Pranab Mukherjee
-
Pranab Mukherjee: 13 అశుభం.. ఆ మాజీ రాష్ట్రపతికి అత్యంత శుభం?
ఈరోజు డిసెంబరు 11.. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జన్మదినం. ఆయన 1935, డిసెంబర్ 11న పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లా మిరాటి గ్రామంలో జన్మించారు. 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ దేశానికి ఎనలేని సేవలు అందించారు. ఆయన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖల బాధ్యతలను కూడా చేపట్టారు. 2020 ఆగస్టులో కన్నుమూసిన ప్రణబ్ ముఖర్జీ జీవితంలో 13వ నంబరుకు ప్రత్యేక స్థానముంది.చాలామంది 13వ నంబరును అశుభ సంఖ్యగా పరిగణిస్తారు. పాశ్చాత్య దేశాల్లో 13వ నంబరుపై ఉండే భయాన్ని ట్రిస్కైడెకాఫోబియా అంటారు. ముఖ్యంగా అమెరికా, ఐరోపా దేశాలలోని ప్రజలు 13 సంఖ్యను అశుభ సూచికగా చెబుతారు. దీనివెనుక పలు కారణాలను కూడా చెబుతుంటారు. అయితే ఇదే 13వ సంబరు ప్రణబ్ ముఖర్జీ జీవితంలో అదృష్ట సంఖ్యగా మారింది. ఆయన జీవితంలోని అన్ని ముఖ్యమైన సంఘటనలు 13వ నంబర్‌తో ముడిపడి ఉన్నాయి.ప్రణబ్ ముఖర్జీ వివాహందివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వైవాహిక జీవితం 13వ సంఖ్యతో ప్రారంభమైంది. ఆయన 1957, జూలై 13న వివాహం చేసుకున్నారు.రాజ్యసభకు..ప్రణబ్ ముఖర్జీ నాటి ప్రధాని ఇందిరాగాంధీకి సన్నిహితునిగా పేరొందారు. ఆమె ప్రణబ్ ముఖర్జీని 1969లో పశ్చిమ బెంగాల్ నుండి రాజ్యసభకు పంపారు. ప్రణబ్ ముఖర్జీ మొదటిసారిగా 1969 జూలై 13న పార్లమెంటులో ప్రవేశించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా..యూపీఏ ప్రభుత్వ హయాంలో రాష్ట్రపతి అభ్యర్థిగా తొలిసారి ప్రణబ్ ముఖర్జీ పేరు తెరపైకి వచ్చిన తేదీ కూడా 13 కావడం విశేషం. 2012, జూన్ 13న యూపీఏ ముందుకు రెండు పేర్లు వచ్చాయి. ఒకరు ప్రణబ్ ముఖర్జీ. మరొకరు హమీద్ అన్సారీ. సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ పేర్లను మమతా బెనర్జీ అందరి ముందుకు తీసుకువచ్చారు.13వ రాష్ట్రపతిగా..ప్రణబ్ ముఖర్జీ దేశ 13వ రాష్ట్రపతి అయ్యారు. ఈ సమయంలో ఆయనకు ప్రభుత్వం 13వ నంబరు బంగ్లాను కేటాయించింది. ప్రణబ్ ముఖర్జీ 1996 నుండి 2012 వరకు ఢిల్లీలోని తల్కటోరిలోని 13వ నంబర్ బంగ్లాలో నివసించారు. 13వ నంబర్‌తో ప్రణబ్ ముఖర్జీకి ఉన్న అనుబంధం ఆయన జీవితంలోని చిరస్మరణీయ క్షణాలుగా మారాయి. ఇది కూడా చదవండి: నేడు గీతా జయంతి: రూపాయికే భగవద్గీతను అందిస్తూ.. గీతాప్రెస్ వందేళ్ల ఘన చరిత్ర -
కాంగ్రెస్ పరిస్థితిపై ప్రణబ్ ముఖర్జీ కుమార్తె సంచలన వ్యాఖ్యలు!
ఒక నిర్దిష్ట నాయకుని నాయకత్వంలో పార్టీ నిరంతరం ఓడిపోతుంటే, దాని గురించి ఆలోచించడం చాలా ముఖ్యమని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె, రచయిత శర్మిష్ట ముఖర్జీ కాంగ్రెస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాజస్థాన్‌లోని జైపూర్‌ల జరిగిన 17వ లిటరేచర్ ఫెస్టివల్లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ 2014, 2019లలో రాహుల్ గాంధీ ఘోరంగా ఓడిపోయారనే విషయాన్ని కాంగ్రెస్ గుర్తుంచుకోవాలన్నారు. దేశంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అని, దానిని ఎలా బలోపేతం చేయాలనే దానిపై కాంగ్రెస్ నేతలంతా ఆలోచించాలని అన్నారు. పార్టీలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ, సభ్యత్వ నమోదు కార్యక్రమం, పార్టీలోని సంస్థాగత ఎన్నికలు, విధానపరమైన నిర్ణయాలు... ఇలా ప్రతి స్థాయిలోనూ అట్టడుగు స్థాయి కార్యకర్తలను భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన డైరీలో రాసుకున్నారని శర్మిష్ట పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో భిన్నమైన సిద్ధాంతాలు ఉంటాయని, ఎవరి భావజాలంతోనూ మనం ఏకీభవించకపోయినప్పటికీ, వారి భావజాలం తప్పుకాదని అర్థం చేసుకోవాలని శర్మిష్ట అన్నారు. తమ తండ్రి క్రియాశీల రాజకీయాల్లో ఉన్నప్పుడు, పార్లమెంటులో ప్రతిష్టంభన సమయంలో ఇతర పార్టీ సభ్యులతో చర్చించడంలో ఆయనకున్న నేర్పు కారణంగా ఆయన ఏకాభిప్రాయ నిర్మాతగా గుర్తింపు పొందారన్నారు. ప్రజాస్వామ్యం అంటే మాట్లాడటం మాత్రమే కాదని, ఇతరుల మాట వినడం కూడా చాలా ముఖ్యమని, ప్రజాస్వామ్యంలో చర్చలు ఉండాలన్నది ప్రణబ్ ముఖర్జీ సిద్ధాంతమని షర్మిష్ట పేర్కొన్నారు. -
PRANAB, MY FATHER: రాహల్‌కు పరిణతి లేదు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీలో చరిష్మా గానీ, రాజకీయ పరిణతి, అవగాహన గానీ లేవని దివంగత రాష్ట్రపతి, ఆ పార్టీ దిగ్గజ నేత ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారట. అది కాంగ్రెస్ కు చాలా సమస్యగా పరిణమించిందని ఆవేదన పడ్డారట. అంతేకాదు, గాంధీ–నెహ్రూ కుటుంబ అహంకారమైతే రాహుల్ కు వచ్చింది గానీ వారి రాజకీయ చతురత మాత్రం అబ్బలేదు‘ అని కొన్నేళ్ల కిందట తన డైరీలో రాసుకున్నారట. ‘కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవాన్ని రాహుల్ తీసుకురాగలడా? ప్రజల్లో స్ఫూర్తి నింపగలరా? ఏమో! నాకైతే తెలియదు‘ అంటూ అనుమానాలు వెలిబుచ్చారట. ’ప్రణబ్: మై ఫాదర్’ పేరిట రాసిన తాజా పుస్తకంలో ఆయన కూతురు శర్మిష్ఠ ముఖర్జీ ఈ మేరకు పలు వివరాలు వెల్లడించారు. సోమవారం విడుదల కానున్న ఈ పుస్తకంలో ఇలాంటి చాలా విషయాలను ఆమె పంచుకున్నారు. ముఖ్యంగా రాహుల్ కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్సు చించివేశారని తెలిసి ప్రణబ్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారని చెప్పారు. ‘అలా చేయడానికి ఆయన ఎవరసలు? కనీసం కేబినెట్ సభ్యుడు కాదు. పైగా అప్పుడు ప్రధాని (మన్మోహన్ సింగ్) విదేశాల్లో ఉన్నారు. తన చర్య పార్టీపై, ప్రభుత్వం పై ఎలాంటి ప్రభావం చూపుతుంది ఆలోచించరా? సొంత ప్రభుత్వ ఉత్తర్వులను అలా మీడియా ముందు ముక్కలు చేయడం 2014లో యూపీఏ కూటమి ఓటమికి కూడా ఒక కారణమైంది‘ అని ప్రణబ్ మండిపడ్డారట. ‘రాహుల్ హుందాగానే ప్రవర్తిస్తారు. కానీ దేన్నీ సీరియస్‌గా తీసుకోరు. బహుశా ఆయనకు అన్నీ చాలా సులువుగా లభించడమే కారణం కావచ్చు. రాహుల్ మాత్రం అత్యంత కీలక సమయాలు, సందర్భాల్లో కూడా చీటికీమాటికీ దేశం విడిచి ఎటో మాయమవుతారు. ఇది కాంగ్రెస్ నేతలకు, కార్యకర్తలకు తప్పుడు సందేశమే ఇచ్చింది‘ అని ప్రణబ్ అభిప్రాయపడ్డట్టు శర్మిష్ఠ తెలిపారు. -
తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర ఒక్క శాతమే..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లుతాయని తెలిసే తెలంగాణ ప్రకటించారని, సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారంటే భారతదేశానికి బ్రిటిష్ వారు స్వాతంత్య్రం ఇచ్చారని చెప్పినంత దరిద్రంగా ఉంటుందని రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014లో అసెంబ్లీలో కేసీఆర్ ఏం మాట్లాడారో కేటీఆర్ తెలుసుకుని మాట్లాడాలని, పనికిమాలిన మాటలు మాట్లాడవద్దని హితవు పలికారు. సోనియా లేకపోతే తెలంగాణ వచ్చి ఉండేది కాదని, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజమని నాడు కేసీఆర్ ఆన్ రికార్డు వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. మంగళవారం గాంధీభవన్‌లో ఎంపీ కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే తెలంగాణ కావాలని.. ‘మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ. వైఎస్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నాతో సహా 41 మంది ఎమ్మెల్యేలం తెలంగాణ కావాలని అడిగినందుకే ప్రణబ్‌ముఖర్జీ కమిటీ వేశారు. అప్పుడు కేటీఆర్ రాజకీయాల్లో లేడు. అమెరికాలో ఉన్నాడు. ఆ తర్వాత కేసీఆర్‌కు చంద్రబాబు మంత్రిపదవి ఇవ్వలేదని తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించాడు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని, కాంగ్రెస్ పార్టీని విమర్శించడం తగదు. ఇంకోసారి కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే ఊరుకోం.’ అని కోమటిరెడ్డి హెచ్చరించారు. వాళ్లకు టికెట్లు క్యాన్సిల్ చేయండి కట్టె పట్టుకుని తెలంగాణ ఉద్యమకారులను కొట్టిన దానం నాగేందర్, కేసీఆర్‌ను ఫుట్బాల్లా తంతానన్న తలసాని శ్రీనివాస్‌యాదవ్, పట్నం మహేందర్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, మాగంటి గోపీనాథ్, అరికెపూడి గాంధీ... ఇలా చెప్పుకుంటూ పోతే చిట్టా చాలా ఉందని, ఈ మంత్రులను ముందు కేబినెట్ నుంచి తొలగించి, తెలంగాణ ఉద్యమ ద్రోహులకు ఇచ్చిన టికెట్లను క్యాన్సిల్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బానిసత్వ పార్టీ ఎవరిదో అందరికీ తెలుసునని, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మంత్రి మహమూద్‌అలీలు ప్రగతిభవన్ వరకు వస్తే 100 కిలోమీటర్ల స్పీడ్‌తో వెనక్కు పంపింది ఎవరని ప్రశ్నించారు. ప్రగతిభవన్ లోపలికి రానివ్వకపోతే ఏడ్చానని రాజేందర్ చెప్పారని గుర్తు చేశారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు సర్పంచ్ కూడా ఆయనను సులువుగా కలవగలిగేవారని చెప్పారు. ఎన్నికల ఆలస్యంపై కేటీఆర్ మాట్లాడటం హాస్యాస్పదం రాష్ట్రంలో ఎన్నికలు ఆలస్యమవుతాయని, ఫిబ్రవరి వరకు తీసుకెళ్తారని కేటీఆర్ చెప్పడం హాస్యాస్పద మని కోమటిరెడ్డి చెప్పారు. బీజేపీతో అమిత్‌షాతో భేటీ అయి కవితను జైలుకు పంపవద్దని ఒప్పందం కుదుర్చుకున్నారని, ఇప్పుడు ఆయన ఫిబ్రవరిలో ఎన్నికలు వస్తాయని చెప్పకపోతే తమకు తెలియదా? అని వ్యాఖ్యానించారు. -
అత్యధిక మెజారిటీతో గెలిచిన రాష్ట్రపతి ఎవరో తెలుసా?
దేశానికి 15వ రాష్ట్రపతిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము బాధ్యతలు చేపట్టబోతున్నారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24తో ముగుస్తుంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ నిర్వహించింది. 21న ఓట్ల లెక్కింపు జరిగింది. ద్రౌపది ముర్ము తన ప్రత్యర్థి యశ్వంత్ సిన్హాపై ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన రాష్ట్రపతి ఎన్నికలపై విహంగ వీక్షణం.. స్వతంత్ర భారత తొలి రాష్ట్రపతిగా డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ సేవలు అందించారు. రెండు పర్యాయాలు రాష్ట్రపతిగా పనిచేసిన ఏకైక వ్యక్తి ఆయనే కావడం విశేషం. అంతేకాదు అత్యధిక మెజారిటీతో గెలిచిన రికార్డు కూడా ఆయన పేరిటే ఉంది. కాగా, 1950 జనవరి 26న రాజేంద్రప్రసాద్‌ను రాష్ట్రపతిగా ఎన్నికైనట్టు రాజ్యాంగం ధ్రువీకరించింది. కేంద్ర ఎన్నికల సంఘం 1952లో తొలిసారిగా నిర్వహించిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. స్వతంత్ర భారత మొట్ట మొదటి ఉప రాష్ట్రపతిగా పనిచేసిన ప్రముఖ తత్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్.. 1962లో రెండో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. జాకిర్ హుస్సేన్ 1967లో మూడవ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. దురదృష్టవశాత్తు పదవీలో ఉండగానే 1969, మే 3న ఆయన కన్నుమూశారు. జాకిర్ హుస్సేన్ మరణంతో 1969లో జరిగిన ఎన్నికల్లో వరాహగిరి వేంకటగిరి నాలుగో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. రెండో ప్రాధాన్య ఓట్లతో గెలిచిన తొలి రాష్ట్రపతిగా ఆయన చరిత్ర కెక్కారు. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్.. భారత ఐదో రాష్ట్రపతిగా పనిచేశారు. పదవిలో ఉండగానే 1977, ఫిబ్రవరి 11న మరణించారు. ఏకగ్రీవంగా రాష్ట్రపతి పదవిని దక్కించుకున్న ఘనత నీలం సంజీవరెడ్డికి దక్కింది. 1977 నాటి ఎన్నికల్లో పోటీలో ఉన్న 37 మందిలో సంజీవరెడ్డి నామినేషన్ మినహా మరెవరిదీ చెల్లకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జ్ఞానీ జైల్ సింగ్ 1982లో దేశానికి 7వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. దేశ ప్రథమ పౌరుడిగా ఎన్నికైన ఏకైక సిక్కుగా ఆయన ఖ్యాతికెక్కారు. ఆర్. వెంకట్రామన్ దేశానికి 8వ రాష్ట్రపతిగా సేవలు అందించారు. ఆయన హయాంలోనే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాల శకం ఆరంభమైంది. శంకర్‌దయాళ్ శర్మ 1992లో దేశానికి 9వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అంతకుముందు ఆయన ఉపరాష్ట్రపతిగానూ సేవలు అందించారు. దేశానికి తొలి దళిత రాష్ట్రపతి కేఆర్ నారాయణన్. కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన మొదటి ప్రెసిడెంట్‌గా గుర్తింపు పొందారు. ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించారు. 1998 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసి పదవిలో ఉండి ఓటు వేసిన మొదటి రాష్ట్రపతిగా ఖ్యాతికెక్కారు. భారతదేశపు మిస్సైల్ మ్యాన్‌గా పేరుగాంచిన ఏపీజే అబ్దుల్ కలాం దేశానికి 11వ రాష్ట్రపతిగా విశేష సేవలు అందించారు. ప్రజల రాష్ట్రపతిగా మెలిగిన ఆయన రాష్ట్రపతి కార్యాలయాన్ని సామాన్యులకు చేరువ చేశారు. రాష్ట్రపతి పీఠాన్ని అధిష్టించిన తొలి మహిళ ప్రతిభా పాటిల్. అంతకుముందు ఆమె రాజస్థాన్ గవర్నర్‌గా పనిచేశారు. రాష్ట్రపతి పనిచేసిన కాలంలో ఆమె పలు రకాల విమర్శలు ఎదుర్కొన్నారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ప్రణబ్ ముఖర్జీ దేశానికి 13వ రాష్ట్రపతిగా 2012లో ఎన్నికయ్యారు. దేశ అత్యున్నత పురస్కారం పొందిన ఆరుగురు రాష్ట్రపతుల్లో ఆయన ఒకరు. ప్రణబ్ హయాంలోనే రాష్ట్రపతి భవన్ ట్విటర్ ఖాతా ప్రారంభమైంది. దేశానికి రెండో దళిత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. అంతకుముందు బిహార్ రాష్ట్రానికి గవర్నర్‌గా ఆయన పనిచేశారు. ఈ ఏడాది జూలై 24తో రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ముగియనుంది. (క్లిక్: భారత పౌరసత్వం వదులుకుంటున్న ప్రవాసులు!) -
చట్టసభల్లో నిరసనకు హద్దులుండాలి
సాక్షి, న్యూఢిల్లీ: చట్టసభల్లో నిరసనలు తెలపడంలో తప్పు లేదని, అదే సమయంలో సభా గౌరవాన్ని, గొప్పతనాన్ని కాపాడుకోవాలని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు, చట్టాల్లోని లోపాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడం ప్రజా ప్రతినిధుల హక్కు అయినప్పటికీ, అవి భావోద్వేగాలకు దారి తీసి పరిమితులు దాటకూడదని హితవు పలికారు. చట్టసభల్లో కార్యకలాపాలకు తరచూ అంతరాయాలు కలుగుతుండటం, దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం స్ఫూర్తికి విఘాతం కలిగే పరిస్థితులు చోటు చేసుకోవడంపై ఉపరాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తొలి స్మారకోపన్యాసం చేసిన ఉపరాష్ట్రపతి, చట్టసభల్లో అంతరాయాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని ప్రణబ్ ముఖర్జీ లెగసీ ఫౌండేషన్ వర్చువల్ వేదికగా నిర్వహించింది. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందని, రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండడమే నిజమైన ప్రజాస్వామ్యాన్ని, సమగ్రాభివృద్ధిని ముందుకు తీసుకెళుతుందని ఉపరాష్ట్రపతి తెలిపారు. చట్టసభల్లో అంతరాయాలతో జవాబుదారీతనం కొరవడి, ఏకపక్ష ధోరణి ఏర్పడే ప్రమాదముందని ఉపరాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రణబ్ ముఖర్జీ బుద్ధి కుశలత, అసాధారణ జ్ఞాపకశక్తి అనేక వివాదాస్పద అంశాలకు సమాధానాన్ని చూపిందన్న ఉపరాష్ట్రపతి, పన్ను సంస్కరణలను స్వయంగా ఆర్థికమంత్రిగా సేవలందించిన ప్రణబ్ స్వాగతించిన విషయాన్ని గుర్తు చేశారు. 2018లో నాగపూర్‌లో జరిగిన ఆర్.ఎస్.ఎస్. శిక్షణా శిబిరంలో ప్రణబ్ ముఖర్జీ పాల్గొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, హుందాగా వ్యవహరించగల ప్రణబ్ వ్యక్తిత్వానికి ఇది ఉదాహరణ అన్నారు. జాతీయవాదం గురించి మాటల్లో చెప్పే వారికి, నిజమైన జాతీయవాదాన్ని చేతల్లో చూపించారని తెలిపారు. దేశాభివృద్ధికి ప్రణబ్ విశేష సేవలు: మోదీ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దార్శనికతగల గొప్ప నేత అని ప్రధాని మోదీ శ్లాఘించారు. అత్యుత్తమ ప్రజాజీవితం, పరిపాలనా దక్షత, సునిశిత దృష్టి కలిగిన ఆయన వివిధ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారన్నారు. ప్రణబ్ ముఖర్జీ ప్రథమ స్మారకోపన్యాసంలో ప్రధాని ఈ మేరకు పేర్కొన్నారు. అమోఘ ప్రజ్ఞాపాటవాలు కలిగిన ప్రణబ్ దేశాభివృద్ధికి గుర్తుంచుకోదగ్గ సేవలందించారని తెలిపారు. దేశ ప్రజాస్వామ్య విలువలను ఆయన పరిపుష్టం చేశారన్నారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ ఖలీదా జియా వర్చువల్‌గా ప్రసంగించారు. యువ ఎంపీగా బంగ్లాదేశ్ అవతరణకు తోడ్పాటునందిం చారని ప్రణబ్‌ను కొనియాడారు. బంగ్లాదేశ్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించాలంటూ 1971 జూన్‌లో రాజ్యసభలో ఆయన తీర్మానం ప్రవేశపెట్టారని గుర్తుకు తెచ్చుకున్నారు. భూటాన్ రాజు జింగ్మే కేసర్ నామ్‌గ్యాల్ వాంగ్‌చుక్ తన ఉపన్యాసంలో.. ప్రణబ్‌తో పలుమార్లు తాను భేటీ అయ్యాయని చెప్పారు. ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నాననీ, ఆయన లోటు తీర్చలేనిదని తెలిపారు. ప్రణబ్‌ముఖర్జీ దేశానికి 13వ రాష్ట్రపతిగా 2012–17 మధ్య కాలంలో పనిచేశారు. కాంగ్రెస్ నేత అయిన ఆయన కేంద్ర ప్రభుత్వంలో పలు శాఖలకు మంత్రిగా కూడా ఉన్నారు. -
కాంగ్రెస్‌కు షాక్.. టీఎంసీలోకి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు
కోల్‌కతా: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. కోల్‌కతాలోని పార్టీ కార్యాలయంలో సోమవారం అభిజిత్ ముఖర్జీకి, టీఎంసీ నేతలు పార్థా ఛటర్జీ, సుదీప్ బంధోపాధ్యాయలు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇంతకాలం కాంగ్రెస్‌లో ఉన్న అభిజిత్ తండ్రి మరణం తర్వాత టీఎంసీలో జాయినవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 2011లో మొదటిసారి బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు అభిజిత్. 2012లో ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో... ఆయన రాజీనామా చేసిన జంగీపూర్ స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. తర్వాత 2014లోనూ అదే నియోజకవర్గం నుంచి మరోసారి ఎంపీగా గెలిచారు అభిజిత్ ముఖర్జీ. Warmly welcoming Shri @ABHIJIT_LS into the Trinamool family! We are certain that your contribution towards fulfilling @MamataOfficial's vision for a brighter Bengal shall be valued by all. pic.twitter.com/oSQgmfxVCR — All India Trinamool Congress (@AITCofficial) July 5, 2021 అయితే 2019లో అభిజిత్ ఓటమి పాలయ్యారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ మొదలు పెట్టిన మతపరమైన హింసను మమతా బెనర్జీ సమర్థవంతంగా అదుపు చేశారని అభిజిత్ చెప్పారు. దేశమంతటా బీజేపీని కంట్రోల్ చేసే శక్తి ఆమెకు ఉందన్నారు. కాంగ్రెస్‌లో ప్రాథమిక సభ్యత్వం తప్ప తనకు ఎలాంటి పొజిషన్ లేదని... టీఎంసీలోనూ సాధారణ కార్యకర్తగానే చేరినట్టు అభిజిత్ తెలిపారు. పార్టీ సూచనలకు అనుగుణంగా పనిచేస్తానని వెల్లడించారు. అయితే అభిజిత్ ముఖర్జీ నిర్ణయంపై ఆయన సోదరి షర్మిష్ట స్పందిస్తూ.. విచారకరం అంటూ ట్వీట్ చేశారు. SAD!!! — Sharmistha Mukherjee (@Sharmistha_GK) July 5, 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచార కమిటీ బాధ్యతలు చూసుకున్నారు అభిజిత్ ముఖర్జీ. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో జట్టు కట్టడంపై అభిజిత్ ముఖర్జీ భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు పెట్టుకోకుండా ఉండి ఉంటే కాంగ్రెస్ ఓట్ల వాటా పెరిగి ఉండేదని అన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని అభిజిత్ ముఖర్జీ పేర్కొన్నారు. -
ప్రణబ్ ఆత్మకథలో సంచలన విషయాలు
న్యూఢిల్లీ : ప్రధాని మోదీ పార్లమెంట్లో తరచుగా మాట్లాడాలని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన ‘ప్రెసిడెన్షియల్ ఈయర్స్ 2012– 2017’ పుస్తకంలో సూచించారు. ప్రణబ్ ముఖర్జీ చనిపోవడానికి ముందు చివరగా రాసిన ఈ పుస్తకం మంగళవారం మార్కెట్లోకి విడుదలైంది. పార్లమెంటులో విపక్ష సభ్యుల భిన్నాభిప్రాయాలను ప్రధాని వినాలని, తన అభిప్రాయాలను వివరించి, వారిని ఒప్పించాలని ఆ పుస్తకంలో ముఖర్జీ సూచించారు. ఏ ప్రధానైనా సరే.. సభలో ఉంటే చాలు, సభ నిర్వహణ వేరుగా ఉంటుంది’ అని పేర్కొన్నారు. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్.. వీరంతా సభలో తమదైన ముద్ర వేశారని పేర్కొన్నారు. ‘ప్రధాని మోదీ తన పూర్వ ప్రధానుల నుంచి ఈ విషయంలో స్ఫూర్తి పొందాలి. స్పష్టమైన నాయకత్వాన్ని చూపాలి. తన అభిప్రాయాలను వ్యక్తపరిచేందుకు పార్లమెంటును వేదికగా వాడుకోవాలి’ అని సూచించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో స్వపక్ష, విపక్ష నేతలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ క్లిష్ట సమస్యలను పరిష్కరించేవాడినని వివరించారు. సభ సజావుగా సాగడమే తన ప్రథమ లక్ష్యంగా ఉండేదన్నారు. దురదృష్టవశాత్తూ 2014–19 మధ్య ఎన్డీయే ప్రభుత్వంలో ఈ స్ఫూర్తి కొరవడిందన్నారు. అయితే, విపక్షం కూడా దారుణంగా, జవాబుదారీతనం లేకుండా వ్యవహరించిందని విమర్శించారు. పార్లమెంట్లో గందరగోళం కొనసాగడం వల్ల ప్రభుత్వం కన్నా విపక్షమే ఎక్కువ నష్టపోతుందని తెలిపారు. దీన్ని సాకుగా చూపి సభా సమయాన్ని కుదించే అవకాశం ప్రభుత్వానికి లభిస్తుందన్నారు. దేశం ప్రధాని పాలనపైననే ఆధారపడి ఉంటాయన్నారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలో నిమగ్నుడై ఉండే పరిస్థితి మన్మోహన్ సింగ్‌దని, దాంతో ఆ ప్రభావం పాలనపై పడిందని ప్రణబ్ విశ్లేషించారు. ఆత్మకథలో సంచలన విషయాలు.. ‘ప్రధానమంత్రి నర్రేంద మోదీ, నవాజ్ షరీఫ్ వ్యక్తిగత కార్యక్రమం కోసం పాకిస్తాన్ వెళ్లాడరు. లాహోర్‌కు వెళ్లడం సరైన నిర్ణయం కాదు సర్జికల్ స్ట్రైక్ అనేది ఆర్మీ సాధారణంగా చేసే ప్రక్రియ మాత్రమే. నాకు అవకాశం ఇస్తే తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేవాడిని. తాను యూపీఏ-2లో ఆర్ధిక మంత్రిగా కొనసాగితే.. మమతా బెనర్జీ కూటమిలోనే కొనసాలా చేసేవాడిని. 2004లో నేను ప్రధానినైతే 2014లో...కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోరమైన ఓటమి పాలయ్యేది కాదని కొంతమంది కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడ్డారు. నేను రాష్ట్రపతిగా వెళ్లిన తరువాత... కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చాలా అంశాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకుంది. సోనియాగాంధీ పార్టీని నడపంలో చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. మహారాష్ట్రలో సరైన నాయకులను కాకుండా ఇతరులపై పార్టీ ఆధారపడింది.’ అని తన ఆత్మకథ ‘ప్రెసిడెన్షియల్ ఈయర్స్ 2012– 2017లో పేర్కొన్నారు. ఈ పుస్తకంలోని అంశాలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. -
కొడుకుగా అది నా హక్కు: మాజీ ఎంపీ
న్యూఢిల్లీ: దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాసిన చివరి పుస్తకం ‘ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్’ ప్రచురణ అంశంపై చెలరేగిన వివాదంపై ఆయన తనయుడు, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ అభిజిత్ ముఖర్జీ స్పందించారు. ఈ పుస్తకాన్ని ప్రచురించడంలో తనకేమీ అభ్యంతరం లేదని, అయితే తాను ఆ బుక్‌ను పూర్తిగా చదివిన తర్వాతే పబ్లిష్ చేయాలని బుధవారం పునరుద్ఘాటించారు. ఈ మేరకు.. ‘‘కొందరు భావిస్తున్నట్లుగా, మా నాన్న చివరి జ్ఞాపకానికి సంబంధించిన అంశానికి నేనెంత మాత్రం వ్యతిరేకం కాదు. అయితే ఆ పుస్తకంలో ఉన్న కంటెంట్ గురించి తెలుసుకోవడం ఒక కొడుకుగా నాకున్న హక్కు. ఒకవేళ నాన్న బతికుండి ఉంటే, పుస్తకం పూర్తైన తర్వాత ఆయన కూడా ఇదే చేసేవారు. ఫైనల్ అవుట్‌పుట్ చూసేవారు. గతంలో కూడా అలాగే చేశారు. ఇప్పుడు కూడా నేను అదే చేయాలనుకుంటున్నా. ఈ విషయాన్ని మరోసారి గుర్తుచేస్తున్నా. నేను ఆ పుస్తకం చదివేంత వరకు ప్రచురణ ఆపేయండి. చీప్ పబ్లిసిటీ కోసం వెంపర్లాడవద్దు’’ అని ట్విటర్లో పేర్కొన్నారు. కాగా ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్ పేరిట ప్రణబ్ ముఖర్జీ రాసిన రూపా పబ్లికేషన్స్ విడుదల చేయనున్నట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ఇందులో ఆయన సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్‌పై చేసిన వ్యాఖ్యలు కొన్ని ఇటీవల బయటకి వచ్చాయి. ఈ క్రమంలో జనవరిలో బుక్‌ను రిలీజ్ చేయనున్నట్లు పబ్లికేషన్స్ ప్రకటించగా.. తాను ఆ పుస్తకం తుది ప్రతుల్ని పూర్తిగా చదివిన తర్వాతే ప్రచురణకు అనుమతినిస్తానని అప్పటి వరకు పుస్తక విడుదలని నిలిపివేయాలని ప్రచురణ కర్తలకి చెప్పినట్టుగా అభిజిత్ ముఖర్జీ వెల్లడించగా, ఆయన సోదరి శర్మిష్ట మాత్రం చీప్ పబ్లిసిటీ కోసం అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దంటూ అంటూ ట్వీట్ చేశారు. దీంతో అక్కాతమ్ముళ్ల తలెత్తిన భేదాభిప్రాయాలు చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన మరోసారి ఈ మేరకు స్పందించడం గమనార్హం.(చదవండి: ప్రణబ్ పుస్తకం.. ఇంట్లోనే వైరం) 1/2 Contrary to the opinion of some , I am not against the publishing of my father's Memoir but I have requested D publisher to allow me to go through it's contents before final roll out & I believe my request is quite legitimate & within my rights as his Son . — Abhijit Mukherjee (@ABHIJIT_LS) December 16, 2020 -
ప్రణబ్ పుస్తకం.. ఇంట్లోనే వైరం
న్యూఢిల్లీ: దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాసిన చివరి పుస్తకం ‘ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్’ ఆయన ఇంట్లోనే విభేదాలకు దారి తీసింది. ఆ పుస్తకాన్ని తన అనుమతి లేకుండా ప్రచురించ కూడదని కుమారుడు అభిజిత్ ముఖర్జీ చెబుతూ ఉంటే, పుస్తకం విడుదలకు అనవసరమైన ఆటంకాలు సృష్టించవద్దని ఆయన సోదరి శర్మిష్ట ముఖర్జీ విజ్ఞప్తి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరు పొందిన ప్రణబ్ ముఖర్జీ రాసిన ఈ చివరి పుస్తకంలో ఆయన సోనియాగాంధీ పైనా, మన్మోహన్ సింగ్‌పైనా చేసిన వ్యాఖ్యలు కొన్ని ఇటీవల బయటకి వచ్చాయి. తాను రాష్ట్రపతి అయ్యాక కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొందని చెబుతూ తనకు తెలిసిన ఇన్సైడ్ సమాచారాన్ని ప్రణబ్ ఆ పుస్తకంలో పొందుపరిచారు. ఈ పుస్తకం అక్కా తమ్ముళ్ల మధ్య విభేదాలకు దారి తీయడం చర్చనీ యాంశంగా మారింది. తాను ఆ పుస్తకం తుది ప్రతుల్ని పూర్తిగా చదివిన తర్వాతే ప్రచురణకు అనుమతినిస్తానని అప్పటి వరకు పుస్తక విడుదలని నిలిపివేయాలని ప్రచురణ కర్తలకి చెప్పినట్టుగా కాంగ్రెస్ మాజీ ఎంపీ అభిజిత్ ముఖర్జీ ట్విటర్ వేదికగా వెల్లడించారు. దీనిపై అభిజిత్ సోదరి శర్మిష్ట తీవ్రంగా ప్రతిస్పందించారు. చీప్ పబ్లిసిటీ కోసం అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దంటూ అంటూ ట్వీట్ చేశారు. -
ప్రణబ్ ముఖర్జీకి లోక్‌సభ నివాళులు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సోమవారం లోక్ సభ సమావేశాలు ఆరంభం కాగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సభ సంతాపం తెలిపింది. దేశానికి ప్రణబ్ సేవలను సభ కొనియాడింది. ఏ పదవిలో ఉన్నా ప్రణబ్ ముఖర్జీ ఆ పదవికి వన్నె తెచ్చారని స్పీకర్ ఓం బిర్లా ప్రశంసించారు. ఇటీవల మృతి చెందిన తమిళనాడు ఎంపీ వసంత్‌కుమార్, పండిత్ జస్రాజ్, అజిత్ జోగి, చేతన్ చౌహాన్ తదితరులకు సభ సంతాపం తెలిపింది. అలాగే కరోనాతో పోరాడుతూ ప్రాణాలు అర్పించిన కరోనా యోధులకు కూడా పార్లమెంట్ నివాళి అర్పిచింది. అనంతరం సభను గంటసేపు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. కరోనా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో.. అన్ని జాగ్రత్తలతో, కోవిడ్ –19 నిబంధనలను పూర్తిగా పాటిస్తూ, కొత్త విధి, విధానాలతో ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు. కోవిడ్–19 నెగెటివ్ ఉన్నవారికే సభలోనికి అనుమతించడంతో పాటు, మాస్క్ కచ్చితంగా ధరించాలన్న నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తున్నారు. ఉభయ సభలు తొలిసారి విడతలవారీగా సమావేశం కావడం ఈ సమావేశాల ప్రత్యేకత. రాజ్యసభ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, లోక్‌సభ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరుగుతుంది. ఇక విజృంభిస్తున్న కరోనా, కుదేలైన ఆర్థిక వ్యవస్థ, సరిహద్దుల్లో చైనా దుస్సాహసాలు.. తదితర వైఫల్యాలను లేవనెత్తి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షం సిద్ధమవుతోంది. చైనా ఆక్రమణలపై కాంగ్రెస్ వాయిదా తీర్మానం చైనాతో నెలకొన్న ఉద్రిక్తతలు, ఆక్రమణలపై సభలో చర్చ చేపట్టాలంటూ కాంగ్రెస్ ఎంపీలు అధిర్ రంజన్ చౌదరీ, కే సురేశ్‌లు వాయిదా తీర్మానం ఇచ్చారు. ఇక ఢిల్లీ అల్లర్ల సమయంలో పోలీసులు మావన హక్కుల ఉల్లంఘనలకు పాల్పడిన అంశంపై సీపీఎం, నీట్ నిర్వహణను వ్యతిరేకిస్తూ, అలాగే 12 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడిన అంశంపై చర్చ చేపట్టాలని డీఎంకే, సీపీఎం.. లోక్‌సభలో వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. -
కర్మయోగి.. అజాత శత్రువు
సాక్షి, హైదరాబాద్: దేశాభివృద్ధిలో మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ సేవలు మరువలేనివని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ప్రణబ్ మరణంతో దేశం శిఖర సమానుడైన నాయకున్ని కోల్పోయిందన్నారు. రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై ఆమోదముద్ర వేసిన రాష్ట్రపతిగా తెలంగాణ చరిత్రలో ప్రణబ్ నిలిచిపోయారని కొనియాడారు. సోమవారం శాసనసభ ప్రారంభం కాగానే స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూచన మేరకు సీఎం కేసీఆర్.. ప్రణబ్ సంతాప తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రణబ్ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. సీఎం మాట్లాడుతూ, ‘ప్రణబ్ మృతిపట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నా. ఆయన మరణంతో దేశం శిఖర సమానుడైన నాయకుడిని కోల్పోయింది. అర్ధ శతాబ్దం పాటు భారత రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించిన కర్మయోగి ప్రణబ్. 1970 తర్వాత దేశ అభివృద్ధిలో ఆయన లేని పేజీ ఉండదంటే అతిశయోక్తి కాదు. క్రమశిక్షణ, కఠోర శ్రమ, అంకితభావంతో ఎదిగారు. సంకీర్ణ ప్రభుత్వాల శకం మొదలయ్యాక పార్టీల మధ్య ఏకాభిప్రాయ సాధనలో ఆయనది అమోఘమైనపాత్ర. మిత్రపక్షాలను కలుపుకొనిపోవడంలో కుడిఎడమలను సమన్వయం చేసిన సవ్యసాచిలా మన్ననలు పొందారు. పార్లమెంట్ విలువలకు నిలువెత్తు ప్రతీక’అని పేర్కొన్నారు. తెలంగాణ చరిత్రలో ప్రణబ్.. తెలంగాణతో ప్రణబ్‌కు ఉన్న సంబంధాన్ని సీఎం గుర్తు చేశారు. ‘రాష్ట్ర ఏర్పాటుపై పార్టీల అభిప్రాయ సేకరణకు నియమించిన కమిటీకి ఆయన సారథ్యం వహించడమే కాకుండా, ప్రజల ఆకాంక్షను అధ్యయనం చేసి పరిష్కారానికై అధిష్టానానికి మార్గదర్శనం చేశారు. రాష్ట్ర అవతరణకు సహాయపడిన వారిగానే కాకుండా, రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై ఆమోదముద్ర వేసిన రాష్ట్రపతిగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయారు’అని సీఎం పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులేశారు: భట్టి ‘ప్రణబ్ దేశం గర్వించదగ్గ నాయకుడు. దేశంలో ఉత్పన్నమైన అనేక సమస్యలను ట్రబుల్ షూటర్‌గా పరిష్కరించేవారు. లోక్‌సభ, రాజ్యసభ ఎంపీగా, కేంద్ర మంత్రిగా బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులు వేశారు.తెలంగాణ సాధనకు మార్గదర్శనం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎదిగి, దేశానికి విశేష సేవలు అందించినందుకు గర్విస్తున్నాం’అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొ న్నారు. మంత్రులు నిరంజన్ రెడ్డి, ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తదితరులు ప్రణబ్ సేవలను గుర్తుచేసుకున్నారు. ఎమ్మెల్యేలు బాల్క సుమన్, సుధీర్‌రెడ్డి మాట్లాడి సంతాప తీర్మానాలను బలపరిచారు. అనం తరం ప్రణబ్ సేవలను స్పీకర్ పోచారం గుర్తు చేశారు. సభ ప్రణబ్ ముఖర్జీ మృతికి తీవ్ర సంతాపాన్ని తెలిపింది. 2 నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించింది. ప్రణబ్ ముఖర్జీకి రాష్ట్ర శాసనమండలి నివాళులర్పించింది. సమావేశాలు ప్రారంభమైన అనం తరం సభ్యులు 2 నిమిషాలు మౌనం పాటించి ప్రణబ్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. -
ప్రియనేతకు తుదివీడ్కోలు
న్యూఢిల్లీ: కుటుంబ సభ్యులు, అభిమానులు, సహచరుల అశ్రునయనాల మధ్య మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు ముగిశాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, త్రివిధ దళాధిపతులు, పలువురు కేంద్ర మంత్రులు, సీనియర్ నేతలు ఆయనకు భారమైన హృదయంతో తుది వీడ్కోలు పలికారు. లోధి రోడ్‌లోని విద్యుత్ దహన వాటికలో మంగళవారం మధ్యాహ్నం పూర్తి అధికార లాంఛనాల మధ్య ప్రణబ్ ముఖర్జీకి ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ అంత్యక్రియలు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో కుటుంబ సభ్యులు, ఇతరులు పీపీఈ కిట్స్ ధరించి కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ రాష్ట్రపతికి ఆర్మీ దళం గన్ సెల్యూట్‌తో గౌరవ వందనం సమర్పించింది. అంతకుముందు ప్రణబ్ మృతదేహాన్ని పూలతో అలంకరించిన వాహనంలో త్రివర్ణ పతాకం కప్పి దహనవాటికకు తీసుకువచ్చారు. పలు అనారోగ్య సమస్యలతో ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరెన్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రణబ్ సోమవారం సాయంత్రం గుండెపోటుతో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆగస్టు 10న అదే ఆసుపత్రిలో ప్రణబ్‌కు వైద్యులు క్లిష్టమైన శస్త్ర చికిత్స సైతం నిర్వహించారు. అదే సమయంలో ఆయనకు కరోనా కూడా సోకింది. భారత రత్న పురస్కార గ్రహీత అయిన ప్రణబ్ మృతికి సంతాప సూచకంగా కేంద్రం సోమవారం నుంచి 7 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రముఖుల నివాళి ప్రణబ్ నివాసంలో ఆయన భౌతిక కాయానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, త్రివిధ దళాధిపతులు జనరల్ ఎంఎం నరవణె(ఆర్మీ), అడ్మిరల్ కరమ్‌వీర్ సింగ్ (నేవీ), ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బధౌరియా (ఎయిర్‌ఫోర్స్), సీనియర్ కాంగ్రెస్ నేతలు, పార్టీలకతీతంగా సీనియర్ నేతలు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. మాస్క్, భౌతికదూరం తదితర కోవిడ్ నిబంధనలను పాటిస్తూ మాజీ ప్రధాని, చిరకాల సహచరుడు మన్మోహన్ సింగ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. తదితరులు ప్రణబ్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రణబ్ నివాసంలోని ఒక గదిలో ఆయన భౌతిక కాయాన్ని ఉంచగా, ప్రముఖుల సందర్శనార్థం మరో గదిలో ఏర్పాటు చేసిన ప్రణబ్ చిత్రపటానికి నాయకులు పుష్పాంజలి సమర్పించారు. ప్రియతమ నేతకు తుది వీడ్కోలు పలికేందుకు అన్ని పార్టీల కార్యకర్తలు, ప్రజలు రాజాజీ మార్గ్‌లోని ప్రణబ్ నివాసానికి తరలివచ్చారు. వారంతా క్రమశిక్షణతో అభిమాన నేతకు అశ్రు నివాళి అర్పించారు. కొందరు అభిమానులు, సెక్యూరిటీ సిబ్బంది మొత్తం ముఖాన్ని కప్పి ఉంచే ఫేస్ షీల్డ్‌ను సైతం ధరించారు. కోవిడ్ ముప్పు నేపథ్యంలో అంతిమయాత్రకు అధికారికంగా ఉపయోగించే వాహనంలో కాకుండా, మరో వాహనంలో ప్రణబ్ భౌతిక కాయాన్ని లోధి రోడ్‌లోని శ్మశాన వాటికకు తరలించారు. పీపీఈ కిట్స్ ధరించిన సిబ్బంది మృతదేహాన్ని వాహనంలోకి చేర్చారు. ప్రణబ్ చిత్రపటం వద్ద పుష్పాలతో నివాళులర్పిస్తున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ స్వగృహంలో మ్యూజియం పశ్చిమబెంగాల్లోని జంగీపూర్‌లో ఉన్న తమ స్వగృహంలో ఒక అంతస్తును తమ తండ్రి జ్ఞాపికలతో ఒక మ్యూజియంగా రూపొందిస్తామని, ఒక గ్రం«థాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ప్రణబ్ కుమారుడు అభిజిత్ ముఖర్జీ వెల్లడించారు. తన తండ్రి స్మృత్యర్థం ప్రభుత్వం ఒక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేయాలని అభిజిత్ కోరారు. తన తండ్రి కోసం ఆగస్టు 4న జంగీపూర్‌లోని తమ వ్యవసాయ క్షేత్రం నుంచి ఒక పనస పండును తీసుకువచ్చానని గుర్తు చేసుకున్నారు. ‘అవి ఇక్కడ కూడా లభిస్తాయి. కానీ మా సొంత క్షేత్రం నుంచి ఆయన కోసం తీసుకురావాలనిపించింది. ఆయన ఆ పండును సంతోషంగా స్వీకరించారు. అప్పుడు అదృష్టవశాత్తూ ఆయన షుగర్ లెవల్స్ కూడా సాధారణ స్థాయిలోనే ఉన్నాయి. ఆయన కోరికను తీర్చినందుకు చాలా సంతోషించాను’అని గద్గద స్వరంతో పేర్కొన్నారు. ‘రాజకీయాల్లో కావచ్చు, జీవితంలో కావచ్చు.. ఎప్పుడు కూడా కక్షపూరితంగా ఉండవద్దు’అని తన తండ్రి పలుమార్లు తనతో చెప్పారన్నారు. ప్రణబ్‌కు శాయశక్తులా చికిత్స అందించిన వైద్యులకు అభిజిత్ కృతజ్ఞతలు తెలిపారు. ‘ఈ లోకంలో ఆయన పోషించాల్సిన పాత్ర ముగిసిందనుకుంటా. ఒక సాధారణ వ్యక్తి కోరుకునే అన్నింటినీ ఆయన పొందారు’అని వ్యాఖ్యానించారు. చైనా, యూఎస్‌ల్లో.. పశ్చిమబెంగాల్లోని ప్రణబ్ స్వగ్రామం మిరాటీలో గ్రామస్తులు ప్రియతమ నేతకు కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ‘దాదాపు ప్రతీ దుర్గాపూజ ఉత్సవానికి కచ్చితంగా స్వగ్రామానికి వచ్చేలా ప్రణబ్ ప్రయత్నించేవారు. ఆయన లేకుండా దుర్గాపూజ ఉత్సవం ఎప్పటిలా ఎన్నటికీ జరగబోదు’అని గ్రామంలోని ఆలయ పూజారి బందోపాధ్యాయ వ్యాఖ్యానించారు. మరోవైపు, చైనా విదేశాంగ కార్యాలయం ప్రణబ్ చిత్రపటానికి నివాళులర్పించింది. అమెరికా, భారత్ కలిసి ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనే విషయంలో ప్రణబ్ విశేష కృషి చేశారని అమెరికా డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ తెలిపారు. గొప్ప నేతను దేశం కోల్పోయింది ప్రణబ్ ముఖర్జీ మృతికి మంగళవారం కేంద్ర కేబినెట్ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఒక గొప్ప నాయకుడిని, అద్భుతమైన పార్లమెంటేరియన్‌ను దేశం కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ రెండు నిమిషాలు మౌనం పాటించి, శ్రద్ధాంజలి ఘటించింది. ‘పాలనలో అనితరసాధ్యమైన అనుభవం ఉన్న నేత. దేశ విదేశాంగ, రక్షణ, వాణిజ్య, ఆర్థిక మంత్రిగా గొప్ప సేవలందించారు’అని కేబినెట్ ఒక తీర్మానంలో ప్రశంసించింది. జాతిజీవనంపై తనదైన ముద్రను వదిలివెళ్లారని, ఆయన మృతితో శిఖరాయమాన దార్శనిక నేతను దేశం కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. దేశాభివృద్ధికి ప్రణబ్ అందించిన సేవలను భారతీయులు తరతరాలు గుర్తుంచుకుంటారని ప్రధానమంత్రి మోదీ ట్వీట్ చేశారు. ఢిల్లీలోని ప్రణబ్ నివాసం వద్ద సెల్యూట్ చేస్తున్న సైనిక జవాన్లు -
కనెక్ట్ అయ్యారు
ప్రణబ్ హిందీ సినిమాలు చూడరు... ‘పీకూ’ చిత్రం మాత్రం ఇష్టంగా చూశారు. దీపికలో కూతుర్ని చూసుకున్నారు. అసలు ఆయన జీవితంలోని ప్రతి దశా.. ఒక స్త్రీమూర్తితో కనెక్ట్ అయి ఉన్నదే. అమ్మ రాజ్యలక్ష్మి, అక్క అన్నపూర్ణ.. భార్య సువ్రా, కూతురు శర్మిష్ట.. రాజకీయాల్లో శ్రీమతి ఇందిరాగాంధీ.. ప్రణబ్‌ని నడిపించారు.. మహిళా సాధికారవాదిగా మలిచారు. ఆడపిల్లను చదివిస్తే ఇంటికి వెలుగు అవుతుంది అనేవారు ప్రణబ్ ముఖర్జీ. ఆయనే అంటుండే ఇంకో మాట.. మహిళలు రాజకీయాల్లో వస్తే ఆ వెలుగులో సమాజం అభివృద్ధి అక్షరాలు దిద్దుకుంటుందని. ఇకనమిక్స్ పండిట్ ఆయన. మాటలు మరీ ఇంత సుకుమారంగా ఉండవు. ఉద్దేశం మాత్రం స్త్రీలకు.. నడిపించే సామర్థ్యం ఉందనే. ఎలా తెలుసు? ఆయనా ఒక మహిళ చూపిన దారిలోనే నడిచారు కనుక. ఒక మహిళ కాదు.. కొంతమంది. రాజకీయాల్లోకి వచ్చాక ప్రణబ్‌కు దారి చూపిన మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ. చాలా నేర్పించారు ఆమె ఈయనకు. ఒక్క ఇంగ్లిష్, హిందీ మాత్రం నేర్పించలేకపోయారు. అవి రెండూ ప్రణబ్‌కు రావని కాదు. వినసొంపుగా మాట్లాడ్డం సాధన చేయమనేవారు. ముఖ్యంగా ఇంగ్లిష్‌ను! ‘ఉచ్చారణను ఇంప్రూవ్ చేసుకోవయ్యా..’ అని ఆమె అంటే.. ‘సర్కిల్ నుంచి స్క్వేర్ను తయారు చేయాలని ప్రయత్నించకండి మేడమ్’ అని ఈయన నవ్వేవారు. ఇక పార్లమెంట్ చర్చా సమావేశాల్లోనైతే కొన్నిసార్లు శ్రీమతి గాంధీనే ప్రణబ్ మీదుగా గట్టెక్కేవాళ్లు. 1983లో లోక్‌సభలో చరణ్‌సింగ్ ఏవో కాగితాలు గాల్లోకి ఝుళిపిస్తూ.. ‘చూడండి. బడ్జెట్ ప్రసంగ పత్రాలివి. ప్రసంగానికంటే ముందు ఐ.ఎం.ఎఫ్.కి లీక్ అయ్యాయి’ అని ‘ఉమామహేశ్వరస్య ఉగ్రరూపస్య’ అయ్యాడు. శ్రీమతి గాంధీ ప్రధాని. అదెలా జరిగిందో ఆమెకు అర్థం కాలేదు. ఆర్థికమంత్రి ప్రణబ్ కోసం చూశారు. చరణ్‌కి సమాధానం ఇవ్వాలి కదా. ఆ సమయంలో ప్రణబ్ రాజ్యసభలో ఉన్నారు. వెంటనే పిలిపించారు. ఆయన వచ్చేసరికి కూడా చరణ్ ఆగ్రహంతో ఊగిపోతూనే ఉన్నారు. ఆయన్ని మరికొంత సేపు మాట్లాడనిచ్చి.. అప్పుడు చెప్పారు ప్రణబ్.. ‘డేటు చూడండి. అవి గత ఏడాది నేను సమర్పించిన బడ్జెట్ ప్రసంగ పత్రాలు’అని! కాంగ్రెస్ బెంచీలు భళ్లున నవ్వాయి. శ్రీమతి గాంధీకి గొప్ప ఉపశమనం లభించింది. ప్రణబ్ ముఖర్జీ.. శ్రీమతి గాంధీకి సహచరులు మాత్రమే కాదు. సన్నిహితులు కూడా. కోపం వస్తే తిట్టేంత చనువుంది ఆమెకు. 1980 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె వద్దంటున్నా కూడా పోటీ చేశారు ప్రణబ్. ఘోరంగా ఓడిపోయారు. శ్రీమతి గాంధీకి పట్టలేనంత కోపం వచ్చింది. వెంటనే కోల్‌కతా ఫోన్ చేశారు. ‘నువ్వు ఓడిపోతావని ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆఖరికి గీతకు కూడా. కానీ నువ్వు వినలేదు. నాకు చిక్కులు తెచ్చిపెట్టావు’ అన్నారు. (ప్రణబ్ భార్య సువ్రా. శ్రీమతి గాంధీ, మరికొందరు స్నేహితులు ఆమెను గీత అని పిలిచేవారు). ప్రణబ్ మౌనంగా ఉన్నారు. రెండు రోజుల తర్వాత ఆయనకు ఇంకో కాల్ వచ్చింది. సంజయ్ గాంధీ! ‘‘మమ్మీ.. మీ మీద చాలా కోపంగా ఉన్నారు. గురుతుల్యులు శ్రీమతి గాంధీ మీరు లేకుండా కేబినెట్ ఏమిటి అని కూడా అంటున్నారు. విమానంలో రేపటి కల్లా ఢిల్లీలో ఉండండి’’ అని చెప్పారు సంజయ్. ప్రణబ్ మీద శ్రీమతి గాంధీ నమ్మకం అంతటిది! ఆమె పట్ల ప్రణబ్ గమనింపు కూడా అంతలానే ఉండేది. బ్రిటన్ ప్రధాని మార్గరెట్ థాచర్ మొదటిసారి కలిసినప్పుడు శ్రీమతి గాంధీ ఏం తిన్నారో కూడా ఆయనకు గుర్తుంటుంది. రెస్పెక్ట్ విత్ కేరింగ్ అనుకోవాలి. భార్య సహా ప్రతి మహిళను ఆయన గౌరవంగా చూస్తారు. సఫ్దర్‌జంగ్ రోడ్డులో ప్రధాని వాజపేయి, ప్రణబ్ ముఖర్జీ ఇరుగు పొరుగుగా ఉన్నప్పుడు వాజపేయి దత్తపుత్రిక నమిత పెళ్లి కుదిరింది. పెళ్లి పనులన్నీ వాజపేయి అభ్యర్థనపై ప్రణబ్ భార్యే దగ్గరుండి మరీ చూసుకున్నారు. ఆ పనుల్లో భార్యకు సహాయంగా ఉన్నారు ప్రణబ్! ప్రణబ్ తన జీవితంలో తొలిసారి చూసిన హిందీ సినిమా ‘రంగ్ దే బసంతి’. అది కూడా ఆయన చూడాలన్న ఆసక్తి కొద్దీ ఏం చూడలేదు. సెన్సార్ బోర్డు చీఫ్ షర్మిల ఠాగోర్ వచ్చి అడిగితే బలవంతంగా సరేనన్నారు. ఆమె ఎందుకు చూడమని అడిగారంటే.. అందులో భారత రక్షణ శాఖ మంత్రిపై ప్రతీకారం తీర్చుకునే కథాపరమైన అనివార్యత ఏదో ఉంది. ముందే చూపిస్తే తర్వాత తిట్లు పడవు కదా అని షర్మిల ఆలోచన. అప్పుడు మన రక్షణ శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీనే. సినిమాను మహదేవ్ రోడ్డులోని ఓ థియేటర్లో ఆయన కోసం ప్రదర్శించి చూపించారు. సినిమా మధ్యలోనే బయటికి వచ్చేశారు ప్రణబ్. షర్మిల బిక్కుబిక్కుమంటూ నిలబడ్డారు. ప్రణబ్ ఆమె వైపు చూసి, ‘దేశాన్ని కాపాడ్డం నా పని. సినిమాలకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడం కాదు’ అని నిష్క్రమించారు. హాయిగా ఊపిరి పీల్చుకున్నారు షర్మిల. ‘రంగ్ దే బసంతి’ తర్వాత బహుశా ప్రణబ్ చూసిన రెండో హిందీ సినిమా ‘పీకూ’ అయుండొచ్చు. రాష్ట్రపతి భవన్లో వేసిన షోలో అడ్వాణీ తో కలిసి ఆ సినిమా చూశారు. వృద్ధుడైన తండ్రి, ఆయన కూతురు మధ్య ఉండే అనుబంధం ఆ సినిమా. నాయకులిద్దరూ కనెక్ట్ అయ్యారు. ఇద్దరికీ కూతుళ్లున్నారు మరి. ఒక విధంగా ప్రణబ్‌ది మహిళల వల్ల రూపు దిద్దుకున్న జీవితం. ఇంట్లో.. తల్లి రాజ్యలక్ష్మి, అక్క అన్నపూర్ణ, భార్య సువ్రా, కూతురు శర్మిష్ట, రాజకీయాల్లో శ్రీమతి గాంధీ. అందుకే కావచ్చు ఆయనలో ఒక మహిళా సంక్షేమ, సాధికార, హక్కుల పరిరక్షణ యోధుడు కనిపిస్తాడు. భారత సైన్యంలో యుద్ధ విధుల్లోకి మహిళల ప్రవేశం ఆయన చొరవ కారణంగానే సాధ్యమయింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు గట్టి మద్దతు ఇచ్చిన వారిలో ఆయన ప్రథములు. మహిళల కోసం చట్టాలు చేసి ఊరుకుంటే సరిపోదని, చిత్తశుద్ధితో వాటిని అమలు పరచాలని ఆయన అంటుండేవారు. రాష్ట్రపతిగా 2012–17 మధ్య, ఇతర హోదాలలో అంతకుముందు, ఆ తర్వాత మహిళాభ్యున్నతికి, అభివృద్ధికి అనేక ప్రయత్నాలు చేశారు. సూచనలు ఇస్తూ వచ్చారు. చివరిసారి ఆయన మహిళల గురించి మాట్లాడింది.. గత ఏడాది ఆగస్టులో ఢిల్లీలో జరిగిన ‘బేటీ పఢావో అభియాన్’ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా. ‘ఆడపిల్లను చదివిస్తే ఇంటికి వెలుగు అవుతుంది’ అని అక్కడే ఆయన మరోసారి జాతి ప్రజలకు గుర్తు చేశారు. కూతురు శర్మిష్ఠ -
ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు
-
అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
సాక్షి, విజయవాడ: పట్టణంలో పశ్చిమ నియోజకవర్గంలోని 34వ డివిజనలో 2.20 లక్షల రూపాయల సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవాడ నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సాధించారని చెప్పారు. కరోనా వంటి విపత్కర సమయంలో కూడా అభివృద్ధికి ఎలాంటి ఆటంకం కలగలేదన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో 22 డివిజన్లు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. 90 శాతం సంక్షేమ పథకాలను ఆయన ప్రజల వద్దకే తీసుకువచ్చారన్నారని ఆయన తెలిపారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చుని జూమ్ ద్వారా కులాలను, మతాలను రెచ్చగొట్టే వాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఇకనైన కుళ్ళు రాజకీయాలు మానుకోవాలని, ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే చంద్రబాబు అడ్డుకుంటున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. -
ప్రణబ్‌కు నివాళులు అర్పించిన ప్రముఖులు
-
విడిది.. విశిష్ట అతిథి
సాక్షి, హైదరాబాద్: ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి హోదాలో దక్షిణాది విడిది అయిన బొల్లారంలోని ఆర్పీ భవనాన్ని నాలుగుసార్లు సందర్శించారు. 2012లో రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆయన అదే ఏడాది డిసెంబర్ నెలాఖరులో హైదరాబాద్‌లోని రాష్ట్రపతి భవన్‌కు శీతాకాల విడిదికి వచ్చారు. 2013 నూతన సంవత్సర వేడుకలను ఆయన ఇక్కడే జరుపుకొన్నారు. తిరిగి 2013 డిసెంబర్‌లోనూ ఇక్కడకు వచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014లో మాత్రం ఆయన శీతాకాల విడిదికి హైదరాబాద్‌కు రాలేదు. మరుసటి ఏడాది డిసెంబర్‌కు బదులు జూలైలోనే ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి నిలయానికి వచ్చారు. ఆ ఏడాది కేవలం మూడు రోజులు మాత్రమే ఇక్కడ ఉన్నారు. చివరిసారిగా 2016 డిసెంబర్లో రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించారు. నక్షత్రవాటిక, దానిమ్మ తోటల ఏర్పాటు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్ గార్డెన్‌లోని నక్షత్ర వాటిక మాదిరిగానే, బొల్లారం రాష్ట్రపతి నిలయంలోనూ నక్షత్ర వాటిక ఏర్పాటు చేయించారు. ఇందులో 27 నక్షత్రాలు (రాశులు) ప్రతిబింబించేలా 27 రకాల మొక్కలు ఏర్పాటు చేశారు. 99 ఎకరాల సువిశాల రాష్ట్రపతి నిలయంలో సగానికిపైగా స్థలం వృథాగానే ఉండేది. ఈ నేపథ్యంలో తొలిసారిగా రాష్ట్రపతి నిలయం సందర్శనకు వచ్చిన ఆయన ఖాళీ స్థలాల్లో పండ్ల తోటలు, పూలమొక్కలు ఏర్పాటు చేయాల్సిందిగా సూచించినట్లు బోర్డు అధికారులు పేర్కొన్నారు. దీంతో అప్పటికే ఉన్న మామిడి, ఉసిరి, సపోటా తోటలకు అదనంగా దానిమ్మ తోటను ఏర్పాటు చేశారు. నేనున్నానంటూ భరోసానిచ్చారు: పీవీ వాణిదేవి సాక్షి, సిటీబ్యూరో: ‘నాన్న పీవీతో ప్రణబ్ ముఖర్జీది సుదీర్ఘ బంధం. నాన్న మరణం తర్వాత ఆయన మా కుటుంబానికి నేనున్నానన్న భరోసానిచ్చారు. కొన్ని సందర్భాల్లో పార్టీ పట్టించుకోకున్నా.. ఆయన మా కుటుంబానికి అండగా నిలిచారు. ప్రణబ్ మరణం దేశానికి తీరనిలోటు’ అని మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కూతురు పీవీ వాణీదేవి అన్నారు. ప్రణబ్ మరణంపై తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. 2012 డిసెంబరులో తొలిసారిగా పీవీ నర్సింహారావు స్మారక ఉపన్యాసాన్ని ప్రణబ్ ముఖర్జీయే ఇచ్చారని, ఆ రోజు తమ కుటుంబ సభ్యులందరినీ పేరుపేరునా పలకరిస్తూ ఫొటోలు తీయించారని వాణీదేవి గతాన్ని జ్ఞాపకం చేశారు. ప్రణబ్‌కు సీజీఆర్, గ్రేస్ నివాళి లక్డీకాపూల్: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ (సీజీఆర్), తూర్పు కనుమల పరిరక్షణ వేదిక (గ్రేస్) ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించింది. ఆయన మరణంతో దేశం పర్యావరణం పట్ల ఎంతో జ్ఞానం, స్పృహ కలిగిన ఓ బహుముఖ ప్రజ్ఞాశాలి, రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందని అభిప్రాయపడింది. అర్ధ శతాబ్దానానికిపైగా వివిధ రూపాల్లో, హోదాల్లో ఆయన దేశానికి అందించిన సేవలు అనితర సాధ్యం, చిరస్మరణీయం అని పేర్కొంది. ప్రముఖ పర్యావరణ వేత్త ప్రొఫెసర్ పురుషోత్తమ్‌రెడ్డి, లీలా లక్ష్మారెడ్డి (సీజీఆర్), దిలీప్‌రెడ్డి (గ్రేస్) ఈ సందర్భంగా ప్రణబ్ ముఖర్జీకి నివాళులర్పించారు. -
ప్రణబ్‌కు ప్రముఖుల నివాళి
‘‘ప్రణబ్ ముఖర్జీ ఒక దిగ్గజం. మాతృదేశానికి యోగిలాగా సేవ చేశారు. భరతమాత ప్రియతమ పుత్రుడి మరణానికి దేశమంతా దుఃఖిస్తోంది. ఆధునికతను, సాంప్రదాయంతో మేళవించిన మనీషి భారత రత్న ప్రణబ్. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.’’ – రాష్ట్రపతి రామ్నా«థ్ కోవింద్ ‘‘దేశం ఒక పెద్దమనిషిని కోల్పోయింది. కష్టించే గుణం, క్రమశిక్షణ, అంకితభావంతో ఆయన కిందిస్థాయి నుంచి దేశంలో రాజ్యాంగబద్ధమైన అత్యున్నత స్ధాయికి ఎదిగారు. సుదీర్ఘ ప్రజాసేవలో ఆయన నిర్వహించిన ప్రతిపనికీ గౌరవం తెచ్చారు. ఓం శాంతి.’’ – ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ‘‘2014లో ఢిల్లీకి నేను వచ్చినప్పటినుంచి ప్రణబ్ దార్శనికత, ఆయన ఆశీస్సులు నాకు మద్దతుగా నిలిచాయి. ఆయనతో అనుబంధం ఎప్పటికీ గుర్తుంటుంది. రాష్ట్రపతి భవన్‌ను వైజ్ఞానిక, శాస్త్రీయ, సాంస్కృతిక కేంద్రంగా ఆయన మార్చారు. కీలక విధాన నిర్ణయాల్లో ఆయన సలహాలను ఎన్నటికీ మరువలేను. దేశ అభివృద్ధి పథంలో ఆయన ముద్ర స్పష్టంగా ఉంటుంది. ఒక పరిణతి చెందిన రాజకీయ నాయకుడిగా ఆయన్ని అన్ని రాజకీయ పక్షాలు గౌరవించేవి. సమాజంలో అన్ని వర్గాల అభిమానం చూరగొన్న వ్యక్తి భారతరత్న ప్రణబ్’’ – ప్రధాని నరేంద్ర మోదీ ‘‘ప్రణబ్ చేపట్టిన అన్ని పదవులకు వన్నె తెచ్చారు. అన్ని రాజకీయ పక్షాలనేతలతో సుహృద్భావనతో మెలిగేవారు. అంకితభావంతో దేశానికి సేవ చేశారు. ఐదుదశాబ్దాలుగా అటు దేశం, ఇటు కాంగ్రెస్ పార్టీ పయనంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. ఆయన లేని లోటు తీర్చలేదని, ఆయనతో కలిసి పనిచేసిన జ్ఞాపకాలు ఎంతో అమూల్యమైనవి.’’ – కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ‘‘ప్రణబ్ లేరన్న వార్త తీవ్ర విచారం కలిగించింది. ఆయన మరణంతో స్వతంత్ర భారతావనికి చెందిన ఒక గొప్పనాయకుడిని దేశం కోల్పోయింది. ఆయనతో కలిసి ప్రభుత్వంలో పనిచేయడం జరిగింది. ఆ సమయంలో ఆయన మేధస్సు, విజ్ఞానం, వివిధ ప్రజా విషయాలపై ఆయన అనుభవం నుంచి ఎంతో నేర్చుకున్నాను.’’ – మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ‘‘ప్రణబ్ ముఖర్జీ మృతి తీవ్ర వేదన కలిగిస్తోంది. అంకిత భావంతో దేశానికి సేవ చేసిన అనుభవజ్ఞుడు. ఆయన సుదీర్ఘ ప్రజా జీవిత ప్రయాణం దేశానికే గర్వకారణం. దేశ రాజకీయ యవనికపై ఆయన లేని లోటు పూడ్చలేనిది. ఓం శాంతి.’’ – హోం మంత్రి అమిత్‌షా ‘‘ భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం బాధాకరం. దేశానికి ఆయన అనేక రూపాల్లో అంకితభావంతో సేవలనందించారు. అన్నిపార్టీలు ఆయన మేధస్సును గౌరవించేవి.’’ – బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ‘‘ ప్రణబ్ ముఖర్జీ లేరన్న వార్తతో దేశం తీవ్రవేదన చెందింది. దేశప్రజలతో పాటు ఆయనకు నా నివాళి. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.’’ – కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ‘‘ దేశప్రయోజనాలకే ప్రణబ్ పెద్దపీట వేసేవారు. రాజకీయ అస్పృశ్యతను ఆయన దరిచేరనీయలేదు. ఆర్ఎస్ఎస్కు ఆయన ఒక మార్గదర్శి. సంఘ్‌కు ఆయన లేని లోటు పూడ్చలేనిది.’’ – ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ‘‘ ప్రణబ్ ముఖర్జీ ఒక పరిపూర్ణ పెద్దమనిషి. ఆయనతో ఎంతో అనుబంధం ఉండేది. ఆయన మృతికి నా నివాళి.’’ – లతా మంగేష్కర్ ‘‘ భారత్ ఒక దిగ్గజ రాజకీయవేత్తను, గౌరవనీయుడైన నాయకుడిని కోల్పోయింది.’’ – అజయ్‌దేవగన్ ‘‘దశాబ్దాలుగా ప్రణబ్ దేశానికి సేవలనందించారు.ఆయన మృతి తీవ్ర విచారకరం.’’ – సచిన్ టెండూల్కర్ ‘‘ దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది. ఆయన కుటుంబానికి నా సానుభూతి.’’ – విరాట్‌కోహ్లీ -
రాష్ట్రపతిగా ప్రణబనాదం
న్యూఢిల్లీ: దేశ ప్రథమ పౌరుడిగా ప్రణబ్ ముఖర్జీ అందించిన సేవలు మరపురానివి. మరువలేనివి. ప్రజాస్వామ్యబద్ధంగా, హుందాగా, ఉత్తేజంగా రాష్ట్రపతిగా ప్రణబ్ ఉరిమే ఉత్సాహంతో పనిచేశారు. ఏపీజే అబ్దుల్ కలాం తర్వాత ఇంచుమించుగా అంతటి పేరు తెచ్చుకొని రాష్ట్రపతి భవన్‌కు పునరుజ్జీవనం తీసుకువచ్చారు. 2012–2017 వరకు దేశ 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ఇ గవర్నెన్స్ విధానాన్ని తీసుకువచ్చారు. ఆన్లైన్ కార్యకలాపాలు అధికంగా నిర్వహించారు. కేంద్రం అడుగులకి మడుగులు ఒత్తకుండా అన్నివైపుల నుంచి ఆలోచించి నిర్ణయాలు తీసుకునేవారు. రక్షణ, ఆర్థిక, వాణిజ్యం వంటి కీలక శాఖలు నిర్వహించిన అనుభవం రాష్ట్రపతిగా ఆయన తీసుకునే నిర్ణయాలకు బాగా పనికివచ్చింది. తన పదవీకాలంలో ఆఖరి రెండేళ్లు రాష్ట్రపతి భవన్‌ను ఒక పాఠశాలగా మార్చి తాను స్వయంగా టీచర్ అవతారం ఎత్తారు. రాష్ట్రపతి ఎస్టేట్‌లోని రాజేంద్రప్రసాద్ సర్వోదయ విద్యాలయాలో 11, 12 తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. ఆచితూచి అడుగులు పార్లమెంటు ఆమోదించిన బిల్లులు సంతకం కోసం రాష్టపతి దగ్గరకి వస్తే ఆయన వెంటనే ఆమోదించేవారు కాదు. అవి రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేవా ? వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటి, నష్టాలేంటి అన్న అంశాలన్నీ నిశితంగా పరిశీలించేవారు. భూసేకరణ, పునరావాస చట్టంపై బాహాటంగానే తన అసంతృప్తి వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం వివిధ అంశాలపై ఆర్డినెన్స్‌లు ఎక్కువగా తీసుకువస్తోందని దాదా ఆగ్రహించారు. ప్రజలకు చేరువగా భారతీయ చారిత్రక వైభవాన్ని, వారసత్వ సంపదని కాపాడుతూనే రాష్ట్రపతి భవన్‌ను ప్రజలకి చేరువ కావడానికి ఎన్నో చర్యలు తీసుకున్నారు. ఇన్ రెసిడెన్స్ కార్యక్రమం ద్వారా రచయితలు, కళాకారులు, సృజనాత్మకత ఉన్నవారికి రాష్ట్రపతి భవన్ తలుపులు బార్లా తెరిచారు. సామాజిక సేవపై ఆసక్తి ఉన్న వారు రాష్ట్రపతి భవన్లో ఉంటూ ప్రాజెక్టులు నిర్వహించే సదుపాయం కల్పించారు. రాష్ట్రపతి భవన్‌కు ఎక్కువ మంది అతిథులు వచ్చేలా చర్యలు చేపట్టారు. క్షమాభిక్ష పిటిషన్లు ఉరిశిక్ష పడిన వారు దరఖాస్తు చేసుకునే క్షమాభిక్ష పిటిషన్ల విషయంలో ప్రణబ్ చాలా త్వరగా నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఖాతాలో ఎక్కువగా తిరస్కరణలే ఉన్నాయి. అయిదేళ్ల పదవీ కాలంలో నలుగురికి క్షమాభిక్ష ప్రసాదిస్తే, 30 పిటిషన్లను తిరస్కరించారు పర్యాటక ప్రాంతంగా.. భారత్‌లో ప్రముఖ పర్యాటక కేంద్రంగా రాష్ట్రపతి భవన్‌ను నిలపడానికి ప్రణబ్ ముఖర్జీ ఎంతో కృషి చేశారు. రాష్ట్రపతి భవన్, మొఘల్ గార్డెన్స్, మ్యూజియం సందర్శించడానికి ప్రజలకు అనుమతులు ఇచ్చారు. ప్రణబ్ హయాంలో భారీగా ప్రజలు రాష్ట్రపతి భవన్‌ను సందర్శించారు. 2017లో జరిగిన ఉద్యానోత్సవ్కి 7 లక్షల మంది వరకు హాజరవడం ఒక రికార్డుగా చెప్పుకోవాలి. ట్విట్టర్లో ‘సిటిజన్ ముఖర్జీ’ ప్రణబ్ ముఖర్జీ హయాంలోనే రాష్ట్రపతి భవన్ మొదటిసారిగా సామాజిక మాధ్యమాల్లో అడుగుపెట్టింది. 2014 జూలై 1న ట్విట్టర్లో అకౌంట్ ప్రారంభించి ప్రజలకు మరింత చేరువయ్యారు. రాష్ట్రపతిగా ప్రణబ్ పదవీ విరమణ చేసినప్పుడు 33 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రజల మనిషి అయిన ప్రణబ్ ట్విట్టర్లో ‘సిటిజన్ ముఖర్జీ’పేరును వాడారు. కొత్త మ్యూజియం రాష్ట్రపతి భవన్లో గుర్రపు శాలలు ఉండే ప్రాంతాన్ని ఒక మ్యూజియంగా మార్చారు. ఇందులో మొదటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ దగ్గర్నుంచి ప్రతీ ఒక్కరూ ప్రమాణ స్వీకారం చేసే ఫొటోలను ఉంచారు. పురాతన ఆయుధాలు, ఫర్నీచర్ కూడా ఈ మ్యూజియంలో కనువిందు చేస్తాయి. -
బహుముఖ ప్రజ్ఞాశాలి... ప్రణబ్‌దా!
న్యూఢిల్లీ: బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రణబ్ ముఖర్జీ. దాదాపు 5 దశాబ్దాల క్రియాశీల రాజకీయ జీవితం ఆయన సొంతం. చివరగా, అత్యున్నత రాజ్యాంగ పదవి ఆయన రాష్ట్రపతిగా 2012 నుంచి 2017 వరకు విధులు నిర్వర్తించారు. అన్ని పార్టీలకు ఆమోదనీయ నేతగా ఆయన ఆ పదవి చేపట్టారు. 2019లో అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’పొందారు. కాంగ్రెస్ పార్టీలో, పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వంలో ప్రణబ్ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరు గాంచారు. ఇందిరాగాంధీ నుంచి సోనియాగాంధీ వరకు.. గాంధీ కుటుంబానికి నమ్మకమైన నేతగా, కుడి భుజంగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన విదేశాంగ, రక్షణ, ఆర్థిక శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా సంస్కరణల అమలుకు సాయమందించారు. తండ్రి సమరయోధుడు 1935 డిసెంబర్ 11న అప్పటి బ్రిటిష్ ఇండియాలో భాగమైన బెంగాల్ ప్రెసిడెన్సీలో ఉన్న మిరాటి గ్రామంలో(ప్రస్తుతం పశ్చిమబెంగాల్లోని బీర్బుమ్ జిల్లాలో ఉంది) ఒక బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో ప్రణబ్ ముఖర్జీ జన్మించారు. తల్లిదండ్రులు రాజ్యలక్ష్మి ముఖర్జీ, కమద కింకర్ ముఖర్జీ. తండ్రి స్వాతంత్య్ర సమరయోధుడు. 1952–64 మధ్య పశ్చిమబెంగాల్ శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ తరఫున సభ్యుడిగా ఉన్నారు. ప్రణబ్ ముఖర్జీ కలకత్తా యూనివర్సిటీలో ఎంఏ(చరిత్ర), ఎంఏ(రాజనీతి శాస్త్రం), ఎల్ఎల్బీ చదివారు. మొదట డిప్యూటీ అకౌంటెంట్ జనరల్(పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్) కార్యాలయంలో యూడీసీగా ఉద్యోగంలో చేరారు. ఆ తరువాత కలకత్తాలోని విద్యాసాగర్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం సాధించారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టేముందు జర్నలిస్ట్‌గా కొంతకాలం పనిచేశారు. 1969 నుంచి అప్రతిహతంగా.. 1969లో ప్రణబ్ ముఖర్జీ క్రియాశీల రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఆ సమయంలో జరిగిన మిడ్నాపుర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి వీకే కృష్ణమీనన్ విజయంలో ప్రణబ్ కీలక పాత్ర పోషించారు. ఆయన సామర్థ్యా న్ని కాంగ్రెస్ నాయకురాలు, అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గుర్తించి, పార్టీలో చేర్చుకున్నారు. 1969 జూలైలో రాజ్యసభకు పంపించారు. ఆ తరువాత 1975, 1981, 1993, 1999ల్లోనూ ఎగువ సభకు ఎన్నికై, పలుమార్లు సభా నాయకుడిగా విశేష సేవలందించారు. రాజకీయాల్లో ఇందిరాగాంధీ ఆశీస్సులు, తన సామర్ధ్యంతో అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. 1973లో తొలిసారి కేంద్రంలో సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత వివిధ శాఖలు నిర్వహించి, 1982లో కీలకమైన ఆర్థిక శాఖ పగ్గాలు చేపట్టారు. ఆ సమయంలో మన్మోహన్ సింగ్‌ను ఆర్బీఐ గవర్నర్‌గా నియమించింది ప్రణబ్ ముఖర్జీనే కావడం విశేషం. 1978లోనే సీడబ్ల్యూసీ సభ్యుడయ్యారు. ఇందిరాగాంధీ కేబినెట్లో నంబర్ 2గా ప్రణబ్ ప్రఖ్యాతి గాంచారు. అయితే, ఇందిరాగాంధీ హత్య అనంతరం పరిస్థితులు తారుమారయ్యాయి. పార్టీలో, ప్రభుత్వంలో ప్రణబ్‌ను పక్కనపెట్టడం ప్రారంభమైంది. చివరకు, ఆయనను పశ్చిమబెంగాల్ పీసీసీ వ్యవహారాలు చూసుకొమ్మని కలకత్తాకు పంపించేశారు. ► ప్రణబ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ), ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్‌లలో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యులుగా ఉన్నారు. ► దేశంలో అత్యున్నత పురస్కారం భారత రత్నతో పాటు, పద్మ విభూషణ్, ఉత్తమ పార్లమెంటేరియన్, బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ ఇన్ ఇండియా అవార్డులు ఆయన్ను వరించాయి. ► ప్రపంచంలోని వివిధ విశ్వవిద్యాలయాలు ఆయనకు ఐదు గౌరవ డాక్టరేట్స్‌ను ప్రదానం చేశాయి. కుటుంబం ప్రణబ్‌కు మొత్తం ముగ్గురు సంతానం. ఇద్ద రు కుమారులు... ఇంద్రజిత్, అభిజిత్. కూతు రు షర్మిష్ట. రాష్ట్రపతిగా ఆయన పదవీకాలం లో షర్మిష్ట కీలకమైన సందర్భాల్లో తండ్రికి తోడుగా ఉన్నారు. ప్రణబ్ అర్ధాంగి సువ్ర ముఖర్జీ 2015లో మరణించారు. 47 ఏళ్లకే ఆర్థికమంత్రి అపారమైన జ్ఞాపకశక్తి, లోతైన విషయపరిజ్ఞానం, సమకాలీన అంశాలపై విస్తృత అవగాహన, పదునైన మేధోశక్తి... ప్రణబ్‌ను విశిష్టమైన రాజకీయవేత్తగా నిలిపాయి. 1982లో ఆయన 47 ఏళ్లకే ఆర్థికమంత్రి అయ్యారు. దేశ చరిత్రలో అత్యంత పిన్నవయస్కుడైన ఆర్థికమంత్రిగా గుర్తింపు పొందారు. విదేశీ వ్యవహారాలు, రక్షణ, ఆర్థిక, వాణిజ్య శాఖలను చూశారు. ఇన్ని కీలకశాఖలను చూసిన తొలి రాష్ట్రపతి ప్రణబే. ముగ్గురు ప్రధానమంత్రులు... ఇంధిరాగాంధీ, పీవీ నరసింçహారావు, మన్మోహన్‌ల వద్ద పనిచేసిన అరుదైన గుర్తింపు పొందారు. ప్రధానమంత్రిగా పనిచేయకుండా... లోక్‌సభ నాయకుడిగా 8 ఏళ్లు పనిచేసిన ఏకైక నేత. 1980–85 ఏళ్లలో రాజ్యసభలో సభానాయకుడిగా ఉన్నారు. 2004–2012 మధ్యకాలంలో మొత్తం 39 మంత్రివర్గ ఉపసంఘాలు (గ్రూప్స్ ఆఫ్ మినిస్టర్స్) ఉండగా... వీటిలో ఏకంగా ఇరవై నాలుగింటికి ప్రణబ్ ముఖర్జీ నేతృత్వం వహించారు. విస్తృత ఏకాభిప్రాయాన్ని నిర్మించడంలో దిట్ట. పార్టీలకతీతంగాఅందరి విశ్వాసం చూరగొన్నారు. ఐదుసార్లు రాజ్యసభ సభ్యుడిగా, రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా పనిచేసిన ప్రణబ్‌కు స్వాతంత్య్రానంతర దేశ రాజకీయ చరిత్ర, పాలనా వ్యవహారాలు కొట్టినపిండి. దీంతో దేశ అభివృద్ధిపథంలో కీలకపాత్ర పోషించారు. 2005లో ప్రణబ్ రక్షణమంత్రిగా ఉన్నపుడే భారత్– అమెరికా రక్షణ సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. సహ చట్టం, జాతీయ ఆహారభద్రతా చట్టం, ఆధార్, మెట్రో రైలు ప్రాజెక్టులు లాంటి మన్మోహన్ సర్కారు నిర్ణయాల్లో ఆయనది ముఖ్యభూమిక. రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన ఏడాది తర్వాత జూన్, 2018లో నాగ్‌పూర్‌లోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కేంద్ర కార్యాలయాన్ని సందర్శించి సంచలనం సృష్టించారు. 2019లో బీజేపీ ప్రభుత్వం ప్రణబ్‌ముఖర్జీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ను ప్రకటించింది. ప్రధాని కాలేకపోయారు 1986లో సొంతంగా రాష్ట్రీయ సమాజ్‌వాదీ కాంగ్రెస్ అనే ఒక రాజకీయ పార్టీని ప్రణబ్ స్థాపించారు. 1987లో జరిగిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రణబ్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. రాజీవ్‌గాంధీతో సయోధ్య అనంతరం 1989లో ఆ పార్టీని ఆయన కాంగ్రెస్‌లో విలీనం చేశారు. 1991లో రాజీవ్ హత్య తరువాత కేంద్ర రాజకీయాల్లో మళ్లీ ప్రణబ్ క్రియాశీలకం అయ్యారు. ప్రధాని పీవీ నరసింహారావు ఆయనను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఆ తరువాత కీలకమైన విదేశాంగ శాఖ అప్పగించారు. సోనియా రాజకీయాల్లోకి రావడానికి ప్రణబ్ వ్యూహమే కారణమని భావిస్తారు. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను సోనియా స్వీకరించిన తరువాత, ప్రణబ్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. 2004లో ప్రధాని పదవిని సోనియా నిరాకరించిన సమయంలో ప్రధానిగా అనుభవజ్ఞుడైన ప్రణబ్ పేరే ప్రముఖంగా వినిపించింది. కానీ అనూహ్యంగా మన్మోహన్ ప్రధాని అయ్యారు. మన్మోహన్ కేబినెట్లోనూ ప్రణబ్ కీలకంగా ఉన్నారు. 2007లోనే ప్రణబ్‌ను రాష్ట్రపతిని చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. కానీ కేబినెట్లో ఆయన సేవలు అవసరమని భావించి, ఆ ఆలోచనను విరమించుకున్నారు. 2012లో రాష్ట్రపతి పదవిని స్వీకరించే వరకు కాంగ్రెస్‌తోనే అనుబంధం కొనసాగింది. ఏకంగా 23 ఏళ్ల పాటు సీడబ్ల్యూసీలో ఉన్నారు. మూడోసారి... కలిసొచ్చింది ఐదుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసినా... ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టాలనే బలమైన కోరిక మాత్రం ప్రణబ్ దాకు చాలాకాలం సాకారం కాలేదు. 1977లో మాల్దా నుంచి, 1980లో బోల్పూర్ నుంచి లోక్‌సభకు పోటీచేసిన ప్రణబ్‌ముఖర్జీ ఓటమిపాలయ్యారు. తర్వాత 2004 దాకా ఆయన ప్రత్యక్ష ఎన్నికల జోలికి పోలేదు. మూడు కారణాలతో తాను మళ్లీ ఎన్నికల గోదాలోకి దిగానని దాదా తన ‘ది కొయలిషన్ ఇయర్స్’పుస్తకంలో రాసుకున్నారు. ‘రాజ్యసభ సభ్యుడు మంత్రి కాగానే సాధ్యమైనంత తొందరగా లోక్‌సభకు ఎన్నిక కావడం మంచిదనేది నెహ్రూ విధానం. ఇదెప్పుడూ నా దృష్టిలో ఉండేది. రెండోది... 1984 తర్వాత ప్రతి ఎన్నికల్లో జాతీయ ప్రచార కమిటీ సారథిగా బాధ్యతలు నిర్వర్తించాను. ప్రచార కమిటీకి చైర్మన్‌గా ఉంటూ ప్రజాతీర్పును ఎదుర్కొనకపోతే ఎట్లా? అనేది నా మదిని తొలుస్తుండేది. మూడోది... నేను పోటీచేయాల్సిందేనని బెంగాల్ కాంగ్రెస్ శ్రేణుల నుంచి గట్టి డిమాండ్ వచ్చింది. అందుకే 2004లో ముర్షిదాబాద్ నుంచి బరిలోకి దిగా’అని చెప్పుకొచ్చారు. రెండుసార్లు ఎంపీగా చేసిన అబుల్ హస్నత్ ఖాన్ (సీపీఎం) ఆయన ప్రత్యర్థి. స్థానిక బీడీ కార్మికుల్లో బాగా పట్టున్న నేత. గెలుస్తానని స్వయంగా తనకే నమ్మకం లేనప్పటికీ... ప్రణబ్‌ను ముచ్చటగా మూడోసారి అదృష్టం వరించింది. దాదాపు 36 వేల మెజారిటీతో ఆయన గెలుపొందారు. చెప్పుకోదగిన విషయం ఏమిటంటే... పదవీకాలం ముగియగానే మళ్లీ రాజ్యసభకు పంపిస్తానని సోనియాగాంధీ అప్పటికే ఆయనకు హామీ ఇచ్చారు. పైగా ఓట్ల లెక్కింపు కోసం ప్రణబ్ ముర్షిదాబాద్‌కు వెళుతున్నపుడు... ఓటమి ఖాయమయ్యే దాకా వేచి ఉండొద్దు. సాధ్యమైనంత త్వరగా ఢిల్లీ వచ్చేయమని సోనియా చెప్పారట. నాలుగో పుస్తకం... రాష్ట్రపతిగా తన ప్రయాణాన్ని ప్రణబ్ ముఖర్జీ చాలా విపులంగా అక్షరబద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబరు 11వ తేదీన ఆయన జయంతిని పురస్కరించుకొని ఈ పుస్తకం... ‘ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్’ను విడుదల చేస్తామని ప్రచురణ సంస్థ రూపా పబ్లికేషన్స్ సోమవారం వెల్లడించింది. ఇది ప్రణబ్ రాసిన నాలుగో పుస్తకం. ఇంతకుముందు ఆయన... ‘ది డ్రమటిక్ డికేడ్ (2014), ది టర్బులెంట్ ఇయర్స్ (2016), ది కొయలిషన్ ఇయర్స్ (2017)లను రాశారు. రాష్ట్రపతి భవన్ పనితీరుపై సమగ్ర అవగాహన కల్పించడమే కాకుండా, అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన, నోట్లరద్దు... వంటి అంశాల్లో అసలేం జరిగిందో తాజా పుస్తకం వివరిస్తుందని రూపా పబ్లికేషన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ‘సర్జికల్ స్ట్రయిక్స్, ప్రధాని నరేంద్ర మోదీతో, ఎన్డీయే ప్రభుత్వంతో ప్రణబ్ సంబంధాలపై కూడా ఇందులో వివరించారని తెలిపింది. శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల పనితీరుపై కూడా ఆయన తన అభిప్రాయాలను ఇందులో వెల్లడించారు. 2019లో రెండోసారి ఎన్నికల్లో గెలిచాక ప్రధాని మోదీకి మిఠాయి తినిపిస్తున్న ప్రణబ్‌ముఖర్జీ రాష్ట్రపతి కోవింద్ నుంచి భారతరత్న పురస్కారాన్ని స్వీకరిస్తున్న ప్రణబ్ దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీతో ప్రణబ్ -
అనుభవశాలి కనుమరుగు
దేశ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం గడించి, ఎన్నో పదవుల్లో రాణించి సమర్థుడిగా పేరుతెచ్చుకున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం కన్నుమూశారు. వేరే వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లినప్పుడు తనకు కరోనా సోకిందని నిర్ధారణ అయిందని గత నెల 10న ఆయనే స్వయంగా ట్వీట్ చేశారు. మెదడులో ఏర్పడిన అవరోధాన్ని తొలగించడానికి అదేరోజు ఆయనకు శస్త్రచికిత్స కూడా చేశారు. ఆనాటినుంచీ ఆయన సురక్షితంగా కోలుకుని బయటపడాలని దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రార్థించారు. ప్రణబ్ ఆరోగ్యం కుదుటపడుతోందని గత నెల 16న ఆయన కుమారుడు ట్వీట్ చేశారు కూడా. కానీ ఆ మరుసటి రోజునుంచే దురదృష్టవశాత్తూ ఆయన ఆరోగ్యం మళ్లీ క్షీణించడం మొదలుపెట్టింది. మధ్యలో కొద్దికాలం మినహా ప్రణబ్ ముఖర్జీ 1969లో కాంగ్రెస్‌లో చేరింది మొదలు రాష్ట్రపతి అయ్యేవరకూ ఆ పార్టీతోనే ప్రయాణించారు. ఇందిరాగాంధీకి విశ్వాసపాత్రుడిగా మెలిగి 1973లో తొలిసారి కేంద్ర మంత్రి అయ్యారు. రెవెన్యూ, బ్యాంకింగ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖను స్వతంత్రంగా చూస్తున్న సమయంలో స్మగ్లర్ హాజీ మస్తాన్ నేర సామ్రాజ్యంపై దాడులు చేయించినప్పుడు మీడియాలో ఆయన పేరు మార్మోగింది. ఎమర్జెన్సీ పర్యవసానంగా 1977లో కాంగ్రెస్ ఓటమిపాలయ్యాక తాత్కాలికంగా తెరమరుగైనా 1982లో ఆ పార్టీ తిరిగి అధికారంలోకొచ్చినప్పుడు ప్రణబ్‌కు ఇందిరాగాంధీ కీలకమైన ఆర్థిక మంత్రిత్వ శాఖను అప్పగించారు. స్వతంత్రంగా ఆలోచించడం, ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మొదటినుంచీ ఆయనకు పేరు తెచ్చిపెట్టాయి. దేనికో ప్రభావితం కావడం, తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోవడం మొదటినుంచీ ఆయనకు పడదు. ఆయన హయాంలోనే భిన్న రంగాలకు సేవచేసేందుకు అనువుగా అనేక సంస్థలు మొగ్గతొడిగాయి. గ్రామీణ బ్యాంకులు, నాబార్డ్, ఎగ్జిమ్ బ్యాంకు వగైరాలు ప్రణబ్ చలవేనంటారు. అనునిత్యం ఎన్నో సవాళ్లు, సమస్యలు వచ్చిపడే రాజకీయ రంగంలో మానసిక ఒత్తిళ్లకు లోనుకాకుండా వుండటం అసాధ్యం. పరస్పర విరుద్ధమైన ప్రయోజనాల కోసం సంఘర్షించే భిన్న వర్గాలను ఒక తాటిపైకి తీసుకురావడం కూడా కష్టం. కానీ ప్రణబ్ వీటిని స్థిరచిత్తంతో ఎదుర్కొన్నారు. సమస్యను జాగ్రత్తగా ఆకళింపు చేసుకుని, అన్ని వర్గాలతో ఓపిగ్గా చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనడంలో ప్రణబ్‌కు ప్రత్యేకమైన గుర్తింపు వుంది. ప్రభుత్వంలోనైనా, పార్టీలోనైనా ఆయన తీరు అదే. అందుకే ఆయన్ను ‘సంక్షోభ పరిష్కర్త’గా చూసేవారు. ఆర్థికమంత్రిగా వున్నప్పుడు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) రుణాన్ని వెనక్కి తిప్పి పంపడం ఒక సంచలనం. సంస్కరణలవైపు మొగ్గుచూపినా వాటిని సంయమనంతో అమలు చేయడం ప్రణబ్ ప్రత్యేకత. ఇందిరాగాంధీ హత్యానంతరం రాజీవ్‌గాంధీ అధికారంలోకొచ్చాక ప్రణబ్ ప్రభ మసకబారడం మొదలైంది. తనను ఆయన పీసీసీ అధ్యక్షుడిగా పంపారని అలిగిన ప్రణబ్ సొంతంగా రాష్ట్రీయ సమాజ్‌వాదీ కాంగ్రెస్‌ను స్థాపించారు. 1987 ఎన్నికల్లో ఓటమిపాలు కావడంతో మౌనంగా వుండిపోయారు. రాజీవ్ మరణానంతరం పీవీ నరసింహారావు హయాంలో తిరిగి కాంగ్రెస్‌లో చేరి పూర్వ వైభవాన్ని పొందగలిగారు. 2004లో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకొచ్చినప్పుడు ప్రధాని పదవి చేపట్టడానికి సోనియాగాంధీ నిరాకరించాక అందరి దృష్టీ ప్రణబ్‌పైనే పడింది. పార్టీలో ఆయన్ను మించిన అనుభవశాలురు లేరు. కానీ రాజీవ్‌తో వున్న అనుభవంరీత్యా ఆయనేమీ ఆశించలేదు. ఇందిర హయాంలో ఆర్థికమంత్రిగా పనిచేస్తూ రిజర్వ్‌బ్యాంకు గవర్నర్‌గా తాను నియమించిన మన్మోహన్ సింగ్‌ను ప్రధాని పదవికి ఎంపిక చేస్తే మారుమాట్లాడకుండా శిరసావహించారు. రెండోసారి 2009లో కూడా ప్రధాని పదవికి ప్రణబ్ పేరు ప్రస్తావనకొచ్చింది. కానీ అప్పుడూ ఆయనకు అది దక్కలేదు. స్వతంత్రంగా వ్యవహరించే ప్రణబ్ తీరుపై సోనియాగాంధీకున్న భయాందోళనలే ఇందుకు కారణమంటారు. అయితే 2012లో రాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడినప్పుడు ఆయన తన అభీష్టాన్ని దాచుకోలేకపోయారు. రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ తొలి చాయిస్ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీయేనని అప్పట్లో మీడియాలో కథనాలొచ్చాయి. సంక్షోభ పరిష్కర్తగా వుండే ప్రణబ్ అనుభవాన్ని వదులుకోలేకే ఇలాంటి ఆలోచన చేసినట్టు కాంగ్రెస్ లీకులిచ్చినా 2014లో బొటాబొటీ మెజారిటీ వచ్చే పక్షంలో ఆయన సహకరించకపోవచ్చునన్న సంశయం సోనియాగాంధీకి వుందంటారు. ఏమైతేనేం రాష్ట్రపతి పదవికి ఆయన్ను ఎంపిక చేయక తప్పలేదు. సాధారణంగా రాజకీయాల్లో మునిగి తేలేవారికి పుస్తక రచన సంగతలావుంచి పుస్తకాలు చదవడానికి కూడా సమయం చిక్కదు. కానీ ప్రణబ్ ఇందుకు భిన్నం. ఆయన ఎన్ని సమస్యల్లో తలమునకలైవున్నా గ్రంథ పఠనానికి, అధ్యయనానికి సమయం కేటాయించుకునేవారు. రాష్ట్రపతి అయ్యాక తీరిక దొరకడం వల్ల కావొచ్చు...ఆయన తన అనుభవాలను రంగరించి మూడు పుస్తకాలు తీసుకొచ్చారు. పదవినుంచి వైదొలగాక మరో గ్రంథాన్ని రాశారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో తనకెదురైన అనుభవాలు, వివిధ సందర్భాల్లో తీసుకున్న కీలక నిర్ణయాలపై తన మనోభీష్టాన్ని వాటిల్లో వ్యక్తం చేశారు. అయితే సంక్షోభ పరిష్కర్తగా పేరున్నందువల్ల కావొచ్చు... ఎక్కడా ఆయన వివాదాస్పద అంశాల జోలికి పోలేదు. ఎవరినీ నొప్పించే ప్రయత్నం చేయలేదు. చివరకు రాజీవ్ తనను తొలుత కేంద్ర కేబినెట్ నుంచీ, ఆ తర్వాత పార్టీనుంచి సాగనంపడంపై ప్రచారంలో వున్న కథనాలను సైతం ఆయన కొట్టిపడేశారు. ఉద్దేశపూర్వకంగానే కొన్ని జ్ఞాపకాలను పంచుకోవడం లేదని కూడా ఆ పుస్తకాల్లో తేల్చిచెప్పారు. అయిదు దశాబ్దాలపాటు దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించి కనుమరుగైన ప్రణబ్‌కు ‘సాక్షి’ నివాళులర్పిస్తోంది. -
ప్రణబ్‌దా.. అల్విదా
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ దురంధరుడు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) కన్నుమూశారు. అనారోగ్యంతో గత 21 రోజులుగా ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న ప్రణబ్.. సోమవారం సాయంత్రం మృతి చెందారు. సాయం త్రం 4.30 గంటల సమయంలో గుండెపోటుతో ప్రణబ్ మరణించారని వైద్యులు ప్రకటించారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో అదే హాస్పిటల్లో ఆగస్టు 10న ఆయనకు వైద్యులు క్లిష్టమైన శస్త్రచికిత్స చేశారు. అదే సమయంలో, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో పాటు కరోనా కూడా సోకడంతో అప్పటి నుంచి ప్రణబ్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. వెంటిలేటర్‌పైనే కోమాలో ఉన్నారు. ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలను నేడు (మంగళవారం) మధ్యాహ్నం 2 గంటలకు లోధి రోడ్‌లోని çశ్మశాన వాటికలో నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబం వెల్లడించింది. దాదాపు ఐదు దశాబ్దాల క్రియాశీల రాజకీయ జీవితంలో ఎన్నో అత్యున్నత పదవులను ప్రణబ్ అధిష్టించారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా దేశ రాజకీయ చిత్రపటంపై చెరగని ముద్ర వేసిన నేతగా పేరుగాంచారు. జీవితాంతం రాజకీయ దురంధరుడిగా, అపర చాణక్యుడిగా, రాజనీతిజ్ఞుడిగా, నడిచే విజ్ఞాన సర్వస్వంగా దేశ ప్రజలు, సహచరుల మన్ననలు పొందారు. ఎన్నో సంక్షోభాల నుంచి కాంగ్రెస్ పార్టీని విజయవంతంగా గట్టెక్కించిన ట్రబుల్ షూటర్‌గా ఆయన గుర్తుండిపోతారు. 2019లో భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’తో ఆయనను గౌరవించింది. ప్రణబ్‌కు ఒక కుమార్తె షర్మిష్ట, ఇద్దరు కుమారులు అభిజిత్ ముఖర్జీ, ఇంద్రజిత్ ముఖర్జీ ఉన్నారు. భార్య సువ్రా ముఖర్జీ 2015లో చనిపోయారు. ప్రణబ్ మృతి వార్తను మొదట ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్వీటర్ ద్వారా ప్రకటించారు. ఒక శకం ముగిసింది ప్రణబ్ మృతితో దేశవ్యాప్తంగా సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ తదితరులు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రణబ్ మృతితో ఒక శకం అంతరించిందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రజా జీవితంలో శిఖరసమానుడు ప్రణబ్. ఒక యోగిలా మాతృభూమికి సేవ చేశారు. గొప్ప కుమారుడిని కోల్పోయిన భారతదేశం శోకతప్తమయింది. ఆయన కుటుంబానికి, మిత్రులకు, దేశ ప్రజలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా’అని ఆయన ట్వీట్ చేశారు. సంప్రదాయం, ఆధునికత.. జ్ఞానం, వివేచన కలగలసిన నేతగా ప్రణబ్‌ను రాష్ట్రపతి ప్రశంసించారు. 2012 నుంచి 2017 వరకు దేశ 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ బాధ్యతలు నిర్వర్తించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ మృతిపై ప్రధాని మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలకు అతీతంగా అందరికీ ప్రణబ్ ఆప్తుడని కొనియాడారు. శిఖరాయమాన దార్శనికుడిగా, అత్యుత్తమ విజ్ఞాన ఖనిగా ఆయనను అభివర్ణించారు. ‘భారత రత్న ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల దేశం యావత్తూ ఆవేదన చెందుతోంది. భారత దేశ అభివృద్ధి పథంపై తనదైన ముద్ర వేసిన నాయకుడు ప్రణబ్’అని ట్వీట్ చేశారు. ‘అనేక దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆర్థిక, ఇతర వ్యూహాత్మక మంత్రిత్వ శాఖల్లో తనదైన ముద్రతో సేవలందించారు. ఆయన గొప్ప పార్లమెంటేరియన్. చర్చలకు బాగా సిద్ధమై వచ్చే నాయకుడు. గొప్ప వక్త. అంతే స్థాయిలో హాస్య స్ఫూర్తి ఉన్న నేత’అని మోదీ ట్వీట్ చేశారు. ప్రణబ్‌కు పాదాభివందనం చేస్తున్న ఫొటోతో పాటు మరికొన్ని ఫొటోలను ఆయన తన ట్వీట్‌కు జతచేశారు. ఇక ముందు ఎలా? పార్టీలో సీనియర్ సహచరుడు ప్రణబ్ మృతిపై తన సంతాపాన్ని ఒక లేఖ ద్వారా కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ఆయన కూతురు షర్మిష్టకు తెలియపరిచారు. గత ఐదు దశాబ్దాల ప్రణబ్ జీవితం.. యాభై ఏళ్ల దేశ చరిత్రకు సాక్షీభూతంగా నిలుస్తుందని సోనియా అందులో కొనియాడారు. ‘ప్రణబ్‌దా దేశ చరిత్రలో, కాంగ్రెస్ ప్రస్థానంలో విస్మరించలేని భాగం. ముందు చూపు, విజ్ఞానం, అనుభవం, అద్భుత అవగాహనతో కూడిన ఆయన సలహాలు, సూచనలు లేకుండా ఇక ముందు ఎలా సాగుతామనేది ఊహించలేకుండా ఉన్నాం. నిర్వహించిన ప్రతీ పదవికీ ఒక దిశానిర్దేశం చేసిన నాయకుడు ఆయన. పార్టీలకు అతీతంగా అందరు నేతలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న నేత. గొప్ప అంకితభావంతో దేశసేవ చేశారు’అని ప్రశంసించారు. వారం పాటు సంతాపం మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతికి సంతాప సూచకంగా ఏడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రభుత్వం ప్రకటించింది. దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌కు గౌరవ సూచకంగా దేశవ్యాప్తంగా ఏడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. ప్రణబ్ మృతికి సంతాపసూచకంగా ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ 6 వరకు దేశవ్యాప్తంగా అన్ని ప్రదేశాల్లో జాతీయ పతాకం సగం వరకు అవనతం చేస్తారని తెలిపింది. బెంగాల్ నుంచి ప్రారంభం.. ప్రణబ్ ముఖర్జీ రాజకీయ ప్రస్థానం 1969లో పశ్చిమబెంగాల్లో ప్రారంభమైంది. ఆ క్రమంలో ఇందిరాగాంధీకి అత్యంత విశ్వసనీయ నేతగా కాంగ్రెస్ పార్టీలో కీలక స్థాయికి ఎదిగారు. ఇతర సీనియర్ మంత్రులున్నప్పటికీ.. ప్రధాని ఇందిర తరువాత ఆమె మంత్రివర్గంలో నెంబర్ 2గా నిలిచారు. అయితే, ఇందిర మరణం అనంతరం పార్టీకి కొంతకాలం దూరమయ్యారు. తరువాత, ప్రధాని పీవీ నరసింహరావు హయాంలో మళ్లీ కీలక బాధ్యతలు చేపట్టారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా, ఆ తరువాత విదేశాంగ శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. తదనంతర పరిణామాల్లో సోనియాకు విశ్వసనీయ సహచరుడిగా, కీలక వ్యూహకర్తగా, సంక్షోభ నివారణ నిపుణుడిగా కాంగ్రెస్ పార్టీలో పేరుగాంచారు. ప్రభుత్వ విధుల్లోనూ ఆర్థిక, రక్షణ, విదేశాంగ శాఖలను అత్యంత ప్రతిభా సామరŠాధ్యలతో నిర్వహించారు. 47 ఏళ్ల వయస్సులోనే ఆర్థిక శాఖ పగ్గాలు చేపట్టిన మంత్రిగా ఆయన రికార్డు సృష్టించారు. ఇందిర మరణం అనంతరం ఒకసారి, రాజీవ్ మృతి తరువాత మరోసారి ప్రధాని పదవి చేపట్టే అవకాశం ఆయనకు తృటిలో చేజారింది. ప్రణబ్ 7 సార్లు ఎంపీగా ఉన్నారు. రాష్ట్రపతిగా ఉన్న సమయంలో.. విరుద్ధ సైద్ధాంతిక నేపథ్యం ఉన్న ప్రధాని మోదీతోనూ ఆయన సత్సంబంధాలను కొనసాగించడం విశేషం. -
దేశం ఓ వజ్రాన్ని కోల్పోయింది: చిరంజీవి
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) ఈ రోజు సాయంత్రం మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో దేశం విషాదంలో మునిగిపోయింది. ప్రణబ్ మృతి పట్ల ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రణబ్ మరణంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఈ మేరకు ట్విటర్లో స్పందించారు. ‘ప్రణబ్ ముఖర్జీ మరణంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాను. అతనితో నేను గడిపిన క్షణాలను ఎప్పటికి గుర్తుంటాయి. ఒక గొప్ప జ్ఞానం, విశిష్టమైన రాజకీయ జీవితాన్ని సాధించిన వ్యక్తి మీరు. మిమ్మల్ని మిస్ అవుతాము సర్.. దేశం ఈ రోజు ఒక విలువైన వజ్రాన్ని కోల్పోయింది. మీ ఆత్మకు శాంతి చేకూరాలి. ప్రణబ్ దా..’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. (ప్రణబ్ కుమార్తె భావోద్వేగ ట్వీట్) Deeply saddened by the demise of Shri #PranabMukherjee Will always treasure & cherish my interactions with him..An accomplished man of great wisdom & an illustrious political career..Will miss you Sir..The country has lost a precious diamond today...Rest in peace Dear Pranab Da! — Chiranjeevi Konidela (@KChiruTweets) August 31, 2020 మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణించడం బాధగా ఉందని సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నారు. తన అత్యంత మేధోశక్తికి, ఉత్తమ నాయకునికి ఈ దేశం సంతాపం ప్రకటిస్తుందన్నారు. ప్రణబ్ కుటుంబ సభ్యులకు చేతులు జోడింది హృదయపూర్వక సంతాపం తెలిపారు. వీరితోపాటు అజయ్ దేవ్‌గణ్, తాప్సీ, రితేష్ దేశ్‌ముఖ్, లతా మంగేష్కర్, రకుల్ ప్రీత్ సింగ్, వరుణ్ దావన్, శిల్పా శెట్టి, శ్రీను వైట్ల వంటి పలువురు ప్రముఖులు ప్రణబ్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించారు.(దేశవ్యాప్తంగా 7 రోజుల పాటు సంతాపం) Saddened to hear about the demise of our former President Shri Pranab Mukherjee. The nation mourns one of its most intellectual and inspiring leaders. Heartfelt condolences to the family and loved ones in this hour of grief. 🙏 — Mahesh Babu (@urstrulyMahesh) August 31, 2020 కాగా గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రణ..బ్ ఆగస్టు 10న ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో ఆస్పత్రిలో చేరారు. చికిత్సలో భాగంగా మెదడుకు డాక్టర్లు. సర్జరీ చేయగా..ఆస్పత్రిలోనే ఆయన కరోనా బారిన పడ్డారు. కరోనాతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తడంతో కొంత కాలంగా ఆస్పత్రిలోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావడంతో ఆరోగ్యం విషమించి మృతిచెందారు. రేపు ఢిల్లీలో ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
దేశవ్యాప్తంగా 7 రోజుల పాటు సంతాపం
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) మరణంతో దేశంలో విషాదం నెలకొంది. ఆయన మరణం పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీతో పాలు పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతిగా, కేంద్ర మంత్రిగా ఆయన అందించిన సేవలను స్మరించుకొనేందుకు దేశ వ్యాప్తంగా ఏడు రోజుల పాటు సంతాపం ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. (చదవండి : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత) అలాగే రాష్ట్రపతి భవన్‌తో సహా అన్ని కార్యాలయాలపై జాతీయజెండా అవనతం చేయాలని కేంద్రం ప్రకటించింది. అధికారిక లాంఛనాలతో ప్రణబ్ అంత్యక్రియలు నిర్వహించేందుకు రక్షణ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. సైనిక వందనంతో వీడ్కోలు పలికేందుకు సన్నాహాలు చేస్తోంది. రేపు ఢిల్లీలో ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, గత కొంతకాలంగా కోవిడ్‌తో పాటు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రణబ్ సోమవారం సాయంత్రంతుది శ్వాస విడిచారు.