![War of Words in Parliament Over Illegal Immigrant's Return from the US](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/060220250447-PTI02_06_2025_.jpg.webp?itok=oYtds9g_)
భారతీయులకు సంకెళ్లు వేయడంపై పార్లమెంట్‌లో విపక్షాల ఆగ్రహం
నరేంద్ర మోదీ ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్
ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలతో అట్టుడికిన ఉభయ సభలు
న్యూఢిల్లీ: అమెరికాలోని భారతీయ అక్రమ వలసదార్లకు బేడీలు వేసి స్వదేశానికి తరలించిన ఘటనపై గురువారం పార్లమెంట్ ఉభయ సభలు అట్టుడికిపోయాయి. భారతీయులను అమెరికా ప్రభుత్వం ఘోరంగా అవమానించినా కేంద్ర ప్రభుత్వంలో చలనం లేదని విపక్ష సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉభయ సభల్లో ఆందోళనకు దిగారు. మోదీ సర్కారు వెంటనే సమాధానం చెప్పాలని నిలదీశారు.
లోక్‌సభలో వెల్‌లోకి దూసుకొచ్చి బిగ్గరగా నినాదాలు చేశారు. శాంతించాలని స్పీకర్ కోరినా వారు వినిపించుకోలేదు. దీంతో సభను నాలుగుసార్లు వేయాల్సి వచి్చంది. షెడ్యూల్ ప్రకారం లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌పై చర్చించాల్సి ఉంది. కానీ, భారతీయులకు జరిగిన అవమానంపై చర్చించడానికి వాయిదా తీర్మానాన్ని కోరుతూ కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగోయ్‌తోపాటు పలువురు విపక్ష ఎంపీలు నోటీసులు ఇచ్చారు. సభాపతి అంగీకరించకపోవడంతో వారు ఆందోళనకు దిగారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంత అవమానం జరుగుతున్నా సర్కారు మొద్దు నిద్ర వీడడం లేదని దుయ్యబట్టారు.
సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సభ నాలుగు సార్లు వాయిదా పడిన పరిస్థితిలో మార్పు రాలేదు. సాయంత్రం విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ లోక్‌సభలో ఒక ప్రకటన చదివి వినిపించారు. స్వదేశానికి తరలించే భారతీయులను అవమానించకుండా అమెరికా అధికారులతో చర్చిస్తున్నామని చెప్పారు. జైశంకర్ ప్రకటన తర్వాత కూడా విపక్షాల నిరసన కొనసాగింది. సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. రాజ్యసభలోనూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. మనవాళ్ల పట్ల అమెరికా అధికారులు అమర్యాదకరంగా ప్రవర్తిస్తే మోదీ సర్కారు ఎందుకు పట్టించుకోవడం లేదని విపక్ష సభ్యులు ధ్వజమెత్తారు.
పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన
పార్లమెంట్ సమావేశాల ప్రారంభం కంటే ముందు ప్రతిపక్ష సభ్యులు పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కాంగ్రెస్ సభ్యులు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌తోపాటు పలువురు విపక్ష ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొందరు ఎంపీలు చేతులకు సంకెళ్లు ధరించారు. ‘ఖైదీలు కాదు... మనుషులు’ అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. భారత్‌ను, భారతీయులను అవమానిస్తే సహించబోమని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు.
గౌరవ మర్యాదలతో వెనక్కి తీసుకురాలేరా?
అమెరికా నుంచి భారతీయుల తరలింపుపై మోదీ ప్రభుత్వం సమగ్రమైన ప్రకటన చేయాలని కాంగ్రెస్ అధ్యక్షడు మల్లికార్జున ఖర్గే ‘ఎక్స్’లో డిమాండ్ చేశారు. భారతీయులను గౌరవ మర్యాదలతో వెనక్కి తీసుకురావడానికి మన విమానాలు ఎందుకు పంపించలేదని ప్రశ్నించారు. ఆవేదన వెల్లడిస్తున్న భారతీయ వలసదారుడి వీడియోను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఈ బాధితుడి ఆవేదన వినాలని ప్రధాని మోదీకి సూచించారు. భారతీయులకు కావాల్సింది గౌరవం, మానవత్వం తప్ప సంకెళ్లు కాదని తేల్చిచెప్పారు.
ప్రధానమంత్రి మోదీ ఇప్పటికైనా నోరు విప్పాలని ప్రియాంక అన్నారు. మనవాళ్లను మనం ఎందుకు తీసుకురాలేకపోయామని అన్నారు మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య మంచి స్నేహం ఉన్నప్పటికీ భారతీయులకు ఈ పరిస్థితి ఎందుకు వచి్చందో చెప్పాలని నిలదీశారు. మన దేశం నుంచి ఎవరినైనా పంపించాల్సి వస్తే ఇలాగే బేడీలు వేసి పంపిస్తారా? అని ప్రశ్నించారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, శివసేన (ఉద్ధవ్) ఎంపీ ప్రియాంక చతుర్వేది, కాంగ్రెస్ ఎంపీలు గౌరవ్ గొగోయ్, శశి థరూర్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కీర్తి ఆజాద్ తదితరులు మోదీ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment