
రోజంతా మూతబడ్డ విమానాశ్రయం
విద్యుత్ సబ్‌స్టేషన్లో పేలుడే కారణం
1,350 విమానాల రద్దు, దారిమళ్లింపు
2.9 లక్షల ప్రయాణికులకు తీవ్ర ఇక్కట్లు
కొద్దిరోజులు సమస్యలే: హీత్రూ వర్గాలు
చెప్పేదాకా ప్రయాణికులు రావద్దని విజ్ఞప్తి
రాత్రికల్లా పాక్షికంగా సేవల పునరుద్ధరణ
లండన్: అంతర్జాతీయ ప్రయాణాలకు గుండెకాయ వంటి లండన్ హీత్రూ విమానాశ్రయం శుక్రవారం పూర్తిగా మూతబడింది. ఎయిర్‌పోర్టుకు విద్యుత్ సరఫరా చేసే సబ్‌స్టేషన్‌లో మంటలు చెలరేగడమే ఇందుకు కారణం. దాంతో హీత్రూకు కరెంటు సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో విమానాశ్రయాన్ని రోజంతా మూసేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయంతో అంతర్జాతీయంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఏకంగా 1,350 విమానాలను రద్దు చేయడం, దారి మళ్లించడం జరిగినట్టు విమాన ట్రాకింగ్ సేవల సంస్థ ఫ్లైట్‌రాడార్24 వెల్లడించింది.
దీనివల్ల 2.9 లక్షల మంది ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు లోనైనట్టు సమాచారం. ‘‘విమానాశ్రయానికి విద్యుత్‌ను పూర్తిగా తిరిగి ఎప్పుడు పునరుద్ధరించేదీ చెప్పలేం. విమానాశ్రయాన్ని తెరిచేదాకా ప్రయాణికులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈవైపు రావొద్దు’’అని హీత్రూ సీఈఓ థామస్ వోల్డ్‌బీ విజ్ఞప్తి చేశారు. శనివారానికల్లా పూర్తిస్థాయిలో సేవలను పునరుద్ధరిస్తామని ఆయన ఆశాభావం వెలిబుచ్చినా చాలా రోజులే పట్టవచ్చంటున్నారు.
ప్రయాణికులు తమ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోవడం, అందుకు తగ్గట్టు విమానయాన సంస్థలు విమానాలను, సిబ్బందిని సమకూర్చుకునేందుకు కూడా కొన్ని రోజులు పడుతుందని చెబుతున్నారు. హీత్రూ యూరప్‌లోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం. ప్రతి 90 సెకన్లకు ఒక విమానం టేకాఫ్/లాండింగ్ జరుగుతుంది! ఇక్కణ్నుంచి రోజుకు 669 విమానాలు టేకాఫ్ అవుతాయి.
మండిపడుతున్న ప్రయాణికులు
హీత్రూ మూసివేతతో ఉత్తర అమెరికా, ఆసియా దేశాలకు చెందిన సుదూర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిణామంపై వారంతా తీవ్రంగా మండిపడుతున్నారు. ఒక్క అగ్నిప్రమాదం కారణంగా యూరప్‌లోనే అత్యంత రద్దీ విమానాశ్రయం మూతబడటమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇది అసాధారణమైన పరిస్థితని ఏవియేషన్ కన్సల్టెంట్ అనితా మెండిరట్టా తెలిపారు. ‘‘శనివారానికల్లా సమస్యను సరిదిద్దుతాం. కానీ పూర్తి సాధారణ స్థితికి చేరేందుకు నాలుగు రోజులు పట్టొచ్చు’’అని చెప్పారు.
హీత్రూ వైపు వెళ్లే అన్ని రైళ్లను కూడా రద్దు చేసినట్లు నేషనల్ రైల్ తెలిపింది. హీత్రూ మూసివేత కారణంగా 4 వేల టన్నుల కార్గో రవాణా కూడా నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రికల్లా కొన్ని విమాన సేవలను పునరుద్ధరించినట్టు చెప్పుకొచ్చారు. ‘‘జొహన్నెస్‌బర్గ్, సింగపూర్, రియాద్, కేప్‌టౌన్, సిడ్నీ, బ్యూనస్‌ఎయిర్స్ వంటి నగరాలకు విమానాలు బయల్దేరాయి. అవన్నీ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడానికే పరిమితమయ్యాయి’’ అని స్పష్టం చేశారు.
కారణమేంటి?
పశి్చమ లండన్‌లో హీత్రూ విమానాశ్రయానికి రెండు మైళ్ల దూరంలో ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో గురువారం అర్ధరాత్రి భారీ పేలుడు శబ్దం విన్పించిందని, మంటలు సబ్ స్టేషన్‌ను చుట్టుముట్టాయని స్థానికులు వివరించారు. లండన్ ఫైర్ బ్రిగేడ్ 70 మంది సిబ్బంది 10 ఫైరింజిన్లతో హుటాహుటిన చేరుకుని 7 గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చింది. అప్పటికే విమానాశ్రయంలో పవర్ కట్ ఏర్పడింది. ప్రమాదానికి కారణమేమిటనే దానిపై స్పష్టత లేదు. కుట్ర కోణం లేదని ప్రభుత్వం పేర్కొంది.
జరిగింది చాలా పెద్ద ప్రమాదం. హీత్రూ విమానాశ్రయానికి ఉన్న అతి పెద్ద బలహీనత విద్యుత్ సరఫరాయే – విమానాశ్రయం సీఈఓ థామస్ వోల్డ్‌బీ

తీవ్ర వైఫల్యమే: ప్రధాని
హీత్రూకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడం తీవ్ర వైఫల్యమేనని ప్రధాని కియర్ స్టార్మర్ అంగీకరించారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిగి తీరుతుందని ఆయన అధికార ప్రతినిధి టామ్ వెల్స్ ప్రకటించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా అన్ని చర్యలూ తీసుకుంటామని తెలిపారు.
బిలియన్లలో నష్టం!
హీత్రూ ప్రమాదం విమానయాన సంస్థల నడ్డి విరిచేలా కని్పస్తోంది. విమానాల రద్దు, బీమా, పరిహారం చెల్లింపులు తదితరాల రూపంలో అవి బిలియన్ల కొద్దీ డాలర్ల నష్టాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చని ఆ రంగ నిపుణులు చెబుతున్నారు. హీత్రూ మూసివేత దెబ్బ ఇప్పటికే వాటి మార్కెట్ విలువపై పడింది. బ్రిటిష్ ఎయిర్‌వేస్, లుఫ్తాన్సా, ర్యాన్‌ఎయిర్ వంటి పలు సంస్థల షేర్లు 1 నుంచి 2 శాతం దాకా పతనమయ్యాయి.
ఆ సమయంలో గాల్లో 120 విమానాలు
విద్యుత్ సరఫరా నిలిచి విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించిన సమయంలో సుమారు 120 విమానాలు హీత్రూ సమీపంలో గాల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. కొన్నింటిని సమీపంలోని గాట్విక్, మాంచెస్టర్‌కు మళ్లించగా మరికొన్ని సమీప యూరప్ దేశాల్లోని పారిస్, ఆమ్‌స్టర్‌డామ్, ఫ్రాంక్‌ఫర్ట్ తదితర విమానాశ్రయాల్లో లాండయ్యాయి.
మరికొన్ని విమానాలు వెనక్కు వెళ్లిపోయాయి. హీత్రూ మూసివేత వల్ల పారిస్‌లో లాండైన తమ ప్రయాణికుల కోసం క్వాంటాస్ ఎయిర్‌లైన్ సింగపూర్, పెర్త్ నుంచి విమానాలను పంపింది. లండన్‌కు వెళ్లాల్సిన వారిని బస్సులు, రైళ్లలో తరలిస్తామని తెలిపింది. ర్యాన్‌ఎయిర్ కూడా తమ ప్రయాణికుల కోసం డబ్లిన్, స్టాన్‌స్టెడ్ ఎయిర్‌పోర్టులకు విమానాలు నడుపుతామని తెలిపింది.
అత్యంత బిజీ!
అంతర్జాతీయ ప్రయాణాల విషయంలో ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో హీత్రూ ఒకటి. ఇది 1964లో అందుబాటులోకి వచ్చింది. ఇక్కడినుంచి ఏకంగా 90 దేశాల్లోని 230 గమ్యస్థానాలకు విమానాలు నడుస్తాయి. బ్రిటిష్ ఎయిర్‌వేస్‌తో పాటు 90 సంస్థలకు చెందిన విమానాలు ఇక్కడినుంచి రాకపోకలు సాగిస్తాయి.
జనవరిలో రికార్డు స్థాయిలో 63 లక్షల మంది ప్రయాణికులు హీత్రూ గుండా రాకపోకలు సాగించారు! 2010లో ఐస్‌ల్యాండ్‌లో అగ్నిపర్వతం బద్దలై భారీగా దుమ్ముధూళి మేఘాలు కమ్ముకోవడంతో అట్లాంటిక్ మీదుగా విమానాల రాకపోకలకు నెలలపాటు అంతరాయం ఏర్పడింది. అప్పుడు కూడా హీత్రూలో విమాన సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అయినా ఇలాంటి సందర్భాలను ఎదుర్కొనేందుకు బ్రిటన్ సన్నద్ధం కాలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మూడు సబ్‌స్టేషన్లున్నా...
హీత్రూకు కరెంటు సరఫరా కోసం మూడు సబ్‌స్టేషన్లతో పాటు ఒక బ్యాకప్ ట్రాన్స్‌ఫార్మర్ కూడా ఉంది. కానీ వాటిలో ఒక సబ్‌స్టేషన్ ప్రస్తు తం పని చేయడం లేదు. మరికొటి కొద్ది రోజులు గా సమస్యలు ఎదుర్కొంటోంది. హీత్రూ విమానాశ్రయం నడవాలంటే ఏకంగా ఒక మినీ నగర అవసరాలకు సమానమైన కరెంటు అవసరం!
ఎయిరిండియా సేవలూ రద్దు..
న్యూఢిల్లీ: హీత్రూకు విమాన సేవలను శుక్రవారం నిలిపేసినట్టు ఎయిరిండియా పేర్కొంది. ‘‘ఒక విమానం ముంబైకి తిరిగొచ్చింది. మరొకటి ఫ్రాంక్‌ఫర్ట్ మళ్లించాం. మిగతావి రద్దయ్యాయి’’ అని ప్రకటించింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు నుంచి శుక్రవారం లండన్ వెళ్లాల్సిన 5 వర్జిన్ అట్లాంటిక్, 8 బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానాలు కూడా రద్దయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment