Zero Tolerance
-
Child Marriages: ఏకంగా 18 వందల మంది అరెస్టు!
బాల్యవివాహాలపై ఉక్కుపాదం మోపింది అస్సాం ప్రభుత్వం. ఈ బాల్యవివాహాలను పూర్తిగా అణిచివేయాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ పిలుపునిచ్చారు. ఈ విషయంలో పోలీసులు ఓపికతో వ్యవహరించొద్దని చెప్పారు. జీరో టోలరెన్సే లక్ష్యంగా ఈ బాల్యవివాహాలకు చెక్‌పెట్టేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. అలాగే బాల్య వివాహాల నిషేధ చట్టాన్ని ఉల్లంఘించే వారిపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అరెస్టులు జరుగుతున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు ఈ విషయమై అస్సాం వ్యాప్తంగా సుమారు 1800 మందిని అరెస్లు చేసినట్లు తెలిపారు., ఈ మేరకు ముఖ్యమంత్రి బిస్వా ట్విట్టర్లో.."బాల్య వివాహాలను అంతం చేయాలనే సంకల్పంలో అస్సాం ప్రభుత్వం చాలా దృఢంగా ఉంది. రాబోయే రోజుల్లో మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉందని అందుకు అందరూ సహకిరించాల్సిందిగా కోరుతున్నా. ఈ పక్షం రోజుల్లోనే అస్సాంలో దాదాపు 4 వేల కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 3 నుంచి ఆ కేసులపై చర్యలు తీసుకుంటాం" అని చెప్పారు. ఈ బాల్య వివాహాల విషయంలో నిందితుల పట్ల దయాదాక్షిణ్యాలు చూపించవద్దని నొక్కి చెప్పారు. దీనిపై యుద్ధం సెక్యులర్‌గా ఉంటుందని, ఏ ఒక్క వర్గాన్ని లక్ష్యంగా చేసుకోబోమని వెల్లడించారు. అంతేగాదు ఈ విషయాలను ప్రోత్సహించే మత పెద్దలు, పురోహితులపై కూడా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదీగాక అస్సాం మత్రి వర్గం 14 ఏళ్ల లోపు పిలల్లను పెళ్లి చేసుకున్న వ్యక్తులపై పోస్కో చట్టం, బాల్యవివాహాల చట్టం కింద అబియోగాలు మోపి అరెస్టు చేయాలని అస్సాం మంత్రి వర్గం గట్టిగా నిర్ణయించింది ఈ నేపథ్యంలోనే ముఖ్యమంతి ఈ చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. వాస్తవానికి అస్సాంలో మాతా, శిశు మరణాల రేటు ఎక్కువగా ఉంది. దీనికి బాల్యవివాహాలు ప్రధాన కారణం. అదీగాక రాష్ట్రంలో సగటున 31 శాతం మందికి చిన్న వయసులోనే వివాహాలు జరుగుతున్నట్లు సమాచారం. (చదవండి: రన్నింగ్ ఎయిర్ ఇండియా విమాన ఇంజిన్‌లో మంటలు.. అలర్ట్ అయిన పైలట్) -
చైనాలో ‘జీరో కోవిడ్’ ఎత్తివేస్తే ఏం జరుగుతుంది?
బీజింగ్: కోవిడ్-19 మహమ్మారి నుంచి ప్రపంచం కోలుకుంటున్నప్పటికీ.. వైరస్ పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో వైరస్ కట్టడికి ‘జీరో కోవిడ్’ ఆంక్షలు అమలు చేస్తోంది చైనా. అయితే, రోజుల తరబడి ఇంట్లోనే నిర్భందించటంపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుని ప్రజలు రోడ్లపైకి వస్తున్న సంఘటనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో జీరో కోవిడ్ ఆంక్షలను సడలిస్తోంది డ్రాగన్. ఓవైపు కేసులు భారీగా నమోదవుతున్న క్రమంలో ఆంక్షలను సడలిస్తే పెను విపత్తు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్య సమస్యలతో పాటు వైద్య వ్యవస్థపై పెను భారం పడుతుందంటున్నారు. చైనాలో ఇప్పటికీ చాలా మందికి వ్యాక్సిన్ అందలేదు. హెర్డ్ ఇమ్యూనిటీ సైతం లేని తరుణంలో కోవిడ్ ఆంక్షలను సడలించి పూర్తి స్వేచ్ఛ ఇస్తే దేశంలో ఎన్ని మరణాలు సంభవిస్తాయనే అంశంపై పరిశోధకులు అంచనా వేశారు. శుక్రవారం నాటికి చైనాలో 5,233 మరణాలు, 331,952కేసులు నమోదయ్యాయి. పరిశోధకుల అంచనా ప్రకారం.. ► 20లక్షలకుపైగా మరణాలు.. హాంకాంగ్ తరహాలో పూర్తి స్థాయిలో కరోనా ఆంక్షలు సడలిస్తే మెయిన్‌ల్యాండ్ చైనాలో 20 లక్షలలకుపైగా మరణాలు సంభవించే అవకాశం ఉందని గ్వాంగ్జీ ప్రాంతంలో ఉన్న సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ హెడ్ జౌ జియాటంగ్ అంచనా వేశారు. గత నెలలో షాంఘై జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధనా పత్రంలో ఈ విషయాలను పేర్కొన్నారు. మరోవైపు.. కరోనా కేసులు సైతం 23 కోట్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేశారు. ► దేశంలో టీకాల పంపిణీని వేగవంతం చేయకుండా, ఆరోగ్య సదుపాయలు మెరుగుపరచకుండా జీరో కోవిడ్ పాలసీని చైనా ఎత్తివేస్తే దాదాపు 15 లక్షల మరణాలు సంభవించే అవకాశం ఉందని చైనా, అమెరికాకు చెందిన పలువురు పరిశోధకులు గత మే నెలలోనే అంచనా వేశారు. కరోనా పీక్ దశకు చేరిన సమయంలో ఐసీయూలకు 15 రెట్ల డిమాండ్ ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే, వ్యాక్సినేషన్‌పై దృష్టి పెడితే మరణాల సంఖ్య తగ్గే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ► జీరో కోవిడ్ ఆంక్షలను పూర్తిగా తొలగిస్తే 13 నుంచి 21 లక్షల మంది మరణించే అవకాశం ఉందని బ్రిటిష్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ అండ్ అనలిటిక్స్ కంపెనీ ఎయిర్ఫినిటీ పేర్కొంది. టీకాలు, బూస్టర్ రేటు, హైబ్రిడ్ ఇమ్యూనిటీ తక్కువగా ఉండటమే అందుకు కారణంగా తెలిపింది. ఇదీ చదవండి: మళ్లీ తెరపైకి జాంబీ వైరస్!.. పెను విపత్తుకు దారి తీయొచ్చా? -
హమ్మయ్యా! అని రిలాక్స్ అవుతున్న చైనా!
Zero Covid Cases: చైనాలో కరోనా మహమ్మారి ఫోర్త్‌వేవ్ విరుచుకుపడింది. గత కొన్ని నెలలుగా అనుహ్యంగా పెరుగుతున్న కేసులు చూసి తలలు పట్టుకున్నారు చైనా అధికారులు. అందులోనూ కరోనా పుట్టినిల్లు అయిన చైనా ఆది నుంచి జీరో కోవిడ్ విధానం అంటూ ప్రగల్పాలు పలికి నిలబెట్టుకోనేందుకు నానాతంటాలు పడింది. కఠినమైన ఆంక్షలతో ప్రజలను నిర్బంధించి తీవ్ర స్థాయిలో ప్రజా వ్యతిరేకత తోపాటు ప్రపంచ దేశాల విమర్శలను ఎదుర్కొంది. ఏదీ ఏమైనా జీరో కోవిడ్ పాలసీని వదిలేదే లేదంటూ... ఆంక్షలు విధించి తన పంతం నెగ్గించుకుంది. ఒక్కపక్క దేశ ఆర్థికస్థితి ప్రమాదకరంలో ఉన్నా సరే అధికంగా డబ్బు ఖర్చుపెట్టి మరీ సామూహిక కరోనా పరీక్షలు నిర్వహించింది. గత ఏప్రిల్ నుంచి కేసులు తగ్గినట్లు తగ్గి అనుహ్యంగా కొన్ని నగరాల్లో వేగంగా పుంజుకోవడంతో తీవ్ర ఆందోళనకు గురైంది. షాంఘై, బీజింగ్ వంటి పారిశ్రామిక నగరాల్లోనే కేసులు పెరగడంతో ఒకనోక దశలో ఏవిధంగా నియత్రించాలో తెలియక చేతులెత్తేసే స్థితికి చేరుకుంది. ప్రజలు కూడా వరుస లాక్డౌన్లతో విసిగిపోయి తీవ్ర అసహనస్థితికి లోనయ్యారు. అయినా చైనా వీటన్నింటిని లెక్క చేయకుండా ప్రజా ఆరోగ్య ప్రయోజాల కోసం జోరో కోవిడ్ పాలసీనే అవలంభిస్తానంటూ పట్టుపట్టి మరీ మరిన్ని ఆంక్షలను విధించింది. ఎట్టకేలకు విజయాన్ని సాధించింది చైనా. ప్రస్తుతం చైనాలో కరోనా కేసులు జీరో అని నివేదికలు పేర్కొన్నాయి. దీంతో చైనా ప్రస్తుతం కొన్ని ఆంక్షలను సడలించింది. గానీ బహిరంగ ప్రదేశాల్లో తిరగాలంటే మాత్రం... ఆరోగ్య స్థితిని ట్రాక్ చేసే మొబైల్ యాప్‌లో గ్రీన్ కోడ్‌ను చూపించాలి. ప్రతి మూడు రోజులోకోసారి కరోనా పరీక్షలు తప్పనసరి అని, పైగా మూడు సంవత్సరాలకు పైబడిన పిల్లలు సైతం పరీక్షలు చేయించుకోవాల్సిందేనని చైనా నొక్కి చెప్పింది. (చదవండి: జీరో కోవిడ్ వ్యూహం తెచ్చిన తంటా...) -
విజృంభిస్తున్న కేసులు ... జీరో కోవిడ్ పాలసీని వదలనంటున్న చైనా!
Xi Jinping has doubled down on a zero-Covid policy: చైనా ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారీ తగ్గుముఖం పట్టిందని ఊపిరి పీల్చుకుంటుంది. అయినా కరోనా కేసులు తగ్గాయని బహిరంగ ప్రదేశాల్లో తిరిగేతే ఊరుకోనని చైనా ఆంక్షలు విధించింది కూడా. ప్రజలు లాక్డౌన్ వద్దని గగ్గోలు పెట్టినా ముందు జాగ్రత్త చర్యలు అంటూ ఆంక్షల కొరడా ఝళిపించి మరీ ఐసోలేషన్‌లో ఉంచింది. ఆఖరికి చైనా ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా మహమ్మారి మాత్రం చైనాని ఒక పట్టాన వదలడం లేదు. చైనా అమలు చేస్తున్న కఠినమైన జీరో కోవిడ్ పాలసీ విధానాన్ని బ్రేక్ చేస్తూ...కరోనా మహమ్మరి విజృంభిస్తూనే ఉంది. గత కొద్దివారాల నుంచి కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో చైనా యంత్రాంగం అందరికీ సాముహిక కరోనా టెస్టులు నిర్వహించింది. ఈ పరీక్షల్లో చైనాకి ఊహించని ఝలక్ ఇచ్చింది కరోనా. శుక్రవారం ఒక్క రోజులో చైనా రాజధాని బీజింగ్‌లో 61 కొత్త కేసులు నమోదవ్వగ... శనివారం నాటికల్లా బీజింగ్‌లో మరో 46 కొత్త కేసులు వెలుగు చూశాయని చైనా అధికారులు తెలిపారు. ఐతే ఇప్పటి వరకు మొత్తం 115 కేసులు వెలుగు చూశాయని చైనా తెలిపింది. పైగా ఈ బాధితులంతా బీజింగ్‌లోని ఒక బార్కి వెళ్లినట్లు సమాచారం. అంతేకాదు ఆ బార్కి వచ్చిన మరో 6,158కి పరీక్షలు నిర్వహించాల్సి ఉందని చైనా యంత్రాంగం పేర్కొంది. ఏదిఏమైనా చైనా ఆ కరోనా మహమ్మారితో సహజీవనం చేసేందుకు రెడీ అవ్వక తప్పదేమో అన్నట్లుగా ఉంది. మరోవైపు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వృద్ధులను, వైద్యా వ్యవస్థను రక్షించాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నప్పటికీ పట్టించుకోకుండా జీరో కోవిడ్ పాలసీ విధానాన్ని రెట్టింపు చేస్తానని చెప్పడం గమనార్హం. (చదవండి: ఉప్పెనల విరుచుకుపడుతున్న ఉక్రెయిన్ దళాలు... ఆవిరై పోతున్న రష్యా ఆశ) -
కరోనా కట్టడి.. జింగ్‌పిన్ తీవ్ర హెచ్చరికలు
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా.. ఒక్క చైనా మాత్రమే కరోనా కట్టడికి జీరో కొవిడ్ పాలసీని అనుసరిస్తోంది. అయితే.. ఆ అనుసరించే విధానం మరీ ఆరాచకంగా ఉండకపోవడమే సొంత పౌరుల నుంచే వ్యతిరేకతకు కారణం అవుతోంది. లాక్‌డౌన్‌తో నరకం అనుభవిస్తున్న వాళ్లు విజ్ఞప్తులు చేస్తున్నా.. కనికరించే ప్రసక్తే లేదంటున్నాడు చైనా అధ్యక్షుడు జింగ్‌పిన్. బలవంతపు లాక్డౌన్లను చైనా ప్రజలు భరించలేకపోతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లోనూ.. కొద్దిపాటి కేసులకే లాక్డౌన్, అదీ కఠినంగా విధించడం, సామూహిక కరోనా టెస్టుల పేరిట భౌతిక దాడులకు పాల్పడుతుండడం, ఐసోలేషన్ పేరిట జంతువుల కంటే హీనంగా మనుషులతో ప్రవర్తించడం లాంటి చేష్టలపై మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పైగా ఈ ఆగ్రహానికి తోడు ఆహార, మందుల కొరత వాళ్లను వేధిస్తోంది. షాంగై వాసుల లాక్డౌన్ కష్టాలే అందుకు నిదర్శనం. ఈ తరుణంలో.. లాక్డౌన్ పరిణామాలపై ప్రశ్నిస్తే కఠిన శిక్షలు అమలు చేయాలని చైనా అధ్యక్షుడు జింగ్‌పిన్ ఆదేశాలు జారీ చేశారు. గురువారం కమ్యూనిస్ట్ పార్టీ ‘సుప్రీం పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీ’ సమావేశం జరిగింది. తమ దేశంలో కరోనా కట్టడికి ఏ విధానాలైతే మేలు చేస్తాయో వాటిని, అవి ప్రజలను ఇబ్బంది పెట్టినా పర్వాలేదని.. అంతిమంగా డైనమిక్ జీరో కొవిడ్ పాలసీని ముందుకు తీసుకెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ ఏడాది కరోనా విజృంభణ పరిస్థితులు.. తీవ్ర విమర్శల నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జింగ్‌పిన్ తొలిసారి, అదీ ఒక కీలక సమావేశంలో ప్రసంగించడం విశేషం. ‘‘కఠిన నిర్ణయాలనేది సహజంగానే మన పార్టీతత్వం . కరోనా కట్టడికి తీసుకునే నిర్ణయాలు ప్రభావవంతంగా ఉంటున్నాయి. వుహాన్‌లో ఏ తరహాలో కరోనాపై పోరాడి గెల్చాం.. అలాగే షాంగైలోనూ గెలిచి తీరతాం. జీరో కొవిడ్ పాలసీని తప్పుబట్టే వాళ్లను, పార్టీ విధానాలను వ్యతిరేకించే వాళ్లను కఠినంగా శిక్షించండి. సోషల్ మీడియాలో అసత్యపు ప్రచారానికి పుల్‌స్టాప్ పెట్టించండి’’ అని జింగ్‌పిన్ ప్రసంగించినట్లు సీఎన్ఎన్ ఓ కథనం ప్రచురించింది. ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఇప్పటిదాకా రాజధాని బీజింగ్‌లో 500కు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఈ తరుణంలో.. ఎక్కడ షాంగై తరహా లాక్డౌన్ అమలు చేస్తారో అని హడలి పోతున్నారు అక్కడి ప్రజలు. చదవండి: చైనాలో కరోనా కట్టడి పేరిట వికృత చేష్టలు -
కీలక ఉత్తర్వులపై బైడెన్ సంతకం
వాషింగ్టన్: దేశ వలస విధానంలో సమూల మార్పులకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించి 3 కార్యనిర్వాహక ఉత్తర్వులపై బైడెన్ సంతకాలుచేశారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ వలసదారులపై అమలు చేసిన అత్యంత కఠిన నిబంధనల్ని వెనక్కి తీసుకున్నారు. తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని వేరు చేసే దుర్మార్గమైన విధానాల్ని ట్రంప్ అనుసరించారని వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు బైడెన్ చెప్పారు. డాలర్ డ్రీమ్స్ కలలు తీరేలా, ముస్లింలపై నిషేధం ఎత్తివేసి దేశ సరిహద్దుల్లో సక్రమం పర్యవేక్షణ జరిగేలా వలస విధానం ఉంటుందన్నారు. వచ్చే 180 రోజుల్లో∙ప్రభుత్వ సంస్థల చేసే సిఫారసుల మేరకు జరిగే మార్పుల వల్ల అమెరికా పౌరసత్వం కావాలనుకునే భారతీయుల కలలు నెరవేరే అవకాశాలున్నాయి. ఆ మూడు ఉత్తర్వులు ఇవే.. ! 1. ట్రంప్ హయాంలో చెట్టుకొకరు పుట్టకొకరుగా విడిపోయిన వలసదారుల కుటుంబాలను కలపడానికి హోంల్యాండ్ సెక్యూరిటీ మంత్రి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ మొదటి కార్యనిర్వాహక ఉత్తర్వుని జారీ చేశారు. విడిపోయిన తల్లిదండ్రుల్ని, పిల్లల్ని కలిపే కార్యక్రమాన్ని ఈ కమిటీ నిర్వహిస్తుంది. అమెరికా, మెక్సికో సరిహద్దుల్లో అక్రమ వలసల నివారణకు ట్రంప్ ప్రభుత్వం అనుసరించి, జీరో టాలరన్స్ విధానం వల్ల 5,500 కుటుంబాలు విడిపోయాయి. ఇప్పటికీ 600కిపైగా పిల్లల తల్లిదండ్రుల్ని గుర్తించలేకపోయారు. 2. అమెరికాకు వలసలు పోటెత్తడానికి గల కారణాలను తెలుసుకొని వాటిని నివారించడం, మానవతా దృక్ఫథంతో శరణార్థుల్ని అక్కున చేర్చుకునే విధంగా వ్యూహాన్ని రచించడమే లక్ష్యంగా రెండో కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఉత్తర మెక్సికోలో మానవీయ సంక్షోభానికి దారి తీసిన మైగ్రెంట్ ప్రొటెక్షన్ ప్రోటోకాల్ కార్యక్రమాన్ని రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని ఈ ఉత్తర్వుల్లో హోంల్యాండ్ సెక్యూరిటీని ఆదేశించారు. 3. ఇక మూడో కార్యనిర్వాహక ఉత్తర్వు స్వేచ్ఛాయుత చట్టబద్ధమైన విలస విధానానికి సంబంధించింది. ఇటీవల కాలంలో వలస విధానానికి సంబంధించిన నియంత్రణల్ని, విధానాలను ప్రభుత్వం సమూలంగా సమీక్షించడం కోసం మూడో ఉత్తర్వుపై సంతకం చేశారు. దేశంలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడానికి వీలు కల్పించే గ్రీన్ కార్డు రాకుండా అడ్డుకునే పబ్లిక్ చార్జ్ నిబంధనల్ని ప్రభుత్వం సమీక్షిస్తుంది. విదేశాల్లో జన్మించి అమెరికాలో ఉంటున్న వారు 40 లక్షల మందికిపైగా ఉన్నారు. వీరిలో భారతీయులే అధికం. ఈ కొత్త అమెరికన్లు అమెరికా ఆర్థిక వ్యవస్థకి ఊతంగా ఉంటారని భావిస్తున్న బైడెన్ వారి ప్రయోజనాల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ఈ ఉత్తర్వుల్ని తీసుకువచ్చారు. -
‘వాళ్లు నా గుండె చీల్చారు; కడుపుకోత మిగిల్చారు’
వాషింగ్టన్ : వలసదారులను నిలువరించే క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న జీరో టాలరెన్స్ విధానం ఎంతోమంది శరణార్థు జీవితాల్లో విషాదం నింపుతోంది. స్వదేశంలో పరిస్థితులు బాగోలేక అమెరికా వెళ్లి పొట్ట పోసుకోవాలని భావిస్తున్న వారి బతుకులను చీకటి చేస్తోంది. అమెరికా సరిహద్దుల్లో శరణార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కళ్లకు కట్టే ఫొటోలు ఎన్నెన్నో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమెరికా వెళ్లే క్రమంలో ఇటీవల మరణించిన రోమిరేజ్- అతడి కూతురు వాలేరియా(ఎల్ సాల్వేడార్) శవాల ఫొటో ప్రపంచం మొత్తాన్ని కన్నీరు పెట్టించింది. తాజాగా జీరో టాలరెన్స్ కారణంగా 19 నెలల చిన్నారిని కోల్పోయిన యజ్మిన్ జురేజ్ అనే మహిళ గాథ అమెరికా కాంగ్రెస్ సభ్యుల మనస్సులను సైతం కదిలించింది. తన నుంచి కూతురిని విడదీసి ఆమెను తనకు శాశ్వతంగా దూరం చేశారంటూ యజ్మిన్ ఆవేదన చెందిన తీరు వారి చేత కంటతడి పెట్టించింది. చదవండి : ‘వారి కళ్లల్లో భయం..మానవత్వానికే మచ్చ’ జీరో టాలరెన్స్ ప్రకారం అమెరికాలోకి అక్రమంగా చొరబడిన తల్లిదండ్రులతోపాటు ఉన్న పిల్లల్ని వేరుచేసి.. వేర్వేరు కేంద్రాల్లో ఉంచుతారు. ఎలాంటి సంరక్షణా లేకుండా తాత్కాలికంగా తయారుచేసిన కేజ్‌ల్లో ఐదారేళ్ల పసివారిని నిర్బంధిస్తున్నారంటూ అన్ని వర్గాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది. అదే విధంగా కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్(సీబీపీ) ఫోర్స్ చిన్నారుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో జీరో టాలరెన్స్ విధానంపై పునరాలోచిస్తామని ట్రంప్ సర్కారు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శరణార్థులు బుధవారం యాజ్మిన్ కాంగ్రెస్ సభ్యులు, మానవ హక్కుల కార్యకర్తల ఎదుట హాజరయ్యారు. చదవండి : ప్రపంచాన్ని కన్నీరు పెట్టిస్తున్న ఫొటో తనో చోట.. నేనో చోట ఈ సందర్భంగా యజ్మిన్ మాట్లాడుతూ...‘ గ్వాటెమాలాలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉండలేకపోయాను. అందుకే నా 19 నెలల కూతురితో కలిసి అమెరికా వచ్చి జీవనోపాధి పొందాలనుకున్నాను. ఈ క్రమంలో గతేడాది చివర్లో ఇక్కడికి వచ్చే క్రమంలో సరిహద్దులో భద్రతా బలగాలు నన్ను అరెస్టు చేశాయి. నా మారీ(కూతురు)ని నా నుంచి దూరం చేశాయి. అప్పటి నుంచి తనో చోట. నేనొక చోట. ఒకరోజు అకస్మాత్తుగా తన ఆరోగ్యం పాడైందని చెప్పి నన్ను తన దగ్గరికి తీసుకువెళ్లారు. ఆ తర్వాత తను ఉన్న కోల్డ్ ఫ్రీజర్‌లో తనతో పాటు నన్నూ బంధించారు. పాపను కాపాడమని అక్కడి డాక్టర్లను ఎంతగా వేడుకున్నానో. కానీ వాళ్లెవరూ కనికరించలేదు. వెంటనే అధికారుల దగ్గరికి పరిగెత్తుకు వెళ్లి విడిపించాలని ప్రాధేయపడ్డాను. ఎమర్జెన్సీ వార్డుకు వెళ్లేందుకు నాకు అనుమతినిచ్చారు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. నా మారీని ఇక అక్కడి నుంచి తీసుకురావాల్సిన అవసరం లేకుండా పోయింది. తను మెల్లమెల్లగా ప్రాణాలు కోల్పోవడం కళ్లారా చూశాను. వాళ్లు నా గుండెను చీల్చారు. కడుపుకోత మిగిల్చారు’ అని కన్నీళ్లతో తన గోడు వెళ్లబోసుకుంది. అగ్రరాజ్యం అమెరికాలో చిన్న పిల్లలు ప్రవర్తించే తీరు ప్రపంచం మొత్తానికి తెలియాలని.. అందుకే తన ఆవేదన పంచుకుంటున్నానని ఉద్వేగానికి లోనైంది. ఇప్పటికైనా ట్రంప్ మానవతా దృక్పథంతో ఆలోచిస్తే బాగుంటుందని అభిప్రాయపడింది. చదవండి : తాలిబన్లే నయం; సబ్బు, పరుపు ఇచ్చారు! అందుకే కఠినంగా ఉంటున్నాం ఈ క్రమంలో యజ్మిన్ మాటలు వింటున్న కాంగ్రెస్ సభ్యురాలు అలెగ్జాండ్రియా ఒకాసియో(29- అత్యంత పిన్న వయస్కురాలైన లా మేకర్) కార్టెజ్ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. యాజ్మిన్ను గుండెలకు హత్తుకుని కంటతడి పెట్టారు. ఆమె గాథ ఫెసిలిటీ సెంటర్లలో ఉంటున్న పిల్లల బాగోగులను సమీక్షించాల్సిన ఆవశ్యకతను వివరించిందన్నారు. మరోవైపు సరిహద్దులో వలసదారుల సంఖ్య రోజురోజుకీ పెరిగి పోతుండటంతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయని అమెరికా హోం లాండ్ విభాగం ప్రకటన విడుదల చేసింది. వారిని నిలువరించే క్రమంలో కఠినంగా వ్యవహరించాల్సి వస్తోందని పేర్కొంది. ఇలాంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నా.. మధ్య అమెరికా దేశాల్లో పెచ్చు మీరిన హింస, పేదరికం కారణంగా ఎంతో మంది పొట్ట చేత బట్టుకుని అమెరికా సరిహద్దుల్లో నేటికీ పడిగాపులు గాస్తూనే ఉండటం విచారించదగ్గ విషయం. -
తాలిబన్లే నయం; సబ్బు, పరుపు ఇచ్చారు!
వాషింగ్టన్ : తమ దేశంలోకి చొరబడుతున్న వలసదారుల్ని సరిహద్దుల్లోనే నిలువరించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ విధానం ప్రకారం అమెరికాలోకి అక్రమంగా చొరబడిన తల్లిదండ్రులతోపాటు ఉన్న పిల్లల్ని వేరుచేసి.. వేర్వేరు కేంద్రాల్లో ఉంచుతారు. ఎలాంటి సంరక్షణా లేకుండా తాత్కాలికంగా తయారుచేసిన కేజ్‌ల్లో ఐదారేళ్ల పసివారిని నిర్బంధిస్తున్నారంటూ అన్ని వర్గాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది. అదే విధంగా కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్(సీబీపీ) ఫోర్స్ చిన్నారుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వేలాది ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో జీరో టాలరెన్స్ విధానంపై పునరాలోచిస్తామని ట్రంప్ సర్కారు పేర్కొంది. ఫెసిలిటీ సెంటర్లలో ఉండే పిల్లలకు సురక్షితమైన, శుభ్రమైన వాతావరణం కల్పిస్తున్నామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అటార్నీ వాదనపై సీనియర్ జడ్జిలు ఘాటుగా స్పందించారు. ఒబామా హయాంలో దాఖలైన ఈ పిటిషన్ విచారణ సందర్భంగా..‘ టూత్‌బ్రష్, సబ్బు, బ్లాంకెట్ ఇలాంటి కనీస అవసరాలు తీరకుండానే పిల్లలు ఇబ్బందులు లేకుండా భద్రంగా ఉంటున్నారా’ అని ప్రశ్నలు సంధించారు. చిన్నారుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్జిల వ్యాఖ్యల నేపథ్యంలో జర్నలిస్టులు, సామాజిక వేత్తలు ట్రంప్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. చదవండి : ‘వారి కళ్లల్లో భయం..మానవత్వానికే మచ్చ’ తాలిబన్లే కాస్త మెరుగ్గా అనిపించారు..! ‘చిన్నారుల విషయంలో అమెరికా అనుసరిస్తున్న విధానాలు కిందిస్థాయిలో ఉన్నాయి. 2012లో ఉగ్రవాదులు నన్ను కిడ్నాప్ చేసిన సమయంలో ఇనుప కడ్డీలతో నిర్మించిన కేజ్‌లలో బంధించారు. కరెంటు కూడా ఉండేది కాదు. అయితే నా కనీస అవసరాలు తీర్చుకునేందుకు తాలిబన్లు సహకరించేవారు. టూత్‌బ్రష్, సబ్బులు ఇచ్చేవారు. రోజూ స్నానం చేసేందుకు అనుమతినిచ్చి.. మెత్తటి పరపులు ఇచ్చేవారు. భోజనం కూడా ఫర్వాలేదు. కానీ అమెరికాలో మాత్రం శరణార్థి చిన్నారుల పట్ల సరిహద్దు భద్రతా బలగాలు కనికరం లేకుండా వ్యవహరిస్తున్నాయి. ఇది నిజంగా దారుణం’ అంటూ సోమాలియాలో తాలిబన్ల చేతిలో అపహరణకు గురైన అమెరికా జర్నలిస్టు మైఖేల్ స్కాట్ మూరే తమ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. ఇక ఇరాన్ చట్టాలను ఉల్లంఘించి ఆ దేశంలోకి వచ్చారన్న కారణంగా అక్కడ అరెస్టైన రేజియాన్ అనే జర్నలిస్టు.. ‘ నాకు అక్కడ నిర్బంధంలో ఉన్నట్లుగా అనిపించలేదు. కానీ అమెరికాలో చిన్నారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వారిని కేవలం వస్తువులుగా చూస్తూ కనీసం మానవత్వం ప్రదర్శించకుండా క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి చర్యలు భవిష్యత్ తరాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. కనీస నైతిక విలువలు పాటించండి’ అని ప్రభుత్వ తీరును విమర్శించారు. కాగా జీరో టాలరెన్స్ విధానాన్ని అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌తో పాటు లారా బుష్ కూడా తప్పుబట్టిన సంగతి తెలిసిందే. -
‘వారి కళ్లల్లో భయం..మానవత్వానికే మచ్చ’
ఆమ్స్టర్డామ్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న ‘జీరో టాలరెన్స్’ విధానం కారణంగా పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలకు తార్కాణంగా నిలిచిన ఓ ‘చిన్నారి’ ఫొటోకు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. అమెరికా సరిహద్దుల్లో వలసదారుల పట్ల ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను కళ్లకు కట్టిన ఈ ఫొటోను తీసినందుకుగాను గెట్టీ ఫొటోగ్రాఫర్ జాన్ మూరే ‘వరల్డ్ ప్రెస్ ఫొటో అవార్డు’ సొంతం చేసుకున్నారు. తమ దేశంలోకి ప్రేవేశించకుండా వలసదారులను అడ్డుకునే క్రమంలో అమెరికా సరిహద్దు బలగాలు చిన్నా పెద్దా తేడా లేకుండా అందరిపై టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా వలసదారుల నుంచి తమ పిల్లలను వేరు చేస్తూ కేజ్‌లలో బంధిస్తున్నారనే కారణంగా ట్రంప్ సర్కారు అన్ని వర్గాల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో గతేడాది జూన్ 12 అర్ధరాత్రి.. హూండరస్ మహిళ సాండ్రా సన్‌చెజ్ తన కూతురు యెనేలాతో పాటు అమెరికాలో ప్రవేశించేందుకు ప్రయత్నించారు. దీంతో ఆమెను అడ్డుకున్న భద్రతా బలగాలు.. యెనేలాను ఆమె నుంచి వేరు చేసేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలో వారి మధ్య వివాదం తలెత్తగా భయపడిన యెనేలా బోరున ఏడ్వడం మొదలుపెట్టింది. ఈ సందర్భంలో అక్కడే ఉన్న ఫొటో జర్నలిస్టు జాన్ మూరే కెమెరాను క్లిక్‌మనిపించారు. తల్లికి దూరమవుతాననే భయంతో హృదయవిదారకంగా ఏడుస్తున్న యెనేలా ఫొటో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో గురువారం నాటి ప్రదానోత్సవంలో ఆయన అవార్డు దక్కించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ‘ సరిహద్దుల్లో బిక్కుబిక్కుమంటున్న శరణార్థుల కళ్లల్లో భయాన్ని నేను చూశాను. మానవత్వానికి మచ్చగా మారుతున్న వలస విధానాల కారణంగా చోటుచేసుకున్న హింస గురించి.. నా ఫొటో ద్వారా పాలకులకు ఓ కొత్త, విభిన్నమైన స్టోరీని చెప్పాలనుకున్నాను. ఇది కేవలం అమెరికాకు మాత్రమే పరిమితమైన అంశం కాదు. ప్రపంచవ్యాప్తంగా శరణార్థులు ఎదుర్కొంటున్న కష్టాలకు ఈ ఫొటో ఓ చిన్న ఉదాహరణ మాత్రమే’ అని తన అనుభవాలు పంచుకున్నారు. చదవండి : (నా పిల్లలు బతికి ఉంటే చాలు.. ఇంకేం వద్దు) కాగా ఈ ఫొటోతో పాటు అమెరికా సరిహద్దుల్లో చోటు చేసుకుంటున్న మరిన్ని ఫొటోలు కూడా ప్రపంచ వ్యాప్తంగా ప్రచురితం కాగా... ట్రంప్ సర్కారు తీవ్ర విమర్శల పాలైంది. అమెరికా సెక్యూరిటీ హోంలాండ్ విభాగం... ఆర్థిక వలసదారులకు మాత్రమే తమ దేశం వ్యతిరేకమని, ఇక మనుషుల అక్రమ రవాణా కారణంగానే సరిహద్దుల్లో పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరుచేస్తున్నామే తప్ప వేరే ఉద్దేశం ఏమీలేదని వివరణ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ‘జీరో టాలరెన్స్’ విధానంలో ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకునేందుకు ఇటువంటి ఫొటోలు ఎంతగానో ఉపయోగపడతాయని జాన్ మూరేకు అవార్డు అందచేసిన న్యాయ నిర్ణేతలు పేర్కొన్నారు. మొత్తం 4, 738 ఫొటోగ్రాఫర్లు పంపిన 78, 801 ఫొటోల్లో యెనేలా ఫొటోను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. చదవండి : ఆ ఫొటో వాడిదే.. అవును నా మేనల్లుడిదే!! ఇక ఏదైనా ఒక సమస్యపై ప్రపంచవ్యాప్తంగా చర్చను లేవనెత్తడంలో ఫొటోలు ప్రముఖ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. సరిగ్గా మూడేళ్ల క్రితం.. యూరప్‌నకు వలస వెళ్లే క్రమంలో జరిగిన పడవ ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకొని... టర్కీ బీచ్‌లోకి కొట్టుకు వచ్చిన మూడేళ్ల చిన్నారి అలన్ కుర్దీ ఫొటో చూసి ప్రపంచమంతా కన్నీరు పెట్టింది. నిరంతరం బాంబుల వర్షంతో అల్లకల్లోలంగా మారిన సిరియాలో బతుకు ఎంత దుర్భరంగా ఉంటుందో, ఆ సమస్యకు పరిష్కారం కనుగొనాల్సిన ఆవశ్యకతను వివరించింది. -
‘జూలో ఉండే జంతువు ఎవరో కాదు.. ఈ జూనియరే’
వాషింగ్టన్ : శరణార్థులుగా అమెరికాకు వచ్చే వారిని జంతువులతో పోలుస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ జాత్యహంకారం ప్రదర్శించారు. జీరో టాలరెన్స్ పేరిట శరణార్థులు, వారి పిల్లలను వేరు చేస్తూ డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే విమర్శల పాలవుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు వలసవాదులను అడ్డుకునేందుకు మెక్సికో సరిహద్దులో గోడ నిర్మించేందుకు ట్రంప్ అడిగిన (500 కోట్ల డాలర్ల) డబ్బుపై ఏ నిర్ణయమూ తీసుకోకుండానే కాంగ్రెస్ వాయిదా పడింది కూడా. ఈ క్రమంలో మెక్సికో గోడ నిర్మాణం ఆవశ్యకతను వివరిస్తూ.. ‘ జూలో ఓరోజు మొత్తం ఎందుకు ఎంజాయ్ చేస్తారో తెలుసా. అక్కడ గోడలు ఉంటాయి కాబట్టి’ అని ట్రంప్ జూనియర్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చారు.(‘నా పిల్లలు బతికి ఉంటే చాలు.. ఇంకేం వద్దు’) కాగా జంతువుల బారి నుంచి ప్రజలను కాపాడాలంటే గోడ కట్టక తప్పదు కదా అనే అర్థం వచ్చేలా ఉన్న జూనియర్ రాతలపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ‘జాతి అహంకారానికి ఇది నిదర్శనం’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ‘జూలో ఉండే జంతువు మరెవరో కాదు ఈ జూనియరే’ అంటూ మరొకరు ఘాటుగా స్పందించారు. గతంలో కూడా ఇదే రీతిలో సిరియా శరణార్థులపై జూనియర్ జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడు. ఇక ఇటీవలే ఆయన తండ్రి ట్రంప్ కూడా వలసవాదుల గురించి ప్రస్తావిస్తూ.. ‘వీళ్లంతా చాలా చెత్త మనుషులు. అయినా వీళ్లని మనుషులు అనకూడదు. జంతువులు అనాలి’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
బాడీ షేమింగ్
‘బోండాం’ అనడం బాడీ షేమింగ్. ‘బక్క పీనుగ’ అనడమూ బాడీ షేమింగే. స్త్రీని పురుషుడు చేసే బాడీ షేమింగ్ అయితే ఇంకా రకరకాలుగా ఉంటుంది. బాడీ షేమింగ్ అని అతడికి తెలియకపోవచ్చు. ఆమెకు తెలుస్తుంది. హర్ట్ అవుతుంది. ఏ విధంగానైనా స్త్రీని బాడీ షేమింగ్ చెయ్యడం అంటే ప్రకృతి ధర్మాన్నే అవమానించడమే. స్త్రీ దేహధర్మాలు, స్త్రీ దేహ స్వభావాలు విలక్షణమైనవి. ఆ విలక్షణతల కారణంగా కొన్ని విభిన్నతలకూ ఆమె దేహం లోనవుతూ ఉండొచ్చు. ఆ విభిన్నతలను ఎత్తిచూపుతూ ఒక మాట అనడం అంటే.. జన్మనిచ్చే జెండర్‌ను కించపరచడమే. వసుంధరారాజే (65) సీనియర్ లీడర్. రాజస్తాన్ తొలి మహిళా ముఖ్యమంత్రి. మళ్లీ కనుక ఆమె ముఖ్యమంత్రి అయితే హ్యాట్రిక్ అవుతుంది. మూడోసారి ముఖ్యమంత్రి కాకుండా ఆమెను అడ్డుకోవాలంటే ఆమె ప్రభుత్వంలోని బలహీనతలేవో ఎత్తి చూపాలి. చేస్తానని చెయ్యని పనులేవైనా ఉంటే వాటిని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి. అయితే శరద్ యాదవ్, వసుంధరా రాజే ‘ఒంటిని’ ప్రజల దృష్టికి తీసుకెళ్లారు! ఆయన కూడా సీనియర్ లీడరే. 73 ఏళ్లు. ‘ఏళ్లొచ్చాయ్ ఎందుకు?’ అనిపిస్తుంది రాజేను ఆయన చేసిన కామెంట్‌ని వింటే! వినే ఉంటారు. ‘‘వసుంధర కో ఆరామ్ దో. బహుత్ థక్ గయీ హై. మోటీ హో గయీ హై’’ అన్నారు. పోలింగ్‌కి ముందురోజు ప్రత్యర్థిపై ఆయన సంధించిన చివరి అస్త్రం అది! ‘‘వసుంధరకు విశ్రాంతి ఇవ్వండి. మనిషి బాగా లాౖÐð పోయి ఆయాస పడుతోంది’’ అని. స్త్రీని సవ్యంగా ఎదుర్కోలేకపోయినప్పుడే పురుషుడు ఇలా ఉక్రోషంతో ఆమె ఒంటి పైకి నోటిని ప్రయోగిస్తాడు. వాస్తవానికి శరద్, రాజే సమీప ప్రత్యర్థి ఏమీ కాదు. అయన్ది రాజస్తాన్ కూడా కాదు. ఎన్నికల ప్రచారం కోసం బిహార్ నుంచి వచ్చారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్‌తో పడక, గతేడాది జేడీయూ నుంచి బయటికి వచ్చి, ఈ ఏడాది మే నెలలో సొంతంగా ‘లోక్తాంత్రిక్ జనతాదళ్’ పార్టీ పెట్టుకుని రాజస్తాన్ ఎన్నికల్లో రాజేకి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి వచ్చారు. ఆ సందర్భంగానే శరద్, రాజే ఒంటిపై కామెంట్ చేశారు. దీనికి ఆయన ఇచ్చిన వివరణ కూడా ఆయన స్థాయికి తగినట్లుగా లేదు. ఏడుసార్లు ఎంపీగా, మూడుసార్లు క్యాబినెట్ మినిస్టర్‌గా చేసిన శరద్ యాదవ్.. ‘ఊరికే జోక్ చేశాను’ అన్నారు! ‘‘ఆమెను హర్ట్ చెయ్యాలని నా ఉద్దేశం కాదు. తనతో నాకు పాత పరిచయం ఉంది. ఆమెను కలిసినప్పుడు కూడా నేనిదే చెప్పాను.. మీరు లావౌతున్నారని’’ అన్నారు. శుక్రవారం జలావర్‌లోని ‘మహిళా పోలింగ్ బూత్’ నుంచి ఓటేసి వస్తూ.. ‘‘అతడి కామెంట్‌పై నేను ఎలక్షన్ కమిషన్‌కి ఫిర్యాదు చేయబోతున్నాను’’ అని రాజే మీడియా ప్రతినిధులతో అనగానే.. శనివారం ఆమెకు క్షమాపణలు చెబుతూ శరద్ ఒక ప్రకటన విడుదల చేశారు. స్మృతి ఇరానీ (శరద్ యాదవ్) శరద్ యాదవ్ ఇలా మహిళల్ని కించపరుస్తూ, ‘బాడీ షేమింగ్’ (ఒంటి సైజు, ఒంటి షేప్, ఒంటి రంగును అవమానించడం) చెయ్యడం ఇదే మొదటి సారి కాదు. మూడేళ్ల క్రితం స్మృతి ఇరానీని ఇలాగే పార్లమెంటులో.. ‘నువ్వేంటో నాకు తెలుసు’ అన్నారు. గత ఏడాది విచిత్రంగా ఓటుకు, ఆడపిల్లలకు ముడిపెట్టి మాట్లాడారు. ఆడపిల్ల పరువు కన్నా ఓటు పరువు ముఖ్యమట. ‘‘ఆడపిల్ల అమ్ముడుపోతే ఇంటి పరువు, ఊరి పరువు మాత్రమే పోతాయి. ఓటు అమ్ముడు పోతే దేశం పరువే పోతుంది’’ అన్నారు. ఏంటో దానర్థం! ‘నువ్వేంటో నాకు తెలుసు’ అని స్మృతి ఇరానీని అన్న మాటల్లోని పరమార్థం ఏమిటో కూడా ఆయనకే తెలియాలి. రాజ్యసభలో ఇన్సూరెన్స్ బిల్లుపై చర్చ జరుగుతున్నప్పుడు డిబేట్ ఎటు నుంచి ఎటో వెళ్లిపోయి, ‘‘ఇండియాలో అందరికీ తెల్లగా ఉండే అమ్మాయిలే కావాలి. నల్ల అమ్మాయిలను ఎవరూ వధువుగా కోరుకోరు. దక్షిణాది మహిళలంతా నల్లగా ఉంటారు. అయినప్పటికీ వారిలో మెరుపు కనిపిస్తుంది..’’ అని యాదవ్ అన్నారు. అక్కడితో ఊరుకోకుండా ఇంకా వివరణ ఇవ్వబోతుంటే.. మంత్రి స్మృతి ఇరానీ డిప్యూటీ చైర్మన్ వైపు చూస్తూ ‘ఇక ఆపమనండీ’ అని అభ్యర్థించారు. దానికి యాదవ్ అసహనంతో.. ‘ఐ నో వాట్ యు ఆర్’ అని స్మృతిపై మండిపడ్డారు. రేణుకా చౌదరి (వెంకయ్య నాయుడు) ఈ ఏడాది మార్చిలో రాజ్యసభ సభ్యత్వపు పదవీకాలం పూర్తి చేసుకున్నవారిలో రేణుకా చౌదరి ఒకరు. ఆ వీడ్కోలు సభలో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు, రేణుకా చౌదరికి మధ్య జరిగిన సంభాషణలోనూ రేణుక బాడీషేమింగ్‌కి గురయ్యారు. అయితే వారిద్దరి మధ్య ఉన్న చిరకాల పరిచయం కారణంగా అది కేవలం ఉల్లాసభరితమైన వాగ్వాదంగా మాత్రమే మిగిలిపోయింది. బరువు టాపిక్ తెచ్చింది మొదట రేణుకే. తన వీడ్కోలు ప్రసంగంలో ఆమె వెంకయ్యనాయుడును ఉద్దేశించి.. ‘సర్.. నా వెయిట్ గురించి అంతా వర్రీ అవుతున్నారు. కానీ ఇది మన వెయిట్ ఏంటో చూపించాల్సిన జాబ్ కదా’’ అన్నారు. అందుకు వెంకయ్యనాయుడు.. ‘‘మీరు వెయిట్ తగ్గండి. మీ పార్టీ వెయిట్ పెంచండి’’ అని సలహా ఇచ్చా రు. ఆ మాటకు రేణుక హాయిగా నవ్వేస్తూ.. ‘మా పార్టీ వెయిట్‌కి వచ్చిన నష్టం ఏమీ లేదు సర్. ఇటీస్ ఫైన్’ అన్నారు. అప్పటికే నాయుడు ఉపరాష్ట్రపతి. రేణుక గానీ, ఇతర మహిళలు కానీ పాయింట్ అవుట్ చెయ్యకపోవడంతో అది పెద్ద ఇష్యూ కాలేదు. షేక్ హసీనా (నరేంద్ర మోదీ) గత ఏడాది ఏప్రిల్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను ప్రశంసల్లో ముంచెత్తారు. ‘ఆడమనిషై ఉండీ టెర్రరిజాన్ని జీరో టాలరెన్స్ (ఏమాత్రం సహించకపోవడం)తో నియంత్రిస్తోంది’ అని ఆయన అన్నారు. ‘ఆడ మనిషై ఉండీ’ అనడంలో మెచ్చుకోలు ఉన్నప్పటికీ.. ‘కంపారిటివ్లీ బలహీనమైన’ అనే అర్థం ధ్వనిస్తుండడంతో ఆయనపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ఇందులో బాడీ షేమింగ్ ఎక్కడున్నట్లు? ఉంది. ‘ఆడపిల్ల నయం కదా, ధైర్యంగా పోరాడింది’ అంటే.. అంతర్లీనంగా ఆమె బలహీనత స్ఫురిస్తుంది కదా. బలహీనమైన బాడీ అనడం షేమింగ్ కాక మరేమిటి?! మహిళల మీద (అబూ అజ్మీ) ఐదేళ్ల క్రితం సమాజ్‌వాది పార్టీ నాయకుడు అబూ అజ్మీ ఒక కామెంట్ చేశాడు. ఆడవాళ్లను స్వేచ్ఛగా వదిలిపెడితే దోపిడికీ గురవుతారట. ఎందుకనంటే.. ‘‘వాళ్లు బంగారంలా విలువైనవారు. బాహాటంగా పెడితే ఆ బంగారాన్ని దోచుకునిపోతారు’’ అని ఆయన ఆందోళన. అందుకే ఆడవాళ్లు.. తోడు లేకుండా బయట తిరగకూడదు. చీకటైతే అసలు బయటికి రాకూడదు అని కూడా అన్నారు అజ్మీ. ఇదొక రకం బాడీ షేమింగ్. తమని తాము కాపాడుకోలేని దేహాలు అని చెప్పడమేగా! చివరికి ఆయన మాటలకు ఆయన కోడలు (కొడుకు ఫర్హాన్ భార్య) అయేషా టాకియా సోషల్ మీడియాలోకి వచ్చి క్షమాపణ చెప్పారు. ‘‘మా మామగారు అలా అని ఉండాల్సింది కాదు’’ అని. భార్యల మీద (శ్రీ ప్రకాశ్ జైస్వాల్) శ్రీ ప్రకాశ్ జైస్వాల్ అయితే ఏకంగా యావత్ద్దేశంలోని భార్యలనే బాడీ షేమింగ్ చేశారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ, మంత్రి ఆయన. 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. అంతకు రెండేళ్ల క్రితం కాన్పూర్‌లోని ఒక మహిళా కాలేజ్‌లో ప్రసంగిస్తూ... ‘‘ఈ భార్యలున్నారే.. ముసలివాళ్లయిపోతారు. అప్పుడు వాళ్ల మీద ఏ ఆకర్షణా కలగదు’’ అన్నారు. ఎంత ఘోరమైన బాడీ షేమింగ్! పెద్ద చదువులుండి, పెద్ద హోదాలుండీ.. ఎందుకీ పెద్దవాళ్లు ఇలా చిన్న మాటలు మాట్లాడతారు? ఒక్క రాజకీయ నాయకులనే కాదు, ఏ రంగంలోని పురుషులైనా.. స్త్రీలను అవమానించడానికి, వ్యంగ్యంగా మాట్లాడటానికి వారి దేహాలను టార్గెట్ చెయ్యడం సంస్కారమేనా? బలవంతుణ్ని అనుకుంటాడు కదా మగవాడు! స్త్రీని బాడీ షేమింగ్ చెయ్యడమేనా అతడి బలం?! ప్రియాంకా చోప్రా (రాజ్‌నాథ్ సింగ్) కొన్ని కామెంట్లు పైకి బాడీ షేమింగ్‌గా అనిపించవు కానీ, లోతుగా చూస్తే వాటిల్లోనూ బాడీ షేమింగ్ కనిపిస్తుంది. 2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్‌గా ఎన్నికైనప్పుడు రాజ్‌నాథ్‌సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో తల్లిదండ్రుల ఉద్యోగాల రీత్యా ప్రియాంక లక్నోలో ఉంటోంది. సీఎం స్థాయిలో ఉండి ఆయన ప్రియాంకను ప్రశంసించాల్సింది పోయి, ‘ఈ అందాలపోటీలను బ్యాన్ చెయ్యాలి. మన సంస్కృతిని ఇవి దిగజారుస్తున్నాయి’ అన్నారు. ఆయన ఉద్దేశం.. ఆడపిల్లలు వేదికలెక్కి ఒళ్లు చూపిస్తున్నారని! బ్యూటీ షేమింగ్‌లా కనిపించే బాడీ షేమింగ్ ఇది. -
‘నా పిల్లలు బతికి ఉంటే చాలు.. ఇంకేం వద్దు’
వాషింగ్టన్ : అమెరికా- మెక్సికో సరిహద్దుల్లో మరోసారి అలజడి చెలరేగుతోంది. మధ్య అమెరికాకు చెందిన శరణార్థులు తమ దేశంలోకి రాకుండా అడ్డుకునేందుకు యూఎస్ సరిహద్దు భద్రతా బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పిల్లలపై కూడా భాష్పవాయువు ప్రయోగించడంతో వారు సొమ్మసిల్లి పడిపోతున్నారు. ఈ క్రమంలో వలసదారుల్ని వెనక్కి పంపించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న ‘జీరో టాలరెన్స్’ విధానం మరోసారి చర్చనీయాంశమైంది. ఈ ఫొటోలు ఇంటర్నెట్ను కుదిపేస్తున్నాయి... తమను నిలువరించేందుకు సరిహద్దు అధికారులు ప్రయోగిస్తున్న టియర్ గ్యాస్ నుంచి తమతో పాటు పిల్లల్ని రక్షించుకోవడం శరణార్థులకు కష్టంగా మారింది. ఈ క్రమంలో వాళ్లు పడుతున్న అవస్థలకు సంబంధించిన ఫొటోలు బయటికి రావడంతో అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం(డీహెచ్ఎస్) మరోసారి విమర్శల పాలవుతోంది. ముఖ్యంగా మారియా మెజా అనే మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి శరణార్థుల శిబిరంవైపునకు పరిగెత్తుతున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నాలాంటి వాళ్లు ఇంకెందరో... ‘హోండురస్‌లో పరిస్థితులు అస్సలు బాగోలేవు. అందుకే నా ఐదుగురు పిల్లలను తీసుకుని మెక్సికో సరిహద్దులోని తిజువానా పట్టణంలో ఓ వారం పాటు బస చేశాను. ఆ తర్వాత అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నాను. ఈ క్రమంలోనే మెక్సికో సరిహద్దులకు చేరుకున్నాను. దీంతో మెక్సికో పోలీసులు మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం మాత్రమే చేశారు. కానీ అమెరికా భద్రతా సిబ్బంది మాత్రం ఒక్కసారిగా టియర్ గ్యాస్ ప్రయోగించడం మొదలుపెట్టారు. దీంతో సరిహద్దుల్లో ఉన్న వాళ్లంతా చెల్లాచెదురయ్యారు. టియర్ గ్యాస్ ప్రభావంతో నా కుమారుడు సొమ్మసిల్లి పడిపోయాడు. వాడితో పాటు నా కూతుళ్ల పరిస్థితి కూడా ఏమంత బాగాలేదు. ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాలేదు. చచ్చిపోతామేమోనని భయం వేసింది. వెంటనే తేరుకుని అందరినీ పొదిమి పట్టుకుని శరణార్థుల శిబిరంవైపునకు పరిగెత్తాను. అయితే ఒక విషయం... ఒకవేళ అమెరికాలో మా లాంటి శరణార్థులకు ఆశ్రయం లేదని తెలిస్తే ఇటువైపుగా వచ్చేవాళ్లమే కాదు. వాళ్లు మమ్మల్ని జంతువుల కన్నా హీనంగా చూశారు. పిల్లలనే జాలి కూడా లేదు వాళ్లకు. నిజంగా దేవుడు అనే వాడు ఒకడుంటే ఇక్కడ కాకపోతే మరోచోట ఆశ్రయం దొరుకుతుంది. ఎక్కడున్నా సరే నా పిల్లలు బతికి ఉంటే చాలు.. నాకు ఇంకేం అక్కర్లేదు’ అని మధ్య అమెరికా దేశం హోండరస్‌కు చెందిన మహిళ మెజా తన భయానక అనుభవాలు వెల్లడించారు. మెజా ప్రస్తుతం తన ఐదుగురు పిల్లలతో కలిసి మెక్సికోలోని తిజువానా పట్టణంలోని శరణార్థుల శిబిరంలో ఆశ్రయం పొందుతున్నారు. (అమెరికా వెళ్తే అంతే మరి..) వాళ్లని వెనక్కి పంపివేయాల్సిందే : ట్రంప్ వివిధ దేశాలకు చెందిన సుమారు 5,200 మంది ప్రజలు మెక్సికో సరిహద్దు గుండా అమెరికాలోకి ప్రవేశించడానికి ప్రయత్నించడంతో అమెరికా సరిహద్దు విభాగం అధికారులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో వీరంతా తిజువానాలో ఏర్పాటు చేసిన తాత్కాలిక గుడారాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ విషయంపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసదారులందరినీ తమ తమ దేశాలకు పంపివేయాలంటూ మెక్సికో ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వారు శరణార్థులు కారని, అమెరికాలో అక్రమంగా చొరబడి ఆర్థికంగా లబ్ది పొందాలని చూస్తున్న ఆశావాదులని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారిని అమెరికా ఎప్పుడూ కేవలం ఆర్థిక వలసదారులుగా మాత్రమే పరిగణిస్తుందని.. శరణార్థులుగా గుర్తించదని ఉద్ఘాటించారు. అంతేకాకుండా వలసదారులపై తమ అధికారులు టియర్ గ్యాస్ ప్రయోగించారన్న వార్తల్ని కొట్టిపారేశారు. హోండురస్‌లోని పరిస్థితులను తమ దేశానికి ఆపాదిస్తూ కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. (జీరో టాలరెన్స్... అమెరికా వివరణ) కాగా, ట్రంప్ వ్యాఖ్యలపై అమెరికా చట్టసభ ప్రతినిధులు, మానవ హక్కుల నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరిహద్దుల్లో చోటుచేసుకుంటున్న హింసకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఆయనకు కనపడటం లేదా అని మండిపడుతున్నారు. (జీరో టాలరెన్స్‌కి భారతీయులూ బలి) -
క్రిమినల్స్ లాగా చూస్తున్నారు.. 24 గంటలూ సంకెళ్లే...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ’జీరో టాలరెన్స్ పాలసీ’లో భాగంగా అరెగాన్ రాష్ట్రంలోకి అక్రమంగా అడుగుపెట్టిన 123 మందిని అరెస్ట్‌చేసి అమానవీయ పరిస్థితుల్లో జైల్లో పెట్టిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. వీరిలో 52 మంది భారతీయులు, వారిలోనూ 18, 20,22 ఏళ్ల మధ్యలో ఉన్న సిక్కు యువకులు మెజారిటీ సంఖ్యలో ఉన్నారు . అరెగాన్లోని షెరిడాన్ ఫెడరల్ జైలులో వీరిని క్రిమిన ల్స్‌గా చూస్తున్నారని, 24 గంటల పాటు సంకెళ్లలోనే ఉంచడంతో పాటు వారి తలపాగాలు కూడా లాగిపారేసి జంతువులుగా చూస్తూ తీవ్ర అవమానాల పాలు చేస్తున్నట్టు బయటపడింది. అమెరికాలో ఆశ్రయం కోసం వచ్చి కొన్ని వారాలుగా జైలుశిక్షను అనుభవిస్తున్న వారికి న్యాయపరమైన సలహాలు,సూచనలిచ్చేందుకు వెళ్లిన స్వచ్చందసంస్థల ప్రతినిధుల ద్వారా ఈ వ్యవహారం వెలుగు చూసింది. అరెగాన్లో కమ్యూనిటీ కాలేజీ ప్రొఫెసర్‌గా ఉన్న నవనీత్‌కౌర్ ’పంజాబీ ట్రాన్స్‌లేటర్’గా 52 మంది భారతీయులతో మాట్లాడారు. అమెరికా చట్టప్రకారం శరణార్ధిగా పరిగణించే లేదా ప్రవాసం కోరుకునే వారిని అమానవీయంగా చూడడం సరికాదంటున్నారామే. భారతీయులను అరెస్ట్ చేసి 24 గంటలు సంకెళ్లతోనే ఉంచారని, రోజుకు 22 గంటలు తమ భాష తెలియని వారితో కలిసి జైలుగదిలో ఉంచడం ఏమాత్రం మానవత్వం అనిపించుకోదన్నారు. ఎవరైన తమ తమ మత విశ్వాసాలను కొనసాగించే హక్కున్న అమెరికా వంటి దేశంలో సిక్కుల తలపాగలను లాగిపారేసి అవమానించడం గర్హనీయమని ఆమె పేర్కొన్నారు. వీరికి న్యాయసహాయం అందించేందుకు అధికారులకు దరఖాస్తు చేయడంతో పాటు, ఆశ్రయం కోరుతున్న భారతీయులందరికీ సహాయపడేందుకు ’ద ఇన్నోవేషన్ లా లాబ్’ ముందుకొచ్చింది. తమ దేశంలో రాజకీయంగా, మతపరంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, తమ ›ప్రాణాలకు రక్షణ లేదని అమెరికాలో ఆశ్రయం కోసం వీరంతా మొరపెట్టుకున్నట్టు తెలుస్తోంది. అరెగాన్ జైలులో ఉన్న వారిని ఇటీవల సాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ కార్యాలయ అధికారులు కలుసుకుని వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. ఇంతటి అమానవీయ పరిస్థితులను ఎదుర్కుంటున్నా ఈ శిక్ష అనుభిస్తున్న వారెవరూ కూడా భారత్‌కు తిరిగివెళ్లేందుకు సంసిద్ధంగా లేరని నవనీత్‌కౌర్‌తో పాటు ఇనో్నవేషన్ లాబ్ డైవలప్మెంట్ డైరెక్టర్ విక్టోరియా బెజరానో మ్యూర్‌హెడ్ చెబుతున్నారు. -
మనం ట్రంప్ కన్నా తక్కువ తిన్నామా!
సాక్షి, న్యూఢిల్లీ : ఎదురుగా ఎత్తయిన పది అడుగుల గోడ. గోడ మీద ఎర్రటి రంగుతో హృదయాకారం. గోడ అంచు మీద ఇనుప కంచె. ఎవరికైనా అది జైలు కాబోలని అనిపిస్తుంది. నిజంగా అక్కడి జీవితం జైలే. ఎవరు పారిపోకుండానే ఆ గోడకు అంత ఎత్తున ఆ ఇనుప కంచె. అయితే దాన్ని జైలు అని పిలవరు. షెల్టర్ అని లేదా శిబిరం అని పిలుస్తారు. ఆ గోడ వెలుపలి నుంచి అప్పుడప్పుడు అటుగా పోతున్నవారి నవ్వులు, అమ్మాయిల అరుపులు వినిపిస్తుంటాయి. అమ్మాయిల అరుపులు వినిపించినప్పుడల్లా వారేమి మాట్లాడుకుంటున్నారో వినేందుకేమో గోడకు ఇటువైపున్న అమ్మాయిలు మౌనంగా ఉంటారు. గోడ లోపలున్న ఈ అమ్మాయిలంతా బంగ్లాదేశీయులు. వారంతా సరైన డాక్యుమెంట్లు లేకుండా సరిహద్దులు దాటి భారత దేశానికి వచ్చి భద్రతా దళాల చేతుల్లో అరెస్ట్ అయిన వారే. వారిలో ఆరేళ్లప్పుడు ఈ శిబిరానికి వచ్చి పెళ్లీడు వచ్చినా ఇప్పటికీ శిబిరంలోనే తలదాచుకుంటున్న వారూ ఉన్నారు. వారి తల్లిదండ్రులను బంగ్లాదేశ్ అధికారులు గుర్తించి వారిని తీసుకెళ్లే వరకు ఆ అమ్మాయిలకు ఈ నిర్బంధ జీవితం తప్పదు. వారిలో కొందరిది మరింత దౌర్భాగ్య పరిస్థితి. తల్లిదండ్రులో, తల్లో లేదా తండ్రో భారత దేశంలోనే ఎక్కడో, ఏదో జైలులో మగ్గుతూ ఉంటారు. ఒకరినొకరు చూసుకునే అవకాశమే ఉండదు. వారికి ఆశ్రయం కల్పిస్తున్న ఈ షెల్టర్ పేరు ‘స్నేహ’. శాన్లాప్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ శిబిరాన్ని నిర్వహిస్తోంది. ఇలాంటి షెల్టర్లు పశ్చిమ బెంగాల్లో మగ పిల్లలకు వేరుగా, ఆడ పిల్లలకు వేరుగా 80 షెల్టర్లు ఉన్నాయి. బంగ్లాదేశ్ నుంచి వీసా, పాస్‌పోర్టు లాంటి సరైన డాక్యుమెంట్లు లేకుండా సరిహద్దులు దాటి భారత్‌కు వచ్చిన లేదా వచ్చి భారత్‌లో రహస్యంగా స్థిరపడిన బంగ్లాదేశీయులను భారత్ అధికారులు అరెస్ట్ చేశారు. వారికి 1946, విదేశీయుల చట్టంలోని సెక్షన్ 14 ఏ కింద రెండేళ్లు నుంచి గరిష్టంగా ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధిస్తారు. వారిలో ఆరేళ్ల పైబడిన పిల్లలుంటే వారిని శిశు సంక్షేమ కమిటీ ముందుకు, జువెనైల్ జస్టిస్ బోర్డుకు పంపుతారు. అక్కడ వారికి ఎలాంటి శిక్షలు విధించరుగని ప్రభుత్వ, స్వచ్ఛంద వసతి గృహాలకు పంపిస్తారు. సరైన డాక్యుమెంట్లతో వారి తల్లిదండ్రులు లేదా బంగ్లాదేశ్ అధికారులు వచ్చే వరకు ఆ పిల్లలకు శిబిరాల్లో నిర్బంధం తప్పదు. ఇక అక్రమంగా వచ్చి జైలు శిక్ష పడిన పెద్దవాళ్లను వారి శిక్ష పూర్తయినప్పటికీ విడుదల చేయరు. కాకపోతే జైళ్లలో ఉన్నవారిని షెల్టర్లలోకి మారుస్తారు. ఇలాంటి షెల్టర్లు ప్రభుత్వం ఆధీనంలోను ఉన్నాయి. స్వచ్చంద సంస్థల ఆధీనంలోనూ ఉన్నాయి. బంగ్లాదేశ్ అధికారులు వచ్చి వారిని తీసుకెళ్లాలి. అందుకు ముందుగా వారు వారిని తమ దేశ పౌరులుగా అంగీకరించాలి. అప్పుడే వారికి జైలు నుంచి, దేశం నుంచి విముక్తి లభిస్తుంది. బంగ్లాదేశ్ అధికారులు రాకపోయినా, వచ్చి వారు తమ దేశీయులు కాదన్నా వారు జీవితాంతం జైల్లో మగ్గిపోవాల్సిందే. గతంలో వారు తమ దేశీయులు కాదన్న ఉదంతాలు కూడా ఉన్నాయి. పిల్లలతో అక్రమంగా వలసవచ్చి అరెస్టై, ఒకరినొకరు చూసుకోకుండా పిల్లలు, తల్లిదండ్రులు వేర్వేరుగా శిక్ష అనుభవించిన, అనుభవిస్తున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ‘మహానిర్మాణ్ కోల్‌కతా రీసర్చ్ గ్రూప్’నకు చెందిన సుచరిత సేన్ గుప్తా అలాంటి వారిపై 2015లో ఓ అధ్యయనం జరిపారు. రాజకీయ సంక్షోభం కారణంగా బంగ్లాదేశ్ వదిలిపెట్టి ఓ కొడుకు, కూతురుతో భారత్‌కు వచ్చిన బహదూరిబాలా అనే 40 ఏళ్ల యువతికి భారత్‌లో ఏడేళ్లు జైలు శిక్ష పడింది. ఆమెను బెహ్రాంపూర్‌లోని సెంట్రల్ కరెక్షనల్ హోమ్‌కు పంపించగా, ఇద్దరు పిల్లలను జువెనైల్ హోమ్స్‌కు పంపించారు. ఆమె నాలుగేళ్ల వరకు తన పిల్లలనే చూడలేదట. ఓ న్యాయవాది కారణంగా వారిని చూడ గలిగింది. ఈ విషయాలు సుచరిత సేన్ గుప్తా అధ్యయనంతో వెలుగులోకి వచ్చాయి. మెక్సికో నుంచి అమెరికాకు అక్రమంగా వలసవచ్చిన ప్రజల నుంచి రెండు వేల మంది పిల్లలను అన్యాయంగా వేరు చేశారంటూ ఇటీవల ప్రపంచమంతా గళమెత్తి ఘోషించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను దుమ్మెత్తి పోసింది. అందులో భారత ప్రభుత్వం కూడా ఉంది. మరి బంగ్లాదేశీయుల విషయంలో భారత్‌లో జరుగుతున్నదేమిటీ? బంగ్లాదేశ్ తల్లిదండ్రుల నుంచి పిల్లలను వేరు చేసి నిర్బంధించడం లేదా! పిల్లల హక్కులపై ఐక్యరాజ్యసమతి చేసిన అంతర్జాతీయ ఒప్పందాన్ని ఉల్లంఘించడం లేదా! ఆ ఒప్పందంలో భారత్ కూడా భాగస్వామే. ఆ ఒప్పందంలోని 9వ అధికరణం ప్రకారం పిల్లలను కొడుతూ తిడుతూ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే తప్ప తల్లిదండ్రుల నుంచి పిల్లలను వేరుచేయరాదు. తల్లిదండ్రుల్లో ఎవరికి శిక్షపడినా, నిర్బంధంలో ఉన్న, జైల్లో ఉన్నా వారి పిల్లల క్షేమసమారాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలి. శిక్ష పడిని వారి పిల్లలను చూసుకునేందుకు బంధు మిత్రులు ఎవరూ లేకుంటే ఆ బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి. బంగ్లాదేశ్ నుంచి వలసలు ఎందుకు? బంగ్లాదేశ్‌తో భారత్‌కు 4,097 కిలోమీటర్ల పొడవున సరిహద్దు ఉంది. అందులో సగానికిపైగా అంటే, 2, 217 కిలోమీటర్ల సరిహద్దు పశ్చిమ బెంగాల్లోనే ఉంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం 2016, ఏప్రిల్ నాటికి పశ్చిమ బెంగాల్లో బంగ్లాకు చెందిన 3,647 మంది పెద్దలు, 142 మంది పిల్లలు నిర్బంధంలో ఉన్నారు. కొన్ని బంగ్లాదేశ్ కుటుంబాలు భారత్‌లోని తమ బంధువులను కలుసుకునేందుకు సరిహద్దులు దాటి వస్తాయి. కొన్ని కుటుంబాలు దళారులు లేదా ఏజెంట్ల మోసం కారణంగా ఇక్కడికి వచ్చి దొరికిపోతాయి. కొందరు బంగ్లా రాజకీయ సంక్షోభం కారణంగా, మతపరమైన వేధింపుల కారణంగా వస్తారు. భారత్‌లో వైద్యం కోసం కూడా కొందరు సరిహద్దులు దాటి వస్తారు. వారు ఏ కారణంగా వచ్చినా సరైన డాక్యుమెంట్లు లేకపోతే జైలు లేదా కరెక్షనల్ సెంటర్లలో గడపాల్సిందే. బెంగాల్లో కరెక్షనల్ సెంటర్లకు జైళ్లకన్నా మంచి పేరే ఉంది. చదవండి: ‘వలస పిల్లల’ను వేరుచేయం వెనక్కి తగ్గిన ట్రంప్.. అమెరికాను కదిలిస్తున్న చిన్నారి సంభాషణ! జీరో టాలరెన్స్ బాధితుల్లో భారతీయురాలు -
జీరో టాలరెన్స్ బాధితుల్లో భారతీయురాలు
వాషింగ్టన్: మెక్సికో సరిహద్దుల నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ పట్టుబడి బిడ్డలకు దూరమైన వారిలో భారత్‌కు చెందిన ఓ మహిళ ఉందని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. గుజరాత్‌కు చెందిన భావన్ పటేల్ (33) అనే మహిళ పట్టుబడగా, వికలాంగుడైన ఆమె కొడుకు (5)ను అమెరికా ప్రభుత్వం తల్లి నుంచి వేరుచేసి నిర్బంధ కేంద్రంలో ఉంచిందని తెలిపింది. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే వారి పట్ల ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అనుసరిస్తూ అక్రమ వలసదారుల పిల్లలను తల్లిదండ్రుల నుంచి అమెరికా వేరుచేయడం తెలిసిందే. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ పట్టుబడిన వారిలో 200 మంది వరకు భారతీయులు ఉండొచ్చని వార్తలొచ్చినా ఇలా వివరాలు వెల్లడవటం ఇదే తొలిసారి. మరోవైపు అధ్యక్షుడు ట్రంప్ వలస విధానాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని వాషింగ్టన్‌లోని సెనేట్ బిల్డింగ్ ముందు ఆందోళన నిర్వహించిన 600 మంది ప్రజల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. -
ట్రంప్ వాదనలో నిజమెంత ?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు ఆదినుంచి వివాదాస్పదమే. అధ్యక్షుడి హోదాలో ఆయన చేసే ప్రకటనల్లో నిజం కూడా నేతి బీరకాయలో నెయ్యి చందంగానే మారుతోంది. శరణార్థుల పేరు చెబితే అంతెత్తున లేస్తున్న ట్రంప్ అమెరికా వలస విధానంపైనా, మెక్సికో సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపైనా తాజా ప్రకటనలన్నీ తప్పుడు తడకలే. వలసవాదులు వాళ్లు చేస్తున్న నేరాలపై ఈ మధ్య కాలంలో ట్రంప్ చేసిన ప్రకటనలేంటి ? వాటి వెనుకనున్న వాస్తవాలేంటి ? వలస న్యాయమూర్తులపై ట్రంప్ : అక్రమంగా వలస వచ్చిన వారి విచారణకు వేలకు వేల మంది న్యాయమూర్తులున్నారు. పనికిమాలిన వలస చట్టాల కారణంగా వారిని నియమించాల్సి వస్తోంది. ఇక మా చట్టాలను మార్చేస్తాం. సరిహద్దుల్లో గోడలు కట్టేస్తాం. అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తే ఇక కోర్టులు, కేసులు ఉండవు. వెనక్కి తిరిగి పంపేస్తాం. వాస్తవం : అక్రమ వలస కేసుల్ని విచారించానికి వేలాది మంది న్యాయమూర్తులు ఉన్నారన్నది పూర్తిగా తప్పు. ఈ విచారణకు ఉద్దేశించిన కోర్టుల్లో దేశవ్యాప్తంగా 335 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారు. 150 మంది అదనపు న్యాయమూర్తుల నియామకానికి బడ్జెట్ ఉంది. ఇంకా ఏడు లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్ కేసులన్నీ పూర్తి కావాలంటే ఒక్కో న్యాయమూర్తి 2 వేలకు పైగా కేసుల్ని విచారించాల్సి ఉంది. తల్లీ బిడ్డల్ని వేరు చేయడంపై ట్రంప్: అత్యంత అమానవీయంగా సరిహద్దుల్లో తల్లీ బిడ్డల్ని వేరు చేయడంపై విమర్శలు వెల్లువెత్తడంతో వెనక్కి తగ్గిన ట్రంప్ జీరో టాలరెన్స్ విధానానికి స్వస్తి పలికే ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై సంతకం చేస్తూ .. ఇకపై మేము కుటుంబాల్ని కలిపే ఉంచుతాం. దీంతో సమస్య పరిష్కారమైపోతోందని వ్యాఖ్యానించారు. వాస్తవం : వలసదారుల సమస్యలు ఎంత మాత్రం పరిష్కారం కావు. వారిపై కేసుల విచారణ ముగిసేవరకు తల్లీబిడ్డల్ని వేర్వేరుగా బదులుగా ఒకే చోట నిర్బంధించి ఉంచుతారు. అంతేకాదు అక్రమంగా దేశంలోకి ప్రవేశించే వ్యక్తుల నుంచి వారి పిల్లలను 20 రోజులకు మించి వేరు చేసి ఉంచకూడదని 1997 నాటి ఫ్లోర్స్ ఒప్పందం చెబుతోంది. అమెరికన్ కాంగ్రెస్ లేదంటే అక్కడి కోర్టులు ఏదో ఒక నిర్ణయం తీసుకునే వరకు ఈ 20 రోజుల విధానం అమల్లోనే ఉంటుందని న్యాయశాఖ స్పష్టం చేసింది. దాని ప్రకారం చూస్తే ప్రభుత్వ అధికారులకు మూడు వారాల తర్వాత మళ్లీ తల్లీ బిడ్డల్ని బలవంతంగా వేరు చేయడానికి అన్ని అధికారాలు సంక్రమిస్తాయి. వలసదారుల అరెస్టులపై ట్రంప్ : 2011 ప్రభుత్వ నివేదిక ప్రకారం హత్యా నేరం కింద 25 వేల మంది, దోపిడి కేసులో 42 వేల మంది, లైంగిక నేరాల్లో 70 వేల మంది, కిడ్నాప్ కేసుల్లో 15 వేల మంది అక్రమవలదారుల అరెస్టులు జరిగాయి. గత ఏడేళ్లుగా కేవలం టెక్సాస్‌లోనే రెండున్నర లక్షల మంది అక్రమ వలసదారుల్ని అరెస్ట్ చేశాం. వారిపై ఆరులక్షలకు పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వాస్తవం: అక్రమ వలసదారుల అరెస్టులపై ప్రభుత్వ అధికారిక గణాంకాలు, నివేదికలో అంశాలనే ట్రంప్ ప్రస్తావించారు. సరిహద్దులు దాటుకొని వచ్చిన నేరగాళ్లలో 30 లక్షల మందికి పైగా జరిగిన అరెస్టులు వాస్తవమే కానీ, అందులో సగానికిపైగా అక్రమవలస, మాదకద్రవ్యాలు, ట్రాఫిక్ నేరాల కింద జరిగాయి. చాలా వరకు కేసులు పౌర చట్టాల అతిక్రమణలకు సంబంధించిన కేసులే తప్ప, క్రిమినల్ అభియోగాలు కాదు. వలసదారుల నేరాలపై ట్రంప్ : ఎప్పుడూ నా చెవుల్లో ఒక మాట వినపడుతూ ఉంటుంది. అమెరికా పౌరుల కంటే వాళ్లు (వలస వచ్చిన వారు) మంచివాళ్లు అని.. అదెంత మాత్రం సరైంది కాదు. వాళ్లే అధిక నేరాలు చేస్తున్నారు. వాళ్లున్న చోటే శాంతి భద్రతల సమస్య తలెత్తుతోంది. వాస్తవం : అమెరికాలో వివిధ సామాజిక సంస్థలు, కాటో ఇనిస్టిట్యూట్ వంటి మేధో సంస్థల గణాంకాల ప్రకారం అమెరికా పౌరులతో పోల్చి చూస్తే వలసదారులు చేసే నేరాల సంఖ్య చాలా తక్కువ. 1990 సంవత్సరం నుంచి 2014 వరకు గణాంకాలను పరిశీలిస్తే వలసదారులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో క్రైమ్ రేటు చాలా తక్కువగా నమోదైంది. అత్యధిక వలసదారుల జనాభా ఉన్న న్యూయార్క్ నగరంలో (5 లక్షల మంది వరకు అక్రమంగా ఉన్నారని అంచనా) గత ఏడాది 292 హత్యలు జరిగాయి. అమెరికాలో ఎన్ని హత్యలు జరిగాయన్నదానిపైనే శాంతి భద్రతల్ని అంచనా వేస్తారు. అలా చూస్తే వలస వచ్చిన వారు స్థిరపడిన ప్రాంతాల్లోనే హత్యలు తక్కువగా జరిగాయి. ఆర్థిక వ్యవస్థకు వాళ్లే ఆలంబన గత ఏడాది ఫిబ్రవరిలో అమెరికా ‘ వలసదారులు లేకుండా ఒక్కరోజు‘ పేరుతో ఇమిగ్రెంట్స్ అందరూ 24 గంటల సమ్మెకు దిగేసరికి అమెరికా వణికి పోయింది. రెస్టారెంట్లు, నిర్మాణ కంపెనీలు, ఇతర వాణిజ్య కేంద్రాల్లో వలస వచ్చిన వారుపనికి హాజరుకాకపోయేసరికి ఆ ఒక్క రోజే దుకాణాలు మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వలసదారుల శ్రమ లేకపోతే అమెరికా ఆర్థిక వ్యవస్థే కుప్పకూలిపోతుందని కొన్ని స్వతంత్ర సంస్థలు చెబుతున్నాయి. అమెరికా పౌరులు వలస వచ్చిన వారిని ఎంత చిన్న చూపు చూసినా రెస్టారెంట్లలో వంటలు చెయ్యడానికీ మెక్సికన్లు కావాలి, వ్యవసాయ క్షేత్రాల్లోపని చేయడానికి వాళ్ల సహకారమే ఉండాలి. అమెరికన్ల ఇళ్లు శుభ్రం చేయాలన్న, గిన్నెలు తోమాలన్నా, తోటల్లో మాలీలుగానైనా, పిల్లల్ని సంరక్షించాలన్నా మెక్సికన్లే దిక్కు అని అమెరికాలోని ప్రముఖ షెఫ్ ఆంథోని బౌర్డెన్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా సేవారంగంలో వసలదారులే ఎక్కువగా ఉన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు అమెరికన్ల ఉద్యోగాలు కాజేస్తున్నారని అందరూ గగ్గోలు పెడుతున్నారు కానీ, గత రెండు దశాబ్దాల్లో రెస్టారెంట్లలో వంటలు, డిష్ వాషింగ్ వంటి ఉద్యోగాల కోసం ఒక్క అమెరికన్ కూడా ముందుకు రాలేదు. మెక్సికన్లు అంటూ లేకపోతే అమెరికాలో సేవా రంగం కుదేలైపోతుందని ఆంథోని చెబుతున్నారు. అమెరికన్ రెస్టారెంట్లలో 75 శాతం వలసదారులే పని చేస్తున్నారు. ఇక వ్యవసాయ రంగంలో కూడా అత్యధికులు వలసదారులేనని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ చదవండి: ట్రంప్ అభిశంసనకు 42 శాతం మొగ్గు -
జీరో టాలరెన్స్... అమెరికా వివరణ
వాషింగ్టన్ : అమెరికా సరిహద్దుల నుంచి వలసదారుల్ని నిలువరించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ విధానం ప్రకారం అమెరికాలోకి అక్రమంగా చొరబడిన తల్లిదండ్రులతోపాటు ఉన్న పిల్లల్ని వేరుచేసి వేర్వేరు కేంద్రాల్లో ఉంచుతారు. ఎలాంటి సంరక్షణా లేకుండా తాత్కాలికంగా తయారుచేసిన కేజ్‌ల్లో ఐదారేళ్ల పసివారిని నిర్బంధిస్తున్నారంటూ అన్ని వర్గాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది. తాజాగా జీరో టాలరెన్స్ విధానాన్ని అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌తో పాటు లారా బుష్ కూడా తప్పుపట్టారు. అయితే విధానంపై సమాధానం ఇవ్వాల్సిన అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం(డీహెచ్ఎస్) జీరో టాలరెన్స్ విధానం గురించి పత్రికా ప్రకటన విడుదల చేసింది. భద్రతా కారణాల దృష్ట్యానే... సరిహద్దు గుండా అక్రమంగా దేశంలోకి చొరబడే తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని వేరు చేసేందుకు ప్రత్యేకంగా ఒక విధానమంటూ ఏదీలేదని డీహెచ్ఎస్ స్పష్టం చేసింది. కాకపోతే మైనర్లను కస్టడీలోకి తీసుకొని వారి బాగోగులను చూసుకోవాల్సిన బాధ్యత తమకు ఉందని తెలిపింది. అయితే.. అక్రమ వలసదారుల్లో కొంత మంది మానవ అక్రమ రవాణాకు పాల్పడేవారు ఉండే అవకాశం ఉన్నందున పిల్లల భద్రత దృష్ట్యానే తాము కాస్త కఠినంగా వ్యవహరిస్తున్నామని పేర్కొంది. 2017 అక్టోబర్ నుంచి 2018 ఫిబ్రవరి మధ్య కాలంలో ఈవిధంగా సరిహద్దుల గుండా పిల్లలతో సహా ప్రవేశించే వారి సంఖ్య 315 శాతం పెరిగిందని, వీరిలో చాలా మంది పిల్లల గురించి ప్రశ్నించినపుడు సరైన సమాధానం చెప్పకుండా తడబడటం తమ అనుమానాన్ని మరింతగా పెంచిందని డీహెచ్ఎస్ తెలిపింది. ఇటువంటి కారణాల వల్లే కుటుంబ సభ్యుల నుంచి పిల్లల్ని వేరుచేస్తున్నామని.. అయితే కోర్టు ఆదేశాల మేరకు అదుపులోకి తీసుకున్న పిల్లల్ని 20 రోజుల్లోగా విడుదల చేస్తున్నామని డీహెచ్ఎస్ తెలిపింది. వారిని తిరస్కరించడం లేదు... ఆశ్రయం కోరి వచ్చేవారిని అమెరికా తిరస్కరించడంలేదని, కేవలం తమ పౌరుల భద్రతా దృష్ట్యానే వలసదారులను అన్ని విధాలా పరీక్షించిన తర్వాతే దేశంలోకి అనుమతిస్తామని డీహెచ్ఎస్ స్పష్టం చేసింది. ఈ విషయంలో అమెరికా సరిహద్దు రక్షణా విభాగం(యూఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్) నిబంధనలను అనుసరించి ఎంత మంది విదేశీయులకు దేశంలోకి ప్రవేశించే అనుమతి ఇవ్వాలనే నిర్ణయం జరుగుతుందని తెలిపింది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్నట్లుగా అక్రమ వలసదారుల నుంచి పిల్లల్ని వేరుచేసిన తర్వాత వారి బాగోగుల గురించి తల్లిదండ్రులకు ఎటువంటి సమాచారం అందించడంలేదనే వార్తల్ని డీహెచ్ఎస్ ఖండించింది. పిల్లల్ని ఎక్కడ ఉంచామనే విషయం తల్లిదండ్రులకు కచ్చితంగా తెలియజేస్తామని.. అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్(హెచ్ఎస్ఎస్) సహాయంతో డిటెన్షన్ రిపోర్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ లైన్(డ్రిల్) ద్వారా ఫోన్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పిల్లలతో సంభాషించే వీలు కల్పిస్తున్నామని పేర్కొంది. అవన్నీ అవాస్తవాలే... అమెరికా సరిహద్దు అధికారులకు ఇతర భాషలు తెలియని కారణంగానే సమస్యలు ఎక్కువవుతున్నాయంటూ వచ్చిన వార్తల్ని డీహెచ్ఎస్ ఖండించింది. బార్డర్ పెట్రోల్ ట్రైనీస్ కచ్చితంగా రెండు భాషల్లో(ఇంగ్లీష్, స్పానిష్) ప్రావీణ్యం కలిగి ఉంటారని, వలసదారుల మాటల్ని వారు చక్కగా అర్థం చేసుకోగలరని తెలిపింది. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే మైనర్లను అదుపులోకి తీసుకుంటారని.. అదేవిధంగా అదుపులోకి తీసుకునే సమయంలో, తిరిగి తల్లిదండ్రులకు అప్పగించే సమయంలో డాక్యుమెంటేషన్ ప్రాసెస్‌లో నిబంధనలు కచ్చితంగా పాటిస్తారని తెలిపింది. వలసదారులకు శుభ్రమైన తాగు నీటిని అందించడంతో పాటు వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచుతున్నామని డీహెచ్ఎస్ పేర్కొంది. అదేవిధంగా పిల్లల్ని కేజ్‌లు, ఐస్‌బాక్స్‌లో బంధించడం లేదని, వారి సంరక్షణకు సంబంధించి బాధ్యతగా వ్యవహరిస్తున్నామని తెలిపింది. ఫోర్స్ సెటిల్మెంట్ అగ్రిమెంట్ నిర్బంధంలోకి తీసుకున్న వారిని 20 రోజుల్లోగా తప్పనిసరిగా విడుదల చేస్తున్నామని.. ఒంటరిగా దేశంలోకి చొరబడిన మైనర్లను అదుపులోకి తీసుకున్న 72 గంటల్లోగా హెచ్ఎస్ఎస్కు తరలించి వారి వివరాలు సేకరిస్తామని డీహెచ్ఎస్ వివరించింది. నిర్బంధంలో ఉన్న పిల్లలతో మాట్లాడటానికి హెచ్ఎస్ఎస్ కల్పించే సదుపాయాల వివరాలు... హెచ్ఎస్ఎస్ హాట్‌లైన్ (ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో 24 గంటలు అందుబాటులో ఉంటుంది) 1. ఐసీఈ(యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్) నిబంధనల ప్రకారం నిర్బంధ సౌకర్యాలేని వారు ఫోన్ చేయాల్సిన నంబర్ : 1-800-203-7001 2. ఐసీఈ నిబంధనల ప్రకారం నిర్బంధంలో ఉన్నవారు : 699# ఫోన్ చేసే వ్యక్తులు పిల్లల పూర్తి పేరు, పుట్టిన తేదీ, మాతృదేశం తదితర వివరాలు తెలపాల్సి ఉంటుంది. హెచ్ఎస్ఎస్ ఈమెయిల్ : information@ORRNCC.com ఐసీఈ కాల్‌సెంటర్ : (సోమ వారం- శుక్రవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు) నంబర్లు : 1-888-350-4024, 9116# ఈమెయిల్ - Parental.Interest@ice.dhs.gov