సాక్షి, హైదరాబాద్: మూడు తరాలుగా గాంధీ కుటుంబం దేశం కోసం పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ కార్యక్రమంలో మాట్లాడుతూ.. దేశ సమగ్రతను కాపాడేందుకు ఆనాడు రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర చేశారు. రాజీవ్ గాంధీ స్ఫూర్తిని కొనసాగించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు.
రాజీవ్ గాంధీ సద్భావన అవార్డును సల్మాన్ ఖుర్షీద్‌కు అందించిన నిర్వాహకులను అభినందిస్తున్నా. దేశంలో గాంధీ అనే పదం భారతదేశానికి పర్యాయ పదం. గాంధీ కుటుంబం దేశానికి స్పూర్తినిచ్చింది. దేశ సమగ్రతను కాపాడేందుకు ఉక్కు మహిళ ఇందిరా గాంధీ ప్రాణాలు అర్పించారు. ఇందిర వారసత్వాన్ని కొనసాగిస్తూ రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలర్పించారు. దేశం కోసం మూడు తరాలు ప్రాణాలర్పించిన చరిత్ర గాంధీ కుటుంబానిది’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
‘‘గాంధీ కుటుంబంతో సల్మాన్ ఖుర్షీద్ అనుబంధం ఈనాటిది కాదు. మూడు తరాలుగా వారి కుటుంబం గాంధీ కుటుంబంతో కలిసి పనిచేస్తోంది. సల్మాన్ ఖుర్షీద్‌కు రాజీవ్ సద్భావన అవార్డ్ అందించడం మనందరికీ గర్వకారణం. 18 ఏళ్లకే ఓటు హక్కును కల్పించి దేశ అభివృద్ధిలో యువతను భాగస్వామ్యం చేసిన మహనీయుడు రాజీవ్ గాంధీ. 21 ఏళ్లకే శాసనసభ్యుడిగా పోటీ చేసే అవకాశం కల్పిస్తూ రాజ్యాంగ సవరణ తీసుకు రావాల్సిన అవసరం ఉంది. రాజీవ్ స్ఫూర్తితో రాహుల్ గాంధీ దేశ సమగ్రత కోసం భారత్ జోడో యాత్ర చేశారు.
..రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ బీజేపీకి బీ టీమ్‌గా మారింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో రహస్య ఒప్పందంతో బీజేపీకి బీఆర్‌ఎస్ మద్దతు ఇచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో 21 శాతం బీఆర్‌ఎస్ ఓట్లు ఎవరికి చేరాయి?. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ అదే చేయాలని కుట్రలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఓట్లు చీల్చాలని కుట్ర చేస్తున్నారు. ఈ కుట్రలను తెలంగాణ సమాజం తిప్పి కొట్టాలి’’ అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.


