చెదిరిన డాలర్‌ డ్రీమ్స్‌ | Sakshi Editorial On Trump Actions On Illegal immigrants In US | Sakshi
Sakshi News home page

చెదిరిన డాలర్‌ డ్రీమ్స్‌

Published Thu, Feb 6 2025 12:32 AM | Last Updated on Thu, Feb 6 2025 12:32 AM

Sakshi Editorial On Trump Actions On Illegal immigrants In US

అక్రమ వలసల్ని సహించేది లేదనీ, అక్రమ వలసదారుల్ని అమెరికా నుంచి వెనక్కి పంపేవరకు నిద్రపోయేది లేదనీ చెబుతూ వస్తున్న అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్‌ ఇప్పుడు చేతల్లోకి దిగారు. సరైన పత్రాలు లేకుండా తమ దేశంలో ఉంటున్న భారత్‌కు చెందిన అక్రమ వలసదారుల్లో కొందరిని తొలి విడతగా వెనక్కి పంపేశారు. అమెరికాలోని టెక్సాస్‌లో శాన్‌ ఆంటోనియో నుంచి బయలు అమెరికన్‌ యుద్ధవిమానం బుధవారం మధ్యాహ్నం మన అమృత్‌సర్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగడంతో కొత్త అంకం ఆరంభమైంది. 

ఆ ఖరీదైన సీ–17 అమెరికా యుద్ధ విమానం నుంచి 104 మంది భారతీయ అక్రమ వలసదారులు వెనక్కి వచ్చినట్టు కథనం. వచ్చిన వారి పత్రాలనూ పరిశీలించి, ప్రాథమికంగా ప్రశ్నించి, వైద్యపరీక్షలు సైతం చేసి, ఎలాంటి నేర చరిత్రా లేదని నిర్ధరించుకున్నాక వారిని స్వరాష్ట్రాలకు పంపే పనిలో భారత పాలనా యంత్రాంగం నిమగ్నమైంది. 

గడచిన బైడెన్‌ హయాంలో 2024లో అమెరికాతో మన సంబంధాలు కొంత అడుగంటాక, తాజా ట్రంప్‌ ఏలుబడిలో వాటిని మళ్ళీ బలోపేతం చేసుకోవాలని మోదీ సర్కార్‌ భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఈ అక్రమ వలసల అంశం కొంత చీకాకు పరిచేదే అయినా, అనివార్యతల్ని గ్రహించి, సహనంతో సమస్యల్ని చక్కదిద్దుకోవడమే భారత్‌ ముందున్న మార్గం. 

పత్రాలు లేకుండా ఉంటున్నవారిని సహించేది లేదని హెచ్చరిస్తూ వచ్చిన ట్రంప్‌ జనవరి 20న అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అలాంటివారిని ఏరి ఏరి మరీ భారత్‌కు వెనక్కు పంపడం ఇది తొలిసారి. గతంలో, గ్వాటెమలా, పెరూ, హాండూరస్‌ల నుంచి చట్టవిరుద్ధంగా వలస వచ్చినవారిని తిరుగు టపాలో పంపేందుకు అమెరికా సైనిక విమానాన్ని వినియోగించింది. ఇప్పుడు మన విషయంలోనూ అదే చేసింది. 

వెనక్కి పంపేందుకు సిద్ధం చేసిన 15 లక్షల మంది జాబితాలో భారతీయులు 18 వేల మంది దాకా ఉన్నారట. అంటే, రానున్న నెలల్లో ఇలాంటి మరిన్ని విమానాల్లో వందల సంఖ్యలో మనవాళ్ళు వెనక్కి రానున్నారన్నది చేదు నిజం. అంటే, ఎంత స్నేహమున్నా అసలు సంగతికొచ్చే సరికి అగ్ర రాజ్యాధినేత భారత్‌తోనూ ముక్కుసూటిగానే ఉంటారన్నది సుస్పష్టం.  

నిజానికి, మెక్సికో, ఎల్‌సాల్వడార్‌ల తర్వాత అమెరికాలో అక్రమ వలసదారుల్లో అధిక సంఖ్యాకులు భారతీయులే. అక్కడ అలాంటి భారతీయుల సంఖ్య దాదాపు 7.25 లక్షలని ఓ లెక్క. తాజాగా వెనక్కివచ్చినవారిలో పంజాబ్‌ (30 మంది), హరియాణా (33), గుజరాత్‌ (33), తదితర రాష్ట్రాల వారున్నారు. వీరిలో పిల్లలు, మహిళలు కూడా ఉండడం గమనార్హం. ఆ మాటకొస్తే, అమె రికా ఇలా అక్రమ వలసదారులైన భారతీయుల్ని వెనక్కిపంపడం కొత్తేమీ కాదు. గత అక్టోబర్‌లోనూ వంద మంది పంజాబ్‌కు తిరిగొచ్చారు. 

2023 అక్టోబర్‌ నుంచి నిరుడు సెప్టెంబర్‌ ఆఖరు వరకు మొత్తం 1100 మంది ఇలా ఇంటి ముఖం పట్టినవారే! అగ్రరాజ్యాన్ని కలలస్వర్గంగా ఊహించుకుంటూ, అక్కడ జీవనం బాగుంటుందనే ఆశతో, డాలర్ల సంపాదనపై ఆకర్షణతో అక్కడకు సక్రమంగానో, అవసరమైతే అక్రమంగానో వెళ్ళి, స్థిరపడాలనే ధోరణి చాలాకాలంగా ఉన్నదే. ఒక లెక్క ప్రకారం ప్రపంచపు పెద్దన్న పంచన చట్టప్రకారమే దాదాపు 50 లక్షల మంది భారత జాతీయు లున్నారంటే మన అమెరికా మోజు ఎంతో అర్థం చేసుకోవచ్చు. 

దీర్ఘకాలంగా మన భారతీయుల్లో అంతకంతకూ అధికమవుతూ వచ్చిన ఆ మోజు ఫలితమే – అధికసంఖ్యలోని అక్రమ వలసలు. ముఖ్యంగా, పంజాబ్‌ లాంటి ప్రాంతాల నుంచి అలా వెళ్ళేవారు మరీ ఎక్కువ. స్థానిక పంజాబీ జాతీయంలో చెప్పాలంటే ‘డాంకీ రూట్స్‌’లో (వాహనాలు మారుతూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళుతూ) అమెరికా చేరుకుంటారు. 

విదేశాల్లో బతుకు తెరువుకై తపిస్తున్న వ్యక్తుల ఆశల్ని సొమ్ము చేసుకుంటూ, ట్రావెల్‌ ఏజెన్సీలు భారీగా లక్షల్లో డబ్బు గుంజి, దొంగ వీసాలతో వారిని ఇలా దేశాల హద్దుల్ని దాటిస్తుంటాయి. సగటున ఏటా 90 వేల పైచిలుకు భారతీయులు ఇలా అక్రమంగా అమెరికాలో ప్రవేశించబోయి, పట్టుబడుతున్నారు. తల తాకట్టుపెట్టి, సరైన పత్రాలు లేకుండానే అందరి కళ్ళుగప్పి అలా హద్దులు దాటి వెళ్ళిన పలువురికి ఇప్పుడు కల చెదిరింది. ట్రంప్‌ రాకతో వారి కథ మారింది. చాలామందికి కన్నీరే మిగిలింది. 

తగిన పత్రాలు లేకుండా అమెరికాలోనే కాదు, ఏ దేశంలోనైనా ఏ జాతీయులు నివసించినా అది తప్పే. శిక్షార్హమైన నేరమే. ఇంతకాలం చూసీచూడనట్టు చెల్లిపోయినా, అమెరికాను మళ్ళీ గొప్ప దేశంగా తీర్చిదిద్దుతానంటూ ఇప్పుడు రెండోసారి పగ్గాలు చేపట్టిన ట్రంప్‌ ఖడ్గప్రహారం చేయడాన్ని తప్పుపట్టలేం. అందుకే, బాధితులు భారతీయులైనా మన దేశం మారుమాట్లాడ లేకపోతోంది. ఆ మాటకొస్తే, వ్యవస్థీకృత నేరాలకు దారి తీస్తున్నట్లు భావిస్తున్న అక్రమ వలసలకు భారత్‌ వ్యతిరేక మని మన విదేశాంగ శాఖ నొక్కి వక్కాణించాల్సి వచ్చింది. 

అదే సమయంలో భారతీయుల పునరా గమనానికి వీలు కల్పిస్తామనీ చెప్పాల్సి వచ్చింది. వాణిజ్య సుంకాల విధింపు సహా అనేక విష యాల్లో ట్రంప్‌ దూకుడు మీదున్న తరుణంలో అమెరికాతో దీర్ఘకాలిక స్నేహసంబంధాలకు ఇబ్బంది కలగకుండా మన దేశం ఆచితూచి వ్యవహరించక తప్పదు. ఆ కోణం నుంచి చూసినప్పుడు భారత్‌ వైఖరి సమంజసమే కాదు సహజం కూడా! అయితే, ఈ అక్రమ వలసల్ని ఆపాలంటే, అమాయకుల ఆశను సొమ్ము చేసుకొనే అక్రమార్కుల పనిపట్టాలి. అంతకన్నా ముఖ్యంగా, ఆశల పల్లకీలో అగ్రరాజ్యం వైపు ఉరికే మనవాళ్ళకు గౌరవప్రదమైన ఉపాధి, ఉద్యోగావకాశాలిక్కడే కల్పించడంపై పాలకులు దృష్టిపెట్టాలి. చిత్తశుద్ధితో అది చేయనంతకాలం ఈ డాలర్‌డ్రీవ్స్‌ు కథలు కంచికి చేరవు!  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement