న్యూఢిల్లీ: అమెరికా నుంచి అక్రమ వలసదారులతో కూడిన విమానం భారత్‌లో ల్యాండ్ అయ్యింది. అయితే ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లు విమానంలో 205 మంది లేరు. టెక్సాస్ నుంచి వచ్చిన ఈ విమానంలో కేవలం 104 మంది ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. వీళ్లతో పాటు అమెరికా ఎంబసీకి చెందిన ఓ అధికారి కూడా వచ్చారు.
అక్రమ వలసదారులతో ఉన్న ఆ విమానం అమృత్‌సర్‌లో దిగినట్లు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ప్రకటించారు. వీళ్లలో 79 మంది పురుషులు, 25 మంది మహిళలు, 13 మంది చిన్నారులు కూడా ఉన్నారు. వీళ్లలో అత్యధికులు.. అమెరికా-మెక్సికో బార్డర్ వద్ద పట్టుబడినట్లు సమాచారం. భారత్ ఇప్పుడు వీళ్లనేం నేరస్థులుగా చూడదు. అయితే.. వాళ్ల గుర్తింపులను క్షుణ్ణంగా పరిశీలించాకే.. స్వస్థలాలకు తిరిగి పంపిస్తామని చెబుతున్నారు.
గడువు ముగిసినా, ఎటువంటి అధికార పత్రాలు లేకుండా తమ భూభాగంలో ఉంటున్న వలసదారుల్ని తిరిగి వాళ్ల వాళ్ల దేశాలకు పంపించే కార్యక్రమాన్ని ట్రంప్(Trump) ప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలి బ్యాచ్ కింద.. వీళ్లను అమెరికా సీ-17 సైనిక విమానం తీసుకొచ్చింది. వీళ్లలో 30 మంది పంజాబ్‌కు చెందినవాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది.
అమెరికాలో భారత అక్రమ వలసదారులు(Indian Illegal Immigrants).. ఏడున్నర లక్షల మంది దాకా ఉన్నట్లు ఫ్యూ రీసెర్చ్ సెంటర్ అంచనా. ఈ లెక్కన మెక్సికో, ఎల్ సాల్వడోర్ తర్వాత అత్యధికంగా అలా ఉంటోంది భారతీయులే!. వీళ్లందరినీ వెనక్కి పంపించే ప్రక్రియ కొనసాగుతుందని అక్కడి అధికారులు అంటున్నారు. ఈ క్రమంలో సుమారు 18 వేల మంది భారతీయులతో కూడిన జాబితాను అక్కడి ఇమ్మిగ్రేషన్ & కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిద్ధం చేసినట్లు సమాచారం. త్వరలో భారత ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. ఆ సమయంలో ట్రంప్‌తో ఆయన ఈ అంశంపైనా చర్చించే అవకాశాలున్నాయి.
మరోవైపు ట్రంప్ ఈ చర్యను భారత్ గతంలోనే స్వాగతించింది. అమెరికాలోనే కాదు.. ప్రపంచంలో ఏమూల ఉన్నా అక్రమ వలసదారులను తాము వెనక్కి పిలిపించుకుంటామని విదేశాంగ మంత్రి జై శంకర్(Jai Sankar) స్పష్టం చేశారు. అయితే ట్రంప్ ప్రభుత్వ నిర్ణయంపై ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కుల్దీప్ సింగ్ ధాలివాల్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అర్థిక వ్యవస్థకు దోహదపడుతున్న వ్యక్తులకు పౌరసత్వం ఇవ్వకుండా.. ఇలా వెనక్కి పంపించేయడం సరికాదని అంటున్నారాయన. ఈ విషయంపై జై శంకర్‌తో ఆయన చర్చించనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment