యంత్రాలు ఫర్ సేల్ ?
పీడబ్ల్యూడీ వర్క్‌షాపు యంత్రాలు
ఘన చరిత్రకు గ్రహణం టీడీపీ హయాంలో నిర్లక్ష్యపు తుప్పు
ప్రకాశం బ్యారేజీ భద్రతపై నీలినీడలు
ఉద్యోగుల భవిష్యత్తూ ప్రశ్నార్థకమే
తాడేపల్లి రూరల్: ఎంతో చరిత్ర కలిగిన సీతానగరం పీడబ్ల్యూడీ వర్కుషాపును మూసివేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సుమారు వంద కోట్ల రూపాయల ఖరీదు చేసే యంత్రాల విక్రయానికి సన్నాహాలు చేస్తోంది. దీని కోసం ముగ్గురు అధికారులతో కూడిన కమిటీని నియమించింది. వర్కుషాపులో యంత్రాలు స్క్రాప్ రూపంలో ఎంత బరువు ఉంటాయి.. వాటిని ఎలా విక్రయించాలనే అంశాలపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
ప్రైవేటు కంపెనీలకు మరమ్మతు బాధ్యతలు...
2002 వరకు పీడబ్ల్యూడీ వర్కు షాపునకు చెందిన సాంకేతిక సిబ్బంది అనేక ప్రాంతాల్లో పలు ప్రాజెక్టులకు గేట్లు అమర్చేవారు. ఆ తరువాత అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం భారీ నీటి పారుదలకు సంబంధించిన మరమ్మతులన్నింటినీ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రక్రియ మొదలు పెట్టింది. అందులో భాగంగానే ప్రకాశం బ్యారేజీ గేట్లను మార్చేటప్పుడు ప్రభుత్వం టెండర్ల ద్వారా రూ. 150 కోట్ల వ్యయంతో పనులను ప్రైవేటు సంస్థకు అప్పగించింది. వర్కుషాపులో సిబ్బంది రూ. 90 కోట్ల వ్యయంతోనే నాణ్యమైన గేట్లను అందజేస్తామన్నా వినిపించుకోలేదు.
12 ఏళ్లకే తుప్పు పట్టిన యంత్రాలు...
పీడబ్ల్యూడీ వర్కు షాపులోని సిబ్బంది 1955లో ప్రకాశం బ్యారేజీ ఆనకట్టకు 10.5 ఎత్తు ఉండేలా గేట్లను తయారు చేసి అమర్చారు. 2002 వరకు అవే గేట్లు వాడకంలో ఉండేవి. సుమారు 50 ఏళ్ల పాటు పని చేసే విధంగా గేట్లను డిజైన్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం కాసులకు కక్కుర్తిపడి 2002లో ఏర్పాటు చేసిన గేట్లు 12 ఏళ్లు గడిచే సరికే తుప్పుపట్టాయి. తిరిగి కోట్ల రూపాయలు వెచ్చించి మరమ్మతులు నిర్వహించాల్సి వచ్చింది.
విలువైన యంత్రాలు...
పీడబ్ల్యూడీ వర్కు షాపు పెన్ స్టాక్‌లో గేట్లను బెండింగ్ చేసే యంత్రం భారతదేశంలో మరెక్కడా లేదు. రెండు నుంచి ఏడు అంగుళాల మందం ఉన్న ఐరన్ షీట్లను సైతం ఎటు కావాలంటే అటు వంచే విధంగా ఆ యంత్రం పని చేస్తుంది. వీటితోపాటు డ్రిల్లింగ్ మిషన్లు, వెల్డింగ్ కట్టర్స్ వర్క్ షాపులోని ప్రత్యేకతలు. ఇప్పుడు అధికార టీడీపీ ఈ వర్కు షాపును తొలగించే విధంగా నిర్ణయాలు తీసుకుంటుంటే చరిత్రాత్మక కట్టడమైన ప్రకాశం బ్యారేజీని ఎలా రక్షిస్తారో అర్థంకాని పరిస్థితులు ఏర్పడ్డాయి.