
ఇండియానే ఈ ఆఫర్ ఇచ్చింది
సంచలన ప్రకటన చేసిన ట్రంప్
అలాంటిదేమీ లేదని స్పష్టం చేసిన భారత్
ఇండియాలో ఐఫోన్‌లు తయారు చేయొద్దని యాపిల్‌కు ట్రంప్ సలహా
దోహా: భారత్, పాక్ పరస్పర సైనిక చర్యలతో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా ఉన్న వేళ కాల్పుల విరమణకు ఇరుదేశాలు సమ్మతించాయని అందరికంటే ముందే ప్రకటించి అభాసుపాలైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోమారు తొందరపాటు ప్రకటన చేశారు. టారిఫ్‌లు విధించకుండానే అమెరికా నుంచి వస్తూత్పత్తుల దిగుమతికి భారత్ అత్యుత్సాహం చూపిస్తోందని ట్రంప్ గురువారం అనూహ్య ప్రకటన చేశారు. దీంతో వెంటనే భారత్ స్పందించింది. అలాంటిదేమీ లేదని, టారిఫ్‌ల ఖరారుపై విస్తృతస్థాయిలో చర్చలు జరుగుతు న్నాయని, చర్చలు ఇప్పట్లో ముగిసిపోవని భారత్ స్పష్టంచేసింది. జీరో టారిఫ్ ప్రతిపాదన లేదని కుండబద్దలు కొట్టింది.
మోదీ మౌనమేల?: కాంగ్రెస్
ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఎందుకు స్పందించట్లేరని విపక్ష కాంగ్రెస్ ప్రశ్నించింది. ‘‘ అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఖరారు చర్చల కోసం మన వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వాషింగ్టన్ డీసీలో పర్యటిస్తున్నారు. ఇదే సమయంలో ట్రంప్ జీరో టారిఫ్ అంటూ ప్రకటన చేశారు. ఈ సున్నా టారిఫ్‌కు, ఆపరేషన్ సిందూర్ ఆగిపోవడానికి మధ్య సంబంధమేంటి?. ఈ అంశంలో మోదీ ఎందుకు మౌనం వహించారు?. అమెరికాతో డీల్ కుదుర్చుకునేందుకు మోదీ ఏమేం అంశాల్లో తలూపారు?’’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాంరమేశ్ ‘ఎక్స్’లో ప్రశ్నించారు.
ట్రంప్ ఏం మాట్లాడారు?
గురువారం ఖతార్ రాజధాని దోహాలో వ్యాపారదిగ్గజాలు, సంస్థలతో ట్రంప్ సమావేశమయ్యారు. చైనా, అమెరికా టారిఫ్‌ల యుద్ధం నేపథ్యంలో భారత్‌లో అత్యధికంగా ఐఫోన్‌లను తయారుచేసి అమెరికాకు ఎగుమతి చేయబోతున్నట్లు యాపిల్ సంస్థ ఇటీవల ప్రకటించడం తెల్సిందే. ఈ విషయం నచ్చని ట్రంప్ ఇదే అంశాన్ని దోహా భేటీలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ వద్ద ప్రస్తావించారు.
‘‘అమెరికాలో యాపిల్ సంస్థను ఇంతబాగా చూసుకుంటున్నా మీరేమో భారత్‌లో ఐఫోన్‌లను మరింత ఎక్కువగా తయారుచేస్తామంటున్నారు. అక్కడే కర్మాగారాలను విస్తరిస్తున్నారు. ఇది నాకు అస్సలు నచ్చలేదు. అమెరికా ఉత్పత్తులపై భారత్ చాలా ఎక్కువ టారిఫ్‌లు విధిస్తోంది. ప్రపంచంలో అధిక టారిఫ్‌లు విధించే దేశాల్లో భారత్ కూడా ఉంది. టారిఫ్‌లు పెంచాక అత్యధిక ధరలకు మీరు భారత్‌లో వస్తువులను విక్రయించడం చాలా కష్టమవుతుంది.
మీకో విషయం చెప్పనా. అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి భారత్ ఒక చక్కని ప్రతిపాదన తెచ్చింది. అసలు టారిఫ్‌లే లేకుండా వస్తువులను భారత్‌లోకి దిగుమతి చేసుకోవడానికి వాళ్లు దాదాపు అంగీకారం తెలిపారు. మీరు భారత్‌లో ఐఫోన్ల తయారీ కర్మాగారాలను నిర్మించినా అక్కడి సర్కార్ మిమ్మల్ని అస్సలు పట్టించుకోలేదు.
వాళ్లకు స్వప్రయోజనాలే ముఖ్యం’’ అని టిమ్‌కుక్‌తో ట్రంప్ మాట్లాడారు.
ఈ విషయాలను మీడియాకు ట్రంప్ స్వయంగా వెల్లడించారు. తనతో మాట్లాడిన తర్వాత అమెరికాలో ఉత్పత్తి పెంచేందుకు టిమ్‌కుక్ అంగీకారం తెలిపారని ట్రంప్ ప్రకటించారు. భారతీయ ఉత్పత్తులపై 26 శాతం టారిఫ్ విధిస్తామని ట్రంప్ ఏప్రిల్ 9వ తేదీన ప్రకటించారు. అయితే 90 రోజులపాటు ఈ పెంపును తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు తర్వాత ట్రంప్ వెల్లడించడం తెల్సిందే.
ఖండించిన భారత్
ట్రంప్ మాటల్లో వాస్తవం లేదని భారత్ గురువారం ప్రకటించింది. ఈ విషయమై భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ స్పందించారు. ‘‘ టారిఫ్‌లుసహా సమగ్ర వాణిజ్య ఒప్పందంపై భారత్, అమెరికా మధ్య విస్తృతస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఇవి సంక్లిష్టమైనవి. చర్చలు ముగిసిపోలేదు. ప్రతి అంశంపైనా కూలంకషంగా చర్చ జరుగుతోంది. ఇప్పటిదాకా ఏ అంశంపైనా తుది నిర్ణయాలు వెలువడలేదు. ఒప్పందం కుదుర్చుకుంటే అది ఇరుపక్షాలకు ప్రయోజనకారిగా ఉండాలి. రెండు దేశాలకూ లబ్ధిచేకూరాలి. మేం ఇదే కోరుకుంటున్నాం. చర్చలు పూర్తికాకుండానే దీనిపై మాట్లాడటం తొందరపాటు చర్యే అవుతుంది’’ అని జైశంకర్ వ్యాఖ్యానించారు. 2024లో ఇరుదేశాల మధ్య 129 బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్యం జరిగింది.