
హైకోర్టు ఆదేశాలను ధిక్కరించిన ఏపీ అధికారిపై ‘సుప్రీం’ సీరియస్
చట్టానికి అతీతులమని భావించొద్దు.. తక్షణమే అరెస్టులకూ వెనుకాడం..
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించిన ఓ ప్రభుత్వ అధికారిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందుకు ‘జైల్లో ప్రభుత్వ ఆతిథ్యాన్ని ఆస్వాదించండి..’ అని వ్యాఖ్యానించింది. కోర్టు ధిక్కార అప్పీళ్లను కొట్టివేసేందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ నిరాకరించటాన్ని సవాల్ చేస్తూ ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న అధికారి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిహ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ పిటిషన్‌ను విచారించింది.
ఇదీ నేపథ్యం..
2013 డిసెంబరు 11న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ధిక్కరిస్తూ నాడు తహసీల్దార్‌గా ఉన్న అధికారి 2014 జనవరిలో గుంటూరు జిల్లాలో గుడిసెలను బలవంతంగా తొలగించారంటూ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని విచారించిన హైకోర్టు సింగిల్ జడ్జి.. ఉద్దేశపూర్వకంగా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు ఆ అధికారికి రెండు నెలల జైలు శిక్ష విధించారు. దీనిపై జోక్యం చేసుకునేందుకు డివిజన్ బెంచ్ నిరాకరించటాన్ని సవాల్ చేస్తూ ఆ అధికారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
అధికారులు చట్టానికి అతీతులమని భావించొద్దు..
మురికి వాడలను కూల్చివేయొద్దని ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించి 80 మంది పోలీసులను తీసుకెళ్లారా? అని సుప్రీం కోర్టులో తాజా విచారణ సందర్భంగా జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ప్రశ్నించింది. న్యాయస్థానం ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తే తక్షణమే అరెస్టు చేస్తామని హెచ్చరించింది. “ఆయన ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారు? అమరావతి, విజయవాడ, తీహార్‌లో ఏదో ఒక జైలు ఎంపిక చేసుకొనేందుకు అవకాశం ఇస్తాం. అధికారులు తాము చట్టానికి అతీతులమని భావించరాదు.. ‘ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
‘చట్టాన్ని గౌరవించని వారికి ఎలాంటి మినహాయింపు లేదు. హైకోర్టు వారించినప్పటికీ మురికివాడలను ఎలా కూల్చివేశారు?’ అని జస్టిస్ గవాయ్ సదరు అధికారిని నిలదీశారు. కేవలం మందలించడం మాత్రమే కాకుండా హైకోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందుకు సదరు అధికారిని డిప్యూటీ కలెక్టర్ స్థాయి నుంచి మళ్లీ తహసీల్దార్ స్థాయికి తగ్గించే విషయాన్ని తెలియచేయాలని పిటిషనర్ తరపు న్యాయవాదికి సుప్రీం సూచించింది.
సంబంధిత అధికారి తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రోటోకాల్ డైరెక్టర్‌గా ఉన్న పిటిషనర్‌కు ఇద్దరు పిల్లలున్నారని, జైలులో ఉంటే ఉద్యోగం పోతుందని కోర్టుకు నివేదించారు. దీనిపై మండిపడ్డ జస్టిస్ గవాయ్ ధర్మాసనం... సదరు అధికారి కూలగొట్టిన ఇళ్లలో ఉంటున్న పిల్లల సంగతేమిటని ప్రశ్నించింది. ఆ అధికారి జైలులో ప్రభుత్వ ఆతిథ్యాన్ని పొందాలని లేదా కూల్చివేతలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు భారీగా పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది. దీనిపై తదుపరి విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసిన సుప్రీం ధర్మాసనం అప్పటి వరకు హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది.