
అక్రమ వలసదారులకు అమెరికా ఆఫర్
వాషింగ్టన్: అమెరికాలో పెద్ద సంఖ్యలో తిష్టవేసిన అక్రమ వలసదారులను బయటికి పంపడమే లక్ష్యంగా పెట్టుకున్న ట్రంప్ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. సొంత దేశాలకు స్వచ్ఛందంగా వెళ్లిపోయే వలసదారులకు వెయ్యి డాలర్ల చొప్పున అందజేస్తామని సోమవారం హోం ల్యాండ్ సెక్యూరిటీ(డీహెచ్‌ఎస్) విభాగం ప్రకటించింది.
నిర్బంధానికి గురి కావడం, బలవంతంగా వెళ్లగొట్టడం కంటే స్వచ్చందంగా సొంత దేశాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు ‘సీబీపీ హోమ్’ యాప్ ద్వారా అంగీకారం తెలిపిన వారికి ప్రయాణ ఖర్చులను సైతం చెల్లిస్తామని డీహెచ్‌ఎస్ తెలిపింది. అమెరికాను వీడే అక్రమ వలసదారులకు ఇదే అత్యుత్తమ, సురక్షిత మార్గమని డీహెచ్‌ఎస్ సెక్రటరీ క్రిస్టీ నోమ్ తెలిపారు.