
ఇస్రోను వేధిస్తున్న నావిగేషన్ సిస్టం సమస్యలు
ఇంకా అందుబాటులోకి రాని భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థ
7 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టినా తప్పని ఇబ్బందులు
ఇస్రో శాస్త్రవేత్తల కృషి ఎప్పటికి ఫలిస్తుందో
సూళ్లూరుపేట: భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ ప్రయోగాల్లో ఇస్రో బాలారిష్టాలను దాటలేకపోతోంది. ఇప్పటికే 7 ఉపగ్రహాలను ప్రయోగించినా అనుకోని సాంకేతిక అవాంతరాలతో సత్ఫలితాలను సాధించలేకపోతోంది. భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ (ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం) వ్యవస్థలో ఇంకా తప్పటడుగులు పడుతూనే ఉన్నాయి. ఈ ఏడు ఉపగ్రహాల సిరీస్‌లో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్–1 ఉపగ్రహం సాంకేతిక లోపంతో పని చేయడం లేదు.
దీనిస్థానంలో 2017 ఆగస్ట్ 31న ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్–1హెచ్ పేరుతో చేసిన ప్రయోగం విఫలమైంది. మళ్లీ ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్–1ఐ ఉపగ్రహాన్ని ప్రయోగించి ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్–1ఏ స్థానంలో ప్రవేశపెట్టినప్పటికీ సొంత నావిగేషన్ వ్యవస్థ అందుబాటులోకి రాలేదు. ఇదిలావుండగానే ఈ నావిగేషన్ వ్యవస్థలో సెకండ్ జనరేషన్ శాటిలైట్ వ్యవస్థ పేరుతో నావిక్–01 ఉపగ్రహాన్ని 2023లో ప్రయోగించారు.
ఈ ఏడాది జనవరి 31న నావిక్–02 ఉపగ్రహాన్ని ప్రయోగించారు. నావిగేషన్ ఉపగ్రహాల శ్రేణిలో కొన్నింటికి కాలపరిమితి ముగియనుండటంతో వాటి స్థానంలో నావిక్ ఉపగ్రహాలను ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. నావిక్–02 ఉపగ్రహం జియో ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ నుంచి జియో ఆర్బిట్‌లోకి ఇంకా చేరలేదు. ఉపగ్రహంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అపోజి ఇంధనాన్ని మండించేందుకు ఆక్సిడైజర్ వాల్‌్వలు తెరుచుకోకపోవడం వల్ల కక్ష్య దూరాన్ని పెంచలేకపోతున్నారు. ఈ ఉపగ్రహం కూడా విఫలమైనట్టుగానే ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీంతో భారతదేశానికి సొంత నావిగేషన్ వ్యవస్థ ఎప్పటికి అందుబాటులోకి వస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది.
7 ఉపగ్రహాల అవసరాన్ని గుర్తించి..
భారతదేశానికి పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నావిగేషన్ సిస్టం తయారు చేసుకోవడానికి ఏడు ఉపగ్రహాల అవసరాన్ని 2006లో ఇస్రో గుర్తించింది. దీనికి రూ.3,425 కోట్ల వ్యయం అవుతుందని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. దీనికి కేంద్రం ఆమోద ముద్ర వేసి బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించింది. భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థలో మొత్తం ఏడు ఉపగ్రహాలకు రూ.1,000 కోట్లు, రాకెట్లకు రూ.1,125 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. ఈ ఉపగ్రహ వ్యవస్థకు ప్రత్యేకంగా బెంగళూరు సమీపంలోని బైలాలు అనే ప్రాంతంలో రూ.1,300 కోట్లతో గ్రౌండ్ స్టేషన్ నిర్మాణం కూడా చేశారు.
సొంత నావిగేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి 2006లోనే ప్రణాళికలు సిద్ధం చేసుకుని 2013 జూన్ 1న ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్–1ఏ) ఉపగ్రహ ప్రయోగంతో శ్రీకారం చుట్టారు. 2014 ఏప్రిల్ 4న ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్–1బీ, అక్టోబర్ 16న ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్–1సీ, 2015 మార్చి 28న ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్–1డీ, 2016 జనవరి 20న ఐఆర్‌ఎన్‌ఎస్–1ఈ, మార్చి 10న ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్–1ఎఫ్, ఏప్రిల్ 28న ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్–1జీ ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
ఇందులో 1ఏ ఉపగ్రహంలో సాంకేతిక లోపం తలెత్తడంతో దీని స్థానంలో 2017 ఆగస్ట్ 31న ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్–1హెచ్ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. అది విఫలమైంది. తిరిగి 2018 ఏప్రిల్ 12న ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్–1ఐ ఉపగ్రహాన్ని 1ఏ ఉపగ్రహం స్థానంలో రీప్లేస్ చేశారు. ఇందులో కొన్ని ఉపగ్రహాలకు కాల పరిమితి కూడా ముగియనుండటంతో నావిగేషన్ వ్యవస్థను బలోపేతం చేయడానికి సెకండ్ జనరేషన్ పేరుతో నావిక్–01 సిరీస్‌లో ఐదు ప్రయోగాలకు శ్రీకారం చుట్టగా.. వీటిలో రెండు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇందులో ఒకటి ఉపగ్రహం కక్ష్యలోకి వెళ్లినప్పటికీ దాన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల దూరంలోని జియో ఆర్బిట్‌లోకి పంపే ప్రక్రియ సాంకేతిక లోపంతో ఆగిపోయింది.
చిన్నచిన్న అవాంతరాలతో తప్పని ఇబ్బందులు
నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థలోని 7 ఉపగ్రహాల్లో 3 ఉపగ్రహాలు భూమికి 36 వేల కిలోమీటర్లు ఎత్తులోని భూస్థిర కక్ష్యలో 34 డిగ్రీలు, 83 డిగ్రీలు, 130.5 డిగ్రీ తూర్పు రేఖాంశాల వద్ద కక్ష్యలో ఉండి పనిచేస్తాయి. మిగతా నాలుగు ఉపగ్రహాలు భూమధ్య రేఖలను ఖండించే భూస్థిర కక్ష్యలోనే 55 డిగ్రీలు, 115 డిగ్రీల తూర్పు భూమధ్య రేఖాతలానికి 31 డిగ్రీల వాలుతో ఉండే కక్ష్యలో 12 ఏళ్లపాటు సేవలందిస్తాయి.
భూస్థిర కక్ష్యలో వివిధ స్థానాల్లో ఉండి పనిచేయడం ప్రారంభించి స్వదేశీ దిక్సూచి వ్యవస్థను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో లోపాలు తలెత్తడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భూమి, జల, వాయు మార్గాల స్థితిగతులు దిక్కులు తెలియజేయడం, ఆపద సమయాల్లో భూగోళానికి సంబంధించిన సమాచారం, వాహన చోదకులకు దిశానిర్దేశం, ఇంటర్నెట్‌తో అనుసంధానం, భారత విమానయాన, నౌకాయాన మార్గాలకు, సైనిక అవసరాలకు కూడా ఈ ఉపగ్రహ వ్యవస్థ అందుబాటులోకి తెచ్చేందుకు నావిగేషన్ సిరీస్ ఉపగ్రహాలను ప్రయోగిస్తూనే ఉన్నప్పటికీ చిన్న చిన్న అవాంతరాల వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే భారతదేశం అంచునుంచి సుమారు 1,500 కిలోమీటర్ల పరిధి వరకు ఈ సేవలు విస్తరించి పనిచేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment