
అక్రమ వసలదారుల్ని స్వస్థలాలకు చేర్చే విషయంలో అమెరికా వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కాళ్లకు సంకెళ్లు, చేతులకు బేడీలు వేసి.. కనీస వసతులేవీ కల్పించకుండా యుద్ధ విమానాల్లో తరలించడంపై ఆయా దేశాలు మండిపడుతున్నాయి. అయితే చిరకాల మిత్రుడైన భారత్ విషయంలో అగ్రరాజ్యం ఇందుకు మినహాయింపేం ఇవ్వడం లేదు. ఈ క్రమంలో.. ఇటు రాజకీయంగానూ కేంద్రం తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
తాజాగా.. ఆదివారం 112 మందితో కూడిన అమెరికా యుద్ధ విమానం అమృత్‌సర్‌లో దిగింది. అయితే వాళ్లను తీసుకొచ్చే క్రమంలో అమెరికా ఎంబసీ అధికారులు వ్యవహరించిన తీరు విమర్శలకు కారణమైంది. మతపరమైన మనోభావాలు దెబ్బతిన్నాయని సిక్కు సంఘాలు అమెరికాపై మండిపడుతున్నాయి.
దాదాపు వారం పాటు క్యాంపులో ఉంచాక వాళ్లను భారత్‌కు తరలించింది అమెరికా. అయితే.. అమృత్‌సర్ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ పూర్తయ్యాక వాళ్లను అక్కడే నేలపై కూర్చోబెట్టారు. వాళ్లలో కొంత మంది సిక్కుల తలకు టర్బన్(దస్తర్) లేకుండా కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో శిరోమణి గురుద్వారా పర్‌బంధక్ కమిటీ(SPGC) మండిపడుతోంది.
అమెరికాలో అక్రమ వలసదారుల పేరిట నిర్బంధించినప్పటి నుంచే వాళ్లలో కొందరి నుంచి తలపాగాలు తొలగించినట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన ఎస్పీజీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అమృత్‌సర్ ఎయిర్‌పోర్టుకు ప్రత్యేక బస్సును, అందులో టర్బన్‌లను పంపించింది. ఈ విషయమై అమెరికా అధికారులతో చర్చిస్తామని ఎస్‌జీపీసీ ప్రధాన కార్యదర్శి గురుచరణ్ సింగ్ గెర్వాల్ చెబుతున్నారు. మరోవైపు.. శిరోమణి అకాలీదళ్ కూడా ఈ వ్యవహారంపై మండిపడుతోంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకుని.. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని కోరుతోంది.
చెత్త కుప్పలో పడేశారు!
‘‘కిందటి ఏడాది నవంబర్ 27వ అక్రమంగా అమెరికా బార్డర్ దాటుతున్న నన్ను.. అధికారులు నిర్బంధించారు. రెండు వారాల కిందట నన్నో క్యాంప్‌నకు తరలించారు. అక్కడ నాతో పాటు మరికొందరిని రకరకాలుగా హింసించారు. సరైన భోజనం కూడా పెట్టలేదు. భారత్‌కు తరలించే ముందు.. టర్బన్ తొలగించాలని ఒత్తిడి తెచ్చారు. అది మతపరమైందని చెప్పినా వినకుండా బలవంతంగా తొలగించి.. చెత్తకుండీలో పడేశారు. వాటితో ఎవరైనా ఉరేసుకుంటే బాధ్యత ఎవరిదంటూ.. మాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే దారిలో విమానంలోనూ సైనికులు మాతో దురుసుగా ప్రవర్తించారు. కాళ్లకు సంకెళ్లు, చేతులకు బేడీలు వేశారు. రెండు పూటలా చిప్స్, ఫ్రూటీలు ఇచ్చారంతే. బాత్రూం వెళ్లడానికి కూడా మేం ఇబ్బందిడ్డాం.
నేను నా కుటుంబం కోసం రూ.50 లక్షలు అప్పు చేసి అమెరికా వెళ్లాను. రిస్క్ లేకుండా తీసుకెళ్తానంటూ నాకు తెలిసిన ఏజెంట్ చెప్పాడు. కానీ, పనామా అడవుల(Panama Jungles) గుండా వెళ్తున్నప్పుడు దారిలో.. ఎన్నో మృతదేహాలను చూశాం. వాళ్లు మాలాగే దొడ్డిదారిన అమెరికా వెళ్లే క్రమంలో అలా అయ్యారని తెలిసి భయంతో వణికిపోయాం. చివరకు ఎన్నో కష్టాలు పడి సరిహద్దు వరకు చేరినా పట్టుబడ్డాం అని 23 ఏళ్ల జతిందర్ సింగ్ చెబుతున్నాడు.
ఇంతకుముందు గురుద్వారాలోనూ అక్రమ వలసదారుల(Illegal Immigrants) కోసం అధికారులు తనిఖీలు జరిపారు. ఆ టైంలోనూ సిక్కు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇదిలా ఉంటే.. ఇప్పటిదాకా మూడు బ్యాచ్‌లుగా.. మూడు విమానాల్లో 332 మంది అక్రమ వలసదారులు అమెరికా నుంచి భారత్‌కు చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment