Homeland Security
-
రక్షణ మంత్రిగా హెగ్సెత్
వాషింగ్టన్: అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం పలు అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు. ఫాక్స్ న్యూస్ చానల్ హోస్ట్, మాజీ సైనికాధికారి పీట్ హెగ్సెత్ను రక్షణ మంత్రిగా, కీలకమైన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్‌గా జాన్ రాట్‌క్లిఫ్‌ను ఎంపిక చేశారు. సౌత్ డకోటా గవర్నర్ క్రిస్టీ నోయెమ్‌ను హోమ్‌లాండ్ సెక్యూరిటీ విభాగం చీఫ్‌గా, అర్కన్సాస్ మాజీ గవర్నర్ మైక్ హకబీ (69)ని ఇజ్రాయెల్‌లో అమెరికా రాయబారిగా నియమించాలని నిర్ణయించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి స్టీవెన్ విట్కాఫ్ను పశ్చిమాసియాకు తన ప్రత్యేక దూతగా నియమించారు. డొనాల్డ్ రమ్స్ఫెల్డ్ తర్వాత అతి పిన్న వయస్కుడైన రక్షణ మంత్రిగా 44 ఏళ్ల హెగ్సెత్ రికార్డు సృష్టించనున్నారు. ఆయన జీవితమంతా సైనికుల కోసం, దేశం కోసం యోధుడిగా గడిపారంటూ ట్రంప్ ప్రశంసించారు. ఇక క్రిస్టీది సరిహద్దు భద్రతపై ఏమాత్రం రాజీ పడని తత్వమంటూ కొనియాడారు. హెగ్సెత్ 2003లో సైన్యంలో చేరారు. ఇరాక్, ఆఫ్గానిస్తాన్‌లలో పని చేశారు. 2016 నుంచి ఫాక్స్ న్యూస్ వీకెండ్ మార్నింగ్ టాక్ షో నిర్వహిస్తున్నారు. ‘ది వార్ ఆఫ్ వారియర్స్’పేరుతో పుస్తకాలు రాశారు.సీఐఏ డైరెక్టర్‌గా సన్నిహితుడుకీలకమైన సీఐఏ డైరెక్టర్‌గా ఎంపికైన రాట్క్లిఫ్ ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడు. భారత సంతతికి చెందిన కశ్యప్ (కాష్) పటేల్‌కు ఈ పదవి దక్కుతుందని తొలుత ఊహాగానాలు వినిపించాయి. ‘‘2016 ఎన్నికలప్పుడు రష్యా కుట్ర అంటూ సాగిన తప్పుడు ప్రచారం డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ పనేనని బయట పెట్టడం మొదలుకుని సత్యం కోసం, నిజాయితీ కోసం పోరాడిన యోధుడు జాన్ రాట్క్లిఫ్. అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ ల్యాప్‌టాప్ గురించి 51 మంది ఇంటెలిజెన్స్ అధికారులు అబద్ధాలు చెప్పినా ఆయన మాత్రమే అమెరికన్ ప్రజలకు నిజం చెప్పారు’’అంటూ ట్రంప్ ప్రశంసించారు. ట్రంప్ తొలిసారి అధ్యక్షునిగా ఉన్నప్పుడు రాట్క్లిఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా పనిచేశారు. 2020లో ఆయన్ను అమెరికా అత్యున్నత గూఢచారిగా ధ్రువీకరించారు. -
వర్క్‌పర్మిట్లపై యూఎస్ కీలక నిర్ణయం
వాషింగ్టన్: గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులు, హెచ్1బీ వీసా హోల్డర్ల జీవితభాగస్వాములు సహా కొన్ని ఇమ్మిగ్రెంట్ కేటగిరీలకు చెందినవారి వర్క్ పర్మిట్ కాలపరిమితిని 18నెలలు పొడిగిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. దీంతో యూఎస్‌లో పనిచేస్తున్న పలువురు భారతీయ ఐటీ ఉద్యోగులకు ఊరట లభించనుంది. కాలపరిమితి ముగిసిన వర్క్‌పర్మిట్లకు 18నెలల పొడిగింపు ఇచ్చే వెసులుబాటు ఈనెల 4నుంచి అమలవుతుంది. ఆయా ప్రభుత్వ శాఖల్లో ఉన్న వీరి వర్క్‌పర్మిట్ కాలపరిమితి ఆటోమేటిగ్గా 180 నుంచి 540 రోజులకు పెరుగుతుందని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ శాఖ తెలిపింది. పెండింగ్‌లో ఉన్న ఈఏడీ దరఖాస్తులతో పనిభారం పెరిగిన నేపథ్యంలో ప్రస్తుత కాలపరిమితిని పొడిగించాలని నిర్ణయించినట్లు యూఎస్సీఐఎస్ (అమెరికా ఇమ్మిగ్రేషన్ సేవల శాఖ) డైరెక్టర్ జడోయ్ చెప్పారు. ఇప్పటివరకు ఉన్న నియమాల ప్రకారం యూఎస్ పౌరులు కానివారు వర్క్‌పర్మిట్ కాలపరిమితి ముగిశాక మరో 180 రోజుల పొడిగింపు ఆటోమేటిగ్గా వస్తుంది. ఈ గడువులో వాళ్లు పర్మిట్ రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకోవాలి. తాజా నిర్ణయం దాదాపు 87వేల మంది ఇమ్మిగ్రెంట్లకు ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు తెలిపారు. తాజా నిర్ణయాన్ని ఇండో అమెరికన్ సంఘాలు స్వాగతించాయి. -
చైనాకు భారత్ మరో షాక్.. 54 చైనా యాప్‌లపై నిషేధం
న్యూఢిల్లీ: దేశ భద్రతకు, ప్రైవసీకి ప్రమాదంగా మారుతున్నాయంటూ మరో 54 చైనా మొబైల్ యాప్‌లను సోమవారం కేంద్రం నిషేధించింది. కేంద్ర హోం శాఖ సిఫార్సు మేరకు ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ మధ్యంతర ఉత్తర్వులిచ్చినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ‘‘ఈ యాప్స్ యూజర్ల తాలూకు వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేస్తున్నాయని, ఎప్పటికప్పుడు శత్రు దేశపు సర్వర్లకు పంపుతున్నాయి. తద్వారా దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి సమస్యగా మారాయి. దేశ రక్షణకు కూడా ముప్పుగా తయారయ్యాయి’’ అని వివరించాయి. గెరెనా ఫ్రీ ఫైర్–ఇల్యుమినేట్, టెన్సెంట్ ఎక్స్‌రివర్, నైస్‌వీడియో బైదు, వివా వీడియో ఎడిటర్, బ్యూటీ కెమెరా: స్వీట్ సెల్ఫీ హెచ్డీ, మ్యూజిక్ ప్లేయర్, మ్యూజిక్ ప్లస్, వాల్యూమ్ బూస్టర్, వీడియో ప్లేయర్స్, యాప్‌లాక్, మూన్‌చాట్, బార్కోడ్ స్కానర్–క్యూఆర్ కోడ్‌స్కాన్ వంటివి ఈ జాబితాలో ఉన్నట్టు వివరించాయి. -
భావి యుద్ధాలకు ట్రైలర్లు చూస్తున్నాం
న్యూఢిల్లీ: సమీప భవిష్యత్తులో మనం కొత్త తరహా యుద్ధాలను ఎదుర్కోవాల్సి రానుందని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె అభిప్రాయపడ్డారు. వాటి తాలూకు ట్రైలర్లు ఐటీ, ఎకనామిక్, సైబర్ వార్ఫేర్ వంటి రూపాల్లో ఇప్పటికే కళ్లముందు కన్పిస్తున్నాయన్నారు. అణుపాటవమున్న పొరుగు దేశాలు, వాటి దన్నుతో ఉగ్ర మూకలు చేస్తున్న పరోక్ష యుద్ధం దేశ భద్రతకు ముందెన్నడూ లేనంతగా సవాళ్లు విసురుతున్నాయని చైనా, పాకిస్తాన్లను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ‘‘యుద్ధ స్వరూపంలో వస్తున్న ఈ సమూల మార్పులను ఎప్పటికప్పుడు పసిగట్టగలగడం, ఎలాంటి పరిస్థితులనైనా సమర్థంగా ఎదుర్కొనే సన్నద్ధత ముఖ్యం. ఈ దిశగా మన ప్రత్యక్ష, పరోక్ష యుద్ధ పాటవాన్ని ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకోవాలి’’ అన్నారు. గురువారం ఇక్కడ సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్ (సీఎల్‌ఏడబ్ల్యూఎస్) ఏర్పాటు చేసిన సెమినార్లో ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధురి, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్‌లతో పాటు నరవణె పాల్గొన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకోవాలి యుద్ధ రంగంలో సాంకేతికతకు ప్రాధాన్యం ఎంతగానో పెరిగిందని ఆర్మీ చీఫ్ అన్నారు. ఇటీవల ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఘర్షణల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌దే ప్రధాన పాత్ర కావడం, యూఏఈపై యెమన్ హౌతీ రెబెల్స్ డ్రోన్, మిసైల్ దాడులు, వాటిని అమెరికా సాంకేతిక సహకారంతో యూఏఈ అడ్డుకున్న తీరు ఇందుకు తాజా నిదర్శనాలన్నారు. పాక్, చైనా నుంచి జాతీయ భద్రతకు ఎదురవుతున్న సవాళ్లను లోతుగా ఆయన విశ్లేషించారు. ‘‘విచ్ఛిన్న శక్తులు స్థానిక పరిస్థితులను ఆసరాగా చేసుకుని తక్కువ ఖర్చుతో భారీ దాడులకు తెగబడతాయి. అధునాతన సామర్థ్యం అందుబాటులో ఉన్నా పూర్తిస్థాయిలో ప్రయోగించలేని పరిస్థితులను కల్పించేందుకు ప్రయత్నిస్తాయి. అఫ్గానిస్తాన్‌లో నిత్యం జరుగుతున్న మారణహోమమే నిదర్శనం’’ అన్నారు. పాక్‌ను నిర్దేశించగలుగుతున్నాం నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్తతలు తగ్గడం, పాక్‌తో కాల్పుల విరమణ పూర్తిస్థాయిలో అమలవుతుండటానికి ప్రధాన కారణం మన సైనిక పాటవమేనని జనరల్ నరవణె అన్నారు. 2003 నాటి కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడుతూ నియంత్రణ రేఖ వెంబడి కాల్పులను కట్టిపెట్టేందుకు ఇరు సైన్యాల మధ్య గతంలో అంగీకారం కుదరడం తెలిసిందే. -
ఎలాంటి సవాలు ఎదురైనా తిప్పికొడతాం
న్యూఢిల్లీ: దేశ భద్రతకు ఎలాంటి సవాలు ఎదురైనా తిప్పికొట్టే పూర్తి సమర్థత భారత నావికాదళానికి ఉందని చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ హరి కుమార్ చెప్పారు. త్రివిధ దళాలల్లో ప్రభుత్వం తలపెట్టిన సంస్కరణలను ఆయన సమర్థించారు. మారిటైమ్ థియేటర్ కమాండ్ ఏర్పాటు చేయాలనుకోవడం మంచి ఆలోచన అని చెప్పారు. శుక్రవారం నావికాదళ దినోత్సవం(నావీ డే) సందర్భంగా హరికుమార్ మీడియాతో మాట్లాడారు. దేశంలో కోవిడ్–19 మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న సమయంలోనే ఉత్తర సరిహద్దుల్లో భద్రతపరంగా సంక్లిష్టమైన పరిస్థితులు తలెత్తాయని గుర్తుచేశారు. అవి ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఇది మనకు పరీక్షా సమయమని, అందుకే తీర ప్రాంత భద్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని అన్నారు. దేశ రక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. హిందూ మహాసముద్రంలో చైనా నావికాదళం కదలికలను నిశితంగా గమనిస్తున్నామని, ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు భారత నావికాదళం సిద్ధంగా ఉందని తెలిపారు. మన నావికాదళానికి అవసరమైన 72 ప్రాజెక్టులను రూ.1.97 లక్షల కోట్లతో చేపట్టేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించిందన్నారు. ఇందులో రూ.1.74 లక్షల కోట్ల విలువైన 59 ప్రాజెక్టులను దేశీయంగానే అమలు చేయనున్నట్లు వివరించారు. మారిటైమ్ థియేటర్ కమాండ్ ప్రణాళికను ప్రభుత్వం రూపొందిస్తోందని, మరో ఆరు నెలల్లో ఖరారు కానుందని అడ్మిరల్ హరికుమార్ పేర్కొన్నారు. యుద్ధ నౌకల్లో కీలకమైన విధుల్లో మహిళలను సైతం నియమిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఐఎన్ఎస్ విక్రమాదిత్యతోసహా 15 భారీ యుద్ధనౌకల్లో 28 మంది మహిళా అధికారులను నియమించామన్నారు. ఈ సంఖ్య మరింత పెరగనుందని వెల్లడించారు. -
Pegasus: బహిరంగ పర్చలేం
న్యూఢిల్లీ: పెగాసస్ స్పైవేర్ అంశంపై కోర్టులో సమగ్ర అఫిడవిట్ సమర్పించలేమని, ఇది దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారమని కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. తాము మధ్యంతర ఉత్తర్వు జారీ చేస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. పెగాసస్ హ్యాకింగ్ అంశంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన కోర్టు సమగ్ర అఫిడవిట్ సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించడం తెల్సిందే. పిటిషన్లపై సుప్రీం బెంచ్ సోమవారం విచారణ జరిపింది. ఈ కేసులో సమగ్ర ఆఫిడవిట్ దాఖలుపై ప్రభుత్వానికి పునరాలోచన ఏదైనా ఉంటే తమకు తెలియజేయాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని బెంచ్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది. మరో 2–3రోజుల్లో మధ్యంతర ఉత్తర్వు జారీ చేస్తామని, అప్పటిలోగా స్పందించాలని పేర్కొంది. ‘ఈ అంశంపై నిజానిజాలను నిర్ధారించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని, కమిటీ కోర్టుకు నివేదిక ఇస్తుందని మీరు(సొలిసిటర్ జనరల్) చెబుతున్నారు. అందుకే ఈ మొత్తం వ్యవహారాన్ని క్షుణ్నంగా పరిశీలించి, మధ్యంతర ఉత్తర్వు జారీ చేస్తాం’ అని కోర్టు స్పష్టం చేసింది. దాచడానికి ఏమీ లేదు: కేంద్రం విచారణ సందర్భంగా తుషార్ మెహతా స్పందిస్తూ.. ఒక నిర్ధిష్టమైన సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం ఉపయోగిస్తోందా? లేదా? అనేది ప్రజల్లో చర్చ జరగాల్పినన అంశం కాదని అన్నారు. పెగాసస్‌ను కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైన అంశంగా పరిగణిస్తోందని, ఇందులో దాచడానికి ఏమీ లేదని తేల్చిచెప్పిందని గుర్తుచేశారు. జాతి భద్రతకు సంబంధించిన అంశాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని తాము ఆశించడం లేదని ధర్మాసనం పేర్కొంది. దేశ పౌరులపై నిఘా పెట్టడానికి పెగాసస్ స్పైవేర్‌ను కేంద్ర ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ఉపయోగించిందా? లేదా? అనేది మాత్రమే తాము తెలుసుకోవాలని కోరుకుంటున్నామని సొలిసిటర్ జనరల్‌కు తెలిపింది. అసలు విషయం ఏమిటో సూటిగా చెప్పకుండా డొంకతిరుగుడు వైఖరి అవలంబించడం సరైంది కాదని వ్యాఖ్యానించింది. చట్టం నిర్దేశించిన ప్రక్రియ మేరకే స్నూపింగ్ సమగ్ర అఫిటవిట్ దాఖలు చేస్తే పెగాసస్‌పై కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో తమకు తెలుస్తుందని కోర్టు వివరించింది. తమ గోప్యతకు(ప్రైవసీ) భంగం కలిగేలా కేంద్రం పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగిస్తోందని, ఫోన్లపై నిఘా పెట్టిందని జర్నలిస్టులు, సామాజిక ఉద్యమకారులు ఇతరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఉద్ఘాటించింది. ‘‘చట్ట ప్రకారం ఒక ప్రక్రియ ఉంటుంది. దేశ భద్రత దృష్ట్యా అనుమానితులపై