Immigration officials
-
హెచ్1బీ వీసా ఫీజుల బాదుడు !
వాషింగ్టన్: హెచ్–1బీ వీసా దరఖాస్తు సహా అన్ని ఇమిగ్రేషన్ ఫీజుల మోత మోగించేందుకు అమెరికా సిద్ధమైంది. సంబంధిత ప్రతిపాదనలను అమెరికా ఇమిగ్రేషన్ విభాగం ప్రచురించింది. 460 డాలర్లుగా ఉన్న హెచ్–1బీ వీసా దరఖాస్తు ధరను ఏకంగా 780 డాలర్లకు పెంచాలని ప్రతిపాదించారు. వలసేతర వీసాల్లో భారతీయులు అధికంగా పొందే హెచ్–1బీ వీసా దరఖాస్తు ధరను భారీగా పెంచడంపై విమర్శలొస్తున్నాయి. మిగతా ఫీజులూ దాదాపు ఇలాగే భారీగా ఉన్నాయి. ఓ–1 దరఖాస్తు ధర 460 డాలర్ల నుంచి 1,055 డాలర్లకు పెంచనున్నారు. అంటే ఒక్కసారిగా 229 శాతం పెంపు అన్నమాట. ఎల్–1 ధరను 460 డాలర్ల నుంచి ఏకంగా 1,385 డాలర్లకు పెంచేయనున్నారు. అంటే ఏకంగా 332 శాతం పెరుగుదల. హెచ్–2బీ దరఖాస్తుల ధర 460 డాలర్ల నుంచి ఒకేసారి 1,080 డాలర్లకు చేరుకోనుంది. అయితే, ఇవి ప్రతిపాదనలు మాత్రమేనని మార్చి ఏడో తేదీలోపు వచ్చే ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ధరలు మారుస్తామని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం వివరణ ఇచ్చింది. ఒకవేళ ఈ ఫీజులు అమలైతే అదనంగా తీసుకునే బయోమెట్రిక్ సేవల ఫీజును రద్దుచేస్తామని ప్రతిపాదించింది. 2016 ఏడాది నుంచి ఇప్పటివరకు ఫీజులు పెంచలేదని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం వాదిస్తోంది. వీసా ఎదురుచూపులు తగ్గించేందుకు కృషి భారత్‌లో వీసా దరఖాస్తు దారులు ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా చేస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ చెప్పారు. సుదీర్ఘకాలం వీసా కోసం ఎదురుచూస్తున్న వారి ఆందోళనను తాము అర్థం చేసుకుంటామన్నారు. వీసా దరఖాస్తుల పరిశీలనను చకచకా పూర్తి చేసేందుకుగాను విదేశాంగ శాఖ సిబ్బంది పెంచామన్నారు. -
బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో ఆకార్ పటేల్ అడ్డగింత
బెంగళూరు: ప్రముఖ పాత్రికేయుడు, చరిత్రకారుడు, ఆమ్మెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా మాజీ అధ్యక్షుడు ఆకార్ పటేల్‌కు బుధవారం బెంగళూరు విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. అమెరికా పయనమైన ఆయనను ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. విదేశాలకు వెళుతున్న తనను అడ్డుకోవడంపై ట్విటర్లో ఆకార్ పటేల్ స్పందించారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియాపై మోదీ ప్రభుత్వం దాఖలు చేసిన కేసు కారణంగా తాను లుక్ అవుట్ సర్క్యులర్‌లో ఉన్నట్టు సీబీఐ అధికారి ఫోన్ చేసి చెప్పారని వెల్లడించారు. అమెరికా పర్యటన కోసం గుజరాత్ కోర్టు నుంచి అనుమతి పొందానని, కోర్టు ఆర్డర్‌తో తన పాస్‌పోర్ట్‌ను కూడా తిరిగి తీసుకున్నానని తెలిపారు. అయితే ఆకార్ పటేల్‌పై లుక్అవుట్ నోటీసు ఉందని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. రూ. 36 కోట్ల విదేశీ నిధులకు సంబంధించి.. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎఫ్సీఆర్ఏ) నిబంధనలు ఉల్లంఘించారన్న నేపథ్యంలో ఆమ్మెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా, ఇతరులపై గతంలో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే లుక్అవుట్ నోటీసు జారీ అయింది. అయితే గతేడాది గుజరాత్ పోలీసులు నమోదు చేసిన కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆకార్ పటేల్.. అమెరికా వెళ్లేందుకు సూరత్ కోర్టు అనుమతి ఇచ్చిందని స్పష్టం చేశాయి. తాజా పరిణామాల నేపథ్యంలో తనపై జారీ చేసిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఢిల్లీలోని సీబీఐ కోర్టును ఆకార్ పటేల్ ఆశ్రయించారు. దీనిపై స్పందన తెలియజేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. ఆకార్ పటేల్ పిటిషన్‌పై గురువారం ఉదయం విచారణ జరిగే అవకాశముంది. -
డబుల్ వీసాలు.. ఏజెంట్ల మోసాలు
44 women Flying To Kuwait Were Caught At RGI : ఏజెంట్లు తప్పుదారి పట్టించడంతో రెండు వీసాలతో కువైట్ వెళ్లేందుకు ప్రయత్నించిన 44 మంది మహిళలు శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడ్డారు. వారిని ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గోవా రాష్ట్రాలకు చెందిన 44 మంది మహిళలు మంగళవారం తెల్లవారుజామున కువైట్ వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. ఇమిగ్రేషన్ అధికారుల తనిఖీల్లో మహిళలు ముందుగా విజిట్ వీసాలు చూపించారు. కువైట్‌కు ఎందుకు వెళ్తున్నారని అధికారులు ప్రశ్నించ గా కొందరు ఉపాధి నిమిత్తం వెళ్తున్నట్టు చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు వారి వద్ద ఉన్న అన్ని పత్రాలను పరిశీలించారు. మహిళలందరి వద్ద విజిట్ వీసాలతో పాటు వర్క్ వీసాలు కూడా లభ్యమయ్యాయి. ఏజెంట్ల సాయంతో బయల్దేరి న మహిళలకు రెండు వీసాలతో వెళ్లడం నేర మని కూడా తెలియదు. ఉపాధి దొరుకుతుందన్న ఆశతో ఏజెంట్లు సమకూర్చిన రెండు వీసాలతో కువైట్‌కు బయల్దేరారు. వారంతా ఉపాధి నిమిత్తం వెళ్తున్న వారిగా నిర్ధారించుకున్న అధికారులు ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించగా దర్యాప్తు ప్రారంభించారు. వారికి తెలియకుండా.. మూడు రాష్ట్రాలకు చెందిన మహిళలందరు కూడా ఒకే విమానంలో కువైట్‌కు వెళ్లేందుకు వచ్చారు. వీరంతా ఆయా ప్రాంతాల సబ్‌ఏజెంట్లతో పాటు ప్రధాన ఏజెంట్లకు అనుసం ధానంగా వీసాలు పొందినట్లు పోలీసుల ద ర్యాప్తులో తేలింది. ప్రధాన ఏజెంట్ ముంబై కి చెందినట్టు గుర్తించారని సమాచారం. గతంలో కూడా సదరు ఏజెంట్ ద్వారా వెళ్లిన మహిళలు ఇదే తరహా మోసానికి గురయ్యా రు. ఒక్కొక్కరు సుమారు రెండు నుంచి రూ.3 లక్షల వరకు చెల్లించినట్లు సమాచారం. వీసాల్లో ఉన్న పొరపాట్లను మహిళలకు తెలియకుండానే ఏజెంట్లు ఈ వ్యవహారాన్ని నడిపించినట్లు పోలీసులు భావిస్తున్నారు. విజిట్ వీసాను ఇక్కడ బయలుదేరే సమ యంలో చూపించాలని, వర్క్ వీసాలను కు వైట్‌లో చూపించాలని మహిళలకు ఏజెంట్లు చెప్పినట్లు సమాచారం. మహిళల్లో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల వారున్నారు. రెండు వీసాలు ఎందుకు..? పదో తరగతి కన్నా తక్కువ విద్యార్హత కలిగిన వారు కొన్ని దేశాల్లో ఉపాధి నిమిత్తం వెళ్లడానికి ఇమిగ్రేషన్ చట్టం 1983 ప్రకారం ఈసీఆర్ (ఇమిగ్రేషన్ చెకింగ్ రిక్వైర్డ్)లో భాగంగా ప్రొటెక్షన్ ఆఫ్ ఇమిగ్రేషన్ పత్రాన్ని కలిగి ఉండాలి. ఈ ప్రక్రియను పూర్తి చేయకుండానే కార్మికులను పెద్ద ఎత్తున ఏజెంట్లు తరలిస్తుంటారు. అక్కడికి వెళ్లిన తర్వాత వర్కింగ్ వీసాలను వాడుకునేందుకు వాటిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఏజెంట్లపై కేసు ఉపాధి నిమిత్తం వెళ్తున్న మహిళలకు ఏజెంట్లు విజిట్ వీసాలు జారీ చేశారు. వర్కింగ్ వీసాలకు ఈసీ ఆర్ లేకుండా వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే వారికి విజిట్ వీసాలతో పాటు వర్కింగ్ వీసాలు అందజేశారు. ఏజెంట్లపైనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. మహిళలను బాధితులుగానే పరిగణిస్తున్నాం. – విజయ్‌కుమార్, సీఐ, ఆర్జీఐఏ అయోమయంగా ఉంది.. మాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఉపా ధి నిమిత్తం కువైట్ వెళ్లడానికి వచ్చాం.. మా వద్ద రెండు వీసాలున్నాయని అధికారులు నిలిపివేసి పోలీస్‌స్టేషన్‌కు పంపారు. గతంలో లాక్డౌన్లో కూడా వీసాలు రద్దయ్యాయి. ఇప్పుడేమో ఇలా.. అంతా అయోమయంగా ఉంది. – బాధిత మహిళ -
విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని.. 3 గంటల ప్రయాణం
విమాన ప్రయానం అంటే ప్రయాణికులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎయిర్‌పోర్టు సిబ్బంది కూడా విమానం టేకాఫ్ నుంచి ల్యాండింగ్ వరకు క్షుణంగా పరిశీలిస్తారు. అయితే తాజాగా ఓ వ్యక్తి విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఏకంగా మూడు గంటల ప్రయాణం చేశాడు. విమానం మరో ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కాగా ఆ వ్యక్తిని ఎయిర్‌పోర్టు అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. చదవండి: Thailand Monkey Festival: ఆ దేశంలో అట్టహాసంగా కోతుల పండగ! అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం ల్యాండింగ్ గేర్‌లో సదరు వ్యక్తి దాక్కున్నాడు. విమానం గాటిమాలా నుంచి మియామి ఎయిర్‌పోర్టుకు వెళ్లింది. అక్కడ విమానం ల్యాండైన అనంతరం అతన్ని ఎయిర్‌పోర్టు అధికారులు పట్టుకొని ఇమిగ్రేషన్ అధికారులకు అప్పగించారు. మూడు గంటలపాటు విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ప్రయాణించినా.. ఈ వ్యక్తికి ఎటువంటి గాయాలూ కాలేదని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. This man arrived to MIA in the landing gear of plane from a Guatemala flight. The flight was about two hours and thirty minutes and witness says he was unharmed😳✈️| #ONLYinDADE pic.twitter.com/qMPP5jjDvb — ONLY in DADE (@ONLYinDADE) November 27, 2021 -
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సుజనా అడ్డగింత
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ మాజీ నేత (ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు), రాజ్యసభ సభ్యుడు యలమంచిలి సత్యనారాయణ చౌదరిని (సుజనా చౌదరి) ఢిల్లీలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. గురువారం ఆయన అమెరికా వెళ్తుండగా... ఆయనపై ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయి ఉన్న కారణంగా అధికారులు నిలిపేసి... దేశం దాటి వెళ్లకూడదంటూ వెనక్కి పంపేశారు. నిజానికి బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజినీరింగ్ సంస్థకు సంబంధించి జరిగిన ఫ్రాడ్ వ్యవహారంలో 2016 ఏప్రిల్ 27న సుజనా చౌదరిపై ఈడీ కేసు నమోదు చేసింది. ఆ తరవాత విచారణ జరుగుతూ వస్తోంది. ఇందులో భాగంగా ఆయన దేశం దాటి వెళ్లిపోకుండా గత ఏడాది జూన్ 18న సీబీఐ లుక్ ఔట్ నోటీసులు జారీ చేసింది. రకరకాల డొల్ల కంపెనీలను పెట్టి, లేని టర్నోవర్‌ను చూపించి... వాటి ఆధారంగా బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని, దాదాపు 10వేల కోట్లు ఎగ్గొట్టిన వ్యవహారంలోనూ సుజనా నిందితుడు. తమకు అప్పు ఎగవేశారంటూ గతంలో మారిషస్ బ్యాంకు ఏకంగా ఇండియాకు వచ్చి మరీ ఇక్కడ కేసు దాఖలు చేసింది. కోర్టులో పిటిషన్; అనుమతి మంజూరు ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్న నేపథ్యంలో తనను అమెరికా వెళ్లేందుకు అనుమతించాలంటూ హైకోర్టును ఆశ్రయించిన సుజనా చౌదరికి అక్కడ ఊరట లభించింది. అమెరికా వెళ్లేందుకు అనుమతిస్తూనే... భారత్‌కు తిరిగి వచ్చే తేదీని సీబీఐకి ఇవ్వాలని, భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత సీబీఐకి సమాచారం అందించాలని షరతు విధించింది. న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ శుక్రవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికాలోని సుజనాచౌదరి బంధువు తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని, ఆయన్ను చూసేందుకు వెళుతున్నారు కనుక అనుమతించాలంటూ సుజనా తరఫున సీనియర్ న్యాయవాది మాథూర్ హౌస్ మోషన్ దాఖలు చేసి వాదనలు వినిపించారు. గతేడాది జూన్ 18న సీబీఐ లుక్ఔట్ నోటీసులు జారీచేసిందని, దీని గడువు ఏడాది మాత్రమేనని మాథూర్ తెలిపారు. అయితే దీని గడువును మరో ఏడాది పొడిగించామని సీబీఐ స్పెషల్ పీపీ సురేందర్ చెప్పారు. ఇరువర్గాల వాదనలు విన్నాక న్యాయమూర్తి అనుమతి మంజూరు చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేశారు. -
యూఎస్ నుంచి 161 మంది వెనక్కు
వాషింగ్టన్: అమెరికాలోకి మెక్సికో సరిహద్దు ద్వారా అక్రమంగా చొరబడిన 161 మంది భారతీయులను ఆ దేశం ఈ వారం వెనక్కు పంపనుంది. అమెరికాలో ఉండేందుకు వారికి ఉన్న న్యాయపరమైన అవకాశాలు అన్నీ ముగిశాయని తెలిపింది. ప్రత్యేక విమానంలో వారిని పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు పంపించనున్నారు. ఆ 161 మందిలో హరియాణాకు చెందిన వారు 76 మంది, పంజాబ్‌కు చెందినవారు 56 మంది, గుజరాత్‌కు చెందిన వారు 12 మంది, యూపీవారు ఐదుగురు, మహారాష్ట్రవారు నలుగురు, కేరళ, తెలంగాణ, తమిళనాడు వారు ఇద్దరు చొప్పున, ఆంధ్రప్రదేశ్, గోవాలకు చెందినవారు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. అమెరికాలోని 95 జైళ్లలో ఉన్న 1739 మంది భారతీయుల్లో వీరు కూడా భాగమేనని నార్త్ అమెరికన్ పంజాబీ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్నామ్ సింగ్ చాహల్ వెల్లడించారు. అక్రమంగా ప్రవేశించిన వీరందరిని ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ఐసీఈ) అధికారులు అరెస్ట్ చేశారు. స్వదేశంలో వివక్షను, హింసను ఎదుర్కొంటున్నామని, అమెరికాలో తమకు ఆశ్రయం కల్పించాలని వీరిలో అత్యధికులు కోర్టును వేడుకుంటున్నా.. వారి వాదనను అమెరికాలోని కోర్టులు విశ్వసించడం లేదని చాహల్ తెలిపారు. ఉత్తర భారతదేశంలో, ముఖ్యంగా పంజాబ్‌లో మనుషుల అక్రమ రవాణాదారులున్నారని, వారికి అధికారులు కూడా సహకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. వారు యువకుల నుంచి రూ. 35 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు వసూలు చేసి, అమెరికాలోకి అక్రమంగా పంపిస్తున్నారన్నారు. 2019లో 1616 మంది భారతీయులను అమెరికా భారత్‌కు పంపించింది. -
వీసా బ్యాన్పై కసరత్తు!
వాషింగ్టన్: హెచ్1బీ సహా పలు రకాల వర్క్ వీసాల జారీపై తాత్కాలిక నిషేధం విధించే దిశగా అమెరికా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. వర్క్ ఆథరైజేషన్‌తో కూడిన స్టుడెంట్ వీసాలపై నిషేధం విధించాలని భావిస్తోంది. కరోనా కారణంగా అమెరికా ఉద్యోగరంగంలో నెలకొన్న సంక్షోభంతో వర్క్ వీసాల జారీపై తాత్కాలికంగా నిషేధం విధించాలని ట్రంప్ సర్కారు యోచిస్తోంది. సాంకేతిక, ఇతర నైపుణ్యాలున్న విదేశీయులకు అమెరికాలోని కంపెనీల్లో ఉద్యోగావకాశం కల్పించేదే హెచ్1బీ వీసా. ఈ వీసాకు భారత్, చైనాలో భారీ డిమాండ్ ఉంది. ఈ వీసాపై ప్రస్తుతం దాదాపు 5 లక్షల మంది విదేశీయులు అమెరికాలో ఉన్నారు. ‘వర్క్ వీసాల నిషేధానికి సంబంధించి ఈ నెలలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడవచ్చు. ఈ దిశగా ఇమిగ్రేషన్ సలహాదారులు ప్రణాళికలను రూపొందిస్తున్నారు’అని శుక్రవారం వాల్‌స్ట్రీట్ జర్నల్ ఒక కథనంలో పేర్కొంది. కరోనా మహమ్మారిపై ముందుండి పోరాడే వైద్య నిపుణుల కొరత తీర్చుకునేందుకు అందుబాటులో ఉన్న 40 వేల గ్రీన్‌కార్డులను విదేశీ వైద్యులు, నర్సులకు జారీ చేయాలని కోరుతూ అమెరికా కాంగ్రెస్‌లో బిల్లును ప్రవేశపెట్టారు. గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ ఆమోదం పొంది, జారీ చేయని గ్రీన్ కార్డ్‌లను ఇప్పుడు వైద్యులు, నర్సులకు జారీ చేయాలని కోరుతూ పలువురు సభ్యులు కాంగ్రెస్‌లో ప్రతిపాదన చేశారు. -
లాక్డౌన్ నిబంధనలు వారి ఆశలను చిదిమేసింది
ఢిల్లీ : తాము కష్టపడైనా సరే కొడుకును ఉన్నత స్థానంలో ఉంచాలని భావించారు ఆ తల్లిదండ్రులు. అందుకు తగ్గట్టుగానే కొడుకు ఎదికి విదేశాల్లో ఉద్యోగం చేస్తూ ఉన్నత స్థాయికి ఎదిగాడు. అయితే అతను ఎదుగుతున్న తీరును చూసి విధికి కన్ను కుట్టిందేమో.. చిన్న వయసులోనే మృత్యువాతపడ్డాడు. గుండెలవిసేలా రోధిస్తున్న తల్లిదండ్రులు తమ కొడుకు మృతదేహాన్ని కడసారి చూసుకుందామనుకున్నారు. కానీ అధికారుల నిబంధనలు వారి పాలిట శాపమయింది. చివరకు కొడుకు మృతదేహాన్ని చూడాలనుకునే లోపే అధికారులు రూల్స్ పేరుతో మృతదేహాన్ని తిరిగి పంపించేశారు. ఈ హృదయవిధారక ఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది. (వైరల్‌గా మారుతున్న కరోనా పాటలు) వివరాలు.. ఉత్తరాఖండ్‌లోని గర్హ్వాల్ జిల్లాకు చెందిన 23 ఏళ్ల కమలేష్ భట్ అబుదాబిలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే వారం క్రితం గుండెపోటు రావడంతో కమలేష్ అక్కడే మృతి చెందాడు. దీంతో అక్కడి అధికారులు కమలేష్ బంధువులకు సమాచారం అందించి మృతదేహాన్ని ఇండియాకు పంపిస్తున్నట్లు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కమలేష్ బందువులు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లారు. అయితే యూఏఈ నుంచి వచ్చిన కమలేష్ మృతదేహానికి అక్కడి భారతీయ ఎంబసీ కార్యాలయం నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని ఇమ్మిగ్రేషన్ అధికారులు పేర్కొన్నారు. దీంతో వారు కమలేష్ మృతదేహాన్ని అప్పగించేదుకు నిరాకరించారు. అధికారులు నిరాకరించిన కొద్ది గంటల్లోనే మృతదేహాన్ని తీసుకొచ్చిన విమానంలోనే తిరిగి యూఏఈకి తరలించారు. కరోనా నేపథ్యంలో మార్చి 25 నుంచి లాక్డౌన్ విధించడంతో పాటు అన్ని రకాల విమాన సేవలను రద్దు చేస్తు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు విదేశాల నుంచి ఎలాంటి విమానాలను అనుమతించొద్దని విదేశాల్లోని అన్ని భారత విదేశాంగ రాయభార కార్యాలయాలకు నివేదికను అందించంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని యూఏఈ నుంచి వచ్చిన విమానాన్ని తాము తిరిగి పంపించినట్లు ఇమ్మిగ్రేషన్ అధికారులు పేర్కొన్నారు. అయితే కమలేష్ సోదరుడు విమలేష్ భట్ మాట్లాడుతూ.. ఇరు దేశాల అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతోనే ఇలా జరిగిందని పేర్కొన్నారు. అయితే కమలేష్ మృతి పట్ల యూఏఈ ఉన్న ఇండియన్ ఎంబసీ కార్యాలయం కమలేష్ మృతిపై తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని తెలిపారు. ఏప్రిల్ 17న కమలేష్ పని చేస్తున్న కంపెనీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఫోన్ చేసి మాకు సమాచారం అందించిందన్నారు. కమలేష్ మృతదేహాన్ని తిరిగి వెనక్కి రప్పించాలంటే ఇండియన్ ఎంబసీ నుంచి ఎన్వోసీ తేవాలని ఇమ్మిగ్రేషన్ అధికారులు పేర్కొన్నట్లు విమలేష్ వెల్లడించారు. ఈ విషయం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దృష్టికి రావడంతో వారు స్పందిస్తూ.. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. -
హెచ్1బీ వీసా దరఖాస్తు రుసుం పెంపు
వాషింగ్టన్: ఎంపిక ప్రక్రియ సమీక్షలో భాగం గా అమెరికా హెచ్1బీ వీసా దరఖాస్తు రుసుంను రూ. 700 (10 డాలర్లు) పెంచుతున్నట్లు అమెరికా తాజాగా ప్రకటించింది. అమెరికాలో విదేశీ నిపుణులకు ఉద్యోగ అవకాశం కల్పించేందుకు ఈ వీసా ఉపయోగపడుతుంది. పెంపు ద్వారా వచ్చే నిధులను ఎంపిక ప్రక్రియను ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ చేసేందుకు వినియోగిస్తామంది. దీనివల్ల ఇమిగ్రేషన్ ప్రక్రియ వేగంగా పూర్తవుతుందని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ డైరెక్టర్ తెలిపారు. -
నాన్నను వదిలేయండి ప్లీజ్..!
మిస్సిస్సిపి : తల్లిదండ్రుల జాడకోసం ఓ పదకొండేళ్ల చిన్నారి పడుతున్న ఆవేదన మనసుల్ని కలచివేస్తోంది. సరైన ఇమ్మిగ్రేషన్ పత్రాలు లేకుండా నివసిస్తున్నారనే కారణంతో మిస్సిస్సిపిలోని ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్‌పై ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం దాడి చేశారు. అందులో పనిచేస్తున్న వందలాది మందిని అరెస్టు చేశారు. పాఠశాలకు వెళ్లిన తమ చిన్నారులు ఆందోళనకు గురవుతారని, వారిని కూడా తమతో తీసుకెళ్లండని మొరపెట్టుకున్నా వినలేదు. ఇక స్కూల్ నుంచి తిరిగొచ్చిన ఆయా కుటుంబాల చిన్నారులు తమవారి జాడలేక కన్నీరుమున్నీరయ్యారు. ఆ పిల్లలందరికీ ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ సమీపంలోని కమ్యూనిటీ జిమ్‌లో ఆశ్రయం కల్పించారు. అమ్మానాన్నల వద్దకు తీసుకెళ్లండని ఓ చిన్నారి అధికారుల్ని ప్రాధేయపడిన వీడియో వైరల్ అయింది. ‘నాపై కాస్త కనికరం చూపండి. మా తల్లిదండ్రుల్ని విడిచి పెట్టండి. లేదా నన్ను వారి వద్దకుచేర్చండి. మా నాన్న ఏ నేరం చేయలేదు. ఆయన నేరస్తుడేం కాదు’అని భోరుమంది. ఇక క్రిస్టియానా పెరాల్టా అనే మహిళ మాట్లాడుతూ.. ‘చిన్నారి తండ్రి అడవిలో నివసించే లాటినో జాతివారికి ట్రాన్స్‌లేటర్‌గా పనిచేస్తాడు. అతన్ని ఎందుకు అరెస్టు చేశారో తెలియదు. వారంతా ఎప్పుడు కలుసుకుంటారో’అని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, అరెస్టు చేసిన వారిలో 300 మందిని విడుదల చేయగా.. మరో 377 మంది విడుదల కావాల్సి ఉందని తెలిసింది. -
దుబాయ్‌లో శివాజీ అడ్డగింత
సాక్షి, హైదరాబాద్: టీవీ9 అధికార మార్పిడి కేసులో నిందితుడిగా ఉన్న సినీనటుడు, గరుడ పురాణం శివాజీ అమెరికా వెళ్లకుండా మరోసారి ఆటంకం ఎదురైంది. కనెక్టింగ్ ఫ్లైట్‌లో అమెరికా వెళ్తుండగా దుబాయ్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఈ నెల 26న (శుక్రవారం) జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుబాయ్‌లో అమెరికా విమానం ఎక్కుతుండగా అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు.. ఆయన్ను అడ్డుకుని మరో విమానంలో భారత్‌కు పంపించారు. అయితే ఇందుకు కారణాలేంటన్నది స్పష్టంగా తెలియరాలేదు. టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌తో పాటు శివాజీపై హైదరాబాద్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మొన్నటికి మొన్న హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లే ప్రయత్నంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అతన్ని ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకుని సైబరాబాద్ పోలీసులకు అప్పగించిన సంగతి తెలిసిందే. అప్పుడు విచారించిన పంపిన సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు.. పిలిచినప్పుడు విచారణకు హాజరు కావాలని శివాజీకి నోటీసులు ఇచ్చారు. ఆయనపై ఎలాంటి ఆంక్షలు లేవు దుబాయ్ విమానాశ్రయంలో శివాజీని అడ్డుకోవడంపై సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్పందించారు. శివాజీ విదేశాలకు వెళ్లే విషయంలో తామెలాంటి ఆంక్షలు విధించలేదని ఆయన స్పష్టంచేశారు. దుబాయ్‌లో ఇమిగ్రేషన్ అధికారులు అతన్ని ఎందుకు తనిఖీ చేశారు? ఏ కారణంతో వెనక్కి పంపారన్న సంగతి తమకు తెలియదన్నారు. ఈ విషయం ఒక్క శివాజీకి మాత్రమే తెలుసని.. ఆయన మాట్లాడితేనే విషయాలు బయటకొస్తాయని పోలీసులంటున్నారు. తెలంగాణలో నమోదైన కేసులు కాకుండా వీసా లేదా ఇతర వివాదాలేమైనా కారణాలు కావొచ్చని భావిస్తున్నారు. -
దుబాయ్‌లో నటుడు శివాజీకి చేదు అనుభవం
సాక్షి, హైదరాబాద్ : అలంద మీడియా కేసులో నిందితుడిగా ఉన్న సినీ నటుడు, గరుడ పురాణం శొంఠినేని శివాజీకి దుబాయ్ విమానాశ్రయంలో మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుబాయ్ మీదగా అమెరికా వెళుతున్న అతడిని ఈ నెల 26న దుబాయ్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. శివాజీపై క్రిమినల్ కేసులు ఉన్నాయంటూ తిరిగి అతడిని హైదరాబాద్ పంపించివేశారు. టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌తో పాటు శివాజీపై హైదరాబాద్ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. గతంలో కూడా హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లే ప్రయత్నంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుబడ్డారు. ఆ తర్వాత సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అతడికి విచారణకు హాజరు కావాలని నోటీసులు కూడా ఇచ్చారు. కాగా విదేశాలకు వెళ్లేందుకు శివాజీపై ఎలాంటి ఆంక్షలు లేవని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. దుబాయ్ పోలీసులు ఎందుకు ఆపారో తెలియదని అన్నారు. -
అప్పనంగా కిడ్నీలు కొట్టేస్తున్నారు
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా కిడ్నీ దాతలు కావాలంటూ సామాజిక మాధ్యమాల్లో(ఎస్‌ఓఎస్‌ఐఎంఎస్.కామ్ వంటి సైట్ల ద్వారా) చేసిన పోస్టుకు స్పందించిన దాతలకు కుదుర్చుకున్న డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్న ముగ్గురు సభ్యుల అంతర్జాతీయ ముఠాను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. గతంలో ముంబై, ఢిల్లీలో పట్టుకునేందుకు వెళ్లిన సమయంలో ప్రధాన నిందితుడు, భోపాల్ వాసి అమ్రిష్ ప్రతాప్ తప్పించుకుపోవడంతో లుక్అవుట్ నోటీసు జారీ చేయడంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఢిల్లీ విమానాశ్రయంలో పట్టుకొని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఆదివారం అప్పగించారు. అతడికి సహకరించిన ఢిల్లీవాసి రింకీ, నోయిడా వాసి సందీప్ కుమార్‌లను కూడా ట్రాన్సిట్ వారంట్‌పై సిటీకి తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా దాదాపు 40 వరకు బలవంతపు కిడ్నీల మార్పిడిలు చేసినట్టుగా అనుమానిస్తున్న ఈ ముఠా వివరాలను నాగోల్‌లోని రాచకొండ పోలీసు కమిçషనర్ క్యాంపు కార్యాలయంలో సీపీ మహేష్ భగవత్ సోమవారం మీడియాకు తెలిపారు. భారత్‌లో కిడ్నీ అవసరముందంటూ ఫేస్బుక్లో పోస్టును చూసిన నగరవాసి స్పందించి రూ.20లక్షలకు ఇచ్చేందుకు అంగీకరించాడు. ఈ ముఠా అతడిని ఈజిప్టు తీసుకెళ్లి బలవంతంగా కిడ్నీ మార్పిడి చేసి డబ్బులు ఇవ్వలేదు. ఇలా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. భార్య బాగు కోసం మోసాలబాట... ప్రస్తుతం ఢిల్లీలో స్థిరపడిన భోపాల్‌కు చెందిన అమ్రిష్ ప్రతాప్ అలియాస్ అంబారిష్ చిన్నతనంలోనే అమ్మనాన్నలను కోల్పోవడంతో తాత, నాన్నమ్మల వద్ద పెరిగాడు. 2006లో హిమాంగి అనే ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమెకు నాడీ సంబంధిత సమస్యలు రావడంతో ముంబై, న్యూఢిల్లీ నగరాల్లో చికిత్సకోసం దాదాపు రూ.40 నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చు చేశాడు. అయినా ఆమె ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఆర్థిక సమస్యల్లో పడ్డాడు. వీటని అధిగమించేందుకు తొలుత బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాల్లో పనిచేసిన అమ్రిష్ ప్రతాప్ మెడికల్ టూరిజమ్‌కు మారాడు. తొలుత చట్టవ్యతిరేకంగా అద్దెకు తల్లులు(సరోగసీ విధానం) నుంచి మొదలెట్టి ఆ తరవాత మానవ అవయవాల మార్పిడి వ్యాపారంవైపు మళ్లాడు. ఇలా డాక్టర్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, ప్రభుత్వ అధికారులు, ఏజెంట్లు, బ్రోకర్లతో కుమ్మక్కై ఈ మోసపు దందాకు తెరలేపాడు. డబ్బు అవసరమున్న వారిని గుర్తించి వారి అవయవాలు మార్పిడి చేసి డబ్బు ఇవ్వకుండా మోసం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఢిల్లీ వాసి రింకి, నోయిడా వాసి సందీప్ కుమార్‌తో పరిచయం ఏర్పడింది. టర్కీలో కిడ్నీ ఇచ్చేందుకు వచ్చిన సమయంలో సందీప్ కుమార్ ఈ మోసం గురించి తెలుసుకొని తానుకూడా అమ్రిష్ ప్రతాప్‌తో చేయికలిపి డబ్బు అవసరమున్న వారిని గుర్తించి ఇతడి చేతిలో పెట్టాడు. ఒక్కో కిడ్నీ మార్పిడికి రూ.50 లక్షల నుంచి కోటి వరకు రోగుల నుంచి ఈ ముఠా తీసుకునేది.ఇలా ఈ ముఠా రోగులు, దాతలను శ్రీలంకలో కొలంబోలొరి వెస్టర్న్ ఆస్పత్రి, ఈజిప్ట్ కైరోలోని అల్ ఫహద్ హాస్పిటల్, టర్కీ ఇజ్మిర్‌లోని కెంట్ ఆస్పతుల్లో 40 వరకు కిడ్నీ మార్పిడీలు చేశారు. డబ్బులివ్వకపోవడంతో వెలుగులోకి మోసం.. సందీప్ కుమార్ ఫేస్బుక్ ఖాతా రోహన్ మాలిక్ పేరుతో సృష్టించి భారత్‌లో కిడ్నీ అవసరముందంటూ చేసిన పోస్టు చూసిన రాచకొండ కమిషనరేట్ ప్రాంతానికి చెందిన ఓ బాధితుడు వారిని సంప్రదించారు. అనంతరం ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన ముఠాసభ్యుడొకరు వాట్సాప్‌లో బాధితుడితో సంప్రదింపులు జరిపాడు. రూ.20లక్షలు ఇస్తామంటూ ఆశ చూపాడు. ఢిల్లీకి రావాలంటూ ముఠా సభ్యులు అతనికి రైలు టికెట్ బుక్ చేశారు. గత జులై 20న అక్కడికి వెళ్లిన బాధితుడిని నోయిడాలోని ఓ హోటల్లో ఉంచారు. ఢిల్లీ మరికొన్నిచోట్ల వైద్య పరీక్షలు జరిపించారు. బాధితుడు రోగి బంధువుగా ధ్రువీకరణపత్రం సృష్టించారు. అనంతరం వైద్య వీసాపై అతణ్ని ఆగస్టులో టర్కీకి తీసుకెళ్లారు. అయితే శస్త్రచికిత్సకు ముందు డబ్బు ఇవ్వాలని బాధితుడు పట్టుబట్టడంతో అతని పాస్‌పోర్టు లాక్కొని బెదిరింపులకు దిగారు. అతడు భయపడటంతో శస్త్రచికిత్స చేయించి కిడ్నీ తీసేశారు. ఆ ముఠా బారి నుంచి బయటపడి హైదరాబాద్‌కు చేరుకున్న బాధితుడు ఈ ఏడాది ఫిబ్రవరి ఐదున రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు ఇది అంతర్జాతీయ ముఠా పనిగా గుర్తించారు. అమ్రిష్ ప్రతాప్‌ను పట్టుకోవడానికి ఢిల్లీ, ముంబైకి వెళ్లగా తప్పించుకొనిపోయాడు. అయితే లుక్ అవుట్ నోటీసు జారీతో ఢిల్లీ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు సింగపూర్ నుంచి వచ్చిన అమ్రిష్ ప్రతాప్‌ను పట్టుకొని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారమిచ్చారు. అతడిచ్చిన సమాచారంతో వారిని ట్రాన్సిట్ వారంట్‌పై సిటీకి తీసుకొచ్చారు. వీరిని పోలీసు కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని వివరాలు తెలుస్తాయని సీపీ మహేష్ భగవత్ అన్నారు.అమ్రిష్ ప్రతాప్‌పై 2016లో నల్గొండలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మాయిగూడెం పోలీసు స్టేషన్లలో రెండు కేసులు నమోదై ఉన్నాయన్నారు. దుబాయ్, వియత్నాం, చైనా, సింగపూర్, ఫిలిప్పీన్స్, బ్యాంకాక్, ఇండోనేసియా, మెక్సికోకు కూడా వెళ్లొచ్చని, అక్కడ కూడా కిడ్నీ మార్పిళ్లు ఏమైనా చేశాడా అనే విషయాలు కస్టడీలోకి తీసుకొని విచారిస్తే తెలుస్తాయని సీపీ అన్నారు. -
ఇస్త్రీ చేసేయ్.. వీసా మార్చేయ్!
ఉద్యోగ వీసాను కంప్యూటర్లో ఫొటోషాప్ ద్వారా సందర్శక వీసాగా మార్చి ఇమిగ్రేషన్ అధికారులను బోల్తా కొట్టించి కువైట్‌కు పలువురిని అక్రమంగా తరలిస్తున్న 15 మంది ఏజెంట్లు, వారికి సహకరించిన ఇద్దరు ఎయిర్‌లైన్స్ సిబ్బంది, ఒక పోలీసు కానిస్టేబుల్‌ను సైబరాబాద్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఏజెంట్లు ఢిల్లీ, ముంబై రాయబార కార్యాలయం ద్వారా లైసెన్స్ ఏజెంట్ స్టాంపింగ్ చేసిన పాస్‌పోర్టు తమను ఆశ్రయించిన వారి చేతికి అందిన వెంటనే .. వేడిచేసిన ఇస్త్రీపెట్టెను వినియోగించి పాస్‌పోర్టుకు అంటించి అది చిరగకుండా వీసా స్టిక్కర్‌ను తొలగించి ..ఇంక్ రిమూవర్‌తో మిగిలిన స్టాంప్‌ను తుడిచేసి ఈ అక్రమ రవాణా సాగిస్తున్నారని పోలీసులు గుర్తించారు.ఎంప్లాయిమెంట్ వీసా మీద వెళ్లాలంటే ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రాంట్స్ నిబంధనల ప్రకారం కువైట్‌లో ఉద్యోగం ఇచ్చే యజమాని ప్రవాసీ భారతి బీమా యోజన కింద రూ.1,50,000 వరకు ఉద్యోగిపై ఇన్సూరెన్స్ కట్టినట్లు రుజువు చూపాలి.ఉద్యోగ ఒప్పంద పత్రం తనిఖీ చేస్తారు. వీటినుంచి తప్పించుకునేందుకు ఏజెంట్లు ‘ఇస్త్రీపెట్టె’మార్గాన్ని ఎంచుకున్నారని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీపీ వీసీ సజ్జనార్ బుధవారం మీడియాకు తెలిపారు. నిందితుల నుంచి 250 పాస్‌పోర్టులు, నకిలీ వీసాలు, రబ్బర్ స్టాంప్‌లు, 160 పోలీసు వెరిఫికేషన్ సర్టిఫికెట్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్లతో పాటు రూ.ఐదు లక్షలకుపైగా నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. ఒక్క మార్చి నెలలోనే నకిలీ వీసాలపై ఆర్జీఐ ఎయిర్‌పోర్టు పోలీసు స్టేషన్లో పది కేసులు నమోదైనట్లు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ టీమ్ గుర్తించినట్లు తెలిపారు. జనవరి నుంచి 14 కేసులు నమోదైతే 71 మందిని అరెస్టు చేశామన్నారు. – సాక్షి, హైదరాబాద్ మెడికల్ ఫిట్ ఉంటే హైదరాబాద్ నుంచే... హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్ విజయనగర్ కాలనీలో ఉంటున్న నెల్లూరు జిల్లా కలువాయిమండలం వెంకటరెడ్డి పాలెం గ్రామానికి చెందిన తోట కంఠేశ్వర్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల ముఠా కడప, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని అమాయకుల అవసరాలను ఆసరాగా చేసుకొని కువైట్‌లో ఉద్యోగాలంటూ ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు వసూలు చేస్తున్నారు. వీరికి విదేశాలకు పంపించే అనుమతి లేకపోవటంతో ముంబై, బెంగళూరు, శ్రీలంకలోని లీగల్ ఏజెంట్లను కలసి ఎంప్లాయిమెంట్ వీసాలు తెప్పిస్తున్నారు. పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్ కోసం మీ సేవలో రూ.135లు ఫీజు చెల్లించి చేవెళ్ల చిరునామాలు ఇస్తుండటంతో అక్కడి పోలీసు కానిస్టేబుల్ జి.మధు రూ.2,500లు తీసుకొని క్లియరెన్స్ ఇచ్చేవాడు.ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రాంట్స్ నిబంధనల ప్రకారం ఎస్ఎస్సీ చదువుకోని వారు ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ (ఈసీఆర్) క్లియరెన్స్‌ను తప్పించుకునేందుకు ఎంప్లాయిమెంట్ వీసా స్థానంలో నకిలీ విజిట్ వీసాను కంప్యూటర్లో ఫొటోషాప్ ద్వారా మారుస్తున్నారు. ఆ తర్వాత ఢిల్లీ, ముంబై రాయబార కార్యాలయాల ద్వారా లైసెన్స్ ఏజెంట్ స్టాంపింగ్ చేసిన పాస్‌పోర్టు తీసుకొని ఏజెంట్లు ‘ఇస్త్రీపెట్టె’వినియోగించి నకిలీ విజిట్ వీసాను సిద్ధం చేసేవారు. నెలరోజుల విజిట్ వీసాతో పాటు నకిలీ తిరుగు ప్రయాణ టికెట్లను గల్ఫ్ ఎయిర్‌లైన్స్ ఉద్యోగి మహమ్మద్ ముజీబ్ ఖాన్, ఒమన్ ఎయిర్ ఉద్యోగి అనప్ప రెడ్డి రామలింగారెడ్డి సమకూర్చి సహకరిస్తున్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కేరళ, మహారాష్ట్రలకు చెందిన పలువురిని కువైట్‌కు పంపించినట్టు తేలింది. ఈ ముఠా సభ్యులైన తోట కంఠేశ్వర్, సురేందర్, నర్సింహ, అనిల్ కుమార్, యుగంధర్, వినయ్ కుమార్, వెంకటసుబ్బారాయుడులను పోలీసులు అరెస్టు చేశారు.చేవెళ్ల పోలీసు కానిస్టేబుల్ మధును కూడా అరెస్టు చేశారు. ఇతర పోలీసుల పాత్రపైనా ఆరా తీస్తున్నామని సీపీ సజ్జనార్‌తెలిపారు. మెడికల్ అన్‌ఫిట్ అయితే శ్రీలంక నుంచి... హైదరాబాద్‌లోని ఆరు ఆస్పత్రుల్లో వైద్యపరీక్షలు చేయించే ఈ ముఠా ఫిట్ ఉంటే శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆశ్రితులను కువైట్‌కు పంపించేవారు.ఎవరైనా అన్‌ఫిట్ అని తేలితే ట్రాన్సిట్ పాస్‌పోర్టుపై ఏడు రోజుల వీసాతో శ్రీలంకకు పంపించే బాధ్యతను 8 మంది సభ్యులతో కూడిన పుష్ప అనే ఆమె నేతృత్వంలోని మరో ముఠా చూసుకునేది. ఈ ముఠాలో ఉన్న ఏపీకి చెందిన గెడ్డం శశి, చింతల సాయిరామ్‌కుమార్, షేక్ అక్రమ్, పిల్లి శ్రీకర్, అకరం బాలకృష్ణ, షేక్ ఖాదర్ బాషా, పూసపాటి రామకృష్ణ, విజయభాస్కర్ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులకు పట్టుబడ్డ నిందితులు ఇలా చేస్తే మేలు... విదేశాల్లో పనిచేసేందుకు వెళ్లేందుకు రిజిస్టర్డ్ ఏజెంట్ల కోసం ఇమిగ్రేట్.జీవోవీ.ఇన్‌లో తెలుసుకోవాలి. నాంపల్లిలోని ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ ఆఫీసులో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇందులో వివరాలు నమోదుచేసుకుంటే విదేశాలలో మెడికల్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది.అక్కడ పనిచేసే ప్రాంతంలో వేధింపులకు గురికాకుండా అక్కడి భారత ప్రభుత్వ రాయబార కార్యాలయం జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇప్పటికే ఎవరైనా ఏజెంట్లు మాయమాటలు చెప్పి పాస్‌పోర్టులు, డబ్బులు తీసుకుంటే వాటిని వెనక్కి తీసుకోవాలని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ సూచించారు. -
విద్యార్థుల కోసం తెలుగు సంఘాల కృషి
వాషింగ్టన్ : మిచిగాన్‌లోని ‘ఫర్మింగ్టన్’ ఫేక్ యూనివర్సిటీ వ్యవహారంలో బాధితులుగా మారిన భారత విద్యార్థులను బయటకు తెచ్చేందుకు భారత కాన్సులెట్ అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారని అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) వెల్లడించింది. అమెరికాలోని తెలుగు అసోషియేషన్ల సాయంతో విద్యార్థుల వివరాలును తీసుకుని అధికారులు వారిని కలిసారని పేర్కొంది. వారు ఇబ్బంది పడకుండా అందరిని ఒక దగ్గరికి చేరేలా చర్యలు తీసుకుందని తెలిపింది. గత శనివారం అమెరికాలోని పలు తెలుగు అసోసియేషన్లు భారత రాయబార కార్యాలయ అధికారి హర్షవర్దన్ ష్రింగ్లాను కలిసాయి. ఈ వివాదం నుంచి విద్యార్థులను రక్షించాలని కోరాయి. డిటెన్షన్‌కు గురైన విద్యార్థులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీల్లో అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశాయి. డిటెన్షన్‌కు గురైన 139 మంది భారత విద్యార్థుల్లో భారత ఎంబసీ అధికారులు ఇప్పటికే 90 మందిని కలిసారు. ఇందులో 60 మందిని డిటెన్షన్ సెంటర్ల నుంచి విడుదల కూడా చేయించారు. విద్యార్ధుల తరపున ఎంబసీ న్యాయ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. -
‘ఫర్మింగ్టన్’లో నమోదై ఉంటే.. వివరాలివ్వండి
చికాగో : మిచిగాన్‌లోని ‘ఫర్మింగ్టన్’ ఫేక్ యూనివర్సిటీ వ్యవహారంలో బాధితులుగా మారిన భారత విద్యార్థులను బయటకు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అమెరికన్ తెలుగు అసోషియేషన్ వెల్లడించింది. ఈ ఉదంతంలో అరెస్టయిన విద్యార్థుల వివరాల కోసం భారత ఎంబసీ అధికారులు వాషింగ్టన్ డీసీ, అట్లాంటాలోని ఆటా సాయం తీసుకున్నారని తెలిపారు. ఆటా నాయకుల సహకారంతో బాధిత విద్యార్థులు, వారి స్నేహితులు, ఫ్యామిలీ మెంబర్లను సంప్రదిస్తున్నారని.. అరెస్టయిన వారి వివరాలను తెలుసుకుంటున్నారని అన్నారు. ఒకవేళ విద్యార్థులు ఫర్మింగ్టన్ యూనివర్సిటీలో నమోదై ఉండి.. వారి ఆచూకీ తెలియక పోయినా లేదా ఫేక్ యూనివర్సిటీ వ్యవహారంలో వారు అరెస్టయ్యారా లేదా అనే విషయం వెల్లడికాకపోయినా.. విద్యార్థుల పూర్తి వివరాలు ఈ క్రింది ఈమెయిల్ అడ్రస్ ద్వారా ఎంబసీ అధికారులకు పంపొచ్చని పేర్కొన్నారు. (130 మంది విద్యార్థుల అరెస్టు) మీవారి వివరాలతో ఈ అడ్రస్‌కు మెయిల్ చేయొచ్చు.. Hoc.atlanta@mea.gov.in Com.atlanta@mea.gov.in fsitou.washington@mea.gov.in మెయిల్ చేసే సమయంలో.. సబ్జెక్ట్ అనే చోట "Farmington" అని తప్పక రాయాలని సూచించారు. విద్యార్థుల వివరాలిలా.. First Name : Last Name : Address or city of residence (if known) : Date arrested(if known and arrested) : Detention location (If Known) : Your contact Phone no : Your email address : Student's contact phone no : Student's email address : పై విధంగా మెయిల్ చేయడం ద్వారా మీ విద్యార్థుల వివరాలు ఎంబసీ అధికారులు నమోదు చేసుకుని తగు చర్యలు చేపట్టే వీలుంటుంది. https://tinyurl.com/DetainedIndianStudents లింక్ ద్వారా కూడా విద్యార్థుల వివరాలు అందివ్వొచ్చని ఆటా నాయకులు తెలిపారు. -
130 మంది విద్యార్థుల అరెస్టు
వాషింగ్టన్: అమెరికా వీసా మోసం కేసులో 130 మంది విద్యార్థులు అరెస్టయ్యారు. వీరిలో అత్యధికులు భారతీయులే. అధికారులు వల పన్ని ఏర్పాటు చేసిన ఫార్మింగ్టన్ యూనివర్సిటీ నకిలీదని తెలిసినప్పటికీ అమెరికాలో ఉండి అక్రమంగా ఉద్యోగాలు చేసుకునేందుకే ఈ విద్యార్థులంతా ఆ విశ్వవిద్యాలయంలో చేరారని వలస విభాగం అధికారులు ఆరోపణలు నమోదు చేశారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఉదయమే వీరందరినీ అరెస్టు చేశారు. మరికొంత మంది కూడా అరెస్టయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. అయితే ఫార్మింగ్టన్ యూనివర్సిటీ చట్టబద్ధమైన రీతిలో పనిచేయడం లేదనే విషయం విద్యార్థులకు తెలియదనీ, చాలా కోర్సులు/యూనివర్సిటీల్లో చదువుతోపాటే ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటు ఉండటంతో ఇది కూడా నిజమైన యూనివర్సిటీనే అని ఆ విద్యార్థులు భావించారని వారి తరఫు న్యాయవాదులు అంటున్నారు. అధికారులే ఇబ్బందికర పద్ధతుల ద్వారా, వల విసిరి విద్యార్థులను పట్టుకున్నారని లాయర్లు ఆరోపించారు. అమెరికాలో విద్యార్థి వీసాలపై అక్రమంగా ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటున్న విదేశీయులను పట్టుకునేందుకు ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ (ఐసీఈ) అధికారులు పార్మింగ్టన్ పేరుతో నకిలీ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం తెలిసిందే. ఈ వలలో చిక్కిన 8 మంది మధ్యవర్తులు (అందరూ తెలుగు వారే) ఇప్పటికే అరెస్టవ్వగా, తాజాగా 130 మంది విద్యార్థులు కూడా అరెస్టయ్యారు. 8 మందిపై వీసా సంబంధిత నేరపూరిత కుట్ర, లాభం కోసం అన్యులకు ఆశ్రయమివ్వడం తదితర అభియోగాలను నమోదు చేసిన అధికారులు, విద్యార్థులపై మాత్రం కేవలం పౌర వలస నిబంధనల ఉల్లంఘన అభియోగంతో సరిపెట్టారు. అరెస్టైన 130 మంది విద్యార్థుల్లో 129 మంది భారతీయులేనని ఐసీఈ అధికార ప్రతినిధి ఖాలిద్ వాల్స్ చెప్పారు. వారిని భారత్‌కు తిరిగి పంపించేయనున్నామన్నారు. వారికేం తెలియదు: న్యాయవాదులు ఫార్మింగ్టన్ వర్సిటీలో తరగతులు జరగవు, సిబ్బంది ఉండరనే విషయం అందులో చేరిన విద్యార్థులకు ముందే తెలుసుననీ, కేవలం అమెరికాలో ఉండి ఉద్యోగాలు చేసుకోవాలన్న ఉద్దేశంతోనే వారు ఆ యూనివర్సిటీలో చేరారని దర్యాప్తు అధికారులు అంటున్నారు. కానీ ఇలా చదువుతున్నప్పుడే ఉద్యోగాలు చేయడం మామూలే కాబట్టి విద్యార్థులు ఇది కూడా అలాంటిదే అనుకున్నారనీ, ఇందులో వారి తప్పేమీ లేదని విద్యార్థుల తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారు. మైకేల్ సోఫో అనే న్యాయవాది మాట్లాడుతూ ‘కోర్సులో చేరిన తొలి రోజు నుంచే ప్రయోగాత్మక శిక్షణను ప్రారంభించి, మిగిలిన సమయంలో ఉద్యోగాలు చేసుకునే వర్సిటీలున్నాయి. యూనివర్సిటీకి రాకుండా ఎంతో దూరంలో ఉండి, ఉద్యోగాలు చేసుకుంటూ కూడా ఆ కోర్సులు చేయొ చ్చు. ఇది కూడా అలాంటిదేనని వారు భావించారు’ అని చెప్పారు. రవి మన్నం అనే మరో న్యాయవాది మాట్లాడుతూ ప్రభుత్వమే అభ్యంతరకర, ఇబ్బందికరమైన పద్ధతుల్లో విదేశీ విద్యార్థులను చేర్చుకుందన్నారు. వారికి అక్కడి రాయబార కార్యాలయం, భారత సంఘాలు సాయం అందించే ప్రయత్నాలను ప్రారంభించాయి. -
ఫేక్ యూనివర్సిటీ కలకలం; రంగంలోకి ‘ఆటా’
న్యూజెర్సీ : వీసా గడువు ముగిసినప్పటికీ అక్రమంగా అమెరికాలో నివాసం ఉంటున్న వారిని పట్టుకునేందుకు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం చేపట్టిన స్టింగ్ ఆపరేషన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను ఆదుకునేందుకు అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) రంగంలోకి దిగింది. ఈ వ్యవహారంలో పోలీసులు ఇప్పటివరకు 600 మందికి వారెంట్లు జారీ చేయగా.. 100 మందిని అరెస్టు చేశారు. ఇందులో భాగంగా బాధితులను ఆదుకునే క్రమంలో ఇండియన్ ఎంబసీకి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఆటా ప్రెసిడెంట్ పరమేష్ భీమ్‌రెడ్డి తెలిపారు. అదే విధంగా నకిలీ ఏజెంట్ల చేతుల్లో మోసాలకు గురికాకుండా ఉండేందుకు ఆటా వెబినార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పరమేష్ భీమ్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచ దేశాల్లో విద్యార్థులకు మరే ఇతర దేశం కల్పించని గొప్ప అవకాశాలు అమెరికా కల్పిస్తుందన్నారు. ఇక్కడ నివసించేందుకు విద్యార్థులు అడ్డదారులు తొక్కడం సరికాదని, చట్టాలను అతిక్రమించడం వల్ల ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆటా వెబినార్ సదస్సులో భాగంగా అట్లాంటాకు చెందిన ఇమ్మిగ్రేషన్ అటార్నీలు రవికుమార్ మన్నం, మైఖేల్ సోఫో, హేమంత్ రామచంద్రన్ విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. 1. కమిషన్ ఏజెంట్లకు దూరంగా ఉండటమే శ్రేయస్కరం. 2. ఎక్కువ కమిషన్‌కు కక్కుర్తి పడి నకిలీ ఏజెంట్లు యూనివర్సిటీల గురించి ఎటువంటి ఆరా తీయకుండానే విద్యార్థులకు అందులో అడ్మిషన్లు చేయిస్తున్నారు. మనం కూడా ఒకసారి సదరు యూనివర్సిటీల వివరాలు తెలుసుకోవాలి. 3. నిజమైన యూనివర్సిటీలు టోఫెల్ఐఈ/ఎల్టీఎస్/జీఆర్ఈ స్కోరు కార్డు అడుగుతాయన్న విషయాన్ని గమనించాలి. 4. మనం చేరబోయే కాలేజీకి సంబంధిత శాఖల నుంచి అక్రిడేషన్ ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడం ఉత్తమం. 5. విద్యార్థిగా వచ్చినప్పుడు విద్యాభ్యాసమే ప్రాథామ్యం కావాలి. అంతేగానీ సంపాదన కోసం సులువైన మార్గాలు ఎంచుకోవడం అంటే చట్ట వ్యతిరేక మార్గంలో ప్రయాణిస్తున్నట్లే. 6. ఎక్కువగా ప్రాచుర్యం లేని, అనుమానాస్పద యూనివర్సిటీల్లో చేరకపోవడమే ఉత్తమం. కొంతమంది నకిలీ ఏజెంట్లు ఆసక్తి ఉన్న విద్యార్థులను ఆకర్షించేందుకు వారి ఈ-మెయిల్, ఫోన్ నంబర్లు సేకరించి వీసా కోసమని డబ్బులు వసూలు చేస్తారు. ఫలానా యూనివర్సిటీలో చేరితే ఎన్నో లాభాలు ఉంటాయంటూ మభ్యపెడతారు. కానీ తీరా వారు చెప్పిన ప్రదేశానికి వెళ్లిన తర్వాత ఎటువంటి స్కూలుగానీ, యూనివర్సిటీ గానీ ఉండదు. కాబట్టి అటువంటి ఆకర్షణలకు లొంగకపోవడమే మంచిది. 7. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న విద్యార్థుల వివరాలు తెలుసుకునేందుకు https://www.ice.gov/ సైట్‌ను సంప్రదించవచ్చు. 8. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ఐసీఈ) ఆఫీసర్లను సంప్రదించినట్లైతే బంధీలుగా ఉన్న విద్యార్థులను కలిసే అవకాశం ఉంటుంది. సాధారణంగా వారిని సిటీకి దూరంగా ఉంచుతారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాల కోసం info@ataworld.org లేదా atahelp@ataworld.org సైట్‌ను దర్శించవచ్చు. సందేహాల నివృత్తికై https://docs.google.com/forms/d/10LKzRHEF3zqwRsZjC8-Ekgk4ukBp619G-Z7opAwveEM/edit?usp=sharing క్లిక్ చేయండి. -
విదేశీ మోజులో మరో మోసం
విదేశీ మోజులో తెలుగు రాష్ట్రాలకు చెందిన తొమ్మిది మంది నిరుద్యోగులు మోసపోయిన ఘటన బుధవారం విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో చోటుచేసుకుంది. ఎయిర్పోర్ట్ సీఐ మళ్ల శేషు తెలిపిన వివరాల ప్రకారం.. సాక్షి, ఎన్ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ) : తెలంగాణ రాష్ట్రం కరీంనగర్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాష్ట్రంలోని నెల్లూరుకు చెందిన 9 మంది యువకులు విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఇమ్మిగ్రేషన్ అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డారు. వీరంతా సింగపూర్‌లో ఆల్ఫిన్ బిల్డర్స్ కనస్ట్రక్షన్ పీటీఈ లిమిటెడ్‌లో ఉద్యోగాలొచ్చాయంటూ ప్రయాణానికి సిద్ధమయ్యారు. విజిటింగ్‌పై విశాఖ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఆసియా విమానంలో కౌలలాంపూర్‌కు వెళ్లి, అక్కడి నుంచి సింగపూర్ వెళ్లేందుకు బయలుదేరారు. అయితే బోర్డింగ్ పూర్తయిన తరువాత వీరిని ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీలు చేశారు. వర్క్ ఆర్డర్‌పై తొమ్మిది మందికి ఒకే నంబర్ ఉండడంతో అనుమానం వచ్చి పరిశీలించారు. ఒక్కో వ్యక్తికి వేర్వేరు వర్క్ ఆర్డర్ నంబర్ ఉండాలి. అందరికి ఒకే నంబర్ ఉండడంతో 9 మందిని అదుపులోకి తీసుకున్నా రు. వీరిని ఎయిర్పోర్ట్ పోలీసులకు అప్పగించా రు. ఈ ఘటనతో నిరుద్యోగులు ఖంగుతిన్నారు. తామంతా మోసపోయామని లబోదిబోమన్నా రు. బాధితులను 6 గురు సబ్ ఏజెంట్లు మోసగించినట్టు పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తు తం ఏజెంట్ల ఫోన్లు స్విచ్ఛాప్ చేసి ఉన్నాయి. సీహెచ్ శ్రీనివాస్ అనే ఏజెంట్‌కు నరేష్, ప్రసాద్‌లు రూ.80 వేల చొప్పున ముట్టజెప్పారు. శంకర్ అనే ఏజెంట్‌కు తెడ్డు గంగాధర్ రూ.70 వేలు, రాజేష్‌కు కాశీమని శ్రీనివాస్, అలువల మల్లేష్లు రూ.70 వేల చొప్పున ఇచ్చారు. ఏజెంట్ మురళీకి యర్ల శ్రీను 65 వేలు, ఏజెంట్ పోతన్నకు దేవల గంగాధర్ రెడ్డి, షేక్ సైదుళ్ల రూ.65 వేలు, ఏజెంట్ ఝాన్సీకి దత్తరావు రూ.65 వేలు సమర్పించుకుని మోసపోయారు. కాగా.. సింగపూర్‌లో ఆల్ఫిన్ బిల్డర్స్ సంస్థ లేదని ప్రాథమికంగా తేలింది. దీనిపై ఎయిర్పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిరుద్యోగులకు కౌనెల్సింగ్ బాధితులకు సీఐ మళ్ల శేషు కౌన్సెలింగ్ ఇచ్చారు. విదేశీ ఉద్యోగాల మోజులో చాలా మంది మోసపోతున్నారని తెలిపారు. సరైన అవగాహన లేకపోవడంతోనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. నకిలీ ఏజెంట్లను నమ్మి మోసపోవద్దని హితవు పలికారు. అయితే వేర్వేరు ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులు వేర్వేరు ఏజెంట్ల ద్వారా వచ్చినా.. వర్క్ ఆర్డర్ మాత్రం ఒకే వ్యక్తి వద్ద నుంచి వచ్చినట్టు గుర్తించామన్నారు. ఈ మోసానికి మూలమైన ఏజెంట్‌ను పట్టుకుంటామని విలేకరులకు తెలిపారు. -
ముంబైలో చిక్కిన ‘ఎన్నారై అత్త’
నగర యువతిపై స్విట్జర్లాండ్‌లో వేధింపులు సాక్షి, హైదరాబాద్: కోర్టు ఉత్తర్వుల్ని ధిక్కరించి విదేశాలకు పారిపోవాలని చూసిన వరకట్న వేధింపుల నిందితురాలిని శుక్రవారం ముంబైలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సీసీఎస్ అధీనంలోని మహిళా ఠాణా అధికారులు జారీ చేసిన ఎల్ఓసీ ఆధారంగా అంతర్జాతీయ విమానాశ్రయం ఇమ్మిగ్రేషన్ విభాగం ఈమెను పట్టుకుంది. నగరానికి చెందిన భవ్యకీర్తికి స్విట్జర్లాండ్‌లో నివసించే వై.ఆదిత్యతో వివాహమైంది. కాపురం చేయడానికి అక్కడకు వెళ్లిన కీర్తిని భర్త, అత్తమామలు జానకి, రవిశేఖర్ ఓ గదిలో నిర్భంధించి అమానుషంగా వేధించారు. దీంతో బాధితురాలి కుటుంబీకులు రాష్ట్ర పోలీసు విభాగాన్ని ఆశ్రయించారు. వెంటనే స్పందించిన పోలీసులు స్విట్జర్లాండ్‌లోని భారత ఎంబసీ సహకారంతో కీర్తిని భారత్‌కు రప్పించారు. అక్రమ నిర్బంధంపై స్విట్జర్లాండ్ పోలీసులు ఆదిత్య, జానకి, రవిశేఖర్‌పై కేసు నమోదు చేశారు. కోర్టు ఉత్తర్వులు ధిక్కరించి... గత ఏడాది నగరానికి తిరిగి వచ్చిన భవ్యకీర్తి సీసీఎస్ అధీనంలోని ఉమెన్ పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించడంతో వరకట్న వేధింపులు, బెదిరింపులు సహా వివిధ ఆరోపణలపై కేసు నమోదైంది. ఇటీవల నగరానికి వచ్చిన జానకికి పోలీసులు నోటీసుల జారీతో పాటు అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలకు లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) పంపారు. నిందితురాలు ఎఫ్ఐఆర్ను కొట్టేయాలంటూ హైకోర్టును ఆశ్రయించగా... పోలీసుల దర్యాప్తునకు సహకరించాల్సిందిగా ఆదేశించింది. మరోపక్క ముందస్తు బెయిల్ కోరుతూ నాంపల్లి కోర్టును ఆశ్రయించగా... గురువారం మంజూరు చేసిన న్యాయస్థానం, వారంలో ఒకరోజు దర్యాప్తు అధికారి వద్ద హాజరయ్యేలా ఆదేశించింది. ఈ రెండు ఉత్తర్వుల్నీ ధిక్కరించిన జానకి శుక్రవారం ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి స్విట్జర్లాండ్ పారిపోవడానికి ప్రయత్నించారు. గుర్తించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సీసీఎస్ పోలీసులు ముంబై వెళ్లారు. న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు తాము జానకి పాస్‌పోర్ట్ మాత్రమే స్వాధీనం చేసుకుంటామని డీసీపీ అవినాష్ మహంతి తెలిపారు. -
ఇమిగ్రేషన్ అధికారులకు మొయిన్ ఝలక్!
న్యూఢిల్లీ: మనీల్యాండరింగ్ కేసులో తనను అదుపులోకి తీసుకున్న ఢిల్లీ విమానాశ్రయంలోని ఇమిగ్రేషన్ అధికారులకు మాంసపు ఎగుమతి వ్యాపారి మొయిన్ ఖురేషీ ఝలక్ ఇచ్చాడు. ఆదాయ పన్ను కేసులో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చూపించి దుబాయ్‌కు చెక్కేశాడు. పొరపాటును గుర్తించిన అధికారులు కంగు తిని, విచారణకు ఆదేశించారు. ఈ ఘటన ఢిల్లీ ఎయిర్‌పోర్టులో శనివారం జరిగింది. మనీల్యాండరింగ్ కేసులో ఖురేషీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ‘లుక్ అవుట్ సర్కు్యలర్’(ఎల్వోసీ) జారీ చేసిన నేపథ్యంలో అతన్ని విమానాశ్రయంలోని ఇమిగ్రేషన్ అధికారులు నిర్బంధించారు. అతను తాను విదేశాలకు వెళ్లడంపై ఆంక్షలు లేవంటూ జారీ చేసిన ఓ కోర్టు ఉత్తర్వును వారికి చూపారు. దీంతో అతడిని దుబాయ్‌కు వెళ్లేందుకు ఇమిగ్రేషన్ అధికారి అనుమతించారు. కాసేపయ్యాక ఈడీ బృందం అతన్ని తమ కస్టడీలోకి తీసుకునేందుకు ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. కోర్టు ఉత్తర్వు ఆధారంగా విదేశాలకు వెళ్లేందుకు అనుమతించిన విషయాన్ని ఇమిగ్రేషన్ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కోర్టు ఉత్తర్వును మరోసారి పరిశీలించగా.. అది ఆదాయ పన్ను కేసులో జారీ చేసిందని, ఈడీ కేసులో జారీ చేసింది కాదని గుర్తించారు. -
షారూక్‌కు మళ్లీ చేదు అనుభవం
లాస్ ఏంజెలిస్/న్యూఢిల్లీ: బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూక్ ఖాన్‌కు అమెరికాలో మరోసారి చేదు అనుభవం ఎదురైంది. లాస్ ఏంజెలిస్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. గత ఏడేళ్లలో షారూక్‌ను ఇలా అదుపులోకి తీసుకోవడం ఇది మూడోసారి. దీనిపై షారూక్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. భద్రతా చర్యలను అమలు చేయడం బాగానే ఉన్నా, ఇలా పదేపదే తనను అదుపులోకి తీసుకోవడం ఇబ్బందికరంగా ఉందని ట్వీట్ చేశారు. విమాన ప్రయాణాలపై అమెరికా నిషేధం విధించిన 80 వేల మంది జాబితాలో షారుఖ్ ఖాన్ అనే మరో వ్యక్తి పేరు ఉండడంతో బాలీవుడ్ బాద్షాకు ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాగా, షారూక్‌కు కలిగిన ఇబ్బందిపై అమెరికా విదేశాంగశాఖ దక్షిణాసియా విభాగం సహాయ మంత్రి నిషా దేశాయ్ బిస్వాల్ ట్విటర్లో క్షమాపణ చెప్పారు. భారత్‌లో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ. షారూక్‌కు కలిగిన ఇబ్బందిపై శుక్రవారం ఢిల్లీలో క్షమాపణ చెప్పారు. మళ్లీ ఇలాంటి సంఘటన జరక్కుండా చూస్తామన్నారు. షారూక్ స్పందిస్తూ, తన ఇబ్బందిని అర్థం చేసుకున్నందుకు వర్మకు ధన్యవాదాలు తెలిపారు. -
భారత విద్యార్థుల వీసాలకు న్యూజిలాండ్ నో
మెల్బోర్న్ : వేలాది భారతీయ విద్యార్థుల వీసాలను న్యూజిలాండ్ తిరస్కరించింది. వీసాకు దరఖాస్తు చేసుకున్న వారిలో అత్యధికులు చదువుల కోసం రావడంలేదని ఆ దేశ ఇమిగ్రేషన్ అధికారులు భావిస్తున్నారని మీడియా తెలిపింది. అధికారిక సమాచార చట్టం ప్రకారం ఆ దేశంలోని సగానికిపైగా పాలిటెక్నిక్ కళాశాల్లో వీసా తిరస్కరణ శాతం 30 శాతానికిపైగా ఉంది. సగానికిపైగా విద్యాసంస్థలు వీసాల్ని తిరస్కరిస్తున్నాయి. వాటిల్లో వీసాల తిరస్కరణ 86 శాతముందని న్యూజిలాండ్ రేడియో పేర్కొంది. 2015 డిసెంబర్- 2016 మే మధ్య నమోదైన సమాచారాన్ని బట్టి ఈ వివరాలల్ని తెలిపింది. ఇటీవల భారత విద్యార్థులకు సంబంధించి 3,864 వీసాలు తిరస్కరణకు గురికాగా 3,176 వీసాలకు అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు ఓకే చెప్పారు. వీసా దరఖాస్తుదారుల్లో అత్యధికులు చదువుల కోసం వస్తున్నారనే నమ్మకంలేదని, వారి పోషణకు సరిపడా ఆర్థిక వనరులు లేవని చెబుతున్నారు. తిరస్కరణకు గురైన వీసాల్లో అత్యధికం తప్పుడు పత్రాలని చెప్పలేమని, అయితే ఇమ్మిగ్రేషన్ నియమనిబంధనలకు తగినవిధంగా సమాచారం వాటిల్లో ఉండడంలేదని ఆక్లాండ్ ఇంటర్నేషన్ ఎడ్యుకేషన్ గ్రూపు పేర్కొంది. -
ఆశ.. నిరాశల మధ్య..!
