పీఎస్‌ఎల్‌వీ–సీ59 ప్రయోగం సక్సెస్‌  | ISRO PSLV C59 Proba 3 Satellite Launch Live Full Details | Sakshi
Sakshi News home page

పీఎస్‌ఎల్‌వీ–సీ59 ప్రయోగం సక్సెస్‌ 

Published Thu, Dec 5 2024 4:07 PM | Last Updated on Fri, Dec 6 2024 5:58 AM

ISRO PSLV C59 Proba 3 Satellite Launch Live Full Details

విజయవంతంగా కక్ష్యలోకి చేరిన ప్రోబా–3 మిషన్‌  

సాంకేతిక లోపాన్ని సరిచేసి 24 గంటల్లోపే ప్రయోగం   

రెండు శాటిలైట్లతో సూర్యుడి కరోనా వలయంలో పరిశోధనలు   

సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇస్రో చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ–సీ59 రాకెట్‌ ప్రయోగం విజయంతమైంది. తిరుపతి జిల్లా సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌–షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి గురువారం సాయంత్రం 4.04 గంటలకు రాకెట్‌ను ప్రయోగించారు. యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీకి చెందిన 550 కిలోల బరువైన ప్రాజెక్ట్‌ ఫర్‌ ఆన్‌బోర్డు అటానమీ(ప్రోబా)–3 మిషన్‌ను విజయవంతంగా కక్ష్యలోకి చేర్చారు. 

ఇందులో రెండు ఉపగ్రహాలు ఉన్నాయి. భూమి దూరంగా 60,530 వేల కిలోమీటర్లు, దగ్గరగా 600 కిలోమీటర్ల ఎత్తులోని జియో ఎలిప్టికల్‌ ఆర్బిట్‌లోకి ప్రోబా–3 చేరుకుంది. వాస్తవానికి బుధవారం సాయంత్రం 4.08 గంటలకు చేపట్టాల్సిన ఈ ప్రయోగాన్ని 25.30 గంటల ముందు.. అంటే మంగళవారం మధ్యాహ్నం 2.38 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించారు. బుధవారం ప్రయోగం నిర్వహించబోయే 48 నిమిషాలకు ముందు ప్రోబా–3 నుంచి సిగ్నల్స్‌ అందలేదు. 

సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయోగాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. ఉపగ్రహంలో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని యూరోపియన్‌ శాస్త్రవేత్తలు, ఇస్రో శాస్త్రవేత్తలు కలిసి సరిచేశారు. 24 గంటల్లోపే ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించి ప్రశంసలందుకున్నారు. గురువారం ఉదయం 8.04 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. 8 గంటల అనంతరం సాయంత్రం 4.04 గంటలకు రాకెట్‌ నింగిలోకి నిప్పులు చిమ్ముకుంటూ దూసుకెళ్లింది. సరిగ్గా 18.39 నిమిషాలకు ప్రోబా–3ని కక్ష్యలోకి విడిచిపెట్టింది. షార్‌ నుంచి ఇది 95వ ప్రయోగం కాగా, పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 61వ ప్రయోగం.  

సూర్యుడిపై పరిశోధనల కోసమే  
యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్నీ రూపొందించిన 550 కిలోల బరువైన ప్రోబా–3లో రెండు వేర్వేరు ఉపగ్రహాలను అమర్చి పంపారు. సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో ఆదిత్య–ఎల్‌1 ఉపగ్రహాన్ని ప్రయోగించిన విషయం తెలిసిందే. యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్నీ వారు ఈ తరహా పరిశోధనలకు శ్రీకారం చుట్టారు. ప్రోబా–3 కూడా ఆదిత్య ఎల్‌1 ఉపగ్రహంతో అనుసంధానమై పని చేస్తుంది. ఇందులో కరోనాగ్రాఫ్‌ స్పేస్‌క్రాఫ్ట్, ఆకల్టర్‌ అనే మరో స్పేస్‌క్రాఫ్ట్‌లను అమర్చి పంపించారు. సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనా వలయంలో పరిశోధనలు చేయడం వీటి ముఖ్య ఉద్దేశం. ప్రోబా–3లో అమర్చిన రెండు ఉపగ్రహాలు పరస్పరం సమన్వయంతో ఒక క్రమ పద్ధతిలో భూకక్ష్యలో పరిభ్రమిస్తూ పని చేస్తాయి. ఈ తరహా ప్రయోగం చేపట్టడం ప్రపంచంలోనే ఇదే మొదటిసారి. ప్రోబా–3 నుంచి ఆ్రస్టేలియాలోని యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ శాటిలైట్‌ స్టేషన్‌కు సంకేతాలు అందడం మొదలైనట్లు సైంటిస్టులు తెలిపారు.  

రాకెట్‌ ప్రయాణమిలా... 
→ 44.5 మీటర్లు ఎత్తు కలిగిన పీఎస్‌ఎల్‌వీ–సీ59 రాకెట్‌ ప్రయోగ సమయంలో 320 టన్నుల బరువుతో నింగి వైపునకు దూసుకెళ్లింది.  
ళీ మొదటిదశ అయిన కోర్‌ అలోన్‌ దశలో 139 టన్నుల ఘన ఇంధనం, దీనికి చుట్టూరా ఆరు స్ట్రాపాన్‌ బూస్టర్లు, ఒక్కో స్ట్రాపాన్‌ బూస్టర్‌లో 12.2 టన్నుల ఘన ఇంధనం, ఆరు స్ట్రాపాన్‌ బూస్టర్లలో కలిపి 73.5 టన్నుల ఇంధనం, మొదటిదశలో మొత్తం కలిపి 212.5 టన్నుల ఘన ఇంధనాన్ని వినియోగించి 109 సెకండ్లకు పూర్తి చేశారు.  
→ 41 టన్నుల ద్రవ ఇంధనం సాయంతో 262 సెకండ్లలో రెండోదశ పూర్తయ్యింది.
→ 7.65 టన్నుల ఘన ఇంధనంతో 489 సెకండ్లకు మూడో దశ ముగిసింది.  
→ 2.5 టన్నుల ద్రవ ఇంధనంతో 1,015 సెకండ్లకు నాలుగో దశను కటాఫ్‌ చేశారు. ప్రోబా–3 మిషన్‌ను ఆర్బిట్‌లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు.  
 

ISRO:  ప్రోబా-3 మిషన్ సక్సెస్

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement