
వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాల దిగుమతులు పెంచుకుంటాం
ప్రధాని మోదీతో భేటీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా
ఆయన నాకు మంచి మిత్రుడు, విశ్వసనీయ భాగస్వామి
రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడి
ఉక్రెయిన్ విషయంలో అమెరికాకు హెచ్చరిక
మాస్కో: భారత్‌తో వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నట్లు అధినేత పుతిన్ స్పష్టమైన సంకేతాలిచ్చారు. భారత్ నుంచి వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాల దిగుమతులను భారీగా పెంచుకోవాలని, ఇందుకోసం ప్రత్యేక విధానం రూపొందించాలని రష్యా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. రష్యా నుంచి భారత ప్రభుత్వం భారీగా ముడిచమురు కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇరుదేశాల మధ్య వాణిజ్య లోటు తగ్గిపోయి, వాణిజ్యంలో సమతూకం ఏర్పడేలా చర్యలు తీసుకోవడానికి పుతిన్ సిద్ధమయ్యారు. అందులో భాగంగానే భారత్ నుంచి దిగుమతులు పెంచాలని నిర్ణయించారు. గురువారం వాల్డాయ్ ప్లీనరీలో పుతిన్ ప్రసంగించారు. ఈ ఏడాది డిసెంబర్‌లో ఇండియాలో పర్యటించబోతున్నానని, ఇందుకోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. తనకు మంచి మిత్రుడు, విశ్వసనీయ భాగస్వామి నరేంద్ర మోదీతో సమావేశం కాబోతున్నానని వెల్లడించారు.
ప్రధాని మోదీపై పుతిన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన సమతూకం కలిగిన, తెలివైన నాయకుడు అని కొనియాడారు. భారతదేశ ప్రయోజనాల కోసం మోదీ నిరంతరం శ్రమిస్తుంటారని వ్యాఖ్యానించారు. మోదీ నేతృత్వంలో జాతీయవాద ప్రభుత్వం చక్కగా పనిచేస్తోందన్నారు. మోదీతో సమావేశమైనప్పుడు తాను ఎంతో సౌకర్యవంతంగా ఉన్నట్లు భావిస్తానని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు సహకరించడం మానుకోవాలని అమెరికాను పుతిన్ హెచ్చరించారు. ఉక్రెయిన్‌కు దీర్ఘశ్రేణి క్షిపణులు సరఫరా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని తేల్చిచెప్పారు.
#BREAKING: Russian President Putin at Valdai Club in Sochi on Trump Tariffs, says, “Indian people will look at what decisions are made by their political leadership. Indian people will never accept any humiliation. I know PM Modi, he will never take any steps of the kind.” pic.twitter.com/2GYqoVK1PO
— Aditya Raj Kaul (@AdityaRajKaul) October 2, 2025
స్వప్రయోజనాలు దెబ్బతింటే భారత్ సహించదు
భారతదేశ ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం భారీగా టారిఫ్‌లు విధించడాన్ని పుతిన్ తప్పుపట్టారు. దేశ స్వప్రయోజనాలు, ప్రాధాన్యతల కోణంలోనే భారతీయులు నిర్ణయాలు తీసుకుంటారని, వాటిని దెబ్బతీసేలా ఎవరైనా వ్యవహరిస్తే వారు సహించబోరని తేల్చిచెప్పారు. అమెరికా విధిస్తున్న టారిఫ్‌ల కారణంగా వాటిల్లుతున్న నష్టాన్ని రష్యా నుంచి చమురు కొనడం ద్వారా భారత్ భర్తీ చేసుకుంటోందని అన్నారు. అదేసమయంలో ఒక సార్వ¿ౌమ దేశంగా ప్రతిష్టను కాపాడుకుంటోందని ప్రశంసించారు.
భారత్ నుంచి దిగుమతులు పెంచుకుంటామని, వ్యవసాయ ఉత్పత్తులతోపాటు ఔషధ ఉత్పత్తులు, ఫార్మాస్యూటికల్స్ అధికంగా కొనుగోలు చేస్తామని ఉద్ఘాటించారు. భారత్, రష్యాల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంపొందించుకోవడానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ విషయంలో కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని చెప్పారు. ఫైనాన్సింగ్, లాజిస్టిక్స్‌తోపాటు చెల్లింపుల్లో కొన్ని అవరోధాలు ఎదురవుతున్నాయని గుర్తుచేశారు. భారత్, రష్యాలు ఏనాడూ ఘర్షణ పడలేదని, భవిష్యత్తులోనూ అలాంటిది తలెత్తే అవకాశమే లేదని పుతిన్ తేల్చిచెప్పారు.
భారతీయ సినిమాలంటే ఇష్టం
భారతీయ సినిమాలు వీక్షించడం తనకు ఎంతో ఇష్టమని పుతిన్ వ్యాఖ్యానించారు. ఈ సినిమాలకు రష్యాలో విశేషమైన ఆదరణ లభిస్తోందని చెప్పారు. భారతీయ సినిమాలను రోజంతా ప్రసారం చేసేందుకు ప్రత్యేకంగా ఓ చానల్ కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. రెండు దేశాల నడుమ రాజకీయ, దౌత్య సంబంధాలే కాకుండా సాంస్కృతిక, మానవీయ బంధాలు కూడా బలంగా ఉన్నాయని గుర్తుచేశారు. భారతీయ సంస్కృతి అంటే రష్యన్లకు ఎంతో అభిమానం అని వ్యాఖ్యానించారు. చాలామంది భారతీయ విద్యార్థులు రష్యాలో చదువుకుంటున్నారని వెల్లడించారు.
ఇదీ చదవండి: పాక్ పరువు.. మళ్లీ పాయే!