
భారత వలసదారులపై అమెరికాది మళ్లీ అదే తీరు
హోషియార్‌పూర్/పటియాలా/చండీగఢ్: అమెరికా తిప్పి పంపిన రెండో విమానంలోనూ భారతీయ వలసదారుల పట్ల అమానవీయంగా ప్రవర్తించింది. చేతులకు సంకెళ్లు.. కాళ్లను గొలుసులతో కట్టేశారు. 116 మందిలో ముగ్గురు మహిళలు, ముగ్గురు పిల్లలు మినహా అందరిదీ ఇదే పరిస్థితి. మరోవైపు వలసదారుల్లోని సిక్కులు తలపాగా ధరించడానికి అమెరికా అనుమతించకపోవడాన్ని ఎస్‌జీపీసీ ఖండించింది. అమెరికా నుంచి భారత్‌కు తిరిగొచ్చిన వలసదారులలో ఇద్దరు వ్యక్తులు అరెస్టయ్యారు.
హత్య కేసుతో సంబంధం ఉన్న పటియాలా జిల్లా రాజ్‌పురాకు చెందిన ఇద్దరు యువకులను పోలీసులు శనివారం రాత్రే అరెస్టు చేశారు. సందీప్ సింగ్ అలియాస్ సన్నీ, ప్రదీప్ సింగ్‌లు 2023లో నమోదైన ఒక హత్య కేసులో నిందితులని పోలీసులు ధ్రువీకరించారు. వలసదారుల్లో సిక్కులను తలపాగా ధరించడానికి కూడా అనుమతించకపోవడంపై శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ ప్రధాన కార్యదర్శి గురుచరణ్ సింగ్ గ్రేవాల్ ఖండించారు. విషయాన్ని అమెరికా దృష్టికి తీసుకెళ్లాలని విదేశాంగ శాఖను కోరారు.
రెండేళ్ల నరకం... శనివారం వచ్చిన వలసదారుల్లో పంజాబ్‌లోని హోషియార్‌పూర్ జిల్లా కురాలా కలాన్ గ్రామానికి చెందిన దల్జీత్‌ది విషాద గాధ. కుటుంబానికి మంచి జీవితం ఇవ్వాలనే ఆశతో అమెరికాకు వెళ్లాలనుకున్న దల్జీత్ ఏజెంట్ రెండేండ్ల పాటు నరకం చూపారు. గ్రామంలోని ఓ వ్యక్తి దల్జీత్‌కు 2022లో ట్రావెల్ ఏజెంట్‌ను పరిచయం చేయగా.. ఆయనకు రూ.65 లక్షలు చెల్లించారు. అవి తీసుకున్న ఏజెంట్ 2022లో దల్జీత్‌ను మొదట దుబాయ్‌కు పంపారు. 18 నెలలు అక్కడున్న తరువాత.. ఆయన ఇండియాకు తిరిగొచ్చారు. ఆ తరువాత అతన్ని అమెరికా పంపుతానని చెప్పి.. దక్షిణాఫ్రికాకు పంపించారు. అక్కడ నాలుగున్నర నెలలున్నారు. ఎట్టకేలకు గత ఏడాది ఆగస్టు 26న డంకీ మార్గం ద్వారా అమెరికా వెళ్లేందుకు ముంబై నుంచి బ్రెజిల్‌కు పంపించారు.
బ్రెజిల్‌లో దాదాపు నెల రోజుల పాటు గడిపిన తర్వాత మూడు రోజులపాటు కాలినడక, ట్యాక్సీ, వివిధ మార్గాల ద్వారా పనామా దాటించారు. చివరకు మెక్సికోకు చేరుకున్న దల్జీత్ అక్కడా నెలరోజులపాటు ఉండాల్సి వచ్చింది. ఈ సమయంలో ట్రావెల్ ఏజెంట్ దల్జీత్‌ను ఇబ్బందులకు గురి చేశారు. అమెరికాకు పంపాలంటే.. వారి కుటుంబానికున్న నాలుగున్నర ఎకరాల భూమి యాజమాన్యాన్ని తనకు బదలాయించాలని ఒత్తిడి తెచ్చారు. బదిలీ చేసిన తరువాత జనవరి 27న దల్జీత్‌ను యూఎస్‌లోకి పంపించేశారు. అక్కడ అధికారులు అరెస్టు చేసి, డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు. బయటకు కూడా రానివ్వకుండా గదిలో బంధించారు. ఆహారంగా నీళ్లబాటిల్, చిప్స్ ప్యాకెట్, ఆపిల్ ఇచ్చారు. రెండో విమానంలో తిరిగి భారత్‌కు పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment