
సాక్షి, న్యూఢిల్లీ : ప్రజాస్వామ్య బలోపేతానికి తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అప్పట్లోనే పునాది వేశారని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొనియాడారు. నెహ్రూ జీవిత చరిత్రపై తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఎ.గోపన్న రాసిన ‘జవహర్‌లాల్ నెహ్రూ–యాన్ ఇల్యుస్ట్రేటెడ్ బయోగ్రఫీ’ పుస్తకాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీలకు తొలి ప్రతులను అందజేశారు. ఈ పుస్తకానికి ముందుమాటను ప్రణబ్ రాశారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నెహ్రూ గురించి ఆధ్యయనం, పరిశీలన భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని, వంద కోట్ల జనాభాను నడిపించగల ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్మించాలన్న సంకల్పంతో ఆయన అప్పట్లోనే విశేష కృషి చేశారని, ఫలితంగా ఆధునిక ప్రజాస్వామ్య దార్శనికుడిగా నిలిచారని కొనియాడారు.
దేశంలో భిన్న మతాలు, భాషలు ఉన్నా భారతీయులంతా ఒకటే అన్న స్ఫూర్తి కలిగేలా ప్రజాస్వామ్య వ్యవస్థల ఏర్పాటుకు నెహ్రూ కృషిచేశారని కీర్తించారు. నెహ్రూ జీవిత చరిత్రపై గోపన్న రాసిన పుస్తకాన్ని అభినందిస్తూ సోనియా గాంధీ సందేశం పంపారు. అంతకుముందు, నెహ్రూ 54వ వర్ధం తి సందర్భంగా ప్రణబ్ ముఖర్జీ, అన్సారీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితరులు యమునా నది ఒడ్డున ఉన్న శాంతివన్ నెహ్రూ స్మారకం వద్ద నివాళులర్పించారు. ‘భార త తొలి ప్రధాని నెహ్రూకు ఘన నివాళులు’ అం టూ ప్రధాని మోదీ ట్విటర్‌లో పోస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment