న్యూఢిల్లీ: పెగాసస్ స్పైవేర్ అంశంపై కోర్టులో సమగ్ర అఫిడవిట్ సమర్పించలేమని, ఇది దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారమని కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. తాము మధ్యంతర ఉత్తర్వు జారీ చేస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. పెగాసస్ హ్యాకింగ్ అంశంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన కోర్టు సమగ్ర అఫిడవిట్ సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించడం తెల్సిందే. పిటిషన్లపై సుప్రీం బెంచ్ సోమవారం విచారణ జరిపింది.
ఈ కేసులో సమగ్ర ఆఫిడవిట్ దాఖలుపై ప్రభుత్వానికి పునరాలోచన ఏదైనా ఉంటే తమకు తెలియజేయాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని బెంచ్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది. మరో 2–3రోజుల్లో మధ్యంతర ఉత్తర్వు జారీ చేస్తామని, అప్పటిలోగా స్పందించాలని పేర్కొంది. ‘ఈ అంశంపై నిజానిజాలను నిర్ధారించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని, కమిటీ కోర్టుకు నివేదిక ఇస్తుందని మీరు(సొలిసిటర్ జనరల్) చెబుతున్నారు. అందుకే ఈ మొత్తం వ్యవహారాన్ని క్షుణ్నంగా పరిశీలించి, మధ్యంతర ఉత్తర్వు జారీ చేస్తాం’ అని కోర్టు స్పష్టం చేసింది.
దాచడానికి ఏమీ లేదు: కేంద్రం
విచారణ సందర్భంగా తుషార్ మెహతా స్పందిస్తూ.. ఒక నిర్ధిష్టమైన సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం ఉపయోగిస్తోందా? లేదా? అనేది ప్రజల్లో చర్చ జరగాల్పినన అంశం కాదని అన్నారు. పెగాసస్‌ను కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైన అంశంగా పరిగణిస్తోందని, ఇందులో దాచడానికి ఏమీ లేదని తేల్చిచెప్పిందని గుర్తుచేశారు. జాతి భద్రతకు సంబంధించిన అంశాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని తాము ఆశించడం లేదని ధర్మాసనం పేర్కొంది. దేశ పౌరులపై నిఘా పెట్టడానికి పెగాసస్ స్పైవేర్‌ను కేంద్ర ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ఉపయోగించిందా? లేదా? అనేది మాత్రమే తాము తెలుసుకోవాలని కోరుకుంటున్నామని సొలిసిటర్ జనరల్‌కు తెలిపింది. అసలు విషయం ఏమిటో సూటిగా చెప్పకుండా డొంకతిరుగుడు వైఖరి అవలంబించడం సరైంది కాదని వ్యాఖ్యానించింది.
చట్టం నిర్దేశించిన ప్రక్రియ మేరకే స్నూపింగ్
సమగ్ర అఫిటవిట్ దాఖలు చేస్తే పెగాసస్‌పై కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో తమకు తెలుస్తుందని కోర్టు వివరించింది. తమ గోప్యతకు(ప్రైవసీ) భంగం కలిగేలా కేంద్రం పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగిస్తోందని, ఫోన్లపై నిఘా పెట్టిందని జర్నలిస్టులు, సామాజిక ఉద్యమకారులు ఇతరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఉద్ఘాటించింది. ‘‘చట్ట ప్రకారం ఒక ప్రక్రియ ఉంటుంది. దేశ భద్రత దృష్ట్యా అనుమానితులపై నిఘా పెట్టడానికి చట్టం కూడా అనుమతిస్తుంది’ అని పేర్కొంది. ఒకవేళ స్పైవేర్‌ను ప్రభుత్వం ఉపయోగిస్తున్నట్లయితే చట్టం నిర్దేశించిన ప్రక్రియ ప్రకారమే అది జరగాల్సి ఉంటుందని సూచించింది. చట్టం అనుమతించిన ప్రక్రియ కాకుండా ఇంకేదైనా ప్రక్రియను ప్రభుత్వం ఉపయోగిస్తోందా? అనేది తెలుసుకోవాలని పిటిషనర్లు ఆశిస్తున్నారని ధర్మాసనం గుర్తుచేసింది.
వాస్తవాలు చెప్పడం ప్రభుత్వం విధి: సిబల్
పిటిషనర్లు ఎన్.రామ్, శశి కుమార్ తరపున సీనియర్ లాయర్ కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. అఫిడవిట్ దాఖలు చేయబోమని కేంద్రం తేల్చిచెప్పడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. దేశ ప్రజలకు వాస్తవాలను వెల్లడించడం ప్రభుత్వం విధి అని అన్నారు. స్పైవేర్‌ను ఉపయోగించే విషయంలో చట్టబద్ధమైన ప్రక్రియను ప్రభుత్వం పాటించలేదని మరో సారి తేలిపోయిందని చెప్పారు. మరో పిటిషనర్ తరపున సీనియర్ అడ్వొకేట్ శ్యామ్ దివాన్ వాదిస్తూ... స్పైవేర్‌తో పౌరుల ఫోన్లపై నిఘా పెట్టడం ప్రజాస్వామ్యంపై ముమ్మాటికీ దాడేనని అన్నారు. విశ్వసనీయమైన దర్యాప్తు జరిపించాలని కోరారు.
చట్టం అనుమతించదు
ఫలానా సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నాం, ఫలానా సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడం లేదు అని బయటకు చెబితే ఉగ్రవాద శక్తులు దాన్నొక అవకాశంగా మార్చుకొనే ప్రమాదం ఉందని సొలిసిటర్ జనరల్ మెహతా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి సాఫ్ట్‌వేర్‌కు కౌంటర్–సాఫ్ట్‌వేర్ ఉంటుందన్నారు. కొన్ని కేసుల్లో ఇలాంటి వాటిని బహిర్గతం చేయడానికి టెలిగ్రాఫ్ చట్టం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం అనుమతించవని వివరించారు. పెగాసస్‌పై ఏర్పాటు చేయబోయే కమిటీలో ప్రభుత్వ ఉద్యోగులెవరూ ఉండబోరని, ఐటీ రంగానికి చెందిన నిపుణులే ఉంటారని తెలిపారు. నివేదిక తమకు అందిన తర్వాత బహిర్గతం చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. కోర్టు ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చని తుషార్ మెహతా బదులిచ్చారు. దేశ భద్రత నేపథ్యంలో ఇలాంటివి ప్రజల్లోకి రాకపోవడమే మంచిదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment