బోఫోర్స్ గన్స్ నాణ్యమైనవే!
న్యూఢిల్లీ: బోఫోర్స్ గన్స్ నాణ్యతలో అద్భుతమైనవి అనడంలో ఎటువంటి సందేహం లేదని రక్షణమంత్రి మనోహర్ పరిక్కర్ అభిప్రాయపడ్డారు. అప్పట్లో దేశాన్ని కుదిపేసిన బోఫోర్స్ కుంభకోణం అంశాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తాజాగా లేవనెత్తడంపై మీడియా అడిగిన ప్రశ్నలకు పరిక్కర్ పై విధంగా స్పందించారు. స్వీడన్ కు చెందిన బోఫోర్స్ గన్స్ నాణ్యతలో మేటి అని ఆయన తెలిపారు. అయితే ప్రణబ్ వ్యాఖ్యలపై మాట్లాడానికి పరిక్కర్ నిరాకరించారు. దానిపై ఏమీ మాట్లాడుదలుచుకోలేదని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కేవలం ఆ గన్స్ నాణ్యతపై అడిగితే మాత్రం అవే అద్భుతమైనవిగా చెబుతానని పరిక్కర్ చమత్కరించారు.
స్వీడన్ ఛానల్ స్వదేశ్ నేషనల్ డైలీ ఇంటర్వ్యూలో రాష్ట్రపతి బోఫోర్స్ కుంభకోణం అంశాన్ని లేవనెత్తిన సంగతి తెలిసిందే. బోఫోర్స్ కుంభకోణం అని ఏ న్యాయస్థానం ఇంకా నిర్ధారించలేదని.. బోఫోర్స్ శతఘ్నులు అద్భుతమైనవని ఆర్మీ అధికారులు ధ్రువీకరించిన తర్వాతే కొనుగోలు చేశామని ప్రణబ్ తెలిపారు. బోఫోర్స్ కొనుగోలు సమయంలో తాను రక్షణమంత్రిగా ఉన్నాన్న సంగతిని ప్రణబ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
1986లో దేశాన్ని కుదిపేసిన బోఫోర్స్ కుంభకోణం మరోసారి తెరపైకి రావడంతో ప్రస్తుతం ఆ అంశం చర్చనీయాంశంగా మారింది. అప్పట్లో స్వీడన్‌కు చెందిన హోవిట్జర్ తుపాకులను భారత సైన్యానికి సరఫరా చేసేందుకు కుదుర్చుకున్న రూ.1600 కోట్ల ఒప్పందంలో రూ.64 కోట్ల ముడుపులు చేతులు మారినట్లు అభియోగాలు ఉన్నాయి.