భారీ వర్షాలు, వరదలకు పూర్తిగా పాడైన బైకులు
ఒక్కో ద్విచక్ర వాహనానికి రిపేర్లకు రూ.5 వేల నుంచి రూ.10 వేలు
ఒక్క సింగ్‌నగర్ ప్రాంతంలోనే 25 నుంచి 30 వేలకు పైగా వాహనాల మునక
కార్లు, ఆటోలు, ఇతర వాహనాల పరిస్థితి కూడా ఇంతే
బుడమేరు వరద ధాటికి విజయవాడ నగరంలో పలు ప్రాంతాలు వారం రోజులకు పైగా నీటిలోనే ఉన్నాయి. భారీ వర్షాలు, కృష్ణా నదిలో భారీ ప్రవాహం, బుడమేరు వరద.. ఇలా అన్ని వైపులా నీరు చుట్టుముట్టడంతో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇళ్లల్లో విలువైన వస్తువులతోపాటు ద్విచక్రవాహనాలు, కార్లు సైతం నీట మునిగాయి. దీంతో అవి పూర్తిగా పాడయ్యాయి. –లబ్బీపేట (విజయవాడ తూర్పు)/మధురానగర్ (విజయవాడ సెంట్రల్)
ఒక్కో వాహనానికి రూ.వేలల్లో ఖర్చు
ఇప్పటికే వరదలతో తమ సర్వస్వాన్ని కోల్పోయి రోడ్డున పడ్డ బాధితులు ఇప్పుడు తమ వాహనాల మరమ్మతులకు కూడా భారీగా వెచ్చించాల్సి రావడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఒక్కో ద్విచక్ర వాహనం మరమ్మతులకు మెకానిక్‌లు రూ.5 వేలు నుంచి రూ.10 వేలు వసూలు చేస్తున్నారు. చేతిలో వాహనం లేకపోతే అనేక పనులు ఆగిపోతాయి కాబట్టి అప్పోసొప్పో చేసి బాగు చేయించక తప్పడంలేదని వాహనదారులు వాపోతున్నారు. విజయవాడ సింగ్ నగర్ డాబా కొట్లు సెంటర్, పైపుల రోడ్డు, ఆంధ్రప్రభ కాలనీ రోడ్డుల్లోని మెకానిక్‌ల వద్ద రిపేర్లు కోసం పెద్ద సంఖ్యలో బైక్‌లు స్కూటర్‌లు బారులు తీరాయి.
కొన్ని వాహనాల ఇంజన్లు పాడైపోవడంతో పూర్తిగా స్తంభించిపోయి కనీసం నడపడానికి కూడా వీలు కావడం లేదు. ఒక్క సింగ్‌నగర్‌లోనే 25 నుంచి 30 వేలకు పైగా ద్విచక్రవాహనాలు పాడయ్యాయని అంచనా. మరోవైపు కార్లను కూడా రిపేర్లు కోసం రికవరీ వెహికల్స్‌తో షెడ్లకు తరలిస్తున్నారు. సింగ్‌నగర్ ప్రాంతంలో సోమవారం ఎక్కడ చూసినా కార్లు తరలించే దృశ్యాలే కనిపించాయి.
మా వాహనాలన్నీ మునిగిపోయాయి..
నాకు, మా పిల్లలకు మూడు ద్విచక్రవాహనాలు, రెండు ఆటోలు ఉన్నాయి. అన్నీ వరద నీటిలో మునిగిపోయాయి. రిపేరు కోసం తీసుకెళ్తే రూ.7 వేలు నుంచి రూ.10 వేలు అవుతుందని మెకానిక్‌లు చెబుతున్నారు. ఆటోలకు ఎంత అవుతుందో తెలియడం లేదు. అంత ఖర్చు ఎలా భరించాలో అర్థం కావడం లేదు. – ఎస్‌కే కరీముల్లా, సింగ్‌నగర్
జీవనోపాధి పోయింది..
బుడమేరు వరద ఉధృతికి నా టాటా ఏస్ నీట మునిగింది. దీంతో జీవనోపాధి కోల్పోయాను. వాహనం ఇప్పుడు పనిచేయని స్థితిలో ఉంది. మరమ్మతులు చేయించాలంటే కనీసం రూ. 70 వేలు అవుతుందని అంటున్నారు. వరద వల్ల అన్నీ కోల్పోయిన నేను ఇప్పుడు అంత డబ్బులు ఎలా తీసుకురావాలో అర్థం కావడం లేదు. – గౌస్, బాధితుడు
Comments
Please login to add a commentAdd a comment