![Aditya L1 mission launch is scheduled for the 2nd of September 2023 - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/1/ADIYA%20L1.jpg.webp?itok=Urxn4uQ-)
సతీష్ ధవన్ స్పేస్ సెంటర్‌లో సిద్ధంగా ఉన్న పీఎస్‌ఎల్‌వీ సీ57
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): నిమిత్తం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శనివారం తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ57 రాకెట్ ద్వారా ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగించబోతోంది. రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం ఉదయం 11.50 గంటలకు ఈ ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు నిర్వహించనున్నారు. ఇందుకోసం శుక్రవారం ఉదయం 11.50 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు.
గురువారం షార్‌లోని బ్రహ్మప్రకాష్‌హాలులో మిషన్ సంసిద్ధత సమావేశం నిర్వహించారు. పీఎస్‌ఎల్‌వీ సీ57 రాకెట్‌కు అన్ని పరీక్షలు నిర్వహించి లాంచ్ ఆథరైజేషన్ బోర్డు(ల్యాబ్)కు అప్పగించారు. ల్యాబ్ చైర్మన్ రాజరాజన్ రాకెట్‌కు మరోసారి పరీక్షలు నిర్వహించి.. కౌంట్‌డౌన్, ప్రయోగ సమయాన్ని అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం ఇస్రో చైర్మన్ సోమనాథ్ షార్‌కు రానున్నారు. సహచర శాస్త్రవేత్తలతో సమీక్ష నిర్వహించి కౌంట్‌డౌన్ ప్రక్రియను పరిశీలిస్తారు.
సూర్యుడు ఒక మండే అగ్నిగోళం.. అక్కడికి ఉపగ్రహాన్ని పంపిస్తే కాలిపోతుంది కదా.. అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. వాస్తవానికి ఈ ప్రయోగంలో భూమి నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజియన్ బిందువు–1(ఎల్–1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి దాదాపు 1,470 కిలోల బరువున్న ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీనివల్ల గ్రహణాలతో సంబంధం లేకుండా సౌరగోళంపై నిరంతరం అధ్యయనం చేసేందుకు అవకాశం లభిస్తుంది. అక్కడికి చేరుకోవాలంటే 175 రోజుల సమయం పడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment