిన తర్వాత ‘క్లిక్’మనిపించిన ‘నాసా’ ఉపగ్రహం. ‘నాసా’ ఉపగ్రహం ‘లూనార్ రీకానసన్స్ ఆర్బిటర్’ (LRO) ప్రస్తుతం చంద్రుడి కక్ష్యలో పరిభ్రమిస్తూ పరిశోధనలు చేస్తోంది. ఈ నెల 19న జపాన్ ‘స్లిమ్’ ల్యాండర్ జాబిలిపై దిగింది. అనంతరం ఐదు రోజులకు అంటే ఈ నెల 24న ‘నాసా’ ఆర్బిటర్... ‘మూన్ స్నైపర్’ దిగిన ప్రాంతం మీదుగా ప్రయాణించింది. ఆ సందర్భంగా జాబిలి ఉపరితలానికి 80 కిలోమీటర్ల ఎత్తు నుంచి జపాన్ ‘స్లిమ్’ ల్యాండర్ ఛాయాచిత్రాలను LRO తన కెమెరాలో బంధించింది. ‘నాసా’ శుక్రవారం వాటిని విడుదల చేసింది. ఓ చిన్న చుక్కగా ల్యాండర్ ఈ ఫొటోల్లో దర్శనమిస్తోంది. చంద్రుడిపై 13.3160 డిగ్రీల దక్షిణ అక్షాంశ, 25.2510 తూర్పు రేఖాంశ ప్రదేశంలో, మైనస్ 912 మీటర్ల (మైనస్ 2,992 అడుగుల) ఎలివేషన్‌లో ‘మూన్ స్నైపర్’ దిగింది. ఈ మైనస్ ఎలివేషన్ అనేది జాబిలిపై నిమ్న ప్రదేశాన్ని సూచిస్తుంది. ఎందుకంటే.. చంద్రుడి ఉపరితలం కంటే దిగువన షియోలీ బిలం (భారీ గుంత) వాలులో ‘మూన్ స్నైపర్’ దిగింది. -
ISRO: మన బాహుబలికి అంత బలం లేదట!
అంతరిక్ష పరిశోధనల్లో వరుస సక్సెస్‌లతో భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో(ISRO) ఎదురేలేకుండా దూసుకుపోతోంది. కొత్త ఏడాది ఆరంభం రోజే చేపట్టిన ప్రయోగమూ విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు.. మరింత జోష్‌తో తదుపరి ప్రయోగాలకు సిద్ధం అవుతున్నారు. అయితే.. తన తదుపరి శాటిలైట్ లాంఛ్ కోసం విదేశీ రాకెట్‌ను ఇస్రో ఆశ్రయిస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భారత్ తరఫున తర్వాతి తరం భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్-20 (GSAT-20)ని స్పేస్ఎక్స్కు చెందిన రాకెట్ ద్వారా ప్రయోగించబోతోంది. అయితే దీనిని స్వదేశీ రాకెట్‌తో కాకుండా.. విదేశీ రాకెట్‌తో ప్రయోగించబోతోంది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ కంపెనీలో ఫాల్కన్-9 రాకెట్‌కు భారీ లాంఛర్‌గా పేరున్న సంగతి తెలిసిందే. ఫ్లోరిడాలోని లాంఛింగ్ స్టేషన్ నుంచి ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ఫాల్కన్ రాకెట్‌తో భారత శాటిలైట్ ప్రయోగం జరగనుంది. ఇస్రో ఏమందంటే.. గతంలో భారీ ఉపగ్రహాల ప్రయోగం కోసం ఇస్రో కమర్షియల్ విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్.. ఫ్రాన్స్‌కు చెందిన ఏరియన్‌స్పేస్ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకునేది. కానీ, ఇప్పుడు స్పేస్ఎక్స్తో ఒప్పందం కుదుర్చుకోవడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. అయితే.. ఈ ప్రయోగంపై ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ స్పందించారు. నిర్ణీత సమయానికి రాకెట్ అందుబాటులో లేనందునే స్పేస్‌ఎక్స్‌ను ఆశ్రయించినట్లు స్పష్టం చేశారు. మన బాహుబలి ఉంది కదా! జీశాట్-20 ఉపగ్రహం అత్యంత శక్తివంతమైంది. దీనిని తయారు చేయడానికి ప్రధాన ఉద్దేశం.. మారుమూల ప్రాంతాలకు సేవలు అందించడం. ఇది ఎంత శక్తివంతమైందంటే.. హార్మోనైజ్డ్ టారిఫ్ షెడ్యూల్ (HTS) సామర్థ్యం 48 జీపీబీఎస్. అంతేకాదు.. 32 బీమ్స్ సామర్థ్యంతో అండమాన్ నికోబార్ దీవులు, జమ్ము కశ్మీర్, లక్షదీవులు.. ఇలా పాన్ ఇండియా కవరేజ్ చేయగలిగే సత్తా ఉంది. GSAT-N2గా దీనికి నామకరణం కూడా చేశారు. అయితే ఆ శాటిలైట్ బరువు.. 4,700 కేజీలు. భారత్‌లో ఇస్రో తరఫున ఇప్పటిదాకా ఉన్న లాంఛ్ వెహికిల్ మార్క్ 3(LVM3)నే అత్యధిక బరువు ఉన్న ఉపగ్రహాల్ని మోసుకెళ్తోంది. అందుకే ఇస్రో బాహుబలిగా దానికి పేరు ముద్రపడింది. కానీ, దాని సామర్థ్యం 4 వేల కిలోగ్రాముల దాకానే ఉంది. అందుకే అంతకు మించిన శాటిలైట్ ప్రయోగాల కోసం విదేశీ రాకెట్లపైన ఆధారపడాల్సి వస్తోంది. ఇస్రో ప్రయోగాలకు.. 10 వేల కేజీల రాకెట్లను సైతం మోసుకెళ్లగలిగే తర్వాతి తరం లాంచ్ వెహికిల్స్ (NGLV)రూపకల్పన అవసరం ఉందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో బాహుబలిని మించిన రాకెట్ డిజైన్ రూపకల్పన జరిగిపోయిందట. అయితే.. అది ప్రత్యక్ష రూపంలోకి రావడానికి ఇంకా కొన్నేళ్లు పట్టొచ్చని సోమనాథ్ అంటున్నారు. -
Telecom Bill 2023: టెలికం సేవలపై కేంద్రం నియంత్రణ
న్యూఢిల్లీ: జాతి భద్రత దృష్ట్యా టెలికమ్యూనికేషన్ సేవలను తాత్కాలికంగా నియంత్రణలోకి తెచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి అధికారం కలి్పంచే కీలకమైన టెలికమ్యూనికేషన్స్ బిల్లు–2023ను గురువారం పార్లమెంట్ ఆమోదించింది. వేలం ప్రక్రియతో సంబంధం లేకుండా ప్రభుత్వమే నేరుగా గ్లోబల్ సర్విస్ ప్రొవైడర్లకు శాటిలైట్ స్పెక్ట్రమ్ కేటాయింపులు జరిపేందుకు కూడా ఈ బిల్లులో నిబంధనలున్నాయి. టెలికమ్యూనికేషన్స్ బిల్లు– 2023ను లోక్‌సభ బుధవారమే ఆమోదించగా గురువారం రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదముద్ర వేసింది. బిల్లును టెలికమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సభలో ప్రవేశపెట్టారు. టెలికం బిల్లు ప్రభుత్వ జోక్యానికి ఎక్కువ తావిచ్చేలా ఉందంటూ పలువురు వ్యక్తం చేసిన ఆందోళనలపై మంత్రి బదులిస్తూ.. వలస పాలన కాలం నాటి పురాతన చట్టాల స్థానంలో ఈ బిల్లును తీసుకువచ్చామన్నారు. ‘టెలికం రంగంలో ఎంతో క్లిష్టమైన నిబంధనలతో కూడిన 100కు పైగా రకాల లైసెన్సులున్నాయి. ఈ బిల్లులో వీటన్నిటినీ తొలగించి, ఒకే ఒక అధికార వ్యవస్థ కిందికి తెచ్చాం. స్పెక్ట్రమ్ కేటాయింపులు పారదర్శకంగా ఉండేందుకు పలు చర్యలు ప్రతిపాదించాం. ఒకటో షెడ్యూల్లోని ఏవో కొన్ని ప్రత్యేక కేటగిరీలను మినహాయిస్తే స్పెక్ట్రమ్ కేటాయింపులన్నీ ఇకపై వేలం ద్వారానే జరుగుతాయి’అని మంత్రి వివరించారు. ‘బిల్లులో సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాత్రకు సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకాలున్నాయి. ఈ విషయంలో ఎలాంటి మార్పు లేదు. జాతి భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం టెలికం సేవలను తాత్కాలికంగా అధీనంలోకి తెచ్చుకునేందుకు ఉద్దేశించిన నిబంధన ఇప్పటికే అమల్లో ఉంది. తాజాగా దీనిని మరింత బలోపేతం చేశాం. కొత్తగా ఏర్పాటు చేసిన డిజిటల్ భారత్ నిధి దేశంలో టెలికం రంగ సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు ఉపయోగపడుతుంది’అని మంత్రి వివరించారు. పార్లమెంట్ ఆమోదం అనంతరం ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్నారు. రాష్ట్రపతి ఆమోదంతో చట్ట రూపం దాల్చనుంది. బిల్లు ముఖ్యాంశాలు.. ► శాంతి భద్రతలు, దేశ ప్రయోజనాలకు భంగం కలిగించే పరిస్థితులున్నాయని భావించినప్పుడు టెలికం నెట్వర్క్ మొత్తాన్ని ప్రభుత్వం తన నియంత్రణలోకి తీసుకోవచ్చు. ప్రజాప్రయోజనాల పరిరక్షణ నిమిత్తం సందేశా(మెసేజీ)లను రహస్యంగా వినొచ్చు, ప్రసారాలను నిలిపివేయవచ్చు. ► ప్రకృతి విపత్తుల సమయాల్లోనూ ప్రభుత్వానికి ఇటువంటి అధికారాలు దఖలు పడతాయి. ► పై పరిస్థితుల్లో కేంద్రం నేరుగా, లేదా కేంద్రం తరఫున రాష్ట్ర ప్రభుత్వం లేదా ప్రత్యేక అధికారికి టెలికం సర్వి సులను లేదా టెలికం నెట్‌వర్క్‌ను నియంత్రణలోకి తీసుకునే అధికారం సమకూరుతుంది. ► ఎవరైనా అనధికారి టెలికం నెట్‌వర్క్‌ను, పరికరాలను, రేడియోలను వినియోగిస్తున్నారని తేలితే ప్రభుత్వం ఏ భవనాన్ని లేదా విమానం, నౌక సహా ఎటువంటి వాహనాన్ని అయినా తనిఖీ చేయొచ్చు, స్వా«దీనం చేసుకోవచ్చు. ► వాణిజ్య అవసరాలకు స్పెక్ట్రమ్‌లను వేలం ద్వారానే కేటాయించాలన్న దేశీయ టెలికం సేవల సంస్థలు జియో, వొడాఫోన్ ఐడియా అభ్యర్థనలను తోసిపుచ్చుతూ ప్రపంచవ్యాప్తంగా ఉపగ్రహ సేవలందించే కంపెనీలకు పాలనా అనుమతుల ద్వారానే స్పెక్ట్రమ్‌లను కేటాయించేలా నిబంధనలను బిల్లులో పొందుపరిచారు. ► పాలనా అనుమతుల ప్రకారం..స్పెక్ట్రమ్ కేటాయింపులను దేశంలో, అంతర్జాతీయంగా సుదూర శాటిలైట్ సర్వి సెస్, విశాట్..విమానయానం, సముద్రయానంతో అనుసంధానమయ్యే నెట్‌వర్క్‌లు, బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ వంటి సంస్థలు పొందగలవు. ► ఇంటర్నెట్ ఆధారిత సందేశాలకు, కాల్స్ చేసుకోవడానికి వీలు కలి్పంచే వాట్సాప్, టెలిగ్రామ్, గూగుల్ మీట్ వంటి యాప్‌లకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని నిబంధనలు వర్తిస్తాయి. వీటిని టెలికం చట్ట పరిధి నుంచి తొలగిస్తారు. ► ఓటీటీ(ఓవర్ ది టాప్) యాప్‌లు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) పరిధి నుంచి తొలగిస్తూ బిల్లులో ప్రతిపాదించారు. అనధికార ట్యాపింగ్‌లకు.. మూడేళ్ల జైలు, రూ.2 కోట్ల జరిమానా అక్రమంగా, అనుమతుల్లేకుండా ఫోన్ సందేశాలను రహస్యంగా విన్నా, ట్యాపింగ్‌కు పాల్పడినా భారీ జరిమానాతోపాటు కఠిన శిక్ష విధించే నిబంధనలు ఈ బిల్లులో ఉన్నాయి. దేశ ప్రయోజనాలకు, మిత్రదేశాలతో సత్సంబంధాలకు భంగం కలిగించేలా టెలికం సేవలను దుర్వినియోగపరచడం నేరంగా పరిగణిస్తారు. దోషులకు మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.2 కోట్ల వరకు జరిమానా, నేర తీవ్రతను బట్టి ఈ రెండూ విధించే అవకాశం ఉంది. నేరగాళ్లకు ప్రత్యక్షంగా, పరోక్షంగా టెలికం సేవలను అందించే సంస్థలపైనా చర్యలుంటాయి. కాల్ డేటా, ఇంటర్నెట్ ప్రొటోకాల్ డేటా రికార్డుల విషయంలో అక్రమాలకు పాల్పడినా శిక్ష, జరిమానా తప్పదు. టెలికం నెట్‌వర్క్‌లకు, టెలీకం సదుపాయాలకు ఉద్దేశ పూర్వకంగా నష్టం కలిగించే వారికి రూ.50 లక్షల వరకు జరిమానా విధించాలని బిల్లులో ప్రతిపాద నలున్నాయి. తప్పుడు ధ్రువ పత్రాలతో సిమ్.. రూ. 50 లక్షల జరిమానా, జైలు తప్పుడు ధ్రువపత్రాలతో సిమ్ కార్డు పొందే వారికి రూ.50 లక్షల జరిమానాతోపాటు మూడేళ్ల జైలు శిక్షకు ఈ బిల్లు వీలు కలి్పస్తోంది. ఎక్కువ సంఖ్యలో సిమ్ కార్డులను వాడి ‘సిమ్‌బాక్స్’తో అక్రమాలకు పాల్పడే వారికి, ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఇతరుల ఫోన్ నంబర్లను స్పూఫింగ్ చేస్తూ మోసాలకు పాల్పడే వారికి కూడా ఇవే శిక్షలుంటాయి. సిమ్ దురి్వనియోగాన్ని అడ్డుకట్ట వేయడంతోపాటు ఇతరులకు వివిధ మార్గాల్లో ఇబ్బంది కలిగించే కాలర్లపైనా చర్యలకు ఇందులో వీలుంది. వినియోగదారులు తమ ఫిర్యాదులను ఆన్లైన్ లో నమోదు చేసుకుని, పరిష్కారం పొందేందుకు సైతం బిల్లులో ఏర్పాట్లున్నాయి. -
అంతరిక్షంలో వ్యర్థాలు, ఆ శాటిలైట్లు భూమిపై దొర్లకుండా..
అంతరిక్షంలో పేరుకుపోతున్న చెత్త వివిధ దేశాలకు సవాల్ విసురుతోంది. టెక్నాలజీ పరంగా ఎదిగేందుకు అంతరిక్షంలో పంపించిన శాటిలైట్లలో కొన్ని డెబ్రిస్(చెత్త)గా మారాయి. ప్రపంచ దేశాలు పోటీపడి మరీ పంపిస్తున్న శాటిలైట్లతో అంతరిక్షంలో ట్రాఫిక్ పెరిగిపోతోంది. కాలం చెల్లిన శాటిలైట్లు, రాకెట్ల శిథిలాలతో అంతరిక్షం చెత్తకుప్పగా మారిపోతోంది. అంతరిక్షంలో పెద్ద ఎత్తున వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల ప్రయోగాలకు కొన్నిసార్లు అంతరాయం ఏర్పడుతుంది. యూఎస్ స్పేస్ కమాండ్ అంచనా ప్రకారం భూమి చుట్టూ దాదాపు 25వేలఅంతరిక్ష వ్యర్ధాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో కొన్ని శిథిలాలు భూమిపైకి చేరతున్నాయి.మరోపక్క అంతరిక్ష వ్యర్థాలు విచ్ఛిన్నమై రేణువుల్లా విడిపోయి అంతరిక్ష కక్ష్యను కలుషితం చేస్తున్నాయి. ఇవికాకుండా రాకెట్ల నుంచి రాలిపడిన మిలియన్ల కొద్దీ చిన్న ముక్కలు అంతరిక్షం చుట్టూ పేరుకుపోయాయి. దీనివల్ల అంతరిక్షంలో డెబ్రిస్ (చెత్త)తో నిండిపోతుంది. అనేక శాటిలైట్లు పాడైన స్థితిలో శిధిలాలుగా మారి అంతరిక్షంలో భూకక్ష్య చుట్టూ ప్రమాదకర వేగంతో తిరుగుతున్నాయి. ప్రతిరోజూ ఒక శిథిలం భూమి వైపు దూసుకొస్తోంది. అది నేలపై పడటమో లేదా వాతావరణంలోకి ప్రవేశించగానే మండిపోవడమో జరుగుతోంది. రాబోయే సంవత్సరాల్లో అంతరిక్ష శిథిలాల సంఖ్య లక్షకు పైగా పెరుగుతుందని అంచనా. సాదారణంగా రెండు ఉపగ్రహాలు ఢీకొన్నప్పుడు కెస్లర్ సిండ్రోమ్ అని పిలువబడే ఘర్షణ ఏర్పడి ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఇటీవల క్యూబ్‌శాట్ Exo-0 అని పిలువబడే ఎయిర్‌బస్ పరికరాన్ని సైంటిస్టులు కనుగొన్నారు. ఇది కాలం చెల్లిన ఉపగ్రహాలు భూమిపైకి దొర్లకుండా నిరోధిస్తుంది. దీని ద్వారా పనిచేయని ఉపగ్రహాలు భూమిపైకి దొర్లకుండా ఒక అయస్కాంత శక్తితో అడ్డుకుంటుంది. ఈ ఎయిర్‌బస్ పరికరం సింపుల్‌గా మోటార్‌ను పోలి ఉంటుంది. ఇది మ్యాగ్నటిక్ ఫీల్డ్‌తో పనిచేస్తుంది. రోటార్ మూవ్‌మెంట్‌ను బట్టి ఫ్రిక్షన్ ఏర్పడుతుంది. ఇది శాటిలైట్ తిరిగే దశను కదలనీయకుండా ఉంచుతుంది. దీనివల్ల ఉపగ్రహాలు నేలపై పడటం వంటిది జరగదు. -
మెరి‘సాయి దివ్య’ ప్రయోగాలు
తెనాలి: తెనాలికి చెందిన బుల్లి ఉపగ్రహాల రూపశిల్పి కొత్తమాసు సాయిదివ్య మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. తాను రూపొందించిన క్యూబ్‌శాట్–బీడబ్ల్యూశాట్‌ను స్పెయిన్ దేశంలో అక్కడి బీ2 స్పేస్ కంపెనీ సాయంతో బుధవారం స్ట్రాటో ఆవరణలోకి ప్రయోగించారు. ఉపగ్రహ కమ్యూనికేషన్ రంగంంలో పీహెచ్డీ స్కాలర్ అయిన సాయిదివ్య ప్రయోగించిన పేలోడ్లలో ఇది మూడోది కావటం విశేషం. 280 గ్రాముల ఈ పేలోడ్‌ను ఇక్కడి తన సొంత ‘ఎన్–స్పేస్‌టెక్’ అనే సంస్థలో తన బృందంతో కలిసి ఆమె తయారుచేశారు. ఇదీ నేపథ్యం శాటిలైట్ కమ్యూనికేషన్ రంగంలో రీసెర్చ్ స్కాలర్‌గా పనిచేస్తున్న కొత్తమాసు సాయిదివ్య బాపట్ల ఇంజినీరింగ్ కాలేజిలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ చేశారు. కేఎల్ యూనివర్సిటీలో కమ్యూనికేషన్ అండ్ రాడార్ సిస్టమ్స్‌లో ఎంటెక్ చేశారు. తన థీసిస్‌లో భాగంగా తన నివాసంలోనే ‘ఎన్–స్పేస్‌టెక్’ అనే సొంత కంపెనీని ఆరంభించారు. అంతరిక్ష సాంకేతికతను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావ టం, తక్కువ ఖర్చుతో బుల్లి ఉపగ్రహాల తయారీని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. తొలిగా లక్ష్యశాట్ పేరుతో క్యూబ్‌శాట్‌ను తయారుచేసి, గతేడాది మార్చిలో యునైటెడ్ కింగ్డమ్ నుంచి బీ2 స్పేస్ సహకారంతోనే స్ట్రాటో ఆవరణలోకి విజయవంతంగా ప్రయోగించారు. ఎక్కువ ఎత్తుకు వెళ్లగలిగిన బెలూన్ సాయంతో పంపిన 400 గ్రాముల లక్ష్యశాట్, భూతలం నుంచి 26 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి, స్ట్రాటో అవరణలో కొన్ని గంటల ఉండగలిగింది. ప్రైవేట్ ర్యాకెట్ ప్రయోగంలో భాగస్వామి తర్వాత కొద్దినెలల్లోనే దేశంలో జరిగిన తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగంలో సాయిదివ్య భాగస్వామి కాగలిగారు. స్కై రూట్ అనే ప్రైవేటు సంస్థ విక్రమ్–ఎస్ రాకెట్‌ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సబ్ ఆర్బిట్‌లోకి ప్రయోగించారు. ఆ రాకెట్ తీసుకెళ్లిన మూడు పేలోడ్లలో తెనాలిలో సాయిదివ్య రూపొందించిన లక్ష్యశాట్–2 పేలోడ్ ఒకటి కావటం గమనించాల్సిన అంశం. స్ట్రాటో ఆవరణలో అధ్యయనానికి బీడబ్ల్యూశాట్ ఆ క్రమంలోనే సాయిదివ్య తమిళనాడుకు చెందిన శక్తిప్రియ, బాపట్ల, కాకినాడలకు చెందిన రెహమాన్, ఉత్తేజ్‌తో కలిసి బీడబ్ల్యూశాట్‌ను తయారుచేశారు. మయన్మార్ దేశంలోని ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులకు శాటిలైట్ టెక్నాలజీపై వీరు ఇక్కణ్ణుంచే ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. ఆ బోధనలో భాగంగానే తయారుచేసిన బీడబ్ల్యూశాట్‌ను మయన్మార్ తీసుకెళ్లి అక్కడి విద్యార్థులకు ప్రదర్శించారు. డిమాన్స్ట్రేషన్ ఇచ్చారు. అనంతరం బీ2 స్పేస్ కంపెనీ సహకారంతో స్పెయిన్‌లో ప్రయోగించారు. తాజా పేలోడ్‌తో స్ట్రాటో ఆవరణంలోని ఉష్ణోగ్రత, తేమ, ఆల్డిట్యూడ్ ప్రెషర్, యూవీ ఇంటెన్సిటీ, ఎంత వెలుతురు ఉంది అనే డేటా సేకరణ వీలవుతుందని బుధవారం సాయంత్రం సాయిదివ్య స్థానిక విలేకరులకు తెలిపారు. స్కైరూట్ సంస్థతో కలిసి త్వరలో జరగనున్న విక్రమ్–1 రాకెట్ ప్రయోగంలో భాగస్వామ్యం కానున్నట్టు చెప్పారు. రాకెట్లో ప్రయోగించే ఐయూ క్యూబ్‌శాట్ పేలోడ్ రూపకల్పనలో ఉన్నట్టు వివరించారు. తన తొలి పేలోడ్ నుంచి ఇప్పటివరకు తన భర్త రఘురామ్, అత్తమామలు కొత్తమాసు కుమార్, చంపకవల్లి, తండ్రి కేఎన్ ప్రసాద్ సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. -
ఆకాశంలో వజ్రం.. 'లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై'
వాషింగ్టన్: సౌర కుటుంబంలో అత్యంత చిన్న గ్రహమైన బుధుడి ఫోటోను తీసింది నాసాకు చెందిన వ్యోమనౌక 'మెసెంజర్'. నాసా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఆ ఫోటోను చూస్తే చిన్నప్పుడు చదువుకున్న 'ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై' పదాలు గుర్తుకు రాక మానవు. అచ్చంగా వజ్రాన్ని పోలి ఉన్న బుధుడు ఆకాశంలో వెలుగుజిలుగులతో నిజంగానే డైమండ్‌లా మెరిసిపోతున్నాడు. 'మెసెంజర్' 'అడ్వెంచర్' ఈ గ్రహం చుట్టూ తిరుగుతున్న మొట్టమొదటి నాసా వ్యోమనౌక 'మెసెంజర్' తీసిన ఈ అద్భుతమైన ఫొటోను నాసా ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేయగానే క్షణాల్లో వైరల్ అయ్యింది. ఫోటోలో మెర్య్కురీ వజ్రకాంతి ధగధగలతో తళుకులీనుతోంది. సూర్యుడికి అత్యంత చేరువలో ఉన్నట్లు కనిపించే ఈ గ్రాహం సూర్యుడికి 58 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నిజంగా వజ్రమేనా.. ఈ ఫోటో కింద నాసా రాస్తూ.. వారు నన్ను మిస్టర్ ఫారన్‌హీట్ అని పిలుస్తారు. సైజులో భూమి యొక్క సహజ ఉపగ్రహం చంద్రుడి కంటే కొంచెం పెద్దగా ఉండే ఈ గ్రహం మన సౌర కుటుంబంలోనే అత్యంత చిన్నది. ఇది సూర్యునికి 58 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రహం చిన్నదే అయినప్పటికీ తన కక్ష్య చుట్టూ అత్యంత వేగంగా తిరుగుతుంది. సెకనుకి 47 కిలోమీటర్ల వేగంతో ఇది చక్కర్లు కొడుతుంది. ఈ గ్రహంపై ఒక సంవత్సర కాలం భూమిపై 88 రోజులతో సమానం. ఈ కక్ష్యలోకి ప్రవేశించిన మొట్టమొదటి స్పేస్‌క్రాఫ్ట్ మెసెంజర్ బుధుడి ఉపరితలంపై ఉన్న రాళ్లల్లో రసాయన, ఖనిజ, భౌతిక వ్యత్యాసాల్ని గుర్తించేందుకు వీలుగా ఇలా బుధుడి కలర్ ఫోటోని తీసింది. జూ. సూర్యుడు.. వాతావరణానికి బదులుగా బుధుడిపై చాలావరకు ఆక్సిజన్, సోడియం, హైడ్రోజన్, హీలియం, పొటాషియంతో కూడిన సన్నని ఎక్సోస్పియర్‌ను కలిగి ఉంటుంది. ఈ గ్రహంపై వాతావరణం లేకపోవడం, సూర్యునికి అత్యంత చేరువగా ఉండటంతో పగటిపూట 800ºF (430ºC) నుండి రాత్రికి -290 ºF (-180 ºC) వరకు ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. భూమితో పోలిస్తే దీని అయస్కాంత క్షేత్రం చాలా బలహీనంగా ఉంటుంది. శాస్త్రవేత్తలు దీని ఉపరితలాన్ని పరీక్షించేందుకు వీలుగా నీలి రంగు వర్ణాల ఉపరితలాన్ని అక్కడక్కడా గుంతలు ఉండటాన్ని మనం గమనించవచ్చని రాసింది. View this post on Instagram A post shared by NASA (@nasa) ఇది కూడా చదవండి: ఢిల్లీ హోటల్లో హైడ్రామా సృష్టించిన జీ20 చైనా బృందం -
ఆదిత్యుడిపై అధ్యయనం
తిరుపతి కల్చరల్ : శ్రీహరి కోటలోని సతీష్ దావన్ స్పేస్ సెంటర్ నుంచి శనివారం ప్రయోగిస్తున్న ఆదిత్య ఎల్1 మిషన్ ఉపగ్రహ ప్రయోగాన్ని సందర్శించేందుకు సైన్స్‌సెంటర్‌లో లైవ్ స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తున్నారు. శుక్రవారం ఈ మేరకు రీజనల్ సైన్స్‌సెంటర్ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ శ్రీనివాస నెహ్రూ మాట్లాడుతూ శనివారం ఉదయం 11 గంటలకు నుంచి లైవ్ స్క్రీనింగ్ ఉంటుందని, మధ్యాహ్నం 12 గంటలకు ఆదిత్య ఎల్1 మిషన్‌పై ప్యానెల్ ఎగ్జిబిషన్ ప్రారంభిస్తున్నట్లు వివరించారు. ఈ అవకాశాన్ని ప్రజలు, అన్ని పాఠశాలల విద్యార్థుల సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివరాలకు సైన్స్ సెంటర్ విద్యా విభాగం 0877–2286202, 7989694681 నంబర్లను సంప్రదించాలని కోరారు. సూళ్లూరుపేట: సౌరగోళంలో గాలులు, జ్వాలలు, రేణువుల తీరుతెన్నులపై పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ప్రయోగించనుంది. 1480.7 కిలోల ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ఈ రాకెట్ ద్వారా శనివారం ఉదయం 11.50 గంటలకు ప్రయోగించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఉపగ్రహం ప్రయోగం ద్వారా సూర్యుడిపై దాగి వున్న రహస్యాలను ఛేదించనున్నారు. సౌర తుఫాన్ సమయంలో వెలువడే రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. దీంతో పాటు కాంతిమండలం (ఫోటోస్పియర్), వర్ణ మండలం (క్రోమోస్పియర్)లపై అధ్యయనం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సూర్యుడిపై అధ్యయనానికి ఇస్రో మొట్టమొదటిసారిగా ఈ ప్రయోగం చేపట్టింది. పరిశోధనలకు ‘పేలోడ్స్’ ఆదిత్య ఎల్1 ఉపగ్రహంలో ఏడు పేలోడ్స్ అమర్చి పంపుతున్నారు. 1,231 కేజీలు ద్రవ ఇంధనంతో ఉపగ్రహం నింపబడింది. మిగిలిన 249 కేజీలు పేలోడ్స్ బరువు వుంటుంది. ఉపగ్రహాన్ని సూర్యుడి వైపు తీసుకెళ్లేందుకు ద్రవ ఇంధనం అవసరం . మొదట ఉపగ్రహాన్ని భూ మధ్యంతర కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తర్వాత భూమికి 15 లక్షలు కిలోమీటర్లు దూరంలోని లాగ్రేంజియన్ బిందువు–1 (ఎల్–1)లోకి చేరవేయడానికి 175 రోజులు పడుతుంది. ఆదిత్య ఎల్–1 ఉపగ్రహంలో సూర్యుడిపై అధ్యయనం చేయడానికి యాస్పెక్స్, సూట్, వెల్సీ, హెలియోస్, పాపా, సోలెక్స్, మాగ్ అనే ఏడు ఉపకరణాలు (పేలోడ్స్) అమర్చారు. ► 170 కేజీల బరువు గల విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ ( వెల్సీ) అనే పేలోడ్ ద్వారా సౌర వాతావరణం ఎందుకు వేడిగా వుంటుంది. సూర్యుడిలో మార్పులు, అంతరిక్ష వాతావరణం, భూమి వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాలపై పరిశోధనలు చేస్తుంది. ► సౌర అతినీలలోహిత ఇమేజింగ్ టెలిస్కోప్ (సూట్) అనే పేలోడ్ 35 కేజీల బరువు వుంటుంది. 200–400 ఎన్ఎం తరంగధైర్ఘ్యం పరిధి మధ్య సూర్యుడిని గమనిస్తుంది. ఇందులో 11 ఫిల్టర్లను ఉపయోగించడం ద్వారా సౌర వాతావరణంలో వివిధ పొరల పూర్తి డిస్క్ చిత్రాలను అందిస్తుంది. ► ఇది సూర్యుడ్ని నిరంతరం గమనిస్తూనే వుంటుంది. ఇస్రో ఇతర సంస్థల సహకారంతో పుణేలోని ఇంటర్–యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ నుంచి ఏఎన్ రామ్ ప్రకాష్, దుర్గేష్ త్రిపాఠి నేతృత్వంలో ఈ పేలోడ్‌ను అభివృద్ది చేశారు. ► ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పర్మెంట్ (యాస్పెక్స్) అనే పేలోడ్ ద్వారా సౌర గాలి వైవిద్యం, లక్షణాలను తెలియజేయడమే కాకుండా దాని వర్ణ పటం లక్షణాలను అధ్యయనం చేస్తుంది. ► ఆదిత్య ప్లాస్మా ఎనలైజర్ ప్యాకేజీ (పాపా) సౌరగాలి కూర్పు దాని శక్తి పంపిణీని అర్థం చేసుకోవడానికి పరిశోధన చేస్తుంది. ► సోలార్ ఎనర్జీ ఎక్స్–రే స్పెక్ట్రోమీటరు (సోలెక్స్) సోలార్ కరోనా సమస్యాత్మకమైన కరోనల్ హీటింగ్ మెకానిజాన్ని అధ్యయనం చేయడానికి, ఎక్స్–రే మంటలను పర్యవేక్షించడానికి పరిశోధనలు చేస్తుంది. ► హై ఎనర్జీ ఎల్1 ఆర్బిటింగ్ ఎక్స్–రే స్పెక్ట్రోమీటర్ (హెలియోస్) సౌర కరోనాలో డైనమిక్ ఈవెంట్లను గమనించడానికి, విస్పోటనం..సంఘటనల సమయంలో సౌరశక్తి కణాలను వేగవంతం చేయడానికి ఉపయోగించే శక్తిని అంచనా వేస్తుంది. ► మ్యాగ్ అనే ఈ పేలోడ్‌ను మాగ్నోమీటర్ అని కూడా అంటారు. ఆదిత్య ఎల్1 ఉపగ్రహానికి ఆన్‌బోర్డు ఉపకరణంగా అమర్చి పంపుతున్నారు. ఇది ఉపగ్రహానికి సంబంధించి సమాచారాన్ని అందించేందుకు వినియోగిస్తారు. ఆదిత్యుడిపై అధ్యయనం భారత అంతరిక్ష పరశోధన సంస్థ సత్తా చాటుతోంది. దేశ ప్రతిష్ట ఇనుమడించేలా నూతన ప్రయోగాలకు శ్రీకారం చుడుతోంది. ఇటీవలే చంద్రయాన్–3 ద్వారా జాబిలిపై కాలుమోపింది. ప్రస్తుతం ఆదిత్య–ఎల్1తో సూర్యుడి రహస్యాల ఛేదనకు సన్నద్ధమైంది. సౌరగోళంలో వాతావరణాన్ని అధ్యయనం చేసేందుకు పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా ఉపగ్రహ ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. -
రేపు ఆదిత్య–ఎల్1 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): నిమిత్తం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శనివారం తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగించబోతోంది. రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం ఉదయం 11.50 గంటలకు ఈ ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు నిర్వహించనున్నారు. ఇందుకోసం శుక్రవారం ఉదయం 11.50 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. గురువారం షార్‌లోని బ్రహ్మప్రకాష్‌హాలులో మిషన్ సంసిద్ధత సమావేశం నిర్వహించారు. పీఎస్ఎల్వీ సీ57 రాకెట్‌కు అన్ని పరీక్షలు నిర్వహించి లాంచ్ ఆథరైజేషన్ బోర్డు(ల్యాబ్)కు అప్పగించారు. ల్యాబ్ చైర్మన్ రాజరాజన్ రాకెట్‌కు మరోసారి పరీక్షలు నిర్వహించి.. కౌంట్‌డౌన్, ప్రయోగ సమయాన్ని అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం ఇస్రో చైర్మన్ సోమనాథ్ షార్కు రానున్నారు. సహచర శాస్త్రవేత్తలతో సమీక్ష నిర్వహించి కౌంట్‌డౌన్ ప్రక్రియను పరిశీలిస్తారు. సూర్యుడు ఒక మండే అగ్నిగోళం.. అక్కడికి ఉపగ్రహాన్ని పంపిస్తే కాలిపోతుంది కదా.. అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. వాస్తవానికి ఈ ప్రయోగంలో భూమి నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజియన్ బిందువు–1(ఎల్–1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి దాదాపు 1,470 కిలోల బరువున్న ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీనివల్ల గ్రహణాలతో సంబంధం లేకుండా సౌరగోళంపై నిరంతరం అధ్యయనం చేసేందుకు అవకాశం లభిస్తుంది. అక్కడికి చేరుకోవాలంటే 175 రోజుల సమయం పడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
Chandrayaan-3: 'శివ్ శక్తి' అని పేరు పెడితే తప్పేంటి?: ఇస్రో చైర్మన్
న్యూఢిల్లీ: చంద్రయాన్-3 విజయవంతమైన వేళ ఇస్రో చైర్మన్ ఎస్.సోమ్‌నాథ్ కేరళలోని పౌర్ణమికవు-భద్రకాళి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం విలేఖరులు చంద్రయాన్-3 చంద్రుడిపై అడుగుపెట్టిన స్థలాన్ని 'శివ్ శక్తి'గా నామకరణం చేయడంపై ప్రశ్నించగా అందులో తప్పేంటన్నారు. దక్షిణాఫ్రికా, గ్రీస్ పర్యటన ముగించుకుని భారతదేశం చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా బెంగుళూరు వెళ్లి చంద్రయాన్-3 విజయంపై ఇస్రో శాస్త్రవేతలకు అభినందనలు తెలిపి విక్రమ్ ల్యాండర్ అడుగుపెట్టిన స్థలానికి 'శివ్ శక్తి' అని నామకారణం చేశారు. కాంగ్రెస్ నాయకులు కొంతమంది ఈ పేరుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ఇస్రో చైర్మన్‌ను ప్రశ్నించగా నాకైతే అందులో తప్పేమీ లేదనిపిస్తోందన్నారు. అలాగే చంద్రయాన్-2 అడుగుపెట్టిన స్థలానికి 'తిరంగా పాయింట్' అని పేరు పెట్టారు. 'శివ్ శక్తి' 'తిరంగా' రెండూ భారతీయత ఉట్టిపడే పేర్లు. మనం చేస్తున్న పనికి ప్రాముఖ్యత ఇవ్వాలి. దేశ ప్రధానిగా పేరు పెట్టేందుకు ఆయనకు ప్రత్యేక అధికారముందన్నారు. ఇక అమ్మవారిని దర్శించుకోవడంపై స్పందిస్తూ నేను ఒక అన్వేషకుడిని.. నా జీవిత గమనంలో సైన్స్, ఆధ్యాత్మికత రెండూ భాగమే. అందుకే నేను అనేక దేవాలయాలను సందర్శిస్తూ ఉంటాను వేద గ్రంధాలను చదువుతూ ఉంటాను. విశ్వంలో ఉనికిని గుర్తించడానికి శూన్యంలో విహరిస్తూ ఉంటాను. సైన్స్ బాహ్య సంతృప్తినిస్తే ఆధ్యాత్మికత ఆత్మీయ సంతృప్తినిస్తుందని అన్నారు. #WATCH | On his visit to Pournamikavu, Bhadrakali Temple in Thiruvananthapuram, ISRO Chairman S Somanath says, "I am an explorer. I explore the Moon. I explore the inner space. So it's a part of the journey of my life to explore both science and spirituality. So I visit many… pic.twitter.com/QkZZAdDyX3 — ANI (@ANI) August 27, 2023 ఇది కూడా చదవండి: కూలీలకు దొరికిన 240 బంగారు నాణేలు.. కానీ అంతలోనే.. -
మలుపుతిప్పిన చంద్రయాన్-3.. ఇస్రో చేతికి నాసా ఉపగ్రహం
వాషింగ్టన్: చంద్రయాన్-3 విజయం తర్వాత ప్రపంచ దేశాల చూపు భారత దేశం వైపు మళ్లింది. ప్రపంచ దేశాలు భారత్‌తో చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అమెరికా అంతరిక్ష సంస్థ నాసా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోతో కలిసి సంయుక్తంగా డెవలప్ చేసిన నాసా-ఇస్రో SAR (NISAR) ఉపగ్రహాన్ని ప్రయోగించే బాధ్యతలను ఇస్రో చేతులకు అప్పజెప్పింది నాసా. భూమి యొక్క కక్ష్యను పరిశీలించే నిసార్ ఉపగ్రహం ప్రయోగానికి ముందు ఇస్రో దీనికి తుది మెరుగులు దిద్దుతోంది. ఇస్రో తెలిపిన వివరాల ప్రకారం, NISAR 12 రోజుల్లో మొత్తం భూగోళాన్ని మ్యాప్ చేయగలదు. భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు, కొండచరియలు సహా భూమి యొక్క పర్యావరణ వ్యవస్థలు, మంచు ద్రవ్యరాశి, వృక్షసంపద, సముద్ర మట్టం పెరుగుదల, భూగర్భ జలాలు, సహజ ప్రమాదాల గురించి అర్థం చేసుకోవడానికి తాత్కాలికమైనా కూడా స్థిరమైన సమాచారాన్ని అందిస్తుంది. NISAR L, S డ్యూయల్ బ్యాండ్ సింథటిక్ ఆపర్చ్యుర్ రాడార్ (SAR)ని కలిగి ఉంటుంది. ఇందులో L బ్యాండ్ SARను కాలిఫోర్నియా జెట్ ప్రపల్షన్ లేబొరేటరీ డెవలప్ చేయగా S బ్యాండ్ SARను మాత్రం ISRO అభివృద్ధి చేసింది. ఇది స్వీప్ SAR టెక్నిక్‌తో పనిచేస్తూ హై రిజొల్యూషన్ డేటాను అందిస్తుంది. SAR పేలోడ్లు ఇంటిగ్రేటెడ్ రాడార్ ఇన్స్ట్రుమెంట్ స్ట్రక్చర్ (ఐరిస్)పై అమర్చబడ్డాయి. SUV-పరిమాణంలో ఉండే పేలోడ్‌ను ప్రత్యేక కార్గో కంటైనర్‌లో బెంగళూరుకు తరలించినట్లు యూఎస్ స్పేస్ ఏజెన్సీ తెలిపింది. బెంగళూరులోని యూ.ఆర్.రావు శాటిలైట్ సెంటర్లో ఉపగ్రహం తుదిమెరుగులు దిద్దుకుని 2024లో ఇస్రో ఆధ్వర్యంలో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి ప్రణాళిక రూపొందించింది నాసా. Touchdown in Bengaluru! @ISRO receives NISAR (@NASA-ISRO Synthetic Aperture Radar) on a @USAirforce C-17 from @NASAJPL in California, setting the stage for final integration of the Earth observation satellite, a true symbol of #USIndia civil space collaboration. #USIndiaTogether pic.twitter.com/l0a5pa1uxV — U.S. Consulate General Chennai (@USAndChennai) March 8, 2023 ఇది కూడా చదవండి:ప్రిగోజిన్ మరణంపై అనేక అనుమానాలు! -
చంద్రయాన్–3లో ఈసీఐఎల్ కీలక భూమిక
కుషాయిగూడ (హైదరాబాద్): చంద్రయాన్–3లో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎల్రక్టానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) కీలక భూమిక పోషించింది. చంద్రయాన్ కమ్యూనికేషన్‌కు కీలకమైన 32 మీటర్ డీప్ స్పేస్ నెట్వర్క్ (డీఎస్ఎన్) యాంటెన్నాను సరఫరా చేసిందని సంస్థ వర్గాలు గురువారం ఓ ప్రకటనలో తెలిపాయి. 300 టన్నుల ఈ యాంటెన్నా వ్యవస్థను బాబా అటామిక్ రీసెర్చ్, యూఆర్ రావు శాటిలైట్ సెంటర్, ఐఎస్టీఆర్ఏసీలతో కలిసి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినట్లు చెప్పాయి. చంద్రుడి ఉపరితలంపై 0.3 మిల్లీమీటర్ల పరిమాణం కలిగిన వాటినీ క్షుణ్ణంగా చూపించేలా వీల్ అండ్ ట్రాక్ మౌంట్, బీమ్ వేవ్ గైడ్, ఫీడ్ సిస్టమ్‌తో కూడిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని యాంటెన్నాలో అమర్చినట్లు చెప్పాయి. చంద్రుడిపై తీసే చిత్రాలు, డేటాను స్వాదీనం చేసుకోవడంలోనూ ఈ యాంటెన్నా కీలక పాత్ర పోషిస్తుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన యాంటెన్నా సిస్టమ్‌తో పాటుగా సేఫ్ అండ్ సెక్యూర్ ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోల్ (పీఎల్సీ)ని అందిస్తూ ఇస్రోతో ఈసీఐఎల్ సన్నిహితంగా పనిచేస్తోందని ఆ వర్గాలు చెప్పాయి. రాబోయే ఆదిత్య, గగన్‌యాన్, మంగళ్యాన్–2 మిషన్లకు కూడా ఈసీఐఎల్ పనిచేస్తుందని పేర్కొన్నాయి. -
ఉపగ్రహం మీ నెత్తిన పడితే..
సపోజ్.. ఫర్ సపోజ్.. ఉపగ్రహం లేదా దానిలోని ఓ భాగం మీ నెత్తిన పడితే ఏం చేస్తారు? పోనీ.. మీ నెత్తిన కాదు.. మీ ఇంటిపై పడితే ఏం చేస్తారు?పిచ్చిలేచిందా.. ఇదేం తిక్క ప్రశ్న అనేగా మీ ఫీలింగు.. మీ ఫీలింగును మేము ఫీలయ్యేలోపు.. ఓసారి ఈ ఫొటో చూడండి.. ఇది భూమి కక్ష్యకు సంబంధించి నాసా రూపొందించిన కంప్యూటర్ జనరేటెడ్ ఫొటో... ఇక్కడ కొన్ని కోట్ల సంఖ్యలో భూమి చుట్టూ వేగంగా తిరుగుతున్నాయే.. వీటిల్లో పనిచేస్తున్న ఉపగ్రహాలు మినహాయిస్తే.. మిగతాదంతా కేవలం చెత్త.. అంటే అంతరిక్ష వ్యర్థాలు.. ప్రస్తుతం ఇక్కడ ఉన్నదాంట్లో 95% అదే.. ఇవి అడపాదడపా.. అక్కడక్కడా వచ్చి పడుతుంటాయి... గత నెల్లో భారత్‌కు చెందిన అంతరిక్ష శిథిలం ఒకటి ఆస్ట్రేలియాలో పడింది కూడా.. ఈ నేపథ్యంలో అసలు అంతరిక్ష వ్యర్థాలు అంటే ఏమిటి? పడితే పరిహారంలాంటిది చెల్లించాలా? అసలు దీనికి సంబంధించిన అంతర్జాతీయ చట్టాలేం చెబుతున్నాయి? లాంటి పెద్ద విషయాలతోపాటు అస లు మన నెత్తిన లేదా ఇంటిపై పడే చాన్సుందా.. పడితే.. మనకూ పరిహారం లాంటిదేమైనా ఇస్తారా వంటి చిన్నపాటి వివరాలు కూడా తెలుసుకుందాం.. అంతరిక్ష వ్యర్థం అంటే.. ♦ స్పేస్‌లో మిగిలిపోయిన, పనికి రాని భాగాలు.. అది కాలపరి మితి ముగిసిన ఉపగ్రహం కావచ్చు లేదా రాకెట్ ప్రయోగ దశలోని భాగాలు కావచ్చు. వ్యోమ గాములు వాడిన గ్లవ్స్లాంటివి కావచ్చు. లక్ష్యాలను పూర్తిచేసు కుని పనికిరానివిగా మిగిలిపోయి నవి ఏవైనా కావచ్చు. ♦ నాసా లెక్క ప్రకారం ఒక మిల్లీమీటర్ కంటే చిన్నవున్న అంతరిక్ష వ్యర్థాలు 10 కోట్లు ఉంటే.. సాఫ్ట్ బాల్ సైజు కన్నా పెద్దవిగా ఉన్నవి 23 వేలు ఉన్నాయి. కొన్నిటిని శాస్త్రవేత్తలే ఎలాంటి ఇబ్బంది లేకుండా.. నియంత్రిత పద్ధతిలో సము ద్రంలో కూలేలా చేస్తుంటారు. ఒకవేళ అలా కాకున్నా.. సాధా రణంగా ఎక్కువ శాతం వ్యర్థాలు సముద్రంలో పడి పోతుంటాయి. ఎందుకంటే.. భూమ్మీద నీటి శాతమే ఎక్కువ గనుక.. కొన్ని ఎడారులు, అడవుల్లాంటి నిర్మానుష్య ప్రదేశాల్లో పడుతుంటాయి. చిన్నసైజు వ్యర్థాలు భూ వాతావరణంలోకి రాగానే మండిపోతాయి. కొంచెం పెద్దగా ఉండేవి కిందకు వస్తాయి. ఒకవేళ అలా వస్తే.. పైసా నికాలో.. అంతరిక్ష వ్యర్థాల వల్ల పర్యావరణానికి లేదా భూమిపై పడినప్పుడు ఆ ప్రదేశంలో ఏదైనా నష్టం వాటిల్లితే.. దాన్ని ప్రయోగించిన దేశం(లాంచింగ్ కంట్రీ) బాధ్యత వహించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అంతర్జాతీయంగా కొన్ని నిబంధనలు ఉన్నాయి. 1967 నాటి ఔటర్ స్పేస్ ట్రీటీ, 1972 నాటి స్పేస్ లయబి లిటీ కన్వెన్షన్ ప్రకారం.. నష్టం జరిగిందని బాధిత దేశం కోరితే.. పరిహా రం చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఎవరైనా చెల్లించారా? ఒక్కసారి జరి గింది. 1978లో కెనడా అప్పటి సోవి యట్ యూనియన్ నుంచి పరిహారాన్ని కోరింది. సోవియట్ ఉపగ్రహ భాగం కెన డాలో పడింది. అది కొంచెఅణు ధార్మికత వెదజల్లిందంటూ కెనడా పరిహా రాన్ని డిమాండ్ చేసింది. కొంచెం ఎక్కు వే అడిగినప్పటికీ.. సోవి యట్ యూనియన్రూ.18 కోట్లే(ప్రస్తుత లెక్క ప్రకారం) చెల్లించింది. మన దేశం విషయానికొస్తే.. పశ్చిమ ఆస్ట్రేలియాలో పడిన అంతరిక్ష వ్యర్థం పీఎస్ఎల్వీ రాకెట్ మూడో స్టేజ్‌కు సంబంధించినదని ఇస్రో నిర్ధారించింది. అది సముద్రంలో పడి.. తర్వాత కొంత కాలానికి తీరానికి కొట్టుకొచ్చి ఉంటుందని తేల్చారు. ఈ సంఘటనలో ఆస్ట్రేలియా పరిహారం కోరితే మనం చెల్లించాల్సి ఉంటుంది. అయితే.. తొలుత దీని నుంచి ఏమైనా విష రసాయనాలు లీకై ఉంటాయనే అనుమానాలు వ్యక్తమైనా.. తర్వాత అలాంటిదేమీ జరగలేదని శాస్త్రవేత్తలు తేల్చారు. దీన్ని బట్టి.. మన దేశం ఎలాంటి పరిహారాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే.. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ ఔటర్ స్పేస్ ఎఫైర్స్ ప్రకారం.. తమ దేశంలో పడ్డ..విదేశీ అంతరిక్ష భాగాన్ని యాజమాన్య దేశానికి తిరిగి అప్పగించాల్సి ఉంటుంది. సాధారణంగా మిషన్ అనాలసిస్ కోసం వీటిని తిరిగి తీసుకుంటారు. అయితే.. ఇక్కడ ఈ పరికరం వల్ల పెద్దగా ఉపయోగం ఉండబోదని ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ ప్రతినిధి చెబుతున్నారు. భారత్‌కు ఇది అక్కర్లేకుంటే.. స్కైల్యాబ్ ఉంచిన.. మ్యూజియంలోనే దీన్ని కూడా పెడతామని చెబుతున్నారు. స్కైల్యాబ్ గుర్తుందిగా.. అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం. 1979లో ఇది కూలిపోతుందని చెప్పి.. ఇక ప్రపంచం అంతమే అన్నట్లు.. అదే ఇక చివరి రోజు అన్నట్లు ఆస్తులు అమ్మి విందులు వినోదాలు చేసుకున్నారు.. చాలామందికి స్కైల్యాబ్ పేరిట పిల్లలకు పేర్లు కూడా పెట్టారు. ఆ మధ్య తెలుగులో సినిమా కూడా వచ్చింది. ఆ స్కైల్యాబ్ భాగాలు కూడా పశ్చిమ ఆస్ట్రేలియా ప్రాంతంలోనే కూలాయి. ఇక మన విషయానికొస్తే... ♦నిజంగానే మన మీదో లేక మన ఇంటి మీదో పడిందనుకోండి.. మనమేమీ చేయనక్కర్లేదు. మన తరఫున మన దేశమే.. అది ఏ దేశానిదైతే.. ఆ దేశం నుంచి పరిహారాన్ని కోరుతుంది. ఇప్పిస్తుంది కూడా.. అయితే.. ఇప్పటివరకూ ఏ లెక్క ప్రకారం చూసినా.. అలా పడే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. అయినా.. ఏమో గుర్రం ఎగరావచ్చు.. ఎగిరి కింద పడనూవచ్చు.. న్యూటన్ చెప్పింది గుర్తుందిగా.. పైకి వెళ్లే ప్రతీది కిందకు రావాల్సిందే.. బీ కేర్‌ఫుల్ మరి.. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
సౌరగోళంపై అధ్యయనానికే ఆదిత్య–ఎల్1 మిషన్
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా) : సౌరగోళం రహస్యాలను ఛేదించే లక్ష్యంతో ఇస్రో సీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా 1,475 కిలోల బరువు కలిగిన ఆదిత్య–ఎల్1 ఉపగ్రహ ప్రయోగాన్ని సెప్టెంబర్ మొదటివారంలో ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించి షార్ కేంద్రంలోని రెండో ప్రయోగవేదికకు సంబంధించిన వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో రాకెట్ అనుసంధానం పనులు జరుగుతుండగా ఆదిత్య–ఎల్1 ఉపగ్రహం బెంగళూరు నుంచి షార్కు చేరుకుంది. ఆదిత్య ఎల్1 ఉపగ్రహం ప్రయోగం ద్వారా సూర్యునిపై దాగి ఉన్న రహస్యాలను పరిశోధనలు చేయనున్నారు. సౌర తుఫాన్ సమయంలో వెలువడే రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు ఒక అంచనా వేశారు. దీంతో పాటు కాంతిమండలం (ఫోటోస్పియర్), వర్ణ మండలం (క్రోమోస్పియర్)పై అధ్యయనం చేసి సమాచారాన్ని సేకరించాలని ఈ ప్రయోగాన్ని నిర్వహించేందుకు పూనుకున్నారు. బెంగళూరులోని ఫ్రొపెసర్ యూఆర్ రావు స్పేస్ సెంటర్ (యూఆర్ఎస్సీ)లో ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. యూఆర్ఎస్సీ సెంటర్లో పనిచేస్తున్న సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కే శంకర సుబ్రమణియన్ శాటిలైట్ సెంటర్లో స్పేస్ ఆస్ట్రానమీ గ్రూపు (సాగ్)కు నాయకత్వం వహిస్తున్నారు. ఈయన ఆధ్వర్యంలో ఆదిత్య ఎల్1 ఉపగ్రహం రూపకల్పన చేశారు. శంకర్ సుబ్రమణియన్ గతంలో ఖగోళ పరిశోధనకు ఉపయోగించిన ఆస్ట్రోశాట్ ఆనే ఉపగ్రహాన్ని, చంద్రయాన్–1. చంద్రయాన్–2 మిషన్లకు అనేక హోదాల్లో పనిచేశారు. ఆదిత్య ఎల్–1 ప్రయోగంలో పరిశోధనలకు పేలోడ్స్ ఇవే 1,475 కేజీలు బరువు కలిగిన ఆదిత్య ఎల్1 ఉపగ్రహంలో ఆరు పేలోడ్స్ బరువు 244 కేజీలు మాత్రమే. మిగిలిన 1,231 కేజీలు ద్రవ ఇంధనం ఉంటుంది. మొదట ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ (భూ మధ్యంతర కక్ష్య)లోకి ప్రవేశపెట్టిన తరువాత ఈ ఉపగ్రహాన్ని భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రేంజియన్ బింవు–1 (ఎల్–1)లోకి చేరవేయడానికి 177 రోజుల సమయం పడుతుంది. అక్కడి నుంచి సూర్యుడిపై జరిగే మార్పులను నిరంతరం పరిశోధించేందుకు వీలవుతుందని అంచనా వేస్తున్నారు. ఆదిత్య ఎల్–1 ఉపగ్రహంలో సూర్యుడిపై అధ్యయనం చేయడానికి యాస్పెక్స్, సూట్, వెల్సి, హెలియోస్, పాపా, సోలెక్స్ అనే ఆరు ఉపకరణాలు (పేలోడ్స్) అమర్చి పంపుతున్నారు. సూర్యుడి వెలుపలి వలయాన్ని కరోనా అంటారు. సూర్యగోళానికి వేల కిలోమీటర్ల దూరం వరకు ఇది విస్తరించి ఉంటుంది. అక్కడ ఉష్ణోగ్రత దాదాపు పది లక్షల డిగ్రీల కెల్విన్ వరకు ఉంటుంది. సూర్యుడి అంతర్భాగ ఉష్ణోగ్రత ఆరు వేల కెల్విన్ డిగ్రీలు వరకు ఉంటుంది. కరోనాలో వేడి పెరిగిపోతుండడానికి కారణం అంతు చిక్కడం లేదు. ఈ అంశంపై ఆదిత్య–ఎల్1 దృష్టి సారించి పరిశోధనలు చేయడానికి రంగం సిద్ధం చేశారు. చంద్రుడు, ఆంగారకుడిపై చేసిన పరిశోధనలు మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ కావడంతో సూర్యుడిపై కూడా పరిశోధనలు చేసేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. ఆదిత్య ఎల్1లో ఆరు పేలోడ్స్ పరిశోధనలు.. సూర్యుడిపై అధ్యయనం చేయడానికి 1,470 కిలోల బరువు కలిగిన ఆదిత్య–ఎల్ 1 ఉపగ్రహంలో ఆరు పేలోడ్స్‌ను అమర్చి పంపుతున్నారు. 170 కేజీల బరువు కలిగిన విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ (వెల్సి) అనే పేలోడ్ ద్వారా సౌర వాతావరణం ఎందుకు వేడిగా ఉంటుంది. సూర్యుడిలో మార్పులు, అంతరిక్ష వాతావరణం, భూమి యొక్క వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాలపై పరిశోధనలు చేస్తుంది. సౌర అతినీలలోహిత ఇమేజింగ్ టెలిస్కోప్ (సూట్) అనే పేలోడ్ 35 కేజీల బరువు వుంటుంది. 200–400 ఎన్ఎం తరంగధైర్ఘ్యం పరిధి మధ్య సూర్యుడిని గమనిస్తుంది. ఇందులో 11 ఫిల్టర్లను ఉపయోగించడం ద్వారా సౌర వాతావరణంలో వివిధ పొరల పూర్తి డిస్క్ చిత్రాలను అందిస్తుంది. సూర్యుడ్ని నిరంతరం గమనిస్తూనే ఉంటుంది. ఇస్రో ఇతర సంస్థల సహకారంతో పుణేలోని ఇంటర్–యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ నుంచి ఏఎన్ రామ్ ప్రకాష్, దుర్గేష్ త్రిపాఠి నేతృత్వంలో ఈ పేలోడ్‌ను అభివృద్ధి చేశారు. ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్ (యాస్పెక్స్) అనే పేలోడ్ ద్వారా సౌర గాలి యెక్క వైవిధ్యం, లక్షణాలను తెలియజేయడమే కాకుండా దాని వర్ణపటం లక్షణాలను అధ్యయనం చేస్తుంది. ఆదిత్య ప్లాస్మా ఎనలైజర్ ప్యాకేజీ (పాపా) సౌరగాలి యొక్క కూర్పు దాని శక్తి పంపిణీని అర్థం చేసుకోవడానికి పరిశోధనలు చేస్తుంది. సోలార్ ఎనర్జీ ఎక్స్–రే స్పెక్ట్రోమీటరు (సోలెక్స్) సోలార్ కరోనా యొక్క సమస్యాత్మకమైన కరోనల్ హీటింగ్ మెకానిజంను అ«ధ్యయనం చేయడానికి, ఎక్స్–రే మంటలను పర్యవేక్షించడానికి పరిశోధనలు చేస్తుంది. హై ఎనర్జీ ఎల్1 ఆర్బిటింగ్ ఎక్స్–రే స్పెక్ట్రోమీటర్ (హెలియోస్) సౌర కరోనాలో డైనమిక్ ఈవెంట్లను గమనించడానికి, విస్ఫోటనం సంఘటనల సమయంలో సౌరశక్తి కణాలను వేగవంతం చేయడానికి ఉపయోగించే శక్తిని అంచనా వేస్తుంది. -
త్వరలో ఆదిత్య–ఎల్1 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): సూర్యుడిపై పరిశోధనల కోసం సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి ఈ నెలాఖరులో గానీ సెప్టెంబర్ మొదటివారంలో గానీ పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించనున్నారు. షార్ కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదికకు సంబంధించి వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో రాకెట్ అనుసంధానం పనులు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది చేసిన ఆరు ప్రయోగాలు వరుసగా విజయాలు సాధించడంతో.. రెట్టించిన ఉత్సాహంతో మరో రాకెట్ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. -
‘తీరం’పైనా ఇస్రో డేగ కన్ను!
సాక్షి, అమరావతి: దేశ తీరప్రాంత భద్రతకు నేను సైతం అంటోంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో). అక్రమ చొరబాట్లను అడ్డుకునేందుకు నేవీ, కోస్ట్ గార్డ్లకు ఉపగ్రహ పరిజ్ఞానాన్ని అందించేందుకు సన్నద్ధమైంది. ప్రధానంగా మత్స్యకారుల భాగస్వామ్యంతో తీరప్రాంతం నుంచి అక్రమ చొరబాట్లను అడ్డుకునేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. మత్స్యకారులకు వాతావరణ సమాచారం, తుఫాన్ హెచ్చరికలు తెలపడానికి కూడా ఈ విధానం ఉపయుక్తంగా ఉంటుంది. ఏపీతో సహా దేశంలోని 13 తీరప్రాంత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మత్స్యకారుల బోట్లపై శాటిలైట్ టెర్మినళ్లు ఏర్పాటునకు ఇస్రో ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇస్రోకు చెందిన ‘న్యూ స్పేస్ ఇండియా’ మొబైల్ శాటిలైట్ సర్వీసెస్(ఎంఎస్ఎస్) పేరుతో ఈ ప్రాజెక్టును రూపొందించింది. మొదటి దశలో దేశంలో లక్ష మత్స్యకార బోట్లపై శాటిలైట్ టెర్మినళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఏపీతో పాటు తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, పాండిచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్, డామన్ డయ్యూలలోని మత్స్యకార బోట్లపై వాటిని ఏర్పాటు చేస్తారు. పొడవైన తీరప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో 10 వేల బోట్లపై వాటిని ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇందుకోసం ఈ 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో తీరప్రాంత సమీపంలో ఇస్రో ప్రత్యేకంగా 9ఎం/11ఎం సి–బాండ్ గ్రౌండ్ స్టేషన్లను హబ్ బేస్‌బాండ్ వ్యవస్థతో ఏర్పాటు చేస్తారు. అనంతరం మత్స్యకార బోట్లపై శాటిలైట్ టెర్మినళ్లు ఏర్పాటు చేస్తారు. ఈ మత్స్యకార బోట్లను ఆయా రాష్ట్రాల గ్రౌండ్ స్టేషన్లతో అనుసంధానిస్తారు. ఇస్రో ఇటీవల ప్రయోగించిన నావిక్ ఉపగ్రహ పరిజ్ఞానంతో ఈ ప్రాజెక్టు పనిచేస్తుంది. దీంతో మన దేశ మత్స్యకార బోట్ల కదలికలను ఎప్పటికప్పుడు గ్రౌండ్ స్టేషన్‌లోని మానిటర్ ద్వారా పర్యవేక్షించొచ్చు. పరస్పర సమాచార మార్పిడికి అవకాశం ఎంఎస్ఎస్ ప్రాజెక్టు అటు భద్రత బలగాలకు, ఇటు మత్స్యకారులకు ఉపయుక్తంగా ఉంటుంది. ఈ ప్రాజెక్టు రెండు వైపుల నుంచి సమాచార మార్పిడికి అవకాశం కల్పిస్తుంది. అంటే సముద్రంలో వేటకు వెళ్లిన బోట్లలో ఉన్న మత్స్యకారులు, ఒడ్డున ఉన్న గ్రౌండ్ స్టేషన్‌లోని అధికారులు పరస్పరం సంభాషించుకోవచ్చు. సముద్రంలో అక్రమ చొరబాటుదారులుగానీ అనుమానాస్పద కదలికలను గానీ గమనిస్తే మత్స్యకారులు వెంటనే గ్రౌండ్ స్టేషన్లో ఉన్న అధికారులకు సమాచారం అందించేందుకు అవకాశం ఉంటుంది. ఇక గ్రౌండ్ స్టేషన్లో ఉన్న అధికారులు వాతావరణ సమాచారం, తుఫాన్ హెచ్చరికలు వంటి సమాచారాన్ని సముద్రంలో ఉన్న మత్స్యకారులకు ఎప్పటికప్పుడు అందించేందుకు వీలుంటుంది. పొరుగు దేశాల సముద్ర జలాల్లోకి ప్రవేశించకుండా అప్రమత్తం చేయొచ్చు. ఈ ప్రాజెక్ట్‌పై తీరప్రాంత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలతో కలిస ఇస్రో త్వరలోనే మత్స్యకారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనుంది. -
కిమ్‌కు తొలిసారి షాక్! ఉత్తర కొరియా నిఘా ఉపగ్రహ ప్రయోగం విఫలం
సియోల్: ఉత్తర కొరి యోలో కిమ్ ప్రభు త్వం మిలటరీ కార్యక లాపాలకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. వరస పెట్టి క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్న ఆ దేశం తొలిసారిగా ప్రయోగించిన నిఘా ఉపగ్రహం విఫలమైంది. ఉపగ్రహాన్ని తీసుకువెళుతున్న రాకెట్ రెండో దశ సమయంలో కనెక్షన్ తెగిపోయినట్టు ఉత్తర కొరియా అధికారిక న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఉపగ్రహ ప్రయోగం వైఫల్యానికి గల కారణాలను శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నట్టుగా వెల్లడించింది. ఉపగ్రహం శకలాలు కొరియాలోని ఉత్తరంవైపు సముద్ర జలాల్లో పడినట్టుగా తెలిపింది. ప్రయోగం విఫలమై రాకెట్ భూమిపైకి దూసుకువచ్చే సమయంలో అసాధారణంగా ప్రయాణించడంతో దక్షిణ కొరియా, జపాన్‌లు వణికిపోయాయి. రాకెట్ ఎక్కడ తమ భూభాగం మీద పడుతుందోనన్న భయంతో దేశ ప్రజలు అండర్ గ్రౌండ్లోకి వెళ్లిపొమ్మంటూ హెచ్చరించాయి. చివరికి రాకెట్ సముద్రంలో పడడంతో ఆ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. -
24న ‘నావిక్–01’ ఉపగ్రహ ప్రయోగం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి మే 24వ తేదీన జీఎస్ఎల్వీ–ఎఫ్12 రాకెట్ ద్వారా నావిక్–01 (ఐఆర్ఎన్ఎస్ఎస్–1జే) అనే ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. షార్‌లోని రెండో ప్రయోగవేదిక నుంచి దీనిని నిర్వహించేందుకు మొదటి అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో రాకెట్‌ను అనుసంధానం చేసే పనులు ప్రారంభించారు. షార్‌లో లాంచింగ్ వసతులు పెరిగిన తర్వాత నెలకు ఒక ప్రయోగం చేయాలని ఇస్రో శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 22న పీఎస్ఎల్వీ సీ55ని ప్రయోగించారు. ఆ ప్రయోగం పూర్తయిన వెంటనే మే 24న జీఎస్ఎల్వీ ఎఫ్12 ద్వారా నావిక్–01 ఉపగ్రహ ప్రయోగానికి శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (ఐఆర్ఎన్ఎస్ఎస్)ను బలోపేతం చేయడానికి ఈ ప్రయోగం చేస్తున్నారు. -
‘జ్యూస్’ అన్వేషణకు అంకురార్పణ
ఈ విశాల విశ్వంలో మనం ఒంటరివాళ్లమా లేక మనలాగే మనుగడసాగించే బుద్ధిజీవులు వేరే గ్రహాలపై కూడా ఉన్నారా అన్న విచికిత్స ఈనాటిది కాదు. ఆ ప్రయత్నంలో గురువారం మరో అడుగు ముందుకుపడబోతోంది. యూరొపియన్ స్పేస్ ఏజెన్సీ(ఈఎస్ఏ) నేతృత్వంలో రూపొందిన ‘జ్యూస్’ (జూపిటర్ అయిసీ మూన్స్ ఎక్స్‌ప్లోరర్) అంతరిక్ష నౌక దక్షిణ అమెరికాలోని కౌరు దీవి నుంచి ఎనిమిదేళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని ప్రారంభించబోతోంది. 2031లో అక్కడికి చేరుకున్నాక గురు గ్రహానికున్న లెక్కకు మిక్కిలి చందమామల్లో మూడింటిని ఎంచుకుని వాటిల్లో జీవుల ఉనికి సంగతిని తేల్చడం ఈ అంతరిక్ష నౌక లక్ష్యం. అంగారక గ్రహం ఆవల జీవం ఉండటానికి ఏమాత్రం అవకాశం లేదని ఒకప్పుడు ఖగోళ శాస్త్రవేత్తలు నిర్ధారణకొచ్చారు. కానీ అంతటితో ఆగిపోతే మానవ జిజ్ఞాసకు అర్థం లేదు. ‘వేరెక్కడో ఒక మహాద్భుతం తనను తాను వ్యక్తపరుచుకోవటానికి వేచిచూస్తూ వుండొచ్చ’ని ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త కార్ల్ సెగాన్ ఒక సందర్భంలో అన్నారు. ఒక్క ఖగోళ శాస్త్రం అనేమిటి...సమస్త రంగాల్లోనూ మానవాళి సాధిస్తున్న విజయపరంపరకు ఈ భావనే మూలం. 1990లో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా గురుగ్రహంపైకి ప్రయోగించిన గెలీలియో ఉపగ్రహం, ఈమధ్యకాలంలో శనిగ్రహానికి పోయిన కేసినీ ఉపగ్రహం శాస్త్రవేత్తల అంచనాలను తలకిందులు చేశాయి. గురుడు, శుక్రుడు, బుధుడు వంటి ఇతరేతర గ్రహాలపై జీవం ఉండక పోవచ్చుగానీ, గురుడు, అంగారకుడు మధ్య కనబడుతున్న చందమామలపై ఏదోమేర, ఏదో రూపంలో జీవం ఉండటానికి అవకాశం ఉన్నదని అవి పంపిన డేటా ఆధారంగా నిర్ధారణ కొచ్చారు. ఆ తర్వాతే ఈ మూడు చందమామలనూ అన్వేషించాలన్న నిర్ణయానికొచ్చారు. గ్రహాలన్నిటిలోనూ గురుగ్రహం చాలా పెద్దది. సంక్లిష్టమైనది కూడా. ఎందుకంటే దీనికి ఒకటీ రెండూ కాదు...ఏకంగా 92 చందమామలున్నాయి. వీటిలో కొన్ని వ్యతిరేక కక్ష్యలో కూడా తిరుగు తుంటాయి. అలాంటి చందమామల్లో పెద్దగా ఉండే యూరోపా, క్యాలిస్టో, గానిమీడ్ అనే మూడింటిని ఎంచుకుని వాటిచుట్టూ జ్యూస్ 35 ప్రదక్షిణలు చేస్తుంది. ఆ తర్వాత 2034లో గానిమీడ్ చుట్టూ నిర్దేశిత కక్ష్యలో కుదురుకుంటుంది. ఈ మూడు చందమామలూ మంచుతో నిండివున్నాయి. ఆ పొరల వెనక మహా సముద్రాలు నిక్షిప్తమైవున్నాయని శాస్త్రవేత్తల అంచనా. అదే నిజమైతే ఏదో రూపంలో అక్కడ జీవం ఉండటానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా గానిమీడ్పై లవణసముద్రం ఉన్నదని గుర్తించారు. నిజానికి సూర్యకాంతి పడే అవకాశం లేదు గనుక ఈ మూడు చందమామల్లో జీవం ఉనికికి అవకాశం లేదు. కానీ గురుగ్రహానికుండే గురుత్వాకర్షణ ఆ లోటు తీరుస్తోంది. ఈ చందమామల్లోని సముద్రాలు వేడెక్కడానికి దోహదపడుతోంది. గురుగ్రహానికి మన దగ్గర బృహస్పతి అనే నామాంతరం ఉంది. పురాణాల్లో బృహస్పతి దేవగురువు. యాదృచ్ఛికమే కావొచ్చు గానీ... బృహస్పతికి ప్రీతిపాత్రమైన గురువారం రోజునే గురుగ్రహానికి జ్యూస్ ప్రయాణం కడుతోంది. నిజానికి ఇంతవరకూ గురుగ్రహం గురించి మానవాళికి తెలిసింది గోరంతే. దాన్ని దట్టంగా చుట్టుముట్టివుండే వాయుమేఘాలే అందుకు కారణం. అందులో అత్యధికం, అంటే...90 శాతం హైడ్రోజన్ అయితే, మిగిలిన పదిశాతంలో హీలియం, మీథేన్, గంథకం, అమోనియా వంటివి ఉన్నాయి. అయితే ఈ మూలకాల్లో ఎన్ని వాయురూపంలో ఉన్నాయో, మరెన్ని ఘనరూపం దాల్చాయో శాస్త్రవేత్తలు ఇంకా తేల్చలేదు. అసలు గురుగ్రహం నెన్నొసట సిందూరంలా ఎర్రగా మెరిసే బింబం ఒకటుంటుంది. దాని పరిమాణమే మన భూమి కన్నా మూడింతలు కాగా, అది కుదురుగా ఒకచోట ఉండక తిరుగా డుతుంటుంది. గురుగ్రహంపై నిత్యం రేగే పెను అలజడే ఇలా కనబడుతోందని శాస్త్రవేత్తలంటారు. మనం భూమ్మీద క్షేమంగా ఉండగలుగుతున్నామంటే అది గురుగ్రహం చలవే. ఎందుకంటే భూమివైపు దూసుకొచ్చే గ్రహశకలాల్లో, ఉల్కల్లో చాలాభాగాన్ని గురుగ్రహం తనవైపు ఆకర్షించుకుని వాటివల్ల కలిగే కష్టనష్టాలను తానే భరిస్తుంటుంది. నిజానికి గురుగ్రహం చుట్టూ తిరుగాడుతున్న చందమామల్లో అనేకం అటువంటి గ్రహశకలాలే. ఇందులో ఒకటైన గానిమీడ్‌కు అయస్కాంత క్షేత్రం ఉన్నా, అది బుధుడి కన్నా చాలా పెద్దదైనా గురుడి ప్రభావానికి లోనై చందమామగానే మిగిలి పోయింది. గురుగ్రహం ఆనుపానులు రాబట్టేందుకు ఇంతవరకూ 4 అంతరిక్షనౌకలు వెళ్లాయి. 1972 మార్చిలో ప్రయోగించిన పయొనీర్–10 గురుగ్రహం చుట్టూ 2003 వరకూ చక్కర్లు కొడుతూనే ఉంది. ఆ తర్వాత దాన్నుంచి సంకేతాలు లేవు. మన సౌర వ్యవస్థను దాటి ముందు కెళ్లడానికి 1977లో ప్రయోగించిన వాయేజర్ గురుగ్రహాన్ని దాటుకుంటూ వెళ్తూ దాని ఛాయా చిత్రాలు పంపింది. ఆ తర్వాత 1990లో వెళ్లిన గెలీలియో, 2000లో వెళ్లిన కేసినీ వ్యోమనౌకలు సైతం గురుగ్రహ ఛాయాచిత్రాలు పంపాయి. ఇక 2016లో నాసా ప్రయోగించిన జునో అంతరిక్ష నౌక నిరుడు యూరోపా ఛాయాచిత్రాలు పంపింది. ఇప్పుడు జ్యూస్ ప్రదక్షిణలు చేయబోయే 3 చందమామల్లో యూరోపా ఒకటి. అది 2031–34 మధ్య యూరోపాను రెండుసార్లు, క్యాలిస్టోను 21సార్లు, గాని మీడ్‌ను 12 సార్లు చుట్టివస్తుంది. అంతరిక్ష నౌకలు పంపే డేటాలో కేవలం రంగుల పొందికే ఉంటుంది. వీటి ఆధారంగా అక్కడ ఏమేం వాయువులున్నాయో, మూలకాలున్నాయో అంచనా కొస్తారు. విశ్వరహఃపేటిక తెరుచుకోవాలంటే నిత్యం ప్రయోగాలు కొనసాగుతూనే ఉండాలి. ఖగోళ శాస్త్ర ఆవిష్కరణలు విశ్వానికి సంబంధించిన మన జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు విస్తృతపరుస్తుంటాయి. -
సంయుక్త నిసార్ ఇస్రో చేతికి
బెంగళూరు: అమెరికాకు చెందిన నాసా, భారత్‌కు చెందిన ఇస్రో సంయుక్తంగా అభివృద్ధి చేసిన నిసార్ ఉపగ్రహం ఇస్రో చెంతకు చేరింది. నాసా–ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్(నిసార్)ను అమెరికాలోని కాలిఫోర్నియాలో తయారుచేయగా ఆ దేశ వాయుసేనకు చెందిన సీ–17 విమానం దానిని బెంగళూరుకు తీసుకొచ్చింది. ‘ నిసార్ భారత్‌కు బుధవారం వచ్చేసింది. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిౖలైట్ తుది ఇంటిగ్రేషన్ మొదలైంది’ అని చెన్నైలోని అమెరికా కాన్సులేట్ జనరల్ బుధవారం ట్వీట్ చేసింది. వ్యవసాయ సంబంధ మ్యాపింగ్, కొండచరియలు విరిగే ప్రమాదమున్న ప్రాంతాల గుర్తింపు తదితరాల కోసం నిసార్‌ను వినియోగించనుంది. ఏపీలోని సతీశ్ ధవన్ అంతరిక్ష ప్రయోగం కేంద్రం నుంచి వచ్చే ఏడాదిలో ఈ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించనుంది. -
ఇస్రో సరికొత్త ప్రయోగం.. భూమిపైకి ‘మేఘాట్రోఫిక్–1’ పునరాగమనం
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): నియంత్రిత పునరాగమన పద్ధతిలో సరికొత్త ప్రయోగానికి ‘ఇస్రో’ సిద్ధమైంది. 2011 అక్టోబర్ 12న పీఎస్ఎల్వీ–సీ18 రాకెట్ ద్వారా పంపించిన మేఘాట్రోఫిక్ ఉపగ్రహం కాలపరిమితికి మించి పనిచేసి, ప్రస్తుతం అంతరిక్షంలో నిరుపయోగంగా మారింది. దాదాపు 1,000 కిలోల బరువైన మేఘాట్రోఫిక్–1 (ఎంటీ–1) ఉపగ్రహాన్ని ఉçష్ణమండలంలోని వాతావరణం, వాతావరణ పరిస్థితులపై అధ్యయనం కోసం ఇస్రో, ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థ (సీఎన్ఈఎస్) సంయుక్తంగా తయారుచేసి ప్రయోగించాయి. దీని కాలపరిమితి మూడేళ్లు. కానీ, 2021 దాకా సేవలందించింది. ప్రస్తుతం వ్యర్థంగా మారిన ఈ ఉపగ్రహంలో 125 కిలోల ద్రవ ఇంధనముంది. ఇది అంతరిక్షంలో పేలిపోయి ఇతర ఉపగ్రహాలకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని ఇస్రో అంచనా వేసింది. ఈ నేపథ్యంలో దానిని సురక్షితంగా భూమిపైకి తీసుకొచ్చి, పసిఫిక్ మహాసముద్రంలో కూల్చేందుకు మంగళవారం సరికొత్త ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టనున్నారు. భూమిపైకి మేఘాట్రోఫిక్–1 రీఎంట్రీ కోసం అందులో ఉన్న ఇంధనం సరిపోతుందని ఇస్రో సైంటిస్టులు చెబుతున్నారు. 26న ఎల్వీఎం3–ఎం3 ప్రయోగం లాంచ్ వెహికల్ మార్క్3–ఎం3 (ఎల్వీఎం3–ఎం3) ప్రయోగాన్ని ఈ నెల 26న నిర్వహించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. యునైటెడ్ కింగ్డమ్కు చెందిన నెట్వర్క్ యాక్సెస్ అసోసియేట్ లిమిటెడ్, ఇండియన్ భారతి ఎంటర్ప్రైజెస్ సంయుక్త భాగస్వాములుగా వన్‌వెబ్ ఇండియా–2 పేరుతో 5,796 కిలోల బరువైన 36 కమ్యూనికేషన్ ఉపగ్రహాలను రెండోసారి వాణిజ్యపరంగా ప్రయోగిస్తున్నాయి. సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ ‘షార్’లోని రెండో ప్రయోగ వేదిక దీనికి వేదిక కానుంది. షార్‌లోని వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో రెండు దశల రాకెట్ అనుసంధానం పూర్తి చేశారు. క్రయోజనిక్ దశ మాత్రమే పెండింగ్‌లో ఉంది. ప్రయోగించబోయే 36 ఉపగ్రహాలు ఇప్పటికే షార్కు చేరుకున్నాయి. వీటికి అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు. హీట్‌షీల్డ్‌లో అమర్చే పనులు జరుగుతున్నాయి. -
డిజిటల్ టీవీ రిసీవర్లకు నాణ్యతా ప్రమాణాలు
న్యూఢిల్లీ: మూడు రకాల ఎలక్ట్రానిక్ డివైజ్‌లకు (డిజిటల్ టీవీ రిసీవర్లు, యూఎస్బీ టైప్–సీ చార్జర్లు, వీడియో నిఘా వ్యవస్థలు –వీఎస్ఎస్) సంబంధించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) నాణ్యతా ప్రమాణాలను రూపొందించింది. బిల్ట్ఇన్ శాటిలైట్ ట్యూనర్లు ఉన్న డిజిటల్ టీవీ రిసీవర్ల కోసం ఐ 18112:2022 స్పెసిఫికేషన్‌ను కేటాయించింది. ఈ ప్రమాణాలతో తయారైన టెలివిజన్లు .. కేవలం డిష్ యాంటెనాను కనెక్ట్ చేయడం ద్వారా ఉచిత టీవీ, రేడియో చానల్స్‌ను అందుకోవచ్చని వినియోగదారుల వ్యవహారాల శాఖ తెలిపింది. ప్రస్తుతం టీవీ వీక్షకులు వివిధ పెయిడ్, ఉచిత చానల్స్‌ను (ఆఖరికి దూరదర్శన్ ఛానళ్లు) చూడాలంటే సెట్–టాప్ బాక్సులను కొనుగోలు చేయాల్సి ఉంటోంది. అటు సీ–టైప్ యూఎస్బీలు, కేబుల్స్ మొదలైన వాటికి (IS/IEC62680&1&3:2022) స్పెసిఫికేషన్ కేటాయించారు. -
భూమ్మీద పడనున్న నాసా పాత ఉపగ్రహం
కేప్ కెనావెరల్ : అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన 38 ఏళ్ల నాటి పాత ఉపగ్రహం ఒకటి అంతరిక్షం నుంచి భూమ్మీద పడబోతోంది. అయితే దీనివల్ల వచ్చే ముప్పు అత్యంత తక్కువని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. 2,450 కేజీలున్న ఈ ఉపగ్రహం సేవా కాలం ముగిసిపోయింది. దీనిని అంతరిక్షంలో మండిస్తారు. అయినప్పటికీ ఆ ఉపగ్రహం శిథిలాలు చిన్న చిన్నవి భూమిపై పడే అవకాశాలున్నాయి. 9,400 శిథిలాల ముక్కల్లో ఒక్క దాని ద్వారా మాత్రమే ప్రమాదం ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి ది ఎర్త్ రేడియేషన్ బడ్జెట్ శాటిలైట్ (ఈఆర్బీఎస్) భూమిపైకి పడిపోనుంది. 1984లో ప్రయోగించిన ఈ ఉపగ్రహం రెండేళ్లు సేవలు అందించింది. సూర్యుడి నుంచి రేడియో ధార్మిక శక్తిని భూమి ఎలా గ్రహిస్తుందన్న దానిపై ఈ ఉపగ్రహం సేవలు చేసింది. 2005 నుంచి దీని సేవలు నిలిచిపోయాయి. -
పదేళ్ళకు ఎంఎస్‌వోల రిజిస్ట్రేషన్ రెన్యువల్
న్యూఢిల్లీ: శాటిలైట్ టీవీ ఎంఎస్‌వోల (మల్టీ–సిస్టం ఆపరేటర్లు) రిజిస్ట్రేషన్‌ను 10 ఏళ్ల వ్యవధికి రెన్యువల్ చేయాలని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ కేంద్రానికి సూచించింది. ఇందుకోసం ప్రాసెస్ ఫీజును రూ. 1 లక్షగా నిర్ణయించాలని సిఫార్సు చేసింది. కేబుల్ టీవీ నెట్వర్క్స్ నిబంధనల్లో ఎంఎస్‌వోల రిజిస్ట్రేషన్ల రెన్యువల్ నిబంధనలు లేకపోవడంతో తగు సూచనలు చేయాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖ కోరిన మీదట ట్రాయ్ ఈ మేరకు సిఫార్సులు చేసింది. రెన్యువల్‌కి దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే జరిగేలా చూడాలని, బ్రాడ్కాస్ట్ సేవా పోర్టల్ ద్వారా పత్రాలన్నీ డిజిటల్ విధానంలో అప్లోడ్ చేసే వెసులుబాటు కల్పించాలని పేర్కొంది. అలాగే రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ కోసం పెండింగ్‌లో ఉన్న ఎంఎస్‌వోల జాబితాను, నిర్దిష్ట గడువులోగా దరఖాస్తు చేసుకోని వాటి లిస్టును పోర్టల్‌లో పొందుపర్చాలని సూచించింది. ఒకవేళ దరఖాస్తు పరిశీలనలో ఉన్నా, నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో ఉంచినా తుది నిర్ణయం తీసుకునే వరకూ సదరు ఎంఎస్‌వోలకు పొడిగింపునివ్వాలని పే ర్కొంది. గడువు తేదీ ముగియడానికి ఏడు నుంచి రెండు నెలల ముందు వరకూ రెన్యువల్ కోసం దరఖాస్తులను స్వీకరించవచ్చని ట్రాయ్ సూచించింది. రెండు నెలల కన్నా తక్కువ సమయంలో దరఖాస్తు చేసుకుంటే జాప్యానికి చూపిన కారణాలను పరిశీలించి శాఖ తగు నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది. -
ఎంటీఏఆర్, ఇన్–స్పేస్ జోడీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రక్షణ, అంతరిక్ష రంగానికి అవసరమైన ఉత్పత్తుల తయారీలో ఉన్న ఎంటీఏఆర్ టెక్నాలజీస్ తాజాగా ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్, ఆథరైజేషన్ సెంటర్‌తో (ఇన్–స్పేస్) ఒప్పందం కుదుర్చుకుంది. ఎంవోయూ కాలపరిమితి మూడేళ్లు. ఇందులో భాగంగా రెండు దశల నుండి భూమికి తక్కువ కక్ష్య వరకు ప్రయాణించే సెమి క్రయోజనిక్ సాంకేతికత ఆధారిత పూర్తి ద్రవ చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం రూపకల్పన, అభివృద్ధి బాధ్యతలను ఎంటీఏఆర్ చేపడుతుంది. 500 కిలోల బరువు మోయగల సామర్థ్యంతో ఈ వాహనాన్ని రూపొందిస్తారు. -
సొంతానికి ఓ శాటిలైట్.. మనకు మనమే సమాచారం తెలుసుకునే వీలు!
రమేష్ హైదరాబాద్‌లో ఉంటున్నాడు. వచ్చే వారం రోజులు వర్షాలు అనే సమాచారం ఉంది. అయితే, తాను ఉంటున్న ప్రాంతంలో వర్షాలు పడతాయో లేదో తెలుసుకునేందుకు తాను పంపిన ప్రైవేటు శాటిలైట్ ద్వారా వర్షం పడుతుందా? లేదా చూశాడు. వర్షం పడదని నిర్ధారించుకుని తన పనిలో మునిగిపోయాడు. ఒక ప్రైవేటు విద్యా సంస్థ.. దేశవ్యాప్తంగా ఉన్న తన నెట్‌వర్క్‌లోని అన్ని విద్యా సంస్థల్లో ఒకేసారి ఆన్లైన్లో పాఠాలు బోధించేందుకు ఎవరిపై ఆధారపడాల్సిన అవసరంలేకుండా తమ విద్యార్థి ప్రయోగించిన శాటిలైట్ ద్వారా నేరుగా సేవలను ఉపయోగించుకుంటోంది. అదీ తక్కువ ఖర్చుతోనే.. ఒక ప్రైవేటు సంస్థ మారుమూల ప్రాంతాల్లో పనులను చేపడుతోంది. దేశవ్యాప్తంగా అటు కశ్మీర్ నుంచి ఇటు కన్యాకుమారి వరకు పనులు ఎలా జరుగుతున్నాయో పరిశీలించేందుకు తాను సొంతంగా నిర్వహిస్తున్న శాటిలైట్ ఆధారంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆదేశాలు జారీచేస్తోంది. ..అవును కేంద్రం కొత్తగా అంతరిక్ష రంగంలోకి ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తూ తీసుకున్న నిర్ణయంతో మనమూ సొంతంగా ఒక ప్రైవేటు శాటిలైట్‌ను ప్రయోగించుకుని సేవలను పొందే రోజు దగ్గర్లోనే ఉంది. ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ సొంతంగా ఏర్పాటుచేసుకున్న అంతరిక్ష రవాణా కంపెనీ ‘స్పేస్ ఎక్స్’ తరహాలో కాకపోయినా.. ప్రైవేటు పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, విద్యా సంస్థలు, మెడికల్ సంస్థలు మొదలైనవి తమ సొంత శాటిలైట్ ద్వారా నెట్‌వర్క్‌ను ఏర్పాటుచేసుకునే వీలు కలగనుంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష రంగంలో ప్రైవేటు పెట్టుబడులకు ఎప్పుడో తలుపులు తెరిచారు. కానీ, భారత్‌లో మాత్రం కేంద్రం ఇటీవలే ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వేతర ప్రైవేటు సంస్థలు (ఎన్జీపీఈ).. అంతరిక్ష పరిశోధనలను తమ సొంత అవసరాలకు స్వయంగా చేసుకునేందుకు వీలుగా ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించింది. తద్వారా విద్యా సంస్థలు, స్టార్టప్స్, పరిశ్రమలకు ఎండ్ టు ఎండ్ (నేరుగా సమాచారం చేరే విధంగా) అంతరిక్ష కార్యక్రమాల నిర్వహణకు అవకాశం కల్పించాలని సంకల్పించింది. ఇందుకోసం ఇండియన్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్–స్పేస్)ను ఏర్పాటుచేసింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)తో అనుసంధానం చేసుకుంటూ ప్రైవేటు సంస్థలకు సహాయ సహకారాలతో పాటు నియంత్రణ కూడా చేస్తుంది. కేంద్రం తాజా నిర్ణయంతో ఇస్రోకు చెందిన సాధన సంపత్తిని ప్రధానంగా రాకెట్ లాంచింగ్ కేంద్రాలతో పాటు ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రైవేటు సంస్థలూ వినియోగించుకునే వెసులుబాటు లభించింది. ఇక బోలెడు అవకాశాలు.. ప్రైవేటు పెట్టుబడులను అనుమతించడంతో అంతరిక్ష రంగంలో అనతికాలంలోనే భారత్ గొప్ప ముందడుగు వేసే అవకాశాలున్నాయని అంతరిక్ష పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు వారు ఒక ఉదాహరణ చెబుతున్నారు. వాస్తవానికి మార్స్ (అంగారకుడు)లో అడుగుపెట్టేందుకు భారత్ కేవలం 75 బిలియన్ డాలర్లు మాత్రమే వెచ్చించింది. మిగిలిన పాశ్చాత్య దేశాల కంటే చాలా తక్కువ ఖర్చుతో మనం అంగారకుడిపై అడుగు పెట్టగలిగామనేది వారి అభిప్రాయం. అంతేకాక.. భారత్‌లో ఉన్న నిపుణులైన యువత ఈ అవకాశాలను మరింత త్వరగా అందిపుచ్చుకునే అవకాశం ఉందనేది వారి అంచనా. ప్రైవేటు సంస్థలకు అవకాశమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత మొట్టమొదటగా విశాఖ, హైదరాబాద్‌కు చెందిన యువకులు.. స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ ద్వారా దేశంలోనే మొదటి ప్రైవేట్ రాకెట్‌ను శ్రీహరికోట నుంచి 2022 నవంబరు 18న విజయవంతంగా ప్రయోగించారు. అవకాశాలు అందుబాటులోకి వస్తే భారత యువత రాకెట్ కంటే వేగంగా దూసుకెళ్లి ప్రపంచ మార్కెట్లో త్వరలోనే పాగావేసే అవకాశం ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. 2019 నాటికి భారత అంతరిక్ష మార్కెట్ విలువ 7 బిలియన్ డాలర్లు కాగా... ఇది కాస్తా 2025 నాటికి 50 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. స్టార్టప్స్ షురూ.. ప్రపంచ అంతరిక్ష మార్కెట్ విలువ 2020 నాటికి 447 బిలియన్ డాలర్లు కాగా.. 2025 నాటికి ఇది 600 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. వాస్తవానికి అంతర్జాతీయంగా ఇప్పటికే స్పేస్ ఎయిర్‌క్రాఫ్ట్ ఎక్విప్మెంట్, శాటిలైట్ కమ్యూనికేషన్స్‌లో ప్రైవేటు సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. రష్యా దాడి తర్వాత ఉక్రెయిన్‌లో దెబ్బతిన్న సమాచార వ్యవస్థ పునరుద్ధరణలో స్టార్ లింక్ ప్రధాన పాత్ర పోషించింది. ‘స్పేస్ ఎక్స్’ సంస్థ అంతరిక్షంలో ఏకంగా 3,271 శాటిలైట్స్‌ను ప్రయోగించింది. ఇందులో 3,236 శాటిలైట్స్ ప్రస్తుతం పనిచేస్తున్నాయి. అయితే, భారత్‌లో కూడా అంతరిక్ష రంగంలో ప్రైవేటు పెట్టుబడుల క్రమం ఇప్పుడే మొదలవుతోంది. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే అంతరిక్ష రంగ పరిశోధనలకు మనం వెచ్చిస్తున్న మొత్తం తక్కువే. అమెరికా అంతరిక్ష బడ్జెట్ 41 బిలియన్ డాలర్లు కాగా.. ఇందులో నాసా ప్రాజెక్టుల మీద 23.3 బిలియన్ డాలర్లు ఖర్చు పెడుతున్నారు. మరోవైపు.. భారత్ అంతరిక్ష బడ్జెట్ రూ.13,700 కోట్లు మాత్రమే. అయితే, ఎవరి ప్రమేయం లేకుండా ఎండ్ టు ఎండ్ సర్వీసులను ప్రైవేటు సంస్థలు పొందేందుకు వీలుగా జూన్ 2022లో ప్రైవేటు రంగాన్ని ఆహ్వానిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో భారత్‌లోనూ వేగం పుంజుకునే అవకాశాలున్నాయి. భారత్‌లో ఇప్పటికే ఇస్రో వద్ద 60 స్టార్టప్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. సమాచారం మరింత ఖచ్చితంగా.. అంతరిక్షంలో మరిన్ని శాటిలైట్లను ప్రయోగించడం ద్వారా మారుమూల ప్రాంతాల సమాచారాన్ని కూడా మరింత సమగ్రంగా, ఖచ్చితంగా విశ్లేషించే అవకాశాలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. నిజానికి.. ఇంట్లో కూర్చుని మనం వివిధ సినిమాలు, న్యూస్, సీరియల్స్, గేమ్స్ చూస్తున్నామంటే అందుకు కారణం శాటిలైట్సే. ఎక్కడో దూరాన ఉన్న మన వారితో ఫోన్లో వీడియో కాల్లో మాట్లాడుతున్నామన్నా.. మనం ఉన్న చోటునుంచే ఎక్కడో ఉన్న వారి బ్యాంకు అకౌంట్లోకి నగదు బదిలీ చేస్తున్నామన్నా.. ఎక్కడెక్కడో ఉన్న కంపెనీల ప్రతినిధులు ఆన్లైన్లో సమావేశం కావడం, ఫలానా తేదీన, ఫలానా ప్రాంతాల్లో వర్షాలు పడతాయన్న సమాచారం కానీ.. మనం ఉన్న ప్రాంతం నుంచి ఫలానా ప్రదేశం ఎంతదూరం ఉందన్న సమాచారం కానీ మనకు వస్తోందంటే శాటిలైట్స్ ఎప్పటికప్పుడు అందిస్తున్న సమాచారమే కారణం. ఇక అంతరిక్షంలోకి మరిన్ని శాటిలైట్లను ప్రయోగిస్తే ఏయే లాభాలు కలుగుతాయంటే.. వాతావరణంలో వచ్చే మార్పులను మరీ సూక్ష్మంగా విశ్లేషించొచ్చు. తద్వారా ఆయా సమాచారాన్ని రైతులకు, సంస్థలకు అందించడం ద్వారా నష్టాన్ని నివారించే వీలు కలుగుతుంది. స్టూడెంట్ శాటిలైట్స్ ద్వారా మారుమూలప్రాంతాలకు చెందిన సమాచారాన్ని తక్కువ ఖర్చుతో సేకరించొచ్చు. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్స్‌కు కనెక్ట్ కాని 49 శాతం మంది ప్రజలు వీటి ద్వారా సమాచారాన్ని చేరవేసేందుకు అవకాశం ఉంటుంది. రాబోయే రోజుల్లో తక్కువ ఖర్చుతో తయారుచేసే చిన్నచిన్న శాటిలైట్లు ప్రధానపాత్ర పోషించనున్నాయి. తక్కువ ఖర్చుతో ఆయా సంస్థలు అంతరిక్ష నెట్‌వర్క్‌ను ఏర్పాటుచేసుకోవడం ద్వారా ఇతరులకు తమ సమాచారమేదీ పొక్కకుండా కాపాడుకోవచ్చు. మెడికల్ రంగంలో మరిన్ని విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశముంది. మన భూమిని ప్రకృతి వైపరీత్యాల నుంచి, వాతావరణ మార్పుల నుంచి కాపాడుకునే వీలుంది. -
NASA's DART Mission: నాసా ప్రయోగం దిగ్విజయం.. గ్రహశకలాల్ని ఇక దారి మళ్లించగలం!
వాషింగ్టన్: అంతరిక్ష సవాళ్లను దీటుగా ఎదుర్కొనే దిశగా కీలక ముందడుగు పడింది. భూమిని ఢీకొట్టే ఆస్కారమున్న గ్రహశకలాలను దారి మళ్లించి మానవాళికి ముప్పును తప్పించగలమన్న భరోసా ఏర్పడింది. భూమికి సుదూరంగా ఉన్న ఓ గ్రహశకలాన్ని ఉపగ్రహంతో ఢీకొట్టించే లక్ష్యంతో నాసా చేపట్టిన డబుల్ ఆస్టిరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ (డార్ట్) విజయవంతమైంది. ఇందుకోసం 10 నెలల క్రితం ప్రయోగించిన 570 కిలోల ఉపగ్రహం లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. భూమికి 108 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న డైమోర్ఫస్ అనే బుల్లి గ్రహశకలాన్ని ముందుగా నిర్దేశించిన మేరకు మంగళవారం తెల్లవారుజామున గంటకు 22,530 కిలోమీటర్ల వేగంతో ఢీకొట్టింది. దాంతో నాసా ప్రధాన కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. శాస్త్రవేత్తలంతా పరస్పరం అభినందనలు తెలుపుకుంటూ సందడి చేశారు. అన్ని అంచనాలనూ అధిగమిస్తూ ప్రయోగం దిగ్విజయంగా ముగిసిందని నాసా ప్రకటించింది. అంతరిక్షంలో అతి చిన్న శకలాన్ని కూడా అత్యంత కచ్చితత్వంతో ఢీకొట్టేలా ఉపగ్రహాలను సంధించగలమని రుజువైందని నాసా సైన్స్ మిషన్ డైరెక్టరేట్ అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ థామస్ జుర్బచెన్ అన్నారు. కెనైటిక్ ఇంపాక్ట్ టెక్నిక్ సాయంతో జరిగిన ఈ ప్రయోగం భూగోళ పరిరక్షణలో అతి పెద్ద ముందడుగని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ చెప్పారు. ‘‘నిన్నామొన్నటిదాకా శాస్త్ర సాంకేతిక కల్పనగా తోచిన విషయం ఒక్కసారిగా వాస్తవ రూపు దాల్చింది. నమ్మకశ్యం కానంతటి ఘనత ఇది. భావి అంతరిక్ష ప్రమాదాల బారినుంచి భూమిని కాపాడుకోవడానికి ఒక చక్కని దారి దొరికినట్టే’’ అంటూ హర్షం వెలిబుచ్చారు. ప్రభావం తేలేందుకు మరికాస్త సమయం... డిడిమోస్ అనే మరో చిన్న గ్రహశకలం చుట్టూ డైమోర్ఫస్ తిరుగుతోంది. దాని వేగాన్ని తగ్గించడం ద్వారా కక్ష్యలో కొద్దిపాటి మార్పు తీసుకురావడం ఈ ప్రయోగ ప్రధాన లక్ష్యం. అది నెరవేరిందీ లేనిదీ నిర్ధారించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల నుంచి శక్తిమంతమైన టెలిస్కోప్‌ల ద్వారా నాసా బృందం డైమోర్పస్ను కొద్ది వారాల పాటు నిరంతరం గమనిస్తుంది. డార్ట్‌క్రాఫ్ట్ ఢీకొట్టడం వల్ల డైమోర్ఫస్ కక్ష్య కనీసం ఒక్క శాతం కుంచించుకుపోతుందని అంచనా వేస్తోంది. ఆ లెక్కన డిడిమోస్ చుట్టూ అది పరిభ్రమించే సమయం 10 నిమిషాల దాకా తగ్గాలి. డిడిమోస్ జోలికి వెళ్లకుండా డైమోర్ఫైస్ను మాత్రమే అత్యంత కచ్చితత్వంతో ఢీకొట్టడం మామూలు విజయం కాదని థామస్ చెప్పారు. ఇందుకోసం అత్యాధునిక డ్రాకో నావిగేషన్ పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. నియో... డార్ట్ వారసుడు డార్ట్ ప్రయోగం సఫలమవడంతో భూమికి అంతరిక్ష ముప్పును పసిగట్టి నివారించే ప్రయోగాల పరంపరలో తదుపరి దశకు నాసా తెర తీస్తోంది. డార్ట్ ప్రాజెక్టుకు కొనసాగింపుగా నియర్ అర్త్ ఆబ్జెక్ట్ (నియో) సర్వేయర్ పేరుతో రెండో దశ ప్లానెటరీ డిఫెన్స్ మిషన్‌ను రూపొందిస్తోంది. దీన్ని త్వరలో పట్టాలపైకి ఎక్కించనున్నట్టు నాసా ప్లానెటరీ డిఫెన్స్ ఆఫీసర్ లిండ్లీ జాన్సన్ ప్రకటించారు. భూమికి సమీపంలో ఉన్న ప్రమాదకర గ్రహశకలాలను కనిపెట్టి వాటితో భవిష్యత్తులో ముప్పు రాకుండా ముందే జాగ్రత్త పడటం దీని లక్ష్యమన్నారు. డైమోర్ఫస్‌ను ఉపగ్రహం ఢీకొట్టేందుకు కేవలం 43 సెకన్ల ముందు తీసిన ఫొటో -
రికార్డు ధరకు షారుక్ 'జవాన్' డిజిటల్ రైట్స్.. ఎన్ని కోట్లో తెలుసా?
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం'జవాన్'. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ చిత్రం డిజిటల్ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ చేజిక్కించుకోగా.. శాటిలైట్ హక్కులను జీ నెట్వర్క్ కొనుగోలు చేసింది. (చదవండి: Shahrukh And Salman Khan: ఒకే సినిమాలో ఖాన్ త్రయం !.. సౌత్ డైరెక్టర్‌తో చిత్రం) సినిమాని కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి నాన్ థియేట్రికల్ హక్కులే షాకింగ్ ధర పలికినట్లు సమాచారం. ఓటీటీ హక్కుల కోసం నెట్ ఫ్లిక్స్.. శాటిలైట్ హక్కులు సొంతం చేసుకున్న జీ దాదాపు రూ.250 కోట్లు చెల్లించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మూవీ మేకర్స్ నుంచి మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రంలో షారుక్ ఖాన్‌కు జంటగా నయనతార నటిస్తోంది. -
అంతరిక్షంలో... ఆర్మగెడాన్!
