మనం ట్రంప్‌ కన్నా తక్కువ తిన్నామా! | India Has Separated BanglaDeshi Children | Sakshi
Sakshi News home page

మనం ట్రంప్‌ కన్నా తక్కువ తిన్నామా!

Published Thu, Jul 5 2018 11:25 PM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM

India Has Separated BanglaDeshi Children - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఎదురుగా ఎత్తయిన పది అడుగుల గోడ. గోడ మీద ఎర్రటి రంగుతో హృదయాకారం. గోడ అంచు మీద ఇనుప కంచె. ఎవరికైనా అది జైలు కాబోలని అనిపిస్తుంది. నిజంగా అక్కడి జీవితం జైలే. ఎవరు పారిపోకుండానే ఆ గోడకు అంత ఎత్తున ఆ ఇనుప కంచె. అయితే దాన్ని జైలు అని పిలవరు. షెల్టర్‌ అని లేదా శిబిరం అని పిలుస్తారు. ఆ గోడ వెలుపలి నుంచి అప్పుడప్పుడు అటుగా పోతున్నవారి నవ్వులు, అమ్మాయిల అరుపులు వినిపిస్తుంటాయి. అమ్మాయిల అరుపులు వినిపించినప్పుడల్లా వారేమి మాట్లాడుకుంటున్నారో వినేందుకేమో గోడకు ఇటువైపున్న అమ్మాయిలు మౌనంగా ఉంటారు. గోడ లోపలున్న ఈ అమ్మాయిలంతా బంగ్లాదేశీయులు.

వారంతా సరైన డాక్యుమెంట్లు లేకుండా సరిహద్దులు దాటి భారత దేశానికి వచ్చి భద్రతా దళాల చేతుల్లో అరెస్ట్‌ అయిన వారే. వారిలో ఆరేళ్లప్పుడు ఈ శిబిరానికి వచ్చి పెళ్లీడు వచ్చినా ఇప్పటికీ శిబిరంలోనే తలదాచుకుంటున్న వారూ ఉన్నారు. వారి తల్లిదండ్రులను బంగ్లాదేశ్‌ అధికారులు గుర్తించి వారిని తీసుకెళ్లే వరకు ఆ అమ్మాయిలకు ఈ నిర్బంధ జీవితం తప్పదు. వారిలో కొందరిది మరింత దౌర్భాగ్య పరిస్థితి. తల్లిదండ్రులో, తల్లో లేదా తండ్రో భారత దేశంలోనే ఎక్కడో, ఏదో జైలులో మగ్గుతూ ఉంటారు. ఒకరినొకరు చూసుకునే అవకాశమే ఉండదు. వారికి ఆశ్రయం కల్పిస్తున్న ఈ షెల్టర్‌ పేరు ‘స్నేహ’. శాన్‌లాప్‌ అనే స్వచ్ఛంద సంస్థ ఈ శిబిరాన్ని నిర్వహిస్తోంది. ఇలాంటి షెల్టర్లు పశ్చిమ బెంగాల్లో మగ పిల్లలకు వేరుగా, ఆడ పిల్లలకు వేరుగా 80 షెల్టర్లు ఉన్నాయి. 

బంగ్లాదేశ్‌ నుంచి వీసా, పాస్‌పోర్టు లాంటి సరైన డాక్యుమెంట్లు లేకుండా సరిహద్దులు దాటి భారత్‌కు వచ్చిన లేదా వచ్చి భారత్‌లో రహస్యంగా స్థిరపడిన బంగ్లాదేశీయులను భారత్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. వారికి 1946, విదేశీయుల చట్టంలోని సెక్షన్‌ 14 ఏ కింద రెండేళ్లు నుంచి గరిష్టంగా ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధిస్తారు. వారిలో ఆరేళ్ల పైబడిన పిల్లలుంటే వారిని శిశు సంక్షేమ కమిటీ ముందుకు, జువెనైల్‌ జస్టిస్‌ బోర్డుకు పంపుతారు. అక్కడ వారికి ఎలాంటి శిక్షలు విధించరుగని ప్రభుత్వ, స్వచ్ఛంద వసతి గృహాలకు పంపిస్తారు. సరైన డాక్యుమెంట్లతో వారి తల్లిదండ్రులు లేదా బంగ్లాదేశ్‌ అధికారులు వచ్చే వరకు ఆ పిల్లలకు శిబిరాల్లో నిర్బంధం తప్పదు. 

ఇక అక్రమంగా వచ్చి జైలు శిక్ష పడిన పెద్దవాళ్లను వారి శిక్ష  పూర్తయినప్పటికీ విడుదల చేయరు.  కాకపోతే జైళ్లలో ఉన్నవారిని షెల్టర్లలోకి మారుస్తారు. ఇలాంటి షెల్టర్లు ప్రభుత్వం ఆధీనంలోను ఉన్నాయి. స్వచ్చంద సంస్థల ఆధీనంలోనూ ఉన్నాయి. బంగ్లాదేశ్‌ అధికారులు వచ్చి వారిని తీసుకెళ్లాలి. అందుకు ముందుగా వారు వారిని తమ దేశ పౌరులుగా అంగీకరించాలి. అప్పుడే వారికి జైలు నుంచి, దేశం నుంచి విముక్తి లభిస్తుంది. బంగ్లాదేశ్‌ అధికారులు రాకపోయినా, వచ్చి వారు తమ దేశీయులు కాదన్నా వారు జీవితాంతం జైల్లో మగ్గిపోవాల్సిందే. గతంలో వారు తమ దేశీయులు కాదన్న ఉదంతాలు కూడా ఉన్నాయి. పిల్లలతో అక్రమంగా వలసవచ్చి అరెస్టై, ఒకరినొకరు చూసుకోకుండా పిల్లలు, తల్లిదండ్రులు వేర్వేరుగా శిక్ష అనుభవించిన, అనుభవిస్తున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ‘మహానిర్మాణ్‌ కోల్‌కతా రీసర్చ్‌ గ్రూప్‌’నకు చెందిన సుచరిత సేన్‌ గుప్తా అలాంటి వారిపై 2015లో ఓ అధ్యయనం జరిపారు. 

రాజకీయ సంక్షోభం కారణంగా బంగ్లాదేశ్‌ వదిలిపెట్టి ఓ కొడుకు, కూతురుతో భారత్‌కు వచ్చిన బహదూరిబాలా అనే 40 ఏళ్ల యువతికి భారత్‌లో ఏడేళ్లు జైలు శిక్ష పడింది. ఆమెను బెహ్రాంపూర్‌లోని సెంట్రల్‌ కరెక్షనల్‌ హోమ్‌కు పంపించగా, ఇద్దరు పిల్లలను జువెనైల్‌ హోమ్స్‌కు పంపించారు. ఆమె నాలుగేళ్ల వరకు తన పిల్లలనే చూడలేదట. ఓ న్యాయవాది కారణంగా వారిని చూడ గలిగింది. ఈ విషయాలు సుచరిత సేన్‌ గుప్తా అధ్యయనంతో వెలుగులోకి వచ్చాయి. 

మెక్సికో నుంచి అమెరికాకు అక్రమంగా వలసవచ్చిన ప్రజల నుంచి రెండు వేల మంది పిల్లలను అన్యాయంగా వేరు చేశారంటూ ఇటీవల ప్రపంచమంతా గళమెత్తి ఘోషించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను దుమ్మెత్తి పోసింది. అందులో భారత ప్రభుత్వం కూడా ఉంది. మరి బంగ్లాదేశీయుల విషయంలో భారత్‌లో జరుగుతున్నదేమిటీ? బంగ్లాదేశ్‌ తల్లిదండ్రుల నుంచి పిల్లలను వేరు చేసి నిర్బంధించడం లేదా! పిల్లల హక్కులపై ఐక్యరాజ్యసమతి చేసిన అంతర్జాతీయ ఒప్పందాన్ని ఉల్లంఘించడం లేదా! ఆ ఒప్పందంలో భారత్‌ కూడా భాగస్వామే. ఆ ఒప్పందంలోని 9వ అధికరణం ప్రకారం పిల్లలను కొడుతూ తిడుతూ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే తప్ప తల్లిదండ్రుల నుంచి పిల్లలను వేరుచేయరాదు. తల్లిదండ్రుల్లో ఎవరికి శిక్షపడినా, నిర్బంధంలో ఉన్న, జైల్లో ఉన్నా వారి పిల్లల క్షేమసమారాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలి. శిక్ష పడిని వారి పిల్లలను చూసుకునేందుకు బంధు మిత్రులు ఎవరూ లేకుంటే ఆ బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి. 

బంగ్లాదేశ్‌ నుంచి వలసలు ఎందుకు?
బంగ్లాదేశ్‌తో భారత్‌కు 4,097 కిలోమీటర్ల పొడవున సరిహద్దు ఉంది. అందులో సగానికిపైగా అంటే, 2, 217 కిలోమీటర్ల సరిహద్దు పశ్చిమ బెంగాల్‌లోనే ఉంది. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో లెక్కల ప్రకారం 2016, ఏప్రిల్‌ నాటికి పశ్చిమ బెంగాల్‌లో బంగ్లాకు చెందిన 3,647 మంది పెద్దలు, 142 మంది పిల్లలు నిర్బంధంలో ఉన్నారు. కొన్ని బంగ్లాదేశ్‌ కుటుంబాలు భారత్‌లోని తమ బంధువులను కలుసుకునేందుకు సరిహద్దులు దాటి వస్తాయి. కొన్ని కుటుంబాలు దళారులు లేదా ఏజెంట్ల మోసం కారణంగా ఇక్కడికి వచ్చి దొరికిపోతాయి. కొందరు బంగ్లా రాజకీయ సంక్షోభం కారణంగా, మతపరమైన వేధింపుల కారణంగా వస్తారు. భారత్‌లో వైద్యం కోసం కూడా కొందరు సరిహద్దులు దాటి వస్తారు. వారు ఏ కారణంగా వచ్చినా సరైన డాక్యుమెంట్లు లేకపోతే జైలు లేదా కరెక్షనల్‌ సెంటర్లలో గడపాల్సిందే. బెంగాల్‌లో కరెక్షనల్‌ సెంటర్లకు జైళ్లకన్నా మంచి పేరే ఉంది. 
 

చదవండి: ‘వలస పిల్లల’ను వేరుచేయం

వెనక్కి తగ్గిన ట్రంప్‌..

అమెరికాను కదిలిస్తున్న చిన్నారి సంభాషణ!

జీరో టాలరెన్స్‌ బాధితుల్లో భారతీయురాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement