వాషింగ్టన్: అమెరికా వీసా మోసం కేసులో 130 మంది విద్యార్థులు అరెస్టయ్యారు. వీరిలో అత్యధికులు భారతీయులే. అధికారులు వల పన్ని ఏర్పాటు చేసిన ఫార్మింగ్‌టన్ యూనివర్సిటీ నకిలీదని తెలిసినప్పటికీ అమెరికాలో ఉండి అక్రమంగా ఉద్యోగాలు చేసుకునేందుకే ఈ విద్యార్థులంతా ఆ విశ్వవిద్యాలయంలో చేరారని వలస విభాగం అధికారులు ఆరోపణలు నమోదు చేశారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఉదయమే వీరందరినీ అరెస్టు చేశారు.
మరికొంత మంది కూడా అరెస్టయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. అయితే ఫార్మింగ్‌టన్ యూనివర్సిటీ చట్టబద్ధమైన రీతిలో పనిచేయడం లేదనే విషయం విద్యార్థులకు తెలియదనీ, చాలా కోర్సులు/యూనివర్సిటీల్లో చదువుతోపాటే ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటు ఉండటంతో ఇది కూడా నిజమైన యూనివర్సిటీనే అని ఆ విద్యార్థులు భావించారని వారి తరఫు న్యాయవాదులు అంటున్నారు. అధికారులే ఇబ్బందికర పద్ధతుల ద్వారా, వల విసిరి విద్యార్థులను పట్టుకున్నారని లాయర్లు ఆరోపించారు.
అమెరికాలో విద్యార్థి వీసాలపై అక్రమంగా ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటున్న విదేశీయులను పట్టుకునేందుకు ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ (ఐసీఈ) అధికారులు పార్మింగ్‌టన్ పేరుతో నకిలీ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం తెలిసిందే. ఈ వలలో చిక్కిన 8 మంది మధ్యవర్తులు (అందరూ తెలుగు వారే) ఇప్పటికే అరెస్టవ్వగా, తాజాగా 130 మంది విద్యార్థులు కూడా అరెస్టయ్యారు. 8 మందిపై వీసా సంబంధిత నేరపూరిత కుట్ర, లాభం కోసం అన్యులకు ఆశ్రయమివ్వడం తదితర అభియోగాలను నమోదు చేసిన అధికారులు, విద్యార్థులపై మాత్రం కేవలం పౌర వలస నిబంధనల ఉల్లంఘన అభియోగంతో సరిపెట్టారు. అరెస్టైన 130 మంది విద్యార్థుల్లో 129 మంది భారతీయులేనని ఐసీఈ అధికార ప్రతినిధి ఖాలిద్ వాల్స్ చెప్పారు. వారిని భారత్‌కు తిరిగి పంపించేయనున్నామన్నారు.
వారికేం తెలియదు: న్యాయవాదులు
ఫార్మింగ్‌టన్ వర్సిటీలో తరగతులు జరగవు, సిబ్బంది ఉండరనే విషయం అందులో చేరిన విద్యార్థులకు ముందే తెలుసుననీ, కేవలం అమెరికాలో ఉండి ఉద్యోగాలు చేసుకోవాలన్న ఉద్దేశంతోనే వారు ఆ యూనివర్సిటీలో చేరారని దర్యాప్తు అధికారులు అంటున్నారు. కానీ ఇలా చదువుతున్నప్పుడే ఉద్యోగాలు చేయడం మామూలే కాబట్టి విద్యార్థులు ఇది కూడా అలాంటిదే అనుకున్నారనీ, ఇందులో వారి తప్పేమీ లేదని విద్యార్థుల తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారు.
మైకేల్ సోఫో అనే న్యాయవాది మాట్లాడుతూ ‘కోర్సులో చేరిన తొలి రోజు నుంచే ప్రయోగాత్మక శిక్షణను ప్రారంభించి, మిగిలిన సమయంలో ఉద్యోగాలు చేసుకునే వర్సిటీలున్నాయి. యూనివర్సిటీకి రాకుండా ఎంతో దూరంలో ఉండి, ఉద్యోగాలు చేసుకుంటూ కూడా ఆ కోర్సులు చేయొ చ్చు. ఇది కూడా అలాంటిదేనని వారు భావించారు’ అని చెప్పారు. రవి మన్నం అనే మరో న్యాయవాది మాట్లాడుతూ ప్రభుత్వమే అభ్యంతరకర, ఇబ్బందికరమైన పద్ధతుల్లో విదేశీ విద్యార్థులను చేర్చుకుందన్నారు. వారికి అక్కడి రాయబార కార్యాలయం, భారత సంఘాలు సాయం అందించే ప్రయత్నాలను ప్రారంభించాయి.
Comments
Please login to add a commentAdd a comment