Repairs
-
స్తంభాలు, లైన్ల మరమ్మతులకు రూ.45 కోట్లు
సాక్షి, అమరావతి: ప్రజల నుంచి వచ్చే విద్యుత్ స్తంభాలు, లైన్ల మరమ్మతుల ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు రూ.15 కోట్లు చొప్పున రూ.45 కోట్లను కేటాయిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) వెల్లడించింది. 2024–25 నుంచి 2024–29 మధ్య డిస్కంల ప్రసార (వీలింగ్)చార్జీలను నిర్ణయిస్తూ మండలి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 33కేవీ, 11కేవీ, ఎల్టీ లైన్లను ఉపయోగించుకున్న వారి నుంచి డిస్కంలు వసూలు చేసేలా రూ.0.32 నుంచి రూ.2.14 వరకూ ఐదేళ్లకు వేర్వేరు చార్జీలను ప్రకటించింది. ఇన్నాళ్లూ కిలోఓల్ట్అవర్ (కేవీఏ) ప్రాతిపదికన వసూలు చేస్తున్న వీలింగ్ చార్జీలను ఇకపై ప్రతి యూనిట్ ప్రాతిపదికన వసూలు చేయాలని ఏపీఈఆర్సీ ఆదేశించింది. అయితే ఈ చార్జీల్లో గృహాలు, పబ్లిక్, ప్రభుత్వ సంస్థలకు 50 శాతం రాయితీ వర్తిస్తుందని తెలిపింది. దానివల్ల ఇళ్లపై సోలార్ రూఫ్‌టాప్ సిస్టంలు ఏర్పాటు చేసేవారి సంఖ్య పెరుగుతుందని అభిప్రాయపడింది. ఏపీ ట్రాన్స్‌కోతో పాటు డిస్కంలు కూడా ఓల్టేజ్ నిర్వహణపై మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని కోరింది. గ్రామీణ ప్రాంతాల్లో దెబ్బతిన్న విద్యుత్ లైన్లు, స్థంభాలను సరి చేయడానికి తాము కేటాయించిన నిధులను వినియోగించాలని సూచించింది. మార్చి 31 నాటికి అన్ని పెట్టుబడుల వివరాలను కమిషన్‌కు తెలియజేయాలని, తర్వాతి ఆరి్థక సంవత్సరానికి సంబంధించి డిసెంబర్ 31వ తేదీలోపు ఖర్చుల వివరాలను సమర్పించి, ఆమోదం పొందాలని కమిషన్ స్పష్టం చేసింది.రాష్ట్రంలో పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడానికి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ రూపొందించిన ‘విద్యుత్ పంపిణీ నెట్వర్క్ ప్లానింగ్ క్రైటీరియా 2023’ పత్రాన్ని అనుసరించాలని డిస్కంలను ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఉద్యోగుల ఖర్చుల్లో పెన్షన్, గ్రాట్యుటీ (పీఅండ్‌జీ) ట్రస్ట్‌లకు సంబంధించిన నిబంధనలను కమిషన్ అనుమతించింది. -
ఆటో రిపేర్‌కు 3 నెలలు
ఆటోనగర్ (విజయవాడ తూర్పు): విజయవాడను ముంచెత్తిన వరదల కారణంగా ఇక్కడి ఆటోవాలాలకు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. వరదలో మునిగిన ఆటోలు మరమ్మతులు చేయడానికి కనీసం మూడు నెలల సమయం పడుతుందని, అప్పటి వరకు వేచి ఉండాలని, లేదంటే బయట మెకానిక్‌ల వద్ద రిపేర్లు చేయించుకోవాలని షోరూం యజమానులు తెగేసి చెబుతున్నారు. దీంతో కంగుతింటున్న ఆటోవాలాలు అన్ని రోజుల పాటు ఉపాధి కోల్పోతే కుటుంబ పోషణ, ఆటోల ఈఎంఐల చెల్లింపు ఎలా అని ఆందోళన చెందుతున్నారు. ఆటో యజమానులను మరింత ఆందోళనకు గురిచేసేలా షోరూం యజమానులు ఓ ప్రతిపాదన కూడా పెడుతున్నారు. వన్‌టైం సెటిల్మెంట్ చేసుకుని ఆటోను వెనక్కి ఇచ్చేస్తే.. కట్టిన వాయిదాలను, ఆటో కండిషన్‌ను బట్టి రూ. 10 వేల నుంచి రూ. 20 వేల వరకు నగదు ఇస్తామని చెబుతున్నారు. బయట రిపేర్లంటే కష్టమే.. బయట మరమ్మతులు చేయించుకోవాలంటే కష్టమేనని, తాము ఇబ్బంది పడతామని ఆటో డ్రైవర్లు చెబుతున్నారు. కొత్త మోడళ్ల ఆటోల రిపేర్లు బయట మెకానిక్‌లకు తెలియదని, సరిగా చేయకపోతే మళ్లీ మొరాయిస్తాయని వాపోతున్నారు. షోరూం వాళ్లు మూడు నెలల సమయం పెడితే ఈఎంఐ ఎలా చెల్లించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదల కారణంగా ఇప్పటికే ఉపాధిలేక నానా ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడంలేదని చెబుతున్నారు. వన్‌టైం సెటిల్మెంట్ చేసుకోవాలంటే సంబంధిత ఫైనాన్స్ కంపెనీల నుంచి కచి్చతంగా క్లయిం నంబర్ తీసుకోవాలని, ఆ నంబర్ ఇవ్వడానికి కూడా ఫైనాన్స్ కంపెనీల ప్రతినిధులు రూ. 4 వేల నుంచి రూ. 5 వేలు డిమాండ్ చేస్తున్నారని ఆటోడ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులు, ఇతర ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల నుంచి అప్పులు చేసి ఆటోలు కొనుక్కున్నామని, ఒక్కసారిగా వరద ముంచెత్తడంతో తీవ్రంగా నష్టపోయామని, ఇప్పుడు షోరూం వాళ్ల తీరుతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నామని పలువురు ఆటో డ్రైవర్లు వాపోయారు. సమస్యను వారంలో పరిష్కరిస్తానని సీఎం చెప్పారు ఆటోల మరమ్మతులు వారం రోజుల్లో చేయిస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇది ఆచరణలో సాధ్యం కాలేదు. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. ఆటో మరమ్మతుకు మూడు నెలల సమయం పడుతుందని షోరూం వారు చెబుతున్నారు.అప్పటి వరకు ఏమి చేసి కుటుంబాన్ని నడపాలి. ఏమి చేయాలో అర్థం కావడంలేదు. వన్‌టైం సెటిల్మెంట్ చేసుకోవడం కుదరదు. గతంలో చెల్లించిన కిస్తీల పరిస్థితి ఏంటో చెప్పడంలేదు. ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించి మమ్మల్ని ఆదుకోవాలి. – ఇ.సింహాచలం, జక్కంపూడి వైఎస్సార్ కాలనీ -
మరమ్మతుల ఖర్చూ ముంచుతోంది
బుడమేరు వరద ధాటికి విజయవాడ నగరంలో పలు ప్రాంతాలు వారం రోజులకు పైగా నీటిలోనే ఉన్నాయి. భారీ వర్షాలు, కృష్ణా నదిలో భారీ ప్రవాహం, బుడమేరు వరద.. ఇలా అన్ని వైపులా నీరు చుట్టుముట్టడంతో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇళ్లల్లో విలువైన వస్తువులతోపాటు ద్విచక్రవాహనాలు, కార్లు సైతం నీట మునిగాయి. దీంతో అవి పూర్తిగా పాడయ్యాయి. –లబ్బీపేట (విజయవాడ తూర్పు)/మధురానగర్ (విజయవాడ సెంట్రల్)ఒక్కో వాహనానికి రూ.వేలల్లో ఖర్చుఇప్పటికే వరదలతో తమ సర్వస్వాన్ని కోల్పోయి రోడ్డున పడ్డ బాధితులు ఇప్పుడు తమ వాహనాల మరమ్మతులకు కూడా భారీగా వెచ్చించాల్సి రావడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఒక్కో ద్విచక్ర వాహనం మరమ్మతులకు మెకానిక్‌లు రూ.5 వేలు నుంచి రూ.10 వేలు వసూలు చేస్తున్నారు. చేతిలో వాహనం లేకపోతే అనేక పనులు ఆగిపోతాయి కాబట్టి అప్పోసొప్పో చేసి బాగు చేయించక తప్పడంలేదని వాహనదారులు వాపోతున్నారు. విజయవాడ సింగ్ నగర్ డాబా కొట్లు సెంటర్, పైపుల రోడ్డు, ఆంధ్రప్రభ కాలనీ రోడ్డుల్లోని మెకానిక్‌ల వద్ద రిపేర్లు కోసం పెద్ద సంఖ్యలో బైక్‌లు స్కూటర్లు బారులు తీరాయి.కొన్ని వాహనాల ఇంజన్లు పాడైపోవడంతో పూర్తిగా స్తంభించిపోయి కనీసం నడపడానికి కూడా వీలు కావడం లేదు. ఒక్క సింగ్‌నగర్‌లోనే 25 నుంచి 30 వేలకు పైగా ద్విచక్రవాహనాలు పాడయ్యాయని అంచనా. మరోవైపు కార్లను కూడా రిపేర్లు కోసం రికవరీ వెహికల్స్‌తో షెడ్లకు తరలిస్తున్నారు. సింగ్‌నగర్ ప్రాంతంలో సోమవారం ఎక్కడ చూసినా కార్లు తరలించే దృశ్యాలే కనిపించాయి. మా వాహనాలన్నీ మునిగిపోయాయి..నాకు, మా పిల్లలకు మూడు ద్విచక్రవాహనాలు, రెండు ఆటోలు ఉన్నాయి. అన్నీ వరద నీటిలో మునిగిపోయాయి. రిపేరు కోసం తీసుకెళ్తే రూ.7 వేలు నుంచి రూ.10 వేలు అవుతుందని మెకానిక్‌లు చెబుతున్నారు. ఆటోలకు ఎంత అవుతుందో తెలియడం లేదు. అంత ఖర్చు ఎలా భరించాలో అర్థం కావడం లేదు. – ఎస్కే కరీముల్లా, సింగ్నగర్జీవనోపాధి పోయింది.. బుడమేరు వరద ఉధృతికి నా టాటా ఏస్ నీట మునిగింది. దీంతో జీవనోపాధి కోల్పోయాను. వాహనం ఇప్పుడు పనిచేయని స్థితిలో ఉంది. మరమ్మతులు చేయించాలంటే కనీసం రూ. 70 వేలు అవుతుందని అంటున్నారు. వరద వల్ల అన్నీ కోల్పోయిన నేను ఇప్పుడు అంత డబ్బులు ఎలా తీసుకురావాలో అర్థం కావడం లేదు. – గౌస్, బాధితుడు -
‘బ్రహ్మపుత్ర’లో భారీ అగ్ని ప్రమాదం
ముంబై/న్యూఢిల్లీ: ముంబై డాక్ యార్డులో మరమ్మతుల కోసం ఉన్న ఐఎన్ఎస్ బ్రహ్మపుత్ర నౌకలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనతో యుద్ధ నౌక పూర్తిగా ఒక పక్కకు ఒరిగిపోగా ఒక నావికుడు గల్లంతయ్యారని నేవీ ఒక ప్రకటనలో తెలిపింది. ముంబై డాక్‌యార్డులో రీఫిట్ పనులు జరుగుతున్న మలీ్టరోల్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో ఆదివారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటుచేసుకుందని నేవీ తెలిపింది. సోమవారం ఉదయం కల్లా మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చామని వివరించింది. అయితే, మధ్యాహ్నం నుంచి యుద్ధ నౌక పక్కకు ఒరిగిపోవడం మొదలైందని, నిటారుగా సరైన స్థితిలో ఉంచేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని వివరించింది. ప్రస్తుతం బ్రహ్మపుత్ర పూర్తిగా పక్కకు ఒరిగి ఉందని తెలిపింది. ప్రమాదంపై విచారణ జరుగుతోందని, గల్లంతైన ఒక జూనియర్ నావికుడి కోసం గాలింపు చేపట్టామని తెలిపింది. దేశీయంగా మొదటిసారిగా రూపొందిన బ్రహ్మపుత్ర క్లాస్‌కు చెందిన గైడెడ్ మిస్సైల్ ఫ్రిగేట్ ఇది. 2000 ఏప్రిల్ నుంచి విధుల్లో ఉన్న ఈ షిప్‌పై 40 మంది అధికారులు, 330 మంది నావికులు విధుల్లో ఉంటారు. -
అంతలో వెళ్లమని.. ఇంతలో ఆగమని..
సాక్షి, హైదరాబాద్: రామగుండం బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం మూసివేతపై రాజకీయ రగడ జరుగుతోంది. 1971లో 62.5 మెగావాట్ల విద్యుదుత్పత్తితో ప్రారంభమైన ఈ విద్యుత్ కేంద్రం జీవితకాలం ఎప్పుడో ముగిసింది. అయినా మరమ్మతులు చేస్తూ ఇంతకాలం నెట్టుకొచ్చారు. సాంకేతిక సమస్యలతో గత నెల 4వ తేదీ నుంచి విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. ఇకపై మరమ్మతులు చేసినా ఫలితం ఉండదనే భావనకు జెన్కో వచ్చింది. అక్కడున్న 65 మంది ఇంజనీర్లు, 230 మంది అపరేషన్స్ అండ్ మెయింటనెన్స్(ఓ అండ్ ఎం) సిబ్బంది, మరో 40 మంది అకౌంట్స్, పీఎంజీ విభాగాల్లో పనిచేస్తుండగా, జూన్ 4 నుంచి వీరికి పనిలేకుండా పోయింది. అక్కడి సబ్‌స్టేషన్, ఇతర అత్యవసర వ్యవస్థల నిర్వహణకు అవసరమైన సిబ్బంది మినహా మిగిలిన ఇంజనీర్లు, ఇతర ఉద్యోగులకు విడతల వారీగా రాష్ట్రంలోని ఇతర విద్యుత్ కేంద్రాలకు బదిలీ చేయాలని జెన్కో నిర్ణయం తీసుకుంది.తొలిదఫాలో 44 మంది ఇంజనీర్లు, నలుగురు కెమిస్ట్‌లను నిర్మాణదశలో ఉన్న యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి డెప్యూటేషన్‌పై బదిలీ చేస్తూ గత నెలలో జెన్కో ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఉత్తర తెలంగాణకు చెందిన ఓ మంత్రి, మరో ఎమ్మెల్యే ఒత్తిడితో రెండురోజులకే ఉత్తర్వుల అమలును నిలుపుదల చేస్తూ మరో ఉత్తర్వులు జారీ చేయాల్సి వచ్చింది. ఈ విద్యుత్ కేంద్రానికి సంబంధించిన ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు నెలకు రూ.4 కోట్లకు పైగా వ్యయం అవుతుండగా, ఉత్పత్తి నిలిచిపోయి ఉద్యోగులందరూ ఖాళీగా ఉండడంతో జెన్కోకు ఆర్థికంగా భారంగా మారింది. కొత్త విద్యుత్ కేంద్రంనిర్మించే వరకు వారిని అక్కడే కొనసాగించాలని ఓ మంత్రి, ఎమ్మెల్యే ఒత్తిడి చేస్తున్నట్టు చర్చ జరుగుతుండగా, కొత్త కేంద్రం నిర్మాణానికి 4 నుంచి 8 ఏళ్లు పట్టనుందని జెన్కో అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఐదేళ్లుగా నెట్టుకొస్తున్నా...రామగుండం బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్వహణ భారంగా మారినా స్థానికంగా వస్తున్న రాజకీయ ఒత్తిళ్లతో గత ఐదేళ్లుగా నెట్టుకొస్తున్నారు. 2019 మార్చి 31లోగా ఈ విద్యుత్ కేంద్రాన్ని మూసివేయాలని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ ఆథారిటీ(సీఈఏ) గతంలో ఆదేశాలు జారీ చేయగా, రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో గడువును 2029 వరకు పొడిగించింది. 62.5 మెగావాట్ల పూర్తి స్థాపిత సామర్థ్యం మేరకు విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి జరగడం లేదు. గరిష్టంగా 45 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి చేస్తుండగా, అధిక బొగ్గు వినియోగిస్తుండడంతో ఆర్థికంగా గిట్టుబాటు కావడం లేదు. కాలుష్యం సైతం అనుమతించిన స్థాయికి మించి జరుగుతోంది. దాదాపుగా రూ.2 కోట్లు ఖర్చు చేసి బయటి నుంచి పరికరాలు తెప్పించి మరమ్మతులు నిర్వహిస్తే 15 రోజుల్లో ఉత్పత్తిని ప్రారంభించి మరికొన్ని రోజుల పాటు నెట్టుకు రావొచ్చని, పూర్తిస్థాయిలో మరమ్మతుల నిర్వహ ణకు కనీసం రూ.30కోట్లకు పైగా ఖర్చు అవుతుందని జెన్కో వర్గాలు పేర్కొంటున్నాయి. అయినా ఎంత కాలం పనిచేస్తుందో చెప్పలేని పరిస్థితి నెల కొంది. ఈ నేపథ్యంలో జెన్కో ఆర్థిక ప్రయోజనాల రీత్యా ఈ విద్యుత్ కేంద్రాన్ని శాశ్వతంగా మూసివేయక తప్పని పరిస్థితి నెలకొంది. ‘సూపర్ క్రిటికల్’ నిర్మాణ బాధ్యతపై జెన్కో అభ్యంతరంరామగుండం బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం స్థానంలో అక్కడే 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై జెన్కో ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరే కిస్తున్నారు. కొత్త విద్యుత్ కేంద్రాన్ని జెన్కో ఆధ్వ ర్యంలోనే నిర్మించాలని కోరుతున్నారు. వాస్తవా నికి నైజాం ప్రభుత్వం 1931లో రామగుండంలో ఏ–థర్మల్, బీ–థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణా నికి 3000 ఎకరాలు కేటాయించింది. ఏ– థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని గతంలోనే మూసివే యగా, ఇందుకు సంబంధించిన స్థలంలో దాదాపు 1200 ఎకరాలను 90వ దశకం మధ్యలో బీపీఎల్ అనే సంస్థకు కొత్త విద్యుత్ కేంద్రం నిర్మాణం కోసం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇక బీ–థర్మల్ కేంద్రానికి దాదాపు 700 ఎకరాల స్థలం ఉండగా, కబ్జాలు పోగా 550 ఎకరాలే మిగిలాయి. 800 మెగావాట్ల కొత్త విద్యుత్ కేంద్రం నిర్మాణానికి ఈ స్థలం సరిపోదు. బీపీఎల్‌కు కేటాయించిన స్థలంలో కొంత స్థలాన్ని జెన్కోకు అప్పగిస్తే కొత్త విద్యుత్ కేంద్రం నిర్మించుకుంటామని జెన్కో ఉద్యోగులు కోరుతున్నారు. -
వానాకాలం పంటలకు కాళేశ్వరం నీళ్లు
సాక్షి ప్రతినిధి, వరంగల్/మంథని: కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వానాకాలం సీజన్లో పంటలకు సాగునీరు అందించేలా చర్యలు చేపడుతున్నామని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) సూచనలు, సిఫార్సుల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టామని తెలిపారు. వానాకాలం ఊపందుకునేలోగా ఈ పనులు పూర్తి కావాలని అధికారులను ఆదేశించామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను, మరమ్మతు పనులను శుక్రవారం మంత్రి ఉత్తమ్ పరిశీలించారు.హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా బయలుదేరిన మంత్రి.. తొలుత సుందిళ్ల వద్ద ఉన్న పార్వతి బ్యారేజీని సందర్శించారు. తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లా అన్నారానికి చేరుకున్నారు. అక్కడి సరస్వతి బ్యారేజీ వద్ద మరమ్మతు పనులను పరిశీలించారు. అనంతరం మేడిగడ్డకు చేరుకున్నారు. లక్ష్మి బ్యారేజీ వద్ద దెబ్బతిన్న పియర్లు, మరమ్మతు పనులను చూశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు.ఎన్నికల కోడ్ ఉండటంతో ఇన్నిరోజులుగా పనులను ఇంజనీరింగ్ అధికారులే పర్యవేక్షించారని చెప్పారు. ఇకపై మరమ్మతు పనులను వేగవంతం చేసి రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. తాత్కాలిక మరమ్మతు పనులు అన్నారంలో 60శాతం మేర, మేడిగడ్డ వద్ద 80శాతం మేర పూర్తి కావొచ్చాయన్నారు. సుందిళ్లలో నత్తనడకన సాగుతున్న పనుల విషయంలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశామన్నారు.బ్యారేజీల గేట్లన్నీ ఎత్తి ఉంచాల్సిందే..గత ప్రభుత్వం రూ.94 వేల కోట్ల ఖర్చు చేస్తే.. కేవలం లక్ష ఎకరాల ఆయకట్టు తయారైందని.. అది కూడా ఇప్పుడు కుంగుబాటుకు గురైందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలకు నష్టం వాటిల్లింది. మా ప్రభుత్వం ఏర్పడ్డాక దీనిపై డ్యాం సేఫ్టీ అధికారులను సంప్రదించాం. వారు చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో కమిటీ వేశారు. బ్యారేజీలను పరిశీలించి పలు సూచనలు చేశారు. మూడు బ్యారేజీలను గేట్లు ఎత్తి ఉంచాలని, అలా ఉంచితే బ్యారేజీలకు మరింత నష్టం వాటిల్లదని చెప్పారు.ఎన్డీఎస్ఏ సూచనల మేరకు తాత్కాలిక మరమ్మతులు చేయిస్తున్నాం..’’ అని తెలిపారు. బ్యారేజీల కుంగుబాటుపై జ్యుడిషియల్ విచారణ కొనసాగుతోందని చెప్పారు. ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణ కూడా జరిగిందని.. ఆ రిపోర్ట్ ప్రకారం మాజీ ఇరిగేషన్ చీఫ్‌ను విధుల నుంచి తప్పించామని వివరించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినవారికి శిక్ష తప్పదన్నారు. గత ప్రభుత్వంలో కమీషన్ల కోసం ఆశపడ్డారే తప్ప సీరియస్‌గా ఏ ఒక్క పనీ చేయలేదని ఉత్తమ్ విమర్శించారు.తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తాంఅసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తామని మంత్రి తెలిపారు. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు గతంలోనే డిజైన్ చేసిన డీపీఆర్ ప్రకారం పనులు పూర్తి చేస్తామన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ భూమి సాగులోకి వచ్చే ప్రాజెక్టులను త్వరగా చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, రాజ్ ఠాకూర్, అడ్లూరి లక్ష్మణ్, ఇంజనీర్లు, అధికారులు ఉన్నారు.జియోట్యూబ్‌లతో నీటిని ఆపి, ఎత్తిపోయొచ్చు!తాత్కాలిక మరమ్మతు పనులు మేడిగడ్డ, అన్నారంలలో వేగంగా నడుస్తున్నాయని, సుందిళ్లలో కాస్త నెమ్మదిగా జరుగుతున్నాయని ఈఎన్సీ అనిల్‌కుమార్ పేర్కొన్నారు. మేడిగడ్డ వద్ద 5 మీటర్లలో ఎత్తులో జియోట్యూబ్‌లు ఏర్పాటు చేస్తే నీటిని ఎత్తిపోయవచ్చన్నారు. అదే అన్నారంలో 11 మీటర్ల ఎత్తులో, సుందిళ్లలో 9 మీటర్ల ఎత్తులో ఆపితే నీటిని లిఫ్ట్ చేయవచ్చన్నారు. -
కాళేశ్వరంలో నీటినిల్వకు సన్నద్ధం!
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్నారం బ్యారేజీలో త్వరగా మరమ్మతు పనులు పూర్తి చేసి నీటిని నిల్వ చేయడానికి ఇంజనీరింగ్‌శాఖ అధికారులు సన్నద్ధం అవుతున్నట్టు తెలిసింది. అన్నారం బ్యారేజీలోని సీపేజీ లీకేజీలకు గ్రౌటింగ్ పనులను ఆదివారం అ«ధికారులు ప్రారంభించారు. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు ఇంజనీరింగ్ అధికారులు సీసీ బ్లాక్‌లు తొలగించి మళ్లీ అమర్చుతున్నారు. బ్యారేజీ క్రస్ట్‌గేట్ల ముందు, వెనుకాల ఉన్న ఇసుక మేటలు తొలగించారు. అక్కడి సీపేజీ లీకేజీలను సిమెంట్, ఇసుక మిశ్రమాన్ని 38వ పియర్ వెంట్ వద్ద గ్రౌటింగ్ ద్వారా నింపుతున్నారు.వర్షాకాలంలో అన్నారం బ్యారేజీ నింపి ఎగువన సుందిళ్ల పంపుహౌస్ ద్వారా ఎత్తిపోసి నీటిని తరలించడానికి ఈఎన్సీ జనరల్ అనిల్‌కుమార్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. అన్నారం బ్యారేజీకి ఎగువన పెద్దవాగు, మానేరు, గ్రావిటీ ద్వారా వచ్చే వరద నీరు కూడా వాడుకునే వీలుందని, ఈ నీటిని ఎగువన సుందిళ్లను తరలించడానికి యత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీ 7వ బ్లాక్‌లో కుంగిన పియర్లు 19, 20, 21ల దిగువన సీసీ బ్లాక్‌ల అమరిక, షీట్‌ఫైల్స్ దింపుతున్నారు. కాగా, ఆదివారం కురిసిన వర్షానికి అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల్లో పనులు నిలిచాయి. కొద్దిపాటి వర్షానికే అన్నారం బ్యారేజీగేట్ల ముందు భాగంలోకి నీరు చేరుతుందని ఇంజనీరింగ్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. -
బ్యారేజీలకు తక్షణ మరమ్మతులు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడి గడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు యుద్ధప్రాతిపదికన అత్యవసర మరమ్మతులు చేయాలని కాంట్రాక్టర్లను రాష్ట్ర నీటిపారుదల శాఖ కోరింది. వర్షాకాలం రాకముందే అత్యవసర మరమ్మతులు చేయాలని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు నీటిపారుదల శాఖ రామగుండం చీఫ్ ఇంజనీర్ కె.సుధాకర్‌రెడ్డి ఈ నెల 14న ఎల్అండ్టీ–పీఈసీ జాయింట్ వెంచర్(మేడిగడ్డ బ్యారేజీ), అఫ్కాన్స్–విజేత–పీఈఎస్(అన్నారం బ్యారేజీ), నవయుగ(సుందిళ్ల బ్యారేజీ) సంస్థలకు వేర్వేరుగా లేఖలు రాశారు. అయ్యర్ కమిటీ సమరి్పంచిన మధ్యంతర నివేదికను నిర్మాణ సంస్థలకు పంపించి ఆ మేరకు పనులు నిర్వహించాలని కోరారు. ఒప్పందం మేరకే ‘మేడిగడ్డ’ చెల్లింపులు.. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణలో భాగంగా చేపట్టే పనులకు చెల్లింపులు చేయాల్సిందేనని కోరుతూ నిర్మాణ సంస్థ ‘ఎల్ అండ్ టీ–పీఈఎస్ జేవీ’విజ్ఞప్తి చేసింది. దీనిని పరిశీలించి ఒప్పందంలోని నియమాలు, ప్రభుత్వ నిబంధనలకు లోబడి నిర్ణయం తీసుకుంటామని, ఆ మేరకు చెల్లింపులు జరుపుతామని నీటిపారుదలశాఖ స్పష్టం చేసింది. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సూచించిన మేరకు మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న బ్లాకులు, షట్టర్ల తొలగింపు, పగుళుæ్ల వచ్చిన పియర్లకు అదనపు భద్రతకు బ్రేసింగ్ చేయడం, బ్యారేజీల్లో ఏర్పడిన బుంగలను పూడ్చివేయడానికి గ్రౌటింగ్ చేయడం, ప్లింత్ స్లాబుకు మరమ్మతులు చేయడం, గేట్లన్నీ ఎత్తడం వంటి అన్ని పనులు చేయాలని నిర్మాణ సంస్థను కోరింది. బ్యారేజీకి మరింత నష్టం జరగకుండా తక్షణమే పనులు ప్రారంభించాలని స్పష్టం చేసింది. -
TS: ప్రజాభవన్‌లో రిపేర్లకు అంత ఖర్చా?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ కాస్త ప్రజా భవన్‌గా మారింది. ప్రజా సందర్శనకు అనుమతి ఇస్తూ.. వాటి ముందు ఉన్న బారికేడ్లను సైతం తొలగించారు. ఆపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు ప్రజా భవన్‌ను కేటాయించారు. అయితే కేసీఆర్ హయాంలో దుబార జరిగిందని.. కాబట్టి హంగులు ఆర్బాటాలకు పోకుండా ఉంటామని ప్రకటించుకుంది రేవంత్ సర్కార్. కానీ, ప్రజా భవన్ రిపేర్ల కోసం చేస్తున్న ఖర్చుపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్రజా భవన్లో టాయిలెట్ల రిపేర్లు కోసం.. అలాగే దోమ తెరల కోసం రూ.35 లక్షలకు టెండర్లను కాంగ్రెస్ ప్రభుత్వం పిలిచినట్లు తెలుస్తోంది. మరో టెండర్లో భాగంగా జిమ్ రూంలో పొడుగు అద్దాలు, గన్‌మెన్ రూముల కోసం రూ.28.70 లక్షలకు టెండర్లను ప్రభుత్వం ఆహ్వానించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ప్రతుల పేరిట సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే వైరల్ అవుతున్న ఈ ప్రచారంపై అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. -
యథాస్థితికి విద్యుత్ వ్యవస్థ
సాక్షి, అమరావతి: మిచాంగ్ తుపానుకు అతలాకుతలమైన విద్యుత్ వ్యవస్థను విజయవంతంగా య«థాస్థితికి తీసుకొచ్చామని విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య పంపిణీ సంస్థల (ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్) పరిధిలో పునరుద్థరణ పనులు వంద శాతం పూర్తయ్యాయని తెలిపాయి. తీవ్రంగా ప్రభావితమైన దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) పరిధిలో మరమ్మతు పనులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని ఇంధన శాఖకు డిస్కంలు శుక్రవారం నివేదించాయి. ఈ సందర్భంగా జరిగిన టెలీకాన్ఫరెన్స్‌లో తుపానును ఎదుర్కోవడం, పునరుద్ధరణ ప్రణాళిక అమలులో సమర్థవంతంగా పని చేసిన విద్యుత్ సంస్థలను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అభినందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మార్గదర్శకత్వంలో ఏపీ విద్యుత్ శాఖ సిబ్బంది రేయింబవళ్లు శ్రమించి విద్యుత్ మౌలిక సదుపాయాల పునరుద్ధరణ పనులను విజయవంతంగా పూర్తి చేశారని ఆయన వెల్లడించారు. భారీ గాలులు, వర్షం వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏపీజెన్కో ఎండీ, ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ కేవీఎన్ చక్రధర్ బాబు, డిస్కంల సీఎండీలు ఐ.పృ«థ్వీతేజ్, జె.పద్మాజనార్దనరెడ్డి, కె. సంతోషరావు క్షేత్రస్థాయిలో పునరుద్ధరణ చర్యలను పర్యవేక్షించారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదనే లక్ష్యంతో ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు, పడిపోయిన విద్యుత్ స్తంభాలను తిరిగి ఏర్పాటు చేయడం, పాడైన ఇన్సులేటర్ల మారి్పడి, విరిగిన కండక్టర్లను సరిచేయడం వంటి పనులను శరవేగంగా పూర్తి చేయించారని తెలిపారు. జిల్లా కేంద్రాల నుంచి తుపాను ప్రభావిత ప్రాంతాలకు అవసరమైన స్తంభాలు, కండక్టర్లు, ట్రాన్స్ఫార్మర్లు, ఇతర సామాగ్రితో పాటు ప్రత్యేక బృందాలు, ఇతర అన్ని రకాల సామగ్రిని వేగంగా సమకూర్చుకొని పనులు పూర్తి చేశాయని పేర్కొన్నారు. కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి, జిల్లా కేంద్రాల నుంచి క్షేత్రస్థాయి అధికారులను, సిబ్బందిని నిరంతరం పర్యవేక్షించడం వల్ల మరమ్మతు పనులు వేగంగా జరిగాయని తెలిపారు. దెబ్బతిన్న 17 ఫీడర్లలో 14 ఫీడర్లను పునరుద్ధరించామని, తమిళనాడులో విద్యుత్ టవర్ కూలిపోవడం వల్ల మూడు ఫీడర్ల పనులు ఇంకా కొనసాగుతున్నాయని ట్రాన్స్‌కో గ్రిడ్ డైరెక్టర్ ఏవీకే భాస్కర్ వెల్లడించారు. అయినప్పటికీ విద్యుత్ సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని వివరించారు. -
గోదావరి రోడ్డు కమ్ రైల్వే బ్రిడ్జి మూసివేత
రాజమహేంద్రవరం సిటీ/కొవ్వూరు: గోదావరి నదిపై రాజమహేంద్రవరం–కొవ్వూరు పట్టణాల మధ్య ఉన్న రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిని మరమ్మతుల నిమిత్తం నెల రోజుల పాటు మూసివేయనున్నారు. 1974 నవంబర్ 20న ఈ వంతెనను అప్పటి రాష్ట్రపతి ఫకృద్దీన్ ఆలీ అహ్మద్ ప్రారంభించారు. 49 ఏళ్లుగా సుదీర్ఘ సేవలందించిన ఈ వంతెన పూర్తిగా పాడైంది. సెంట్రల్ క్యారేజ్ వే, వయాడక్ట్ భాగం, అప్రోచ్‌లు సహా దెబ్బ తిన్న సెకండరీ జాయింట్ల మరమ్మతుల నిమిత్తం ఈ నెల 27 నుంచి అక్టోబర్ 26వ తేదీ వరకూ ఈ బ్రిడ్జిని మూసివేస్తున్నామని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కె.మాధవీలత ఆదివారం ప్రకటించారు. మరమ్మతు పనులకు, తక్షణ పునరుద్ధరణ చేపట్టేందుకు వీలుగా ఈ వంతెనపై అన్ని రకాల వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తున్నారు. వయాడక్ట్ భాగం, అప్రోచ్‌లు సహా బీటీ క్యారేజ్‌వే పునరుద్ధరణ, 4.473 కిలోమీటర్ల పొడవున దెబ్బ తిన్న సెకండరీ జాయింట్ల వద్ద జియో గ్లాస్ గ్రిడ్ల ప్రత్యేక మరమ్మతులకు రూ.2.10 కోట్లు వెమరమ్మతుల స్తున్నారు. ఈ మేరకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. ఇప్పటికే మిల్లింగ్ మెషీన్‌తో బీటీ సర్ఫేస్ తొలగింపు తదితర పనులు చేపట్టారు. ఈ బ్రిడ్జి మీదుగా తిరిగే వాహనాలను గామన్ బ్రిడ్జి మీదుగా మళ్లించనున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ, రవాణా, ఆర్టీసీ అధికారులను కోరామని కలెక్టర్ కె.మాధవీలత తెలిపారు. బ్రిడ్జి మూసివేతపై జిల్లాలోని వివిధ విద్యా సంస్థలకు ముందస్తుగా సమాచారం తెలియజేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు. -
99శాతం బాగున్నాయి
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఎనిమిదో తరగతి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్లో అందించిన ట్యాబ్‌ల్లో 99 శాతం బాగున్నాయని అధికారులు గుర్తించారు. కేవలంఒక్క శాతం ట్యాబ్‌ల్లో మాత్రమే రిపేర్లున్నాయని చెబుతున్నారు. పది రోజులుగా జిల్లాల్లో పర్యటిస్తున్న పాఠశాల విద్యాశాఖ ఐటీ విభాగం, జిల్లా నోడల్ అధికారులు ప్రతి పాఠశాలకు వెళ్లి విద్యార్థులు, ఉపాధ్యాయుల సమక్షంలో ట్యాబ్‌లను పరిశీలించి సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి ఇస్తున్నారు. స్క్రీన్లు పగిలిపోయినవి అత్యధికంగా ఉండగా, కొన్ని టాబ్స్‌లో ఎస్డీ కార్డులు తొలగించడంతో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు గుర్తించారు. మొత్తం ట్యాబ్‌ల్లో ఇలాంటివి 4,800 వరకు ఉన్నట్టు తేలింది. స్క్రీన్లు పగిలిపోయిన వాటికి ప్రభుత్వమే కొత్తవి అమర్చి విద్యార్థులకు ఇవ్వనుంది. తల్లిదండ్రులపై భారం పడకుండా.. ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులకు గత డిసెంబర్లో 5,18,740 ట్యాబ్స్‌ను బైజూస్ కంటెంట్‌తో ప్రభుత్వం పంపిణీ చేసింది. భౌతిక నష్టం (ఫిజికల్ డ్యామేజీ) మినహా ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తితే ఎలాంటి ఖర్చు లేకుండా సరిచేసి ఇచ్చేలా మూడేళ్ల వారంటీతో వీటిని ప్రభుత్వం కొనుగోలు చేసింది. స్క్రీన్లు పగిలిపోయిన 3వేల పైచిలుకు ట్యాబ్‌లకు కొత్తవి అమర్చాలంటే కనీసం రూ.5 వేల వరకు ఖర్చవుతుంది. ఇంత భారం విద్యార్థుల తల్లిదండ్రులపై పడకూడదనే ఉద్దేశంతో ఆ ఖర్చును ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించింది. ఎస్డీ కార్డు మార్చినవి కొన్నే.. కొందరు విద్యార్థులు తెలిసీ తెలియక ట్యాబ్స్‌లోని ఎస్డీ కార్డును తొలగించడంతో అవి పనిచేయడం లేదు. ఇలాంటివి సుమారు 1,500 నుంచి 1,800 వరకు ఉన్నట్టు గుర్తించారు. ట్యాబ్స్ కొనుగోలు చేసినప్పుడే ప్రతి విద్యార్థికి ఎస్డీ కార్డు తొలగించవద్దని సూచించినా కొందరు దీన్ని పాటించకపోవడంతో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వాటిని సైతం సరిచేసి అందిస్తున్నారు. ఇకపై విద్యార్థులు ఎస్డీ కార్డు తొలగిస్తే వెంటనే గుర్తించేలా ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్ని ట్యాబ్స్‌లో అందుబాటులోకి తెస్తున్నారు. ట్యాబ్‌లో ఇచ్చిన కంటెంట్ మినహా ఇంటర్నెట్ కంటెంట్ అప్లోడ్, డౌన్లోడ్ చేసేందుకు అవకాశం లేకుండా కొత్త సాఫ్ట్వేర్ రూపొందించారు. దీంతోపాటు గూగుల్ అథెంటికేటర్‌ను కూడా ఇన్స్టాల్ చేసి ట్యాబ్స్‌కు పటిష్ట రక్షణ కల్పించారు. ఇకపై ట్యాబ్‌ను ట్యాంపరింగ్ చేస్తే వెంటనే సంబంధిత జిల్లా నోడల్ అధికారులకు ఓటీపీ మెస్సేజ్ వెళ్లడంతో పాటు ఆయా ట్యాబ్ సేవలు నిలిచిపోతాయి. ట్యాంపర్ చేశారా..? లేక ఎస్డీ కార్డు మార్చారా? అనేది కూడా అధికారులకు తెలిసిపోతుంది. ఏ విద్యార్థి ట్యాబ్‌లో మార్పులు చేసేందుకు యత్నించారో జిల్లా నోడల్ అధికారుల నుంచి సంబంధిత స్కూలు హెచ్ఎంకు మెస్సేజ్ వెళుతుంది. అధికారులకు వచ్చే ఓటీపీని ఎంటర్ చేస్తేనే తిరిగి ట్యాబ్ పనిచేస్తుంది. సక్రమంగా వినియోగించాలి.. విద్యార్థులు విజ్ఞానవంతులుగా ఎదగాలని, వారికి ఉత్తమ భవిష్యత్ అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ట్యాబ్స్‌ను అందించింది. వాటిని సక్రమంగా వాడుకోవాలి. ప్రస్తుతం స్క్రీన్ పాడైన వాటికి ఉచితంగానే కొత్తవి అమర్చాలని ఆదేశించాం. సాంకేతిక సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించే యంత్రాంగం కూడా ఉంది. సాఫ్ట్వేర్ ఇబ్బందులుంటే స్థానిక సచివాలయం డిజిటల్ అసిస్టెంట్‌కు అందజేసి సమస్యను వివరిస్తే ఫోన్ నంబర్, ట్యాబ్ ఈఎంఐఈ నంబర్ ఆధారంగా ఆన్లైన్లో నమోదు చేస్తారు. నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా వారికోసం మాన్యువల్‌గా రశీదు కూడా ఇస్తారు. ట్యాబ్స్ సర్విస్ కోసం రాష్ట్రంలో 145 శామ్సంగ్ సరీ్వస్ సెంటర్లున్నాయి. గరిష్టంగా 3 రోజుల్లో రిపేరు చేసి తిరిగి విద్యార్థికి అందిస్తారు. – కాటమనేని భాస్కర్, పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పన కమిషనర్ -
ఆర్ఎఫ్సీఎల్ షట్‌డౌన్
ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): రామగుండం ఫెర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్ (ఆర్ఎఫ్ సీఎల్) కర్మాగారంలో మరమ్మతుల కార ణంగా గురువారం రాత్రి నుంచి యూరి యా ఉత్పత్తి నిలిచిపోయింది. హీటర్ సెక్ష న్ పైపులు మరమ్మతులు చేయడానికి వా రంరోజుల దాకా సమయం పడుతుందని అధికారులు అంచనా వేశారు. శుక్ర వారం మరమ్మతులు ప్రారంభించారు. వానాకాలం సీజన్ కావడంతో తెలు గురాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో యూరియాకు డిమాండ్ అధికంగా ఉంది. నిత్యం సాంకేతిక సమస్యలు: ఫ్యాక్టరీలో జూన్‌లో కూడా సాంకేతిక సమ స్యలతో 20 రోజులపాటు యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. మరమ్మతుల అనంతరం ప్లాంట్ పునరుద్ధరించినా, రెండు రోజులకే మళ్లీ సాంకేతిక సమస్యలు తలెత్తాయి. జూన్ చివరివారంలో ఉత్పత్తి ప్రారంభించారు. సాంకేతిక సమ స్యలతో ఆగస్టులో ఉత్పత్తి కొంత తగ్గింది. మళ్లీ సమస్య తలెత్తడంతో కర్మా గారాన్ని తాత్కాలికంగా వారం పాటు షట్‌డౌన్ చేసి మరమ్మతుల అనంతరం ఉత్పత్తి పునరుద్ధరిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. కర్మాగారంలో గడిచిన 4 నెలల్లో 5,01,597.63 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేశారు. 2023– 24లో 12.70 లక్షల మెట్రిక్‌టన్నుల యూరియా ఉత్పత్తి చేయాలనేది టార్గెట్. -
క్షిపణుల డిజైన్‌లో స్టార్టప్‌లను భాగస్వాములను చేయాలి
సాక్షి, విశాఖపట్నం: క్షిపణుల మరమ్మతులు, డిజైన్లలో స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఈలను భాగస్వాములను చేస్తే ఆత్మ నిర్భర్ భారత్ దిశగా మరింత పురోగతి సాధించవచ్చని డీఆర్డీవో డైరెక్టర్ జనరల్ డాక్టర్ వై.శ్రీనివాసరావు అన్నారు. విశాఖపట్నం కేంద్రంగా ఉన్న తూర్పు నౌకాదళం(ఈఎన్సీ) ప్రధాన కేంద్రానికి అనుబంధంగా ఉన్న ఐఎన్ఎస్ కళింగ బేస్‌లో గురువారం ‘అమృత్–2023’ పేరుతో మిసైల్ టెక్నాలజీ కాంక్లేవ్, సింపోజియం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ శ్రీనివాసరావు, ఈఎన్సీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ సమీర్ సక్సేనా ప్రారంభించారు. డాక్టర్ వై.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆత్మ నిర్భర్ భారత్ మిషన్‌కు అనుగుణంగా ఇండియన్ పబ్లిక్, ప్రైవేట్ ఇండస్ట్రీస్, డీఆర్డీవో ల్యాబ్స్, అకాడమీ, ఇండియన్ నేవీ ముందుకువెళ్తుండటం శుభపరిణామమని చెప్పారు. విదేశీ దిగుమతులపై ఆధారపడకుండా రక్షణ పరిశ్రమ ప్రధాన సామర్థ్యాలను బలోపేతం చేయాలని సూచించారు. -
కాళేశ్వరం బ్యారేజీలకు మరమ్మతులేవి?
కాళేశ్వరం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లింకు–1 బ్యారేజీల వద్ద గత ఏడాది వచ్చిన భారీ వరదలతో కాంక్రీటు దెబ్బతింది. అయితే మళ్లీ వానాకాలం వచ్చినప్పటికీ దెబ్బతిన్న చోట్ల ఇప్పటికీ మరమ్మతులు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్‌పల్లిలోని మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీ, అన్నారంలోని (సరస్వతి) బ్యారేజీల వద్ద వరద తాకిడికి గేట్ల ముందు భాగంలోని కాంక్రీటు దిమ్మెలు కొట్టుకుపోయాయి. గత సీజన్లో ఇది జరిగితే ఇప్పటికీ ఇరిగేషన్ శాఖ అధికారులు మరమ్మతుల విషయంలో ఆలోచన చేయడం లేదని, ఖరీఫ్ సీజన్ ఆరంభం అవుతున్నా పనుల్లో జాప్యం చేస్తున్నారని నీటిపారుదల రంగ నిపుణులు ఆక్షేపిస్తున్నారు. గతేడాది ఉధృతంగా వరద గత ఏడాది కురిసిన భారీవర్షాలకు బ్యారేజీలు కొంతమేర దెబ్బతిన్నాయి. ఎగువ గోదావరి నుంచి సరస్వతీ బ్యారేజీ వద్ద 17.50 లక్షల క్యూసెక్కుల వరద జూలై 14–15 తేదీల్లో ఉధృతంగా ప్రవహించింది. దీంతో బ్యారేజీలోని మొత్తం 66 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. వరద ఉధృతికి గేట్ల కింది భాగాన ఉన్న కాంక్రీట్ దిమ్మెలు లేచిపోయాయి. అలాగే గోదావరి వరదకు, ప్రాణహిత వరద తోడై మేడిగడ్డలోని లక్ష్మీబ్యారేజీ వద్ద 29 లక్షల క్యూసెక్కులకుపైగా వరద రావడంతో దిమ్మెలు చెల్లాచెదురుగా కొట్టుకుపోయాయి. కాంక్రీటు దిమ్మెలు ఇలా.. బ్యారేజీల్లో గేట్లు ఎత్తినప్పుడు వరద తాకిడికి నేల కోతకు గురికాకుండా ముందు భాగంలో ఇంజనీరింగ్ శాఖ అధికారులు అత్యాధునిక టెక్నాలజీతో కాంక్రీటు దిమ్మెలను అమర్చారు. 3 అడుగుల వెడల్పు, పొడవుతో దిమ్మెలను బ్యారేజీ పొడవునా గేట్ల కింద ముందు భాగంలో కాంక్రీటు చేశారు. వరద తాకి డి కి నేల కోతకు గురికాకుండా ఈ దిమ్మెలు అడ్డుకుంటాయి. కానీ గత ఏడాది వచ్చిన భారీ వరద తాకిడికి ఈ దిమ్మెలు విరిగి ఎక్కడికక్కడ చెల్లాచె దురుగా పడి కొట్టుకుపోయాయి. అప్పటి నుంచీ అక్కడ మరమ్మతులు చేయలేదని చెబుతున్నారు. డిజైన్స్ రాలేదని.. మేడిగడ్డ (లక్ష్మి), అన్నారం (సరస్వతి) బ్యారేజీల వద్ద అమర్చిన దిమ్మెలు కొట్టుకుపోయి ఏడాది కావస్తున్నా.. డిజైన్స్ తయారు చేయలేదని ఇంజనీ రింగ్ శాఖ పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో మరమ్మ తులు చేయకుండానే మళ్లీ వర్షాకాలం ఆరంభమైంది. వర్షాలు ఏకధాటిగా కురిస్తే మరోసారి భారీ వరదలు వచ్చే అవకాశం ఉంది. బ్యారేజీల గేట్లు ఎత్తితే మరింత కోతకు గురయ్యే ప్రమాదం ఉంది. గత ఏడాది కురిసిన వర్షాలకు ఇప్పటికే గేట్ల ముందుభాగంలో కోతకు గురై, భారీగా ఇసుక మేటలు వేశాయి. దీంతో గేట్లకు కూడా ప్రమాదం పొంచి ఉందని నిపుణులు అంటున్నారు. -
కేజ్రీవాల్ నివాసానికి మరమ్మతులపై నివేదిక కోరిన ఎల్జీ
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అధికార నివాసానికి రూ.49 కోట్లతో చేయించిన మరమ్మతుల్లో అవకతవకలు జరిగాయంటూ వచ్చిన వార్తలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా స్పందించారు. దీనిపై సవివర నివేదిక ఇవ్వాలని, మరమ్మతులకు సంబంధించిన అన్ని రికార్డులను 15 రోజుల్లోగా తన ముందుంచాలని శనివారం చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. 2020–22 సంవత్సరాల్లో అధికార నివాసంలో అదనపు పనులు, మరమ్మతుల కోసం కేటాయింపులు రూ43.70 కోట్లు కాగా, రూ.44.78 కోట్లు వెచ్చించినట్లు రికార్డులు చెబుతున్నాయి. సమస్యల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే అవకతవకలు జరిగాయంటూ బీజేపీ ఆరోపణలు చేస్తోందని ఆప్ అంటోంది. -
రిపేరు హక్కు ఉద్యమంలో భాగంగా ఏసీఎంఏ..
న్యూఢిల్లీ: వాహనాలను వినియోగదారులు ఎవరిదగ్గరైనా మరమ్మతు చేయించుకునే హక్కును సాధించుకునేందుకు అంతర్జాతీయంగా సాగుతున్న ఉద్యమానికి తాము కూడా మద్దతునిస్తున్నట్లు దేశీ ఆటో విడిభాగాల తయారీ సంస్థల సమాఖ్య ఏసీఎంఏ వెల్లడించింది. వివరాల్లోకి వెడితే.. వైర్లెస్ విధానంలో కనెక్టెడ్‌గా ఉంటున్న వాహనాల డేటా అంతా కూడా వాటి తయారీ సంస్థలకు చేరుతోంది. దీంతో వాటికి ఏమైనా రిపేర్లు వస్తే బైట వేరే వారి దగ్గర మరమ్మతు చేయించుకోనివ్వకుండా కంపెనీలు నిరోధించేందుకు ఆస్కారం ఏర్పడుతోంది. ఫలితంగా వినియోగదారులు తాము కోరుకున్న చోట రిపేరు చేయించుకునే హక్కులకు భంగం కలుగుతోంది. తప్పనిసరిగా కంపెనీనే ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే రిపేర్ హక్కుల ఉద్యమం తెరపైకి వచ్చింది. వారంటీ వ్యవధి ముగిసిపోయిన వాహనాలకు వచ్చే మరమ్మతుల్లో 70 శాతం భాగాన్ని స్వతంత్ర రిపేర్ షాపులే చేస్తున్నాయి. కొనుగోలు అనంతర సేవలకు సంబంధించిన ఆఫ్టర్‌మార్కెట్ విభాగం దేశీయంగా 10.1 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో వినియోగదారులు కోరుకుంటున్న రిపేర్ హక్కులకు మద్దతునిస్తున్న ఇతర అంతర్జాతీయ సంస్థలతో పాటు తామూ సంఘీభావం ప్రకటిస్తున్నట్లు ఏసీఎంఏ తెలిపింది. రైట్ టు రిపేర్ కింద దేశీయంగానూ చట్టం తీసుకొస్తే భారత్‌లో ఆఫ్టర్‌మార్కెట్ విభాగం మరింతగా విస్తరించగలదని పేర్కొంది. అంతర్జాతీయంగా అమెరికాలో ఈ ఉద్యమం మొదలైంది. -
మెట్రోకు సమ్మర్ ఫీవర్.. పగుళ్లకు కోటింగ్..పట్టాలకు లూబ్రికేషన్!
సాక్షి, సిటీబ్యూరో: వేసవిలో మెట్రో నిర్వహణ భారంగా మారింది. పలు మెట్రో స్టేషన్లకు ఏర్పడిన పగుళ్లు.. పట్టాలపై రైళ్లు పరుగులు తీసినపుడు మలుపుల వద్ద రణగొణ ధ్వనులు వెలువడుతుండడంతో తరచూ ఆందోళన వ్యక్తమౌతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో నష్టనివారణ చర్యలు చేపట్టే అంశంపై ఎల్అండ్టీ హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ దృష్టి సారించింది. ప్రమాణాల మేరకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) ప్రకారం మెట్రో ప్రాజెక్టులోని స్టేషన్లు, పిల్లర్లు తదితర సివిల్ నిర్మాణాలకు పగుళ్ల నివారణ, మన్నిక పెంచేందుకు ఇతర నిర్వహణపరమైన మరమ్మతులు చేపడుతున్నట్లు మెట్రో వర్గాలు తెలిపాయి. నగరంలో ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్, నాగోల్–రాయదుర్గం మూడు మార్గాల్లోని మొత్తం మెట్రో రైల్ నెట్వర్క్ పరిధిలో ఉన్న వయాడక్ట్ పారాపెట్స్ (పిట్టగోడలు)ను సైతం నిశితంగా పరిశీలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పలు చోట్ల స్టేషన్లకు వెంట్రుకవాసి పరిమాణంలో ఏర్పడిన పగుళ్లకు ఎపాక్సీ పదార్థంతో కోటింగ్ వేసి సరిచేస్తున్నట్లు తెలిపారు. మూడు రూట్లలో నిరంతరాయంగా రైళ్లు పరుగులు తీస్తున్న నేపథ్యంలో మెట్రో మార్గం పలు కంపనాలకు గురవుతుండడం, వాతావరణ మార్పుల కారణంగా తరచూ పగుళ్లు ఏర్పడుతున్నట్లు వివరించారు. ఇది సాధారణ పరిణామమేనని స్పష్టంచేశారు. రణగొణ ధ్వనులు వెలువడకుండా చర్యలు... నగరంలో మెట్రో మార్గం పలు ములుపులు తిరిగి ఉంది. నగర భౌగోళిక స్ధితి కారణంగా దేశంలో మరే ఇతర మెట్రో రైల్ మార్గంలో లేని విధంగా వినూత్నమైన రీతిలో మలుపులు, ఎత్తుపల్లాలతో అలైన్ మెంట్ ఉంది. ఈ నేపథ్యంలో మలుపుల వద్ద మెట్రో పట్టాలు, చక్రాల మధ్య రాపిడి కారణంగా కీచుమనే శబ్దాలు, అతిధ్వనులు అధికంగా వెలువడుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించి..రణగొణ ధ్వనులను నివారించేందుకు పట్టాలకు ట్రాక్ లూబ్రికేషన్ చేస్తున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. తద్వార కంపనాలు పెరిగిన సమయంలో శబ్ద స్థాయిలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తరచుగా శబ్ద స్థాయిని పర్యవేక్షిస్తున్నామన్నారు. పీసీబీ నిర్దేశించిన ప్రమాణాల మేరకు శబ్దకాలుష్యం ఉందని తెలిపారు. విశ్వసనీయ ఇంజినీరింగ్ సంస్థగా, ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో నిలుస్తుందని..స్వల్ప పగుళ్లు, శబ్దకాలుష్యంపై ఎవరూ ఆందోళన చెందవద్దని సంస్థ భరోసానిస్తుండడం విశేషం. చదవండి: ఆ కరెంటుతో షాకే.. -
రాజమహేంద్రవరం రోడ్డు కమ్ రైలు బ్రిడ్జిపై మరమ్మతులు
-
రావోయి విహారి.. బోటింగ్‌కు సిద్ధమోయి
సాక్షి ప్రతినిధి, విజయవాడ/భవానీపురం (విజయవాడ పశ్చిమ): ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)కు చెందిన బోధిసిరి బోటుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. మరమ్మతుల పేరుతో మూడేళ్లపాటు పర్యాటకులకు దూరంగా ఉన్న ఈ డబుల్ డెక్కర్ క్రూయిజ్ వారం రోజుల్లో అందుబాటులోకి రానుంది. రూ.23 లక్షలతో మరమ్మతులు చేసిన బోధిసిరి ఇటీవల బెరంపార్క్‌లో బోటింగ్ పాయింట్ వద్దకు చేరుకుంది. ప్రస్తుతం దానికి సర్వహంగులు ఏర్పాటు చేస్తూ తుదిమెరుగులు దిద్దుతున్నారు. కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో పర్యాటకులు ఇప్పుడిప్పుడే దర్శనీయ స్థలాలను, పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ తరుణంలో బోధిసిరి బోటు నదీ విహారానికి సిద్ధమవడంపై హర్షం వ్యక్తమవుతోంది. బోధిసిరి బోటు వినియోగంలోకి వస్తే కృష్ణానదిలో విహరించేందుకు ఉత్సాహపడే పర్యాటకులకు ఆహ్లాదం కలిగించడమేగాక ఏపీటీడీసీకి మంచి ఆదాయం సమకూరుతుంది. పోర్ట్ అధికారుల నిబంధనల మేరకు రూపుదిద్దిన బోధిసిరి బోటుకు పోర్ట్, ఇరిగేషన్ శాఖల అనుమతులు కూడా సులువుగానే లభించాయి. బోటులో నైట్ పార్టీ.. రెండు దశాబ్దాలుగా పర్యాటకులకు సేవలందిస్తున్న బోధిసిరి బోటు 120 సీటింగ్ సామర్థ్యం కలిగి ఉంది. గరిష్టంగా 200 మంది వరకు ఇందులో ప్రయాణం చేయవచ్చు. ఈ బోటును ఫంక్షన్లు నిర్వహించుకునేందుకు కూడా అద్దెకు ఇస్తారు. ఈ భారీ బోటు పైభాగంలో పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి చిన్నచిన్న వేడుకలు నిర్వహించుకోవచ్చు. దీనిమీద చిన్నపాటి వేదిక కూడా ఉంది. బోటు నదిలో విహరిస్తుండగా పార్టీలు చేసుకోవడానికి చాలామంది ఇష్టపడతారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో బోటులో ఏర్పాటు చేసుకునే విద్యుత్ లైట్లతో అహ్లాదకరమైన వాతావరణంలో వేడుకలు జరుపుకొంటే ఆ మజానే వేరని అంటారు ప్రకృతి ప్రేమికులు. ఇటువంటి ఫంక్షన్లతోపాటు అసోసియేషన్లు, మార్కెటింగ్ సంస్థలు వంటివాటి సమావేశాలకు కూడా అనువుగా ఉంటుంది. ఫంక్షన్‌కు లేదా సమావేశానికి వచ్చే అతిథులు భోజనాలు చేసేందుకు కింద ఏసీ సౌకర్యంతో సీటింగ్, టేబుల్స్‌తో పెద్ద హాల్ ఉంది. పైన ఆటపాటలతో కనువిందు చేస్తే కింద హాల్లో రుచికరమైన వంటకాలతో విందు భోజనం సిద్ధంగా ఉంటుంది. బోధిసిరి బోటులో నదిలో విహరించేందుకు గతంలో రెండు గంటలకు రూ.10 వేలు వసూలు చేసింది ఏపీటీడీసీ. కార్తికమాసం, పండుగలు, వారాంతపు సెలవుదినాల్లో పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉండటంతో బోధిసిరి బోటును వినియోగిస్తుంటారు. వారంలో బోటు విహారం బోధిసిరి బోటుకు సంబంధించిన పనులు 95 శాతానికి పైగా పూర్తయ్యాయి. చిన్నచిన్న పనులు, స్టిక్కరింగ్, ప్లంబింగ్ పనులు మూడు, నాలుగు రోజుల్లో పూర్తవుతాయి. ఇప్పటికే బోటు ట్రయల్ రన్ పూర్తయింది. బోటుకు సంబంధించిన అనుమతులు వచ్చాయి. ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా బోటు షికారు వారం రోజుల్లోనే ప్రారంభం కానుంది. ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు కృష్ణానదిలో బోధిసిరి కనువిందు చేయనుంది. – సీహెచ్.శ్రీనివాసరావు, డివిజనల్ మేనేజరు, ఏపీటీడీసీ -
16వ నంబర్ గేట్ వద్ద సాగుతున్న మరమ్మతు పనులు
-
పులిచింతల ప్రాజెక్ట్ వద్ద మరమ్మతులు
సాక్షి, గుంటూరు: పులిచింతల ప్రాజెక్టు వద్ద అధికారులు మరమ్మతులు చేపట్టారు. 16వ నంబర్ గేట్ వద్ద నిపుణుల ఆధ్వర్యంలో మరమ్మతులు కొనసాగుతున్నాయి. సాగర్, తుపాకులగూడెం, పోలవరం నుంచి నిపుణులు వచ్చారు. 35 మంది సిబ్బంది మరమ్మతు పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రాజెక్ట్ వద్ద స్టాప్ లాక్ గేట్ అమర్చే పనిలో సిబ్బంది ఉన్నారు. పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుకోవడంతో గురువారం తెల్లవారుజామున నీటిని దిగువకు విడుదల చేసేందుకు గేట్లు ఎత్తుతుండగా 16వ గేటు ప్రమాదవశాత్తు విరిగిపోయిన సంగతి తెలిసిందే. రెండు అడుగుల మేర గేట్లు ఎత్తడానికి అధికారులు ప్రయత్నిస్తుండగా హైడ్రాలిక్ గడ్డర్ ఊడిపోవడంతో గేటు విరిగి వరద నీటిలో కొట్టుకుపోయింది. సమాచారం అందుకున్న ప్రాజెక్టు ఉన్నతాధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ నిన్న ఉదయాన్నే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. నిపుణుల బృందాన్ని రప్పించి మరమ్మతులు చేపట్టారు. -
తుపాన్లతో దెబ్బతిన్న రోడ్లకు వేగంగా మరమ్మతులు
సాక్షి, అమరావతి: తుపాన్లు, భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్లకు రెండు దశల్లో యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయాలని ఆర్ అండ్ బీ శాఖ నిర్ణయించింది. తిత్లీ, నివర్ తుపాన్లు, భారీ వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నాయి. ఈ రోడ్ల మరమ్మతులను వెంటనే చేపట్టాలని సీఎం జగన్ ఇటీవల అధికారులను ఆదేశించారు. ఈమేరకు అధికారులు రెండు దశల్లో రూ.540 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. అందులో రూ.154 కోట్లతో 260 పనులను ఇప్పటికే ఆమోదించారు. త్వరలో మరో రూ.386 కోట్లతో పనులకు ప్రణాళికలను రూపొందించి ప్రభుత్వ ఆమోదానికి పంపింది. మొదటి దశలో రాష్ట్ర ప్రధాన రహదారుల మరమ్మతుల కోసం రూ.74 కోట్లతో 50 పనులను ఆమోదించారు. వాటిలో 25 పనులను ప్రారంభించగా మరో 25 పనులు టెండర్ల దశలో ఉన్నాయి. ఇక జిల్లా ప్రధాన రహదారుల మరమ్మతుల కోసం రూ.80 కోట్లతో 210 పనులను ఆమోదించారు. వాటిలో 55 పనులను ప్రారంభించగా 155 పనులు టెండర్ల దశలో ఉన్నాయి. ఇక రెండో దశ పనులకు తుది ఆమోదం రాగానే పనులు మొదలుపెడతారు. చదవండి: సీఎం సహాయ నిధికి రూ.1.33 కోట్ల విరాళం ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోండి -
బ్రిటన్ రాణికి కరోనా కష్టాలు!
లండన్: కరోనా మహమ్మారి ప్రభావం బ్రిటన్ రాణి ఎలిజబెత్–2పైనా పడింది. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ వల్ల సందర్శకుల రాక తగ్గిపోవడంతో ఎలిజబెత్ కుటుంబం 35 మిలియన్ పౌండ్ల(45 మిలియన్ డాలర్లు) ఆదాయం కోల్పోనున్నట్లు రాజకుటుంబం మనీ మేనేజర్ మైఖేల్ స్టీవెన్స్ చెప్పారు. ఎలిజబెత్ కుటుంబ వార్షిక ఆదాయ వ్యయాల వివరాలను ప్రకటించారు. బ్రిటన్‌లో రాజ కుటుంబానికి ఎన్నో ప్యాలెస్‌లను సందర్శించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వచ్చేవారు. వీరి ద్వారా ఫీజుల రూపంలో అందే మొత్తం ఎలిజబెత్ ఖాతాలోకే చేరేది. కరోనాతో ఈ ఆదాయానికి భారీగా గండి పడింది. మరోవైపు రాణి నివసించే ప్రఖ్యాత బకింగ్హమ్ ప్యాలెస్‌కు మరమ్మతులు చేయాల్సి ఉంది. చివరిసారిగా రెండో ప్రపంచ యుద్ధం కొన్నాళ్లకు ఈ ప్యాలెస్‌కు మరమ్మతులు చేశారు. ఇప్పుడు నిధులు లేవని మరమ్మతులు ఆపేస్తే ప్యాలెస్ శిథిలావస్థకు చేరుతుందని ఆందోళన చెందుతున్నారు. కరోనా కష్టకాలంలో నిధులు ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని రాణి కోరబోరని స్టీవెన్స్ చెప్పారు. ఉన్న నిధులనే సర్దుబాటు చేసుకుంటామన్నారు. ప్యాలెస్ సిబ్బందికి ఇప్పటికే íజీతాలు చెల్లించడం నిలిపి వేశారు. గత ఆర్థిక సంవత్సరం బ్రిటన్ ప్రభుత్వం రాజ కుటుంబానికి 69.4 మిలియన్ పౌండ్లు అందజేసింది. అంతకుముందు నాటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 2.4 మిలియన్ పౌండ్లు అధికం కావడం గమనార్హం. -
మెట్రో స్టేషన్లలో మరమ్మతులు
సాక్షి, సిటీబ్యూరో: అమీర్‌పేట్ మెట్రోస్టేషన్ దుర్ఘటన నేపథ్యంలో అన్ని స్టేషన్లలో మరమ్మతు పనులు ఊపందుకున్నాయి. మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ మెట్రోరైలు, ఎల్‌అండ్‌టీలు అప్రమత్తమై ఆయా స్టేషన్లలో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు పనులు చేపడుతున్నాయి. విడిభాగాలు, ప్లాస్టరింగ్ మెటీరియల్ ఊడి పడకుండా మరమ్మతు పనులు చేపట్టినట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ పనులను తాను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నానన్నారు. పనుల నాణ్యత, మన్నిక, లోపాలను గుర్తించేందుకు ఎల్అండ్టీ ఆరు ప్రత్యేక ఇంజినీరింగ్ బృందాలను ఏర్పాటు చేసిందన్నారు. పనులు చేపట్టేందుకు అత్యంత ఎత్తునకు వెళ్లే బూమ్ లిఫ్టులు, ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేశామన్నారు. నాగోల్–హైటెక్‌సిటీ, ఎల్బీనగర్–మియాపూర్ రూట్లలోని అన్ని స్టేషన్ల విడిభాగాలు, ఇతర నిర్మాణాలను సూక్ష్మంగా పరిశీలిస్తున్నామన్నారు. సుదీర్ఘం అనుభవం కలిగిన ఇంజినీర్ల పర్యవేక్షణలో ఇవి కొనసాగుతున్నాయన్నారు. నిర్మాణాల్లోని పగుళ్లు, ఉపరితల ప్లాస్టర్ మెటీరియల్, కాంక్రీట్ చిప్‌లు, విడిభాగాలు ఊడిపడకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇక్కడే మరమ్మతులు.. ప్రధానంగా బాలానగర్, పరేడ్‌గ్రౌండ్స్, రసూల్‌పురా, హైటెక్‌సిటీ, గాంధీభవన్, ఎల్బీనగర్, న్యూమార్కెట్, ఉస్మానియా మెడికల్ కాలేజ్ తదితర స్టేషన్లకున్న పగుళ్లను సరిదిద్దుతున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.