హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహనాలకు నావిగేషన్ వ్యవస్థ? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా త్వరలోనే ఇది భారత్‌లో సాకారం కానుంది. లొకేషన్ టెక్నాలజీ కంపెనీ మ్యాప్ మై ఇండియా ఈ మేరకు ఓ ద్విచక్ర వాహన కంపెనీతో చేతులు కలిపింది. కొద్ది రోజుల్లో నావిగేషన్ వ్యవస్థ కలిగిన టూ వీలర్లు రోడ్డెక్కనున్నాయని మ్యాప్ మై ఇండియా ఎండీ రాకేశ్ వర్మ తెలిపారు. కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శివాలిక్ ప్రసాద్‌తో కలిసి బుధవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ద్విచక్ర వాహన కంపెనీకి తాము సాఫ్ట్‌వేర్, మ్యాప్స్ అందిస్తామని చెప్పారు. వాహన కంపెనీ పేరు ఇప్పుడే వెల్లడించలేనన్నారు. అయితే హీరో మోటోకార్ప్ ఈ దిశగా ప్రయత్నాలను మొదలు పెట్టినట్టు సమాచారం. మ్యాప్ మై ఇండి యా సహకారం అందించిన నావిగేషన్ వ్యవస్థ 30 లక్షలకుపైగా కార్లలో ప్రస్తుతం వినియోగంలో ఉంది.
నూతన ఫీచర్లతో...
స్మార్ట్ పర్సనల్ సేఫ్టీ ఉపకరణం ‘సేఫ్‌మేట్’ ఈ ఏడాదే కొత్త ఫీచర్లతో రానుందని రాకేశ్ వర్మ తెలిపారు. ‘సిమ్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. బ్యాటరీ ఒకసారి చార్జ్ చేస్తే 7 రోజులు వచ్చేలా డిజైన్ చేస్తున్నాం. అత్యవసర సమయాల్లో బటన్ నొక్కితే నిక్షిప్తం అయి ఉన్న నాలుగు నంబర్లకు ఫోన్ కాల్ వెళుతుంది. ప్రపంచంలో ఎక్కడున్నా ఇంటి నంబర్లతోసహా రియల్ టైం లొకేషన్ తెలుస్తుంది. లొకేషన్‌తో కూడిన అలర్టులు ఎస్‌ఎంఎస్, ఈమెయిల్ రూపంలో వెళ్తాయి. ఈ ఉపకరణం ఉన్నవారి దగ్గర స్మార్ట్‌ఫోన్ ఉండాల్సిన అవసరం లేదు. సేఫ్‌మేట్ సేవలు పొందాలంటే కస్టమర్లు నెలకు రూ.100 అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఉపకరణం ధర రూ.4,000 ఉండొచ్చు’ అని వివరించారు. గూగుల్ మ్యాప్స్‌కు ప్రత్యామ్నాయంగా ఆధునీకరించిన సేవలను త్వరలో పరిచయం చేస్తున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment