కొత్తగా వచ్చిన పదమూడు సర్కిళ్లు
ఒక్క కొత్త పోస్టు కూడా ఇవ్వలేమని చెప్పిన ప్రభుత్వం
ప్రస్తుత ఉద్యోగులనే కొత్త సర్కిళ్లకు కేటాయింపు
పలు జిల్లాల్లో పోస్టులను కుదించేసిన అధికారులు
ఒక్కో ఉద్యోగిపై ఇద్దరు ముగ్గురు చేయాల్సిన పనిభారం
డివిజన్ కార్యాలయాలనే జిల్లాస్థాయికి మార్చడంపై అసంతృప్తి
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం వంద రోజల పాలనలో విద్యుత్ శాఖలో చెప్పుకోవడానికంటూ జరిగిన అభివృద్ధి ఒక్కటీ లేదు. కనీసం కొత్త సర్కిళ్లయినా ఇస్తే ప్రజలకు విద్యుత్ సేవలు చేరువవుతాయనే డిమాండ్ రావడంతో ఎట్టకేలకు వాటికి అనుమతినిచ్చింది. ఆ వెంటనే విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీలు పదమూడు కొత్త జిల్లాలకు సర్కిళ్లను ఏర్పాటు చేశారు. కానీ ఎలాంటి ఆర్థిక భారం ఉండకూడదని ప్రభుత్వం ఇచ్చిన అనుమతి ఆదేశాల్లోనే పేర్కొనడంతో ప్రస్తుతం ఉన్న సిబ్బందినే కొత్త కార్యాలయాల్లో సర్దుబాటు చేశారు.
దానివల్ల కొన్ని చోట్ల కొన్ని పోస్టులను తీసేయాల్సి వచ్చింది. మరి కొన్ని చోట్ల పోస్టులను ఒకదానితో మరొకటి కలిపేయాల్సి వచ్చింది. దీంతో పనిభారం పెంచేలా ప్రభుత్వం చర్యలున్నాయని విద్యుత్ ఉద్యోగులు మండిపడుతున్నారు. అదీగాక ఇన్నాళ్లూ డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇంజనీర్ (డీఈఈ)లు ఉన్న డివిజన్ కార్యాలయాలనే జిల్లా స్థాయికి మార్చడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.
పర్యవేక్షక ఇంజనీర్ (ఎస్‌ఈ) కార్యాలయానికి తగ్గట్టు ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా.. ఉన్నవాటితోనే సర్ధుకోమనడంపై విద్యుత్ సంఘాలు మండిపడుతున్నాయి. గత ప్రభుత్వంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా పెంచినప్పుడు ప్రతి జిల్లాకు ఒకేలా పరిపాలనా సిబ్బందిని, కార్యాలయాలను కేటాయించారని, కానీ కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా విద్యుత్ సంస్థల్లో సిబ్బందిని వేధించేందుకే సర్కిళ్లకు షరతులు పెట్టిందని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
కేటాయింపుల్లో తేడాలు
సిబ్బందిపైనే భారంరాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల్లో కొత్త సర్కిళ్లు (జిల్లా కార్యాలయాలు) ఏర్పాటు చేసిన విషయం విధితమే.13 పాత సర్కిళ్లకు అదనంగా మరో 13 కొత్త సర్కిళ్లను రూపొందించి, వాటికి అధికారులను, సిబ్బందిని కూడా కేటాయించారు. కార్పొరేట్ కార్యాలయాల్లో జనరల్ మేనేజర్లు(జీఎం)గా ఉన్నవారిని సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్‌ఈ)లుగా నియమించారు. అక్కడ మిగిలిన జీఎంల డిజిగ్నేషన్లు మార్చి, అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఇప్పుడు ఒక్కొక్కరూ రెండు, మూడు విభాగాలను చూడాలి. ఉదాహరణకు ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో క్యాలిటీ కంట్రోల్ జీఎంకు కమర్షియల్ విభాగాన్ని అదనంగా ఇచ్చారు. అదేవిధంగా అన్ని సర్కిళ్లలో చీఫ్‌జనరల్ మేనేజర్లకు అదనపు బాధ్యతలు అప్పగించనున్నారు. అలాగే సర్కిళ్ల విభజన తరువాత ఒక్కో జిల్లాకూ ఒక్కో విధంగా విద్యుత్ సిబ్బంది పోస్టులను కేటాయించారు.
ఏపీఎస్పీడీసీఎల్‌లో అనంతపురం సర్కిల్‌కు 58 మంది సిబ్బందిని కేటాయిస్తే, అదే డిస్కం పరిధిలోని సత్యసాయి జిల్లా, పుట్టపర్తి సర్కిల్‌కు 55 మందినే ఇచ్చారు. అలాగే ఏపీఈపీడీసీఎల్ లో విశాఖపట్నం సర్కిల్‌లో 61 మందితో సర్ధుబాటు చేస్తే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సర్కిల్‌కు కేవలం 52 మందితోనే సరిపెట్టారు. ఏపీసీపీడీసీఎల్‌లో ఒంగోలు సర్కిళ్లలో 49 మందిని ఇస్తే సీఆర్‌డీఏ సర్కిల్‌కు 41 మందినే కేటాయించారు. పోనీ ఈ కేటాయింపుల మేరకైనా సిబ్బందిని బదిలీ చేశారా అంటే అదీ లేదు. కొత్త సర్కిళ్ల పేరు చెప్పి సగం సర్వీసులు తగ్గించేశారు.
ఉదాహరణకు కొన్ని సర్కిళ్లలో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (ఎస్‌ఏఓ) పోస్టులను తీసేశారు. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్(జేఏఓ) పోస్టులను తగ్గించేశారు. అలాగే టెక్నికల్ పోస్టులను కుదించేశారు. ఒక్కో ఉద్యోగి రెండు మూడు విభాగాల పని చేసే విధంగా పనిభారం మోపడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. అసలే పని భారంతో సతమతమవుతున్న ఉద్యోగులు ఈ కేటాయింపుపై ఆందోళనకు గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment