నిద్రలేచిన ‘బోఫోర్స్‌ స్కాం’ | Sakshi Editorial On Bofors scandal | Sakshi
Sakshi News home page

నిద్రలేచిన ‘బోఫోర్స్‌ స్కాం’

Published Thu, Mar 6 2025 4:16 AM | Last Updated on Thu, Mar 6 2025 4:16 AM

Sakshi Editorial On Bofors scandal

నలభైయ్యేళ్ల క్రితం పుట్టుకొచ్చి, పుష్కరకాలం క్రితం శాశ్వత సమాధి అయిందనుకున్న బోఫోర్స్‌ కుంభకోణం మళ్లీ ఆవులిస్తోంది. దాన్ని సమాధి చేసేవరకూ ఇంచుమించు ప్రతియేటా ఏదో ఒక కొత్త సంగతితో బయటికొస్తూ, వచ్చినప్పుడల్లా పెను సంచలనానికీ, దుమారానికీ కారణమైన బోఫోర్స్‌ ఆ రకంగా ‘ఎవర్‌ గ్రీన్‌’. ప్రత్యేక న్యాయస్థానం జారీ చేసిన అభ్యర్థన పత్రంతో కొన్ని రోజుల క్రితం కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ, అమెరికా న్యాయ విభాగాన్ని సంప్రదించటంతో అది మరోసారి పతాక శీర్షికలకు ఎక్కబోతున్నదని భావించవచ్చు. 

అప్పట్లో బోఫోర్స్‌ స్కాంపై దర్యాప్తు చేశామని చెప్పిన అమెరికన్‌ ప్రైవేటు డిటెక్టివ్‌ సంస్థ ‘ఫెయిర్‌ ఫాక్స్‌’ నుంచి సమాచారం సేకరించాలన్నది సీబీఐ ప్రధాన ధ్యేయం. వాస్తవానికి ఈ అభ్యర్థన పత్రాన్ని జారీ చేయాల్సిందిగా నిరుడు అక్టోబర్‌లోనే ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానాన్ని సీబీఐ ఆశ్రయించిందని చెబుతున్నారు. 

ఇప్పటికీ ఎవరూ అధిగమించలేని స్థాయిలో 1984 లోక్‌సభ ఎన్నికల్లో తన నేతృత్వంలోని కాంగ్రెస్‌కు 404 స్థానాలు సాధించిపెట్టిన మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీని... ఆ తర్వాత మరో మూడేళ్లకు బయట పడిన ఈ కుంభకోణం ఊపిరాడనీయకుండా చేసింది. 

ఇందులో తనకు లేదా తన కుటుంబ సభ్యు లకు ఎలాంటి ప్రమేయమూ లేదని రాజీవ్‌ చెప్పిన మాటల్ని జనం విశ్వసించలేదు. 1989 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సగానికిపైగా స్థానాలు కోల్పోయి ప్రతిపక్షానికి పరిమితమైంది. వీపీ సింగ్‌ నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం 1990లో ఆదేశించే వరకూ నిందితులపై కేసు ల్లేవు. దర్యాప్తు లేదు. 

అంతవరకూ మన దేశంలో ఎవరికీ పెద్దగా తెలియని స్వీడన్‌ రేడియో 1987లో బోఫోర్స్‌ శతఘ్నుల కొనుగోళ్లలో ముడుపులు చేతులు మారాయని తొలిసారి వెల్లడించినప్పుడు మన దేశంలో రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి. అటు స్వీడన్‌లోనూ పెను సంచలనం కలిగించాయి. 

ఈ స్కాంలో మన రాజకీయ నాయకులు, రక్షణ అధికారులతోపాటు కొందరు విదేశీయులు పీకల్లోతు మునిగారని వెల్లడైంది. స్వీడన్‌ ఆయుధాల సంస్థ ఏబీ బోఫోర్స్‌ నుంచి నాలుగు వందల 155 ఎంఎం శతఘ్నులు కొనుగోలు చేయటానికి రూ. 1,437 కోట్లతో ఒప్పందం కుదరగా,అందులో రూ. 64 కోట్లు చేతులు మారాయన్నది ప్రధాన ఆరోపణ. 

ఇందులో ఇటలీ వ్యాపారవేత్త అటావియో కత్రోచి, బోఫోర్స్‌కు ఏజెంట్‌గా వ్యవహరించిన విన్‌చద్దా, పారిశ్రామికవేత్తలు హిందూజా సోదరుల పేర్లు వెల్లడయ్యాయి. ‘ది హిందూ’ దినపత్రిక జర్నలిస్టు చిత్రా సుబ్రహ్మణ్యం ఈ కుంభ    కోణంపై వరసబెట్టి రాసిన కథనాల పరంపరతో కాంగ్రెస్‌ ఇరకాటంలో పడింది. దీనికి తోడు బోఫోర్స్‌ సంస్థ ఎండీ మార్టిన్‌ ఆర్డ్‌బో రాసుకున్న డైరీలోని అంశాలు సైతం బట్టబయలయ్యాయి.

దాదాపు పదిహేనేళ్లపాటు దర్యాప్తు పేరుతో సీబీఐ సాగించిందంతా ఒక ప్రహసనం. ఆ తంతు సాగుతుండగానే 1993లో కత్రోచి మన దేశం నుంచి చల్లగా జారుకున్నాడు. అతని బ్యాంకు ఖాతాల విషయమై సమాచారం కావాలంటూ భారత్‌ నుంచి వచ్చిన అభ్యర్థనను పట్టించుకోవాల్సిన పని లేదంటూ స్విట్జర్లాండ్‌ విదేశాంగ మంత్రికి అంతకు ఏడాదిముందు... అంటే 1992లో పీవీ నరసింహారావు ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా ఉన్న మాధవ్‌సిన్హ్‌ సోలంకీ ఉత్తరం అందజేశారు. 

ఇక 2004లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ఏలుబడి మొదలయ్యాక దర్యాప్తు పూర్తిగా పడకేసింది. ఈ కేసుకు సంబంధించి కొత్త పాత్రధారులు తెరపైకొస్తున్నా, సరికొత్త వివరాలు వెల్లడవుతున్నా పట్టించుకున్న నాథుడే లేడు. ఈలోగా నిందితుల్లో కొందరు మరణించారు. కనీసం బతికున్న కత్రోచి పైన అయినా దర్యాప్తు కొనసాగించమని 2005లో ఢిల్లీ హైకోర్టు చెప్పినా సీబీఐ ముందుకు కదలనే లేదు. 

వాస్తవానికి అంతకుముందు 2003లో మలేసియాలోనూ, ఆ తర్వాత 2007లో అర్జెంటీనా లోనూ కత్రోచి కదలికలు కనబడినా అరెస్టుకు ప్రయత్నించలేదు. సరిగదా... లండన్‌లోని కత్రోచి ఖాతాలకూ, ముడుపులకూ సంబంధం లేదంటూ ఆ ఖాతాల స్తంభనను రద్దు చేయించి, 2009లో ‘వాంటెడ్‌’ జాబితా నుంచి అతని పేరు తొలగింపజేయటంలో సీబీఐ అత్యుత్సాహం ప్రదర్శించింది. 

నిందితులుగా ఉన్న కత్రోచి, విన్‌ చద్దాలకు రూ. 41 కోట్లు అందాయని ఆదాయపన్ను విభాగం అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ నిర్ధారించి వారిద్దరూ ఆ ఆదాయంపై పన్ను కట్టాల్సిందేనని 2011లో తేల్చి చెప్పింది. వీరిద్దరికీ ఏఈ సర్వీసెస్‌ నుంచీ, స్వెన్‌స్కా అనే సంస్థ నుంచీ సొమ్ములు బదిలీ అయ్యా యని తెలిపింది. ఆ తర్వాతైనా సీబీఐ చేయాల్సింది చేయలేదు. 

ట్రిబ్యునల్‌ ఉత్తర్వులిచ్చిన మర్నాడే కత్రోచిని పట్టుకోవటం మావల్ల కాదని కోర్టులో ఆ సంస్థ చేతులెత్తేసింది. నిందితులందరిపై కేసుల ఉపసంహరణకు అనుమతించమని అది దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రత్యేక కోర్టు అంగీకరించింది. కీలక నిందితుడు కత్రోచి 2013లో మరణించాడు. దీన్ని తిరగదోడేందుకు అనుమతించాలన్న సీబీఐ వినతిని సుప్రీంకోర్టు తీవ్ర జాప్యం చోటుచేసుకుందన్న కారణాన్ని చూపి 2018లో తోసిపుచ్చింది.

రాజీవ్‌ గాంధీకి ఈ ముడుపుల వ్యవహారంతో సంబంధం లేదని 2004లో ఢిల్లీ హైకోర్టు క్లీన్‌చిట్‌ ఇచ్చింది. కానీ ఆ తర్వాత కాలంలో దర్యాప్తు ఎందుకు నత్తనడకన సాగింది? ఎవరిని కాపాడటానికి ఆ సంస్థ తాపత్రయపడింది? ఒక స్విస్‌ బ్యాంక్‌లో ‘మాంట్‌ బ్లాంక్‌’ పేరిట ఉన్న ఖాతాలో బోఫోర్స్‌ ముడుపులున్నాయని తాము కనుగొన్నప్పుడు అప్పటి ప్రధాని రాజీవ్‌ గాంధీ ఆగ్రహోదగ్రు డయ్యారని ‘ఫెయిర్‌ ఫాక్స్‌’ సారథి మైకేల్‌ హెర్ష్‌మాన్‌ 2017లో చెప్పిన మాటల్లో వాస్తవం ఎంత? ఇందులో వెలికితీయాల్సిన చేదు నిజాలు చాలానే ఉన్నాయని ఈ పరిణామాలు చూస్తే అర్థమవు తుంది. ఈసారైనా ఆ పని జరుగుతుందా అనేది వేచిచూడాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement