
అభిప్రాయం
డోనాల్డ్ ట్రంప్ తీరు చూసి నోరు వెళ్లబెడు తున్నారా? బహుశా లెక్క పెట్టలేనన్ని సార్లు అయ్యుంటుంది. నాది మాత్రం అదే పరిస్థితి. మీరు అమెరికా అధ్యక్షుడి అభిమాని కావచ్చు, కాకపోవచ్చు; అది సమస్య కాదు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉదారవాద రాజకీ యాలు సంక్షోభంలో పడిపోయాయి, ఉన్నత వర్గాల చర్మం మొద్దుబారింది, మితవాదం జనాదరణ పొందుతోంది... ఎందుకిలా జరుగుతుందో తేల్చడానికి చర్చోపచర్చలు నడుస్తున్నాయి. వాటినీ పక్కన పెడదాం.
ట్రంప్ పదవిని అలంకరించి కొన్ని వారాలు గడచి పోయాయి. ఈ స్వల్ప సమయంలోనే అమెరికా బండారం బయట పడింది. అమెరికా అసామాన్యత (అమెరికన్ ఎక్సెప్షనలిజం) అనేది ఒక కట్టుకథ అని తేలిపోయింది. అమెరికన్ ఎక్సెప్షనలిజం అంటే? ‘ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా’ నిర్వచనం ప్రకారం, ‘చారిత్రక, సైద్ధాంతిక, మత కారణాల రీత్యా అమెరికా ప్రత్యేకమైనది, నైతికంగా ఒక ఉన్నతమైన దేశం అనే భావన.’
అమెరికా ప్రతి చర్యలోనూ... కపటమైన సైనిక జోక్యాల్లో,అధికార పీఠాలను కూలదోసే కుట్రల్లో, ఆఖరికి పత్రికా వ్యాసా ల్లోనూ ఈ అహంభావపూరితమైన ఆధిక్యతా భావన కనబడుతుంది. రష్యా – ఉక్రెయిన్ యుద్ధ కాలంలో మాటిమాటికీ ‘విలువల ఆధారిత వ్యవస్థ’ అంటూ అరిగిపోయిన పదాలతో ఊదరగొట్టిన వారు, భారత్ దౌత్య విధానానికి వంక పెట్టిన వారు, ఆ తర్వాత ఏం చేశారు? అదే అమెరికా ఐక్యరాజ్య సమితి తీర్మానంపై ఊహకే అందని విధంగా రష్యాతో చేయి కలిపింది. ఉక్రెయిన్‌కు వ్యతి రేకంగా ఓటేసింది. యుద్ధ సమయంలోనూ ఆచితూచి వ్యవహరించినభారత్ ఓటింగ్‌కు హాజరు కాకుండా తటస్థ వైఖరి అవలం బించింది.
హక్కుల గురించి మీరా మాట్లాడేది?
విదేశీ దేశీ విధానాలను తలకిందులు చేస్తున్న ట్రంప్ విన్యాసాలు వినోదం కలిగిస్తున్నప్పటికీ, అవి ప్రమాదభరితమైనవి. ఏమైనా, అమెరికా విలువలు, అమెరికా ప్రజాస్వామ్యం, అమెరికా మీడియా, లేదంటే అమెరికా సంపన్నస్వామ్యం (అలిగార్కీ)... ఇవన్నీ ప్రభుత్వ వ్యవస్థల ప్రమేయం లేకుండా ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో కంటే స్వేచ్ఛగా, ఆరోగ్యదాయకంగా ఉంటాయన్న కట్టుకథ తిరుగులేనివిధంగా పటాపంచలైంది.
అమెరికా మేధావులు ఇకమీదట ఎప్పుడన్నా భారత ప్రజాస్వామ్యాన్ని శల్యపరీక్షకు పెడితే నేనేం చేస్తానో తెలుసా? పడిపడి కాకున్నా ముసిముసిగా నవ్వుకుంటాను! యూఎస్ ప్రభుత్వం భారత్‌లో మానవ హక్కుల మీద నివేదిక వెలువరించినా అంతే చేస్తా.
భారతీయ అక్రమ వలసదారులను మీరెలా ట్రీట్ చేశారు? వారిని 40 గంటల పాటు ఉక్కు సంకెళ్లు వేసి స్వదేశానికి పంపించడమే కాకుండా ఆ మెటల్ శబ్దాల మ్యూజిక్‌తో వీడియోలు రూపొందిస్తారా? జన్మలో ఇక మీరు మానవ హక్కులంటూ భారతీయులకు ఉపన్యాసాలు ఇవ్వలేరు.
ఈ క్షణాన యూఎస్ ప్రభుత్వాన్ని నడుపు తున్న టెస్లా, ఎక్స్ సంస్థల అధిపతి ఎలాన్ మస్క్ సహా అమెరికా కార్పొరేట్ టైటాన్లు ట్రంప్ ప్రమాణస్వీకార ఉత్సవంలో బారులు తీరడం మేము చూడలేదనుకుంటున్నారా? ఇక మీదట మీరు ఏ ముఖం పెట్టుకుని భారత్ మీడియాకు, వ్యాపార సామ్రాజ్యాలకు మధ్య సంబంధాలు ఉన్నాయంటూ విమర్శిస్తారు? ట్రంప్ గెలుపు ఖాయం అనుకోక ముందు నుంచే మస్క్ ఆయన పక్షం నిలిచి ఉన్నారు.
కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. మరి మెటా/ఫేస్‌బుక్ అధిపతి మార్క్ జుకర్‌బర్గ్ వాస్తవ నిర్ధారణ, రాజకీయాలు వంటి అంశాల మీద ఏళ్ల తరబడిగా అవలంబిస్తున్న విధానాలను వాషింగ్టన్ పెద్దలకు అనుకూల రీతిలో రాత్రికి రాత్రే రివర్స్ చేసుకున్నాడంటే ఏమనుకోవాలి?
ఇన్‌ఫ్లుయెన్సర్లకు పీట
ఒకప్పుడు ఎంతో గౌరవప్రదమైన ‘ద వాషింగ్టన్ పోస్ట్’ సంగతేంటి? నేను కూడా చాలా సంవత్సరాల పాటు ఆ వార్తాపత్రికలో కాలమ్ రాశాను. ఆ పత్రికలో ఇప్పుడేం జరుగుతోందో చూడండి. సంక్షోభాల నడుమ కొట్టుమిట్టాడుతోంది. సంపాదకీయ నాయకత్వంలో వరసగా అనేక ఆకస్మిక మార్పులు చేశారు.
యజమాని అయిన ‘అమెజాన్’ అధిపతి జెఫ్ బెజోస్ గందరగోళంగా ఆ పత్రిక దిశను మార్చడంతో అదిప్పుడు అనిశ్చితిలో పడింది. ‘ఒపీనియన్ పేజీ’ ఎడిటర్ డేవిడ్ షిప్లీ ఈ మార్పులకు నిరసనగా వైదొలిగారు. ‘స్వేచ్ఛా విపణులు, వ్యక్తిగత స్వాతంత్య్రం’ ఆదర్శాన్ని పత్రిక ఎలా అనుసరించాలో నిర్దేశిస్తూ బెజోస్ ‘ట్విట్టర్’ వేదికగా చేసిన ప్రకటన (బహుశా మస్క్, ట్రంప్‌ల అనుమతి కోసం) ప్రమోటర్‌కు, ఎడిటర్‌కు మధ్య ఒక గోడ ఉంటుందన్న భ్రమను ఈ ఆదేశం బద్దలు కొట్టింది.
దీనికి తోడు, లబ్ధ ప్రతిష్ఠులైన జర్నలిస్టుల స్థానంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను వైట్‌హౌస్ నియమిస్తోంది. వీరు పత్రికా సమావేశాల్లో ప్రభుత్వ అనుకూలురుగా ఉంటారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మీడియా స్వేచ్ఛకు ఈ చర్య అశనిపాతం.
అలిగార్క్‌లు చలాయించే అహంకారపూరిత అధికారం, పత్రికా స్వేచ్ఛకు సవాళ్లు, సమాచారం కోసం సంబంధిత సంస్థలను సంప్ర దించే వీలు తగ్గిపోతూ ఉండటం... ఇవన్నీ సీరియస్ అంశాలు. ప్రపంచంలోని ప్రతిచోటా ఉన్నట్లే భారత్ లోనూ ఈ సమస్యలు ఉంటాయి. కానీ అంత సమర్థంగా వీటిపై పోరాడలేక పోవచ్చు. అయితే, ఈసారి ఏదైనా అమెరికా వార్తాపత్రిక... మసకబారుతున్న ఇండియా మీడియా గురించి సంపాదకీయం రాసినప్పుడు మనం వారిని వేలెత్తి చూపించగలం.
అత్యంత హేయమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘టేట్ బ్రదర్స్’ రొమేనియా నుంచి అమెరికాలో ప్రత్యక్షం కావడం ఈవారం కొసమెరుపు. ఆండ్రూ టేట్, ట్రిస్టాన్ టేట్ సోదరులు అత్యాచారం, సెక్సువల్ ట్రాఫికింగ్ కేసుల్లో ఇరుక్కున్నారు.
మహిళలందరూ సెక్స్ వర్కర్లనీ, అత్యాచారాలకు వారే బాధ్యత వహించాలనీ... ఇంకా ఇలాంటి దుర్మార్గమైన, అసహ్యకర వ్యాఖ్యలు చేసిన ఈ అన్న దమ్ములు ట్రంప్ ఫాన్స్! వీరు స్వదేశం తిరిగి వచ్చేందుకు అనుమతించాలంటూ ట్రంప్ ప్రభుత్వం రొమేనియాను సంప్రదించినట్లు ‘ద ఫైనాన్షియల్ టైమ్స్’ కథనం ప్రచురించింది. చివరకు, అతివాద రిపబ్లికన్ నేతలు సైతం వారిని ఏవగించుకుంటున్నారు.
ట్రంప్ రాజకీయంగా మరింత బలపడవచ్చు. కానీ అమెరికా పతనమౌతోంది. ప్రభుత్వ గందరగోళ విధానాల నేపథ్యంలో అమెరికా అసామాన్యత (అసలు అలాంటిది ఎప్పుడూ లేదని నేనంటాను) చావుదెబ్బ తినబోతోంది!
బర్ఖా దత్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)