
బహిష్కరణకు గురైన వారికి ట్రంప్ సర్కారు అల్టిమేటం
కఠినచర్యలూ తప్పవన్నహోంల్యాండ్ విభాగం
వాషింగ్టన్: దేశంలో తిష్టవేసిన లక్షలాది మంది అక్రమ వలసదారులను వేర్వేరు ప్రభుత్వ శాఖలు, భిన్న దర్యాప్తు సంస్థల ద్వారా గుర్తించి స్వదేశానికి వెనక్కి పంపుతున్న డొనాల్డ్ ట్రంప్ సర్కార్ వారికి మరో హెచ్చరిక జారీ చేసింది. తామే స్వయంగా గుర్తించి, బలవంతంగా పంపేసేలోపు స్వీయ బహిష్కరణ ద్వారా దేశాన్ని వీడాలని సూచించింది.
సున్నితంగా సూచిస్తూ ఇచ్చిన ఆదేశాలను పెడచెవిన పెడితే పెద్ద జరిమానా చెల్లించుకోక తప్పదని అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం స్పష్టంచేసింది. ఇప్పటికే దేశ బహిష్కరణ ఆదేశాలను అందుకున్న అక్రమవలసదారులు ఇంకా అమెరికా గడ్డపైనే నివసిస్తుంటే వారికి రోజుకు 998 డాలర్ల(దాదాపు రూ.86,469) చొప్పున జరిమానా విధిస్తామని, పట్టుబడ్డాక వారి నుంచి ఈ మొత్తం నగదును ముక్కుపిండి మరీ వసూలుచేస్తామని హోమ్‌ల్యాండ్ విభాగం ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదలచేసింది.
చెల్లించకుంటే ఆస్తుల జప్తు
బహిష్కరణ నోటీసు అందుకున్న రోజు నుంచి ప్రతిరోజూ 998 డాలర్ల చొప్పున జరిమానా విధించనున్నారు. అంతటి భారీ మొత్తాలను చెల్లించని, చెల్లించలేని అక్రమ వలసదారుల ఆస్తులను జప్తుచేస్తామని సంబంధిత ఈ–మెయిల్స్‌లో ప్రభుత్వం ప్రస్తావించింది. ట్రంప్ గతంలో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఈ జరిమానాలకు సంబంధించి 1996లో తీసుకువచ్చిన చట్టాన్ని తొలిసారిగా అమలు చేశారు.
ఇలా బహిష్కరణ నోటీసు అందుకున్నాక అమెరికాలోనే నివసిస్తే వాళ్లకు గరిష్టంగా ఐదు సంవత్సరాలపాటు ఈ జరిమానా విధించే వీలుంది. రోజుకు 998 డాలర్ల చొప్పున జరిమానాను ఎదుర్కొంటే అలాంటి అక్రమవలసదారుడు ఐదేళ్లలో ఏకంగా 10లక్షల డాలర్ల జరిమానాను చెల్లించాల్సి ఉంటుంది. ఇంతటి భారీ మొత్తాలను వాళ్లు ఎలాగూ కట్టలేరుకాబట్టి అలాంటి వ్యక్తుల ఆస్తులను ప్రభుత్వం స్వా«దీనంచేసుకోనుందని ట్రంప్ యంత్రాంగంలోని ఒక సీనియర్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
గతంలోనూ పెనాల్టీలు
ట్రంప్ తొలిసారిగా అధ్యక్షబాధ్యతలు నిర్వర్తించి కాలంలోనూ కొద్దిమంది అక్రమ వలసదారులపై ఇలా భారీ జరిమానాలు విధించారు. ఆనాడు శరణార్థులుగా వచ్చి చర్చిల్లో రహస్యంగా ఆశ్రయం పొందుతున్న 9 మంది అక్రమవలసదారులపై ట్రంప్ సర్కార్ ఏకంగా లక్షల డాలర్ల పెనాల్టీ విధించింది. తర్వాత కాస్త కనికరం చూపించి నలుగురిపై తలో 60 వేల డాలర్ల జరిమానా విధించింది. అయితే ఈ అంశం కోర్టుల దాకా వెళ్లింది. ఆ తర్వాత అధ్యక్షపగ్గాలు చేబట్టిన జో బైడెన్ వెంటనే జరిమానాల విధింపును రద్దుచేశారు. సంబంధిత విధానపర నిర్ణయాలనూ 2021లో ఉపసంహరించుకున్నారు.
కోటికిపైగా అక్రమ వలసదారులు
వలసదారుల సలహాల సంస్థ ‘ఎఫ్‌డబ్ల్యూడీ.యూఎస్’ గణాంకాల ప్రకారం అమెరికాలో దాదాపు 1,00,00,000కిపైగా అక్రమ వలసదారులు ఉన్నారు. వీళ్లంతా ఒంటరిగా ఉండట్లేరు. వీళ్ల రక్తసంబం«దీకులు, కుటుంబసభ్యులు, బంధువుల్లో కొందరికి చట్టబద్ధమైన స్థిరనివాస హోదా, పౌరసత్వం ఉన్నాయి. వాళ్లతో కలిసి ఈ అక్రమవలసదారులు జీవిస్తున్నారు. ఇలా ‘మిక్స్‌డ్ స్టేటస్’ ఉన్న కుటుంబాలు అమెరికాలో లక్షల్లో ఉన్నాయి. వలసదారుల్లో తక్కువ ఆదాయం ఉన్న వాళ్లే ఎక్కువ.