Navigation System
-
ఇనుములో హృదయం మొలిచెనె
ఓ అధికారిగా దక్షిణ కొరియాలోని గుమి నగరంలో పనిచేసే రోబో మెట్ల మీదపడి చనిపోయింది అంటూ గత ఏడాది మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీనికి కారణం రియల్ లైఫ్‌లో అనుకోకుండా ఎదురయ్యే సంఘటనల పట్ల ఎలా స్పందించాలనే విషయం ఏఐ ఆధారిత రోబోలకు తెలియకపోవటమే. ఇకపై ఇటువంటి ఘటనలు జరగకుండా.. ఎదురుగా మెట్లు కనిపిస్తే మనుషుల్లాగా మెట్ల మీద నుంచి రోబోలు కిందకు దిగనున్నాయి.అంతేకాకుండా దారిలో పోతుంటే రోడ్డు మధ్యలో గుంత ఉంటే దాని మీద నుంచి గెంతి ముందుకెళ్లేలా తర్ఫీదు పొందిన రోబోలు ఇక మీదట రోడ్ల మీద తిరగనున్నాయి. మనం అలసిపోయి ఇంటికి వెళ్లి టీ తయారుచేసి.. కొంచెం తక్కువ చక్కెర వేసి ఇవ్వమంటే అలాగే తయారుచేసి ఇవ్వనున్నాయి. –సాక్షి ప్రతినిధి, విశాఖపట్నంకచ్చితమైన నావిగేషన్హ్యూమనాయిడ్ రోబోట్ నావిగేషన్ వ్యవస్థను మరింతగా మెరుగుపరచనుంది. ఈ మానవరూప రోబోలు క్లిష్ట పరిస్థితుల్లోనూ.. ఎటువంటి ఇబ్బందులు లేకుండా కచి్చతత్వంతో, మరింత పక్కాగా ముందుకు వెళ్లి పనులను నెరవేర్చే అవకాశం ఉంటుంది. అంటే రోడ్డుపై ఏదైనా అనుకోకుండా ఎదురుగానో.. పక్కనుంచో వచ్చే వాహనాలతో ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తే అందుకు అనుగుణంగా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు ముందుకు వెళ్లేలా రూపుదిద్దుకోనున్నాయి. వాటికి ఉండే కెమెరాలు, రాడార్లు, వివిధ సెన్సార్ల ద్వారా వాస్తవ పరిస్థితులను పక్కాగా అంచనా వేసుకుని.. మెదడు వలే విశ్లేషణ చేసుకుని ముందుకు వెళ్లనున్నాయి. తద్వారా ఏఐ ఆధారిత సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు మరింత సులభంగా రోడ్లపై సంచరించనున్నాయి. ఈ రోబోలు భౌతిక ప్రపంచంలోకి అడుగు పెట్టకముందే వర్చువల్ పరిసరాలతో శిక్షణ పొంది ఉండటం వల్ల మర మనుషులు మరింత తెలివిగా నిజ జీవిత సవాళ్లను సులభంగా ఎదుర్కొనే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉదాహరణకు.. కాస్మోస్ ఏఐతో కూడిన హ్యూమనాయిడ్ రోబో ఓ గదిలో ఉండే ఫరి్నచర్, ఎదురుపడే వ్యక్తులను ఢీ కొట్టకుండా రద్దీగా ఉండే గదిలో నడవగలదు. గదిలో ఎక్కడైనా తడి ఉంటే.. అక్కడ గెంతి దాటనూ గలదు. అంతేకాకుండా వాతావరణంలో వచ్చే సూక్ష్మమైన మార్పులను కూడా ఇది గుర్తించగలదని రూపకర్తలు ఘంటాపథంగా చెబుతున్నారు. మర మనుషులకుండే ఈ సామర్థ్యాలతో ప్రధానంగా హోటల్, హాస్పిటల్, లాజిస్టిక్స్ పరిశ్రమల్లో విరివిగా వినియోగించుకునేందుకు దోహదపడతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.అచ్చం మనుషుల మాదిరిగానే.. అచ్చం మనుషుల్లా రోజువారీ జీవితంలో ఎదురయ్యే వివిధ రకాల విషయాలను వర్చువల్‌గా రోబోలకు ఎదురయ్యేలా చేసి.. వాటిని ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై శిక్షణ ఇస్తారు. తద్వారా రోడ్డు మీద నడిచే సమయంలో మధ్యలో గుంత వస్తే.. దాటుకుని ముందుకు వెళ్లడం.. ఎవరైనా దారికి అడ్డువస్తే తప్పుకుని వెళ్లడం ఇలా అన్ని విషయాల్లో అప్పటికప్పుడు మనుషుల తరహాలో స్పందించేలా వీటిని తీర్చిదిద్దుతున్నారు. ఏదైనా పరిశ్రమలో ఈ హ్యూమనాయిడ్ రోబోలను వినియోగిస్తే.. పనిచేస్తున్న సమయంలో సమస్య తలెత్తినా ప్రత్యేకంగా ఎటువంటి ఆదేశాలు అవసరం లేకుండానే వెంటనే అది పరిష్కరించుకుని ముందుకు వెళ్లే అవకాశం ఏర్పడనుంది. అంతేకాకుండా ఆస్పత్రుల్లో ఏదైనా ఆపరేషన్ చేసే సమయంలో కూడా అకస్మాత్తుగా సమస్య తలెత్తితే కూడా పరిష్కరించుకునే విధంగా వీటిని తయారు చేస్తున్నారు. హోటల్స్‌లో మనం చెఫ్‌కు ‘ఆమ్లెట్ విత్ లెస్ స్పైసీ’ ఆర్డర్ ఇచ్చినట్టుగానే.. రోబోకు సైతం మనకు ఇష్టం నచ్చిన రుచుల్లో ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు. ఆ రోబో మనం ఇచ్చే ఆర్డర్‌కు అనుగుణంగా వంటకాలను తయారుచేసి అందించేస్తుందన్న మాట. సిద్ధమైన హ్యూమనాయిడ్ రోబో రోబోలు సైతం మనసున్న మనుషుల్లాగే అనుకోకుండా జరిగే ఘటనలకు మనుషుల తరహాలోనే స్పందించే విధంగా తయారవుతున్నాయి. ఇటువంటి హ్యూమనాయిడ్ రోబోలను నివిదియా సీఈవో జెన్షెన్ హుయాగ్ సిద్ధం చేశారు. గత నెలలో లాస్ వేగాస్‌లో జరిగిన సీఈఎస్–2025లో తన హ్యూమనాయిడ్ రోబో పరిశోధనలను ఆయన వివరించారు. ఏదైనా పనిచెబితే.. అప్పటికప్పుడు చేయడంతో పాటు నిజజీవితంలో ఎదురయ్యే వివిధ ఘటనల పట్ల శిక్షణ ఇచి్చనట్టు ఆయన తెలిపారు. ఫిజికల్ డైనమిక్ థింగ్స్.. ఫిజికల్ వరల్డ్‌ను అర్థం చేసుకునేందుకు వీలుగా 20 మిలియన్ గంటల (2 కోట్ల గంటల) వీడియోల ద్వారా హ్యూమనాయిడ్ రోబోకు శిక్షణ అందించినట్టు ఆయన పేర్కొన్నారు. -
ఐఐటీ హైదరాబాద్‌లో టైహాన్
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగర సిగలో మరో మణిహారం.. నగర శివారు లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ–హైదరాబాద్)లో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అడుగు పడింది. మానవ రహిత విమానాలు, రిమోట్ కంట్రోల్‌తో నడిచే వాహనాలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం పరీక్షించేందుకు ఉద్దేశించిన ‘టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఫర్ అటానమస్ నేవిగేషన్ సిస్టమ్స్(టైహాన్)’ ఏర్పాటుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ మంగళవారం పునాది వేశారు. వర్చువల్ పద్ధతిలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి మాట్లాడుతూ ఆత్మనిర్భర్ భారత్ దిశగా వేస్తున్న అతిపెద్ద ముందంజగా ఈ ప్రాజెక్టును అభివర్ణించారు. స్వతంత్ర నేవిగేషన్ వ్యవస్థకు సంబంధించిన పలు విభాగాలు ఈ ప్రాజెక్టులో కలసికట్టుగా పనిచేస్తాయన్నారు. మానవ రహి త విమానాల నిర్వహణలో ఎదురయ్యే వాస్తవ సమస్యలు, సవాళ్ల పరిష్కారానికి ఇది ఉపయోగపడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తంచేశారు. మానవ రహిత డ్రోన్లు, వాహనాలను ఎలాంటి అడ్డంకులు, ప్రమాదాలు లేకుండా పరీక్షించేందుకు ఇదో మేలైన వ్యవస్థగా రూపొందుతుం దని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీవీఎస్ మూర్తి తెలిపారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం ఐఐటీ–హెచ్‌కు రూ.135 కోట్లు మంజూరు చేశాయి. ప్రాజెక్టులో భాగం గా టైహాన్‌లో టెస్ట్ ట్రాక్‌లు, నిత్యజీవితంలో ఎదురయ్యే రకరకాల పరిస్థితులను తలపించేవి ఏర్పాటవుతాయి. అత్యాధునిక సిమ్యులేషన్ టెక్నాలజీలు, రహదారి వ్యవస్థలు, వీ2ఎక్స్ కమ్యూనికేషన్, డ్రోన్లు ఎగిరేందుకు, దిగేందుకు అవసరమైన రన్వేలు, ల్యాండింగ్ ఏరియాలు ఏర్పాటుచేస్తా రు. ఇటు సెంట్రలైజ్డ్ కంట్రోల్ రూమ్/గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్, హ్యాంగర్లు కూడా ఈ ప్రాజెక్టులో ఉంటాయని ఐఐటీ–హెచ్ ఓ ప్రకటనలో తెలిపింది. -
జి. సతీశ్‌రెడ్డికి అంతర్జాతీయ అవార్డు
సాక్షి, హైదరాబాద్: దేశ రక్షణ వ్యవస్థలకు కీలకమైన నావిగేషన్ వ్యవస్థలు అందించిన శాస్త్రవేత్త..డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి ప్రతిష్టాత్మకమైన ‘‘2019 మిస్సైల్ సిస్టమ్స్’’అవార్డుకు ఎంపికయ్యారు. ద అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ అస్ట్రోనాటిక్స్ (ఏఐఏఏ) ఇచ్చే ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయుడిగా సతీశ్‌రెడ్డి రికార్డు సృష్టించారు. రెండేళ్లకు ఒకసారి అందించే ఈ అత్యున్నత అవార్డును ఇప్పటివరకూ అమెరికన్లకు మాత్రమే అందిస్తుండగా.. తొలిసారి ఇతర దేశపు నిపుణుడికి ఇవ్వటం విశేషం. క్షిపణి వ్యవస్థను అభివృద్ధి, తయారీల్లో అత్యున్నత నైపుణ్యం కనబరిచే వారికి అందించే ఈ అవార్డును రోండెల్ జే.విల్సన్‌తో కలసి పంచుకోనున్నారు. అమెరికాలోని మేరీల్యాండ్‌లో మే ఏడు నుంచి తొమ్మిది వరకూ జరిగే డిఫెన్స్ ఫోరం కార్యక్రమంలో రోండెల్ ఈ అవార్డు అందుకుంటారని.. సతీశ్‌రెడ్డికి భారత్‌లోనే అంద జేస్తామని ఏఐఏఏ ఒక ప్రకటనలో తెలిపింది. కలామ్ స్ఫూర్తితో.. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని ఓ కుగ్రామంలో జన్మించిన జి.సతీశ్‌రెడ్డి అనంత పురంలోని జేఎన్టీయూ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. హైదరాబాద్‌లోని జేఎన్టీయూలో స్నాతకోత్తర విద్యతోపాటు పీహెచ్డీ కూడా పూర్తి చేసిన ఆయన 1986లో డీఆర్డీఎల్లో చేరారు. ఆ తర్వాత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలామ్ అధ్యక్షుడిగా పనిచేసిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్సీఐ)లో విధులు కొనసాగించారు. మిస్సైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్ డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ మిస్సైల్ కాంప్లెక్స్‌కు నేతృత్వం వహించారు కూడా. అంతర్జాతీయంగా అనేక నిషేధాజ్ఞలు, కట్టుబాట్లు ఉన్న తరుణంలో రక్షణ రంగంలో స్వావలంబన కోసం కృషి చేశారు. సతీశ్‌రెడ్డి డిజైన్ చేసి సిద్ధం చేసిన అత్యాధునిక ఏవియానిక్స్ వ్యవస్థలు క్షిపణులతోపాటు స్మార్ట్ గైడెడ్ బాంబుల్లోనూ వాడుతున్నారు. హోమీ జే.బాబా స్మారక బంగారు మెడల్, జాతీయ ఏరోనాటికల్ ప్రైజ్, నేషనల్ డిజైన్ అవార్డు, నేషనల్ సిస్టమ్స్ గోల్డ్ మెడల్ ఐఈఐృఐఈఈఈ (అమెరికా) అవార్డులు కూడా సతీశ్‌రెడ్డిని వరించాయి. క్షిపణి నావిగేషన్ వ్యవస్థల రూపశిల్పి భారత రక్షణ రంగంలో అత్యంత కీలకమైన క్షిపణులకు నావిగేషన్ వ్యవస్థలను డిజైన్ చేయడంతోపాటు తయారీకి అవసరమైన అనేక పరికరాలను పూర్తి స్వదేశీ టెక్నాలజీతోనే అభివృద్ధి చేసుకునేందుకు సతీశ్‌రెడ్డి కృషి చేసిన విషయం తెలిసిందే. అగ్ని, పృథ్వీ, నాగ్ క్షిపణులతోపాటు అనేక ఇతర వ్యూహాత్మక క్షిపణులకు అత్యాధునిక నావిగేషన్ వ్యవస్థలను అందించిన ఘనత సతీశ్ రెడ్డి సొంతం. రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నావిగేషన్, రాయల్ ఏరోనాటికల్ సొసైటీ, అకాడమీ ఆఫ్ నావిగేషన్ అండ్ మోషన్ కంట్రోల్ (రష్యా) సభ్యత్వం లభించిన తొలి భారతీయుడిగా సతీశ్‌రెడ్డి గుర్తింపు పొందారు. -
టూ వీలర్లకూ నావిగేషన్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహనాలకు నావిగేషన్ వ్యవస్థ? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా త్వరలోనే ఇది భారత్‌లో సాకారం కానుంది. లొకేషన్ టెక్నాలజీ కంపెనీ మ్యాప్ మై ఇండియా ఈ మేరకు ఓ ద్విచక్ర వాహన కంపెనీతో చేతులు కలిపింది. కొద్ది రోజుల్లో నావిగేషన్ వ్యవస్థ కలిగిన టూ వీలర్లు రోడ్డెక్కనున్నాయని మ్యాప్ మై ఇండియా ఎండీ రాకేశ్ వర్మ తెలిపారు. కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శివాలిక్ ప్రసాద్‌తో కలిసి బుధవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ద్విచక్ర వాహన కంపెనీకి తాము సాఫ్ట్వేర్, మ్యాప్స్ అందిస్తామని చెప్పారు. వాహన కంపెనీ పేరు ఇప్పుడే వెల్లడించలేనన్నారు. అయితే హీరో మోటోకార్ప్ ఈ దిశగా ప్రయత్నాలను మొదలు పెట్టినట్టు సమాచారం. మ్యాప్ మై ఇండి యా సహకారం అందించిన నావిగేషన్ వ్యవస్థ 30 లక్షలకుపైగా కార్లలో ప్రస్తుతం వినియోగంలో ఉంది. నూతన ఫీచర్లతో... స్మార్ట్ పర్సనల్ సేఫ్టీ ఉపకరణం ‘సేఫ్‌మేట్’ ఈ ఏడాదే కొత్త ఫీచర్లతో రానుందని రాకేశ్ వర్మ తెలిపారు. ‘సిమ్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. బ్యాటరీ ఒకసారి చార్జ్ చేస్తే 7 రోజులు వచ్చేలా డిజైన్ చేస్తున్నాం. అత్యవసర సమయాల్లో బటన్ నొక్కితే నిక్షిప్తం అయి ఉన్న నాలుగు నంబర్లకు ఫోన్ కాల్ వెళుతుంది. ప్రపంచంలో ఎక్కడున్నా ఇంటి నంబర్లతోసహా రియల్ టైం లొకేషన్ తెలుస్తుంది. లొకేషన్‌తో కూడిన అలర్టులు ఎస్ఎంఎస్, ఈమెయిల్ రూపంలో వెళ్తాయి. ఈ ఉపకరణం ఉన్నవారి దగ్గర స్మార్ట్‌ఫోన్ ఉండాల్సిన అవసరం లేదు. సేఫ్‌మేట్ సేవలు పొందాలంటే కస్టమర్లు నెలకు రూ.100 అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఉపకరణం ధర రూ.4,000 ఉండొచ్చు’ అని వివరించారు. గూగుల్ మ్యాప్స్‌కు ప్రత్యామ్నాయంగా ఆధునీకరించిన సేవలను త్వరలో పరిచయం చేస్తున్నట్టు చెప్పారు. -
‘గగన్’ ప్రారంభం
దేశీయ నావిగేషన్ వ్యవస్థను ప్రారంభించిన కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు న్యూఢిల్లీ: భారత ఉపఖండ ప్రాంతంలో విస్తృతమైన నావిగేషన్ సౌకర్యాన్ని కల్పించే.. దేశీయ నావిగేషన్ వ్యవస్థ ‘గగన్ (జీపీఎస్ ఎయిడెడ్ జియో అగుమెంటెడ్ నావిగేషన్)’ పని ప్రారంభించింది. పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు సోమవారం దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. బంగాళాఖాతం, ఆగ్నేయాసియా, పశ్చిమాసియా దేశాల నుంచి ఆఫ్రికా వరకు పనిచేసే వ్యవస్థను ఇస్రో, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేశాయి. రూ.774 కోట్ల అంచనాతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా ఇస్రో పలు కృత్రిమ ఉపగ్రహాలనూ ప్రయోగిస్తోంది. గత ఏడాదే ప్రయోగించిన‘జీశాట్-8, జీశాట్-10’ శాటిలైట్లు నావిగేషన్ సిగ్నల్స్‌ను పంపుతున్నాయి. ఈ నావిగేషన్ వ్యవస్థ సైనిక, పౌర విమాన సర్వీసులను సమర్థవంతంగా నిర్వహించేందుకు, వ్యయాలను తగ్గించేందుకు, భద్రతకు తోడ్పడుతుంది. ‘గగన్’ను ఆవిష్కరించిన అనంతరం అశోక్‌గజపతిరాజు మాట్లాడారు. రవాణా, వ్యవసాయం తదితర అవసరాలకూ ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగకరమని చెప్పారు. ‘గగన్’ను ప్రారంభించడంతో ఇప్పటికిప్పుడు 50 విమానాశ్రయాలకు ప్రయోజనకరమని, సార్క్ దేశాలన్నీ కూడా ఈ నావిగేషన్‌ను వినియోగించుకోవచ్చని పౌర విమానయానశాఖ కార్యదర్శి ఆర్.ఎన్.చౌబే చెప్పారు.