♦ చేదు అనుభవంతో అమెరికా నుంచి తిరిగొస్తున్న విద్యార్థులు ♦ వందకు చేరిన సంఖ్య ♦ అయినా కొందరు అమెరికాబాట శంషాబాద్: ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి చేదు అనుభవంతో తిరిగివస్తున్న తెలుగు విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. అక్కడి ఇమిగ్రేషన్ అధికారుల నిరాకరణతో ఓ వైపు విద్యార్థులు తిరుగుముఖం పడుతున్నా.. కొందరు విద్యార్థులు చిన్న ఆశతో అక్కడి దాకా వెళ్లి ఆవేదనను మూటగట్టుకుని తిరుగుప్రయాణం అవుతున్నారు. డిసెంబర్ 19న శాన్ఫ్రాన్సిస్కో నుంచి 14 మంది తెలుగు విద్యార్థులను అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు తిప్పి పంపడంతో ఈ విష యం వెలుగుచూసింది. దీంతో అప్రమత్తమైన ఎయిరిండియా అధికారులు అదేరోజున శం షాబాద్ విమానాశ్రయం నుంచి కాలిఫోర్నియాకు బయలుదేరడానికి వచ్చిన 19 మంది విద్యార్థులను నిలిపేశారు. ఆ విద్యార్థులు బయలుదేరుతున్న వర్సిటీలు నిషేధిత జాబి తాలో ఉన్న కారణంగా అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు విద్యార్థులను తిప్పి పంపుతున్నారని వెల్లడించారు. సంబంధిత వర్సిటీలు మాత్రం అలాంటి సమస్య లేదని వర్సిటీల వెబ్సైట్లు, ఇతర మాధ్యమాల ద్వారా వెల్లడించడంతో ఇక్కడి నుంచి బయలుదేరుతున్న విద్యార్థుల సంఖ్య యథాతథంగా కొనసాగుతోంది. ఎయిరిండియా కాకుండా ఇతర ఎయిర్‌లైన్స్ సంస్థల నుంచి అమెరికా వెళ్తున్న విద్యార్థులకు ఇక్కడి నుంచి బయలుదేరే సమయంలో ఎలాంటి అడ్డంకులూ లేకపోవడంతో వాటిలో బుక్ చేసుకున్న విద్యార్థులు అమెరికా దాకా వెళ్లి చిక్కుల్లో పడుతున్నారు. ఇప్పటి వరకు సుమారు వందమందికి పైగా విద్యార్థులు అమెరికాలోని విమానాశ్రయాల్లో ఇబ్బందులు ఎదుర్కొని ఇక్కడికి చేరుకున్నారు. న్యూయార్క్ వరకు వెళ్లిన 18 మంది విద్యార్థులను డిసెంబరు 22న అక్కడి నుంచి తిప్పిపంపడంతో కనెక్టివిటీ విమానం ద్వారా ముందు గా అబుదాబి చేరుకున్నారు. అబుదాబి విమానాశ్రయంలో కూడా వీరు నానా ఇబ్బందులు పడ్డారు. మొత్తం మీద డిసెంబర్ 26వ తేదీ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న వీరు తమ బాధలను ఇక్కడి వారికి తెలియజేశారు. డిసెంబర్ 27న ఇక్కడి నుంచి బయలుదేరిన 18 మంది విద్యార్థులు జనవరి 2వ తేదీన తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అమెరికా అధికారులు తీవ్రంగా అవమానించారని ఆవేదన వెళ్లగక్కారు. న్యూయార్స్ ఎయిర్‌పోర్టులో బేడీలు వేసి తిప్పారని పలువురు విద్యార్థులు మీడియాతో వెల్లడించారు. వీసాలు కొంటున్నారా? అంటూ ప్రశ్నల వ ర్షం కురిపించారంటూ ఆవేదన చెందారు. అన్ని సమాధానాలు సరిగ్గా తెలిపినా అక్కడి అధికారులు అనుమతించడం లేదని వాపోయారు. అదేరోజు మరో 10 మంది విద్యార్థులు కూడా కాలిఫోర్నియా నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. జనవరి 4వ తేదీ రాత్రి కూడా మరో 10 మంది విద్యార్థులు న్యూయార్క్ వరకు వెళ్లి ఇబ్బందులు పడి హైదరాబాద్‌కు వచ్చేశారు. తాజాగా శనివారం అర్ధరాత్రి 22 మంది విద్యార్థులు అమెరికా నుంచి ముందుగా ఢిల్లీ చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. మరో ఆరుగురు.. ఆదివారం అర్ధరాత్రి న్యూయార్క్ నుంచి తిరుగుముఖం పట్టిన ఆరుగురు తెలుగు విద్యార్థులు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. మీడియాతో మాట్లాడడానికి కూడా నిరాకరించారు. అమెరికా అధికారులు నానా తిప్పలు పెట్టారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. -
తనిఖీల పేరుతో వేధింపులు..!
అమెరికా నుంచి తిరిగొచ్చిన మరో 15 మంది విద్యార్థులు వీసాలను కొంటున్నారా..? అని అక్కడి అధికారులు ప్రశ్నించారని ఆవేదన శంషాబాద్: ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన మరో 15 మంది విద్యార్థులకు కూడా అక్కడ చేదు అనుభవమే ఎదురైంది. తనిఖీల పేరిట అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు వేధింపులకు గురిచేశారని అమెరికా నుంచి తిరిగొచ్చిన తెలుగు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గత డిసెంబర్ 28న ఇక్కడి నుంచి బయలుదేరి న్యూయార్క్ చేరుకున్న 15 మంది విద్యార్థులను అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు తిప్పి పంపారు. దీంతో వారు శనివారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మీడియాతో తమ ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నా కూడా.. తాము చేరబోయే ఆ యూనివర్సిటీలను నిషేధించారంటూ వెనక్కి పంపారని తిరిగొచ్చిన విద్యార్థులు తెలిపారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పినా లెక్కచేయడం లేదన్నారు. భారతదేశం నుంచి వచ్చిన తెలుగు విద్యార్థుల పట్ల అక్కడి అధికారులు చులకన భావంతో ఉన్నారన్నారు. కొందరు విద్యార్థులకు న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో బేడీలు కూడా వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫామ్-20, వీసాలు సరిగ్గా ఉన్నవారికి ఎలాంటి ఇబ్బందులుండవని తెలపడంతోనే తాము అక్కడికి వెళ్లినట్లు వారు చెప్పారు. ఇండియాలో మీరు వీసాలు కొంటున్నారా..? అంటూ కొందరు ఇమ్మిగ్రేషన్ అధికారులు తమని ప్రశ్నించారని ఓ విద్యార్థి తెలిపాడు. ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.. అన్నింటికీ సరైన సమాధానం చెప్పినా అమెరికాలోని అధికారులు తిప్పి పంపుతున్నారు. వర్సిటీలను నిషేధించినట్లు చెబుతున్నా అసలు కారణాలు అర్థం కావడం లేదు. ప్రభుత్వం చొరవ తీసుకుని విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి. ఇండియా నుంచి వెళ్లిన విద్యార్థులతో అమెరికా అధికారులు దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి, తగు చర్యలు తీసుకోవాలి. -సందీప్, విద్యార్థి చులకనగా చూస్తున్నారు.. అమెరికాలోని ఇమ్మిగ్రేషన్ అధికారులు భారత్ నుంచి ఉన్నత చదువుల కోసం వెళ్తున్న విద్యార్థులను చులకనగా చూస్తున్నారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినా నిరాకరిస్తున్నారు. ఇండియాలో మీరు వీసాలు కొంటున్నారా..? అంటూ కొందరు అధికారులు ప్రశ్నించారు. అమెరికా కాన్సులేట్ అధికారులు వీసాలు అమ్ముతున్నారా..? అన్నది వారు పరిశీలించుకోవచ్చు కదా. - కరుణాకర్, విద్యార్థి