సాక్షి, హైదరాబాద్: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ , రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులివ్వడంపై మల్కాజిగిరి ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఎనిమిదేళ్ల పాలన తర్వాత కూడా కాంగ్రెస్సే కలలోకి వస్తున్నట్టుంది. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఇచ్చిన ప్రైవేటు ఫిర్యాదుపై నమోదు చేసిన కేసును ఎనిమిదేళ్లుగా సాగదీస్తూ.. తాజాగా సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ ద్వారా నోటీసులు ఇప్పించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ మేరకు రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..బీజేపీది, బ్రిటీషువారిది ఒక్కటే భావజాలం. నాడు వారి అణచివేత, దౌర్జన్యానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడింది. ఇప్పుడు వారి భావజాలానికి వారసులైన బీజేపీ - మోదీ అణచివేత, కుట్రలకు వ్యతిరేకంగా అంతే ఉత్తేజంతో పోరాడుతోంది. నాటి స్వాతంత్య్ర సంగ్రామానికి నాయకత్వం వహించిన కాంగ్రెస్ నేడు మోదీని గద్దె దింపే ఉద్యమానికి నాయకత్వం వహిస్తుంది. తాజాగా ఈడీ నోటీసులు కాంగ్రెస్ అగ్రనాయకత్వ మనోధైర్యాన్ని దెబ్బతీయలేవు. బీజేపీ ప్రజావ్యతిరేక పాలనపై మా పోరాటాన్ని అడ్డుకోలేవు. ఈ పరిణామం మా కార్యకర్తలలో మరింత కసి, పట్టుదలను పెంచుతుంది. ఈ వేధింపులతో కాంగ్రెస్ కుంగిపోతుందని భావిస్తే అది వారి భ్రమ.
చదవండి: (సోనియా, రాహుల్‌గాంధీకి ఈడీ సమన్లు..)
మోదీ పేదలను మోసం చేశాడు
అధికారం ఇస్తే విదేశాల నుండి నల్లధనం తెచ్చి, ప్రతి పేదవాడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానన్న మోదీ పేదలను మోసం చేశాడు. బ్యాంకులను ముంచిన నీరవ్ మోదీ, విజయ్ మాల్యాలను దేశానికి తిరిగి తీసుకురాలేకపోయారు. 70 ఏళ్ల ప్రజల శ్రమ, చమట చుక్కలతో కాంగ్రెస్ నిర్మించిన వ్యవస్థలను మోదీ ధ్వంసం చేశారు. దేశ ప్రజల సంపదను అదానీకి అడ్డగోలుగా అమ్ముతున్నారు. పెట్రోలు, డీజిల్ ధరలు, నిత్యావసరాల ధరలు పెంచేసి పేదల నడ్డి విరుస్తున్నారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం అనే ప్రశ్నే ఉండదని నమ్మబలికి.. దేశంలో మరింత నల్లధన వ్యాప్తికి కారకులయ్యారు. దేశంలో నయా బ్రిటీష్ పాలన నడుస్తోంది. దీనిపై సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పోరాడుతోంది. ఇది సహించలేకనే ఈడీ నోటీసులతో వారి మనోధైర్యాన్ని దెబ్బతీయాలని మోదీ భావిస్తున్నారు. అది జరిగే సమస్యే లేదు. పోరాడుతాం.. గెలుస్తాం. దేశాన్ని గెలిపిస్తాం' అని ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment