సాక్షి, విజయవాడ: చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు. న్యాయం తన వైపే ఉందని.. హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్తానన్నారు. ఘటన జరిగిన రోజు బాలిక తండ్రి పిలిస్తేనే తాను వెళ్లానని.. కానీ తనపై అనవసరంగా ఫోక్సో కేసు పెట్టారని చెవిరెడ్డి అన్నారు. ఈ కేసును సుప్రీంకోర్టులోనే తేల్చుకుంటానని చెవిరెడ్డి స్పష్టం చేశారు.
అసలు జరిగింది ఇదే..
కాగా, తిరుపతి జిల్లాలో ఓ బాధిత బాలికకు అండగా నిలిచినందుకు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై ఏకంగా 11 సెక్షన్ల కింద అక్రమ కేసు నమోదు చేయడం చంద్రబాబు సర్కారు అరాచక పాలన, దుర్మార్గాలకు పరాకాష్టగా నిలుస్తోంది. చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారిపాలెం మండలానికి చెందిన 14 ఏళ్ల బాలిక పాఠశాల నుంచి వస్తుండగా కొద్ది రోజుల క్రితం కొందరు యువకులు దాడి చేసి అపహరించుకుపోయారు.
కుమార్తె కోసం గాలిస్తూ వచ్చిన ఆమె తండ్రి ముళ్ల పొదల్లో బాధితురాలిని గుర్తించినట్లు చెప్పారు. ‘బడి నుంచి వస్తున్న నా బిడ్డపై దుర్మార్గులు దాడి చేశారు. ముళ్ల పొదల్లో పడవేశారు. ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు అడ్డగించి కత్తితో దాడిచేశారు. నీళ్లలో మత్తు బిళ్లలు కలిపి తాగించారు. చేతిపై, కడుపుపై కత్తితో కోశారు. గంటవరకు బాలిక సృహలో లేదు.
నా పరువు పోయినా పరవాలేదు.. పోలీసులు నిందితులను పట్టుకుని స్టేషన్‌కు తెచ్చి ఉరితీయాలి.. అప్పుడే మాకు న్యాయం జరిగినట్లు..’ అంటూ బాధిత బాలిక తండ్రి విలపించాడు (ఆ వీడియో కూడా ఉంది). ఈ ఘటన గురించి తెలియడంతో వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చలించిపోయారు. వెంటనే 80 కిలోమీటర్లు దూరం ప్రయాణించి బాధిత బాలికను, కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. పరామర్శించేందుకు వెళ్లి న్యాయం కోసం నిలబడిన చెవిరెడ్డిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment