
‘‘ఇంక్విలాబ్ జిందాబాద్’’ అని నిన దిస్తూ భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ చేసిన తిరుగుబాటు ఆనాడు యావద్దేశాన్ని వారి వైపు తలతిప్పి చూసేలా చేసింది. భారతమాత విముక్తి కోసం ఆ యువకులు ముగ్గురూ ఉరికొయ్యల్ని ముద్దాడారు. జలియన్ వాలాబాగ్ ఉదంతం జరిగినప్పుడు భగత్‌సింగ్ వయస్సు సరిగ్గా పన్నెండేళ్లు. భారతీ యుల నెత్తురుతో తడిసిన ఆ నేలను చూసి చలించిపోయాడు. చిన్న వయసులోనే దేశం పట్ల, ప్రజల పట్ల మక్కువ పెంచుకున్నాడు. గాంధీ ఇచ్చిన సహాయ నిరాకరణ పిలుపును అందుకుని ప్రత్యక్ష పోరాటంలో పాల్గొన్నాడు. ఒక బ్రిటిష్ పోలీస్ అధికారిని కాల్చి చంపిన కేసులో భగత్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు ఉరి శిక్ష పడింది.
విశ్వమానవ సౌభ్రాతృత్వం కోసం, మనుషులంతా ఒక్కటే అనే భావన కోసం నిలబడినవాడు భగత్‌సింగ్. వాస్తవానికి భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ఉరి తీయాల్సింది మార్చి 24న (1931). కానీ ఒక రోజు ముందే, అది కూడా సంప్రదాయానికి భిన్నంగా సూర్యాస్తమయం తర్వాత లాహోర్ సెంట్రల్ జైలులో ఉరి తీశారు. వారి మృతదేహాలు ప్రజల కంటపడకుండా బ్రిటిష్ ప్రభుత్వం జాగ్రత్త పడింది. బతికున్న భగత్‌సింగ్ (Bhagat Singh) కంటే చనిపోయిన భగత్‌సింగ్ మరింత ప్రమాదకారి అని వారు భావించటమే అందుకు కారణం. ‘‘నా విప్లవ భావాలు ఈ సుందరమైన మాతృభూమి అంతటా వ్యాపించి యువతకు మత్తెక్కిచ్చి స్వాతంత్య్రం కోసం, సమానత్వం కోసం, స్వేచ్ఛ (Freedom) కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదులను తరిమి కొడతాయి’’ అంటూ బ్రిటిష్ పాలకులను హెచ్చరించినవాడు భగత్‌సింగ్.
చదవండి: పేరు ఏదైతేనేం.. అంతా అణచివేతే!
అంతరాలు లేని సమాజం సోషలిజమే అని నమ్మి, దాని ఆచరణకు శ్రీకారం చుట్టిన మేధావి, మొదటితరం మార్క్సిస్టు భగత్ సింగ్. తండ్రి కిషన్ సింగ్ (Kishan Singh) తనను ఉరిశిక్ష నుంచి తప్పించటం కోసం స్పెషల్ ట్రిబ్యునల్‌లో పిటిషన్ పెట్టుకున్నట్లు తెలుసుకున్న భగత్ సింగ్ తన తండ్రికి లేఖ రాస్తూ... ‘‘నా జీవితం కన్నా దేశమే గొప్పది. ప్రతి యువకుడూ తన జన్మభూమి రుణం తీర్చుకోవటానికి... అవసరమైతే తన ప్రాణాలను సైతం అర్పించుకోవాలని నేను నమ్ముతాను’’ అని తండ్రినే ఊరడించాడు. ‘‘విప్లవ పోరాటంతో కూడిన ఈ కొద్దిపాటి జీవితం ఒక్కటే నాకు గొప్ప బహుమానం’’ అని చాటిన భగత్ సింగ్‌ను ఈ తరం స్ఫూర్తిగా తీసుకోవాలి.
– జి. రామన్న, డీవైఎఫ్‌ఐ ఏపీ కార్యదర్శి
(మార్చి 23న భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు వర్ధంతి)
Comments
Please login to add a commentAdd a comment