1998లో వచ్చిన సూపర్‌హిట్ హాలీవుడ్ మూవీ ఆర్మగెడాన్ గుర్తుందా? భూమిని ఢీకొట్టేందుకు శరవేగంగా దూసుకొచ్చే గ్రహశకలం బారి నుంచి మానవాళిని కాపాడే ఇతివృత్తంతో రూపొందింది. అంతరిక్షంలో సోమవారం అచ్చంగా అలాంటి ప్రమాదమే ఒకటి జరగనుంది. కాకపోతే రివర్సులో! ఏడాది క్రితం నాసా ప్రయోగించిన ఉపగ్రహం ఒకటి గంటకు ఏకంగా 24 వేల కిలోమీటర్ల వేగంతో ఓ గ్రహశకలాన్ని ఢీకొట్టనుంది! కాకపోతే, భూమికి 108 కోట్ల కిలోమీటర్ల దూరంలో జరగనున్న ఈ ప్రమాదం యాదృచ్చికం కాదు. నాసా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నదే! అంతరిక్ష రక్షణ పరీక్షల్లో భాగంగా డబుల్ ఆస్టిరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ (డార్ట్) పేరుతో నాసా తొలిసారిగా ఇలాంటి ప్రయోగానికి తెర తీసింది. ఈ ప్రయోగం అనుకున్నట్టుగా సఫలమైతే ఎప్పుడైనా గ్రహశకలాలు భూమిని ఢీకొట్టే ముప్పు ఎదురైతే దాన్ని తప్పించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని నాసా భావిస్తోంది. 32.5 కోట్ల డాలర్ల ఖర్చుతో దాదాపు ఏడాది క్రితం నాసా ఈ డార్ట్ ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో భాగంగా గత నవంబర్‌లో డార్ట్‌క్రాఫ్ట్ పేరుతో ఓ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. అది సోమవారం (భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 4.44 గంటలకు) డైమోర్ఫస్ అనే ఓ బుల్లి గ్రహశకలాన్ని ఢీకొట్టనుంది. ఇది తనకన్నా పెద్దదైన డిడిమోస్ అనే గ్రహశకలం చుట్టూ పరిభ్రమిస్తోంది. ఈ రెండు శకలాలూ సోమవారం భూమికి అత్యంత సమీపానికి, అంటే 108 కోట్ల కిలోమీటర్ల దూరంలోకి రానున్నాయి. అందుకే ఈ ముహూర్తాన్ని నాసా ఎంచుకుంది. ఈ ప్రయోగాన్ని నాసా యూట్యూబ్ చానళ్లో లైవ్‌లో చూడొచ్చు కూడా. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఉపగ్రహం ఢీకొన్నాక గ్రహశకలం కాంతిలో వచ్చే మార్పులను స్పష్టంగా చూడొచ్చని అంతరిక్ష శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏం జరగనుంది? ► డైమోర్ఫస్ కేవలం 525 అడుగుల వెడల్పున్న బుల్లి గ్రహశకలం. ► డార్ట్‌క్రాఫ్ట్ గంటకు 24 వేల కి.మీ. బ్రహ్మాండమైన వేగంతో వెళ్లి దాన్ని ఢీకొంటుంది. ► తద్వారా డైమోర్ఫస్ తాలూకు వేగాన్ని కాస్త తగ్గించి దాని కక్ష్యలో కొద్దిగా మార్చడం ఈ ప్రయోగం ప్రధానోద్దేశం! ► డైమోర్ఫస్ కక్ష్యలో చోటుచేసుకునే మార్పును శక్తిమంతమైన టెలిస్కోపుల ద్వారా పరిశీలిస్తారు. ► డైమోర్ఫస్ ప్రస్తుతం డిడిమోస్ గ్రహశకలం చుట్టూ 11 గంటల 55 సెకన్లకు ఒకసారి చొప్పున తిరుగుతోంది. ► డార్ట్‌క్రాఫ్ట్ ఢీకొట్టి ఆ వేగంలో కనీసం 73 సెకన్ల మార్పయినా వస్తే ప్రయోగం సక్సెస్ అయినట్టు. లాభమేమిటి? ► భూమిని ఢీకొట్టగల గ్రహశకలాల వంటివాటిని ముందే గుర్తించే పరిజ్ఞానం ఇప్పటికే మనకు అందుబాటులో ఉంది. ఈ ప్రయోగం గనుక విజయవంతమైతే అలాంటి వాటిని ముందే ఏ డార్ట్క్రాఫ్ట్తోనో ఢీకొట్టించడం ద్వారా వాటి ప్రయాణ మార్గాన్ని మార్చవచ్చు. తద్వారా భూమి అంతరించిపోగల పెను ప్రమాదాన్ని తప్పించవచ్చు. ► నాసా నిర్వచనం ప్రకారం 460 అడుగుల కంటే పెద్దదైన అంతరిక్ష శకలం ఏదైనా భూమికి 46 లక్షల మైళ్ల కంటే సమీపానికి వస్తే దానితో భూమికి డేంజరని భావిస్తారు. ► భూమికి సమీపంలో ఇప్పటిదాకా 27 వేలకు పైగా గ్రహశకలాలను గుర్తించారు. కానీ ప్రస్తుతానికైతే వీటిలో మనకు ప్రమాదకరమైనవి లేవు. ► చివరగా, ఈ ప్రయోగంతో భూమికి వచ్చిన ముప్పేమీ లేదని నాసా భరోసా ఇస్తోంది! – సాక్షి, నేషనల్‌డెస్క్ -
ఇంజిన్‌లో సాంకేతిక సమస్య.. ఆర్టెమిస్ ప్రయోగం వాయిదా
కేప్ కెనావెరాల్: చంద్రుడిపైకి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ చేపట్టిన ఆర్టెమిస్–1 ప్రయోగం సోమవారం వాయిదా పడింది. ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో మూన్ మిషన్‌ను నిలిపివేస్తున్నట్లు నాసా ప్రకటించింది. ఇంజిన్ నుంచి ఇంధనం లీక్ అయినట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం కౌంట్‌డౌన్ ప్రారంభమైనప్పటికీ చివరి గంటలో నాసా శాస్త్రవేత్తలు ప్రయోగాన్ని నిలిపివేశారు. మళ్లీ ఎప్పుడు ప్రారంభిస్తారన్న విషయాన్ని వెల్లడించలేదు. సెప్టెంబర్ మొదటి వారంలో ఉండవచ్చని సమాచారం. ఆర్టెమిస్–1 ప్రయోగంలో భాగంగా రాకెట్లో 10 లక్షల గ్యాలన్ల అతిశీతల హైడ్రోజన్, ఆక్సిజన్ నింపాల్సి ఉంది. 4 ఇంజిన్లు ఉన్న ఈ రాకెట్లో ఒకదాంట్లో ఇంధనం లీక్ అవుతున్నట్లు గుర్తించారు. లాంచ్ప్యాడ్పై రాకెట్ ఉన్నచోట పిడుగు పడడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైనట్లు భావిస్తున్నారు. సమస్యను సరిదిద్దడానికి కొంత సమయం పట్టొచ్చు. 2024లో ఆర్టెమిస్–2, 2025లో ఆర్టెమిస్–3 ప్రయోగాలు చేపట్టేందుకు నాసా సన్నద్ధమవుతోంది. చందమామపైకి వ్యోమగాములను పంపించడమే కాదు, అక్కడ మానవుల శాశ్వత నివాసానికి పునాదులు వేయడమే ఈ ప్రయోగాల లక్ష్యం. -
సూర్యుడిపై ఇస్రో గురి: ‘ఆదిత్య ఎల్1’ ప్రయోగం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో), అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) సంయుక్తంగా సూర్యుడిపై పరిశోధనలు చేసేందుకు 2023 జనవరి నెలాఖరులోపు ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. 2018లోనే దీనిపై ఇస్రో, నాసా చర్చలు జరిపాయి. 2020లోనే ఈ ప్రయోగం చేయాల్సి ఉంది. కానీ కోవిడ్ వల్ల ఆలస్యమైంది. ఇప్పుడు మళ్లీ ఈ ప్రయోగం తెర పైకి వచ్చింది. దీనికి భారత ప్రభుత్వం నుంచి కూడా అనుమతి వచ్చింది. దీంతో 2023 జనవరిలో శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ–సీ56 రాకెట్ ద్వారా ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఇస్రో ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ విషయాన్ని షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ మీడియాకు వెల్లడించారు. మరో ఘనత దిశగా.. బెంగళూరులోని యు.ఆర్.రావు స్పేస్ సెంటర్లో ఈ ఉపగ్రహాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే చంద్రుడిపై పరిశోధనలకు చంద్రయాన్–1, చంద్రయాన్–2, అంగారకుడిపై పరిశోధనలకు మంగళ్యాన్–1 అనే మూడు ప్రయోగాలను అతి తక్కువ వ్యయంతో మొదటి ప్రయత్నంలోనే ప్రయోగించి ఇస్రో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. ఇదే క్రమంలో ఇప్పుడు సూర్యుడి పైకి ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగించబోతున్నారు. ఈ ఉపగ్రహం 1,475 కిలోల బరువు ఉంటుంది. ఇందులో పేలోడ్స్ బరువు 244 కిలోలు కాగా, ద్రవ ఇంధనం బరువు 1,231 కిలోలుంటుంది. సూర్యుడి వైపు తీసుకెళ్లడం కోసం ఎక్కువ ద్రవ ఇంధనాన్ని ఉపయోగిస్తున్నారు. తొలుత ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టిన తర్వాత.. ఉపగ్రహాన్ని భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రేంజియన్ బిందువు–1(ఎల్–1)లోకి చేరవేయడానికి 177 రోజుల సమయం పడుతుంది. అక్కడి నుంచి ఎలాంటి అడ్డంకులు లేకుండా సూర్యుడిపై మార్పులను నిరంతరం పరిశోధించేందుకు వీలవుతుందని అంచనా వేస్తున్నారు. ఉపగ్రహంలో ఆరు పేలోడ్స్ అమర్చి పంపిస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను అధ్యయనం చేసేందుకు.. సూర్యుడి వెలుపలి వలయాన్ని కరోనా అంటారు. సౌర గోళానికి వేల కిలోమీటర్ల దూరం వరకు ఇది విస్తరించి ఉంటుంది. అక్కడ ఉష్ణోగ్రత దాదాపు పది లక్షల డిగ్రీల కెల్విన్ వరకు ఉంటుంది. సూర్యుడి అంతర్భాగ ఉష్ణోగ్రత ఆరు వేల కెల్విన్ డిగ్రీల వరకు ఉంటుంది. కరోనాలో వేడి పెరిగిపోతుండడానికి కారణం అంతు చిక్కడం లేదు. దీనిపైన ఆదిత్య–ఎల్1 ద్వారా పరిశోధనలు చేయనున్నారు. అలాగే సౌర తుపాన్ సమయంలో భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని అంచనా వేశారు. ఈ ప్రయోగం ద్వారా ఫొటో స్పియర్, క్రోమో స్పియర్లపై అధ్యయనం చేసి సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. -
ISRO: మరో ప్రయోగానికి ఇస్రో రెడీ..
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): సూళ్లూరుపేటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ మొదటి ప్రయోగ వేదిక నుంచి ఆదివారం ఉదయం 9.18 గంటలకు స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్(ఎస్ఎస్ఎల్వీ డీ1)ను ప్రయోగించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. ప్రయోగాన్ని 13.2 నిమిషాల్లోనే పూర్తి చేయనున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు మిషన్ సంసిద్ధత సమావేశం నిర్వహించి ప్రయోగ తేదీని అధికారికంగా ప్రకటిస్తారు. ల్యాబ్ చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో రాకెట్‌కు తుది విడత తనిఖీలు నిర్వహించి ప్రయోగానికి 7 గంటల ముందు.. అంటే ఆదివారం రాత్రి 2.18 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభిస్తారు. ప్రయోగంలోని మూడు దశలను ఘన ఇంధనం సాయంతో నిర్వహించనున్నారు. చదవండి: టీచర్లకు గుడ్‌న్యూస్.. ప్రమోషన్లకు విద్యాశాఖ గ్రీన్‌సిగ్నల్! సమాచారం ఎప్పటికప్పుడు చేరవేసేలా.. చిన్నచిన్న ఉపగ్రహాలతో అంతరిక్షంలోకి దూసుకెళ్లేలా ఎస్ఎస్ఎల్వీ డీ1ను ఇస్రో రూపొందించింది. 34 మీటర్ల పొడవు, రెండు మీటర్ల వెడల్పు, 120 టన్నుల బరువు ఉండే ఈ రాకెట్ ద్వారా రెండు ఉపగ్రహాలను రోదసీలోకి పంపిస్తున్నారు. ఇందులో దేశ అవసరాలకు సంబంధించిన 135 కేజీల మైక్రోశాట్–2ఏ(ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్) ఉపగ్రహంతో పాటు దేశంలోని 75 జిల్లా పరిషత్ హైస్కూల్స్‌కు చెందిన 750 మంది గ్రామీణ విద్యార్థినులు తయారు చేసిన ‘ఆజాదీ శాట్’ను ప్రయోగిస్తున్నారు. 8 కిలోల ఆజాదీశాట్ ఉపగ్రహం ఇస్రో పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన భూ పరిశీలన ఉపగ్రహమే మైక్రోశాట్ 2ఏ. అధిక రిజల్యూషన్‌తో కూడిన ప్రయోగాత్మక ఆప్టికల్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం ఇది. ఈ ఉపగ్రహం భూమికి తక్కువ ఎత్తులో ఉండి అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో భూమి మీద ఉన్న వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి సమాచారాన్ని చేరవేస్తుంటుంది. విద్యార్థినులు తీర్చిదిద్దిన బుల్లి ఉపగ్రహం.. బుల్లి ఉపగ్రహమైన ఆజాదీ శాట్ బరువు 8 కేజీలు. ఇందులో 75 పే లోడ్స్‌ను ఏకీకృతం చేశారు. ఉష్ణోగ్రత సెన్సార్లు, రేడియేషన్ కౌంటర్లు, సోలార్ ప్యానల్ సహాయంతో ఫొటోలు తీయడానికి సెల్ఫీ కెమెరాలు, దీర్ఘ శ్రేణి కమ్యూనికేషన్ ట్రాన్స్పాండర్లు అమర్చారు. ఈ ఉపగ్రహం 6 నెలలు మాత్రమే సేవలందిస్తుంది. ఈ ఏడాదిని ‘అంతరిక్షంలో అతివ’గా పరిగణిస్తున్న నేపథ్యంలో ‘సైన్స్ అండ్ టెక్నాలజీ–ఇంజనీరింగ్ మ్యాథమేటిక్స్’లో మహిళలను ప్రోత్సహించేందుకు దీనిని మొదటి అంతరిక్ష మిషన్‌గా ప్రయోగిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు రిఫాత్ షరూక్ అనే మహిళ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా విద్యార్థులతో ఈ ఉపగ్రహాన్ని తయారు చేయించారు. -
స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ఎలాన్ మస్క్ బంపరాఫర్!
స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల విషయంలో మరో అడుగు ముందుకు వేశారు. స్టార్ లింక్ శాటిలైట్ సేవల్ని అందిస్తున్న మస్క్ ఇకపై అమెరికాకు చెందిన మొబైల్ యూజర్లకు శాటిలైట్ సాయంతో నేరుగా హై స్పీడ్ ఇంటర్నెట్ను వాడుకలోకి తేనున్నారు. మస్క్ ప్రపంచవ్యాప్తంగా 2,600కు పైగా స్టార్ లింక్ శాటిలైట్ల సాయంతో శాటిలైట్ ఇంటర్నెట్ను అందిస్తున్నారు. ఇప్పుడు మొబైల్స్‌లో సైతం శాటిలైట్ ఇంటర్నెట్ను అందించనున్నారు.మొబైల్ యూజర్లకు శాటిలైట్ సర్వీస్ అందిస్తామని, ఇందుకోసం 2జీహెచ్‌జెడ్ స్పెక్ట్రమ్‌ను ఉపయోగించేలా అనుమతి ఇవ్వాలని కోరుతూ యూఎస్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమీషన్ (ఎఫ్‌సీసీ)కి దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా ఎఫ్సీసీకి తమ సంస్థ మొబైల్ శాటిలైట్ సర్వీస్ ను సులభతరం చేయడానికి 2జీహెచ్‌జెడ్ రేడియో బ్యాండ్‌ని ఉపయోగించగల సామర్థ్యం ఉన్న స్టార్‌లింక్ ఉపగ్రహాలకు "మాడ్యులర్ పేలోడ్"ని జోడించేందుకు , ఉపయోగించేందుకు అనుమతిని కోరినట్ల స్పేస్ ఎక్స్ పేర్కొంది. తద్వారా అమెరికన్లు ఎప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ హై స్పీడ్ ఇంటర్నెట్ను వినియోగించుకోవచ్చు' అని స్పేస్ ఎక్స్ తన ఎఫ్‌సీసీ ఫైలింగ్‌లో నివేదించింది. -
యూటెల్శాట్తో వన్‌వెబ్ విలీనం
న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌కి చెందిన ఉపగ్రహాల ఆపరేటర్ యూటెల్‌శాట్, కమ్యూనికేషన్స్ నెట్వర్క్ వన్‌వెబ్ విలీనం కానున్నాయి. ఇందుకు సంబంధించి ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ డీల్ పూర్తిగా షేర్ల మార్పిడి రూపంలో ఉండనుంది. ఇరు సంస్థల సంయుక్త ప్రకటన ప్రకారం వన్‌వెబ్ విలువను 3.4 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ. 27,000 కోట్లు) లెక్కకట్టారు. ప్రస్తుతం వన్‌వెబ్‌లో కీలక భాగస్వామి అయిన దేశీ టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్ .. డీల్ పూర్తయిన తర్వత యూటెల్‌శాట్‌లో అతి పెద్ద వాటాదారుగా ఉండనుంది. విలీన సంస్థకు ఎయిర్టెల్ చీఫ్ సునీల్ భారతి మిట్టల్ కో–చైర్మన్‌గాను, ఆయన కుమారుడు శ్రావిన్ భారతి మిట్టల్ .. డైరెక్టరుగా ఉంటారు. యూటెల్‌శాట్ ప్రస్తుత చైర్మన్ డొమినిక్ డి హినిన్ .. విలీన సంస్థకు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. డీల్ ప్రకారం వన్‌వెబ్ షేర్హోల్డర్లకు యూటెల్‌శాట్ కొత్తగా 23 కోట్ల షేర్లను జారీ చేస్తుంది. తద్వారా పెరిగిన షేర్ క్యాపిటల్‌లో ఇరు సంస్థల షేర్‌హోల్డర్ల వాటా చెరి 50 శాతంగా ఉండనుంది. వన్‌వెబ్‌లో 100 శాతం వాటాలు యూటెల్‌శాట్‌కు దఖలుపడతాయి. 2023 ప్రథమార్ధంలో ఈ డీల్ పూర్తి కావచ్చని అంచనా. యూటెల్‌శాట్‌కు 36 జియోస్టేషనరీ ఆర్బిట్ (జియో) ఉపగ్రహాలు ఉండగా, వన్‌వెబ్‌కు 648 లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్లు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే 428 ఉపగ్రహాలు కక్ష్యలో ఉన్నాయి. -
శాటిలైట్ సర్వీసుల కోసం 27.5 గిగాహెట్జ్ స్పెక్ట్రం!
త్వరలో నిర్వహించబోయే వేలంలో 27.5–28.5 గిగాహెట్జ్ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రంను ప్రభుత్వం విక్రయించకపోవచ్చని తెలుస్తోంది. దీన్ని శాటిలైట్ సర్వీసుల (టీవీ,రేడియో, ఇంటర్నెట్) కోసం పక్కన పెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఫ్రీక్వెన్సీని మొబైల్, శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు కూడా ఉపయోగించుకోవచ్చని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ కేంద్రానికి సూచించింది. అయితే, 5జీ, శాటిలైట్ ట్రాన్స్మిటర్లు పక్కపక్కనే పని చేయడం కుదరదని, ఫలితంగా ఒకే ఫ్రీక్వెన్సీని రెండు రకాల సర్వీసుల కోసం షేర్ చేసుకోవడం కష్టంగా ఉంటుందని టెలికం శాఖ భావిస్తున్నట్లు ఇద్దరు అధికారులు తెలిపారు. అయితే, ఇవన్నీ వదంతులేనని టెలికం శాఖ వర్గాలు కొట్టిపారేశాయి. దీనిపై డిపార్ట్మెంట్లో పలు అభిప్రాయాలు ఉన్నాయని, ఇంకా తుది నిర్ణయమేదీ తీసుకోలేదని వివరించాయి. 5జీ తదితర సేవల కోసం వివిధ ఫ్రీక్వెన్సీల్లోని స్పెక్ట్రంను దాదాపు 7.5 లక్షల కోట్లకు వేలం వేయవచ్చంటూ ట్రాయ్ సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. అయితే, స్పెక్ట్రం ధర చాలా ఎక్కువగా ఉందంటూ టెల్కోలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. -
రష్యా దూకుడు: నేల మీదే కాదు, నింగిలో కూడా.. తగ్గేదేలే!
ఉక్రెయిన్ రష్యా యుద్ధం భూమ్మీదే కాదు.. అంతరిక్షంలోనూ ప్రభావం చూపిస్తోంది. తమపై ఆంక్షలు విధించిన దేశాలపై ప్రతీకారానికి దిగిన రష్యా.. వన్‌వెబ్ శాటిలైట్ ప్రాజెక్ట్‌ను అర్థాంతరంగా నిలిపేస్తున్నట్టు ప్రకటించింది. అసలేంటీ ప్రాజెక్ట్..? రష్యా చర్యతో ఎవరికి నష్టం..?. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వన్‌వెబ్ సంస్థను కష్టాల్లోకి నెట్టింది. ఇంటర్నెట్ ప్రసార ఉపగ్రహాల ప్రయోగాన్ని రష్యా నిలిపివేసింది. రష్యా నిర్మించిన సోయజ్ రాకెట్ ద్వారా శుక్రవారం 36 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపాల్సి ఉంది. కజకిస్థాన్‌లో రష్యాకు చెందిన బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి ఈ ప్రయోగం జరగాలి. అయితే తమ దేశంపై బ్రిటన్ విధించిన ఆంక్షలకు ప్రతిగా.. వన్బెబ్ ఉపగ్రహాల ప్రయోగానికి నిరాకరిస్తామని రష్యా స్పేస్ ఏజెన్సీ డైరెక్టర్ దిమిత్రి రోగోజిన్ ప్రకటించారు. ఉపగ్రహాల నుంచి నేరుగా ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఉద్దేశించినదే వన్‌వెబ్ ప్రాజెక్ట్. ఇందుకోసం తొలి దశలో 150 కిలోల బరువున్న 648 ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. ఇప్పటికే 428 ఉపగ్రహాలు కక్ష్యను చేరుకొన్నాయి. రెండో దశలో దాదాపు 1900కి పైగా ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. ఈ ఉపగ్రహాలను ఫ్లోరిడాలోని ఒక కంపెనీ తయారు చేస్తోంది. ఫ్రాన్స్‌కు చెందిన ఏరియన్ స్పేస్ కంపెనీ రష్యా సోయజ్ రాకెట్ల సాయంతో వీటిని అంతరిక్షంలోకి చేరుస్తోంది. ఆంక్షల నేపథ్యంలో ఇప్పుడీ ప్రాజెక్ట్‌కు రష్యా అడ్డుపుల్ల వేసింది. లండన్ కేంద్రంగా పనిచేసే వన్‌వెబ్ కంపెనీలో.. భారత్‌కు చెందిన భారతీ ఎంటర్ప్రైజెస్ 42.2శాతం వాటా కొనుగోలు చేసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సహకారం ఉపసంహరించుకొంటామని ఇప్పటికే రష్యా బెదిరింపులకు దిగింది. ఐఎస్ఎస్ నిర్వహణలో రష్యా తమ సహకారాన్ని ఉపసంహరించుకుంటే.. యూఎస్, ఇతర దేశాలు దానిని నియంత్రించలేవని గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. తాజాగా ఉపగ్రహ ప్రయోగాలకూ మోకాలడ్డుతోంది. అంతేకాదు వన్‌వెబ్ రాకెట్‌పై నుంచి అమెరికా, బ్రిటన్, జపాన్ జాతీయ జెండాలను రష్యా తొలగించింది. భారత జాతీయ జెండాను మాత్రమే రాకెట్‌పై ఉంచింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ రష్యా యుద్ధం అంతరిక్షంపైనా ప్రభావం చూపిస్తోందని టెక్నాలజీ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
పీఎస్ఎల్వీ– సీ53 ప్రయోగానికి ‘షార్’ సిద్ధం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ ఏడాదిలో రెండో ప్రయోగానికి సిద్ధమవుతోంది. కరోనా పూర్తిగా తగ్గుతున్న నేపథ్యంలో ప్రయోగాల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్ మొదటి వారంలో పీఎస్ఎల్వీ–సీ53 ప్రయోగం ఉండే అవకాశం ఉంటుందని సమాచారం. ఈ ప్రయోగంలో ఈవోఎస్ (అకా ఓషన్‌శాట్–3) అనే ఉపగ్రహంతో పాటు మరో 5 చిన్న ఉపగ్రహాలను పంపనున్నారు. ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తోన్న స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ) ప్రయోగాన్ని మార్చి 15న ప్రయోగాత్మకంగా నిర్వహించి నిర్థారించుకున్న తరువాత మార్చి 25 నుంచి 31 లోపు ఎస్ఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాన్ని కూడా చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. -
రోదసిలోకి భూ పరిశీలన ఉపగ్రహం
సూళ్లూరుపేట: భూ పరిశీలన ఉపగ్రహం రాడర్ ఇమేజింగ్ శాటిలైట్ (ఈఓఎస్–4)ను ఇస్రో సోమవారం రోదసిలోకి ప్రవేశపెట్టనుంది. పీఎస్ఎల్వీ – సి 52 ద్వారా 1710 కిలోల బరువు కలిగిన ఈఓఎస్–4తో పాటు భారత దేశంలోని ఐఐటీ కళాశాల విద్యార్థులు తయారు చేసిన రెండు చిన్న ఉపగ్రహాల (ఇన్స్పైర్ శాట్–1, ఐఎన్ఎస్–2టీడీ)ను కూడా రోదసీలోకి పంపుతున్నారు. శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి సోమవారం ఉదయం 5.59 గంటలకు పీఎస్ఎల్వీ–సి 52ను ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించనున్నారు. షార్‌లోని బ్రహ్మప్రకాష్ హాలులో శనివారం ఎంఆర్ఆర్ (మిషన్ రెడీనెస్ రెవ్యూ) సమావే శం నిర్వహించారు. రాకెట్‌కు అన్ని పరీక్షలు నిర్వహించి ప్రయోగాన్ని లాంచ్ ఆథరైజేషన్ బోర్డు చైర్మన్ రాజరాజన్‌కు అప్పగించారు. ఆయన ఇతర శాస్త్రవేత్తలతో లాంచ్ సమావేశం నిర్వహించి ముందుగా నిర్ణయించిన ప్రకారమే ఆదివారం ఉదయం 4.29 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 25.35 గంటల కౌంట్‌డౌన్ అనంతరం సోమవారం ఉదయం 5.59 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్తుంది. ఉపగ్రహాలను 529 కిలోమీటర్ల ఎత్తులోని సన్ సింక్రసన్ కక్ష్యలో ప్రవేశపెడుతుంది. ఈఓఎస్–4 ఉపగ్రహం వ్యవసాయం, అటవీ ప్లాంటేషన్, భూమిపై జరిగే మార్పులు, వరదలు, వాతావరణం వంటి అనువర్తనాల కోసం అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ అత్యంత నాణ్యమైన ఛాయా చిత్రాల ద్వారా సమాచారాన్ని అందిస్తుంది. శ్రీవారి వద్ద పీఎస్ఎల్వీ – సి52 నమూనాకు ప్రత్యేక పూజలు తిరుమల: పీఎస్ఎల్వీ – సి52 నమూనాకు శనివారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నమూనాను ఇస్రో శాస్త్రవేత్తల బృందం తిరుమలకు తీసుకువచ్చింది. వారికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. నమూనాను శ్రీవారి మూల విరాట్ పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. మరిన్ని ప్రయోగాలకు సిద్ధం: – ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుండటంతో మరిన్ని ప్రయోగాలకు సిద్ధమవుతున్నామని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. చంద్రయాన్–3, గగన్‌యాన్–1కు సంబంధించి పలు ప్రయోగాత్మక పరీక్షలు చేపడతామన్నారు. పీఎస్ఎల్వీ– సి 52 ప్రయోగం విజయవంతం కావాలని శనివారం సాయంత్రం సూళ్లూరుపేట చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం ఆయన విలేకరుతో మాట్లాడుతూ గత రెండేళ్లుగా కరోనా కారణంగా ప్రయోగాలకు అంతరాయం కలిగిందన్నారు. ఇస్రో చైర్మన్‌గా తనకు ఇది తొలి ప్రయోగం కావడంతో విజయవంతం కావాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ దేశంలో ఉన్న సామాన్యుడికి కూడా దీర్ఘకాలిక సేవలందిస్తుందని తెలిపారు. పీఎస్ఎల్వీ సీ–53 ప్రయోగానికి కూడా సిద్ధమవుతున్నామని తెలిపారు. ఆయన వెంట షార్ అధికారి గోపీకృష్ణ తదితరులు ఉన్నారు. -
పీఎస్ఎల్వీ సీ53 అనుసంధాన పనులు ప్రారంభం
సూళ్లూరుపేట: నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి పీఎస్ఎల్వీ సీ53 ప్రయోగం నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. షార్‌లోని మొదటి ప్రయోగ వేదికపై రాకెట్ అనుసంధాన పనులు ప్రారంభమయ్యాయి. రెండు, మూడుదశల పరీక్షలు జరుగు తున్నాయి. ఈ నెల 20న ఈ ప్రయోగాన్ని నిర్వహిం చాలని నిర్ణయించారు. అయితే ఉపగ్రహం రావడంలో జాప్యం జరిగితే ప్రయోగం ఫిబ్రవరికి వాయిదా పడే అవకాశముందని సమాచారం. పీఎస్ఎల్వీ సీ53 ద్వారా ఈఓఎస్–6(ఓషన్‌శాట్–3) అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించనున్నారు. -
ఏంటీ.. ఈ టెక్నాలజీతో రేపు ఏం జరుగుతుందో తెసుకోవచ్చా!
గతంలో ఏం జరిగింది. ప్రజెంట్ ఏం జరుగుతుందో అందరికి తెలిసిందే. అదే భవిష్యత్ లో ఖచ్చితంగా ఏం జరుగుతుందో ముందే తెలుసుకుంటే ఎలా ఉంటుంది?! ఇది కొంచెం కష్టమే అయినా దాన్ని సుసాధ్యం చేసేందుకు అమెరికా పావులు కదుపుతోంది. టెక్నాలజీని ఉపయోగించి భవిష్యత్‌లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్ ప్రయోగాలు చేస్తోంది. గ్లోబల్ ఇన్ఫర్మేషన్ డామినాన్స్ ఎక్స్పెరిమెంట్స్ యుద్ధాలు జరిగే సమయంలో సైలెంట్ గా ఉండకుండా శుత్రు దేశాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఎలాంటి వ్యూహరచనలు చేస్తున్నాయి. ఇలా తదితర అంశాల గురించి తెలుసుకునేందుకు రక్షణ సంస్థ పెంటగాన్ మోడ్రన్ టెక్నాలజీ, శాటిలైట్స్, నెట్వర్క్స్ లను వినియోగించుకుంటున్నాయి. తద్వారా మిగిలిన దేశాలకంటే తామే ముందజలో ఉండాలనేది తాపత్రయం. ఇందులో భాగంగా గ్లోబల్ ఇన్ఫర్మేషన్ డామినాన్స్ ఎక్స్పెరిమెంట్స్ (gide) అనే పేరుతో ప్రయోగాలు ప్రారంభించింది. శాటిలైట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రాడార్ల నుంచి రోజూ వచ్చే డేటాను తీసుకొని ప్రపంచం నలుమూలలా ఏం జరుగుతుందో వేగంగా కనిపెట్టేస్తుంది. టెక్నాలజీ ద్వారా వచ్చే డేటా పర్ఫెక్ట్గా ఉంటుందని, దేశం మరో దేశంపై యుద్ధానికి రెడీ అవుతుంటే ఆ వివరాల్ని అమెరికా టెక్నాలజీ గైడ్‌కి చేరవేస్తుంది. తద్వారా యుద్ధం ఎక్కడ జరుగుతుందో అమెరికా ముందే కనిపెట్టేస్తుంది. ఆ తర్వాత అంతా తన కంట్రోల్లోకి తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. -
శాటిలైట్ ఇమేజింగ్‌తో సరిహద్దుల నిర్ణయం
న్యూఢిల్లీ/గువాహటి/ఐజ్వాల్: ఈశాన్య రాష్ట్రాల మధ్య తరచూ తలెత్తుతున్న సరిహద్దు వివాదాలు, ఒక్కోసారి అవి హింసాత్మక రూపంగా మారుతుండటంపై కేంద్రం తీవ్ర ఆందోళన చెందుతోంది. ఇటువంటి పరిణామాలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు ఆయా రాష్ట్రాల హద్దులను శాటిలైట్ ఇమేజింగ్ సాయంతో నిర్ణయించనుంది. ఈ బాధ్యతను నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్(ఎన్ఈఎస్ఏసీ, నెశాక్)కి అప్పగించినట్లు కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు వెల్లడించారు. రాష్ట్రాల సరిహద్దులను శాటిలైట్ ఇమేజింగ్ ద్వారా శాస్త్రీయంగా ఖరారు చేయాలన్న ఆలోచనను హోంమంత్రి అమిత్ షా కొన్ని నెలల క్రితం తెరపైకి తెచ్చారని ఆ అధికారులన్నారు. శాస్త్రీయంగా చేపట్టే సరిహద్దుల విభజన కచ్చితత్వంతో ఉంటుందనీ, దీని ఆధారంగా చూపే పరిష్కారం రాష్ట్రాలకు ఎక్కువ ఆమోదయోగ్యంగా ఉంటుందని ఆ అధికారులు పేర్కొన్నారు. నెశాక్ నుంచి అందే శాటిలైట్ మ్యాపింగ్ ప్రకారం ఈశాన్య రాష్ట్రాల సరిహద్దుల నిర్ణయం జరుగుతుందనీ, ఈ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం లభిస్తుందని వారు చెప్పారు. అస్సాం, మిజోరం సరిహద్దుల్లో జూలై 26వ తేదీన జరిగిన ఘర్షణల్లో ఇటీవల ఐదుగురు అస్సాంకు చెందిన పోలీసులు ప్రాణాలు కోల్పోగా, 60 మంది వరకు గాయపడటంతో ఈ ప్రాంత రాష్ట్రాల మధ్య సరిహద్దు పంచాయితీలు మరోసారి తెరపైకి వచ్చాయి. నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్(ఎన్ఈసీ), కేంద్ర ప్రభుత్వ అంతరిక్ష శాఖ సంయుక్త ఆధ్వర్యంలో షిల్లాంగ్ కేంద్రంగా పనిచేస్తున్న నెశాక్ ప్రస్తుతం ఈశాన్య ప్రాంతంలో వరద హెచ్చరికలు జారీ చేస్తోంది. ప్రభుత్వాలు ఈ ప్రాంతంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు కూడా నెశాక్ సాంకేతిక సాయాన్ని అందజేస్తోంది. కాగా, 1875లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఆధారంగా సరిహద్దుల్లోని రిజర్వు ఫారెస్టులో ఉన్న 509 చదరపు మైళ్ల ప్రాంతం తమదేనని మిజోరం వాదిస్తుండగా, అదేం కాదు, 1993లో నిర్ణయించిన ప్రస్తుత సరిహద్దునే గుర్తిస్తామని అస్సాం చెబుతోంది. ఇద్దరు సీఎంలతో మాట్లాడిన అమిత్ షా అస్సాం, మిజోరం రాష్ట్రాల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హిమంత బిశ్వ శర్మ, జొరంతంగాలతో ఫోన్లో మాట్లాడారు. సమస్యకు అర్థవంతమైన, ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలని ఈ సందర్భంగా నిర్ణయించినట్లు అనంతరం జొరంతంగా ట్విట్టర్లో వెల్లడించారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేయవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇలా ఉండగా, జూలై 26వ తేదీన జరిగిన ఘర్షణలకు సంబంధించి అస్సాం సీఎం హిమంతపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకునే అవకాశముందని మిజోరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లాల్నున్మావియా చువాంగో వెల్లడించారు. ఈ విషయమై అధికారులతో చర్చిస్తామన్నారు. అరెస్టుకయినా సిద్ధం: సీఎం హిమంత సరిహద్దు ఘర్షణలపై నోటీసులు అందితే మిజోరం పోలీసుల ఎదుట విచారణకు హాజరవుతారని అస్సాం సీఎం హిమంత చెప్పారు. అరెస్టయినా అవుతాను గానీ, తనతోపాటు కేసులు నమోదైన రాష్ట్ర అధికారులను మాత్రం విచారణకు పంపేది లేదన్నారు. అరెస్టును తప్పించుకునేందుకు కోర్టు నుంచి బెయిల్ కూడా కోరనన్నారు. చర్చలే సమస్యకు పరిష్కారమని హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. ఈశాన్య ప్రాంత స్ఫూర్తిని సజీవంగా ఉంచటమే తమ ప్రధాన ధ్యేయమని అన్నారు. -
ఎట్టకేలకు తిరిగి ప్రారంభంకానున్న ఇస్రో ప్రయోగం..!
బెంగుళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది.ఆగస్టు 12 న జిఎస్ఎల్వి-ఎఫ్ 10 రాకెట్ ద్వారా జియో ఇమేజింగ్ ఉపగ్రహం జిశాట్ -1 కక్ష్యలోకి ప్రవేశపెట్టాలని ఇస్రో భావిస్తోంది. ఈ ప్రయోగం 2021 వ సంవత్పరంలో ఇస్రో జరపబోయే రెండో ప్రయోగం. బ్రెజిల్‌కు చెందిన ఎర్త్ ఆబ్సర్వేషన్ శాటిలైట్ అమెజోనియా -1తో పాటుగా మరో 18 శాటిలైట్లను పీఎస్ఎల్వీ- సీ51 రాకెట్ తో ఫిబ్రవరి 28 రోజున ప్రయోగించింది. ఈ ప్రయోగంలో కొంతమంది విద్యార్థులు తయారుచేసిన శాటిలైట్లు కూడా ఉన్నాయి. 2,268 కిలోల బరువున్న జిశాట్-1 ఉపగ్రహాన్ని గత ఏడాది మార్చి 5 న ప్రయోగించాలని నిర్ణయించినప్పటికీ సాంకేతిక కారణాలతో ప్రయోగాన్ని నిలిపివేశారు. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభించడంతో జీశాట్-1 ప్రయోగం ఆలస్యమైంది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఆగస్టు 12 న ఉదయం 05.43 గంటలకు జీఎస్ఎల్వి-ఎఫ్ 10 లాంచ్ వెహికిల్తో జీశాట్-1ను ప్రయోగిస్తామని ఇస్రో అధికారులు శనివారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు. GISAT-1 ప్రయోగంతో భారత ఉపఖండ పరిశీలనకు దోహదపడుతుందని తెలిపారు. GISAT-1 ను GSLV-F10 రాకెట్‌తో జియోసింక్రోనస్ కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ఉపగ్రహం దేశ సరిహద్దుల రియల్ టైం చిత్రాలను అందిస్తోంది. అంతేకాకుండా ప్రకృతి వైపరీత్యాలను త్వరగా పర్యవేక్షించటానికి వీలు కల్పిస్తుంది. ఆన్‌బోర్డ్ హై రిజల్యూషన్ కెమెరాలతో, భారతీయ భూభాగం, మహాసముద్రాలను, ముఖ్యంగా దాని సరిహద్దులను నిరంతరం పర్యవేక్షించడానికి ఈ ఉపగ్రహం ఉపయోగపడుతోందని ఇస్రో అధికారులు పేర్కొన్నారు. -
అర్థరాత్రి ఆకాశంలో వింత కాంతి.. ఆందోళనలో జనాలు
గాంధీనగర్: గుజరాత్ జునాగఢ్‌లో రాత్రి, ఆకాశంలో మెరుస్తున్న ప్రకాశవంతమైన లైట్ల వరుసలు జనాలను భయభ్రాంతులకు గురి చేశాయి. జనాలు వీటిని యూఎఫ్ఓలు అని అనుమానించి.. తీవ్రంగా కంగారు పడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. వీటిలో, సుమారు నాలుగు నుంచి ఏడు ప్రకాశవంతమైన మెరిసే లైట్లు ఒకదాని వెంట లైన్‌గా పయనించడం గమనించవచ్చు. ఈ సందర్భంగా గుజరాత్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (గుజ్కోస్ట్) సలహాదారు నరోత్తం సాహూ మాట్లాడుతూ.. ‘‘అసహజమైన కాంతి దృశ్యాలను జనాలు యూఎఫ్ఓలుగా భావిస్తున్నారు. కానీ ఇది నిజం కాదు.. ఇవి శాటిలైట్లు. భూమికి తక్కువ ఎత్తులో పయనించే ఈ శాటిలైట్లు ఇలా కనిపించి జనాలను భయభ్రాంతులకు గురి చేశాయి తప్పి ఇవి యూఎఫ్ఓలు కాదు’’ అన్నారు. "సౌరాష్ట్ర ప్రాంతంలో జనాలు జూన్ 22 తెల్లవారుజామన ఆకాశంలో అనుమానాస్పద రీతిలో 30-40 కాంతి పుంజాలు సరళ రేఖలో పయనించడం గమనించారు. జనాల్లో గూడు కట్టుకున్న సందేహాలు, మూఢనమ్మకాల వల్ల వీటిని యూఎఫ్ఓలుగా భావించారు. అయితే, అంతరిక్ష శాస్త్రం ప్రకారం, ఇటువంటి కాంతి మూడు సందర్భాలలో కనిపిస్తుంది. ఒక ఉల్కకు సంబంధించిన చిన్న భాగం భూమి ఉపరితలంలోకి ప్రవేశించినప్పుడు ఇలా కాంతి కనిపిస్తుంది. దీన్ని షూటింగ్ స్టార్’’ అంటారు అని గుజ్కోస్ట్ సలహాదారు సాహు తెలిపారు. UFOs again in #Rajkot? Even few months back these types of lights were seen in many cities of #Gujarat pic.twitter.com/v5GokrUpVC — Divyesh Trivedi (@DivyeshTrivedi_) June 21, 2021 "కానీ, ఇక్కడ కనిపించిన ఈ ప్రత్యేక దృశ్యంలో ఎక్కువ లైట్లు కనిపించాయి. దీనికి కారణం భూమికి తక్కువ ఎత్తు కక్ష్యలో పయనించే ఉపగ్రహాలు అయి ఉంటాయి. ప్రస్తుతం భూమి దిగువ కక్ష్యలో 3000 కి పైగా ఉపగ్రహాలు పనిచేస్తున్నాయి" అని తెలిపారు. ఎలోన్ మస్క్ స్పేస్ఎక్స్ ఫాల్కన్ రాకెట్‌ను ప్రయోగించినప్పుడు అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఇలా లైట్లు కనిపించాయని సాహూ తెలిపారు. ఈ లైట్లు కచ్చితంగా ఉపగ్రహాలే. వీటి గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అన్నారు. చదవండి: అమెరికన్ యుద్ధ నౌకను చుట్టుముట్టిన యూఎఫ్ఓలు -
SpaceX Starlink: ఇంటర్నెట్ షట్‌డౌన్.. సింపుల్‌గా పరిష్కరించిన యువకుడు..!
వాషింగ్టన్: మమూలుగా మన దగ్గర ఉండే ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ బాగా వేడెక్కితే ఏం చేస్తాం. కొద్ది సేపు వాటిని ఆఫ్ చేసి తిరిగి మళ్లీ ఆన్ చేస్తాం. ఆరిజోనాకు చెందిన యువకుడు మాత్రం అసాధారణ పద్దతి ఉపయోగించి తిరిగి ఇంటర్నెట్ వచ్చేలా చేశాడు. వివరాలోకి వెళ్లేే.. ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ స్టార్‌లింక్‌తో అమెరికాలో ఇంటర్నెట్ను ప్రవేశపెట్టింది. భూమిపై ఏర్పాటుచేసిన డిష్ ఆంటెన్నాతో యూజర్లు ఇంటర్నెట్ సేవలను పొందుతారు. కాగా అప్పుడప్పుడు డిష్ ఆంటెన్నాలు ఎక్కువగా వేడెక్కడంతో ఇంటర్నెట్ సేవలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. ఈ విషయాన్ని స్టార్‌లింక్ తన వినియోగదారులకు ముందుగానే తెలిపింది. డిష్ ఆంటెన్నాలు తిరిగి కూల్ డౌన్ అయ్యే వరకు ఇంటర్నెట్ సేవలను పొందలేరని పేర్కొంది స్టార్‌లింక్. ప్రస్తుతం అమెరికాలోని ఆరిజోనా స్టేట్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈ ప్రాంతంలో సుమారు 44 డిగ్రీల నుంచి 55 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వడంతో ఆరిజోనాలో ఇంటర్నెట్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. కాగా ఈ సమస్య ఆరిజోనాకు చెందిన యువకుడికి రావడంతో స్టార్‌లింక్ కస్టమర్ సర్వీస్‌ను సంప్రదించడంతో కంపెనీ ముందుగానే చెప్పిన విషయానే చెప్పింది. దీంతో విసుగు చెందిన యువకుడు ఇంటర్నెట్ డిష్‌పై నీళ్లను స్ప్రే చేశాడు. వాటర్ పోయడంతో డిష్ ఆంటెన్నా త్వరగా కూల్ డౌన్ అయ్యింది. తిరిగి ఇంటర్నెట్ సేవలను అతడు పొందగల్గిగాడు. ప్రస్తుతం ఈ చర్య చర్చనీయాంశంగా మారింది. ఇకపై ఇంటర్నెట్ షట్‌డౌన్ అవ్వకుండా ఉండాలంటే డిష్ ఆంటెన్నాపై ఒక చిన్న ఫౌంటెన్‌ను ఏర్పాటు చేస్తే అసలు అంతరాయం ఉండదని ఓ నెటిజన్ వ్యంగ్యంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. చదవండి: జెఫ్ బెజోస్ సంచలన నిర్ణయం.. నాసాపై.. -
భారత్‌లో శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్! రంగంలోకి అమెజాన్...
న్యూఢిల్లీ: అత్యంత వేగవంతమైన ఉపగ్రహ ఇంటర్నెట్ సర్వీసులను భారత్‌లో అందుబాటులోకి తేవడంపై ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించిన విధివిధానాలు, అనుమతులపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వంతో భేటీ అయ్యే యోచనలో కంపెనీ ఉన్నట్లు సమాచారం. ల్యాండింగ్ హక్కులు, శాటిలైట్ బ్యాండ్‌విడ్త్ లీజింగ్ వ్యయాలు తదితర అంశాలపై డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ (డీవోఎస్), టెలికం శాఖ (డాట్)లతో సమావేశాల్లో చర్చించే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. క్విపర్ పేరిట చేపట్టిన శాటిలైట్ ఇంటర్నెట్ ప్రాజెక్టులో భాగంగా 3,236 పైచిలుకు ’లో ఎర్త్ ఆర్బిట్’ (ఎల్ఈవో) ఉపగ్రహాలపై అమెజాన్ దాదాపు 10 బిలియన్ డాలర్లు వెచ్చిస్తోంది. వీటి ద్వారా అంతర్జాతీయంగా ఈ తరహా వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తేవాలని యోచిస్తోంది. అయితే, అధికారికంగా ఇప్పటిదాకా భారత్ ప్రణాళికలను మాత్రం కంపెనీ వెల్లడించలేదు. కీలక మార్కెట్‌గా భారత్.. గణాంకాల ప్రకారం దేశీయంగా దాదాపు 75 శాతం మంది గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు అందుబాటులో లేవు. చాలా మటుకు ప్రాంతాలకు సెల్యులార్ లేదా ఫైబర్ కనెక్టివిటీ లేకపోవడమే ఇందుకు కారణం. దీంతో ఎల్ఈవో శాటిలైట్ సిస్టమ్స్ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించే సంస్థలకు భారత మార్కెట్లో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు తెలిపారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని లక్షల మందికి ఈ తరహా సేవలు అందించడం ద్వారా సమీప భవిష్యత్తులో దాదాపు 500 మిలియన్ డాలర్ల మేర ఆదాయాల ఆర్జనకు అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారత మార్కెట్‌ను అమెజా న్ పక్కన పెట్టే పరిస్థితి ఉండబోదని తెలిపారు. ఒంటరిగానా లేదా జట్టుగానా.. మిగతా శాటిలైట్ ఇంటర్నెట్ కంపెనీల వైఖరి ఇప్పటికే స్పష్టం కావడంతో అమెజాన్ ఎలా ముందుకెళ్తుందన్న అంశంపై అందరి దృష్టి ఉంది. ఒంటరిగా రంగంలోకి దిగుతుందా లేదా ఇతరత్రా ఏదైనా సంస్థతో జట్టు కడుతుందా అన్నది ఆసక్తిగా మారింది. వన్‌వెబ్‌లో భారతి గ్రూప్ ఇప్పటికే భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో ఇక మిగిలింది రెండు టెలికం సంస్థలు.. ఒకటి జియో కాగా రెండోది.. వొడాఫోన్ ఐడియా. అయితే, ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ వ్యాపారాల కొనుగోలుపై రిలయన్స్‌తో అమెజాన్ న్యాయపోరాటం చేస్తోంది. కాబట్టి దానితో జట్టు కట్టే అవకాశాలపై సందేహాలు నెలకొన్నాయి. వన్‌వెబ్..స్పేస్ఎక్స్తో పోటీ అంతర్జాతీయంగా ఎల్ఈవో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలందించడంలో ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా అధిపతి ఎలాన్ మస్క్‌కి చెందిన స్పేస్ఎక్స్తోను, దేశీ టెలికం దిగ్గజం భారతి గ్రూప్.. బ్రిటన్ ప్రభుత్వం కలిసి నెలకొల్పిన వన్వెబ్తోనూ అమెజాన్ పోటీపడాల్సి రానుంది. ఈ రెండు సంస్థలూ ఇప్పటికే భారత మార్కెట్‌పై తమ ప్రణాళికలను ప్రకటించేశాయి. వచ్చే ఏడాదే కార్యకలాపాలు ప్రారంభించేం దుకు కూడా సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఇక అమెజాన్ కూడా రంగంలోకి దిగితే పోటీ మరింత పెరుగుతుందని పరిశ్రమవర్గాలు తెలిపాయి. దీనివల్ల రేట్లు కూడా తగ్గగలవని పేర్కొన్నాయి. ప్రస్తుతం 4జీ మొబైల్ బ్రాడ్‌బ్యాండ్‌తో పోలిస్తే శాటిలైట్ ఇంటర్నెట్ సేవల చార్జీలు చాలా అధికంగా ఉంటున్నాయి. మొబైల్ డేటా చార్జీ జీబీకి 0.68 డాలర్లుగా ఉంటే.. శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ చార్జీలు జీబీకీ 15–20 డాలర్ల దాకా ఉంటున్నాయి. వన్‌వెబ్, స్పేస్ఎక్స్, అమెజాన్‌ల రాకతో ఆరోగ్యవంతమైన పోటీ నెలకొనగలదని, సేవ లు మరింత చౌకగా లభించగలవని అంచనా. స్పేస్ఎక్స్ బీటా వెర్షన్.. స్పేస్ఎక్స్ ప్రస్తుతం భారత్‌లో యూజర్లకు తమ స్టార్‌లింక్ శాటిలైట్ సర్వీసును బీటా వెర్షన్లో అందించేందుకు ప్రీ–ఆర్డర్లు తీసుకుంటోంది. ఇందుకోసం రిఫండబుల్ డిపాజిట్ 99 డాలర్లు (సుమారు రూ. 7,200)గా ఉంది. వన్‌వెబ్ ప్రధానంగా మారుమూల ప్రాంతాలకు శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులపై దృష్టి పెడుతుండగా.. స్టార్‌లింక్ ఇటు పట్టణ ప్రాంతాలకు కూడా మరింత వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించాలని యోచిస్తోంది. తగినన్ని మొబైల్ టవర్లు, ఫైబర్ నెట్వర్క్ ఉండని గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ కవరేజీని పెంచేందుకు శాటిలైట్ సర్వీసులు తోడ్పడగలవని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. సరఫరా వ్యవస్థ, కోల్డ్ చెయిన్ల నిర్వహణ మొదలుకుని విద్యుత్ పంపిణీకి సంబంధించిన స్మార్ట్ గ్రిడ్స్ నిర్వహణ, వరదలు..సునామీల సమయంలో అత్యవసర హెచ్చరికల జారీ తదితర అవసరాలకు ఇవి ఉపయోగపడగలవని వివరించారు. -
గగన్‌యాన్ మిషన్ కోసం మరో కీలక ప్రయోగం: ఇస్రో
శ్రీహరికోట : మానవ సహిత యాత్ర కోసం భారత్ గగన్‌యాన్ మిషన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ మిషన్ కోసం రష్యాలో ఒక సంవత్సరం పాటు భారత వ్యోమగాములు శిక్షణను కూడా పూర్తి చేశారు. గగన్ యాన్ మిషన్ కోసం మరో కీలక ఘట్టాన్ని పూర్తి చేయాలని ఇస్రో భావిస్తోంది. గగన్‌యాన్ మిషన్‌తో డేటా వినిమయం జరపడం కోసం ప్రత్యేకంగా డాటా రిలే సాటిలైట్ను ప్రయోగించనుంది. గగన్‌యాన్ మిషన్‌కు ముందుగా ఈ శాటిలైట్‌ను ఇస్రో ప్రయోగించనున్నట్లు తెలుస్తోంది. ఇది వ్యోమగాములను లోయర్ ఎర్త్ ఆర్బిట్ (ఎల్ఈఓ)కు పంపడానికి ఉపయోగపడుతుంది. మొదటి దశలో భాగంగా ఈ మానవరహిత మిషన్ డిసెంబర్ నెలలో ప్రారంభించనున్నారు. గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా వ్యోమగాములు వెళ్లే అంతరిక్ష నౌకకు డేటారిలే ఉపగ్రహంగా పనిచేస్తోందని, అందుకోసం ఇతర దేశాలపై ఆధారపడకుండా స్వదేశీ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నట్లు ఇస్రో ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.800 కోట్లకు ఆమోదం తెలిపిందని ఇస్రో వర్గాలు తెలిపాయి. నిర్ణీత కక్షలో తిరిగే శాటిలైట్‌కు, భూమి మీద ఉండే గ్రౌండ్ స్టేషనుకు సరైన సంబంధం లేకుంటే శాటిలైట్ అందించే డేటా భూమి పైకి చేరదు. దీన్ని నిరోధించడానికి డేటా రిలే శాటిలైట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కాగా, నాసా మానవ సహిత అంతరిక్ష నౌకల కోసం, అత్యంత బలమైన డేటా రిలే ఉపగ్రహాన్ని కలిగి ఉంది. భూమిపై ఎలాంటి ప్రత్యేకమైన గ్రౌండ్ స్టేషన్ అవసరం లేకుండానే నిర్ణీత కక్షలో తిరిగే అన్ని ఉపగ్రహాలను ఈ డేటారిలే శాటిలైట్ పర్యవేక్షిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మారిషస్, బ్రూనై, ఇండోనేషియా, బియాక్‌లో ఉండే గ్రౌండ్ స్టేషన్లను ఇస్రో ఉపయోగిస్తుంది. గగన్‌యాన్ మిషన్ కోసం కోకో దీవుల్లో గ్రౌండ్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి ఆస్ట్రేలియాతో చర్చలు జరుపుతున్నట్లు గత నెల ఇస్రో చైర్పర్సన్ కే శివన్ తెలిపారు. ఈ నెల ప్రారంభంలో ఫ్రెంచ్ అంతరిక్ష సంస్థ సీఎన్ఈఎస్తో గగన్‌యాన్ సహకారం కోసం ఒక ఒప్పందంపై ఇస్రో సంతకం చేసింది. చదవండి: షార్‌లో పాక్షిక లాక్డౌన్ -
భూతలం.. మరింత స్పష్టం
ఏపీ సెంట్రల్ డెస్క్: భూ ఉపరితల మార్పులను క్షుణ్ణంగా పరిశోధించే క్రమంలో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) మరో ముందడుగు వేసింది. అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా)తో కలసి సంయుక్తంగా రూపొందిస్తున్న ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ మిషన్ కోసం అత్యంత ఎక్కువ రిజల్యూషన్‌తో ఫొటోలు తీయడానికి ఉపకరించే సింథటిక్ అపెర్చ్యూర్ రాడార్ (సార్)ను ఇస్రో విజయవంతంగా అభివృద్ధి చేసింది. దీనికి సంబంధించిన ఎస్ బ్యాండ్ పేలోడ్‌కు మార్చి 4న ఇస్రో చైర్మన్ కె.శివన్ వర్చువల్ విధానంలో పచ్చ జెండా ఊపారు. అహ్మదాబాద్‌లోని ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ (ఎస్ఏసీ) నుంచి అమెరికాలోని పాసడేనాలో ఉన్న నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ (జేపీఎల్)కి దానిని పంపారు. అక్కడ రెండు బ్యాండ్లను అనుసంధానం చేస్తారని ఇస్రో వర్గాలు చెప్పాయి. భూమిని మరింత నిశితంగా పరిశీలించడానికి నిసార్ (నాసా, ఇస్రో సార్) మిషన్‌ను నాసా, ఇస్రో సంయుక్తంగా ప్రయోగించనున్న విషయం తెలిసిందే. భూ ఉపరితలంపై సెంటీ మీటర్ వైశాల్యం కన్నా చిన్న ప్రాంతంలో కూడా సంభవించే మార్పులను గుర్తించడానికి రెండు వైవిధ్య భరిత ఫ్రీక్వెన్సీలు (ఎల్ బ్యాండ్, ఎస్ బ్యాండ్) ఉపయోగిస్తున్న మొట్టమొదటి శాటిలైట్ మిషన్ నిసార్ అని నాసా వర్గాలు పేర్కొన్నాయి. దీనిలో స్పేస్‌క్రాఫ్ట్ బస్, ఎస్ బ్యాండ్ రాడార్, ల్యాండ్ వెహికిల్, నిసార్ లాంచ్‌కు కావాల్సిన ఇతర సేవలను ఇస్రో అందిస్తుంది. ఎల్ బ్యాండ్ సార్, కమ్యూనికేషన్ కోసం సైన్స్ డేటా సబ్ సిస్టం, అత్యంత భద్రంగా ఉండే రికార్డర్, పేలోడ్ డేటా సబ్ సిస్టంలను నాసా సమకూరుస్తుంది. శ్రీహరికోట నుంచి ప్రయోగం.. నిసార్ మిషన్ ప్రయోగానికి సంబంధించి 2014 సెప్టెంబర్ 30న ఇస్రో, నాసా మధ్య భాగస్వామ్య ఒప్పందం జరిగింది. దీనిని 2022 ప్రథమార్థంలో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్నారు. అడ్వాన్స్ రాడార్ ఫొటోల ద్వారా భూ ఉపరితలంపై జరుగుతున్న మార్పులు, తదనంతరం సంభవించబోయే పరిణామాలను లెక్కించడం ఇస్రో లక్ష్యం. మంచు కరిగిపోవడం నుంచి భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు, కొండచరియలు విరిగిపడటాలు మొదలగు ఉపద్రవాలకు గల కారణాలు, ఆ ప్రాదేశిక ప్రాంతాల్లోని పర్యావరణ మార్పులకు సంబంధించి కచ్చితమైన సమాచారాన్ని నిసార్ సమకూరుస్తుంది. భూ ఉపరితలంపై వస్తున్న సున్నిత మార్పులు, మంచు పరిమాణం, జీవపదార్థాల సమాచారం, సహజ ప్రమాదాలు, సముద్ర మట్టం పెరిగిపోవడం, భూమిలో నీటిమట్టం తదితర వివరాలను నిసార్ మిషన్ అంచనా వేస్తుందని నాసా వర్గాలు పేర్కొన్నాయి. ఈ మిషన్ ప్రతి ఆరురోజులకు ఒక భూ ప్రదక్షిణ పూర్తి చేస్తుందని, ఆ సమయంలో భూమి, మంచు ఉపరితాలలో మార్పులను క్షుణ్ణంగా పరిశీస్తుందని ఆ వర్గాలు తెలిపాయి. భూమిని కారు మబ్బులు కమ్మినా, చిమ్మచీకటి అలిమేసినా.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సమాచారాన్ని సేకరించి విశ్లేషించేలా నిసార్‌ను రూపొందిస్తున్నామని నాసా వెల్లడించింది. విపత్తులను ఎదుర్కోవడానికి ఎంతో అవసరం ఈ మిషన్ పలు భ్రమణాలు పూర్తి చేసిన తర్వాత భూ ఉపరితలంపై మార్పులను, ప్రమాదాలను సులువుగా గుర్తించడానికి వీలవుతుంది. స్పష్టంగా ఉండే ఫొటోలతో ప్రాంతాల వారీగా వస్తున్నమార్పులను నిశితంగా పరిశీలించవచ్చు. భూ ఉపరితలంలో వస్తున్న మార్పులు, అనంతర పరిణామాలను కొన్నేళ్ల పాటు బాగా అర్థం చేసుకోవడానికి ఈ మిషన్ సమాచారం ఉపయోగపడుతుందని నాసా వర్గాలు తెలిపాయి. వనరులను సమర్థవంతగా వినియోగించుకుంటూ విపత్తులను ఎదుర్కోవడానికి, భూ ఉపరితల మార్పులను తట్టుకునేలా సిద్ధం కావడానికి ఇది ఎంతో అవసరమని చెప్పాయి. విశ్వవ్యాప్తంగా సైన్స్ కార్యక్రమాల కోసం ఎల్ బ్యాండ్ రాడార్ సేవలు కనీసం మూడేళ్లు అవసరమని, దక్షిణ మహాసముద్రం, భారత్‌లలో ప్రత్యేక లక్ష్యాల కోసం ఇస్రోకు ఎస్ బ్యాండ్ రాడార్ సేవలు కనీసం ఐదేళ్లు అవసరమని నాసా పేర్కొంది. -
మార్స్‌పై ఏలియన్స్?
ఏలియన్స్, స్పీసిస్ తదితర సినిమాలు చూస్తే గ్రహాంతరవాసులు మనపై దాడికి వస్తారని భావించే ప్రజలున్నారంటే నమ్ముతారా? మనదగ్గర ఉండకపోవచ్చు కానీ, పాశ్చాత్య దేశాల్లో ఈ నమ్మకాన్ని ఒక మతంలాగా పాటించేవారు కోకొల్లలు. నిజంగా మనం కాకుండా విశ్వంలో జీవం ఉందనేది నిరూపణ కాని ఊహ మాత్రమే! మనిషి ఎంత విజ్ఞానం సాధించానని భావించినా అతని మనసులో ఒక వెలితి తీరట్లేదు. ఈ విశాల విశ్వంలో తాను ఒంటరినా? కనీసం సౌర కుటుంబంలోని ఇతర గ్రహాలపై జీవం ఉందా? ఉంటే మన కన్నా ఎక్కువ తెలివైనవా? లేక అల్పజీవులా?.. ఈ ప్రశ్నలకు సంపూర్ణ సమాధానాలు ఇంకా దొరకలేదు. దీంతో తనకు చేతనైన రీతిలో గ్రహాంతర జీవుల కోసం ‘విశ్వ’ప్రయత్నాలు చేస్తున్నాడు. చంద్రుడితో మొదలెట్టి ఇతర గ్రహాలకు శాటిలైట్లు పంపి శోధిస్తున్నాడు. ఇంతవరకు ఎలాంటి స్పష్టమైన సమాధానాలు దొరక్కపోయినా, కొన్ని గ్రహాల్లో మాత్రం గతంలో జీవం ఉండేదనేందుకు స్వల్ప ఆధారాలు లభించాయి. అయితే ఈ ఆధారాలతో సమస్య తీరకపోగా కొత్తగా మరో ప్రశ్న మొదలైంది. ఒకవేళ ఇతర గ్రహాలపై జీవం ఉండేదనుకుంటే, ఇప్పుడేమైందనేది కొత్త ప్రశ్న! మంగళుడిపై మనుగడ తాజాగా కుజగ్రహంపై కనిపిస్తున్న నల్లటి చారికలు ఆ గ్రహంపై జీవం ఉందనేందుకు నిదర్శనమని తాజాగా సైంటిస్టులు విశ్లేషిస్తున్నారు. దీనిపై మరిన్ని పరిశోధనలు జరిపితే సదరు జీవజాలం ఎలా మాయమైందన్న విషయం తెలియవచ్చని, తద్వారా భూమిపై ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడవచ్చని వీరి ఆలోచన. మార్స్(కుజుడు) పై కనిపించే నల్లటి చారికలు ద్రవరూప పదార్ధాలు ప్రవహిస్తే ఏర్పడే కయ్యల్లాగా ఉన్నాయి. ఇవి ఈ గ్రహంపై ఉండే కరిగే మంచుకు, కుజుడి ఉపరితలంపై ఉండే ఉప్పురాతి శిలలకు మధ్య జరిగే రసాయన చర్య వల్ల ఏర్పడ్డాయని సైంటిస్టుల ఆలోచన. కుజుడిపై దాదాపు మైనస్ 60 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు ఉంటుంది. అందువల్ల మంచు ఏర్పడేందుకు ఛాన్సులు ఎక్కువ. మరి మంచు ఉంటే జీవముండాలి కదా అని ప్రశ్నిస్తే ప్రస్తుతం ఆ మంచు జీవం మనుగడ సాధించలేనంత ఉప్పుతో కలిసి ఉన్నందున జీవం లేదని, కానీ 200– 300 కోట్ల సంవత్సరాల క్రితం మాత్రం మార్స్‌పై జీవం ఉండే ఉండొచ్చని కొత్త సిద్ధాంతం ప్రతిపాదిస్తున్నారు. అయితే అది ఎందుకు అంతర్ధానమైందో ఇంకా తెలియరాలేదని, మరిన్ని పరిశోధనలతో కానీ ఈ విషయం నిర్ధారించలేమని సైంటిస్టులు చెప్పారు. కాబటి.. మన పొరుగు గ్రహం నుంచి మనపైకి దాడికి వచ్చే ఏలియన్స్ అయితే ఇంకా ఏమీ లేవని భరోసాతో ఉండొచ్చు! -
నింగిలోకి ప్రధాని మోదీ ఫొటో
న్యూఢిల్లీ: భగవద్గీత పుస్తకం, ప్రధాని మోదీ చిత్రపటం, 25 వేల మంది పౌరుల పేర్ల జాబితాను ఈ దఫా నింగిలోకి తీసుకుపోయేందుకు ఇస్రో సిద్ధమైంది. ఇస్రో 50 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా దేశీయ ప్రైవేటు సంస్థల ఉపగ్రహాలను నింగిలోకి పంపనుంది. వీటిలోని ఒక శాటిలైట్‌లో మోదీ ఫొటో, భగవద్గీత కాపీ, పౌరుల పేర్లను అంతరిక్షంలోకి పంపనున్నారు. ఫిబ్రవరి 28న పీఎస్ఎల్వీ సీ–51 ద్వారా బ్రెజిల్‌కు చెందిన అమెజోనియా–1, భారత ప్రైవేటు సంస్థలు రూపొందించిన ఆనంద్, సతీశ్ ధావన్, యునిటీశాట్ ఉపగ్రహాలతో పాటు మొత్తం 21 శాటిలైట్లను ప్రయోగించనుంది. వీటిలో ఆనంద్‌ను బెంగళూరుకు చెందిన అంకుర సంస్థ పిక్సెల్, సతీశ్ ధావన్(ఎస్డీ శాట్)ను చెన్నైకు చెందిన స్పేస్ కిడ్జ్ ఇండియా, యునిటీశాట్‌ను జిట్‌శాట్ (శ్రీపెరంబుదూర్), జీహెచ్‌ఆర్‌సీఈ శాట్(నాగ్‌పుర్), శ్రీశక్తి శాట్ (కోయంబత్తూరు) కళాశాలల విద్యార్థులు రూపొందించారు. వీటిలో సతీష్‌ధావన్ శాటిలైట్‌లో మోదీ పేరు, ఫొటో, ‘ఆత్మనిర్భర్ మిషన్’∙పదాలు, భగవద్గీత కాపీ, 25000 మంది పౌరుల పేర్ల జాబితాను తీసుకెళ్లనున్నట్లు స్పేస్ కిడ్జ్ సీఈవో డాక్టర్ శ్రీమతి కేసన్ తెలిపారు. అంతరిక్షంలోకి పేర్లను పంపేందుకు అడిగిన వారం రోజుల్లోనే 25వేల ఎంట్రీలు వచ్చాయి. వీటిలో 1000 పేర్లు విదేశీయులవి ఉన్నాయన్నారు. వీరందరికీ బోర్డింగ్ పాస్‌లు ఇచ్చామన్నారు. ప్యానెల్ దిగువన ఇరువైపులా ఇస్రో చైర్మన్ శివన్, సైంటిఫిక్ సెక్రటరీ ఉమామహేశ్వరన్ పేర్లను చెక్కినట్లు తెలిపారు. విదేశాలకు చెందిన కొన్ని ప్రయోగాల్లో ఆయా దేశాలు బైబిల్‌ను అంతరిక్షంలోకి పంపాయి. ఇదే తరహాలో హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీతను అంతరిక్షంలోకి పంపించాలనుకుంటున్నామని డాక్టర్ శ్రీమతి వెల్లడించారు. పీఎస్ఎల్వీ సీ–51 వాహకనౌకను శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ఫిబ్రవరి 28న ఉదయం 10.24 గంటలకు ప్రయోగించనున్నట్లు ఇస్రో అధికారులు తెలిపారు. -
భారీ బెలూన్‌తో నింగికి శాటిలైట్లు
సాక్షి, చెన్నై: భారీ బెలూన్ సాయంతో నింగికి వంద శాటిలైట్లను ప్రయోగించి విద్యార్థులు రికార్డు ప్రయత్నం చేశారు. మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం పుట్టిన గడ్డ రామేశ్వరం ఈ కార్యక్రమానికి ఆదివారం వేదికైంది. అబ్దుల్‌కలాం కలలను సాకారం చేసే రీతిలో ఆయన కుటుంబీకులు డాక్టర్ ఏపీజే అబ్దుల్‌కలాం అంతర్జాతీయ ట్రస్టును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ ట్రస్టు నేతృత్వంలో విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను చాటే రీతిలో చిన్నపాటి శాటిలైట్ల తయారీపై ప్రత్యేక కార్యక్రమాన్ని గతవారం చేపట్టారు. ఇందుకోసం తమిళనాడుతో పాటు దేశంలోని వివిధ కళాశాలలకు చెందిన రెండు వందల మంది విద్యార్థులు రామేశ్వరానికి తరలివచ్చారు. భారీ బెలూన్‌తో.. ప్రపంచంలోనే అతి చిన్నశాటిలైట్లుగా 40 గ్రాముల నుంచి 50 గ్రాముల్లోపు విద్యార్థులు సిద్ధం చేశారు. విద్యార్థులు సిద్ధం చేసిన వంద శాటిలైట్లను ప్రయోగించే రీతిలో ఆదివారం రామేశ్వరంలో కార్యక్రమం జరిగింది. ఆన్లైన్ ద్వారా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 5 నుంచి 8 అడుగుల మేరకు ఉన్న భారీబెలూన్‌లో ఈ శాటిలైట్లను పొందు పరిచి గాల్లోకి వదిలారు. వాతావరణ పరిశోధ, ఉష్ణోగ్రతలకు సంబంధించిన సమాచారాలు తెలుసుకునే రీతిలో ఈ ప్రయోగం సాగింది. రామేశ్వరం పరిసరాలకు చెందిన వెయ్యికి పైగా విద్యార్థులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. కలాం మనవళ్లు షేక్ సలీం, షేక్ దావుద్, అబ్దుల్ కలాంతో పనిచేసిన శాస్త్రవేత్త శివథానుపిల్‌లై, పలు విభాగాలకు చెందిన శాస్త్రవేత్తలు, కళాశాలల ప్రొఫెసర్లు, పరిశోధకలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కేవలం అవగాహన కల్పించే రీతిలో కలాం పేరిట రికార్డు ప్రయత్నంగా భారీ బెలూన్ ద్వారా శాటిలైట్ల ప్రయోగం కార్యక్రమాన్ని నిర్వహించినట్టు ఆయన మనవళ్లు పేర్కొన్నారు. -
10 బిలియన్ ఏళ్ల రాతి గ్రహం.. మండుతున్న గోళంలా..
భూమిని పోలిసి ఓ రాతి గ్రహాన్ని నాసా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది భూమి కంటే 50 శాతం, మూడు రెట్ల ద్రవ్యరాశిని కలిగి ఉన్న అత్యంత వేడి, రాతి గ్రహంగా నాసా టెస్ మిషన్(ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్) కనుగొంది. అయితే ఇది భూమికి సమాన సాంద్రతలో ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీనికి TOI-561b అని పేరు పెట్టారు. మన సౌర వ్యవస్థ వెలుపల ఉన్నందున దీనిని ఎక్స్ప్లానెట్గా నాసా సైంటిస్టులు పేర్కొన్నారు. సూపర్ ఎర్త్‌గా పలిచే ఈ గ్రహం సూర్యునిలా ఎర్రగా, మండిపోతున్న గోళంలా కనిపిస్తోంది. మన పాలపుంతలో ఈ కొత్త గ్రహం ఈ నాటిది కాదని, ఎన్నో బిలియన్ల సంవత్సరాల క్రితం గ్రహంగా నాసా పేర్కొంది. అంటే.. ఈ గ్రహం వయస్సు దాదాపు 1000 కోట్ల సంవత్సరాలు ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. అంతేకాదు.. మన భూమికి 280 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ పురాతన గ్రహం (TOI-561b) రాతి ప్రపంచంలో ఉంటుందని, ఇది భూమికి మూడంతలు పెద్దదిగా ఉంటుందని పేర్కొన్నారు. కేవలం 24 గంటలకు కంటే ఎక్కువ సమయంలో ఈ గ్రహం స్టార్ కక్ష్యలో తిరుగుతుందట. అందువల్లే దీనిని సూపర్ ఎర్త్‌గా పేర్కొంటున్నట్లు శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. నాసా ప్రకారం.. విశ్వంలో చాలా వరకు రాతి గ్రహాలు ఏర్పడి ఉండవచ్చని, ఈ TOI-561b అనేది పురాతన రాతి గ్రహాలలో ఒకటై ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 14 బిలియన్ ఏళ్ల క్రితం విశ్వం ప్రారంభమైనప్పటి నుండి రాతి గ్రహాలు ఉన్నాయని ఈ గ్రహం ఆధారంగా అంచనా వేస్తున్నారు. పాలపుంతలోని ప్రధాన నక్షత్రాలకు మొదటి నుంచే 10 బిలియన్ల ఏళ్ల వయస్సు ఉన్న ఈ గ్రహం ప్రకాశిస్తోందని, సౌర వ్యవస్థ కంటే రెండు రెట్లు పాతదని భావిస్తున్నారు. ఈ పాలపుంత సుమారు 12 బిలియన్ ఏళ్ల నాటి పురాతనమైనదిగా నాసా వివరించింది. -
దేవాస్‌కు 8,939 కోట్లివ్వండి
వాషింగ్టన్: శాటిలైట్ ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసినందుకు గాను బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ దేవాస్ మల్టీమీడియాకు రూ.8,939.79 కోట్ల(1.2 బిలియన్ డాలర్లు) నష్ట పరిహారం చెల్లించాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) వాణిజ్య విభాగమైన యాంట్రిక్స్ కార్పొరేషన్‌ను అమెరికా న్యాయస్థానం ఆదేశించింది. 2005 జనవరిలో ఈ ఒప్పందం కుదిరింది. 70 మెగాహెట్జ్ ఎస్–బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను దేవాస్ మల్టీమీడియాకు అందించేందుకు రెండు ఉపగ్రహాలను నిర్మించి, ప్రయోగించి, నిర్వహిస్తామని యాంట్రిక్స్ కార్పొరేషన్ హామీ ఇచ్చింది. అయితే, ఒప్పందం మేరకు స్పెక్ట్రమ్‌ను దేవాస్‌కు ఇవ్వడంలో యాంట్రిక్స్ కార్పొరేషన్ విఫలమైంది. 2011 ఫిబ్రవరిలో ఒప్పందాన్ని యాంట్రిక్స్ రద్దు చేసింది. అనంతరం దేవాస్ భారత్‌లో పలు కోర్టులను ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో సైతం పిటిషన్ దాఖలు చేసింది. తమకు న్యాయం చేయాలని విన్నవించింది. సరైన స్పందన లేకపోవడంతో 2018లో అమెరికాలోని వెస్ట్రన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వాషింగ్టన్ కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి థామస్ ఎస్.జిల్లీ అక్టోబర్ 27న ఉత్తర్వు జారీ చేశారు. దేవాస్ సంస్థకు 562.5 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని, ఇప్పటిదాకా వడ్డీతో కలిపి రూ.8,939.79 కోట్ల(1.2 బిలియన్ డాలర్లు)ను దేవాస్ మల్టీమీడియాకు చెల్లించాలని యాంట్రిక్స్ కార్పొరేషన్‌కు తేల్చిచెప్పారు. -
వచ్చే నెల 5న జీఐ శాట్ ప్రయోగం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నూతనంగా రూపొందించిన జియో ఇమేజింగ్ శాటిలైట్ (జీఐ శాట్–1)ను మార్చి 5వ తేదీన ప్రయోగించేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తోంది. అదేవిధంగా మార్చి 10న రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ (రిశాట్)ను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఒకే నెలలో రెండు ప్రయోగాలు చేయనుండటంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబంధిత పనుల్లో నిమగ్నమయ్యారు. ఇస్రో చరిత్రలో నూతన ఉపగ్రహం 2,100 కిలోల బరువైన జీఐ శాట్–1 ఇస్రో చరిత్రలో నూతన ఉపగ్రహం. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్–10 (జీఎస్ఎల్వీ మార్క్–2) రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపిస్తారు. బెంగళూరులోని యూఆర్ రావు స్పేస్ సెంటర్ నుంచి జీఐ శాట్–1 ఉపగ్రహం గత ఏడాది డిసెంబర్ 23న షార్కు చేరుకుంది. దీనిని ఈ ఏడాది జనవరి 15న ప్రయోగించాలని తొలుత భావించారు. సాంకేతిక కారణాల వల్ల ఈ నెల 10వ తేదీకి వాయిదా వేశారు. రాకెట్‌కు శిఖర భాగాన ఉపగ్రహాన్ని అమర్చి హీట్‌షీల్డ్ క్లోజ్ చేసే క్రమంలో తలెత్తిన చిన్నపాటి సాంకేతిక లోపంతో ఈనెల 25కు వాయిదా వేసుకున్నారు. సాంకేతికపరమైన లోపాన్ని సవరించే క్రమంలో కాస్త ఆలస్యం కావడంతో మార్చి 5న దీనిని ప్రయోగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జీఐ శాట్ ప్రత్యేకతలివీ.. నూతన ఉపగ్రహం జీఐ శాట్–1ను భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని జియో ఆర్బిట్ (భూ స్థిర కక్ష్య)లోకి ప్రవేశపెడతారు. భూమిని పరిశోధించేందుకు ఇప్పటి వరకు రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ (దూర పరిశీలనా ఉపగ్రహాలు) భూమికి 506 నుంచి 830 కిలోమీటర్లు ఎత్తులో వున్న సన్ సింక్రనస్ ఆర్బిట్ (సూర్యానువర్తన ధ్రువ కక్ష్య)లోకి మాత్రమే పంపించేవారు. కమ్యూనికేషన్ శాటిలైట్స్ (సమాచార ఉపగ్రహాలు) భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని జియో ఆర్బిట్ (భూ స్థిర కక్ష్య)లోకి పంపేవారు. ఈసారి జియో ఇమేజింగ్ శాటిలైట్ పేరుతో రిమోట్ సెన్సింగ్ శాటిలైట్‌ను మొట్ట మొదటిసారిగా భూస్థిర కక్ష్యలోకి పంపించి పనిచేసే విధంగా ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించడం విశేషం. ఈ తరహా ఉపగ్రహాల్లో జీఐ శాట్–1 ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ ప్రయోగం తరువాత జూలైలో జీఎస్ఎల్వీ ఎఫ్–12 రాకెట్ ద్వారా జీఐ శాట్–2 ఉపగ్రహాన్ని కూడా పంపేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. దేశ భద్రత, అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ రెండు ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. అదేవిధంగా మార్చి 10న పీస్ఎల్వీ సీ–49 ద్వారా రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ (రిశాట్)ను ప్రయోగించేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. -
నింగీ నేలా ఏకమయ్యేలా...
అంతరిక్షంలోకి వెళ్లి దాని లోతులు తెలుసుకోవాలనే తపన ఉన్నవారు శారీరకంగా, మానసికంగా ఎంతో బలంగా ఉండాలి. కఠోర శిక్షణ పూర్తి చేయాలి. వ్యోమగాముల పొడవు కనీసం 147 సెంటీ మీటర్లు (4 అడుగుల 8 అంగుళాలు) ఉండాలి. కంటిచూపు బాగుండాలి. రక్తపోటు ఉండకూడదు. విద్యాధికులై ఉండాలి. వయసుకి ఎలాంటి పరిమితి లేకపోయినప్పటికీ సాధారణంగా 25 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారికే శిక్షణ ఇస్తారు. భూ కక్ష్యను దాటి పైకి వెళ్లే కొద్దీ వ్యోమగాములు ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యమైనది భారరహిత స్థితి. వ్యోమగాముల్ని తీసుకువెళ్లే ఉపగ్రహం భూమి దాటి పైకి వెళ్తున్న కొద్దీ శరీరం బరువు తగ్గిపోతుంది. ఆ సమయంలో గురుత్వాకర్షణ శక్తికి సంబంధించిన ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. రేడియేషన్ అధికంగా ఉండటంతో శారీరకంగా ప్రభావం పడుతుంది. ఎక్కువ మందిలో మోషన్ సిక్నెస్, రక్త ప్రసరణలో తేడాలు కనిపిస్తాయి. సరైన శిక్షణ ఇవ్వకపోతే వ్యోమగాములు స్పృహ కోల్పోయే అవకాశం ఉంది. మైక్రో గ్రావిటీ, మానవ సంచారం లేకుండా ఒంటరిగా ఉండటం, శూన్యంలో ప్రయాణం వంటివి వ్యోమగాముల్ని మానసికంగా దెబ్బ తీయకుండా ఈ శిక్షణ ఇస్తారు. అంతరిక్షంలో ఉండే వాతావరణాన్ని భూమిపై కృత్రిమంగా నెలకొల్పిన సిమ్యులేటర్లలో కఠోర శిక్షణ ఇస్తారు. వాతావరణంలో ఉన్న ఒత్తిడి కంటే ఆరు రెట్లు అధికమైన ఒత్తిడి ఈ సిమ్యులేటర్లలో ఉంటుంది. వీటిలో శిక్షణ తీసుకుంటే భార రహిత స్థితిని సమర్థవంతంగా ఎదుర్కోవడం, రోజువారీ కార్యకలాపాల నిర్వహణ, వాతావరణంలో త్వరత్వరగా వచ్చే మార్పుల్ని తట్టుకునే శారీరక సామర్థ్యం, అంతరిక్ష వాతావరణంలో శరీరంపై పడే దుష్ప్రభావాలను తగ్గించుకునే సామర్థ్యం వంటివి పెరుగుతాయి. అన్నింటికి మించి శరీరం తలకిందులుగా ఉన్నప్పుడు అన్ని పనుల్ని చక్కబెట్టే సామర్థ్యం, స్పేస్ వాక్ వంటి వాటిల్లో శిక్షణ ఉంటుంది. అత్యంత ఇరుకుగా ఉండే కాప్సూ్యల్లో ప్రయాణం కూడా అత్యంత క్లిష్టమైనదే. ఇవే కాకుండా స్పేస్‌క్రాఫ్ట్ నిర్వహణపై కూడా శిక్షణ ఇస్తారు. మిషన్‌లో వచ్చే సాంకేతిక లోపాల్ని సరిదిద్దడం, ఉపగ్రహ ప్రయాణం ఏ దిశగా వెళుతోందో గమనిస్తూ ఉండటం, అత్యవసర పరిస్థితుల్ని ఎదుర్కొనే సామర్థ్యం వంటివాటిలో శిక్షణ ఇస్తారు. ఇక హైడ్రోల్యాబ్స్లో నీళ్లల్లో భారరహిత స్థితిలో ఉండటంపై శిక్షణ కూడా ఉంటుంది. -
సూర్యుడిపై గురి
సూళ్లూరుపేట: సూర్యుడిపై పరిశోధనలు చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సిద్ధమైంది. ఇందుకోసం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా)తో కలిసి పని చేస్తోంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఆదిత్య ఎల్–1 ఉపగ్రహాన్ని సూర్యుడి చెంతకు పంపించేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. ఇందుకు సంబంధించి భారత, అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థలు చర్చలు జరిపిన విషయం విదితమే. సూర్యుడిపై పరిశోధనల నిమిత్తం ఇటీవలే అమెరికా ‘సోలార్ ప్రోబ్’ ప్రయోగాన్ని చేపట్టింది. ఈ నేపథ్యంలోనే సూర్యుడిపై మరిన్ని పరిశోధనలు జరిపేందుకు శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ–ఎక్సెల్ రాకెట్ ద్వారా ఆదిత్య ఎల్–1 ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమైంది. దీనికి భారత ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో ఈ ఏడాది జూన్ లేదా జూలై నెలల్లో ప్రయోగం చేపట్టేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. బెంగళూరులోని ఉపగ్రహాల తయారీ కేంద్రంలో దీనిని తయారు చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రయోగం ఎందుకంటే.. సూర్యుడి వెలుపలి వలయాన్ని కరోనా అంటారు. సూర్యగోళానికి వేల కిలోమీటర్లు దూరం వరకు ఇది విస్తరించి ఉంటుంది. సూర్యుడి అంతర్భాగ ఉష్ణోగ్రత 5 వేల కెల్విన్ డిగ్రీల వరకు ఉంటుంది. అయితే, కరోనా ప్రాంతంలో ఉష్ణోగ్రత మాత్రం దాదాపు 10 లక్షల కెల్విన్ డిగ్రీల వరకు ఉంటోంది. కరోనాలో వేడి పెరిగిపోతుండడానికి గల కారణం ఏమిటనేది అంతు చిక్కడం లేదు. ప్రధానంగా ఈ అంశంపైనే ఆదిత్య ఎల్–1 ఉపగ్రహం దృష్టి సారిస్తుంది. సౌర గోళాన్ని పరిశోధించేందుకు ఆదిత్య ఎల్–1 ఉపగ్రహంలో అమర్చే ఆరు పరికరాల ఊహాచిత్రం సౌర గోళం పరిస్థితులపైనా అధ్యయనం సౌర గోళంలో సౌర గాలులు, జ్వాలలు, రేణువుల తీరు తెన్నులపై పరిశో«ధనలు జరిపేందుకు ఇస్రో–నాసా శాస్త్రవేత్తలు సంయుక్త ప్రణాళికలు సిద్ధం చేశారు. సౌర తుపాను సమయంలో వెలువడే రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని అంచనా వేశారు. దీంతో పాటు కాంతి మండలం (ఫొటోస్ఫియర్), వర్ణ మండలాలను (క్రోమోస్ఫియర్)లపై అధ్యయనం చేసి సమాచారాన్ని సేకరిస్తారు. ఆదిత్య ఎల్–1 ప్రత్యేకతలివీ - ఆదిత్య ఎల్–1 ఉపగ్రహంలో ఆరు పేలోడ్స్‌ను అమర్చి సూర్యుడి చెంతకు పంపిస్తారు. - సూర్యుని వలయంలో ఉన్న పరిస్థితులను అధ్యయనం చేసేందుకు యాస్పెక్స్, సూట్, వెల్సి, హెలియోస్, పాపా, సోలెక్స్ అనే ఆరు ఉపకరణాలు ఇందులో ఉంటాయి. - ఈ ఉపగ్రహాన్ని భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో భూమి, సూర్యుడి అభికేంద్ర బలాలు సమానమయ్యే చోట (లాగ్రేంజియన్ బిందువు–1 (ఎల్–1)లోకి చేరవేస్తారు. - అక్కడి నుంచి ఎలాంటి అవరోధాలు, అడ్డంకులు లేకుండా సూర్యుడిని నిరంతరం పరిశీలించేందుకు వీలవుతుందని అంచనా వేస్తున్నారు. -
విచ్చుకున్న ‘రీశాట్–2బీఆర్1’ యాంటెన్నా
సూళ్లూరుపేట : దేశీయ అవసరాల నిమిత్తం బుధవా రం సాయంత్రం 3.25 గంటలకు పీఎస్ఎల్వీ సీ48 రాకెట్ ద్వారా రోదసీలోకి పంపించిన రాడార్ ఇమేజింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ (రీశాట్–2బీఆర్1) ఉపగ్రహానికి అమర్చిన రేడియల్ రిబ్ యాంటెన్నా గురువారం విజయవంతంగా విచ్చుకున్నట్లు ఇస్రో ప్రకటించింది. 628 కేజీల బరువు కలిగిన రీశాట్–2బీఆర్1 ఉపగ్రహాన్ని భూమికి 576 కిలోమీటర్లు ఎత్తులోని సన్ సింక్రనస్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 3.6 మీట ర్లు వ్యాసార్థం కలిగిన రేడియల్ రిబ్ యాంటెన్నాను ఇందులో వినియోగించారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు 9.12 నిమిషాల వ్యవధిలో యాంటెన్నా విజయవంతంగా విచ్చుకుంది. మరో రెండు మూడు రోజుల్లో ఈ ఉపగ్రహం సేవలు అందుబాటులోకి రానున్నాయి. బెంగళూరు సమీపంలో హాసన్‌లో వున్న మాస్టర్ కంట్రోల్ సెంటర్ నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ఆపరేషన్‌ను చేపట్టారు. -
పీఎస్ఎల్వీ సీ– 48 ప్రయోగానికి సర్వం సిద్ధం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో).. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ –సీ48 ఉపగ్రహ వాహకనౌకను ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. మొబైల్ సర్వీస్ టవర్ (ఎంఎస్టీ)లో పీఎస్ఎల్వీ రాకెట్‌కు శిఖర భాగాన శనివారం రీశాట్–2బీఆర్1 అనే ఉపగ్రహంతోపాటు 9 విదేశీ ఉపగ్రహాలను అమర్చి హీట్‌షీల్డ్ క్లోజ్ చేశారు. అనంతరం గ్లోబల్ చెకింగ్ చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం మిషన్ సంసిద్ధత సమావేశం (ఎంఆర్ఆర్) నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంఆర్ఆర్ అనంతరం లాంచ్ ఆథరైజేషన్ బోర్డ్.. ల్యాబ్ సమావేశాన్ని నిర్వహించనుంది. సోమవారం ఉదయం లాంచ్ రిహార్సల్స్ నిర్వహించాక మంగళవారం మధ్యాహ్నం 1.25 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించనున్నారు. 26 గంటల కౌంట్‌డౌన్ తర్వాత బుధవారం మధ్యాహ్నం 3.25 గంటలకు పీఎస్ఎల్వీ –సీ48 రాకెట్‌ను ప్రయోగించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ప్రయోగంలో భాగంగా 628 కిలోల బరువు కలిగిన రీశాట్–2బీఆర్1, అమెరికాకు చెందిన తైవోక్–0129, ఐహోప్ శాట్, నాలుగు లీమూర్, జపాన్‌కు చెందిన క్యూఆర్ఎస్–సార్, ఇటలీకి చెందిన తైవోక్–0992, ఇజ్రాయెల్‌కు చెందిన డచీఫాట్–3 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నారు. -
యువత అద్భుతాలు చేయగలదు
థింపూ: భవిష్యత్ తరాలపై ప్రభావం చూపగలరీతిలో అద్భుతాలు చేయగల శక్తిసామర్థ్యాలు భూటాన్ యువతలో ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. నైపుణ్యవంతులైన యువత భూటాన్‌ను సరికొత్త ఎత్తుకు తీసుకెళుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రపంచంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయనీ, ఈ సమస్యలకు పరిష్కారం కొనుగొనేందుకు మనకు తెలివైన యువతీయువకులు ఉన్నారని వెల్లడించారు. ఆలోచనలు, సృజనాత్మకతపై ఎలాంటి పరిమితులు విధించుకోవద్దని ప్రధాని సూచించారు. భూటాన్ పర్యటనలో భాగంగా ఆదివారం థింపూలోని ‘రాయల్ యూనివర్సిటీ ఆఫ్ భూటాన్’లో జరిగిన ఓ కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి మోదీ మాట్లాడారు. యువత లక్ష్యాన్ని గుర్తించాలి.. ‘ప్రపంచం గతంలో ఎన్నడూలేనన్ని అవకాశాలను ఈరోజు ఇస్తోంది. సాంకేతిక ఆవిష్కరణలు, ఇతర రంగాల్లో భూటాన్ దూసుకుపోతే మీ 130 కోట్ల మంది స్నేహితులు మౌనంగా ఉండరు. ఆనందం, గర్వంతో చప్పట్లు కొట్టి ప్రోత్సహిస్తారు. ప్రస్తుతం భారత్ పలురంగాల్లో చరిత్రాత్మక రీతిలో పురోగమిస్తోంది. పాఠశాల స్థాయి నుంచి అంతరిక్షం, డిజిటల్ చెల్లింపులు, విపత్తుల నిర్వహణవరకూ భూటాన్‌తో కలిసి పనిచేసేందుకు మేం ఆసక్తిగా ఉన్నాం’ అని మోదీ పేర్కొన్నారు. ‘అంతరిక్షం’లో సహకారం బలోపేతం.. అంతరిక్ష రంగంలోనూ భారత్ భూటాన్‌తో సంబంధాలను పటిష్టం చేసుకుంటోందని ప్రధాని మోదీ చెప్పారు. ‘మేం ‘థింపూ గ్రౌండ్ స్టేషన్ ఆఫ్ సౌత్ఏసియా శాటిలైట్’ను ప్రారంభించాం. ఉపగ్రహాలతో టెలిమెడిసిన్, దూరవిద్య, సహజవనరుల మ్యాపింగ్, వాతావరణాన్ని అంచనా వేయడంతో పాటు ప్రకృతి విపత్తులను ముందుగానే గుర్తించి హెచ్చరికలు జారీ చేయవచ్చు. మేం ఇటీవల చంద్రుడిపైకి చంద్రయాన్–2ను ప్రయో గించాం. భూటాన్ కూడా త్వరలోనే ఓ చిన్న ఉపగ్రహాన్ని సొంతంగా సమకూర్చుకోబోతోంది. భవిష్యత్‌లో భూటాన్‌కు చెందిన యువ శాస్త్రవేత్తలు భారత్‌కు వచ్చి తమ ఉపగ్రహాన్ని డిజైన్ చేసుకోవడంతో పాటు ప్రయోగాన్ని వీక్షిస్తారని ఆలోచిస్తేనే చాలా సంతోషంగా ఉంది’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. తాను రాసిన ‘ఎగ్జామ్ వారియర్స్’ పుస్తకాన్ని భూటాన్ ప్రధాని లోటే షెరింగ్ ప్రశంసించడంపై స్పందిస్తూ, గౌతమబుద్ధుని ప్రభావంతోనే ఆ పుస్తకం రాసినట్లు మోదీ చెప్పారు. భూటాన్ అర్థం చేసుకుంది: సంతోషం ప్రాముఖ్యతను భూటాన్ అర్థం చేసుకుందని ప్రధాని మోదీ చెప్పారు. ‘భూటాన్ నుంచి ప్రపంచం నేర్చుకోవాల్సింది చాలాఉంది. ఇక్కడ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, సంస్కృతులు ఒకదానితో మరొకటి సంఘర్షణ పడకుండా కలిసి ముందుకు సాగుతాయి. సంతోషం యొక్క ప్రాముఖ్యతను, దయాగుణం గొప్పతనాన్ని భూటాన్ అర్థం చేసుకుంది’ అని మోదీ తెలిపారు. తర్వాత మోదీ భారత్‌కు తిరుగుపయనమయ్యారు. -
శ్రీలంక శాటిలైట్‌కు ‘రావణ’ పేరెందుకు?
సాక్షి, న్యూఢిల్లీ : శ్రీలంక ఇటీవల అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించిన మొట్ట మొదటి ఉపగ్రహంకు ‘రావణ’ అని ఎందుకు నామకరణం చేసింది. రామాయణ కాలంనాటి రావణాసురుడి పాత్రను నిజంగా ఆరాధిస్తోందా? అక్కడి సింహళ–బౌద్ధులు రావణుడిని తమ హీరోగా ఎందుకు పేర్కొంటున్నారు? ఎప్పటి నుంచి ? రాముడిని కూడా ఓ ఆయుధంగా చేసుకొని భారత్‌లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వాన్ని కవ్వించడం కోసం ఉపగ్రహంకు రావణ పేరును ఖరారు చేసిందా? దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఎల్టీటీఈ తీవ్రవాదులతో అవిశ్రాంత యుద్ధం చేసి విజయం సాధించిన శ్రీలంక ప్రభుత్వం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి సారించి ఓ ఉపగ్రహాన్ని తయారు చేసింది. దానికి ‘రావణ–1’గా నామకరణం చేసి జూన్ 19వ తేదీన విజయవంతంగా అంతరిక్షంలోకి పంపించింది. ఎక్కువ మంది భారతీయుల దృష్టిలో రావణుడు ఓ దుష్ట రాజు. అతను రాముడి చేతుల్లో మరణిస్తాడు. శ్రీలంక మెజారిటీలైన సింహళీయులు కూడా రాముడి చేతుల్లోనే రావణుడు మరణించారని నమ్ముతున్నారు. రావణుడి సోదరుడైన విభూషణడి కుట్ర వల్ల రావణుడు మరణిస్తారని, రావణాసురుడు రాముడికన్నా మంచి రాజని వారు నమ్ముతున్నారు. వారేకాకుండా తమిళనాడులో ద్రావిడ ఉద్యమకారులు కూడా రావణుడినే తమ ద్రవిడ హీరోగా పరిగణిస్తూ వచ్చారు. రాముడిని వారు ఆర్యుడిగానే ద్వేషించారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి సీఎన్ అన్నాదురై కూడా రావణుడినే హీరోగా కీర్తించారు. ఒకరకంగా ద్రావిడ ఉద్యమానికి రావణుడి పాత్రే స్ఫూర్తినిచ్చింది. 2,500 సంవత్సరాల క్రితం జరిగినట్లు చెబుతున్న రామాయణంకు సంబంధించి కొన్ని వందల పుస్తకాలు ఉన్నాయని, అవన్నీ కూడా వాల్మికీ సంస్కృతంలో రాసిన రామాయణం మహా కావ్యానికి భిన్నంగానే ఉన్నాయని ప్రముఖ విద్యావేత్త ఏకే రామానుజన్ చెప్పారు. ఒక్క భారత్‌లోని కేరళలోనే 29 రకాల రామాయణాలు ఉన్నాయి. వాటిలో కూడా కొన్ని రావణుడినే హీరోగా పేర్కొన్నాయి. రామాయణం నిజంగా జరిగినట్లు చెప్పడానికి సరైన చారిత్రక ఆధారాలు లేకపోవడం వల్ల అన్ని రామాయణ పుస్తకాలు పుట్టుకొచ్చాయన్నది చరిత్రకారుల వాదన. అసలు రామాయణం పేర్కొన్న లంక, శ్రీలంక కాకపోవచ్చని, నీటితో చుట్టుముట్టి ఉన్న దీవులన్నింటినీ లంకలుగా వ్యవహరిస్తారన్నది కూడా వారి వాదనే. 1940 సింహళ–తమిళుల ఘర్షణ శ్రీలంకలో మెజారిటీలైన సింహళులు, మైనారిటీలైన తమిళుల మధ్య 1940 దశకంలోనే ఘర్షణలు మొదలయ్యాయి. తాము ఆదివాసులమని, తామే శ్రీలంకకు అసలైన వారసులమన్న వాదనను సింహళీయులు తీసుకొచ్చారు. పరభాషా ప్రభావాన్ని తొలగించి ఆ భాషను శుద్ధి చేయాలనే లక్ష్యంతో సాహితీవేత్త కుమారతుంగ మునిదాస 1941లో ‘హేల అవులా’ అన్న సాహితీ సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ సింహళ భాషాభివృద్ధికి కృషి చేయడంతోపాటు సంసృతిని పునరుద్ధరించడంలో భాగంగా రావణ రాజును తీసుకొచ్చింది. సింహళీలులకు హీరోగా పేర్కొంటు రచనలను మొదలుపెట్టింది. అయినా అనుకున్న స్థాయిలో ఫలితం రాలేదు. 1987లో భారత శాంతి దళం ప్రవేశంతో శ్రీలంక ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెడుతున్న ఎల్టీటీఈ తీవ్రవాదులను అణచివేసేందుకు 1987లో భారత శాంతి పరిరక్షక దళం శ్రీలంకలో అడుగుపెట్టింది. అప్పుడు దానికి వ్యతిరేకంగా రామాయణాన్ని దృష్టిలో పెట్టుకొనే ‘మంకీ ఆర్మీ’ వచ్చిందంటూ వామపక్ష భావాలు కలిగిన ‘జనతా విముక్తి పెరమున’ అనే సంస్థ పోస్టర్లను వేసింది. అప్పటికే భారత పట్ల వ్యతిరేకత చూపే సింహళ–బౌద్ధులు రావణుడిని హోరాగా చేస్తూ అనేక నాటకాలు వేయడం ప్రారంభించారు. ఆ తర్వాత టీవీ, రేడియోల్లో కూడా రావణడిపై నాటకాలు, రూపకాలు, పాటలు ప్రసారమయ్యాయి. పుస్తకాలు, వ్యాసాలూ వెలువడ్డాయి. 2009లో ఎల్టీటీఈ ఓడిపోయి భారత దళాలు వెనక్కి వెళ్లిపోయాక వీధి వీధిన రావణుడి విగ్రహాలు వెలిశాయి. ఆ తర్వాత ప్రత్యేక ఈలం గొడవ లేకపోవడంతో రావణుడిని పెద్దగా పట్టించుకోలేదు. భారత్ పట్ల ద్వేషమా? భారత్, శ్రీలంక మధ్య బలమైన సాంస్కృతిక, ఆర్థిక, నైసర్గిక సంబంధాలు ఉన్నాయి. ఇవి రాజకీయాలకు అతీతమైనవి. దౌత్య సంబంధాల విషయంలో ఇరు దేశ ప్రభుత్వాలు ఒకటి, రెండు సందర్భాల్లో మినహా తమ రాజకీయాలను పక్కన పెట్టి వ్యవహరించాయి. వ్యవహరిస్తున్నాయి. కనుక మన ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో ‘రావణ’ పేరును ఖరారు చేయలేదు. మెజారిటీలైన సింహళీయులు హీరోగా రావణుడి పరిగణించడం ఒక కారణమైతే, అసలు కారణం మరోటి ఉంది. రావణుడి కాలంలో పుష్పక విమానం ఉంది కనుక, అప్పటికే తమకు అంతటి శాస్త్ర పరిజ్ఞానం ఉందని గుర్తు చేయడంలో భాగంగా ‘రావణ’ పేరు పెట్టారని కొలంబో యూనివర్శిటీ చరిత్ర విభాగం సీనియర్ లెక్చరర్ నిర్మల్ రంజిత్ దేవసిరి తెలిపారు. -
హ్యూస్, ఎయిర్టెల్ జట్టు
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్, హ్యూస్ కమ్యూనికేషన్స్ ఇండియా (హెచ్‌సీఐఎల్) సంస్థలు దేశీయంగా తమ తమ వీశాట్ శాటిలైట్ కార్యకలాపాలను విలీనం చేయాలని నిర్ణయించుకున్నాయి. విలీన సంస్థలో హ్యూస్కు మెజారిటీ యాజమాన్య అధికారాలు ఉండనుండగా.. ఎయిర్‌టెల్‌కు గణనీయంగా వాటాలు ఉంటాయని ఇరు సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. బ్రాడ్‌బ్యాండ్ శాటిలైట్ నెట్వర్క్స్, సర్వీసుల సంస్థ హ్యూస్ నెట్వర్క్ సిస్టమ్స్‌కు హెచ్‌సీఐఎల్ అనుబంధ సంస్థ. ఇది దేశీయంగా వ్యాపార సంస్థలు, ప్రభుత్వాలకు బ్రాడ్‌బ్యాండ్ నెట్వర్కింగ్ టెక్నాలజీలు, సర్వీసులు అందిస్తోంది. కంపెనీలకు, వ్యక్తులకు శాటిలైట్ ఆధారిత టెలికం, ఇంటర్నెట్ సేవలు అందించేందుకు వీశాట్ ఉపయోగపడుతుంది. -
స్పీకర్ కోడెల తనయుడి నిర్వాకం
నరసరావుపేటటౌన్: శాటిలైట్ పైరసీకి పాల్పడుతూ కోట్ల రూపాయలను దండుకుంటున్న స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు శివరామకృష్ణకు చెందిన ‘కే చానల్’ కార్యాలయంలో ఢిల్లీ హైకోర్టు నియమించిన అడ్వకేట్ కమిషన్ గురువారం సోదాలు నిర్వహించింది. పైరసీకి ఉపయోగించిన పరికరాలను స్వాధీనం చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో స్పీకర్ కోడెల తనయుడు శివరామకృష్ణ గౌతమ్ కమ్యూనికేషన్ పేరిట కే చానల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ‘కే చానల్’కు ఈటీవీ, జెమినీ టీవీ ప్రసారాలకు మాత్రమే హక్కులు ఉన్నాయి. జీ, స్టార్ మా చానళ్లకు సంబంధించి ఆయా సంస్థల ద్వారా ఎలాంటి ప్యాకేజ్ అనుమతులు తీసుకోకుండా డీటీహెచ్ సన్ డైరెక్ట్ ద్వారా శాటిలైట్ పైరసీకి పాల్పడుతూ గత కొన్నేళ్లుగా వినియోగదారులకు ప్రసారం చేస్తున్నారు. స్టార్ మా ప్యాకేజీకి ప్రసార హక్కులు తీసుకొని ఉంటే ఒక్కో వినియోగదారుడి తరఫున రూ. 39, జీ ప్యాకేజీకి సంబంధించి రూ. 25 శివరామకృష్ణ చెల్లించాల్సి ఉంది. ఇలా ఒక్కో ఏడాదికి సుమారుగా రూ. 5.46 కోట్లతోపాటు అదనంగా జీఎస్టీ కూడా చెల్లించాల్సి ఉంటుందని పే చానళ్ల సంస్థ సభ్యులు చెబుతున్నారు. అయితే తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని శివరామ్ డీటీహెచ్ ద్వారా సాంకేతికపరమైన నేరానికి పాల్పడుతున్నారు. అదే సమయంలో వినియోగదారుల నుంచి ప్రతి నెలా కోట్లలో సొమ్ము ముక్కుపిండి మరీ వసూలుచేసుకుంటున్నారు. ఈ అక్రమ వ్యవహారాన్ని గమనించిన స్టార్ ప్లస్ ప్రతినిధులు రెండేళ్ల కిందట టూటౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే నిందితుడు స్పీకర్ కుమారుడు కావటంతో పోలీసులు కేసు నమోదు చేసేందుకు వెనుకడుగు వేశారు. దీంతో బాధితులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. స్పందించిన న్యాయస్థానం శాటిలైట్ పైరసీపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కమిషన్ సభ్యుల బృందం గురువారం నరసరావుపేటలోని స్పీకర్ కోడెల క్యాంపు కార్యాలయంలోని కే చానల్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించింది. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు అక్కడకు చేరుకొని కమిషన్ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. తమకు సహకరించకుంటే కోర్టు ధిక్కారం కింద ఫిర్యాదు చేస్తామని కమిషన్ సభ్యులు హెచ్చరించటంతో టీడీపీ నాయకులు వెనక్కి తగ్గారు. టూటౌన్ పోలీసుల సహకారంతో శాటిలైట్ పైరసీకి వినియోగించిన ఎన్కోడర్, సెట్ టాప్ బాక్స్‌లను స్వాధీనం చేసుకొని పోలీసుస్టేషన్‌కు తరలించారు. అక్కడ మధ్యవర్తుల సమక్షంలో సీజర్ నామా నిర్వహించి స్వాధీనం చేసుకున్న వస్తువులను కోర్టులో సమర్పించేందుకు తమ వెంట తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా, మాచర్ల టీడీపీ నాయకుడు కూడా ఇదే తరహాలో శాటిలైట్ పైరసీకి పాల్పడటంతో అతని కార్యాలయంపై కూడా అడ్వకేట్ కమిషన్ సభ్యులు సోదాలు నిర్వహించి పైరసీకి వినియోగించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.