
వాషింగ్టన్: సోషల్ మీడియా ఖాతా చూస్తే వ్యక్తుల గురించి తెలిసిపోతుంది. అందుకే.. అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు ఇప్పుడు దానిపై దృష్టి పెట్టారు. సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించిన తరువాతే వీసాలు, నివాస అనుమతులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. హమాస్, పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్, లెబనాన్‌కు చెందిన హెజ్‌బొల్లా, యెమెన్‌కు చెందిన హౌతీలతో సహా ఉగ్రవాదులుగా అమెరికా వర్గీకరించిన గ్రూపులకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులుంటే వారికి అమెరికాలోకి ప్రవేశం లేదు. అమెరికా, ఇజ్రాయెల్ వ్యతిరేక పోస్టులుంటే వీసాలు, నివాస అనుమతులు నిరాకరిస్తామని తెలిపారు.
ఈ విధానం తక్షణమే అమల్లోకి వస్తుందని హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ ఏజెన్సీ అయిన యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ తెలిపింది. అమెరికాలో ఉండేందుకు పర్మనెంట్ రెసిడెంట్ ‘గ్రీన్ కార్డుల’ కోసం దరఖాస్తు చేసేవారికీ ఇది వర్తిస్తుందని పేర్కొంది. విదేశీ ఉగ్రవాదాన్ని, యాంటీసెమిటిక్ ఉగ్రవాద సంస్థలు లేదా ఇతర యాంటీసెమిటిక్ కార్యకలాపాలను సమర్థించడం, ప్రోత్సహించడం లేదా మద్దతు ఇచ్చేవిగా సోషల్ మీడియా కంటెంట్ ఉంటే.. యూఎస్ ప్రతికూల అంశంగా పరిగణిస్తుందని ఏజెన్సీ తెలిపింది. ప్రపంచంలోని ఉగ్రవాద సానుభూతిపరులకు అమెరికాలో చోటు లేదని డీహెచ్‌ఎస్ పబ్లిక్ అఫైర్స్ అసిస్టెంట్ సెక్రటరీ ట్రిసాయ మెక్లాఫ్లిన్ అన్నారు. మరోఅడుగు ముందుకేసి అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో.. రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనే విద్యార్థులను ఉన్మాదులుగా అభివర్ణించారు.