లక్షలు అప్పు చేసి ఏజెంట్లకు చెల్లింపులు
ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణాలు
చివరకు దొరికి సంకెళ్లతో స్వదేశానికి..
భారతీయ అక్రమ వలసదారుల వెతలు
చండీగఢ్/హోషియార్‌పూర్(పంజాబ్): ప్రమాదకరరీతిలో సముద్రంలో పడవ ప్రయాణం, ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని కిలోమీటర్ల కొద్దీ నడక, మెక్సికో సరిహద్దులోని చీకటి గదుల్లో బస.. ఇలా చెప్పుకుంటూ పోతే అమెరికాకు ఎలాగైనా చేరుకునేందుకు భారతీయ అక్రమ వలసదారుల పడిన కష్టాలెన్నో.
రహస్యంగా సరిహద్దు దాటించే ఏజెంట్లకు అప్పు చేసి మరీ డబ్బులు కట్టి అమెరికాకు ఎలాగోలా చేరుకుంటే తిరిగి పోలీసులకు దొరికిపోయి సంకెళ్లతో స్వదేశానికి వచ్చిన కొందరు అక్రమ వలసదారులు తమ కన్నీటి కష్టాలను మీడియా ముందు వెళ్లబోసుకున్నారు.
తమ అమెరికా కల ఎలా చెదిరిపోయిందో వివరించారు. తీవ్రమైన నేరస్తుల్లా చేతులకు, కాళ్లకు బేడీలు వేసి సైనిక విమానంలో అమెరికా భారత్‌కు పంపింది. ఒకే ఒక టాయిలెట్ ఉన్న సైనిక విమానంలో వందమందికి పైగా అక్రమ వలసదారులను కుక్కి ఏకంగా 24 గంటల పాటు ప్రయాణం చేసి రావడం ఒక ఎత్తయితే అసలు తాము వచ్చేది స్వదేశానికి అన్న విషయం అమృత్‌సర్ విమానాశ్రయంలో అడుగుపెట్టేదాకా వారికి తెలియకపోవడం మరో విషాదం.
అమెరికా నుంచి అమృత్‌సర్‌కు చేరుకున్న సైనిక విమానంలో 105 మంది వలసదారులన్నారు. వీరిలో హరియాణా రాష్ట్రానికి చెందిన వాళ్లు 33 మంది ఉన్నారు. గుజరాత్(33), పంజాబ్(30), మహారాష్ట్ర(3), ఉత్తరప్రదేశ్(3), చండీగఢ్(2) రాష్ట్రాల వాళ్లూ ఉన్నారు. అమెరికా తిరిగి పంపిన వారిలో 19 మంది మహిళలు, నాలుగేళ్ల బాలుడు, ఐదేళ్లు, ఏడేళ్ల వయసున్న బాలికలున్నారు. ఇక్కడికొచ్చాక భారత అధికారులు పోలీసు వాహనాల్లో ఈ వలసదారులను స్వస్థలాలకు తరలించారు. వీరిలో ఒకొక్కరిదీ ఒక్కో గాథ. అందరిదే ఒకటే వ్యథ.
చీకటి గదిలో ఉంచారు
‘‘నన్ను డంకీ మార్గం గుండా తీసుకెళ్లారు. మేం వెళ్తుండగా మార్గమధ్యంలో రూ.35 వేల విలువైన దుస్తులు చోరీ అయ్యాయి. మమ్మల్ని మొదట ఇటలీకి, ఆ తర్వాత లాటిన్ అమెరికాకు తీసుకెళ్లారు. 15 గంటల పాటు పడవ ప్రయాణం. తర్వాత దాదాపు 45 కిలో మీటర్లు నడిచాం. దాదాపు 18 కొండలు దాటాం. అంతెత్తు నుంచి జారిపడ్డామంటే బతికే అవకాశమే లేదు. మార్గమధ్యంలో కొన్ని మృతదేహాలను కూడా చూశాం. అమెరికాలోకి ప్రవేశించడానికి సరిహద్దు దాటకముందే మెక్సికోలో నన్ను అరెస్ట్ చేశారు. 14 రోజుల పాటు చీకటి గదిలో ఉంచారు.
వేలాది మంది పంజాబీలు, వాళ్ల కుటుంబాలు, వాళ్ల పిల్లలు ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో బతుకీడుస్తున్నారు. మేం వెళ్లి ఎన్నో కష్టాలు పడ్డాం. ఇంకెవరూ ఇలా తప్పుడు మార్గాల్లో విదేశాలకు వెళ్లడానికి ప్రయత్నించకండి’’ అని పంజాబ్‌లోని జలంధర్ జిల్లా దారాపూర్ గ్రామానికి చెందిన సుఖ్‌పాల్ సింగ్ సలహా ఇచ్చారు. కపుర్తలాలోని తర్ఫ్ బెహ్బల్ బహదూర్ గ్రామానికి చెందిన గుర్‌ప్రీత్ సింగ్‌ను అతని కుటుంబం ఇంటిని తాకట్టు పెట్టి అప్పు చేసి మరీ అమెరికాకు పంపింది.
ఫతేగఢ్ సాహిబ్‌లో జస్వీందర్ సింగ్‌ను విదేశాలకు పంపేందుకు అతని కుటుంబం రూ.50 లక్షలు అప్పు చేసింది. పంజాబ్‌లో ఎన్‌ఆర్‌ఐలు ఎక్కువగా ఉండే జలంధర్, హోషియార్‌పూర్, కపుర్తలా, నవాన్‌షహర్ జిల్లాల్లో ప్రతి గ్రామంలోనూ ఇలాంటి కథలే ఎప్పుడూ వినిపిస్తుంటాయి. ఇక్కడి నుంచి ఏటా పెద్ద సంఖ్యలో స్థానికులు డాలర్లవేటలో పడి విదేశాలకు అక్రమ మార్గాల్లో వలసలు వెళ్తున్నారు. ఉజ్వల భవిష్యత్తును ఆశిస్తూ అమెరికా వెళ్తున్నారు. ఏజెంట్ల చేతుల్లో మోసపోతున్నారు. ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
సంకెళ్లతో ప్రయాణం
‘‘చట్టబద్ధంగానే అమెరికా పంపిస్తానని చెప్పి ట్రావెల్ ఏజెంట్ మోసం చేశాడు. అందుకు రూ.30 లక్షలు తీసుకున్నాడు. గతేడాది జూలైలో విమానంలో బ్రెజిల్‌కు వెళ్లాను. అక్కడి నుంచి అమెరికాకు కూడా విమానంలోనే పంపిస్తామని చెప్పారు. కానీ అందుకు భిన్నంగా జరిగింది. ఆరు నెలలపాటు బ్రెజిల్‌లో ఉన్న తరువాత.. అక్రమంగా సరిహద్దు దాటించి పంపేందుకు ప్రయత్నించారు. అమెరికా బోర్డర్ పెట్రోలింగ్ పోలీసులు అరెస్టు చేశారు.
అక్కడ 11 రోజుల పాటు కస్టడీలో ఉంచి ఆ తర్వాత ఇంటికి పంపించారు. భారత్‌కు పంపించేస్తున్నట్లు నాకు తెలియదు. ఏదో క్యాంప్‌కు తీసుకెళ్తున్నా రని అనుకున్నాం. అమృత్‌సర్ విమానాశ్రయం వచ్చాక సంకెళ్లను తీసేశారు. బహిష్కరణతో కుంగిపోయా. అమెరికా వెళ్లడానికి అప్పు చేశా ను. కుటుంబానికి మంచి భవిష్యత్ ఇవ్వా లని కలలు కన్నా. ఇప్పుడవన్నీ చెదిరిపోయాయి’’ అని గురుదాస్ పూర్ జిల్లాలోని హర్‌దోర్వాల్ గ్రామానికి చెందిన జస్పాల్ వాపోయారు.
సముద్రంలో, అడవిలో ప్రాణాలు పోయాయి
‘‘గత ఏడాది ఆగస్టులో అమెరికా వెళ్లా. తొలుత యూరప్‌కు, ఆ తర్వాత మెక్సికోకు తీసుకెళ్తామని ట్రావెల్ ఏజెంట్ హామీ ఇచ్చాడు. రూ.42 లక్షలు చెల్లించాను. కానీ ఖతార్, బ్రెజిల్, పెరూ, కొలంబియా, పనామా, నికరాగ్వా, ఆ తర్వాత మెక్సికో దేశాల గుండా తీసుకెళ్లారు. పర్వత మార్గం గుండా నడుచుకుంటూ వెళ్లాం. మెక్సికో సరిహద్దు వైపు లోతైన సముద్రంలోకి ఒక చిన్న పడవలో పంపారు.
నాలుగు గంటల సముద్ర ప్రయాణం. మా పడవ బోల్తా పడింది. మాతో వచ్చిన వలసదారుల్లో ఒకరు నీటిలో పడి జలసమాధి అయ్యారు. మరొకరు పనామా అడవి గుండా వెళ్తుండగా ప్రాణాలు కోల్పోయారు. నేను మాత్రం ప్రాణాలతో బయటపడ్డా. దారిలో కొన్నిసార్లే అన్నం దొరికేది. మంచి భవిష్యత్తుపై ఆశతో అధిక వడ్డీకి అప్పు చేసి ఏజెంట్‌కు చెల్లించాం. కానీ ఏజెంట్ మమ్మల్ని మోసం చేశారు. అమెరికా బహిష్కరించడంతో చివరకు భారీ అప్పుతో సొంతూరకు వచ్చిపడ్డాం’’ అని హోషియార్ పూర్ జిల్లాలోని తహ్లీ గ్రామవాసి హర్విందర్ సింగ్ ఆవేదన వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment