Bofors scandal
-
స్వతంత్ర భారతి: బోఫోర్స్ కుంభకోణం
బోఫోర్స్ శతఘ్నుల కొనుగోలుకు జరిగిన లావాదేవీలలో రాజీవ్ గాంధీకి సన్నిహితులైనవారికి భారీ మొత్తంలో ముడుపులు ముట్టాయని వెల్లడి కావడం ప్రతిపక్షాలకు ఆయుధంగా ఉపయోగపడింది. అప్పటి వరకు యువ ప్రధాని రాజీవ్ గాంధీకి మిస్టర్ క్లీన్ అనే పేరు ఉండేది. బోఫోర్స్ ముడుపుల గురించి వెల్లడి కావడంతోనే ఆ మంచి పేరు కాస్తా తుడిచిపెట్టుకుపోయింది. 64 కోట్ల ఆ బోఫోర్స్ ముడుపుల కుంభకోణం నేటికీ దేశంలోని అవినీతికి ఒక ప్రతీకగా నిలిచిపోయింది. దర్యాప్తులు జరగడం, చార్జిషీట్లు దాఖలు అవడం, లెటర్ రొగేటరీలు జారీ అవడం జరిగినా వాస్తవంగా దోషులెవ్వరో ఇంతవరకు రుజువు కాలేదు. ఈ కేసు దేశంలో నేరస్థులకు శిక్ష వేయడంలో న్యాయ వ్యవస్థ వైఫల్యానికి కూడా నిదర్శనంగా నిలిచింది. కాంగ్రెస్‌ను అనునిత్య భయపెట్టిన ఈ కుంభకోణం రాజకీయ అవినీతి నిఘంటువులో అంతర్భాగంగా చిరకాలం నిలిచిపోతుంది. ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు ♦124 అత్యద్భుతమైన ఇన్నింగ్స్ కలిగి ఉన్న గవాస్కర్ 10,000 పరుగుల మైలురాయిని చేరుకున్నారు. ♦బ్యాంకు చెక్కుల క్లియరెన్సుకు ‘మేగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్ టెక్నాలజీ’ వాడకం ప్రారంభం. ♦మతకలహాల కారణంగా మీరట్‌లో జరిగిన అల్లర్లలో పోలీసుల కాల్పుల్లో ఒక వర్గానికి చెందిన 50 మంది దుర్మరణం. -
గవర్నర్ ఆ పేర్లన్నీ బయటపెట్టాలి!
పట్నా: బోఫోర్స్ స్కామ్‌పై బిహార్ గవర్నర్ సత్య పాల్ మాలిక్ చేసిన కామెంట్లు సంచలనం సృష్టిస్తున్నాయి. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ నిజాయితీపరుడని, ఆయన చుట్టూ ఉన్న కొందరు కాంగ్రెస్ నేతలే బోఫోర్స్ స్కామ్‌కు కారకులంటూ సత్య పాల్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపగా, ఆ పేర్లను గవర్నర్ బయటపెట్టాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది. మే 18న పట్నాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ మాలిక్.. రాజీవ్ గాంధీపై ప్రశంసలు గుప్పించారు. ప్రసంగంలో మధ్యలో బోఫోర్స్ ప్రస్తావన తీసుకొచ్చిన ఆయన రాజీవ్‌కు ఈ స్కామ్‌తో సంబంధం లేదని, ఆయన చాలా మంచి వ్యక్తని, చుట్టూ ఉన్న కొందరు తప్పుడు మనుషుల మూలంగానే ఆయన కళంకం ఎదుర్కోవాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఆ కాంగ్రెస్ నేతలు ఎవరో తనకు తెలుసున్న గవర్నర్ మాలిక్.. పేర్లు వెల్లడించేందుకు మాత్రం విముఖత వ్యక్తం చేశారు. దీనిపై బీజేపీ నేత, బోఫోర్స్ స్కామ్ కేసులో వాదనలు వినిపిస్తున్న న్యాయవాది అజయ్ అగర్వాల్ స్పందించారు. ‘ఈ కేసును తిరిగి దర్యాప్తు చేపట్టేందుకు సీబీఐ ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలో గవర్నర్ మాలిక్, ఆయన దగ్గర ఉన్న సమాచారాన్ని సీబీఐకి ఇస్తే ఎంతో మేలు చేసినట్లు అవుతుంది. దేశాన్ని కుదిపేసిన ఈ స్కామ్‌లో కాంగ్రెస్ కీలక నేతల హస్తం ఉందన్న అనుమానాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. మాలిక్ వ్యాఖ్యలతో అవి బలపడ్డాయి. ఆయన సహకరిస్తారని ఆశిస్తున్నాం’ అని అజయ్ తెలిపారు. కాగా, అజయ్ 2014 సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీపై పోటీ చేసి ఓడిపోయారు. ఇక బీజేపీ నేత అయిన సత్య పాల్ మాలిక్‌ను గతేడాది ఎన్డీయే ప్రభుత్వం బిహార్ గవర్నర్‌గా నియమించింది. బోఫోర్స్ నేపథ్యం... భారత ప్రభుత్వం స్వీడన్ ఆయుధ తయారీ సంస్థ ఏబీ బోఫోర్స్ మధ్య నాలుగు వందల 155ఎంఎం హోవిట్జర్లను కొనుగోలు చేసేందుకు 1986 మార్చి 24న రూ.1,437 కోట్ల ఒప్పందం కుదిరింది. 1987 ఏప్రిల్ 16న స్వీడన్ రేడియో.. ఆయుధాల కొనుగోలుకు సంబంధించి భారతీయ ప్రముఖ రాజకీయ నాయకులకు, రక్షణశాఖ అధికారులకు బోఫోర్స్ ముడుపులు చెల్లించిందని వెల్లడించింది. దీంతో 1990 జనవరి 22న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఏబీ బోఫోర్స్ అధ్యక్షుడు మార్టిన్ అర్డ్బో, మధ్యవర్తులుగా ఉన్న విన్ చద్దా, హిందూజా సోదరులపై నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీతోపాటుగా అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసింది. దీంతోపాటుగా 1982 నుంచి 1987 మధ్య పలువురు భారతీయ అధికారులు, ప్రైవేటు వ్యక్తులు అవినీతి, మోసానికి పాల్పడటం ద్వారా నేరపూరిత కుట్రలో భాగస్వాములయ్యారని పేర్కొంది. 1999 అక్టోబర్ 22న దాఖలు చేసిన తొలి చార్జిషీటులో చద్దా, ఒట్టావియో ఖత్రోచి, అప్పటి రక్షణ కార్యదర్శి ఎస్కే భట్నాగర్, బోఫోర్స్ కంపెనీ, అర్డ్‌బోల పేర్లను పేర్కొంది. 2000, అక్టోబర్ 9 దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీటులో హిందూజా సోదరుల పేర్లనూ పేర్కొంది. మార్చి4, 2011న సీబీఐ ప్రత్యేక కోర్టు ఖత్రోచీకి కేసునుంచి విముక్తి కల్పించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఖత్రోచి, భట్నాగర్, చద్దా, ఆర్డ్బో ఇప్పటికే మరణించారు. 2005లో హైకోర్టు తీర్పుకంటే ముందు 2004 ఫిబ్రవరిలో ఢిల్లీ హైకోర్టు మరో జడ్జి.. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీపై నమోదైన అభియోగాలను తోసిపుచ్చారు. సీఐఏ పత్రాల్లో...నాటి ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీకి తలవంపులు వస్తాయనే ఉద్దేశంతోనే అప్పట్లో బోఫోర్స్ ఆయుధాల కుంభకోణంపై స్వీడన్ దర్యాప్తు ఆపేసిందని అమెరికా దర్యాప్తు ఏజెన్సీ సీఐఏ పత్రాలు వెల్లడించాయి. విచారణ మరింత కొనసాగితే బోఫోర్స్ ఆయుధాల ఒప్పందంలో భారత అధికారులకు ముడుపులు ముట్టినట్లు వెల్లడవుతుందని స్వీడన్ భావించినట్లు ఆ పత్రాల్లో పేర్కొంది. 1988లో అప్పటి ప్రధాని రాజీవ్ స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్ పర్యటన అనంతరం బోఫోర్స్‌పై ప్రత్యేక పోలీసు దర్యాప్తు ఆగిపోయిందని అదే ఏడాది మార్చి 4న వెలువరించిన సీఐఏ నివేదిక చెబుతోంది. బోఫోర్స్ స్కాం ఆరోపణల ఫలితంగానే రాజీవ్ గాంధీ 1989లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. -
ప్రధాన రాజకీయ ఆయుధంగా 'అవినీతి'
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో నేడు పెరుగుతున్న రైతుల ఆత్మహత్యలు, ఉద్యోగాల కరువు, కుల, మత ఘర్షణలు, రేప్‌లు, హత్యలు రాజకీయ ఆయుధాలు కాకుండా పోయాయి. వేల కోట్ల రూపాయలను బ్యాంకులకు ఎగ్గొట్టిన నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల అవినీతి గురించి పాలకపక్షం, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు పరస్పరం దూషించుకుంటున్నాయి. అవినీతే మళ్లీ మళ్లీ ఆయుధం అవుతోంది. ఎందుకు ? 1987లో బోఫోర్స్ కుంభకోణం వెలుగులోకి వచ్చిన నాటి నుంచి రాజకీయ పక్షాలకు అవినీతే ప్రధాన ఆయుధంగా ఉంటూ వస్తోంది. నాడు బోఫోర్స్ కుంభకోణం గురించి ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో పాలకపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై గోల చేయడంతో ఆ తర్వాత 1989లో జరిగిన ఎన్నికల్లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం కూలిపోయింది. అంతకు ముందు పార్లమెంట్ ఎన్నికల్లో 404 సీట్లతో అఖండ విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికల్లో కేవలం 197 సీట్లకే పరిమితం అయింది. ఎన్నికలపై అవినీతి మంత్రం ఎంతటి ప్రభావాన్ని చూపిస్తుందో రాజకీయ పార్టీలకు మొదటిసారి తెలిసి వచ్చింది. 1991 నుంచి పాలకపక్షాన్ని అవినీతి పేరు మీద తూర్పారా పట్టడం ప్రతిపక్షాలకు ప్రధాన పనైంది. అవినీతి ఆరోపణల్లో ఎంత బలం ఉంది? కోర్టు ముందు అవినీతి తేలుతుందా? లేదా? అన్న అంశంతో సంబంధం లేకుండా ప్రజల దృష్టిలో అభాసుపాలు చేయడమే ప్రధాన ఉద్దేశంగా కొనసాగుతూ వస్తోంది. వీపీ సింగ్, చంద్రశేఖర్, హెచ్డీ దేవెగౌడ, ఐకే గుజ్రాల్, పీవీ నర్సింహారావు, మన్మోహన్ సింగ్‌లు ప్రధాన మంత్రులుగా ఉన్నప్పుడూ ఇదే జరిగింది. పీవీ నర్సింహారావుకు హర్షద్ మెహతా భారీ మొత్తంలో డబ్బులు చెల్లించినట్లు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తగా, మన్మోహన్ సింగ్ హయాంలో బొగ్గు, టెలిఫోన్ స్కామ్‌లపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు, కేసులు కొనసాగాయి. ఆ తర్వాత విజయం మాల్యా, ఇప్పుడు నీరవ్ మోదీ, చోక్సీల బాగోతాలు బట్టబయలయ్యాయి. ప్రభుత్వ ఖజానాకు చౌకీదారుగా వ్యవహరిస్తానంటూ 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడేం చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ దండెత్తడంతోపాటు.. దావోస్‌లో బిజినెస్ లీడర్లతో మోదీ దిగిన గ్రూప్ ఫోటోలో నీరవ్ మోదీ ఉండడాన్ని తప్పు పట్టింది. మెహుల్ చోక్సీని పేరుతో పిలిచే వీడియో క్లిప్‌ను ప్రచారంలోకి తెచ్చింది. దీనికి ప్రతిగా 2013లో నీరవ్ మోదీ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరైన విషయాన్ని, నీరవ్ మోదీకి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అభిషేక్ సింఘ్వీ భార్యా, కూతురు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా ఉన్న కంపెనీ ఆఫీస్ స్పేస్‌ను అద్దెకు ఇవ్వడాన్ని బీజేపీ పట్టుకు చూపింది. దేశంలో పెరుగుతున్న రైతుల ఆత్మహత్యలపై గ్రామీణ ఓటర్లు స్పందిస్తుండగా, అవినీతి ఆరోపణలపై పట్టణ ఓటర్లు స్పందిస్తున్నారు. రానున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఈ ఓటర్ల ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి! -
సుప్రీం ముందుకు ‘బోఫోర్స్’
న్యూఢిల్లీ: బోఫోర్స్ కుంభకోణంపై 2005లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ శుక్రవారం సుప్రీంలో పిటిషన్ వేసింది. కేసుకు సంబంధించి మరిన్ని స్పష్టమైన ఆధారాలు, కీలక సాక్ష్యాలతో ఈ పిటిషన్ వేసినట్లు సీబీఐ పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి బీజేపీ నేత అజయ్ అగర్వాల్ గతంలో ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు. అగర్వాల్ వేసిన పిటిషన్లో ప్రతివాదిగా మరో పిటిషన్ వేయాలంటూ అటార్నీ జనరల్ వేణుగోపాల్ ఇటీవలే సీబీఐకి మౌఖికంగా సూచించారు. పిటిషన్ వేసిన 90 రోజుల్లోనే సీబీఐ స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాల్సి ఉన్నప్పటికీ వివిధ కారణాలతో అది జరగలేదు. ఈ నేపథ్యంలో బోఫోర్స్ కేసుకు సంబంధించిన కీలకమైన దస్తావేజులు, సాక్షాలతో హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రూ.64కోట్లు చేతులు మారినట్లు ఆరోపణలున్న ఈ కేసులో యూరప్ పారిశ్రామిక వేత్తలైన హిందూజా సోదరులతోసహా పలువురిపై సీబీఐ వద్ద పూర్తి ఆధారాలున్నట్లు సమాచారం. మే 31, 2005న అప్పటి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ సోధి ఈ కుంభకోణంలో సీబీఐ కేసును కొట్టేశారు. అంతకుముందు, 2004 ఫిబ్రవరి4న మరో జడ్జి జస్టిస్ జేడీ కపూర్. ఈ కేసులో మాజీ ప్రధాని రాజీవ్ ప్రమేయం లేదంటూ నిర్దోషిగా ప్రకటించారు. ‘బోఫోర్స్’ కథాకమామిషు.. భారత ప్రభుత్వం స్వీడన్ ఆయుధ తయారీ సంస్థ ఏబీ బోఫోర్స్ మధ్య నాలుగు వందల 155ఎంఎం హోవిట్జర్లను కొనుగోలు చేసేందుకు 1986 మార్చి 24న రూ.1,437 కోట్ల ఒప్పందం కుదిరింది. 1987 ఏప్రిల్ 16న స్వీడన్ రేడియో.. ఆయుధాల కొనుగోలుకు సంబంధించి భారతీయ ప్రముఖ రాజకీయ నాయకులకు, రక్షణశాఖ అధికారులకు బోఫోర్స్ ముడుపులు చెల్లించిందని వెల్లడించింది. దీంతో 1990 జనవరి 22న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఏబీ బోఫోర్స్ అధ్యక్షుడు మార్టిన్ అర్డ్బో, మధ్యవర్తులుగా ఉన్న విన్ చద్దా, హిందూజా సోదరులపై నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీతోపాటుగా అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసింది. దీంతోపాటుగా 1982 నుంచి 1987 మధ్య పలువురు భారతీయ అధికారులు, ప్రైవేటు వ్యక్తులు అవినీతి, మోసానికి పాల్పడటం ద్వారా నేరపూరిత కుట్రలో భాగస్వాములయ్యారని పేర్కొంది. 1999 అక్టోబర్ 22న దాఖలు చేసిన తొలి చార్జిషీటులో చద్దా, ఒట్టావియో ఖత్రోచి, అప్పటి రక్షణ కార్యదర్శి ఎస్కే భట్నాగర్, బోఫోర్స్ కంపెనీ, అర్డ్‌బోల పేర్లను పేర్కొంది. 2000, అక్టోబర్ 9 దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీటులో హిందూజా సోదరుల పేర్లనూ పేర్కొంది. మార్చి4, 2011న సీబీఐ ప్రత్యేక కోర్టు ఖత్రోచీకి కేసునుంచి విముక్తి కల్పించింది. 2013 జూలై 13న ఖత్రోచీ మరణించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న భట్నాగర్, చద్దా, అర్డ్‌బోలు కూడా చనిపోయారు. -
మళ్లీ తెరపైకి బోఫోర్ కుంభకోణం కేసు
-
దళిత రాజకీయాలే కీలకమా?
జాతిహితం మైనారిటీలు, దళితులు, ఆదివాసుల నుంచి ఏ ఒక్కరూ నేడు కేంద్రంలో కీలక మంత్రు లుగా లేదా జమ్మూకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలలో మినహా మరెక్కడా సీఎంలుగా లేరు. ఈ పరిస్థితే మెవానీకి అవకాశాన్ని కల్పిస్తోంది. బీజేపీ ఈ ముప్పును లెక్కచేయడం లేదు. దేన్నయినా జయించగల సమున్నత శక్తినని అది భావిస్తోంది. దళిత ఐక్యత వల్ల కలిగే ముప్పును మొగ్గలోనే తుంచేయగలనని అది భావిస్తోంది. కాబట్టే దళితుల ఆందోళనల పట్ల అతిగా ప్రతిస్పందిస్తోంది. భీమా–కొరెగాం ఉదంతం వాటిలో తాజాది. దళితులు మన జాతీయ రాజకీయాలను నిర్ణయాత్మకంగా ప్రభావితం చేసే శక్తిగా ఆవిర్భవించనున్నారా? దళిత ఆత్మవిశ్వాసంగా ఇటీవల అభివర్ణిస్తు న్నది కేవలం సామాజిక–రాజకీయపరమైనదేనా లేక జోరుగా సాగనున్న ఈ ఎన్నికల ఏడాదిలో వర్తమాన రాజకీయాల ధోరణిని బద్దలుకొట్టే శక్తి దానికి ఉన్నదా? ఉన్నట్టయితే, ఆ రాకెట్లో మే 2019 వరకు సరిపడేటంత ఇం«దనం ఉన్నదా? లే క అంతకంటే ముందుగానే కొడిగట్టిపోతుందా? ఈ ప్రశ్నల పరం పరను మరో రెండు ప్రశ్నలతో ముగిద్దాం. ఈ నూతన అంశం జిగ్నేశ్ మెవానీ రూపంలో వ్యక్తమౌతోందా? రాజకీయ పరిభాషలో ఆయన సరికొత్త కాన్షీరాం కానున్నారా? లేక మహేంద్రసింగ్ తికాయత్ లేదా రిటైర్డ్ కల్నల్ కిశోరీసింగ్ బైంస్లాల వంటి వారు మాత్రమేనా? నేను చెప్పదలుచుకున్న అంశమైతే ఇదే.. కాన్షీరాం దేశ ప్రధాన భూభాగంలోని రాజకీయాలను ప్రగాఢంగా ప్రభావితం చేశారు. మిగతా ఇద్దరికీ వివిధ సమయాల్లో జాట్లు, గుజ్జర్ల మద్దతున్నా క్రమంగా తెరమరుగయ్యారు. దళిత ఓటర్లను సంఘటితం చేయగలరా? దేశ ఓటర్లలో దాదాపు 16.6 శాతం ఉండే దళితులు నిజానికి ముస్లింల కంటే మరింత శక్తివంతమైన ఓటు బ్యాంకు. కేరళ, తమిళనాడు వంటి కొన్ని రాష్ట్రాల్లో తప్పితే 1989కి ముందు కాంగ్రెస్ దళితులంతా తమ ఓటర్లేనని భావించగలిగేది. 1989 నుంచి కాంగ్రెస్ వెనుకబడిన కులాలు, ముస్లింలతో పాటూ దళితుల ఓట్లను కోల్పోవడం మొదలైంది. ముస్లింలకు భిన్నంగా దళితులు ఎన్నడూ వ్యూహాత్మకంగా లేదా ఒక పార్టీని ఎన్నుకోవాలి లేదా మరో పార్టీని అధికారానికి దూరంగా ఉంచాలి అనే ఏకైక లక్ష్యంతో ఎన్నడూ ఓటు చేయలేదు. ఉత్తరప్రదేశ్, బిహార్ సహా చాలా కీలక రాష్ట్రాల్లో దళితుల ఓట్లు కాంగ్రెసేతర పార్టీలకు వెళ్లాయి. బీజేపీకి అది ఉపయోగపడింది. దళి తులలో కొందరు నరేంద్ర మోదీ పట్లా్ల, ఇటీవలి కాలంలో ఆ పార్టీ పట్ల కూడా ఆకర్షితులయ్యారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు తదుపరి దశలో... జాతీయ రాజ కీయాల్లో ఏమంత ప్రాధాన్యం లేనంతగా దళితుల ఓట్లు చీలిపోయాయి. మరోవిధంగా కూడా ముస్లింలకంటే దళితులు విభిన్నమైన ఓటర్లు. దళితుల ఓట్లు వివిధ రాష్ట్రాల్లో బాగా చెల్లా చెదురుగా ఉన్నాయి. కాబట్టి ముస్లింల వలే చాలా రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలను తలకిందులు చేయగల శక్తిని కోల్పో యారు. ఉత్తరప్రదేశ్ ఒక్కటే ఇందుకు మినహాయింపు. దళిత ఓటర్లు అత్య ధికంగా ఉన్నది పంజాబ్‌లో (32%). కానీ వారిలో చాలా మంది సిక్కులు. ఆ రాష్ట్రంలో ఓటర్లు కులం ప్రాతిపదికపై సమీకృతం కారు. కానీ పెద్ద సంఖ్యలో ఎవరి ఓట్లయినా ఒక పక్షంవైపు మొగ్గితే బలాబలాలు తారుమారు అవు తాయి. అందువల్ల మనం ముందు వేసిన ప్రశ్నల సారం ఒక్కటే.. దళిత ఆత్మ విశ్వాసానికి ప్రాతినిధ్యం వహిస్తూ, వారికి నాయకత్వం వహిస్తున్న మెవానీ దళిత ఓట్లను అలా సంఘటితం చేయగలరా? ఆ పని చేయగలిగితే అది ప్రస్తుత రాజకీయాల ధోరణిని భగ్నం చేయగలుగుతుంది. మెవానీ దళిత నేతగా ఆవిర్భవించినా ఆయన చాలా రాష్ట్రాలకు విస్తరిం చిన జనాకర్షణశక్తిగల నేత కూడా కావాల్సి ఉంటుంది. దళితులను అందరినీ సమీకరించగలిగిన ఒక నేత అవసరం. 1970ల మధ్య వరకు జగ్జీవన్‌రాం కాంగ్రెస్‌కు అలాంటి నేతగా ఉండేవారు. ఆ తర్వాత మరో దళిత నేతకు అలాంటి సాధికారతను కల్పించడంలో కాంగ్రెస్ విఫలమైంది. దాదాపు 8 శాతం ఓటర్లుగా ఉన్న ఆదివాసులకు చెందిన అలాంటి జాతీయ స్థాయి నేత ఏ పార్టీకీ, ప్రత్యేకించి కాంగ్రెస్‌కు (పీఏ సంగ్మా తర్వాత) లేరు. ఈ విష యంలో బీజేపీ పరిస్థితి మరీ అధ్వానం. దళితుడైన రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా ఉన్నా అది లెక్కలోకి రాదు. దళిత ఐక్యతకు అందివచ్చిన అవకాశం మైనారిటీలు, దళితులు, ఆదివాసులలో ఎవరూ కేంద్రంలో కీలక మంత్రులుగా లేదా జమ్మూకశ్మీర్, ఈశాన్యాలను మినహా రాష్ట్ర ముఖ్యమంత్రులుగా లేని ఆసక్తికరమైన పరిస్థితి నేడుంది. సరిగ్గా ఇదే జిగ్నేశ్ మెవానీకి అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ ముప్పును లెక్కచేయనంతటి రాజకీయ చతురత మోదీ–షాల బీజేపీకి ఉంది. దేన్నయినా జయించేయగల సమున్నత శక్తిననే ఆలోచనా ధోరణి దానిది. కాబట్టి తలెత్తగల ఆ ముప్పుతో తలపడి సాధ్యమైనంత త్వరగా, మొగ్గలోనే తుంచేయాలని ఆ పార్టీ భావిస్తుంది. క్షేత్రస్థాయిలో దళి తులు కార్యాచరణకు దిగడం పట్ల వారు అతిగా ప్రతిస్పందించడంలో అదే వ్యక్తమౌతోంది. భీమా–కొరెగాం ఉదంతం వాటిలో తాజాది. ఉనాలో గోరక్షకులు దళితులపై సాగించిన అత్యాచారం నేపథ్యంలో మెవానీ నేతగా ముందుకు వచ్చారు. తొలుత ఆయనను గుజరాత్‌కే పరిమి తమైన స్థానిక నేతగానే చూశారు. రాజకీయంగా పెద్దగా లెక్కలోకి తీసుకోవా ల్సిన వాడిగా చూడలేదు. ఆయన రాజకీయాల్లో మొదట్లో సాంప్రదాయ కమైన ఎన్నికల రాజకీయాలను మెచ్చని జేఎన్‌యూ తరహా భావజాలం కని పించింది. అదికాస్తా ఆయన ఎన్నికల బరిలోకి దిగాలని, అది కూడా బూర్జువా జాతీయ పార్టీ కాంగ్రెస్‌తో కూటమి కట్టాలని నిర్ణయించు కోవ డంతోనే అది ఒక్కసారిగా పూర్తిగా మారిపోయింది. ఆయన ప్రస్తుతం గుజ రాత్‌లోని ఒక ఎంఎల్ఏ మాత్రమే. అయినా అంతకంటే చాలా ఎక్కువ గానే లెక్కలోకి వస్తారు. ఇతర రాష్ట్రాలలోని దళితులకు తన సందేశాన్ని విని పించే అవకాశాన్ని కూడా అది ఆయనకు కల్పిస్తుంది. ఈ వారంలో ఆయన మహా రాష్ట్రలో చేసినది సరిగ్గా అదే. మెవానీలో చాలా బలమైన అంశాలు చాలానే ఉన్నాయి. యవ్వనం, అద్భుత వాక్పటిమ, సామాజిక మాధ్యమాలను ఉపయోగించగల శక్తిసామ ర్థ్యాలు, రాజకీయ, భావజాలపరమైన పట్టువిడుపుల గుణం ఆయనకు న్నాయి. అంతేకాదు, ఇప్పటికి ఏకైక శత్రువు బీజేపీ మాత్రమేనంటూ దానిపైకే గురిపెట్టి... మిగతా వారందరితోనూ కలవగల దృష్టి కేంద్రీకరణ కూడా ఉంది. పైగా ఆయన దళితులలోని ప్రధానమైన ఒక ఉపకులానికి చెంది నవారు. ఆయన వచ్చింది చిన్న రాష్ట్రం నుంచి, అయితే ఆయనకు ముందు కాన్షీరాం కూడా ఆయనలాగే ఒక చిన్న రాష్ట్రం నుంచి వచ్చి జాతీయస్థాయిలో అత్యంత ప్రబలమైన రాజకీయ ధోరణిని నిర్మించారు. అది ఆయనకు అను కూలంగా పనిచేసే మరో బలీయమైన అంశం అవుతుంది. పంజాబీ అయిన కాన్షీరాం కూడా సాంప్రదాయకంగా చెప్పుకోదగినది కాని ప్రాంతం నుంచి రంగం మీదకు వచ్చారు. డీఆర్డీఓలో సైంటిస్టుగా పనిచేస్తూ, అంబేడ్కర్ రచనలతో ప్రభావితుడై ఆయన షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన కులాలు, మైనారిటీ ఉద్యోగుల జాతీయ స్థాయి సంఘాన్ని (బీఏఎంసీఈఎఫ్) నిర్మించడంతో ప్రారంభించారు. అప్పటివరకు దళితులు అనే పదం పెద్దగా వాడుకలో లేదు. మొదట్లో ఆయన పతాకశీర్షికలకు ఎక్కా లని తాపత్రయపడేవారిలా కనిపించారు. 1980ల చివరి కాలం అస్థిరమైనది, కాంగ్రెస్ క్షీణిస్తూ పలు వేర్పాటువాద ఉద్యమాలు పుట్టుకొచ్చాయి. కాన్షీరాం చూపిన రాజకీయ చతురత ఉందా? సిక్కు వేర్పాటువాద నేతలు సహా రకరకాల గ్రూపులను ఆయన ఒక్క చోటికి చేర్చి భారీగా ప్రజలను సమీకరించారు. అయినా ఆయనను పెద్దగా లెక్క చేయలేదు. త్వరలోనే ఆయన తన శక్తిని పెంచుకుని, వారందరినీ వదిలించే సుకున్నారు. తన రాజకీయాలు వృద్ధి చెందాలంటే మెవానీ కూడా ఉమర్ ఖలీద్‌ను విడిచిపెట్టాలి. దేశ ప్రధాన భూభాగంలో వేళ్లూనుకోనిదే జాతీయ వాదాన్ని లేదా మతాన్ని ఢీకొంటూ దళిత రాజకీయాలను నిర్మించలేమని కాన్షీరాం 30 ఏళ్ల క్రితమే కనిపెట్టారు. దాన్ని మెవానీ గుర్తించాలి. అయితే, కాన్షీరాంగానీ, మాయావతిగానీ హిందూయిజాన్ని తిరస్కరించలేదు లేదా బౌద్ధాన్ని స్వీకరించలేదు. ‘‘మన పోరాటం హిందూ దేవతలతో కాదు మను వాదులతో’’ అనే వారాయన. ఇక బుద్ధుడంటారా? మను వాదులు మూడు కోట్ల దేవతల్లో ఒకడిని చేసేస్తారు అంటుండేవారు. ఆయన రాజకీయాల్లోకి ప్రముఖంగా ముందుకు వచ్చినది 1988లో. బోఫోర్స్ కుంభకోణం విష యంలో రాజీవ్‌ను తప్పు పడుతూ వీపీ సింగ్ ఆయన మంత్రివర్గం నుంచి రాజీనామా చేశారు. అదేసమయానికి అమితాబ్ బచ్చన్ రాజీనామా చేయ డంతో అలహాబాద్ పార్లమెంటు స్థానానికి ఉపఎన్నిక అవసరమైంది. వీపీ సింగ్‌కు, కాంగ్రెస్ అభ్యర్థి, లాల్‌బహదూర్ శాస్త్రి కుమారుడు సునీల్ శాస్త్రికి మధ్యనే పోటీ జరుగుతున్నదని మేం అంతా అనుకున్నాం. కొన్ని రోజుల ప్రచారం జరిగే సరికే కాన్షీరాం నిర్ణయాత్మక శక్తిగా ముందుకు వచ్చారు. అప్పుడే మేం మొదటిసారిగా సూటిగా సరళంగా దళిత రాజకీయాలను విన్నాం : ‘‘40 ఏళ్లుగా మనం జంతువుల్లా బతికాం. మనుషులుగా బతకా ల్సిన సమయం వచ్చింది.’’ ఆయన ఎన్నికల ప్రచారంలో, ఆ తర్వాత రూప కల్పన చేసిన రాజకీయాల్లో మూడు అంశాలు కొట్టవచ్చిట్టు కనిపించేవి. ఒకటి, అస్పష్టంగానైనా వేర్పాటువాది అనిపించిన వారెవరైనా వారిని ఆయన దూరంగా ఉంచేవారు. రెండు, తన కుటుంబ జాతీయవాద, సైనిక వారసత్వాన్ని పదే పదే ఏకరువు పెడుతుండేవారు. అంతేకాదు, తన ప్రచా రాన్ని కూడా సైనిక పద్ధతుల్లోనే నిర్వహించేవారు: ప్రింటింగ్ బ్రిగేడ్, పాంప్లెట్ బ్రిగేడ్, దళిత బస్తీల్లో డబ్బాలు పట్టుకుని చందాలు సేకరించే బిచ్చగాళ్ల బ్రిగేడ్లను నిర్మించేవారు. వాళ్లిచ్చే డబ్బు ఎంత అని కాదు. ‘‘ఒక పారిశుద్ధ్య కార్మికుడు ఒకసారి ఒక రూపాయి ఇచ్చాడంటే, కాంగ్రెస్ వెయ్యి రూపాయలిచ్చినా దానికి ఓటు వేయడు’’ అనేవారు. ఇక మూడవది, అతి ముఖ్యమైనది. ఆయన తన శిబిరాన్ని సువిశాలంగా మార్చారు. బహుజన సమాజ్ అనే నిర్వచనంతో ఇతర వర్గాలన్నిటినీ ఆకర్షించడానికి ప్రయత్నిం చారు. అలాగే ఆయన ఓట్లు మావి, అధికారం మీదా/ ఇక చెల్లదు, ఇక చెల్లదు అనే నినాదాన్ని తయారుచేశారు. తర్వాతి కాలంలో అధికారంలోకి రావడా నికి ముస్లింలను, కొన్ని ఉన్నత కులాలను కూడా కలుపుకుపోవాలని ఆయన, మాయావతి గుర్తించారు. అదే వారిని అధికారంలోకి తెచ్చింది. ఓడినా మాయావతిని ఇంకా ప్రబల శక్తిగా నిలిపింది. దళిత కౌటిల్యునిగా కాన్షీరాం తన మేధస్సుతో మాయావతిని తన చంద్రగుప్తునిగా తయారుచేశారు. మెవానీకి అలాంటి నైపుణ్యం, ప్రతిభ, తదేక దృష్టి ఉన్నాయా? చెప్పడం కష్టమే. కానీ, బీజేపీ, హిందూ ఉన్నత వర్గాలకు చెందిన మితవాదశక్తులూ ఆయన గురించి ఆందో ళన చెందడమే ఆ విషయాన్ని విశదం చేస్తుంది. శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
‘బోఫోర్స్’ పై పునర్విచారణ
-
‘బోఫోర్స్’ పై పునర్విచారణ
12 ఏళ్ల నాటి పిటిషన్‌పై సుప్రీంకోర్టు అంగీకారం ►అక్టోబర్ 30 తర్వాత విచారణ జరుపుతామన్న ధర్మాసనం న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి న 30 ఏళ్ల నాటి బోఫోర్స్ కుంభకోణం మళ్లీ తెరపైకి వచ్చింది. రూ.64 కోట్ల ముడుపులకు సంబంధించిన ఈ కేసు పునర్విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. 2005 మే 31న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ సోదీ.. యూరప్‌కు చెందిన పారిశ్రామికవేత్తలైన హిందూజా సోదరులైన శ్రీచంద్, గోపీచంద్, ప్రకాశ్‌చంద్‌తో పాటు బోఫోర్స్ కంపెనీపై అభియోగాలను కొట్టే శారు. అలాగే ఈ కేసు దర్యాప్తు కోసం రూ.250 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టడంపై సీబీఐపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ 90 రోజుల గడువులోగా అప్పీలు చేయడంలో సీబీఐ విఫలం కావడంతో 2005 అక్టోబర్ 18న సుప్రీంకోర్టులో బీజేపీ సీనియర్ నేత అజయ్ కుమార్ అగర్వాల్ మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. 12 ఏళ్ల నాటి అగర్వాల్ పిటిషన్‌పై త్వరితగతిన విచారణ జరిపేందుకు సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం అంగీకారం తెలిపింది. అక్టోబర్ 30 తర్వాత కేసు విచారణ చేపడతామంది. అత్యున్నత స్థాయిలో ముడుపులు చేతులు మారాయని ఇటీవల స్వీడన్ చీఫ్ ఇన్వెస్టిగేటర్ స్టెన్ లిండ్స్టర్మ్ వ్యాఖ్యానించినట్టు మీడియాలో వార్తలు రావడంతో పార్లమెంట్లో బీజేపీ ఎంపీలు బోఫోర్స్ కేసు పునర్విచారణకు డిమాండ్ చేసిన నేపథ్యంలో కోర్టు త్వరితగతిన విచారణ చేపడతామని ప్రకటించడం గమనార్హం. బోఫోర్స్ కుంభకోణం ఇదీ 400 అత్యాధునిక తుపాకుల సరఫరా నిమిత్తం స్వీడిష్ ఆయుధ తయారీ సంస్థ ఏబీ బోఫోర్స్, భారత ప్రభుత్వం మధ్య 1986 మార్చి 24న రూ.1,437 కోట్ల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం కోసం బోఫోర్స్.. భారత్‌లో ప్రముఖ రాజకీయ నాయకులు, రక్షణ అధికారులకు భారీగా ముడుపులు చెల్లించినట్టు 1987 ఏప్రిల్ 16న స్వీడిష్ రేడియో ప్రకటించడంతో దుమారం రేగింది.దీంతో 1990 జనవరిలో సీబీఐ వివిధ సెక్షన్ల కింద అప్పటి బోఫోర్స్ ప్రెసిడెంట్ మార్టిన్ ఆర్డ్బో, మధ్యవర్తి విన్ చద్దా, హిందూజా సోదరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 1999 అక్టోబర్ 22న చద్దా, ఇటలీ వ్యాపారవేత్త ఒట్టావియో ఖత్రోచి, అప్పటి రక్షణ శాఖ కార్యదర్శి ఎస్కే భట్నాగర్, ఆర్డ్బో, బోఫోర్స్ కంపెనీలపై తొలి చార్జిషీట్ దాఖలు చేసింది. అక్టోబర్ 9న హిందూజా సోదరులను చేరుస్తూ అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఖత్రోచిపై ఉన్న కేసును 2011, మార్చి 4న ఢిల్లీలోని సీబీఐ కోర్టు కొట్టేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఖత్రోచి, భట్నాగర్, చద్దా, ఆర్డ్బో ఇప్పటికే మరణించారు. 2005లో హైకోర్టు తీర్పుకంటే ముందు 2004 ఫిబ్రవరిలో ఢిల్లీ హైకోర్టు మరో జడ్జి.. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీపై నమోదైన అభియోగాలను తోసిపుచ్చారు. -
రాజీవ్ కోసమే స్వీడన్ బోఫోర్స్ దర్యాప్తు ఆపేసింది
న్యూఢిల్లీ: నాటి ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీకి తలవంపులు వస్తాయనే ఉద్దేశంతోనే అప్పట్లో బోఫోర్స్ ఆయుధాల కుంభకోణంపై స్వీడన్ దర్యాప్తు ఆపేసిందని సీఐఏ పత్రాలు వెల్లడించాయి. విచారణ మరింత కొనసాగితే బోఫోర్స్ ఆయుధాల ఒప్పందంలో భారత అధికారులకు ముడుపులు ముట్టినట్లు వెల్లడవుతుందని స్వీడన్ భావించినట్లు ఆ పత్రాల్లో పేర్కొన్నారు. 1988లో అప్పటి ప్రధాని రాజీవ్ స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్ పర్యటన అనంతరం బోఫోర్స్‌పై ప్రత్యేక పోలీసు దర్యాప్తు ఆగిపోయిందని అదే ఏడాది మార్చి 4 నాటి సీఐఏ నివేదిక చెబుతోంది. బోఫోర్స్ స్కాం ఆరోపణల ఫలితంగానే రాజీవ్ గాంధీ 1989లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. -
బోఫోర్స్ గన్స్ నాణ్యమైనవే!
న్యూఢిల్లీ: బోఫోర్స్ గన్స్ నాణ్యతలో అద్భుతమైనవి అనడంలో ఎటువంటి సందేహం లేదని రక్షణమంత్రి మనోహర్ పరిక్కర్ అభిప్రాయపడ్డారు. అప్పట్లో దేశాన్ని కుదిపేసిన బోఫోర్స్ కుంభకోణం అంశాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తాజాగా లేవనెత్తడంపై మీడియా అడిగిన ప్రశ్నలకు పరిక్కర్ పై విధంగా స్పందించారు. స్వీడన్ కు చెందిన బోఫోర్స్ గన్స్ నాణ్యతలో మేటి అని ఆయన తెలిపారు. అయితే ప్రణబ్ వ్యాఖ్యలపై మాట్లాడానికి పరిక్కర్ నిరాకరించారు. దానిపై ఏమీ మాట్లాడుదలుచుకోలేదని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కేవలం ఆ గన్స్ నాణ్యతపై అడిగితే మాత్రం అవే అద్భుతమైనవిగా చెబుతానని పరిక్కర్ చమత్కరించారు. స్వీడన్ ఛానల్ స్వదేశ్ నేషనల్ డైలీ ఇంటర్వ్యూలో రాష్ట్రపతి బోఫోర్స్ కుంభకోణం అంశాన్ని లేవనెత్తిన సంగతి తెలిసిందే. బోఫోర్స్ కుంభకోణం అని ఏ న్యాయస్థానం ఇంకా నిర్ధారించలేదని.. బోఫోర్స్ శతఘ్నులు అద్భుతమైనవని ఆర్మీ అధికారులు ధ్రువీకరించిన తర్వాతే కొనుగోలు చేశామని ప్రణబ్ తెలిపారు. బోఫోర్స్ కొనుగోలు సమయంలో తాను రక్షణమంత్రిగా ఉన్నాన్న సంగతిని ప్రణబ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. 1986లో దేశాన్ని కుదిపేసిన బోఫోర్స్ కుంభకోణం మరోసారి తెరపైకి రావడంతో ప్రస్తుతం ఆ అంశం చర్చనీయాంశంగా మారింది. అప్పట్లో స్వీడన్‌కు చెందిన హోవిట్జర్ తుపాకులను భారత సైన్యానికి సరఫరా చేసేందుకు కుదుర్చుకున్న రూ.1600 కోట్ల ఒప్పందంలో రూ.64 కోట్ల ముడుపులు చేతులు మారినట్లు అభియోగాలు ఉన్నాయి. -
బోఫోర్స్ కుంభకోణం అని ఏ కోర్టు నిర్ధారించలేదు: ప్రణబ్
న్యూఢిల్లీ : దేశాన్ని కుదిపేసిన 'బోఫోర్స్' వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. బోఫోర్స్ ఒప్పందం కుంభకోణం తేనెతుట్టను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కదిలించారు. బోఫోర్స్ ఒప్పందం ...కుంభకోణం అని నిర్థారాణ కాలేదని ఆయన అన్నారు. బోఫోర్స్ ఒప్పందం స్కాం అని మీడియాలోనే వచ్చిందని ప్రణబ్ పేర్కొన్నారు. స్వీడన్ ఛానల్ స్వదేశ్ నేషనల్ డైలీ ఇంటర్వ్యూలో ఆయన పైవిధంగా స్పందించారు. బోఫోర్స్ కుంభకోణం అని ఏ న్యాయస్థానం ఇంకా నిర్ధారించలేదన్నారు. బోఫోర్స్ కొనుగోలు సమయంలో తాను రక్షణమంత్రిగా ఉన్నానన్నారు. బోఫోర్స్ శతఘ్నులు అద్భుతమైనవని ఆర్మీ అధికారులు ధ్రువీకరించిన తర్వాతే కొనుగోలు చేశామన్నారు. స్వీడన్‌కు చెందిన హోవిట్జర్ తుపాకులను భారత సైన్యానికి సరఫరా చేసేందుకు 1986లో కుదుర్చుకున్న రూ.1600 కోట్ల ఒప్పందంలో రూ.64 కోట్ల ముడుపులు చేతులు మారినట్లు అభియోగాలు ఉన్నాయి. 'బోఫోర్స్' దెబ్బకు 1989లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. బోఫోర్స్ కుంభకోణంలో కీలక పాత్రధారి అయిన ఇటాలియన్ వ్యాపారి ఒట్టావియో ఖత్రోకీ ఆరోపణలు ఎదుర్కొన్న ఖత్రోకీ, అరెస్టును తప్పించుకునేందుకు 1993లో భారత్‌ను విడిచి పారిపోయాడు. అతడి అప్పగింత కోసం సీబీఐ రెండుసార్లు విఫలయత్నాలు చేసింది. తొలుత 2002లో మలేసియాను, తర్వాత 2007లో అర్జెంటీనాను ఖత్రోకీ అప్పగింత కోసం కోరినా ఫలితం లేకపోయింది. 2013 జులైలో ఇటలీలోని మిలాన్ నగరంలో అతడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ వ్యవహారంపై బీజేపీ... మరోసారి సీబీఐ దర్యాప్తుకు అప్పట్లో డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. -
సీబీఐకి ఎందుకీ ‘రక్షణ’ కవచం?
మనం ఇప్పటికీ అవినీతి గుట్టు వెల్లడించే వారిని వెంటాడి వేధిస్తున్నామే గాని, బయటకు వచ్చిన సమాచారం మేరకు పరిశోధన చేసి అవినీతిని ఆపడానికి ఏమీ చేయడం లేదు. అక్రమమో, సక్రమమో కీలకమైన అవినీతి సమాచారం వెల్లడిస్తే, ఆ క్లూను మరింత తవ్వి అవినీతిని వేళ్లతో సహా పెకిలించడం దర్యాప్తు సంస్థల బాధ్యత, వారిని పాలించే ప్రభుత్వాల ధర్మం. బోఫోర్స్ లంచాల గుట్టు బయటపడడానికి మూలం సమాచార హక్కు. స్వీడన్లో సమాచార స్వాతంత్య్రం 1766 నుంచి ఉన్న ది. అందుకే, తుపాకులు అమ్ము కోవడానికి భారత్‌లో పెద్దలంద రికీ స్వీడన్ భారీ ముడుపులు అందజేసిందని ఆ దేశ అధికారిక రేడియో చెప్పగలిగింది. భార త్లో ఆనాడు సమాచార స్వేచ్ఛా చట్టం లేకపోయినా, స్వీడన్లో ఉండడం వల్ల ఈ వ్యవ హారం బయటపడింది. బోఫోర్స్ కుంభకోణం బయట పడడానికి స్వీడన్‌లోని 1766 నాటి తొలి సమాచార హక్కు చట్టం ఉపయోగపడితే, అదే బోఫోర్స్ సమాచారం దాచ డానికి 2005 నాటి సమాచార హక్కు చట్టం నుంచి మన కేంద్ర ప్రభుత్వం ిసీబీఐని తొలగించడమే విషాదం. ఇప్పటి లక్షల కోట్ల వ్యాపార రాజకీయాల ముందు, బోఫోర్స్ కుంభకోణంలో చెల్లించినట్టు చెప్పే 64 కోట్లు చాలా తక్కువే. ‘మిస్టర్ క్లీన్’ రాజీవ్ గాంధీ పాలనను కుది పివేసిన కుంభకోణమిది. ఉన్నత స్థానాలలో పెద్దల అవి నీతిని ప్రశ్నించడమే గాక, ఈ దేశ రాజకీయ స్వరూపాన్నే మార్చింది. ఏక పార్టీ పాలన ముగిసి సంకీర్ణకూటముల, ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యం మొదలైంది. అవినీతి మాత్రం తగ్గలేదు. కానీ పత్రికా స్వాతంత్య్రం, ప్రజా ైచైతన్యం, న్యాయస్థానాల సమీక్షతో అవినీతిపైన పోరాడ వచ్చని తేలింది. బోఫోర్స్ కేసు చార్జిషీటు వరకు రాకముందే నిందితులంతా చనిపోయారు. ఇటాలియన్ వ్యాపారి కత్రోచీ మరణించే దాకా దర్యాప్తు వాయిదా పడిం ది. కత్రోచీతోనే బోఫోర్స్ న్యాయసాధనోద్యమం కూడా మరణించింది. మనం ఇప్పటికీ అవినీతిని వెల్లడించే వారిని వెంటాడి వేటాడి వేధిస్తున్నామే గాని బయటకు వచ్చిన సమాచారం మేరకు పరిశోధన చేసి అవినీతిని ఆపడానికి ఏమీ చేయడం లేదు. అక్రమమో సక్రమమో కీలకమైన అవినీతి సమాచారం వెల్లడిస్తే, ఆ క్లూను మరింత తవ్వి అవినీతిని వేళ్లతో సహా పెకిలించడం దర్యాప్తు సంస్థల బాధ్యత, వారిని పాలించే ప్రభుత్వాల ధర్మం. వెల్లడయిన సమా చారం నమ్మదగినదయితే తదుపరి చర్య తీసుకోవాలి. గుట్టు రట్టు చేసిన వారిని గుర్తించాల్సిన అవసరం లేదు. ప్రాథమిక విచారణలో నిజమని తేలితే బయటపడిన సమాచారాన్ని ఒప్పుకోవాలి. ఇవి రెండు కీలకమైన న్యాయసూత్రాలు. సుప్రీంకోర్టు నియమాలకు సమాచార హక్కు చట్టం విజిల్ బ్లోయర్స్ చట్టంలోని నియమాలు విరుద్ధంగా ఉన్నాయి. వ్యక్తిపేరు చెబితే భద్రతకు ప్రమాదకరం అను కున్నపుడు ఆ విషయం వెల్లడి చేయడానికి వీల్లేదని సెక్షన్ 8(1) (జి) నియమం ఆదేశిస్తున్నది. సీబీఐ మాజీ డెరైక్టర్ రంజిత్ సిన్హా వివాదంలో డైరీని లీక్ చేసిన వ్యక్తి భద్రతకు అత్యంత ప్రమాదం ఉన్నదని తెలిసి కూడా వెల్లడి చేయాలని ఎందుకు ఆదేశించారు? విజిల్ బ్లోయర్స్ ప్రొటెక్షన్ చట్టం 2011 సెక్షన్ 4(6) పేరు చెప్పని వారు వెల్లడించే సమాచారాన్ని దర్యాప్తు చేయకుండా ఫిబ్రవరి 2014లో నిషేధం విధించింది. ప్రాణాలకు తెగించి గుట్టు బయటపెట్టిన వారి ప్రాణాలను ఈ చట్టం రక్షిస్తుందని నమ్మాలి. అదే సమయంలో పేరు చెప్పకుండా లంచగొండులను బయటపెడితే అసలు పరిశీలించడం కూడా నిషేధించడం ఎంత వరకు న్యా యం? పేరు చెప్పకుండా, కారణాలు చెప్పకుండా సమాచారం కోరవచ్చునని సమాచార హక్కు చట్టం 2005లో హక్కు కల్పించారు. కాని ఆకాశరామన్న ఉత్తరాలను పట్టించుకోనవసరం లేదని అందుకు విరుద్ధమైన నియ మాలను విజిల్ బ్లోయర్స్ చట్టంలో చేర్చారు. రంజిత్ సిన్హా ఇంటి డైరీ గుట్టు బయటపెట్టిన వారిని గుర్తించాలని సుపీంకోర్టు ఆదేశించిన తరువాత చెలరేగిన వివాదాల ఘర్షణ నుంచి ఈ రెండు సూత్రాలు రూపొందాయి. రంజిత్ సిన్హా సీబీఐ డెరైక్టర్ హోదాలో ఉండి, తన అధి కారిక నివాసంలో రాత్రి వేళలో రకరకాల కేసుల్లో నిందితులైన వారిని మే 2013 నుంచి ఆగస్ట్ 2014 మధ్య రాడాగ్ అధికారులతో 15 నెలల్లో 50 సార్లు సమావేశాలు జరపడం అనేక అనుమానాలకు దారితీస్తుంది. ఈ డైరీ నకిలీదని ముందు వాదించి తరవాత ఎవరో తెలియని వారు దానిని లీక్ చేశారని అన్నారు. సుప్రీంకోర్టుకు సమర్పించే పత్రాలను పిటిషనర్ ప్రమాణ పత్రం ద్వారా ఇవ్వాలని, అందులో తనకు వ్యక్తి గతంగా అందిన సమాచారం ఆధారంగా ఇచ్చిన పత్రాలా లేకా తాము నమ్మిన అంశాలా అనేవి వివరించాలని, తనకు విషయాలు తెలిపిన వారి పేర్లు వెల్లడించాలని సుప్రీంకోర్టు నియమాలు ఆర్డర్ 9 రూల్ 13 నిర్దేశిస్తు న్నదని, కనుక తనకు డైరీ ఇచ్చిన వారి పేరు చెప్పాలని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 15, 2014న ఆదేశించింది. ఈ ఆదేశాన్ని నవంబర్ 20 న ఉపసంహరించింది. సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వులు విజిల్బ్లోయర్ల రక్షణకు ముంద డుగు అనవచ్చు. లీక్ అయిన ైడైరీ నిజమో కాదో అని పరిశీలించడానికి ఒకే అవకాశం సమాచార హక్కు కింద అధికారికంగా పౌరులు ఆ ైడైరీ పొందే అవకాశం కల్పిం చడమే. కాని ప్రస్తుతం డైరీ అధికారిక ప్రతిని అడగడానికి వీల్లేదు. సమాచార హక్కు చట్టం సెక్షన్ 24 కింద దేశ భద్రతకు సంబంధించిన సంస్థలను మినహాయించడానికి వీలు కల్పించారు. సీబీఐ కూడా ఒక పోలీసు సంస్థ. పోలీస్ శాఖలు ఈ చట్టం కింద సమాచారం ఇస్తుంటే సీబీఐని తప్పించడం అసమంజసం. జనం అడుగుతారనే భయం రగిల్చితే తప్ప దర్యాప్తు సంస్థలు ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయవు. (వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్) professorsridhar@gmail.com డా॥మాడభూషి శ్రీధర్ -
విశ్లేషణం: ఎగిసిపడే కెరటం...
ప్రజల అటెన్షన్ తనకు చాలా ఇబ్బందిగా ఉంటుందంటారు అమితాబ్. ఆ బిడియం, ఆ ఇబ్బంది ఆయన బాడీ లాంగ్వేజ్‌లో స్పష్టంగా కనిపిస్తాయి. ఆరడుగుల ఆజానుబాహుడు... మంత్రముగ్ధులను చేసే కంఠస్వరం... ఘనమైన కుటుంబ వారసత్వం... సూపర్‌స్టార్ వైభవం... మరణం అంచులదాకా వెళ్లి వచ్చిన అనుభవం... రాజకీయ రంగప్రవేశం... బోఫోర్స్ కుంభకోణంలో దేశద్రోహిగా అపవాదు... వ్యాపారం దివాళా... అయినా అలిసిపోలేదు. ఎగిసిపడే కెరటంలా మళ్లీ పైకి లేచారు. ఆయన నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త, గాయకుడు, రాజకీయ నాయకుడు, టీవీ యాంకర్... వీటన్నింటికీ మించి... మంచి కొడుకు, మనసున్న భర్త, బాధ్యతెరిగిన తండ్రి, ప్రేమను పంచే తాత. సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్. 71 సంవత్సరాల వయసులోనూ తరగని నటనాదాహం ఆయన సొంతం. బిడియస్తుడైన సూపర్‌స్టార్ అమితాబ్ స్వరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు... సినిమాల్లో ఆవేశంగా డైలాగ్స్ చెప్పినా... ఇంటర్వ్యూలలో, సభల్లో మాట్లాడేటప్పుడు నిదానంగా, గంభీరంగా మాట్లాడతారు. కుడివైపు కిందకు చూస్తూ తనతో తాను మాట్లాడుకుంటున్నట్లుగా ఉంటారు. ఆ తర్వాతనే తలెత్తి ఎదుటివారివైపు చూస్తారు. అయితే అది కాసేపే. ఆ తర్వాత మళ్లీ కిందకు చూస్తూ మంద్రస్వరంతో మాట్లాడతారు. ఆ సమయంలో ఆయన గతానుభవాలను గుర్తుచేసుకుంటారు... వాటిని అనుభూతి చెందుతారు... ప్రశ్నించుకుంటారు. ఇవన్నీ ఆయన అనుభూతి ప్రధాన వ్యక్తిత్వమున్నవారని చెప్తాయి. నటుడిగా ఆయన ఎంతో జోష్ ఉన్న పాత్రలు పోషించినా.. వ్యక్తిగతంగా ఆయన బిడియస్తుడనే చెప్పాలి. ప్రజల అటెన్షన్ తనకు చాలా ఇబ్బందిగా ఉంటుందంటారు అమితాబ్. ఆ బిడియం, ఆ ఇబ్బంది ఆయన బాడీ లాంగ్వేజ్‌లో స్పష్టంగా కనిపిస్తాయి. ఆయన కాలుమీద కాలువేసుకుని దర్జాగా కూర్చున్నప్పటికీ... అప్పుడప్పుడూ చేతులు కాళ్లమధ్యలో దాచుకోవడం అందులో భాగమే. అంతేకాదు అప్పుడప్పుడూ హాండ్కఫ్స్ను సవరించుకోవడం, చేతివేళ్లు క్రాస్ చేయడం కూడా నెర్వస్‌నెస్‌ను దాచుకునే ప్రయత్నంలో భాగమే. అలాగే మాట్లాడేటప్పుడు పెదవులను నాలుకతో స్పృశించడం ద్వారా ఆయన తన మాటలను నిగ్రహించుకుంటారని అర్థమవుతుంది. అయితే మాట్లాడేటప్పుడు రెండు చేతులను ఓపెన్‌గా ఉంచడం, హస్తాలను పైకి ఉంచడం ఆయన ఓపెన్‌గా ఉంటారని చెప్తాయి. నటనే శ్వాస... 1970, 80 దశాబ్దాల్లో బాలీవుడ్లో అమితాబ్ హవా నడిచింది. ఫ్రెంచి దర్శకుడు ఫ్రాంకోయిస్ ట్రఫాట్ ఆ కాలాన్ని ‘ఒన్ మ్యాన్ ఇండస్ట్రీ’ అన్నాడు. బిగ్‌బీ మాత్రం తనకు నటన రాదంటారు! ‘‘నటుడిగా నా కెరీర్ గురించి నాకెప్పుడూ విశ్వాసం లేదు. నేను సూపర్‌స్టార్‌ని కాదు. సినిమాల్లో పనిచేయడాన్ని ఎంజాయ్ చేస్తానంతే’’ అంటారు. ఆ మాటలు ఆయన సంస్కారానికి దర్పణం. ఆరు పదుల వయసులోనూ ‘పా’లాంటి ప్రయోగాత్మక చిత్రాలు చేయడం ఆయన నటనాతృష్ణను వ్యక్తీకరిస్తాయి. భవిష్యత్ దృక్పథం... స్నేహితుడు రాజీవ్‌గాంధీ ఆహ్వానం మేరకు రాజకీయ రంగప్రవేశం చేసి, బోఫోర్స్ కుంభకోణంలో దేశద్రోహానికి పాల్పడ్డాడన్న అపవాదును ఎదుర్కొన్నారు అమితాబ్. 1982లో ‘కూలీ’నిర్మాణంలో గాయపడి మరణం అంచులదాకా వెళ్లి వచ్చారు. అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ ద్వారా నిర్మాతగా మారి దివాళా తీశారు. కానీ ఆయనేనాడూ కుంగిపోలేదంటే కారణం ఆయన ‘భవిష్యత్ దృక్పథ’మే. కొందరు గతాన్ని తలచుకుంటూ కుంగిపోతే, మరికొందరు తప్పులనుంచి పాఠాలు నేర్చుకుని, అందమైన భవిష్యత్తు ఉంటుందని విశ్వసించి శ్రమించి సాధిస్తారు. అమితాబ్ అలాంటి దృక్పథం కలవారు. నేనెప్పుడూ గతాన్ని తలచుకోను, భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచిస్తానని చెప్తారు. ‘‘నేను నా జీవితాన్ని సహజంగా, సాధారణంగా జీవించాను. కానీ అప్పుడప్పుడూ వివాదాలు వస్తూనే ఉన్నాయి. అవి ఒక్కోసారి నాకే ఆశ్చర్యం కలిగిస్తాయి. నేను గడ్డం పెంచితే అది టైమ్స్ ఆఫ్ ఇండియా ఎడిటోరియల్‌కు చేరింది’’ అంటూ నవ్వేస్తారు. ఇలాంటి సానుకూల దృక్పథమే ఆయనను అనేక పరాజయాలు, అవమానాలనుంచి బయటపడేసింది. అమితాబ్ కుటుంబం గురించి చెప్పకుండా ఈ విశ్లేషణ ముగిస్తే అసంపూర్తిగా ఉంటుంది... ఎందుకంటే ఆయన పూర్తిగా కుటుంబం మనిషి. తల్లిదండ్రులను, భార్యను, సంతానాన్ని, వారసులను ప్రేమించే మనిషి. - విశేష్, సైకాలజిస్ట్ -
సాయుధ దళాలను వంచిస్తోంది
కాంగ్రెస్‌పై మోడీ ధ్వజం ‘ఒక ర్యాంకు-ఒక పెన్షన్’పై 2004 నుంచి ఏం చేసింది అవినీతిపై రాహుల్ మాట్లాడటం హాస్యాస్పదం అధికారమిస్తే దేశాన్ని అభివృద్ధి చేస్తా లూధియానా: సాయుధ దళాలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఆరోపించారు. మాజీ సైనికోద్యోగులకు ‘ఒక ర్యాంకు-ఒక పెన్షన్’ను అమలు చేయడంలో కాంగ్రెస్ జాప్యాన్ని ఆయన తూర్పారబట్టారు. గత పదేళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ యూపీఏ ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేయకుండా ఎన్నికల వేళ హడావుడిగా ప్రకటన చేయడంలోని ఆంతర్యాన్ని గుర్తించాలని కోరారు. ఆదివారం పంజాబ్‌లోని లూధియానా, మాల్వాలలో నిర్వహించిన బహిరంగ సభల్లో మిత్రపక్షమైన శిరోమణి-అకాలీదళ్ నేతలతో కలసి మోడీ మాట్లాడారు. సంప్రదాయ సిక్కు తలపాగా ధరించిన మోడీ సుమారు అరగంటపాటు చేపట్టిన ప్రసంగంలో కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు... మాజీ సైనికోద్యోగుల సంక్షేమంపట్ల కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ నిజంగా చిత్తశుద్ధి ఉండుంటే 2004 నుంచీ అధికారంలో ఉన్నా ‘ఒక ర్యాంకు-ఒక పెన్షన్’ను ఎందుకు అమలు చేయలేదు? ఈ అంశంపై నేను తరచూ మాట్లాడుతుండటంతో ఈసారి బడ్జెట్లో ప్రకటన చేసింది. వాజ్‌పేయి సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం 2004లో అధికారంలోకి వచ్చి ఉంటే దీన్ని వెంటనే అమలు చేసేది. ‘ఏబీసీ’లకు కొత్త నిర్వచనం (ఏ-ఆదర్శ్ హౌసింగ్ స్కాం, బీ-బోఫోర్స్ కుంభకోణం, సీ-కోల్ స్కాం) ఇస్తూ ఓవైపు కాంగ్రెస్ అవినీతిలో కూరుకుపోతుంటే ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అవినీతి విషయంలో విపక్షాలపై వేలెత్తి చూపడం హాస్యాస్పదంగా ఉంది. కేంద్రం నుంచి రూపాయి పంపితే 15 పైసలే గ్రామానికి చేరుతోందంటూ నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ పేర్కొనడమే కాంగ్రెస్ అవినీతికి నిదర్శనం. అధికారంలోకి వస్తే ప్రధాని పదవిని దేశానికి కాపాలాదారుగా స్వీకరిస్తా. ప్రభుత్వ ఖజానాపై ‘చెయ్యి’ పడకుండా చూస్తా. కాంగ్రెస్ ఇప్పటివరకూ ప్రజల కళ్లలో మట్టి కొట్టి మోసం చేయగా తాజాగా పెప్పర్ స్ప్రే చల్లడం మొదలు పెట్టింది (తెలంగాణ బిల్లును ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్ విజయవాడ ఎంపీ (ప్రస్తుతం మాజీ) లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే చల్లడాన్ని ఉదహరిస్తూ...) గుజరాత్‌లోని కచ్ ప్రాంతం నుంచి సిక్కు రైతులు వలస వెళ్తున్నారంటూ సాగుతున్న ప్రచారమంతా బూటకం. పంజాబ్‌లో బీజేపీ-ఎస్ఏడీ కూటమి హిందువులు-సిక్కుల ఐక్యతకు చిహ్నం. సుపరిపాలన ఎలా అందించాలో బన్సీలాల్, ప్రకాశ్‌సింగ్ బాదల్ (ఎస్ఏడీ నేత), ఓం ప్రకాశ్ చౌతాలా (ఐఎన్ఎల్డీ అధినేత), ఫరూఖ్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్) నుంచి నేర్చుకున్నా. అధికారం అందిస్తే దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తా. రైతులకు మేలు చేకూరాలంటే వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ పెరగాలి. నష్టాల ఊబిలో ఉన్న రైతులను ఆదుకునేందుకు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)ని మూడు విభాగాలుగా చేయాలి. మొదటి విభాగం ఉత్పత్తులను సేకరిస్తే రెండో విభాగం వాటిని నిల్వ చేసే బాధ్యతను, మూడో విభాగం వాటిని సమర్థంగా పంపిణీ చేసే బాధ్యతను చేపట్టాలి. గిడ్డంగుల్లో నిల్వ ఉన్న గోధుమలను రైతుల మధ్య పంపిణీ చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించినా కేంద్రం మాత్రం గోధుమ నిల్వలు కుళ్లిపోయే వరకూ నిరీక్షించి ఆ తర్వాత లిక్కర్ తయారీ బెవరేజీలకు అమ్ముకుంది. వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి. సంక్షిప్తంగా... 2011లో తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ లక్ష్యంగా అమర్చిన పైపు బాంబు ఉదంతంలో ప్రధాన నిందితుడిని కేరళలో ఆదివారం అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. 21 మంది అఫ్ఘానిస్థాన్ సైనికులను తాలిబాన్లు ఆదివారం కాల్చి చంపి, మరో ఏడుగురిని అపహరించిన ఘటనపై అఫ్ఘాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ మండిపడ్డారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను ఏరివేయడంలో ఆ దేశ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. {పపంచవ్యాప్తంగా అడవుల నాశనాన్ని ఎప్పటికప్పుడు కళ్లకు కట్టినట్లు చూపే వెబ్‌సైట్‌ను గూగుల్ సెర్చ్ ఇంజిన్ ప్రారంభించింది. ‘గ్లోబల్ ఫారెస్ట్ వాచ్’ పేరుతో ప్రారంభించిన ఈ సైట్లో అటవీప్రాంత నిర్మూలన సమాచారం, నివేదికలు, మ్యాపులు ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక నక్సల్ మృతి చెందాడు. జిల్లాలోని ధాదాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అడవుల్లో ఆదివారం ఉదయం కోబ్రా, సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ చేపట్టినప్పుడు ఎన్కౌంటర్ జరిగిందని అధికారులు చెప్పారు.