ఇస్రో కీర్తి కిరీటంలో మరో ఉపగ్రహం | ISRO Gears Up Launch Of INSAT 3DS Satellite flags It Off Sriharikota | Sakshi
Sakshi News home page

ఇస్రో కీర్తి కిరీటంలో మరో ఉపగ్రహం

Published Sat, Jan 27 2024 9:54 PM | Last Updated on Sun, Jan 28 2024 4:15 AM

ISRO Gears Up Launch Of INSAT 3DS Satellite flags It Off Sriharikota - Sakshi

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’ కీర్తి కిరీటంలో మరో ఉపగ్రహం ప్రకాశించనుంది. వాతావరణ రంగంలో సేవలందించేందుకు ప్రత్యేకంగా ఉద్దేశించిన ఇన్శాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని త్వరలో శ్రీహరికోట నుంచి రోదసికి ప్రయోగించేందుకు ఇస్రో ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం కక్ష్యలో పరిభ్రమిస్తూ ఇన్శాట్-3డీ, ఇన్శాట్-3డీఆర్ ఉపగ్రహాలు అందిస్తున్న సేవలకు కొనసాగింపుగా ఇన్శాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని త్వరలో జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్ సాయంతో నింగికి ప్రయోగించనున్నారు. కేంద్రప్రభుత్వ ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ కోసం ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు.

ఫిబ్రవరి 17-మార్చి 17 తేదీల మధ్య ఎప్పుడైనా దాన్ని ప్రయోగించేలా లాంచ్ విండోను ఇస్రో నిర్ణయించింది. ఆ తేదీల మధ్య కాలంలో రాకెట్ గమన మార్గానికి అవాంతరాలు కలుగకుండా ముందుజాగ్రత్త చర్యగా వైమానిక సంస్థలకు ఇస్రో ఇప్పటికే నోటమ్ (నోటీస్ టు ఎయిర్ మిషన్స్) జారీ చేసింది. అంతా సవ్యంగా ఉంటే, వీలు కుదిరితే ఫిబ్రవరి మాసం మధ్యలోనే ఉపగ్రహాన్ని రోదసిలో ప్రవేశపెట్టాలని ఇస్రో యోచిస్తోంది. బెంగళూరులోని ప్రొఫెసర్ యు.ఆర్.రావు శాటిలైట్ సెంటరులో ఇప్పటికే అసెంబ్లింగ్, ఇంటిగ్రేషన్ కార్యక్రమాలతోపాటుగా కీలక పరీక్షలన్నిటినీ విజయవంతంగా పూర్తిచేసుకున్న ఇన్శాట్-3డీఎస్ ఉపగ్రహం శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంటోంది.

వాతావరణ సంబంధమైన  అధ్యయనం నిర్వహించే ఈ ఉపగ్రహం బరువు ప్రయోగ సమయంలో 2,275 కిలోలు ఉంటుంది. వాతావరణ అంచనాలు రూపొందించడానికి, విపత్తుల గురించి ముంచే హెచ్చరించడానికి వీలుగా తనలోని అత్యాధునిక శాస్త్రీయ పరికరాలతో భూ, సముద్ర ఉపరితలాలను ఇన్శాట్-3డీఎస్ ఉపగ్రహం పరిశీలిస్తుంది. ఇమేజర్లు, డేటా రిలే ట్రాన్స్పాండర్ (డీఆర్టీ), శాటిలైట్ ఎయిడెడ్ సర్చ్ అండ్ రెస్క్యూ (ఎస్ఏఎస్ & ఆర్) ట్రాన్స్పాండర్ తదితర పరికరాలను దానిలో అమర్చారు. 

మార్చిలో నింగికి ‘నిసార్’…  
ఇస్రో ఆధ్వర్యంలో ఈ ఏడాది మార్చి నెలలో ‘నిసార్’ ఉపగ్రహ ప్రయోగం జరగనుంది. ‘నిసార్’ అంటే నాసా-ఇస్రో సింథటిక్ ఆపెర్చర్ రాడార్. ఇదొక భూ పరిశీలక రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం. ఈ రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’, మన ఇస్రోల సంయుక్త ప్రాజెక్టు. ‘నిసార్’ ప్రయోగంలో వాడే ఉపగ్రహ వాహక నౌక (జీఎస్ఎల్వీ)కు తాజా ఇన్శాట్-3డీఎస్ ప్రయోగం అర్హతా పరీక్ష లాంటిదని అంతరిక్ష రంగ నిపుణులు అంటున్నారు.

ఎందుకంటే... ‘నిసార్’ అనేది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎర్త్ ఇమేజింగ్ శాటిలైట్. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.12,500 కోట్లు. సింథటిక్ అపెర్చర్ రాడార్ (సార్) అమర్చిన ‘నిసార్’… భూమి సంబంధ మార్పుల్ని పరిశీలిస్తుంది. చిత్తడి నేలల స్థితిగతులు, అగ్నిపర్వతాల కారణంగా నేల రూపురేఖల్లో సంభవించే మార్పులను గమనిస్తుంది. అలాగే భూమిపై శీతలావరణం (క్రయోస్ఫియర్)కు సంబంధించి మంచు పలకలు, హిమనీనదాలు, సముద్ర మంచులో కలిగే మార్పులను క్షుణ్ణంగా శోధిస్తుంది.

:::: జమ్ముల శ్రీకాంత్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement