గృహ విద్యుత్ వినియోగదారులపై రూ.2,194 కోట్ల భారం
వ్యవసాయ విద్యుత్ సర్వీసులపై రూ.1,901 కోట్ల చార్జీ
పరిశ్రమలపై రూ.2,748 కోట్లు అదనంగా పడనున్న బిల్లు
వాణిజ్య దుకాణాలపై రూ.669 కోట్లు.. సంస్థలపై రూ.547 కోట్లు
ఏపీఈఆర్‌సీ అనుమతిస్తే వసూలు చేస్తామన్న డిస్కంలు
గత ప్రభుత్వంలో సెకీతో మినహా దీర్ఘకాలిక ఒప్పందాలు లేవు
సాక్షి, అమరావతి: ఇంధన, విద్యుత్ కొనుగోలు ఖర్చు సర్దుబాటు (ఎఫ్‌పీపీసీఏ) చార్జీలు రూ.8,113.60 కోట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ)కి ప్రతిపాదించినట్లు విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్) మంగళవారం వెల్లడించాయి. ఏపీఈఆర్‌సీ అనుమతితో గృహ విద్యుత్ వినియోగదారుల నుంచి రూ.2,194 కోట్లు, వ్యవసాయ విద్యుత్ సర్వీసుల నుంచి రూ.1901 కోట్లు, పారిశ్రామిక సర్వీసుల నుంచి రూ.2,748 కోట్లు, వాణిజ్య సర్వీసుల నుంచి రూ.669 కోట్లు, సంస్థ(ఇన్‌స్టిట్యూషన్స్) నుంచి రూ.547 కోట్లు చొప్పున విద్యుత్ బిల్లుల్లో అదనంగా వసూలు చేయనున్నట్లు డిస్కంలు వెల్లడించాయి.
ప్రతి నెలా ఒక్కో బిల్లుపై యూనిట్‌కు రూ.1.27 చొప్పున వసూలు చేస్తామని తెలిపాయి. ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ వినియోగదారులపై యూనిట్‌కు రూ.1.65 వసూలు చేస్తున్నామని, వీటిని వచ్చే ఏడాది మార్చి వరకూ కొనసాగిస్తామని స్పష్టం చేశాయి. వీటికి తాజా ఎఫ్‌పీపీసీఏ చార్జీలు అదనమని పేర్కొన్నాయి. ఈ చార్జీల వసూలుకు ఏపీఈఆర్‌సీ అనుమతి ఇవ్వాల్సి ఉందని, ఇవ్వకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇందులో 75 శాతం భరించాల్సి ఉంటుందని డిస్కంలు స్పష్టం చేశాయి.
‘బాబు’ గుదిబండ పీపీఏ కోసమే రుణాలు
గత ప్రభుత్వంలో సెకీ నుంచి 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు మినహా ఎలాంటి దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోలేదని డిస్కంలు తెలిపాయి. దీంతో స్పల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లకు 2022–23లో రూ.6,522 కోట్లు వెచ్చించినట్లు పేర్కొన్నాయి. అయితే గతంలో చంద్రబాబు హయాంలో జరిగిన పీపీఏలను సమీక్షించేందుకు 2019 జూలైలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉన్నత స్థాయి చర్చల కమిటీని నియమించిందని, అయితే ఒప్పందం ప్రకారం చెల్లింపులు జరపాలని 2022 మార్చిలో హైకోర్టు సూచించిందని డిస్కంలు గుర్తు చేశాయి.
దీనివల్ల సౌర, పవన విద్యుత్ సరఫరా దారులకు యూనిట్ రూ.2.44 చొప్పున బకాయిలు చెల్లించేందుకు రూ.9 వేల కోట్ల రుణం తీసుకోవాల్సి వచ్చిందని డిస్కంలు వెల్లడించాయి. దీన్నిబట్టి చంద్రబాబు పాపాలు విద్యుత్ సంస్థలను, రాష్ట్ర ప్రజలను వెంటాడుతున్నాయనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలని విద్యుత్తు రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment