
అమెరికా కంపెనీలకు ట్రంప్ సూచన
వాషింగ్టన్: హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ వంటి అత్యుత్తమ యూనివర్సిటీల్లో చదివే ప్రతిభావంతులైన భారత పట్టభద్రులకు ఉద్యోగాలిచ్చేందుకు గోల్డ్ కార్డ్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అమెరికా కంపెనీలకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. 50 లక్షల డాలర్లు (రూ.43.67 కోట్లు) చెల్లించి గోల్డ్ కార్డు కొనుగోలు చేస్తే అమెరికా పౌరసత్వమిస్తామని ఆయన తాజాగా ప్రకటించడం తెలిసిందే.
‘‘అమెరికాలోని అత్యున్నత వర్సిటీల్లో చదివే భారత్, చైనా, జపాన్ విద్యార్థులకు ఇక్కడి కంపెనీలు ఆకర్షణీయమైన జాబ్ ఆఫర్లు ఇచ్చి నిలుపుకునే అవకాశం ప్రస్తుత ఇమిగ్రేషన్ వ్యవస్థలో లేదు. దాంతో వారు స్వదేశాలకు వెళ్లి వ్యాపారాలు ప్రారంభించి బిలియనీర్లుగా ఎదుగుతున్నారు. వేలాదిమందికి ఉపాధి కల్పిస్తున్నారు. అలాంటి వారి కోసం అమెరికా కంపెనీలే ఇకపై గోల్డ్ కార్డు కొనుగోలు చేయొచ్చు. తద్వారా వారికి ఉపాధి కల్పించి అట్టిపెట్టుకోవచ్చు’’ అని పేర్కొన్నారు. గోల్డ్ కార్డు పథకం రెండు వారాల్లో అమల్లోకి రానుంది.