చాచా నెహ్రూకు ఘన నివాళి
- 125వ జయంతి సందర్భంగా శాంతివనం వద్ద ప్రముఖుల నివాళి
న్యూఢిల్లీ: భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ 125వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని శాంతివనం వద్ద పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, ఢిల్లీ మాజీ సీఎం షీలాదీక్షిత్ తదితరులు నెహ్రూ సమాధి వద్ద పుష్పగుచ్చాలుంచి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా నెహ్రూ జాతికి చేసిన సేవలను కొనియాడి.. ఆయన స్మృతులను గుర్తు చేసుకున్నారు. అనంతరం విద్యార్థులు సంగీత వాయిద్యాలను వాయిస్తుండగా.. మూడు రంగుల బెలూన్లను ఆకాశంలోకి వదిలారు. అయితే శాంతివనంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులుగానీ, ప్రభుత్వ ప్రతినిధులుగానీ హాజరుకాలేదు. అదే సమయంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన కార్యక్రమాలకు సోనియా దూరంగా ఉన్నారు.
నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైద్ధాంతిక ప్రత్యర్థులపై నెహ్రూ ఎప్పుడూ శత్రుత్వం చూపలేదని, అందువల్ల రాజకీయ ప్రత్యర్థులపై శత్రుత్వం కూడదని పరోక్షంగా రాహుల్ గాంధీకి చురకలంటించారు. ఈ కార్యక్రమానికి సోనియా బదులు లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత ఖర్గే హాజరయ్యారు. కాగా, నెహ్రూ జయంతి సందర్భంగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ‘‘బాల స్వచ్ఛతా అభియాన్’’ను ప్రారంభించారు.
ఆధునిక భారత రూపశిల్పి నెహ్రూ: ప్రణబ్
నెహ్రూ 125వ జయంతి, బాలల దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 110 స్కూళ్ల విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ సందర్భంగా వారినుద్దేశించి ప్రసంగించారు. ఆధునిక భారతదేశ రూపశిల్పి నెహ్రూ అని ప్రణబ్ కొనియాడారు. భవిష్యత్‌లో మీలో ఒకరు రాష్ట్రపతి భవన్‌లో కూర్చుంటారని, అది ప్రజాస్వామ్య గొప్పదనమని పేర్కొన్నారు. విద్యార్థులు స్కూళ్లను, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, తద్వారా ‘క్లీన్ ఇండియా’ను విజయవంతం చేయాలని సూచించారు.
నెహ్రూకు నివాళులర్పించిన ప్రధాని మోదీ
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ సామాజిక సంబంధాల వెబ్‌సైట్ ట్విట్టర్ ద్వారా చాచా నెహ్రూకు నివాళులర్పించారు. ‘‘ఈ రోజు(శుక్రవారం) భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ 125వ జయంతి. ఆయనకు నా నివాళులు’’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. స్వాతంత్య్ర సంగ్రామం సందర్భంగా నెహ్రూ చేసిన సేవలు, తొలి ప్రధానమంత్రిగా ఆయన పోషించిన పాత్రను గుర్తు చేసుకున్నారు.
గ్రామాల దత్తత...: గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి లక్ష్యంగా ప్రధాని మోదీ చేపట్టిన ‘సాంసద్ ఆదర్శ్ గ్రామ యోజన’ పథకం కింద కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్‌లు తమతమ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని చెరొక గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. రాయ్‌బరేలీ నియోజకవర్గంలోని ఉద్వా గ్రామాన్ని సోనియా దత్తత తీసుకోగా అమేథీ నియోజకవర్గం పరిధిలోని దీహ్ గ్రామాన్ని రాహుల్ గాంధీ దత్తత తీసుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.