నిఘా పెట్టడానికి చట్టం కూడా అనుమతిస్తుంది’ అని పేర్కొంది. ఒకవేళ స్పైవేర్‌ను ప్రభుత్వం ఉపయోగిస్తున్నట్లయితే చట్టం నిర్దేశించిన ప్రక్రియ ప్రకారమే అది జరగాల్సి ఉంటుందని సూచించింది. చట్టం అనుమతించిన ప్రక్రియ కాకుండా ఇంకేదైనా ప్రక్రియను ప్రభుత్వం ఉపయోగిస్తోందా? అనేది తెలుసుకోవాలని పిటిషనర్లు ఆశిస్తున్నారని ధర్మాసనం గుర్తుచేసింది. వాస్తవాలు చెప్పడం ప్రభుత్వం విధి: సిబల్ పిటిషనర్లు ఎన్.రామ్, శశి కుమార్ తరపున సీనియర్ లాయర్ కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. అఫిడవిట్ దాఖలు చేయబోమని కేంద్రం తేల్చిచెప్పడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. దేశ ప్రజలకు వాస్తవాలను వెల్లడించడం ప్రభుత్వం విధి అని అన్నారు. స్పైవేర్‌ను ఉపయోగించే విషయంలో చట్టబద్ధమైన ప్రక్రియను ప్రభుత్వం పాటించలేదని మరో సారి తేలిపోయిందని చెప్పారు. మరో పిటిషనర్ తరపున సీనియర్ అడ్వొకేట్ శ్యామ్ దివాన్ వాదిస్తూ... స్పైవేర్‌తో పౌరుల ఫోన్లపై నిఘా పెట్టడం ప్రజాస్వామ్యంపై ముమ్మాటికీ దాడేనని అన్నారు. విశ్వసనీయమైన దర్యాప్తు జరిపించాలని కోరారు. చట్టం అనుమతించదు ఫలానా సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నాం, ఫలానా సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడం లేదు అని బయటకు చెబితే ఉగ్రవాద శక్తులు దాన్నొక అవకాశంగా మార్చుకొనే ప్రమాదం ఉందని సొలిసిటర్ జనరల్ మెహతా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి సాఫ్ట్‌వేర్‌కు కౌంటర్–సాఫ్ట్వేర్ ఉంటుందన్నారు. కొన్ని కేసుల్లో ఇలాంటి వాటిని బహిర్గతం చేయడానికి టెలిగ్రాఫ్ చట్టం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం అనుమతించవని వివరించారు. పెగాసస్‌పై ఏర్పాటు చేయబోయే కమిటీలో ప్రభుత్వ ఉద్యోగులెవరూ ఉండబోరని, ఐటీ రంగానికి చెందిన నిపుణులే ఉంటారని తెలిపారు. నివేదిక తమకు అందిన తర్వాత బహిర్గతం చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. కోర్టు ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చని తుషార్ మెహతా బదులిచ్చారు. దేశ భద్రత నేపథ్యంలో ఇలాంటివి ప్రజల్లోకి రాకపోవడమే మంచిదని అన్నారు. -
నిషేధం ఉన్నా.. నిశ్శబ్దంగా విస్తరిస్తున్నాయ్
దేశ భద్రతకు ముప్పు కారణంతో కేంద్ర ప్రభుత్వం పలు చైనా యాప్‌లపై నిషేధం విధించిన నేపథ్యంలో డ్రాగన్ కంపెనీలు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నాయి. వివిధ యాప్‌లకు యాజమాన్య సంస్థగా వేరే కంపెనీని ముందు పెట్టి తెర వెనుక కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. భారత మార్కెట్లో నిశ్శబ్దంగా విస్తరిస్తున్నాయి. గతేడాది నిషేధం వేటు పడిన ఆలీబాబా, బైట్‌డ్యాన్స్ వంటి కంపెనీలే ఈ యాప్‌లను వెనుక నుంచి నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీలు తమ యాప్‌లను కొత్త సంస్థల పేర్లతో లిస్ట్ చేస్తున్నాయి. యాప్‌ల యాజమాన్యం గురించి ఎక్కువగా బైట సమాచారం పొక్కకుండా, చైనా మూలాల గురించి తెలియకుండా జాగ్రత్తపడుతున్నాయి. దేశీయంగా టాప్ 60 యాప్‌ల్లో 8 చైనాకి చెందినవి ఉన్నట్లుగా ఒక పరిశోధనలో తేలింది. వీటికి ప్రతి నెలా సగటున 21.1 కోట్ల మంది యూజర్లు ఉంటున్నారు. చైనా యాప్‌లను గతేడాది జూలైలో నిషేధించినప్పుడు ఇవే యాప్‌ల యూజర్ల సంఖ్య 9.6 కోట్లే. కానీ గడిచిన 13 నెలల్లో ఈ సంఖ్య ఏకంగా 11.5 కోట్ల మేర పెరగడం .. నిషేధం ఉన్నా చైనా యాప్‌లు ఎంత వేగంగా వృద్ధి చెందుతున్నాయో చెబుతోంది. చైనాతో సరిహద్దుల్లోనూ, దౌత్యపరంగాను ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం గతేడాది చైనా యాప్‌లపై కొరడా ఝళిపించిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఏకంగా 267 చైనా యాప్‌లను నిషేధించింది. టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, పబ్జీ, హెలో, అలీఎక్స్‌ప్రెస్, లైకీ, షేర్ఇట్, మి కమ్యూనిటీ, వుయ్‌చాట్, బైదు సెర్చి, క్యామ్‌స్కానర్, వీబో, బిగో లైవ్‌తో పాటు షావోమీ సంస్థకు చెందిన కొన్ని యాప్‌లు వీటిలో ఉన్నాయి. దేశ ప్రజలు, వారి డేటా భద్రత కారణాల రీత్యా హోం శాఖ సిఫార్సుల మేరకు వీటిపై నిషేధం విధించినట్లు కేంద్రం అప్పట్లో వెల్లడించింది. అయితే, దాదాపు అదే తరహా యాప్‌లు కొత్త అవతారంలో నిశ్శబ్దంగా చాప కింద నీరులాగా విస్తరిస్తుండటం గమనార్హం. అత్యధికం మీడియా, వినోద రంగానివే.. కొత్తగా పుట్టుకొస్తున్న వాటిల్లో చాలా మటుకు యాప్‌లు.. మీడియా, వినోద రంగానికి చెందినవే. 2020లో నిషేధం వేటు పడిన టిక్‌టాక్ (యాజమాన్య సంస్థ బైట్‌డ్యాన్స్), శ్నాక్‌వీడియో (క్వాయ్‌షో) వంటి సంస్థలు ఇదే విభాగంలో హవా కొనసాగించడం గమనార్హం. ఈ విభాగంలో పెద్ద సంఖ్యలో యూజర్లకు త్వరితగతిన చేరువ కావడానికి వీలుంటుంది కాబట్టి మీడియా, వినోద రంగాలనే చైనా కంపెనీలు ఎక్కువగా ఎంచుకుంటున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దానికి తగ్గట్లే నిషేధం అనంతరం కొత్తగా వచ్చిన వాటిలో కొన్ని యాప్‌లు కేవలం నెలల వ్యవధిలోనే లక్షల కొద్దీ యూజర్లను నమోదు చేసుకోవడం ఈ వాదనలకు ఊతమిస్తోంది. ఈ యాప్‌లలో కొన్ని పైరసీని ఎరగా చూపి యూజర్లను ఆకర్షిస్తున్నాయి. భారత్‌లో అత్యంత వేగంగా ఎదుగుతున్న చైనా యాప్‌లలో ప్లేఇట్ ఒకటి. ఇది ప్రధానంగా పైరసీని అడ్డం పెట్టుకుని వేగంగా వృద్ధి చెందింది. వివిధ వీడియోలను ప్లే చేయడంతో పాటు నెట్‌ఫ్లిక్స్, ఎంఎక్స్ప్లేయర్, సోనిలివ్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫాంల నుంచి షోలు, సినిమాల కాపీలను డౌన్లోడ్ చేసుకుని, చూసుకునేందుకు ప్లేఇట్ యాప్ వీలు కల్పిస్తోంది. పలు యాప్‌లు .. యూజర్ల డివైజ్‌లో ఉన్న సమా చారం, వీడియోలు, ఫొటోలకు సంబంధించిన డేటాను సేకరిస్తున్నాయి. ఆఖరికి యూజరు ఉన్న ప్రాంతాన్ని కూడా ట్రాక్ చేయగలుగుతున్నాయి. ఎంతో ఆకర్షణీయంగా ఆయా యాప్‌లు ఉంటున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా లిస్టింగ్.. గూగుల్ ప్లే స్టోర్‌లో పలు చైనా యాప్‌లు అసలు యాజమాన్య సంస్థ పేరుతో కాకుండా వేరే కంపెనీ పేరుతో లిస్టయి ఉంటున్నాయి. ఫలితంగా వెనుక ఉండి నడిపిస్తున్న అసలు సంస్థ ఆనవాళ్లు దొరకపుచ్చుకోవడం కష్టసాధ్యంగా మారుతోంది. అయితే, ఆయా కార్పొరేట్ కంపెనీల వెబ్సైట్లలో వాటి భాగస్వామ్య సంస్థల వివరాలు, యాజమాన్యానికి సంబంధించి పబ్లిక్‌గా ఉన్న రికార్డులు, సిబ్బంది నియామకాలకు సంబంధించి లింక్డ్ఇన్ వంటి పోర్టల్స్‌ను సదరు సంస్థలు ఉపయోగిస్తున్న విధానాన్ని నిశితంగా పరిశీలిస్తే అసలు విషయం అవగతమవుతుంది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న పలు యాప్‌లకు, గతంలో నిషేధం వేటుపడిన యాప్‌లకు యాజమాన్య సంస్థ ఒకటే అన్నది తెలుస్తుంది. చాలా సందర్భాల్లో నిషేధించిన యాప్‌ల ఉద్యోగులనే కొత్త యాప్‌లకు ఆయా కంపెనీలు మారుస్తున్నట్లు లింక్డ్ఇన్ డేటా బట్టి చూస్తే అర్థమవుతుంది. భారత ప్రభుత్వం నిషేధించిన టిక్‌టాక్ యాప్ మాజీ హెడ్ .. ఈ ఏడాది జూలైలో బైట్‌డ్యాన్స్‌లో మరో విభాగానికి మారినట్లుగా లింక్డ్ఇన్ వివరాలు చూపడం ఇందుకు నిదర్శనం. మరోవైపు, భద్రత ఏజెన్సీలు ఏవైనా హెచ్చరికలు, సిఫార్సులు చేసిన తర్వాతే ఆయా యాప్‌లపై కేంద్రం చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గతేడాది కూడా దేశభద్రత కారణాలతో హోం శాఖ సిఫార్సుల మేరకే కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ పలు యాప్‌ల నిషేధానికి ఆదేశాలిచ్చింది. -
అక్రమంగా ఉంటున్న భారతీయులు @ 21వేలు
వాషింగ్టన్: 2016 అక్టోబరు నుంచి 2017 సెప్టెంబరు మధ్య కాలంలో వలసేతర వీసాలపై అమెరికాకు వెళ్లిన భారతీయుల్లో 21 వేల మంది వీసా గడువు ముగిసినా అక్కడే అక్రమంగా ఉన్నారు. ఈ విషయాన్ని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డీహెచ్ఎస్) వెల్లడించింది. అమెరికాకు చట్టబద్ధంగా వచ్చి, అక్రమంగా ఉంటున్న వారి సంఖ్యపరంగా చూస్తే భారత్ టాప్–10 దేశాల్లో ఉంది. 2016 అక్టోబరు–2017 సెప్టెంబర్ కాలంలో అమెరికాకు వివిధ వీసాలపై వచ్చి వెళ్లిన వారి వివరాలను విశ్లేషిస్తూ డీహెచ్ఎస్ కొన్ని వివరాలు ప్రకటించింది. ఈ ఏడాది కాలంలో అన్ని దేశాల నుంచి కలిపి దాదాపు 5.26 కోట్ల మంది అమెరికాకు వలసేతర వీసాల (వాణిజ్య, పర్యాటక తదితర వీసాలు)పై వచ్చారనీ, వారిలో దాదాపు ఏడు లక్షల మంది తిరిగి వెళ్లకుండా అమెరికాలోనే ఉండిపోయారని తేలింది. బీ–1, బీ–2 వీసాల వరకు చూస్తే ఏడాది కాలంలో మొత్తం 10.7 లక్షల మంది భారతీయులు అమెరికాలోకి ప్రవేశించగా, వారిలో 12,498 మంది ఇప్పటికీ అమెరికాలో అక్రమంగా ఉన్నారు. మరో 1,708 మంది వీసా గడువు ముగిశాక కొన్నాళ్లు ఉండి తర్వాత వెళ్లారని తేలింది. 2017లో వాయు, సముద్ర మార్గాల ద్వారా 5,26,56,022 మంది విదేశీయులు (శరణార్థులు కాకుండా) అమెరికాకు వచ్చారని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. -
అమెరికా గుడ్‌న్యూస్ : అదనంగా 15వేల వీసాలు
వాషింగ్టన్ : వీసాల జారీ విషయంలో కఠినతరమైన నిబంధనలు విధిస్తూ.. విదేశీయులకు చుక్కలు చూపిస్తూ వస్తున్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. అదనంగా 15వేల హెచ్-2బీ వీసాలను విదేశీయులకు జారీచేయనున్నట్టు ప్రకటించింది. ఈ వీసాలు ఇప్పటికే 2018 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జారీ చేసిన 66వేల వీసాల కంటే అదనం. అదనపు వీసాలు జారీ చేస్తున్నట్టు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యురిటీ ప్రకటించింది. ఈ హెచ్-2బీ వీసాలను ప్రస్తుతం తాత్కాలికంగా నాన్-అగ్రికల్చర్ వర్కర్లకు జారీ చేస్తున్నారు. ఈ వీసాల ద్వారా అమెరికన్ వ్యాపారాలు పలు అవసరాల నేపథ్యంలో నాన్-అగ్రికల్చర్ ఉద్యోగాలను పూరించుకోవడం కోసం విదేశీయులను వారి దేశానికి రప్పించడం కోసం ఉపయోగపడుతున్నాయి. అమెరికాన్ వ్యాపారాలను సంతృప్తిపరిచేంతగా, తాత్కాలిక నాన్-అగ్రికల్చర్ లేబర్‌గా పనిచేసేందుకు ప్రతిభావంతులైన, సరిపడ స్థాయిలో అమెరికన్ వర్కర్లు లేరని సెక్రటరీ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యురిటీ కిర్స్టేజెన్ నీ నీల్సన్ చెప్పారు. సెక్రటరీ ఆఫ్ లేబర్ అలెక్సాండర్ అకోస్టా, కాంగ్రెస్ సభ్యులు, వ్యాపార యజమానులతో సమావేశమైన తర్వాత ఆమె ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు డీహెచ్ఎస్ ప్రెస్‌కు తెలిపింది. హెచ్-2బీ వీసాను కూడా ఇందుకోసమే ప్రత్యేకంగా రూపొందించారు. ప్రతిభావంతులైన, సరిపడ స్థాయిలో వర్కర్లు దొరకనప్పుడు, తాత్కాలికంగా విదేశాల నుంచి అమెరికా వ్యాపారాలకు అనుగుణంగా వర్కర్లను రప్పించుకోవచ్చు. గరిష్టంగా ఈ ఏడాది ప్రథమార్థంలో 33వేల హెచ్-2బీ వీసాలు అందుబాటులో ఉంటాయని, మరో 33వేలు వీసాలను ద్వితీయార్థంలో జారీచేయనున్నట్టు హోమ్‌ల్యాండ్ సెక్యురిటీ పేర్కొంది. ఈ వారం నుంచి అర్హత కలిగిన వారు హెచ్-2బీ వీసాల కోసం ఫామ్ 1-129ను సమర్పించాలని చెప్పింది. -
హెచ్1బీ వీసా ఉంటే.. భార్యా జాబ్ చేయొచ్చు!
కొత్త విధాన నిర్ణయాలు తీసుకోనున్న అమెరికా వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా తెలివైనోళ్లందరినీ తన దగ్గరకు తెచ్చుకుని పని చేయించుకోవాలనుకునే అమెరికా.. ఆ దిశగా మరో ప్రయత్నం చేస్తోంది. హెచ్-1బీ వీసా కలిగిన సాంకేతిక నిపుణుల జీవిత భాగస్వాములు కూడా అమెరికాలో ఉద్యోగం చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని భావిస్తోంది. తద్వారా ఇతర దేశాల్లో ఉన్న నిపుణులను తమ దేశంవైపు ఆకర్షించాలని చూస్తోంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ మేరకు త్వరలో పలు విధాన నిర్ణయాలు తీసుకోనున్నారు. ‘అమెరికాలో ఆర్థిక వ్యవస్థ మెరుగుదలకు, ఉద్యోగాల కల్పనకు, సృజనాత్మక పోటీతత్వాన్ని పెంచడానికి వీలుగా ప్రతిభ కలిగిన విదేశీ పారిశ్రామికవేత్తలు, ఇతర ఉత్తమ నైపుణ్యాలు కలిగిన ఇమిగ్రంట్లను మరింతగా ఆకర్షించాలనుకుంటున్నాం. ఇందుకుగాను హోమ్‌లాండ్ సెక్యూరిటీ విభాగం త్వరలో కొన్ని నిబంధనలను వెల్లడించనుంది’ అని అమెరికా అధ్యక్ష భవనం ఒక ప్రకటనలో తెలిపింది. నైపుణ్యం కలిగిన ఉద్యోగుల జీవిత భాగస్వాములకు అమెరికాలో ఉద్యోగం చేసుకోవడానికి అనుమతిచ్చే నిబంధనలు కూడా ఇందులో ఉన్నాయని పేర్కొంది. వీరితోపాటు ప్రతిభ కలిగిన ప్రొఫెసర్లు, పరిశోధకులకు కూడా ఉపాధి అవకాశాలు పెంచాలని చూస్తున్నట్లు వెల్లడించింది. అయితే హెచ్-1బీ వీసా ఉన్న వారందరి జీవిత భాగస్వాములకూ ఉద్యోగ అవకాశం రాకపోవచ్చు. ప్రధానంగా శాస్త్ర-సాంకేతిక రంగాల్లో వారికే ఇది లాభించే అవకాశముందని తెలుస్తోంది.