ఆందోళనలో ఇస్రో
న్యూఢిల్లీ: ఎన్‌వీఎస్–02 ఉపగ్రహ కక్ష్యను పెంచేందుకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కాకపోవడంపై ఇస్రో వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. జనవరి 31వ తేదీన ప్రయోగించిన ఈ ఉపగ్రహంలోని థ్రస్టర్లను మండించేందుకు శాస్త్రవేత్తలు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. అయితే, ఆక్సిడైజర్‌ను అందించే వాల్వులు తెరుచుకోవడం లేదు. లిక్విడ్ అపోజీ మోటార్(ఎల్‌ఏఎం) వ్యవస్థ విఫలమైందని అంటున్నారు. దీంతో, ప్రత్యామ్నాయాలను వెతికే పనిలో ఉన్నారు.
ప్రస్తుతం జియో సిక్రనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్(జీటీవీ)లో ఉన్న ఈ శాటిలైట్ థ్రస్టర్లను యాక్టివేట్ చేయకుంటే అది దీర్ఘవృత్తాకార కక్ష్యలోనే ఉండిపోయే ప్రమాదముంది. ‘నిర్దేశిత దూరం దాన్ని తీసుకెళ్లాలంటే ఎల్‌ఏఎంను మండించాలి. ఎల్‌ఏఎంలో ఇంజిన్, ఆక్సిడైజర్, ఇంధనం ఉంటాయి. ఇంజిన్ యాక్టివేట్ కావాలంటే ఆక్సిడైజర్ ప్రవహించాలి. అయితే, ఆక్సిడైజర్ వాల్వులు తెరిచేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఈ ప్రక్రియ అసాధ్యంగా మారింది’అని ఓ నిపుణుడు వివరించారు.
నిపుణుల బృందం
ప్రస్తుతం జియో స్టేషనరీ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లోనే ఉండిపోయిన ఉపగ్రహాన్ని జియో స్టేషనరీ ఆర్బిట్‌లోకి తీసుకెళ్లాల్సి ఉంది. దేశ వ్యాప్తంగా నావిగేషన్ సేవలను అందించేందుకు ఇది అత్యంత కీలకం. ఎన్‌వీఎస్–02లోని ఇతర వ్యవస్థలన్నీ సక్రమంగానే పనిచేస్తున్నాయి.
భూ కేంద్రంతో సంబంధాలు కూడా సజావుగా సాగుతున్నాయి. అయితే, ఎల్‌ఏఎంను మండించలేకపోవడంతో నిర్దేశిత కక్ష్యలోకి దీనిని పంపించలేని పరిస్థితి ఏర్పడింది. ఇందుకు ప్రత్యామ్నాయాలను కనిపెట్టేందుకు ఇస్రో ప్రత్యేకంగా నిపుణులు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇవన్నీ సజావుగా సాగితే సరి, లేకుంటే ఉపగ్రహం తిరిగి భూమిపై పడిపోయే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముక్కలై మండిపోతుందా..!
ఎల్‌ఏఎంను ఫైర్ చేయకుంటే, శాటిలైట్‌ను నిర్దేశిత కక్ష్యలోకి పంపే వీల్లేదు. అందుకే, అది ఆ కక్ష్యలోనే ఉండిపోనుంది. ఈ నేపథ్యంలో దీర్ఘవృత్తాకార కక్ష్యలో ఉండే ఎన్‌వీఎస్–02 నుంచి సాధ్యమైనంత మేర సమాచారం రాబట్టుకోవడం మాత్రమే ఇస్రో చేయగలిగిందని నిపుణులు అంటున్నారు. థ్రస్టర్లను యాక్టివేట్ చేయలేని పరిస్థితుల్లో దీర్ఘవృత్తాకార కక్ష్యలో ఉండే ఎన్‌వీఎస్–02 కక్ష్యలో మార్పుల కారణంగా అంతరిక్ష వాతావరణం లాక్కెళుతుంది.
దీంతో, కక్ష్య నుంచి దూరంగా వెళ్లిపోయి వాతావరణంలోకి తిరిగి ప్రవేశిస్తుంది. తీవ్ర ఘర్షణ కారణంగా ముక్కలై మండిపోతుంది. తర్వాతి తరం నావిక్ వ్యవస్థలో భాగంగా ఇస్రో పంపే శాటిలైట్లలో ఎన్‌వీఎస్–02 రెండోది. భవిష్యత్తులో ఇటువంటి వాటిని మరికొన్నిటిని ప్రయోగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. వీటి వల్ల భారత్‌తోపాటు చుట్టుపక్కల 1,500 కిలోమీటర్ల పరిధిలోని వినియోగదారులకు జీపీఎస్, టైమింగ్ డేటా వంటి సమాచారం అందుతుంది.
Comments
Please login to add a commentAdd a comment