ఈ అనిశ్చితి పోయేదెలా? | Sakshi Editorial On Tariff Hikes Of US by Donald Trump | Sakshi
Sakshi News home page

ఈ అనిశ్చితి పోయేదెలా?

Published Fri, Mar 7 2025 4:01 AM | Last Updated on Fri, Mar 7 2025 4:01 AM

Sakshi Editorial On Tariff Hikes Of US by Donald Trump

జనవరి 20న గద్దెనెక్కినప్పటినుంచీ అధిక టారిఫ్‌లపై హెచ్చరిస్తూ వచ్చిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌... చివరికి అందుకు తుది గడువు ఖరారు చేశారు. తమ ఉత్పత్తులపై అధిక టారిఫ్‌లు వసూలు చేస్తున్న దేశాలన్నీ వచ్చే నెల 2 నుంచి తమ దెబ్బ కాచుకోవాలని హెచ్చరిక జారీచేశారు. దాదాపు వంద నిమిషాలపాటు అమెరికన్‌ కాంగ్రెస్‌నుద్దేశించి బుధవారం ఆయన చేసిన ప్రసంగం నిండా ఇలాంటి హెచ్చరికలున్నాయి. 

ఇప్పటికే చాలా సాధించినట్టు స్వోత్కర్షలున్నాయి. అమెరికా ప్రజల పాలిట తాను ఆపద్బాంధవుడినన్న భ్రమ కూడా ఆయనకు పుష్కలంగా ఉంది. ‘నేను విధించబోయే సుంకాలు కేవలం ప్రజానీకం ఉద్యోగాలు కాపాడటానికి మాత్రమే కాదు... ఈ చర్య మన దేశ ఆత్మను కాపాడటానికి కూడా’ అని ఆయన చెప్పుకొచ్చారు. సహజంగానే ప్రపంచమంతా ఏప్రిల్‌ గురించి బెంగపడుతోంది. 

ముంచుకొచ్చే ద్రవ్యపరమైన అసమతౌల్యతను అధిగమించడమెలాగో తెలియక అయోమయంలో కూరుకుపోతోంది. ఇప్పటికే ట్రంప్‌ చైనాపై అదనంగా 10 శాతం, మెక్సికో, కెనడాలపై మరో 25 శాతం సుంకాలు ప్రకటించటం వల్ల ఈ ఉపద్రవం ఖాయమని అన్ని దేశాలూ ఆందోళనతో ఉన్నాయి. సుంకాలను ట్రంప్‌ ‘సర్వరోగ నివారిణి’గా భావిస్తున్నారు. మెక్సికో మాదకద్రవ్య ముఠాల నుంచి పెద్ద యెత్తున వచ్చిపడే ఫెంటానిల్‌ అమెరికాకు పెద్ద సమస్యగా మారింది. 

అక్రమ వలసలు దీనికి అదనం. వలసలను అరికట్టి, మాదకద్రవ్య ముఠా నాయకుల్ని పట్టి అప్పగించకపోతే 25 శాతం సుంకాలు తప్పవని గత నెల 4న ట్రంప్‌ హెచ్చరించటంతో కెనడా, మెక్సికోలు ఒక నెల వ్యవధి కోరాయి. మెక్సికో అధ్యక్షురాలు షీన్‌బామ్‌ వెనువెంటనే అమెరికా–మెక్సికో సరిహద్దుల్లోకి అదనంగా 10,000 మంది సైనికులను తరలించి తనిఖీలు పెంచి వలసలను నియంత్రించారు. 

దేశంలో ఫెంటానిల్‌ నిల్వలను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేయటంతోపాటు భారీయెత్తున అరెస్టులు చేయించారు. 29 మంది డ్రగ్స్‌ ముఠా నాయకుల్ని అమెరికాకు అప్పగించారు. కెనడా అధ్యక్షుడు ట్రూడో ఫెంటానిల్‌ సరిహద్దులు దాటకుండా తనిఖీ వ్యవస్థను ముమ్మరం చేశారు. అయినా ట్రంప్‌ మనసు మారలేదు. 

ఆ రెండు దేశాలపై 25 శాతం అదనపు సుంకాలుంటాయని తన ప్రసంగంలో ప్రకటించారు. త్వరలో జరగబోయే ఎన్ని కల్లో పార్టీ ఓటమి ఖాయమన్న అంచనాలుండటంతో దీన్ని తనకు అనుకూలంగా మలుచుకోవ టానికి ట్రూడో సిద్ధపడ్డారు. అందుకే ‘సై అంటే సై’ అంటున్నారు. అమెరికాపై ప్రతీకార సుంకాలు విధించ బోతున్నట్టు ప్రకటించారు. 

ఇప్పటికే 2,100 కోట్ల డాలర్ల విలువైన సరుకుపై సుంకాలు వడ్డించారు. వివాదం సద్దుమణగకపోతే మరో 8,700 కోట్ల డాలర్ల సరుకుపై ఇది తప్పదని హెచ్చరించారు. షీన్‌బామ్‌ ఈమధ్యే అధికారంలోకొచ్చారు గనుక ఆమెకు కావలసినంత వ్యవధి వుంది. అందుకే ఎంతో సంయమనం పాటిస్తున్నారు. 

ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్ని తలకిందులు చేసే ఈ మాదిరి బ్లాక్‌మెయిలింగ్‌ కొత్తగా ట్రంప్‌కు పుట్టిన బుద్ధికాదు. అమెరికాలో ఎవరున్నా ఇలాంటి బెదిరింపులతోనే ప్రపంచ దేశాలను దారికి తెచ్చుకున్నారు. 1986–89 మధ్య సుంకాలు, వాణిజ్యాలపై సాధారణ ఒడంబడిక (గాట్‌)కు సంబంధించిన ఉరుగ్వే రౌండ్‌ చర్చల్లోనైనా, ఆ తర్వాత ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)పై జరిగిన దోహా రౌండ్‌ చర్చల్లోనైనా అమెరికా వ్యూహం ఇదే. 

బ్రెజిల్‌ నుంచి వచ్చిన 4 కోట్ల డాలర్ల దిగుమతులపై వంద శాతం సుంకాలు విధించింది. మన నుంచి వెళ్లిన వస్త్ర దిగుమతులపైనా ఇలాంటి చర్యే తీసుకోబోతున్నట్టు హెచ్చరించింది. దాంతో మేధా సంపత్తి హక్కుల(ఐపీఆర్‌)పై అమెరికా తీసుకొచ్చిన అన్యాయమైన నిబంధనలకు తలొగ్గక తప్పలేదు. ఆఫ్రికా దేశాలనూ ఇలాగే దారికి తెచ్చుకుంది. 

అమెరికా అతి పెద్ద మార్కెట్‌ కావటం వల్ల అత్యధిక దేశాలు దానికెళ్లే ఎగుమతులపై ఆధారపడి వుంటాయి. మన దేశం నుంచి అమెరికాకు వెళ్లే ఎగుమతులు 18 శాతమైతే థాయ్‌లాండ్‌ నుంచి 17 శాతం, దక్షిణ కొరియానుంచి 16 శాతం ఎగుమతులుంటాయి. అమెరికాకు మెక్సికో ఎగుమతులు ఏకంగా 78 శాతం.  

తమ సంపద పెంచుకోవటానికి సంపన్న రాజ్యాలు నిరంతరం ప్రయత్నిస్తుంటాయి. భారత్‌తో సహా అనేక దేశాలు సుదీర్ఘకాలం పరాయి పాలనలో మగ్గిపోవటానికి ఏకైక కారణం ఇదే. ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకు లభ్యతకూ, తయారైన సరుకు అమ్ముకోవటానికీ సరిహద్దులు దాటి వెళ్తూ సమయానుకూలంగా విధానాలు మార్చుకోవడం సంపన్న రాజ్యాల నైజం. 

గతంలో తన మార్కెట్‌ను విస్తరించుకోవటానికి డబ్ల్యూటీవో తీసుకొచ్చిన అమెరికాయే ఇప్పుడు వేరే మార్గానికి మళ్లింది. అయితే ట్రంప్‌ చర్యల వల్ల అమెరికాలో ద్రవ్యోల్బణం అధికమవుతుంది. సగటు పౌరుల జీవన వ్యయం పెరిగి పోతుంది. వ్యాపారం దెబ్బతిని నిరుద్యోగం ప్రబలుతుంది. ఆర్థిక వ్యవస్థ మందగిస్తుంది. తరతమ స్థాయిల్లో అన్ని దేశాలూ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనక తప్పదు. 

80 ఏళ్లుగా ప్రపంచ మార్కెట్లను శాసిస్తూ అతిగా సంపద పోగేసిన దేశమే ‘నన్ను అందరూ దోచుకుతింటున్నార’ంటూ పెడబొబ్బలు పెట్టడం ఒక వైచిత్రి. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ నేతృత్వంలోని బృందం అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం ఎదురుచూస్తోంది. 

ఇప్పుడు ఒక్కొక్క దేశం అమెరికాపై ప్రతీకార సుంకాలకు రెడీ అవుతోంది. మున్ముందు కొత్త మార్కెట్ల వెదుకులాట కూడా మొదలవుతుంది. ఇలాకాక దేశాలన్నీ సమష్టిగా వ్యవహరిస్తేనే ఏదో మేర ప్రయోజనం ఉంటుంది. అమెరికాపై ఒత్తిడి పెరిగి సహేతుకమైన పరిష్కారం వీలవుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement