
ఫ్లోరిడా రాష్ట్రంలోని 3 వర్సిటీల్లో కొత్తగా ‘ఇమిగ్రేషన్’ పోలీసులు!
తలాహస్సీ(యూఎస్): అమెరికా గ్రామాలు, పట్టణాల్లో అనుమానిత ప్రదేశాలు, జనావాస స్థలాల్లో మాత్రమే ఇన్నాళ్లూ అక్రమ వలసదా రుల కోసం ఇమిగ్రేషన్ అధికారుల వేట కొన సాగింది. ఇకపై ‘సున్నిత ప్రదేశాల’ కేటగిరీలో ఉన్న విశ్వవిద్యాలయాల్లోనూ అక్రమ వలస దారుల జాడ కనిపెట్టేందుకు ఇమిగ్రేషన్ ఎన్ ఫోర్స్‌మెంట్ అధికారులు రంగప్రవేశం చేయ నున్నారు.
ప్రస్తుతానికి ఫ్లోరిడా రాష్ట్రంలోని మూడు ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లోకి ‘ఇమి గ్రేషన్’ తనిఖీలను అనుమతించే అవకాశ ముంది. బోకా రాటన్ నగరంలోని ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ, గెయిన్స్‌విల్లేలోని ఫ్లోరిడా వర్సిటీ క్యాంపస్, తంపా సిటీలోని సౌత్ ఫ్లోరిడా యూనివర్సిటీలు ఈ మేరకు ట్రంప్ ప్రభుత్వంతో ఒప్పందానికి ముందుకొ చ్చాయి.
తమ విశ్వవిద్యాలయాల అనుబంధ కళాశాలల్లోని స్థానిక పోలీసులను ఇమిగ్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సేవల కోసం వినియోగించుకునేందుకు ఈ మూడు ప్రభుత్వ విశ్వవి ద్యాలయాలు అనుమతి ఇవ్వనున్నాయి. ఫ్లోరిడా రాష్ట్ర గవర్నర్ రోన్ డీశాంటిస్ సైతం తమ రాష్ట్రంలో అక్రమ వలసదారులపై ఉక్కుపా దం మోపేందుకు ట్రంప్ సర్కార్‌కు పూర్తి మద్దతు పలుకుతున్న నేపథ్యంలో ఫ్లోరిడాలో తాజాగా ఈ పరిణామం జరగడం ప్రాధాన్య త సంతరించుకుంది. స్థానిక, రాష్ట్ర పాలనా యంత్రాంగాలు కలిసికట్టుగా ఇమిగ్రేషన్ విభాగానికి పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు ఫిబ్రవరి 19వ తేదీనే సంబంధిత ఒప్పందాలపై సంతకాలు చేశారు.
పోలీసులకు తగు శిక్షణ
ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీలోని పోలీ స్ శాఖ(ఎఫ్‌ఏయూపీడీ) సిబ్బందికి ఇమిగ్రే షన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగ విధులను అప్ప గించనున్నారు. ఇమిగేషన్ సంబంధిత పత్రాల తనిఖీ, ఒకవేళ అక్రమ వలసదారు చిక్కితే నిర్బంధం, అరెస్ట్, అనుసరించాల్సిన విధానాలను ఈ సాధారణ పోలీసులుకు విడమర్చి చెప్పనున్నారు. ఇందుకోసం ఎఫ్‌ఏ యూపీడీ సిబ్బందికి ‘287(జీ) ప్రోగ్రామ్’ పేరిట తగు శిక్షణ ఇస్తారని ఫ్లోరిడా అట్లాంటిక్ వర్సిటీ అధికార ప్రతినిధి జాషువా గ్లేంజర్ చెప్పారు.
ఈ శిక్షణ బాధ్యతలను యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం తీసుకోనుంది. వర్సిటీ పోలీసులకు ఇలా ఇమిగ్రేషన్ అధికారాలు దఖలుపడే అవకాశం రావడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి. శిక్షణ పూర్తయ్యాక వర్సిటీ పోలీసు లు ఆయా విశ్వవిద్యాలయాల ప్రాంగణాలు, క్యాంపస్, కళాశాలల్లో అనుమానితులు, విద్యార్థులు, విదేశీయులను విచారిస్తారు. తనిఖీలు చేస్తారు. అవసరమైతే ఎలాంటి వారెంట్ లేకుండానే అరెస్ట్ చేస్తారు. అయితే వర్సిటీ పాలకమండళ్ల ఈ నిర్ణయాలను విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నాయి.
విద్యాలయాలను అక్రమచొరబాట్ల తనిఖీ కేంద్రాలుగా మార్చొద్దని, నిర్ణయాలను వెంటనే వెనక్కితీసుకోవాలని డిమాండ్‌చేశాయి. ‘‘వర్సిటీల్లో ఉన్న వాళ్లు విద్యార్థు లా కాదా అంటూ పోలీసులు అణువణువునా గాలింపులు మొదలెడితే వర్సిటీల్లో ప్రశాంత వాతావరణం దెబ్బతింటుంది’’ అని జెనికా ఛార్లెస్ అన్నారు. ఛార్లెస్ హౌతీ నుంచి వలసవచ్చి ఫ్లోరిడా అట్లాంటిక్ వర్సిటీలో రాజనీతిశాస్త్రం చదువుతున్నారు. సురక్షిత, సమ్మిళిత విద్యకు పట్టుగొమ్మల్లాంటి వర్సిటీ ల్లో ఇమిగ్రేషన్ తనిఖీలు, సోదాలను నిరోధించాలని ‘ప్రెసిడెంట్స్ అలయన్స్ ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ ఇమిగ్రేషన్’ సంస్థ సీఈఓ మిరియం ఫెడ్‌బ్లమ్ ఆందోళన వ్యక్తంచేశారు. ఈ సంస్థ విదేశీ విద్యార్థుల సమస్యలపై పోరాడుతోంది.