డిస్కంలకు కేటాయించిన విద్యుత్ నియంత్రణ మండలి
సాక్షి, అమరావతి: ప్రజల నుంచి వచ్చే విద్యుత్ స్తంభాలు, లైన్ల మరమ్మతుల ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు రూ.15 కోట్లు చొప్పున రూ.45 కోట్లను కేటాయిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) వెల్లడించింది. 2024–25 నుంచి 2024–29 మధ్య డిస్కంల ప్రసార (వీలింగ్)చార్జీలను నిర్ణయిస్తూ మండలి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
33కేవీ, 11కేవీ, ఎల్టీ లైన్లను ఉపయోగించుకున్న వారి నుంచి డిస్కంలు వసూలు చేసేలా రూ.0.32 నుంచి రూ.2.14 వరకూ ఐదేళ్లకు వేర్వేరు చార్జీలను ప్రకటించింది. ఇన్నాళ్లూ కిలోఓల్ట్‌అవర్ (కేవీఏ) ప్రాతిపదికన వసూలు చేస్తున్న వీలింగ్ చార్జీలను ఇకపై ప్రతి యూనిట్ ప్రాతిపదికన వసూలు చేయాలని ఏపీఈఆర్సీ ఆదేశించింది. అయితే ఈ చార్జీల్లో గృహాలు, పబ్లిక్, ప్రభుత్వ సంస్థలకు 50 శాతం రాయితీ వర్తిస్తుందని తెలిపింది. దానివల్ల ఇళ్లపై సోలార్ రూఫ్‌టాప్ సిస్టంలు ఏర్పాటు చేసేవారి సంఖ్య పెరుగుతుందని అభిప్రాయపడింది.
ఏపీ ట్రాన్స్‌కోతో పాటు డిస్కంలు కూడా ఓల్టేజ్ నిర్వహణపై మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని కోరింది. గ్రామీణ ప్రాంతాల్లో దెబ్బతిన్న విద్యుత్ లైన్లు, స్థంభాలను సరి చేయడానికి తాము కేటాయించిన నిధులను వినియోగించాలని సూచించింది. మార్చి 31 నాటికి అన్ని పెట్టుబడుల వివరాలను కమిషన్‌కు తెలియజేయాలని, తర్వాతి ఆరి్థక సంవత్సరానికి సంబంధించి డిసెంబర్ 31వ తేదీలోపు ఖర్చుల వివరాలను సమర్పించి, ఆమోదం పొందాలని కమిషన్ స్పష్టం చేసింది.
రాష్ట్రంలో పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడానికి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ రూపొందించిన ‘విద్యుత్ పంపిణీ నెట్‌వర్క్ ప్లానింగ్ క్రైటీరియా 2023’ పత్రాన్ని అనుసరించాలని డిస్కంలను ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఉద్యోగుల ఖర్చుల్లో పెన్షన్, గ్రాట్యుటీ (పీఅండ్‌జీ) ట్రస్ట్‌లకు సంబంధించిన నిబంధనలను కమిషన్ అనుమతించింది.
Comments
Please login to add a commentAdd a comment