సాక్షి, హైదరాబాద్: సాధారణ ఎన్నికల తర్వాత ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ కాలం చెల్లిన మందులాంటి (ఎక్స్‌పైర్డ్ మెడిసిన్)వారని, ఆయన వచ్చే ఎన్నికల తర్వాత షెడ్డుకు వెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించారు. రాహుల్‌గాంధీ 150 రోజులు, దాదాపు 4 వేలకు పైగా కిలోమీటర్లు భారత్ జోడో యాత్ర చేశారని, ఆ స్ఫూర్తితోనే కర్ణాటకలో, ఆ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించిందని చెప్పారు.
కర్ణాటక, తెలంగాణ తర్వాత మహారాష్ట్రలో రాహుల్ ప్రవేశించారని, వచ్చే ఎన్నికల్లో మహారాష్ట్రలోనూ పార్టీ గెలుపు తథ్యమని జోస్యం చెప్పారు. నాగ్‌పూర్‌లో గురువారం జరిగిన కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు
డబుల్ ఇంజిన్ అంటే మోదీ, అదానీ
బీజేపీ డబుల్ ఇంజిన్ అని పదేపదే చెబుతోందని, డబుల్ ఇంజిన్ అంటే మోదీ, అదానీ అని రేవంత్ విమర్శించారు. రాహుల్‌గాంధీ పార్లమెంట్‌లో అదానీ గురించి నోరు విప్పగానే ఆ ఇంజిన్ ఆగిపోయిందని ఎద్దేవా చేశారు. మోదీ ఎప్పుడూ చప్పన్ ఇంచ్ ఛాతీ అని గొప్పలు చెప్పుకుంటారని, కానీ ఆయన నేతృత్వంలో నడుస్తున్న లోక్‌సభలోనే ఒక సామాన్యుడు ప్రవేశించి హంగామా చేస్తుంటే ఏమీ చేయలేకపోయారని విమర్శించారు.
‘మోదీ జీ..మీరు ఒక సామాన్య వ్యక్తిని పార్లమెంట్‌లోకి రాకుండా ఆపలేకపోయారు. రేపు ఎర్రకోట మీద కూడా కాంగ్రెస్ జెండా ఎగరకుండా ఆపడం కూడా మీతరం కాదు..’ అని అన్నారు. జనవరి 14 నుంచి రాహుల్‌గాంధీ ‘భారత్ న్యాయ యాత్ర’ మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు కొనసాగుతుందని, దీనితో మోదీ ఇంజిన్ షెడ్డుకు వెళ్లక తప్పదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చి దేశాన్ని కాపాడుకుందామని, పార్టీ శ్రేణులు వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment