
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన 'డొనాల్డ్ ట్రంప్' (Donald Trump) 2025 జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తరువాత అమెరికాలోని సుమారు 18,000 మంది భారతీయులు బహిష్కరణకు గురయ్యే అవకాశం ఉంది.
యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) గణాంకాల ప్రకారం.. 10.45 లక్షల మంది చట్ట విరుద్ధంగా అమెరికాలో ఉన్నట్లు, ఇందులో 17,940 మంది ఇండియన్స్ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన జాబితా సిద్దమైనట్లు సమాచారం. ట్రంప్ పదవి చేపట్టిన తరువాత వీరందరినీ వారి దేశాలకు పంపించే అవకాశం ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
సరైన పత్రాలు లేకుండా అమెరికాలో.. చట్టపరమైన హోదాను పొందటం పెద్ద సవాలు. ఇలాంటి వారే చట్టపరమైన చర్యలలో చిక్కుకుంటున్నారు. ఇలాంటి కేసుల నుంచి బయటపడటానికి సుమారు రెండు నుంచి మూడు సంవత్సరాల సమయం పడుతుంది.
చాలామంది ఐసీఈ నుంచి క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తున్నప్పుడే బ్యూరోక్రాటిక్ చిక్కుల్లో చిక్కుకుంటున్నట్లు సమాచారం. గత మూడేళ్ళలో సగటున 90,000 మంది భారతీయులు అమెరికా సరిహద్దులలోకి ప్రవేశించడానికి ప్రయత్నించి పట్టుబడినట్లు తెలుస్తోంది. వీరిలో చాలామంది పంజాబ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి వచ్చినవారే అని సమాచారం.
ఇదీ చదవండి: బ్యాంకులో ఉద్యోగం.. రోజూ ఒకటే సూట్: మస్క్ తల్లి ట్వీట్
తాను పదవీ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్న వేళ, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాల పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటించారు. సరైన పత్రాలు లేని వలసదారుల బహిష్కరణ ప్రధాన ఎజెండాగా ఉన్నట్లు సమాచారం. అంతే కాకుండా అక్రమ వలసదారుల బహిష్కరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. అమెరికా చరిత్రలో అతిపెద్ద బహిష్కరణ ప్రక్రియను చేపడతామని ట్రంప్ ప్రతిజ్ఞ చేసినందున.. అక్రమ వలసదారుల బహిష్కరణ అనివార్యమనే తెలుస్తోంది.